శ్రీ చాగంటి సద్గురువుల " భాగవతసప్తాహం " ప్రవచనానికి మొన్నటి మార్గశిర కృష్ణ పంచమి ( 2019-డిసెంబర్-16 ) నాటి సాయంసంధ్యా వేళలో దోమల్గుడ యెన్.టి.ఆర్ స్టేడియానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలలో ఎన్నెన్నో అంశాలకు సంబంధించిన గ్రంథాలు ఉండడం చూసిన నాకు కేవలం శ్రీమద్భాగవత ప్రవచనాన్నే సప్తాహం గా ఏర్పాటు చేసుకొని వినడం ఎందుకు అనే విషయం గురించి ఆలోచిస్తుండగా, గురువుగారు చెప్పిన
" ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి ఉండేవి 7 రోజులే.......
ఎవ్వరికైనా ఉండేది సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని, ఆది వారాలే....
ఎవ్వరు పుట్టిన ఈ 7 రోజుల్లోనే......
ఎవ్వరు గిట్టినా ఈ 7 రోజుల్లోనే.....
కాబట్టి ప్రతిరోజు కూడ ఈశ్వరుణ్ణి స్మరిస్తు బ్రతకడమే జీవితం......
ఈశ్వరుడిని విస్మరించడమే మరణం.... అది ఎల్లప్పుడు గుర్తుండడానికి 7 రోజుల సప్తాహం గా రాశీభూతమైన పరమాత్మతత్వాన్ని అత్యంత సులభగ్రాహ్యం గా జీవుడికి అందించే శ్రీమద్భాగవతాన్ని వినడం....."
అనే సమన్వయం తో పాటుగా.......
మరికొన్ని ఈ క్రింది విషయాలు కూడ సమన్వయంగావించి చూడగా, అందుకేనేమో కలియుగప్రత్యక్ష పరమాత్మ సప్తగిరిపై నిల్చి,
" ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా....." అనే పేరుతో ఆర్తితో పిలిచిన ప్రతిభక్తుడిని అక్కునజేర్చుకొని కరుణించి కాపాడుతున్నాడు కదా అని అనిపించింది.....
అధ్యాత్మ శాస్త్ర ప్రకరాంగా చతుర్దశభువనాల్లో జీవుడి గమనం సాగి తుదకు " పరమపదం " చేరడం,
" కైవల్యసిద్ధిని గడించడం", " పంచ విధ మోక్షాలకు " అర్హతను సాధించడం" అనగా ఇక జీవుడిగా ఏ లోకంలోకి, ఏ రూపము తీసుకొని రావలసిన పరిస్థితి లేకుండ జీవస్వతంత్రత లభించడం అనే సర్వోన్నత సాధనా ఫలం కేవల దైవానుగ్రహంగా లభించడం......,
"నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సికింద్రబాద్లో సాయాంత్రం 6 గంటలకి ఎక్కితే పొద్దున 8 అయ్యే సరికి తిరుపతి చేరుకొని ఫ్రెషప్ అయ్యి కొండెక్కి ఒక 10 గంటల్లో తిరుమల చేరుకొని స్వామిని దర్శించి తరించడం...."
అనేలా.........,
చెప్పడానికి ఎంతో సులభంగా అనిపించినా, శ్రీభూనీళాసమేత పరమపదనాథుడిగా కొలువైన ఆ శాశ్వత సర్వేశ్వరతత్త్వంలోకి ఐక్యమవ్వడం అనేది అంత సులభమైన ప్రయాణం ఏమి కాదు.....
పూజాదికాలు జరిపే సమయంలో సంకల్పపఠనంలో పెద్దలు మనకు చెప్పిన ప్రకారంగా ఈ క్రింది 14 భువనాల్లో మధ్యలో ఉన్నది భూలోకం......
1. సత్యలోకం
2. తపోలోకం
3. జనోలోకం
4. మహర్లోకం
5. సువర్లోక
6. భువర్లోకం
7. భూలోకం
8. అతలం
9. వితలం
10. సుతలం
11. తలాతలం
12. రసాతలం
13. మహాతలం
14. పాతాళం
అనగా ఒక జీవుడి ఖాతాలో పుణ్యం + పాపం రెండు ఉన్నందుకు ఈ మర్త్యలోకంలో జన్మించిన మనుష్యుడికి...
పుణ్యాన్ని , తత్ఫలితంగా చిత్తశుద్ధిని ఆర్జించి 7 మెట్లు పైకి ఎక్కి ఉన్నతమైన పరమపదం చేరుకోవడానికైనా లేదా ఎత్తిన జన్మలో సుఖాలను అనుభవిస్తూ
పుణ్యం మొత్తం ఖాళి చేసుకొని
పాపాలను మూటకట్టుకొని 7 అధోలోకాల వైపునకు జీవయాత్ర సాగించాడమైనా అందరికి ఉండేవి 7 రోజులే......
భగవద్ప్రీతికరంగా మనం జీవించి ఆయన అనుగ్రహానికి పాత్రతను సమకూర్చుకోవడమే ప్రతి జీవుడి లక్ష్యం......
లోకంలో సాధారణంగా కొన్ని మాటలు వింటుంటాం.....
" ఏడేడు జన్మలకు నువ్వే నా ప్రాణం తెలుసా....."
" ఈ లోకంలో మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉంటారు తెలుసా...."
" పెళ్ళికి అటేడు తరాలు ఇటేడుతరాలు
చూసి ఇచ్చుకోవాలి తెలుసా...."
" సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం చేయడం వల్ల
"దశపూర్వేశాం దశాపరేశాం మద్వంశ్యానాం....." అనగా అటు 10 తరాలు ఇటు 10 తరాలు మన తరం మొత్తం 7 * 3 = 21 తరాలు తరిస్తాయి తెలుసా..... "
ఇవ్విధముగా 7 సంఖ్యమీద నడిచే తత్వం మనం గమనిస్తూ ఉంటాం.....
84 లక్షల జీవరాశుల్లో "మాట" / "వాక్కు" ప్రసాదించబడిన ఒకేఒక జీవి మనుష్యుడు.....
అందుకు కృతజ్ఞ్యతగా ఎల్లప్పుడు అది ప్రసాదించిన ఈశ్వరుడి నామస్మరణం గావిస్తు, ఇతరులకు వీలైన సహాయం గావిస్తు జీవించగలిగిన ఎకైక ప్రాణి మనుష్యుడు.......
కాని మనుష్యుడు అనవసరంగా తనకు సంబంధించని విషయాల్లో తలదూర్చి ఇతరులను మాటలతో
తూలనాడి వీలైతే చేతలతో కూడా హింసించి వాళ్ళ బాధకు కారణమై జీవించడం సమాజంలో తరచుగా మనం చూసే సత్యం....
ఒక్కొక్కరు చూడండి వాళ్ళకు అబ్బిన ప్రతి సంపద, అది పేరైనా, పదవైనా, అధికార ఐశ్వర్యాలైనా మరే ఇతరమైన నశ్వరసంపత్తైనను అది ఈశ్వరానుగ్రహంగా భావించి జీవించే ఔన్నత్యంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారు.....
కొందరు వాటిని కేవల తమ గొప్పతనం మాత్రమే అన్నట్టుగా ఈశ్వరుడిని విస్మరించి జీవించేస్తుంటారు.......తన్మూలంగా
అన్ని జాఢ్యాలు వారి జీవితంలో భాగమై ఎవ్వరిని కూడా గౌరవించని, ఓర్వని, మెచ్చుకోని, ఆఖరికి భరించని రీతిలో తమ అక్కసును అనునిత్యం ఎవరు పడితే వారిపై వెళ్ళగక్కుతుంటారు....
అవి ఆకాశంలో అప్పుడప్పుడు మెరిసే ఉరుముల తాలుకా కేవల శబ్దాలే అని నింగిని తూలనాడుతావేమో....
అది భీకర ప్రళయాగ్నిని తనలో నింపుకున్న పిడుగై నీపై విరుచుకుపడి సమూలంగా దహించివేయగలదు అనితెలిసిననాడు నింగిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
అవి రోజూ అలా వచ్చిపోయే పిల్లగాలులు మాత్రమే అని గాలిని తూలనాడుతావేమో......
సముద్రపు కెరటాలను నలుదెసల వ్యాప్తిగావించి కొబ్బరి చెట్లను సైతం పెకిలించివేసే తుఫాను తాలుకా సుడిగాలి హోరు కాగలదు అని తెలిసిన నాడు గాలిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
అవి ఎవరో చలి మంటలు కాచుకోవడానికి రగిల్చిన నిప్పు కణికలు మాత్రమే అని అగ్నిని తూలనాడుతావేమో......
అవి అరణ్యాలను సైతం దహించివేసే దావానలకీలలు కాగలవు అని తెలిసిననాడు అగ్నిని గౌరవిస్తావేమో....
అవి వచ్చి పోయే సాగర అలలతుంపర్లు మాత్రమే అని ఎల్లపుడు నీటిని తూలనాడుతావేమో....
అవి వచ్చి విరుచుకుపడి అన్నిటినితనలోకి ఈడ్చుకుని దూసుకుపోయే సునామి తాలూకా కెరటాలు కాగలవు అని తెలిసిననాడు నీటిని గౌరవిస్తావేమో....
అది కేవలం భూమిలోనుండి వచ్చిన బారెడు లైట్ వేట్ అల్యుమినియుం తీగమాత్రమే అని భూజనితమైన ఖనిజాన్ని తద్వారా భూమిని తూలనాడుతావేమో.....
అది కొన్ని వందల మెగావాట్ల విద్యుత్ శక్తిని తనలో ప్రవహింపజేసుకుంటూ అజాగ్రత్తగా చెయ్యేసినవాడిని అక్కడికక్కడే మాడి మసిజేసే కరెంట్ తీగ కాగలదు అని తెలిసిన నాడు భూమిని, భూసంపదను గౌరవిస్తావేమో....
అది బురదలో పొర్లే కట్లపామేలే అని తూలనాడుతావేమో......
అది సాక్షాత్ ఆదిశేషుని అంశగా వచ్చిన మేలిమిజాతి శ్వేతనాగై నిన్ను కబలించిననాడు, మనకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వారిని మనం కూడా గౌరవించాలి అని గుర్తిస్తావేమో.....
" తనదార్లో తాను ఆఫీస్ కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కావలని ఆగి ఉన్న కార్ డోర్ ఒక్కసారిగా గట్టిగా ఓపెన్ చేయించి బైక్ తో సహా ఆ వ్యక్తి అంతదూరం ఎగిరి పడేలా కొట్టించి మోచెతులకు దెబ్బలు తగిలి, బైక్ డెంట్లు పడి బాగా డ్యామేజ్ అయ్యి ఇండికేటర్ లైట్లు విరిగి హెల్మెట్ ఉన్నందుకు ప్రాణాపాయం తప్పి గాయాలు కాగా, మీరు కాపుగా పెట్టిన వాళ్ళింటి పక్కన ఉండే సమోసాలు విక్రయించే అంకుల్ సహాయంతో పైకి లేచి ఎం జరిగిందో అని కాసేపు విస్తు పోయి ఆనక నీళ్ళు తాగి తేరుకున్న ఆ వ్యక్తిని చూసి వెకిలి నవ్వులు నవ్వుకున్న మీ అత్యంత క్రూరమైన మనస్సుకు, మీ హేయమైన వ్యక్తిత్వానికి ఆ ఘాతుకం తాలుక పాపఫలితాన్ని
అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు,
ఈశ్వరుడు......
' నీకో, నీ పిల్లలకో అట్లే జరిగి నువ్వు కూడా అట్లే బాధపడెదవు గాక..... '
అని కాలాన్ని శాసించిన నాడు నీ దుర్గతి ఎలా ఉంటుందో ఆలోచించగలవ...?
ఎంతసేపు పక్కవాడు ఎదగకుండా ఎలా అడ్డుపడదామా అనే తప్ప జీవితంలో సన్మార్గంలో ఉన్నతి సాధించాలి అనే ఆలోచన ఏఒక్కరోజు కూడా రాని మీకు, అవతలి వ్యక్తిని అనునిత్యం హింసించి ఎదో సాధించేద్దాం అనుకుంటారేమో, మీ కదలికలను మీ కంటే కూడా ఎంతో నిశితంగా పరిశీలించే ఆ వ్యక్తి
మీకు సరైన సనయంలో సరైన విధంగా చెక్ పెట్టడానికే మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాడు అని తెలుసుకునే ఇంగితం కూడా లేకుండా ఆ వ్యక్తి తాలూకా వారందరిని ప్రతికూలంగా మలిచి ఆ వ్యక్తిని దెబ్బతీయాలని చూసే మీకు కాలమే తగు రీతిలో సమాధానం చెప్పగలదు...."
అని తెలుసుకున్న నాడు ఇతరులను గౌరవిస్తారేమో........
ఎదురుగా ఉన్నది కేవలం 5 1/2 అడుగుల, 33 సంవత్సరాల బక్కపలచని వ్యక్తి మాత్రమే
అని తూలనాడుతావేమో.....
ఆ వ్యక్తిలోకి ఈ బ్రహ్మాండాన్నిసైతం బద్దలకొట్టగలిగే చిత్శక్తి వచ్చిచేరి యావద్ విశ్వాన్ని తన పిడికిట బంధించే వ్యక్తిత్వమది అని తెలిసిననాడు ఇతరులను కేవలం వారి శరీరానుగుణంగా కాక దేశకాలానుగుణంగా గౌరవించడం నేర్చుకుంటావేమో......
"ఎక్కడరా నీ శ్రీహరి......??"
అని పదే పదే ప్రహ్లాదుడిని హింసించిన తన తండ్రి హిరణ్యకశిపుడికి సమాధానంగా ఇవ్వబడిన ఈ క్రింది శ్రీ పోతనామత్యుల శ్రీమద్భాగవతపద్యరాజం మనకు విశదీకరించినట్టుగా "
ఈశ్వరుడు ఎక్కడుంటాడు.....?"
అనే ప్రశ్నకు సమాధానం
"ఈశ్వరుడెక్కడైనా ఉంటాడు...."
చూడగలిగే మనసు, చూడాలనే ఆకాంక్ష, చూసే భాగ్యం ఉన్నవారికి ఈశ్వరుడు అంతటా కలడు....
అని చెప్పే ఈ పద్యం నిజంగా ఎంతటి భావుకతను తనలో నిక్షిప్తం చేసుకుందో కదా......
" కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్. "
ఇన్నిటికి మరియు అన్నిటిని మూలమైన ఈశ్వరుడిని అనునిత్యం, అనగా మనందరికి ఉండే 7 రోజులూ, స్మరించడమే అన్ని దివ్యవిభూతులు మనకు కటాక్షించబడేందుకు మూలకారణమై ఉంటుంది కాబట్టి
ఆ ప్రయత్నపూర్వక భగవద్ స్మరణను
మనకు అబ్బేలా పెద్దలు శ్రీమద్భాగవతాన్ని సప్తాహంగా మనకు సెలవిచ్చారు.....
పైన ఉన్న పద్యం యొక్క భావం సప్తస్వరాలసమ్మేళనాత్మకంగా పరమాత్మను స్తుతించే ఒక చక్కని సంకీర్తన రూపంలోకి ఒలికిస్తే ఈ క్రింది అన్నమాచార్యుల సంకీర్తనలా ఉంటుందని నా భావన...😊
****************** ******************
ప : విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ శాశ్వతునకు కూహింప జన్మ మిక నేడ
చ : సర్వపరిపూర్ణునకు సంచార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
చ : నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహౄదయస్థునకు మాటేడ పలుకేడ జ़్జానస్వరూపునకు గాన విన నేడ
చ : పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ
****************** ******************
నాటి ప్రవచనం ముగిసాక వేదికపై కొలువైన శ్రీకృష్ణపరమాత్మకు ఇవ్వబడిన మంగళనీరాజనానికి నమస్కరిస్తున్న గురువుగారి పిక్....😊🙏