ఆనాడు రాయలసీమలో వారు శ్రీమద్రామాయణాన్ని ప్రవచిస్తుండగా స్టోర్ రూం నుండి తిరునామాన్ని ధరించిన శ్రీఆంజనేయస్వామి వారు,
(కొందరు ఒక పేద్ద వానరం అని అనుకోవచ్చు. అది వారి వారి బుద్ధి వైభవానికి సంబంధించిన అంశం)
వారి కపిరూపం / నిజరూపంలో ప్రత్యక్షమై అక్కడ ఆసీనులై ఉన్న ఎందరో భక్తులకు దర్శనీయమైన రీతిలో అక్కడినుండి నడిచి వెళ్ళడం అనే సంఘటన గుర్తున్న భక్తుల్లెలరికీ, అటువంటి హనుమద్ స్వరూపం ఎట్లుండునో అని ఒకసారి దర్శించాలని ఉంటే, వివేకానందనగర్ లో కొలువైన
శ్రీ పాంచరాత్ర ఆగమోక్త శ్రీ కార్యసిద్ధి హనుమద్ ఆలయాన్ని సందర్శించి తరించండి....
అధ్యాత్మసంప్రదాయంలో ఆంజనేయులవారిని ఆచార్యులకు ప్రతీకగా భావించెదరు...
ఎందుకంటే ప్రత్యక్ష పరమాత్మకు ప్రతీకగా ఆరాధింపబడే సూర్యపరమాత్మ నుండి సకల శాస్త్రాలను స్వాధీనపరుచుకున్న అనితరసాధ్య సాధకవరేణ్యులు ఆంజనేయులవారు....
అందుకే కద 6 కాండల అపురూప ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ ఇతిహాస మహార్ణవంలో "సుందరకాండ" అనే కాండ మాత్రమే "సుందర" అనే నామవాచకంతో అలరారే ఎకైక శ్రీమద్రామాయణకాండగా శ్రీవాల్మీకి మహర్షి వారు లోకోత్తరప్రసిద్ధిని కల్పించారు....
సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా |
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనమ్ ||
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః |
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరమ్ ||
అనే శ్లోకం విజ్ఞ్యులచే అనాదిగా లోకంలో ప్రసిద్ధిని గడించింది...
ఇక్కడ "సుందరం" అనే పదానికి అర్ధం "యశోభరితమైన / "యశస్కరమైన" అని అన్వయం అవుతుంది.....
హనుమకు ఆ యశోవైభవం అంతా కూడా ప్రత్యక్షపరమాత్మగా అలరారే సూర్యపరమాత్మ యొక్క అనుగ్రహం....
అందుకే అమరులు కూడా అచ్చెరువొందే గాథలకు ఆలవాలమైన సుందరకాండలో హనుమ యొక్క వైభవం తారాస్థాయిలో ప్రకాశించును....
ఆచార్యులుగా లోకంలో వర్ధిల్లే విజ్ఞ్యుల పరంపరాగతమైన స్వాధ్యాయజ్ఞ్యానయజ్ఞ్యంలో సమిధలుగా వారి శ్రద్ధాభక్తిని సమర్పించే వారి వైభవం కూడా అట్లే తారాస్థాయిలో ప్రకాశించును....
యావద్ ప్రపంచంలోగల అసంఖ్యాక శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాశ్రోతల్లో, కొందరిలో కొందరికైనా శ్రీచాగంటి గారి ఈ క్రింది శ్రీలలితాంబికావైభవ వర్ణన గురించి గుర్తుండే ఉంటుంది...
"ఈ కీర్తి యశస్సు ఇత్యాదివన్నీ కూడా ఆ పరేశి యొక్క అనుగ్రహమే కదండి...ఎందుకంటే ఆవిడ "శర్మదా శర్మదాయిని" అని కదా స్తుతింపబడును.....
"ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయైనమః"
అని ఆవిడను స్తుతించిన భక్తుడికి ఫలితంగా ఆవిడే ఎంతో యశోవైభవాన్ని అనుగ్రహిస్తూ,
మరలా ఆవిడే
"ఓం శర్మదాయై నమః"
"ఓం శర్మదాయిన్యై నమః"
అని స్తుతింపబడడం ఎంత ఆశ్చర్యకరమో కద ..... !
అమ్మవారి తాటంకములు, నయనములు,
సూర్యచంద్రమండలాలైతే అమ్మవారి ముక్కెర / నాసాభరణం తారామండలానికి ప్రతీక....
అనగా అసంఖ్యాక స్వప్రకాశకాంతిశక్తిపుంజములకు ఆలవాలమైన తారామండలంలోనే యావద్ నిత్యవికసిత ఖగోళరహస్యాలు దాగి ఉన్నవి అని ఆధునిక సైంటిస్ట్ల ఉవాచ కూడా...
[ NASA, ISRO, వాళ్ళు కూడా అన్ని రోదసి విజ్ఞ్యాన విషయాలను పబ్లిష్ చేయరు....వారు కూడా దాచేవి, దాచవలసినవి, కొన్ని ఉంటాయ్...ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి అమేయ సృష్టిని మనకంటే దెగ్గరినుండి పరికించే వారే కాబట్టి...]
విజ్ఞ్యులైన ఆరాధకులకు ఈ క్రింది దైనందిన శివార్చనకు సంబంధించిన 8 నామాలకు మరియు వాటి యొక్క పంచభూతాలకు / సూర్య / చంద్ర / జీవ మండలాలకు గల ప్రతీక గురించి తెలిసినదే కద....
1. ఓం భవాయ దేవాయ నమః (జలలింగం / నీటికి అధిపతి)
2. ఓం శర్వాయ దేవాయ నమః (పృథ్వీలింగం / భూమికి అధిపతి)
3. ఓం ఈశానాయ దేవాయ నమః (సూర్యలింగం / సూర్యమండలానికి అధిపతి)
4. ఓం పశుపతయే దేవాయ నమః (ఆత్మలింగం / సర్వజీవులకు అధిపతి)
5. ఓం రుద్రాయ దేవాయ నమః (అగ్నిలింగం / అగ్నికి అధిపతి)
6. ఓం ఉగ్రాయ దేవాయ నమః (వాయులింగం / గాలికి అధిపతి)
7. ఓం భీమాయ దేవాయ నమః (ఆకాశలింగం / ఖగోళానికి అధిపతి)
8. ఓం మహతే దేవాయ నమః (చంద్రలింగం / చంద్రమండలానికి అధిపతి)
శ్రీమాణిక్యాంబ / దక్షారామ శక్తిపీఠ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించే వారికి అక్కడి అంతర్నిహిత సప్తగోదావరి, 108 శివాలయాల భీమమండల ప్రాంతం, 108 నక్షత్రపాదాల్లో ఏ నక్షత్రపాదం వారు ఏ ఊర్లో కొలువైన ఏ శివాలయాన్ని దర్శించాలి, ఇత్యాదిగా తెలిసే ఉంటుంది కద....
"భీమమండలం" అనగా మన భౌగోళికపటంలో ఆ ఖగోళ స్థిత 108 నక్షత్రమండలాలకు ప్రతీకగా అలరారే శివశక్తి అని అర్ధం...
అట్టి ఖగోళసంబంధమైన శివశక్తినే "భీమ" శక్తి గా శైవాగమవైభవం స్తుతించును........
చిదంబర నటరాజ స్వామి వారి పంచభూత ఆకాశలింగ పుణ్యక్షేత్రం దర్శించే వారికి తెలిసినట్టుగా...
"ఏమి లేని ఒక సాధారణ గోడకు బిల్వదలమాలను అలంకరించి...ఇదిగో ఇదే చిదంబర రహస్య దర్శనం..." అని చెప్తుంటారు అని కొందరు అనుకుంటూఉంటారు.....
కాని చిదంబరరహస్యమంతా ఇక్కడే ఉంది...
ఎదురుగా కనిపించే ఆకాశంలో ఏం ఉన్నది....
అని ఒక 1వ తరగతి విద్యార్ధిని అడిగితే...
"ఆ ఏముంది అంతా ఖాళిగానే ఉంది కద...."
అని అనొచ్చు...
ఒక సైంటిస్ట్ ని అడిగితే...
"ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలు, సౌరమండలం, మనం నివసించే భూమి, ఇలా ప్రతీ ఒక్కటి ఉన్నది ఆకాశంలోనే...కాబట్టి ఆకాశంలో అన్నీ ఉన్నాయ్...అనగా ఆకాశం అమేయమైనది.... అనంతమైనది... ఆశ్చర్యకరమైనది..." అని సమాధానం ఇస్తారు...
1వ తరగతి విద్యార్ధి పరికించేది అదే ఆకాశం....
(ఏమి లేదు అని అనబడే ఆకాశం...)
ఒక సైంటిస్ట్ పరికించేది కూడా అదే ఆకాశం....
(అన్నీ ఉన్నాయ్ అని అనబడే ఆకాశం...)
కాబట్టి ఇక్కడ భేదం 1వ తరగతి విద్యార్ధి మరియు ఒక సైన్స్టిస్ట్ యొక్క జ్ఞ్యానస్థాయి మరియు దృక్పథంలో ఉన్నది అని అనబడును...
అచ్చం అదే విధంగా...
అధ్యాత్మ ఆకాశతత్త్వం కూడా....
అంబరంలో పరివ్యాప్తమై ఉండే చిదంబర రహస్యాలను జ్ఞ్యాననేత్రంతో పరికించాలంటే మనం "ఓం భీమాయ దేవాయ నమః" గా పరిఢవిల్లే ఈశ్వర తత్త్వాన్ని ధ్యానించాలి / ఆరాధించాలి...
ఆకాశం ఎంత ఆశ్చర్యకరమైన తత్త్వంతో అలరారునో...
సుందరకాండలో అపరరుద్రాంశ సంభూతుడైన హనుమ యొక్క లీలలు కూడ అంత ఆశ్చర్యకరమైవిగా భక్తులకు ఎరుకలోకి వచ్చి...ఔరా...సుందరకాండ ఎంత సుందరమైనది....
అని అనిపించును...
నూరుయోజనాల దక్షిణసముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడను కనిపెట్టడానికి హనుమంతుల వారు చారణులు చరించే మార్గంలో ఆకాశయానం గావించి కాంచనలంక దిశగా ప్రయాణించడం...
అనే సంఘటనతో.....
ఈ క్రింది శ్లోకం తో ప్రారంభమయ్యే సుందరకాండ...
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః.
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ৷৷5.1.1৷৷
శ్రీరాముడి గూర్చి చింతిస్తూ అశోకవనంలో ఉన్న సీతమ్మ నా యొక్క సుభాషితములతో ఊరడిల్లి శాంతించెను ....
అనే స్వస్తివాచకంతో సంపూర్ణమయ్యే 68 సర్గల సుందరకాండ ఆద్యంతమూ ఆశ్చర్యకరమైన వాయుపుత్రుడి వైభవగాథలకు ఆలవాలమైన సుందరాతిసుందరమైన కాండ.....
తతో మయా వాగ్భిరదీనభాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదితా.
జగామ శాన్తిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడితా ৷৷5.68.29৷৷
ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను పరికిద్దాం...
మహేంద్రగిరి పర్వతాన్ని భేదించి సముద్రాన్ని లంఘించినది మొదలు,
లంకిణిని భంజించి కాంచనలంకాప్రవేశం గావించిన పర్యంతం....హనుమ సాగించిన ఆకాశయానాన్ని దర్శించినది ఎవరు...?
మధ్యలో తారసపడిన నాగమాత సురస హనుమను దేవతల తరపున పరీక్షించుటకు ప్రత్యక్షమై హనుమ యొక్క యుక్తికి సమాధానం చెందడం,
రాక్షసుల తరపున అడ్డగించిన సిమ్హిక హనుమ యొక్క శక్తికి లయించడం, పర్వతాల్లో రెక్కలతో మిగిలిన ఒకే ఒక్క పర్వతమైన మైనాకుడు సముద్రం నుండి వెలుపలికి వచ్చి హనుమకు ఆతిథ్యమివ్వడం,
అనే 3 సంఘటనలు కూడా లోకానికి
తెలియవచ్చిన రీతిని గమనించినట్లైతే, శ్రీవాల్మీకి మహర్షి గారికి ఇతిహాసకావ్యరచనకు ఆవశ్యకమైన
సత్యదర్శనవిభూతి అనే వరం బ్రహ్మగారి నుండి సంప్రాప్తమై ఉన్న కారణంగా, ఒక సంఘటనలోని వ్యక్తుల మనోసీమల్లో కూడా విహరించి వారిని వర్ణించగల సారస్వతశక్తిసంపన్నమైన మహర్షి యొక్క యోగదృష్టికి మాత్రమే యావద్
సుందరకాండ / శ్రీమద్రామాయణం భాసించి లోకానికి అనుగ్రహింపబడెను....
ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేది సర్వోన్నతమైన సత్యలోకంలో....
అనగా ఆకాశం యొక్క / 14 భువనాల సముదాయంలో సర్వోన్నతమైన సీమల్లో అని అధ్యాత్మ అర్ధం....
అనగా "ఓం భీమాయ దేవాయ నమః" అనే అధ్యాత్మ వైభవం బ్రహ్మగారి నుండి శ్రీవాల్మీకి మహర్షి గారికి వరంగా సంప్రాప్తించినది...
కొన్ని అధ్యాత్మకారణాల రీత్యా / బ్రహ్మగారి సభామరియాద రీత్యా కావ్యరచనామరియాదను పాటించవలెను కాబట్టి,
హనుమ కూడా శ్రీవాల్మీకి మహర్షి వారిలా ఒక గొప్ప మహర్షిగా వర్ధిల్లడం,
హనుమకు కూడా శ్రీవాల్మీకి మహర్షిగారిలా సత్యదర్శనవిభూతి అనే వరం ఉండడం,
హనుమ కూడా "శ్రీహనుమద్రామాయణం" పేరిట ఒక రామాయణాన్ని రచించుకోవడం....
ఇత్యాది వాటి గురించి ఎక్కువగా వివరింపబడడం వలదు కాన...
అధ్యాత్మసంప్రదాయంలో ఆచార్యులకు హనుమ ప్రతీక కాబట్టి.....
హనుమను ఆరాధించిన భక్తులకు ఎన్నో విభూతులు హనుమంతుల అనుగ్రహంగా అమరి తరించెదరు అని శాస్త్రవచనం....
శ్రీరాముడి పట్ల, శ్రీరాముడి అయనం పట్ల, ఆనాడు హనుమ ఎంత గౌరభరితంగా నడుచుకున్నారో...
అట్టి మహిమాన్వితమైన "సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాలు" అనే స్వాధ్యాయ అధ్యాత్మజ్ఞ్యానయజ్ఞ్యం లో ఆనాడు ఎంతో దీక్షాదక్షులై వర్ధిల్లి భక్తులకు శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనాలను అనుగ్రహించారు కాబట్టి,
ఇప్పటికీ మరియు ఎప్పటికీ అ మధురసుజ్ఞ్యానామృత ప్రహృష్టవచనాలు యావద్ లోకంలో పరివ్యాప్తమై విజ్ఞ్యులను వివిధ రీతుల అనుగ్రహిస్తూ వర్ధిల్లుతున్నాయ్...
ఒక నిష్కామజ్ఞ్యానయోగిని దర్శించి నమస్కరించడం సహస్ర సత్సంకల్ప గంగాతీర్థస్నాన ఫలదాయక వైభవం అని అధ్యాత్మలోకవిశ్వాసం...
మరి అట్టి నిస్వార్ధవరిష్ఠ అధ్యాత్మవేత్తలైన శ్రీ చాగంటి సద్గురువులు, అట్టి నిస్వార్ధ శ్రీరామదాసుడైన హనుమ యొక్క వైభవోపేత ఆలయంలో "శ్రీ హనుమద్ వైభవం" అనే ప్రవచనంతో విజ్ఞ్యులను అనుగ్రహించడం, కూకట్పల్లి వివేకానందనగర్ పరిసరాల్లోని భాగ్యనగర విజ్ఞ్యుల భాగ్యపరిపాకమై వర్ధిల్లే సందర్భం....
ఇవ్వాళ్టి రోజుల్లో కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆధ్యాత్మిక వైభవాన్ని, అధ్యాత్మవేత్తల గౌరవాన్ని, వారి వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలకు సాధనంగా వినియోగిస్తున్న సందర్భాల్లో...,
అటువంటి వ్యాపార పటాటోపాలకు, వ్యాపారవేత్తల ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, కేవలం ఆలయం, భగవంతుడు, భక్తులు, పుణ్యం, సమాజసంస్కరణ, ఉజ్జ్వల భావిభారతనిర్మాణం, ఇత్యాది లోకోపకార కార్యక్రమాల నిమిత్తమై వర్ధిల్లుతున్న శ్రీశుకయోగీంద్ర సమాన అభినవ ఆధునిక అధ్యాత్మ భవ్యభారత నిర్మాణ యోగీశ్వరులైన శ్రీచాగంటి సద్గురువులను దర్శించి నమస్కరించడం ఎంతో పుణ్యప్రదమైన అంశం....
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐
సర్వం శ్రీవీరాంజనేయ శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏