🎂🍕🎇🍧💐🍦✨🍨
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకచతుర్దశి అనే పేర, నాడు భీకర యుద్ధంలో శ్రీకృష్ణుడు అలసి ఉండగా సత్యభామ నరకాసురుణ్ణి సమ్హరించడాన్ని అనాటినుండి ఈనాటి వరకు కూడా పండగగా జరుపుకోవడంలో అసలైన ఆంతర్యం ఏంటి...?
అమావాస్య నాడు దీపావళి లక్ష్మీ పూజ పేరిట శ్రీలక్ష్మీ ఆరాధనలోని అసలైన ఆంతర్యం ఏంటి...?
అనే సందేహాలు కొందరు విజ్ఞ్యులకైనా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటాయి....
సనాతన ధర్మసంప్రదాయంలోని ప్రతీ పండగా, ప్రతీ క్రతువు, ప్రతీ ఆచారం, ప్రతీ విశేషంలో ఒక లౌకిక, ఒక పారలౌకిక, సందేశం ఇమిడి ఉండడం అనేది ఎల్లరికి విదితమే....
ఇంటిదెగ్గర ఉండే శివాలయానికి వెళ్ళి అభిషేకం, దర్శనం, గావించమంటే చాలామందికి అది అవలీలగా సాధ్యమయ్యే విషయమే....
కాని అమర్నాథ్ యాత్రకు వెళ్ళి అత్యంత అరుదైన జ్యోతిర్లింగమైన హిమలింగాన్ని దర్శించి రమ్మంటే
అది అందరికీ సాధ్యంకాకపోవచ్చు.....
ఎందుకంటే అది ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సాధించబడే ఉన్నతమైన దర్శనం......
ఒక ఉన్నతోన్నతమైన స్థాయిలో ఉండే అమరనాథుడిని దర్శించే స్థాయికి ఏనాటికైనా చేరుకోవాలి అనే సంకల్పం తో ప్రయత్నం గావించడం సబబుగా ఉంటుంది.....
కాని.....
ఎవరో కొంతమందికి మాత్రమే అమరనాథుడి దర్శనం సాధ్యం కాబట్టి ఇక శివుడు కొందరికి మాత్రమే అందే వాడు అని అనడం అర్ధరహితం......
అచ్చం అదే విధంగా ఒక సనాతన ధర్మ ప్రతిపాదిత పురాతన సంప్రదాయంలో ఉండే లౌకిక విషయాలను ఆకళింపు జేసుకోవడం అందరికి సాధ్యమయ్యే సామాన్యాంశం గా ఉండి....
అందలి అలౌకిక, ఉన్నతమైన లౌకిక, పారలౌకిక, విషయాలను ఆకళింపు జేసుకోవడం అందరికి సాధ్యమయ్యే అంశం కాకపోవచ్చు...... అంతమాత్రాన
ఎవరో కొంతమందికి మాత్రమే ఆ వేదవేదాంత ప్రతిపాదిత తత్త్వ జ్ఞ్యానం అర్ధమౌతుంది కాబట్టి....
సనాతన ధర్మ వైభవం కొందరికి మాత్రమే అందేది / అర్ధమయ్యేది కాబట్టి వాటిని విడిచి కేవలం
ఆధునిక జీవనం అనే ఒక మరమనిషి యొక్క జీవితంలా ఎల్లరి జీవితాలు ఉండిపోవాలి అని అనుకోవడంలో అర్ధమే లేదు....
నక్షత్రమానం ప్రకారంగా అశ్విని నక్షత్రం క్రమసంఖ్యలో మొట్టమొదటిది....
అనగా ఒక నూతన నక్షత్రమాన సంవత్సరారంభం ఈ ఆశ్వయుజ మాసంతో మొదలైంది అనేది సైద్ధాంతిక వివరణ.....
తత్ నక్షత్రమాన సంవత్సరాదిలో మొట్టమొదట దుర్గాపూజంతర్గత శక్తి ఆరాధనతో 27 నక్షత్రాలు × వాటి 4 పాదాలు = 108 పాదాల్లో / 12 రాశుల్లోనే జన్మించే యావద్ జీవకోటికి తగు విధంగా జీవశక్తిని అందించేది సంప్రదాయాంతర్గత ఆశ్వయుజ శక్తి ఆరాధన......
పంచాంగ వ్యవస్థ ప్రకారంగా పరావర్తన సౌరశక్తి లుప్తమై ఉండే తిథి అమావాస్య....
అనగా సదా స్వప్రకాశకమైన శాశ్వతమైన సత్య శక్తిగా భాసించే ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యుడి పరావర్తన శక్తితో ప్రకాశించే చంద్రుడి శక్తి (చంద్రశక్తి జీవశక్తికి ప్రతీక) లుప్తమై, అనగా జీవశక్తి లుప్తమై, ఉండే రోజే విశేషమైన లక్ష్మీ ఆరాధన గావించడంలోని ఆంతర్యం.....
జీవుడు సదా పరమాత్మ యొక్క శక్తితో మాత్రమే తన ఉనికిని ఏర్పరచుకొని సూచింపబడే ఒక ప్రాణి తత్త్వంగా, అనగా జీవధారిగా వెలుగొందుచున్నాడు అనే తత్త్వాన్ని జీవుడు ఎరుకలోకి తెచ్చుకోవలసిన అసలైన లక్ష్మీ తత్త్వమే దీపావళి శ్రీలక్ష్మీ ఆరాధనలోని అసలైన ఆంతర్యం....
( లక్ష్మ్యతే ఇతి లక్ష్మి అను వ్యుత్పత్తి ప్రకారంగా ఒక సూచికగా భాసించునదే లక్ష్మీ అని అర్ధం)
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నట్టుగా
"దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో.." అనే సామెతకు అసలైన అర్ధం
జీవుడు సహకరించే స్థితిలో ఉండగానే, అనగా దేహం శక్తియుక్తులతో ఉరకలు వేసే స్థితిలో ఉండగానే కావలసినంత పుణ్యార్జనగావించి ఉత్తర జన్మలను ఉన్నతంగా తీర్చి దిద్దుకో అనేది అందలి అసలైన పరమార్ధం.......
మన సనాతన సంప్రదాయంలో గతించినవారి శిరస్సు దెగ్గర కూడా దీపం వెలిగించడం లోని అసలైన పరమార్ధం శ్రీచాగంటి సద్గురువులు తెలిపి ఉన్నారు......
"వచ్చే జన్మల్లో కూడా/అయినా ఈశ్వరుడి పై భక్తితో జీవించేలా ఈ పుర్రె పుణ్యాలను గడించి ఉన్నతమైన సద్గతులను పొందుగాక...." అనే తత్త్వ సందేశాన్ని ఇమిడిఉండేలా ఉండే మన దీపారాధన సంప్రదాయం ఎంత గొప్పదో కద...!
"దీపేన సాధ్యతే సర్వం.... " అని మన పెద్దలు అన్నది అందుకే......
"సనాతనమైన లక్ష్మిని కీర్తిస్తున్నాను...."
అంటూ పరతత్త్వాన్ని సూచించే శ్రీలక్ష్మీ వైభవాన్ని శ్రీలక్ష్మీహృదయస్తోత్రం లో ఈ క్రింది విధంగా వర్ణించడం చదివే ఉంటారు.....
శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీమ్ |
సర్వకామఫలావాప్తి-సాధనైకసుఖావహామ్ ||
స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః |
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీమ్||
సనాతనం / సనాతన ధర్మం అంటే అసలు అర్ధం ఏంటి..... ?
"పూర్వజా త్రిపురాంబిక..." అనే శ్రీలలితా సహస్రనామావళి వ్యాఖ్యానంలో శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా.......
"ఫలానా సమయం నుండి... "
అని ఎవరైనా చెప్పగలిగితే....
అంత కంటే కూడా పురాతనమైనది.....అని అర్ధం.....
అనగా నిర్దిష్టమైన దేశకాలములకు అందని వైభవంతో అలరారే ధర్మం అని అర్ధం......
ఎప్పటినుండి ఉందో చెప్పనలవి కానటువంటి వైవిధ్యభరిత పరతత్త్వాన్ని ఎప్పటికీ అందేలా ఒక సూచికగా ప్రాపంచిక ఇంద్రియగోచరమైన విధంగా అందుకోవడం / ఆరాధించడమే శ్రీలక్ష్మీ ఆరాధన.....
జాగ్రత్తగా గమనిస్తే అన్ని రకాల దైవారాధనలు కూడా పై వాక్యం లో ఇమిడిఉంటాయి......
ఆ శాశ్వతమైన సార్వకాలిక సత్య తత్త్వమైన పరతత్త్వం యొక్క దర్శనీయమైన స్థితే
"సత్య భా".....
"మ.." అనగా శ్రీలక్ష్మిని సూచించే బీజాక్షరం.....
కాబట్టి " సత్యభామ " చేతిలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు హతమై వాడి చెరనుండి 16000 మంది గోపికలకు శ్రీకృష్ణుడు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి వరించడం అనగా.....
పంచభూతాలు (అనగా పాంచభౌతికమైన ప్రపంచం) + పంచతన్మాత్రలు + పంచేద్రియాలు + వీటన్నిటిని అనుసంధానించే అగోచరమైన మన మనసు అనే సంకల్పవికల్పాల సమూహం = 16 తత్త్వ సంచయాల కలయికతో సదా భ్రమించే జీవుడు ప్రాపంచిక దుఖాలకు బంధీగా ఉండడం అనే అనివార్యమైన స్థితి నుండి పరమాత్మ విముక్తిని ప్రసాదించడం.......
వెయ్యి / సహస్రం అంటే అనంతం అని అర్ధం...
అంటే (16 తత్వ సంచయాలు × 1000 = 16000)
అనగా అనంతమైన షోడశ తత్త్వ భూమికల్లో తిరుగాడే జీవకోటి అనేది తాత్విక సమన్వయం.....
అందుకోసం పురుషకారిణి గా, భాగ్యనుసంధాయినీం గా, పెద్దలచే అనాదిగా స్తుతింపబడే శ్రీలక్ష్మీ అనుగ్రహమే కీలకమై ఉంటుంది అని తెలియజేయడమే అందలి తత్త్వ సందేశం.....
8 ఏండ్ల వటువుగా అవతరించి వచ్చినా సరే అనఘాలక్ష్మీ సహితుడై ఏతెంచిన శ్రీమహావిష్ణువు బలిదైత్యుణ్ణి
"ఒకటిరెండడుగుల మేర సొమ్ము ఇమ్ము...బ్రహ్మకూకటి ముట్టెద..."
అంటూ 3 అడుగుల భూదానాన్ని అర్థించి యావద్ బ్రహ్మాండాన్ని కైవసం గావించుకొని 3వ అడుగు బలిదైత్యుడి శిరస్సుపై మోపి ఆతడిని అధోలోకాలకు పంపించి, అక్కడ తను స్వయంగా బలిచక్రవర్తికి ద్వారపాలకుడిగా ఉండే వృత్తాంతాన్ని గుర్తుచేసే బలిపాడ్యమి.....
కార్తీక శుద్ధ విదియ నాడు చెల్లెల్లి చేతి భోజనం స్వీకరించిన వారికి యమయాతనలు తగ్గును అని
"భగినీ హస్త భోజనం" గా, తన చెల్లెలు సూర్యపుత్రిక యమున ఇంట్లో భోజనం గావించిన తదుపరి సంతుష్టుడై వరమిచ్చిన అష్టదిక్పాలకుల్లో ఒకరైన సమవర్తి యొక్క గొప్పదనాన్ని గుర్తుచేసే యమద్వితీయ.....తో 5 రోజుల దివ్వెల ఉత్సవంగా
దీపావళి పండగ సనాతన ధర్మసంప్రదాయాంతర్గతమైన ఒక ఘనమైన ఉత్సవంగా అనాదిగా భారతావని యొక్క దేదీప్య సంప్రదాయ ద్యుతిని భావి తరాలకు అందిస్తూ అలరారుచున్నది......
సర్వమంగళమాంగళ్యే
విష్ణువక్షస్థలాలయే..
విష్ణోః ప్రియసఖీం దేవీం
నమామి అచ్యుత వల్లభాం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🍨🍦✨🍕💐😊🎂🎇