Monday, December 23, 2019

శ్రీ చాగంటి సద్గురువులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ | శ్రీ కే.సీ.ఆర్ గారి గురువందన పూర్వక చిరు సత్కారం…… :)

శ్రీ చాగంటి సద్గురువులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ | శ్రీ కే.సీ.ఆర్ గారి గురువందన పూర్వక చిరు సత్కారం…… 
వసంత ఋతువులోని పూత పిందై, కాయగా మారి అనతి కాలంలోనే మామిడి / రసాల ఫలం గా మారి చివరిదాకా చెట్టుపైనే ఉండి బాగా దోరగా అయ్యి రామచిలుకలు కొరికేంతగా పండిన మామిడి పండుని కోసుకొని దానిపై కొంచెం తేనె రాసి భగవంతుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించడంలోని ఆనందమే వేరు……
అట్లే శిశువుగా మనుష్యజన్మనెత్తి ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చి పెరిగి పెద్దై, శ్రీమద్భాగవతాన్ని వినే అదృష్టానికి నోచుకొని, అది సర్వోత్కృష్టమైన సద్గురువుల బోధామృతముగా ఆలకించి తత్ప్రతిపాదితమైన అధ్యాత్మ అమృతాన్ని ఆస్వాదించి జన్మను తరింపజేసుకోవడంలోని ఆనందమే వేరు…...
విష్ణ్వాంశలేనిదే పదిమందిని శాసించే అధికారి కాలేరు అనేది సద్గురువుల ఉవాచ…..
అటువంటిది విష్ణ్వాంశ మెండుగా ఉండి ఒక రాష్ట్రాన్నే శాసించే అధికారిగా, సద్గురువుల పాదాలకు నమస్కరించి వారిని సత్కరించడం, సమ్మానించడం నిజంగా ఎంత ముదావహమైన సందర్భమో కదా…..
అలనాడు తమ గురుకులాశ్రమ జీవితంలోని గురు సాందీపని మహర్షి కి శ్రీకృష్ణపరమాత్మ తదనంతర కాలంలో శ్రీమద్భాగవత ప్రవచనం వినడానికి వచ్చి నమస్కరించినట్టుంది కదా ఈ ఘట్టం…. 
YOUTUBE.COM
CM KCR Felicitates Chaganti Koteswara Rao || Bhagvata Saptaham At NTR Stadium #CMKCR #ChagantiKoteswaraRao Watch Ntv Live Here: https://bit.ly/2RhrSQE For mo...

శ్రీ చాగంటి సద్గురువుల " భాగవతసప్తాహం " మార్గశిర కృష్ణ పంచమి ( 2019-డిసెంబర్-16 ) :)

శ్రీ చాగంటి సద్గురువుల " భాగవతసప్తాహం " ప్రవచనానికి మొన్నటి మార్గశిర కృష్ణ పంచమి ( 2019-డిసెంబర్-16 ) నాటి సాయంసంధ్యా వేళలో దోమల్గుడ యెన్.టి.ఆర్ స్టేడియానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలలో ఎన్నెన్నో అంశాలకు సంబంధించిన గ్రంథాలు ఉండడం చూసిన నాకు కేవలం శ్రీమద్భాగవత ప్రవచనాన్నే సప్తాహం గా ఏర్పాటు చేసుకొని వినడం ఎందుకు అనే విషయం గురించి ఆలోచిస్తుండగా, గురువుగారు చెప్పిన
" ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి ఉండేవి 7 రోజులే.......
ఎవ్వరికైనా ఉండేది సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని, ఆది వారాలే....
ఎవ్వరు పుట్టిన ఈ 7 రోజుల్లోనే......
ఎవ్వరు గిట్టినా ఈ 7 రోజుల్లోనే.....
కాబట్టి ప్రతిరోజు కూడ ఈశ్వరుణ్ణి స్మరిస్తు బ్రతకడమే జీవితం......
ఈశ్వరుడిని విస్మరించడమే మరణం.... అది ఎల్లప్పుడు గుర్తుండడానికి 7 రోజుల సప్తాహం గా రాశీభూతమైన పరమాత్మతత్వాన్ని అత్యంత సులభగ్రాహ్యం గా జీవుడికి అందించే శ్రీమద్భాగవతాన్ని వినడం....."
అనే సమన్వయం తో పాటుగా.......
మరికొన్ని ఈ క్రింది విషయాలు కూడ సమన్వయంగావించి చూడగా, అందుకేనేమో కలియుగప్రత్యక్ష పరమాత్మ సప్తగిరిపై నిల్చి,
" ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా....." అనే పేరుతో ఆర్తితో పిలిచిన ప్రతిభక్తుడిని అక్కునజేర్చుకొని కరుణించి కాపాడుతున్నాడు కదా అని అనిపించింది.....
అధ్యాత్మ శాస్త్ర ప్రకరాంగా చతుర్దశభువనాల్లో జీవుడి గమనం సాగి తుదకు " పరమపదం " చేరడం,
" కైవల్యసిద్ధిని గడించడం", " పంచ విధ మోక్షాలకు " అర్హతను సాధించడం" అనగా ఇక జీవుడిగా ఏ లోకంలోకి, ఏ రూపము తీసుకొని రావలసిన పరిస్థితి లేకుండ జీవస్వతంత్రత లభించడం అనే సర్వోన్నత సాధనా ఫలం కేవల దైవానుగ్రహంగా లభించడం......,
"నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సికింద్రబాద్లో సాయాంత్రం 6 గంటలకి ఎక్కితే పొద్దున 8 అయ్యే సరికి తిరుపతి చేరుకొని ఫ్రెషప్ అయ్యి కొండెక్కి ఒక 10 గంటల్లో తిరుమల చేరుకొని స్వామిని దర్శించి తరించడం...."
అనేలా.........,
చెప్పడానికి ఎంతో సులభంగా అనిపించినా, శ్రీభూనీళాసమేత పరమపదనాథుడిగా కొలువైన ఆ శాశ్వత సర్వేశ్వరతత్త్వంలోకి ఐక్యమవ్వడం అనేది అంత సులభమైన ప్రయాణం ఏమి కాదు.....
పూజాదికాలు జరిపే సమయంలో సంకల్పపఠనంలో పెద్దలు మనకు చెప్పిన ప్రకారంగా ఈ క్రింది 14 భువనాల్లో మధ్యలో ఉన్నది భూలోకం......
1. సత్యలోకం
2. తపోలోకం
3. జనోలోకం
4. మహర్లోకం
5. సువర్లోక
6. భువర్లోకం
7. భూలోకం
8. అతలం
9. వితలం
10. సుతలం
11. తలాతలం
12. రసాతలం
13. మహాతలం
14. పాతాళం
అనగా ఒక జీవుడి ఖాతాలో పుణ్యం + పాపం రెండు ఉన్నందుకు ఈ మర్త్యలోకంలో జన్మించిన మనుష్యుడికి...
పుణ్యాన్ని , తత్ఫలితంగా చిత్తశుద్ధిని ఆర్జించి 7 మెట్లు పైకి ఎక్కి ఉన్నతమైన పరమపదం చేరుకోవడానికైనా లేదా ఎత్తిన జన్మలో సుఖాలను అనుభవిస్తూ
పుణ్యం మొత్తం ఖాళి చేసుకొని
పాపాలను మూటకట్టుకొని 7 అధోలోకాల వైపునకు జీవయాత్ర సాగించాడమైనా అందరికి ఉండేవి 7 రోజులే......
భగవద్ప్రీతికరంగా మనం జీవించి ఆయన అనుగ్రహానికి పాత్రతను సమకూర్చుకోవడమే ప్రతి జీవుడి లక్ష్యం......
లోకంలో సాధారణంగా కొన్ని మాటలు వింటుంటాం.....
" ఏడేడు జన్మలకు నువ్వే నా ప్రాణం తెలుసా....."
" ఈ లోకంలో మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉంటారు తెలుసా...."
" పెళ్ళికి అటేడు తరాలు ఇటేడుతరాలు
చూసి ఇచ్చుకోవాలి తెలుసా...."
" సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం చేయడం వల్ల
"దశపూర్వేశాం దశాపరేశాం మద్వంశ్యానాం....." అనగా అటు 10 తరాలు ఇటు 10 తరాలు మన తరం మొత్తం 7 * 3 = 21 తరాలు తరిస్తాయి తెలుసా..... "
ఇవ్విధముగా 7 సంఖ్యమీద నడిచే తత్వం మనం గమనిస్తూ ఉంటాం.....
84 లక్షల జీవరాశుల్లో "మాట" / "వాక్కు" ప్రసాదించబడిన ఒకేఒక జీవి మనుష్యుడు.....
అందుకు కృతజ్ఞ్యతగా ఎల్లప్పుడు అది ప్రసాదించిన ఈశ్వరుడి నామస్మరణం గావిస్తు, ఇతరులకు వీలైన సహాయం గావిస్తు జీవించగలిగిన ఎకైక ప్రాణి మనుష్యుడు.......
కాని మనుష్యుడు అనవసరంగా తనకు సంబంధించని విషయాల్లో తలదూర్చి ఇతరులను మాటలతో
తూలనాడి వీలైతే చేతలతో కూడా హింసించి వాళ్ళ బాధకు కారణమై జీవించడం సమాజంలో తరచుగా మనం చూసే సత్యం....
ఒక్కొక్కరు చూడండి వాళ్ళకు అబ్బిన ప్రతి సంపద, అది పేరైనా, పదవైనా, అధికార ఐశ్వర్యాలైనా మరే ఇతరమైన నశ్వరసంపత్తైనను అది ఈశ్వరానుగ్రహంగా భావించి జీవించే ఔన్నత్యంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారు.....
కొందరు వాటిని కేవల తమ గొప్పతనం మాత్రమే అన్నట్టుగా ఈశ్వరుడిని విస్మరించి జీవించేస్తుంటారు.......తన్మూలంగా
అన్ని జాఢ్యాలు వారి జీవితంలో భాగమై ఎవ్వరిని కూడా గౌరవించని, ఓర్వని, మెచ్చుకోని, ఆఖరికి భరించని రీతిలో తమ అక్కసును అనునిత్యం ఎవరు పడితే వారిపై వెళ్ళగక్కుతుంటారు....
అవి ఆకాశంలో అప్పుడప్పుడు మెరిసే ఉరుముల తాలుకా కేవల శబ్దాలే అని నింగిని తూలనాడుతావేమో....
అది భీకర ప్రళయాగ్నిని తనలో నింపుకున్న పిడుగై నీపై విరుచుకుపడి సమూలంగా దహించివేయగలదు అనితెలిసిననాడు నింగిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
అవి రోజూ అలా వచ్చిపోయే పిల్లగాలులు మాత్రమే అని గాలిని తూలనాడుతావేమో......
సముద్రపు కెరటాలను నలుదెసల వ్యాప్తిగావించి కొబ్బరి చెట్లను సైతం పెకిలించివేసే తుఫాను తాలుకా సుడిగాలి హోరు కాగలదు అని తెలిసిన నాడు గాలిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
అవి ఎవరో చలి మంటలు కాచుకోవడానికి రగిల్చిన నిప్పు కణికలు మాత్రమే అని అగ్నిని తూలనాడుతావేమో......
అవి అరణ్యాలను సైతం దహించివేసే దావానలకీలలు కాగలవు అని తెలిసిననాడు అగ్నిని గౌరవిస్తావేమో....
అవి వచ్చి పోయే సాగర అలలతుంపర్లు మాత్రమే అని ఎల్లపుడు నీటిని తూలనాడుతావేమో....
అవి వచ్చి విరుచుకుపడి అన్నిటినితనలోకి ఈడ్చుకుని దూసుకుపోయే సునామి తాలూకా కెరటాలు కాగలవు అని తెలిసిననాడు నీటిని గౌరవిస్తావేమో....
అది కేవలం భూమిలోనుండి వచ్చిన బారెడు లైట్ వేట్ అల్యుమినియుం తీగమాత్రమే అని భూజనితమైన ఖనిజాన్ని తద్వారా భూమిని తూలనాడుతావేమో.....
అది కొన్ని వందల మెగావాట్ల విద్యుత్ శక్తిని తనలో ప్రవహింపజేసుకుంటూ అజాగ్రత్తగా చెయ్యేసినవాడిని అక్కడికక్కడే మాడి మసిజేసే కరెంట్ తీగ కాగలదు అని తెలిసిన నాడు భూమిని, భూసంపదను గౌరవిస్తావేమో....
అది బురదలో పొర్లే కట్లపామేలే అని తూలనాడుతావేమో......
అది సాక్షాత్ ఆదిశేషుని అంశగా వచ్చిన మేలిమిజాతి శ్వేతనాగై నిన్ను కబలించిననాడు, మనకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వారిని మనం కూడా గౌరవించాలి అని గుర్తిస్తావేమో.....
" తనదార్లో తాను ఆఫీస్ కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కావలని ఆగి ఉన్న కార్ డోర్ ఒక్కసారిగా గట్టిగా ఓపెన్ చేయించి బైక్ తో సహా ఆ వ్యక్తి అంతదూరం ఎగిరి పడేలా కొట్టించి మోచెతులకు దెబ్బలు తగిలి, బైక్ డెంట్లు పడి బాగా డ్యామేజ్ అయ్యి ఇండికేటర్ లైట్లు విరిగి హెల్మెట్ ఉన్నందుకు ప్రాణాపాయం తప్పి గాయాలు కాగా, మీరు కాపుగా పెట్టిన వాళ్ళింటి పక్కన ఉండే సమోసాలు విక్రయించే అంకుల్ సహాయంతో పైకి లేచి ఎం జరిగిందో అని కాసేపు విస్తు పోయి ఆనక నీళ్ళు తాగి తేరుకున్న ఆ వ్యక్తిని చూసి వెకిలి నవ్వులు నవ్వుకున్న మీ అత్యంత క్రూరమైన మనస్సుకు, మీ హేయమైన వ్యక్తిత్వానికి ఆ ఘాతుకం తాలుక పాపఫలితాన్ని
అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు,
ఈశ్వరుడు......
' నీకో, నీ పిల్లలకో అట్లే జరిగి నువ్వు కూడా అట్లే బాధపడెదవు గాక..... '
అని కాలాన్ని శాసించిన నాడు నీ దుర్గతి ఎలా ఉంటుందో ఆలోచించగలవ...?
ఎంతసేపు పక్కవాడు ఎదగకుండా ఎలా అడ్డుపడదామా అనే తప్ప జీవితంలో సన్మార్గంలో ఉన్నతి సాధించాలి అనే ఆలోచన ఏఒక్కరోజు కూడా రాని మీకు, అవతలి వ్యక్తిని అనునిత్యం హింసించి ఎదో సాధించేద్దాం అనుకుంటారేమో, మీ కదలికలను మీ కంటే కూడా ఎంతో నిశితంగా పరిశీలించే ఆ వ్యక్తి
మీకు సరైన సనయంలో సరైన విధంగా చెక్ పెట్టడానికే మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాడు అని తెలుసుకునే ఇంగితం కూడా లేకుండా ఆ వ్యక్తి తాలూకా వారందరిని ప్రతికూలంగా మలిచి ఆ వ్యక్తిని దెబ్బతీయాలని చూసే మీకు కాలమే తగు రీతిలో సమాధానం చెప్పగలదు...."
అని తెలుసుకున్న నాడు ఇతరులను గౌరవిస్తారేమో........
ఎదురుగా ఉన్నది కేవలం 5 1/2 అడుగుల, 33 సంవత్సరాల బక్కపలచని వ్యక్తి మాత్రమే
అని తూలనాడుతావేమో.....
ఆ వ్యక్తిలోకి ఈ బ్రహ్మాండాన్నిసైతం బద్దలకొట్టగలిగే చిత్శక్తి వచ్చిచేరి యావద్ విశ్వాన్ని తన పిడికిట బంధించే వ్యక్తిత్వమది అని తెలిసిననాడు ఇతరులను కేవలం వారి శరీరానుగుణంగా కాక దేశకాలానుగుణంగా గౌరవించడం నేర్చుకుంటావేమో......
"ఎక్కడరా నీ శ్రీహరి......??"
అని పదే పదే ప్రహ్లాదుడిని హింసించిన తన తండ్రి హిరణ్యకశిపుడికి సమాధానంగా ఇవ్వబడిన ఈ క్రింది శ్రీ పోతనామత్యుల శ్రీమద్భాగవతపద్యరాజం మనకు విశదీకరించినట్టుగా "
ఈశ్వరుడు ఎక్కడుంటాడు.....?"
అనే ప్రశ్నకు సమాధానం
"ఈశ్వరుడెక్కడైనా ఉంటాడు...."
చూడగలిగే మనసు, చూడాలనే ఆకాంక్ష, చూసే భాగ్యం ఉన్నవారికి ఈశ్వరుడు అంతటా కలడు....
అని చెప్పే ఈ పద్యం నిజంగా ఎంతటి భావుకతను తనలో నిక్షిప్తం చేసుకుందో కదా......
" కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్. "
ఇన్నిటికి మరియు అన్నిటిని మూలమైన ఈశ్వరుడిని అనునిత్యం, అనగా మనందరికి ఉండే 7 రోజులూ, స్మరించడమే అన్ని దివ్యవిభూతులు మనకు కటాక్షించబడేందుకు మూలకారణమై ఉంటుంది కాబట్టి
ఆ ప్రయత్నపూర్వక భగవద్ స్మరణను
మనకు అబ్బేలా పెద్దలు శ్రీమద్భాగవతాన్ని సప్తాహంగా మనకు సెలవిచ్చారు.....
పైన ఉన్న పద్యం యొక్క భావం సప్తస్వరాలసమ్మేళనాత్మకంగా పరమాత్మను స్తుతించే ఒక చక్కని సంకీర్తన రూపంలోకి ఒలికిస్తే ఈ క్రింది అన్నమాచార్యుల సంకీర్తనలా ఉంటుందని నా భావన...😊
****************** ******************
ప : విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ శాశ్వతునకు కూహింప జన్మ మిక నేడ
చ : సర్వపరిపూర్ణునకు సంచార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
చ : నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహౄదయస్థునకు మాటేడ పలుకేడ జ़్జానస్వరూపునకు గాన విన నేడ
చ : పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ
****************** ******************
నాటి ప్రవచనం ముగిసాక వేదికపై కొలువైన శ్రీకృష్ణపరమాత్మకు ఇవ్వబడిన మంగళనీరాజనానికి నమస్కరిస్తున్న గురువుగారి పిక్....😊🙏

Friday, December 6, 2019

శ్రీకరి శ్రీపుష్పయాగ వైభవం.....! :)

శ్రీకరి శ్రీపుష్పయాగ వైభవం.....!
సిరులతల్లికి సుమనోహర సుమసరాల సందోహం.....!!
స్వామి తిరుమేని యొక్క సాటిలేని ఆ సహజ పరిమళం తనకు సోకకుండా ప్లోతవస్త్రం పీల్చేసుకుంటుందని శ్రీనివాసుని హృదయదేవేరి అలకబూని వివిధ వర్ణరంజితమైన విరులు పరిమళాలు వెదజల్లే పూదోటలో కొలువైఉండడానికి తరలి వచ్చిందా ఏమి అన్నట్టుగా ఉన్న
ఈ శ్రీపుష్పయాగ చిత్రాలు భక్తులకు కనులపండువగా భలే ఉన్నాయి కదు.....😊
సనాతన ధర్మాంతర్గతమైన, ఆగమోక్తమైన ప్రతి శాస్త్రీయ ఆచారానికి, సంప్రదాయానికి,
లౌకికంగా, శాస్త్రప్రకారంగా / ఆధ్యాత్మికంగా, దైవికంగా, తాత్వికంగా, ఇలా వివిధ కోణాల్లో ఒక్కో ప్రత్యేకత, ఒక్కో విశిష్టత, ఒక్కో ఘనత ఉంటుందనేది మన పెద్దల ఉవాచ......
అవేంటో సద్గురువుల / ఆచార్యుల జ్ఞ్యానబోధానుగ్రహంతో ఇంకా తెలుసుకోకపోయినా సరే, వాటిని ఆచరించిన వారికి, అందులో పాల్గొన్న వారికి అవి వర్షించాల్సిన అనుగ్రహం ప్రసాదించడం కద్దు......
( ఒక ట్యాబ్లెట్ యొక్క మెడికల్ కాంపోసిషన్ గురించిన వివరాలు తెలియకపోయినా, మనం మింగిన తరువాత అవి డీకంపోస్ అయ్యి ఏ విధంగా మన రక్తంలో కలిసిపోయి ఎరిత్రోసైట్స్ లింఫోసైట్స్ తో కలిసి శత్రునాశనం, అనగా రోగ కారక క్రిమిసమూహన్ని అంతమొందించి మనకు స్వస్థతను కలిగించడం, అనే సూక్ష్మ విద్యపై మనకు ఒక డాక్టర్కి ఉన్నంతగా అవగాహన లేకున్నా సరే, మింగినంత మాత్రం చేత అవి తమ నిర్దేశిత ప్రయోజనాన్ని ఏవిధంగా సాధించిపెడతాయో......
అచ్చం అదేవిధంగా శాస్త్రోక్తమైన పూజాక్రతువులు కూడా తమ నిర్దేశిత ప్రయోజనాన్ని భక్తులకు సమకూర్చిపెడతాయి అనేది పెద్దలచే రూఢమైన అధ్యాత్మ సత్యం.......)
బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలిసితెలియక జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్త క్రతువుగా శ్రీపుష్పయాగం నిర్వహించడం అనేది అనాదిగా ఆచరింపబడుతున్న సదాచార విశేషం అనేది నాణానికి ఒక వైపైతే, పుష్పములకు గల మహిమ్నత, ప్రత్యేకత దృష్ట్యా శ్రీపుష్పయాగాన్ని దేవిదేవతాప్రీత్యర్ధం నిర్వహించడం అనేది నాణానికి మరోవైపు గల సత్యం.....
( పుష్పం యొక్క గొప్పతనం ఏంటి, పూజలో పుష్పం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇదివరకే ఈ క్రింది నా పాత పోస్ట్లో రాసాను....అది కూడా ఇక్కడ సమన్వయపరచుకోగలరు......
క్రింద ఉన్న లింక్ నుండి ** అనే 7 జతల నక్షత్ర గుర్తులను తీసేసి క్లిక్ చేస్తే ఆ పాత పోస్ట్ ని చదవచ్చు.......
**https**://m.facebook.com**/story.php?story_fbid=**10217907148963715**&id=**1033694038**
)
" అరోమాథెరపి " అనే వైద్యవిధానంలో వివిధ పరిమళాలతో అనేకరకమైన శారీరక మానసిక రుగ్మతలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యంత శ్రేష్ఠమైన నాన్-ఇన్వేసివ్ మేడికల్ థెరపి / ప్రక్రియద్వార చికిత్స చేయడం ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో మనం గమనించవచ్చు.....
అలాంటి పరిమళాలు బాగా కాస్ట్లి కాబట్టి, ఎక్కువ ఖర్చులతో కూడుకునే ఈ ప్రక్రియ అంతగా సామాన్య జనబాహుళ్యానికి అందుబాటులో లేని ప్రక్రియ...
ఈ భూమండలంపై గల మనకు తెలిసిన కొన్ని వందల రకాల పుష్పాలు, తెలియని కొన్ని వేల జాతుల పుష్పాలు తమదైన పరిమళంతో ఒక్కోటి ఒక్కో
ప్రత్యేకతతో ఉంటుంది......
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల అధ్యాత్మ పరిమళాలు ఆఘ్రానించేవారికి తెలిసినట్టుగా,
మన ఇతిహాస పురాణాల్లో కూడా వివిధ పుష్పాల గురించిన సంఘటనలు కలవు......
శ్రీ కృష్ణపరమాత్మ సత్యభామ అలకను తీర్చుటకై దేవలోక పరిజాతాపహరణం గావించడం......
( ఎన్నటికి వాడని పువ్వులతో పరిమళభరితంగా సదా వికసితమై ఉండడం, పూసిన ప్రతి దేవ పారిజాతపుష్పం ప్రార్ధించిన వారి ఒక కోరికను తీర్చడం అనేది వీటి ప్రత్యేకత.....)
ద్రౌపది యొక్క కోరిక మేరకు భీముడు హిమవత్పర్వతసానువుల్లో మాత్రమే లభించే సౌగంధికా పుష్పాలకొరకై వెళ్ళెటప్పుడు దార్లో హనుమ వారిని అడ్డగించి, తన అప్రతిహత బలపరాక్రమాలపై భీముడికి గల అతిశయాన్ని తొలగించేందుకు, దారికి అడ్డుగా తన వాలాన్ని వేసి చేతనైతే అది తొలగించి దారి చేసుకొని వెళ్ళమని భీముడికి సవాల్ విసరడం, హనుమంతుల వారి వాలాన్ని రవ్వంతైనను కదపలేని తన అశక్తతను గుర్తించి భీముడు హనుమ స్వామిని గుర్తించి ప్రార్ధించడం.....
ఇవ్విధముగా పుష్పాలకు గల వైభవాన్ని మనం గమనించవచ్చు......
పుష్పముల నుండి గ్రహించబడిన మకరందాన్ని తేనెటీగలు కమ్మని తేనేగా మార్చడం, ఆ తేనె ఆయుర్వేదశాస్త్రంలో ఎంతో ఘనమైన ఔషధం గా పరిగణించబడడం.....
( తేనెకు గల ఆంల తత్వరీత్యా అది వేడిచేస్తే ఔషధం కాస్త విషంగా మారుతుంది.... జుత్తుకు తేనె రాస్తే తల ముగ్గుబుట్ట అవుతుంది....
( అనగా వెంట్రుకలు తెల్లబడిపోతాయి....)
ఇలా ఈ సృష్టిలో పుష్పాలకు, పుష్పజనితమైన పరిమళానికి, మకరందానికి గల గొప్పదనం ఎల్లరికి విదితమే......
రసాయన శాస్త్రంపై గట్టి పట్టున్న కెమిస్ట్రి సబ్జెక్ట్ లవర్స్ కి తెలిసినట్టుగా,
ఒకే పదార్ధం ( అది ఆంలమైనను, క్షారమైనను ) తమకు గల pH ఫాక్టర్ కి అనుగుణంగా వివిధ ఇతర పదార్ధాలతో సమ్యోగ చర్యలో పాల్గొన్నప్పుడు ఇదివరకు లేని వివిధ కొత్త పదార్ధాలను జనింపజేయడం వాటి ప్రత్యేకత......
అచ్చం అదేవిధంగా వివిధ పరిమళాలు గల వివిధ పుష్పాలను ఒక క్రమపద్ధతిలో భగవద్కైంకర్యంలో వినియోగించినప్పుడు అవి వివిధ అనుగ్రహానికి మనలను పాత్రులను గావిస్తాయి......ఆ గహనమైన రసాయన శాస్త్ర విశేషాలు మనకు అంతగా తెలియకపోయినా భక్తితో మనం సమర్పించిన పుష్పాలు వాటి ప్రత్యేకతను బట్టి భగవద్ ప్రీతి కలిగించి మనల్ని అనుగ్రహించడం కద్దు......
ప్రత్యేకించి తిరుమలకు పుష్పమండపం అని పేరు ఉండడం మరియు శ్రీనివాసుడు పుష్పప్రియుడు కావడం వల్ల తిరుమల తిరుపతిలో జరిగే శ్రీపుష్పకైంకర్యాలు మరింతగా భగవద్ప్రీత్యర్ధమై భక్తులను అనుగ్రహించడం ఇక్కడి విశేషం....!!

ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదానుభవేపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 3 ||

ఓం శ్రియై నమః...
🙏🙏🙏🙏🙏 😊

అన్నమాచార్యులవారు కూడా 'అలర్మేల్మంగమ్మ అలక' అనే భావమంజరిని విరబూసిన సుమాల గుబాలింపుతో ఊగిసలాడే కొమ్మల రెమ్మల కోమల దోబూచులాటగా ఎంతో చక్కనైన ఈ క్రింది సంకీర్తనా సౌరభంలో ఒలికించారు......😊
 
********************************************

ప: అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

చ: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ

చ: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

చ: చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ

********************************************


Ponnala Venkatesh RD
సిరుల అలివేణికి శ్రీ పుష్పయాగం

Wednesday, November 13, 2019

శ్రీ వెంకయ్యనాయుడి గారి ఈ చిరు వ్యాసం ,భాషాభారతికి బహుచక్కని బహుమానం... :)

Vinay Kumar Aitha
53 mins
శ్రీయుతమై సకల శ్రేయోదాయకమై వర్ధిల్లే మాతృభాషా ప్రాముఖ్యతనూ, ప్రాభవాన్ని, ఎంతో పరిణతి గల పదసంపదతో పొందుపరిచిన భారత ఉపరాష్ట్రపతి, భారతదేశ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని మాన్యులైన నేతల్లో ఒకరైన రాజనీతిజ్ఞ్యులుగా, అనర్గళ వక్తగా, దేశభక్తి మెండుగా గల భరతమాతబిడ్డడిగా, 'సెక్యులరిజం' అనే భావజాలాన్ని సరైన రీతిలో సమన్వయపరచగల సాధికారవ్యక్తిత్వసంపన్నులుగా పేర్గాంచిన
గౌ|| శ్రీ వెంకయ్యనాయుడి గారి
ఈ చిరు వ్యాసం నిజంగా
కడు రమణీయం.....
బహుభంగిమల సందేశాత్మకం.....
భాషాభారతికి బహుచక్కని బహుమానం ఈ భవ్యభావనాత్మకమైన భాషాభావజాల ఉల్లేఖనం.....🙏😊👏
TWITTER.COM
“తెలుగు మాధ్యమంలో విద్యాబోధన అవసరం, దాని గొప్పదనంపై *'అందరికోసం అమ్మభాష'* పేరిట ఇవాళ్టి ఈనాడు దినపత్రికలో ప్రచు....

శ్రీచాగంటి సద్గురుదంపతులకు పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ on Nov-03-2019 :)....

శ్రీచాగంటి సద్గురుదంపతులకు,
శ్రీ వికారి కార్తీక శుద్ధసప్తమి భానువాసర సాయంసంధ్యానంతరం జరిగిన పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ.....
ఇది 2019-నవంబర్-03 నాడు నాంపల్లి
తెలుగు లలితకళాతోరణంలో ఆస్తికులెల్లరికి అమితమైన ఆనందాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక కార్యక్రమం......😊
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసి మరింత ప్రత్యేకతను జోడించిన
మాన్యులైన ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక వక్తలు, ఐ.ఏ.ఎస్ ఆఫిసర్స్, రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు,
(
శ్రీ జొన్నవిత్తుల గారు,
శ్రీ కే.వి. రమణాచారి గారు,
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,
శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు,
శ్రీ హరీష్ రావ్ గారు,
.
.
......)
ఇత్యాది గా విచ్చేసిన ఎందరో ప్రముఖులతో / మరియు ఇతర పెద్దలతో అక్కడికి తరలివచ్చిన ఆధ్యాత్మిక జిజ్ఞ్యాసులెల్లరికి కార్క్యక్రమం ఆసాంతం కన్నులపండువగా కొనసాగింది..... 😊
బాహ్యార్ధంలో పైన చెప్పిన విధంగా అది సద్గురువులకు గౌరవవందనావిష్కరణగా జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం......
ఆ బిరుదులను, సత్కారాలను గురువుగారు మరునాడు సంధ్యవార్చే సమయంలో వారి అర్ఘ్యపాత్రలోని గంగలో నీటిబిందువులలా భావించి వాటిని ఈశ్వరార్పణం గావించి యథావిధిగా వారి ప్రవచనాప్రస్థానంలో సాగిపోతుంటారు అనేది అందరికి విదితమైన సత్యమే....
కాని అక్కడికి విచ్చేసిన వారి శిష్యపరమాణువులందరికి కూడా అది ఎంతో ఘనమైన ఉత్సవం.......
ఇంకా చెప్పాలంటే అది వారి శిష్యబృందానికి జరిగిన సత్కారమే...! 😁
ఒక మేఘం తనలో దాచుకున్న జలసిరిని అందరిపై వర్షించి వెళ్ళడం ఆ మేఘం యొక్క గొప్పతనమే..... కాని ఎవరి మీద ఆ ఆకాశ గంగ వర్షించబడిందో వారందరికి అది ఉత్సవమే కద.....
ఒక మల్లె చెట్టో, విరజాజి చెట్టో, విరబూసిన విరులపరిమళాలతో హరితధవళసమ్మిళితవర్ణరంజితమై శోభిల్లే సమయంలో అటుగా నడిచి వెళ్తున్నవారందరికి అది ఆహ్లాదం అయాచితంగానే పంచుతుంది......
వారి కళ్ళు ఆ సుమసిరిని చూసి ఆనందించడం, ఆ విరుల పరిమళాలను వారి ముక్కు ఆఘ్రానించడం, తద్వార ఆ వ్యక్తి ఆనందించడం అనేది ఏ ఒక్క వ్యక్తికోసమో కాకుండా అటుగా వెళ్తున్నవారందరికి అయాచితంగనే లభించే సౌభాగ్యం.....
ఎవరో ఒకరు చూసి ఆఘ్రానించినంత మాత్రాన వాటి వైభవం తగ్గడం లేదా ఎవరో చూడనంత మాత్రాన వాటి వైభవం పెరగడం అనేది అక్కడ అన్వయం కాని విషయం.....
విరబూసి పరిమళాలను వెదజల్లడం
ఆ లత యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
వాటిని స్వీకరించి ఆనందించడం అనేది సదరు వ్యక్తి యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
" ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం చూస్తున్న వ్యక్తికి సంబంధించినదా...?
లేదా
చూడబడుతున్న లతకు సంబంధించినదా...?
అని అడిగితే,
ఆ ఇరువురికి అనుసంధానకర్తగా వ్యవహరించిన చైతన్య శక్తిసంఘాతానికి సంబంధించినది అని సమాధానం చెప్పవలసి ఉంటుంది.....
ఆ చెట్టు యొక్క మూలము నుండి ఆ లత విరబూసిన కుసుమకేసరాలపర్యంతం వ్యాపించిన
ప్రకృతియొక్క అదే చైతన్య శక్తి,
ఆ వ్యక్తి శరీరరంలో ఆపాదతలమస్తకం కొలువైఉండి తన యొక్క నయనఘ్రాణేంద్రియాలను ఆధారంగా చేసుకొని తన మనసు ద్వార ప్రకటితమై, అక్కడ వ్యాప్తిగావించబడి ఉన్న ఆ చైతన్య శక్తితో అనుసంధానం అవ్వడంతో " ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం అయ్యింది కద.....
అంటే ఇక్కడి,
కర్త కు ( విరబూసిన లత, దరిచేరిన వ్యక్తి),
క్రియ కు ( లత విరబూయడం, వ్యక్తి తిలకించి ఆఘ్రాణించడం ),
కర్మ కు ( వెల్లివిరిసిన ఆనందం ),
మూల కారణం అత్యంత ఉన్నత స్థాయిలో వాటిలో అంతర్లీనంగా పరివ్యాప్తమై ఉండి ప్రకటితమవుతున్న ఆ ప్రకృతి యొక్క చైతన్య శక్తియే...!
ఈ సత్యాన్ని గుర్తించ గలిగిన వారికి మరియు ఇతరులకు, భేదం కేవలం వారి యొక్క దృక్కోణం మరియు దృక్పథమే......!
( అంటే అటుగా ఒక 50 మంది వరకు నడిచి వెళ్ళుండొచ్చు......కాని కేవలం 5గురు మాత్రమే ఆ లత విరబూసిన సుమసిరి వైపుగా తమ చింతనను కొనసాగించి పైన చెప్పిన విధంగా " ఆనందం " అనే ప్రక్రియకు సాక్షి గా తమను తాము
నిలుపుకున్నారు.....)
అచ్చం ఇదే విధంగా "ఆధ్యాత్మిక అమృతరసాస్వాదన" అనే ఆనంద ప్రక్రియ ఒక సద్గురువు యొక్క వాగ్సుమాలకు, వాటిని శ్రవణేంద్రియంతో పూర్తి జాగరూకతతో మనస్పూర్తిగా తనలోకి స్వీకరించిన సదరు శిష్యుడి ఆధ్యాత్మిక తృష్ణకు సంబంధించినది....!
ఒక్కరి కోసం మాత్రమే అని ప్రత్యేకంగా మేఘం వర్షించలేదు......
ఒక్కరి కోసం మాత్రమే అని మల్లే తీగ విరబూయలేదు....
మేఘం నాకోసమే వర్షించింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
మల్లే తీగ నాకోసమే విరబూసిందని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
అట్లే, ఒక సద్గురువుల బోధామృతం కూడా నాకోసమే అనుగ్రహించబడింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఉన్నతి / ఆనందం దాగుంటుంది.....
మేఘం వేరెవరికోసమో వర్షించిందని భావించడం, మల్లే తీగ వేరెవరికోసమో విరబూసిందని భావించడం, మన యొక్క భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, విజ్ఞ్యానం అనిపించుకోదు.....
అట్లే ఒక సద్గురువులచే నుడువబడిన అధ్యాత్మబోధామృతము వేరెవరికోసమో అనుగ్రహించబడింది అని భావించడం మన
భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, సుజ్ఞ్యానం అనిపించుకోదు..... అది మన స్వోద్ధరణ కోసమే అని భావించి స్వీకరించి తరించడంలోనే ప్రజ్ఞ్యానం దాగుంటుంది......!!
సద్గురువాక్కుల ప్రతి అనుగ్రహ బిందువును ఒడిసిపట్టి వాటిని మన దైనందిన జీవితానికి అపాదించుకొని అన్వయించుకొని అంతర్వివేచన కొనసాగించిన నాడు అవి మనలోనే ఒక అవ్యాజమైన అవ్యక్తమైన అనిర్వచనీయమైన అగోచరమైన అతీంద్రియమైన ఆధ్యాత్మిక అమృతరసాన్ని ప్రభవింపజేసి మన జీవితాన్ని శాశ్వత ఆనందానికి ఆవాసంగా గావించి జీవనసాఫల్యత అనే అమృతఫలాన్ని అనుగ్రహఫలంగా అందిస్తాయి...!
అలా కాకుండా కేవలం వినడమో లేదా కేవలం వింటే సరిపోతుందనుకోవడమో అనే ధోరణిలో ఆధ్యాత్మికతను ఆలకించిననాడు అది ఇవ్వగల సంపూర్ణ ఆనందానికి చాలా దూరంలోనే ఉండిపోతాం....
ఎలా అంటే, ఒక తేనేటీగ ఎన్నో వేల పువ్వులనుండి మకరందాన్ని స్వీకరిస్తుంది ( పువ్వుకు ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో అది మకరందం స్వీకరించే శైలిలోనే ఒక శిష్యుడు కూడా తేనేటీగ లా మారి సద్గురువుల పాదపద్మములకు ప్రణమిల్లి, వారికి ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో ఆధ్యాత్మిక అనుగ్రహన్ని స్వీకరించగలగాలి.....)
చాల మందికి తెలియని విషయం ఏంటంటే పువ్వు లో నుండి స్వీకరించబడిన మకరందం మనం షాప్లో కొనుక్కొని తాగే తేనె లా తియ్యగా ఉండదు.... అది చేదు వగరు రుచుల మిశ్రమమైన ఒక విధమైన ఆంలము ( అసిడిక్ ) గా ఉంటుంది.....
మనుష్యులకు రుచించని రీతిలో ఉండే ఆ మకరందాన్ని తియ్యని మధువుగా మార్చే కళ కేవలం ఆ తేనేటీగకు మాత్రమే కలదు.....అన్యులకు అది అసాధ్యం......అందుకే ఇంత ఆధునిక యుగంలోకి వచ్చినాసరే, ఆకాశంలోకి రయ్యిన ఎగిరి చంద్రుడితో పాటుగా పక్క గ్రహాలపైకి కూడ వెళ్ళి ఆవాసాలు ఏర్పాటుచేసుకునేందుకు కావలసిన నీటివనరులు ఉన్నాయో లేదో కనుక్కునేంతగా రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిందేమో కాని పక్కనే ఉన్న చెట్టు పై ఉన్న పూలనుండి డైరెక్ట్ గా తేనేను పిండుకొని తాగే టెక్నాలజి కనిపెట్టడం మానవులకు సాధ్యపడలేదు.
ఏపియరీస్ లో అత్యాధునిక హనీబీ / హనీ కోంబ్ మ్యానేజ్మెంట్ టెక్నిక్స్ తో అధిక తేనెరాబడి తేగలిగేవరకు మాత్రమే వెళ్ళగలిగారు..... )
అచ్చం ఇదేవిధంగా, కొన్ని వందల వేల గ్రంథాల్లోని సారస్వతాన్ని తమలోకి ఆకళింపుచేకున్న సద్గురువులు దేశకాలానుగుణంగా నుడివే సద్వక్కులద్వార మనం గ్రహించే అధ్యాత్మవస్తువిషయసామాగ్రి అనే సారస్వత మకరందం, సురుచిర అధ్యాత్మమధువుగా మారడం అనేది సదరు శిష్యుడి స్మరణ మనన నిధిధ్యాసనములు అనే కళపై ఆధారపడి, సాటిలేని భగవత్తత్వ రసామృతంగా పరిణమించి పరిఢవిల్లేది.....
లౌకిక మకరందాన్ని తియ్యని తేనేగా మార్చిన తేనెటీగను ఏమార్చి అది మరెవ్వరైనా స్వీకరించగలరేమో.....పైగా తాగిన కొద్ది తరిగిపోయేది ఈ కమ్మని లౌకిక మధువు......
కాని అధ్యాత్మమధువు అలాకాకుండా, అది సమకూర్చుకున్నవారు కరుణించి పంచితేనే ఇతరులకు అందేది......
పైగా పంచే కొద్ది పెరిగేదే కాని ఎన్నటికి తరగనిది ఈ కడుచక్కనైన అలౌకిక అధ్యాత్మమధువు.....
ఒక చెట్టుపై పెద్ద పెద్ద తేనెపట్ట్లు తేనెతో నిండుగాఉన్నప్పుడు అహా ఎంత తేనె ఉందో లోపల, కొద్ది సేపు ఈ తేనెటీగలన్నీ వెళ్ళిపోతే మొత్తం పిండుకొని తాగేయొచ్చు అని అనుకుంటాం కద...... శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణంలో హనుమ సీతమ్మ జాడను కనుక్కొని లంకనుండి ఉత్తరంగా నింగికెగసి భారతదక్షిణతీరానికి వస్తూ
" దృష్ట్వా సీతా....." అని తియ్యని కబురు తీసుకువచ్చినందుకు సుగ్రీవుడు సంతసించి తన ఉద్యానవనంలోని తేనెపట్లనుండి హాయిగా తేనె తాగి అక్కడి పళ్ళను ఆగరించి విందు చేసుకోండని చెప్పగా వానరసైన్యం బాగ తేనెతాగి మత్తెక్కి అక్కడే నిద్రపోయినట్టుగా.....
( ఇంజనీరింగ్ రోజుల్లో మెదక్ నర్సాపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి రోజూ ప్రయాణించే దారిలో గుమ్మడిదల గ్రామం దాటిన తర్వాత ఒక 20 నిమిషాలపాటు మెదక్ రిసర్వ్ ఫారెస్ట్ రేంజ్ లోని దట్టమైన అటవీప్రాతంలో ఉండే పెద్ద పెద్ద చెట్లపై అలాంటి తేనెపట్లను చూసినప్పుడల్లా నాకు
" దార్లో ఉన్న లంబాడి తండాల్లో ( కొండాపూర్ స్టాప్లో ) బస్సు కొంచెం సేపు ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతే బావుణ్ణు.....హాయిగా ఎదైనా చెట్లపై తేనెటీగలు లేని వాటిలో ఉన్న తేనెని పిండుకొని తీస్కెళ్ళొచ్చు......" అని అనుకునే వాణ్ణి.....😁 )
అలాంటి అధ్యాత్మమధువును తమలో నిక్షిప్తంచేసుకున్న ఆస్తికులైన ఎందరో పెద్దల, ధర్మప్రచారకుల, అధ్యాత్మ తత్వచింతనాపరుల, సమక్షంలో శ్రీ చాగంటి సద్గురువులకు, శ్రీశంకరభగవద్పాదుల వారి అనుగ్రహంగా అవిచ్ఛిన్న గురుపరంపరాగతంగా ప్రపంచానికి ధర్మబోధను అందించే శృంగేరి పీఠస్థిత శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆరాధకులైన జగద్గురువుల అనుగ్రహాశీర్వచనంగా జరిగిన పల్లకీ సేవలో గురుదంపతులు ఆసీనులైన పల్లకిని వహించి జన్మనుతరింపజేసుకోవడం, ఆ తదనంతరం వారికి ప్రసాదించబడిన " ధార్మికవరేణ్య " బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకృతులైన సద్గురువులను దర్శించి తరించడం జీవితంలో ఎన్నటికి తరగని అధ్యాత్మ అమృతానందరసపానభరిత మధురజ్ఞ్యాపకాల మధువును గ్రోలి ఇంటితిరిగిరావడం ఒక అవ్యక్తమైన చిరకాల పులకాంకిత మధురస్మృతి..... 😊
శ్రీగురుభ్యో నమః.....
నమో నమః....... శ్రీగురుపాదుకాభ్యాం.....🙏🙏🙏🙏🙏