కలౌవేంకటనాయకః అనే ఆర్యోక్తి ప్రకారంగా, కలియుగ ప్రత్యక్షదైవంగా అప్రాకృత శ్రీవేంకటాచలంపై, ఆగమాలకు అందని, నిగామాలకు దొరకని, శాస్త్రాలకు చిక్కని, సకలదేవతాస్వరూపంగా, సాటిలేని మహిమాన్విత శక్తిస్వరూపంగా అష్టదలపద్మపీఠంపై కొలువై, ప్రతీ శుక్రవారం ఉషోదయసమయంలో వేదసూక్తపఠనంతో హరిద్రా కుంకుమ శ్రీగంధాది సుగంధ ద్రవ్యాలతో, అభిషేక ఉత్సవాన్ని స్వీకరిస్తూ నెలకొన్న శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవ సమయం కూడా ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకు పరిఢవిల్లే అత్యంత పవిత్రమైన ఉపాసనా సమయం...
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించినవారికి గుర్తున్నట్టుగా....
చిపిలిచేష్టలచిన్నికృష్ణుడిగా, గడసరిగొల్లబాలుడిగా, సొగసరిగోపికాహృదయవల్లభుడిగా, పార్థసారధిగా, పాండవదూతగా, కురుక్షేత్రసంగ్రామద్రష్టగా,
గంభీరమైన అధ్యాత్మయోగిగా, ద్వారకాధీశుడిగా,
ద్వాపరయుగంలో పరమాత్మ నిర్వహించిన భూమికలు ఎన్నో ఉన్నా కూడా....
కన్నతల్లికన్నా మెండుగా తన కొడుకుగా ఆరాధించిన యశోదమ్మ అడిగిన మాటను కాదనకుండా మీ అభిమతమే నా అభిమతము కానిమ్మని ఈ క్రింది విధంగా వరాన్ని వర్షించిన వరిష్టవరదైవం శ్రీకృష్ణస్వామి...
"ఈ ద్వాపరయుగంలో కారణాలరీత్యా నా కళ్యాణం నీ కరకమలసంజాతరమణితో కాలేదనే నీ చింతను, రానున్న కలియుగంలో లోకకళ్యాణార్ధమై ఆకాశరాజ పుత్రికయైన పద్మావతీదేవితో జరిగే నా పరిణయోత్సవంలో తీర్చెదను....
ఆ తదుపరి నాకు ఎంతో ప్రీతిపాత్రమైన గోవింద నామం తో పట్టాభిషిక్తుడనై, శ్రీవేంకటరాయడిగా ఈ కలియుగాంతమూ శ్రీవేంకటాచలాధీశుడనై, నా కళ్యాణ సమయంలో కుబేరుని వద్ద స్వీకరించిన ద్రవ్యానికి, భక్తులు నా హుండీల్లో సమర్పించే మ్రొక్కులతో, కానుకలతో, వడ్డీని చెల్లిస్తూ,
శ్రీవేంకటేశ్వరుడిగా, భక్తులపాలిటిప్రత్యక్షవరదైవంగా, నా నిజ భక్తులు పిలిస్తే పలికే ప్రత్యక్షదైవంగా కొలువై, వకుళమాతగా వర్ధిల్లే మీకు నేను ధరించే శిరోలంకారమైన పూమాలకు వకుళమాలగా శాశ్వతగౌరవాన్ని, కీర్తిని అనుగ్రహించి, శ్రీవైకుంఠగత శ్రీరమను నా వక్షస్థల వ్యూహలక్ష్మీదేవిగా
ధరించి, శ్రీదేవిరమణుడనై సకల శ్రీలక్ష్మీతత్త్వభూషితుడనై,
షోడశకళాప్రపూర్ణుడనైన శ్రీశ్రీనివాసుడిగా కలియుగాంతమూ
శ్రీతిరుమలేశుడనై వర్ధిల్లెదను...
అస్తు....."
అని ఆనాటి యశోదమ్మకు సాటిలేని మేటి వరాన్ని అనుగ్రహించిన అమరవంద్యుడు ఆ శ్రియః పతి...!
అట్లే, తన కన్నతల్లితండ్రులైన దేవకీవసుదేవులను కూడా తన ఈ కలియుగ శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యక్షపరమాత్మ అవతారానికి ఆలంబనగా అమరే తింత్రినీవృక్షం, వల్మీకం (శేషాచాల అభయారణ్యంలో చింతచెట్టు మరియు చీమలపుట్ట గా) గా ప్రభవించే అనుగ్రహాన్ని ప్రసాదించాడు మన పరమాత్మ....
శ్రీవైకుంఠంలో ఒకానొక సందర్భంలో ఏతెంచిన భృగుమహర్షి ఆవేశంలో పాదతాడనం గావించి, శ్రీహరి హృదయసీమపై కాలుమోపి శ్రీలక్ష్మీనివాసస్థానాన్ని అవమానించినందుకు అలకతో శ్రీవైకుంఠాన్ని వీడి భోలోకంలో కొల్హాపురికి తరలివచ్చిన శ్రీలక్ష్మీదేవిని వెతుకుతూ ఆ చింతచెట్టు కింద ఉన్న చీమలపుట్టలో ఉండి తపస్సు ఆచరిస్తున్న సమయంలో,
ఏ గొల్లడైతే, "నా ఇంటి ఆవు రోజు అడవికి వచ్చి ఈ పుట్టలో పాలు పోయడం ఏంటి..."? అనే కోపంతో తన ఆవును కొట్టబోతుండగా, గోవుకు అపకారం జరగడం సహించని స్వామివారు పుట్టనుండి ఒక్కసారిగా పైకివచ్చిన సందర్భంలో..,
వేంకటేశ్వరుడిపై ఆ కర్రదెబ్బ తగిలిన కారణంగా ఆ హఠాత్పరిణామానికి నేలకూలిన ఆ గొల్లడు కైవల్యప్రాప్తి పొందడం మరియు అతడి గొల్ల సంతతివారికే ప్రతీరోజు శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రప్రథమ దర్శనం ఉండును.....
అనే వరాలను ఆ గొల్లడు పొందడం....
అనే వృత్తాతం అధ్యాత్మ విజ్ఞ్యులకు మరియు శ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత అత్యంత సాధికార మాహాత్మ్యభరిత "శ్రీవేంకటాచలమాహాత్మ్యం" గ్రంథపాఠకులకు విదితమే కద....
ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా,
ఆ ప్రప్రథమ శ్రీవేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతదర్శనం ఆ గొల్లసంతతి వారికి అనుగ్రహింపబడడం, మరియు ఆ తదుపరి ఈరోజుల్లో సుప్రభాతసేవా టికెట్ హోల్దర్స్ కు అనుగ్రహింపబడడం...
ఈ కలియుగ లోకానికి అందిన ఆ శ్రీహరి యొక్క నిర్హేతుక కారుణ్యకటాక్షవైభవం...!
ఆనాడు ద్వారపరయుగంలో శ్రీకృష్ణావతారంలో కొందరు విజ్ఞ్యులకు అనుగ్రహించిన తన విశ్వరూపసందర్శనాభాగ్యం,
ఈనాడు ఆ పరమాత్మ ఇక్కాలపు కలియుగ భక్తులకు, యోగులకు, లభ్యమయ్యేలా ఎక్కడెక్కడ నిక్షిప్తంగావించాడో తెలుసా...?
పైకి ఒక సాధారణ త్రితలవిమానగోపురం లా భాసించే ఆ ఆనందనిలయగోపురవైశ్వికదైవికవిమానశక్తివలయానికి నాలుగూవైపులా కాపలాగా నెలకొన్న సిమ్హాలను ధ్యానించి తెలుసుకోండి....
ఒక శ్రేయస్కర కావ్యరచనాపరిధిని దాటి దైవికాంశాలను నుడవరాదు కాబట్టి ఆ విశ్వరూపదర్శనవిశేషాలకు ఇక్కడితో స్వస్తి చెప్పి, మన యాక్ట్చువల్ టాపిక్ కి వద్దాం...
శ్రీహయగ్రీవాగస్త్యసంవాదమైన శ్రీలలితాసహస్రనామావళిలో
"గోప్త్రీ గోవిందరూపిణి", "వైష్ణవి విష్ణురూపిణి"
అని వాగ్దేవతలు కీర్తించిన ఆదిపరాశక్తిని....
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1
"సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు...
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు..."
అని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎంతో ఘనమైన రీతిలో శ్రీవేంకటాచలస్థితశక్తిస్వరూపాన్ని కీర్తించారు....
నేను మరియు నా మితృలు కొందరు కలిసి తిరుమల తీర్థయాత్రకు వెళ్ళామని అనుకోండి....
నేను పాదయాత్రగా భూమిపై నడుచుకుంటూ వెళ్ళినా...
నా మితృడొకరు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా...
నా మితృడింకొకరు ఇతర వాహనాలు నడుపుతూ వెళ్ళినా..
నా మితృడింకొకరు రైలుబండిలో వెళ్ళినా...
నా మితృడింకొకరు విమానంలో వెళ్ళినా...
మా అందరిగమ్యమూ కూడా తిరుమలేశుడి దర్శనభాగ్యానుగ్రహాన్ని అందుకొని తరించడమే....
దేశకాలాదికారణాలరీత్యా మా ప్రయాణ మార్గాలు, దార్లు, మాధ్యమాలు, సాధనాసరంజామాదిసంపత్తి వేరైనా,
మా ఎల్లరి గమ్యమూ గోవింద పరమాత్మే....!
అవ్విధముగా,
ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం | సర్వదేవనమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి ||
ఆకాశం నుండి పడే నీరంతా సముద్రంలోకి వెళ్ళినట్లే, అన్ని దేవతలకు చేసే నమస్కారాలు శ్రీహరి (శ్రీకృష్ణుడు) కి చెందుతాయి.
అని శాస్త్ర ఉవాచ...
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి"
అంటే "సత్యం ఒక్కటే, కానీ వివేకవంతులు / జ్ఞానులు దానిని అనేక రకాలుగా చెబుతారు" అని అర్థం. ఇది వేదంలోని ఒక ప్రసిద్ధ మంత్రం, దీని అర్థం వివిధ దేవతలను లేదా సృష్టిని ఏకీకృత సార్వత్రిక సత్యానికి సూచించే రూపాలుగా చూడవచ్చని...అధ్యాత్మ తత్త్వ ఉవాచ....
ఈ ఆశ్వయుజ నవరాత్రి ఉత్సవాలు భక్తుల జీవితల్లో నవనవోత్సాహభరిత వివేకవిజ్ఞ్యానసిరులను కలిగించాలని అకాంక్షిస్తూ....
ఎల్లరికీ 2025 ఆశ్వయుజ నవరాత్రి ఉత్సవ / పర్వసమయ శుభాభినందనలు...💐😊
యా దేవి సర్వ-భూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
అన్ని జీవులలో విష్ణుమాయ రూపంలో శబ్దశక్తిగా కొలువైఉండే ఆ దేవికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు....💐🙏