Thursday, June 27, 2019

శ్రీ ఉడుపి శ్రీకృష్ణ మరియు శ్రీ కుక్కి / కుక్షి / కుక్కె సుబ్రహ్మణ్య స్వామి వారి వైభవం....! :)

శ్రీ ఉడుపి శ్రీకృష్ణ మరియు శ్రీ కుక్కి / కుక్షి / కుక్కె సుబ్రహ్మణ్య స్వామి వారి వైభవం....! 
2014 నవంబర్ లో, అప్పుడు జీవితంలో ఎదురీదుతున్న కష్టాల పరిహారానికి విజ్ఞ్యులైన కొందరు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు యావద్ భారత దేశంలో సుబ్రహ్మణ్య స్వామివారికి గల ఎన్నో విశిస్టమైన క్షేత్రాల్లో ఒకటిగా, అత్యంత సంప్రదాయబద్దంగా ఆరాధనలు గావించబడే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం లో ఆర్జితసేవలుగా భక్తులకు ఆలయంవారు 2 రోజులు పాటు జరిపించే సర్పసంస్కార / నాగప్రతిష్ఠ పూజాదికాలు చేయించడానికి, ఎం.జి.బి.యస్ నుండి మంగళూరు కు వెళ్ళే కర్ణాటక అర్.టి.సి బస్ ఎక్కి, " శిరిడి, కాశి తర్వాత రాష్ట్రాన్ని దాటివెళ్ళే మరో తీర్థయాత్ర....కర్ణాటక కొత్త ప్రదేశం...కన్నడ కొంచెం చదవడం వచ్చు కాని...మాట్లాడడం రాదు....అక్కడి పరిసరాలు, భోజనాలు, మొదలైనవన్ని ఎలా ఉంటాయో ఏమో...", అని ఆలోచిస్తు....పొద్దున ఉడిపి లో దిగి అక్కడ శ్రీకృష్ణ స్వామి దర్శనం చేసుకొని, ఆ తర్వాత సాయంత్రం కల్లా కుక్కే కి వెళ్దామని అనుకొని....అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నాను......
ఎక్కడెక్కడో దూరతీరాలకు వెళ్ళి ఎంతో ప్రయాసపడి దైవాన్ని సేవించడం ఎంటో అని నిట్టూర్చే నవయుగపు ఆధునిక సోకాల్డ్
' హేతువాదులు ' ఒకవైపు....,
మరియు ఫలాన క్షేత్రం / ఆలయం, ఫలాన అనుగ్రహానికి అనాదిగా చాల ప్రశస్తమైనది అని వీలైన మంచి సలహా ఇచ్చి ప్రోత్సహించే మంచి మనసు గల సద్గురువులు / పెద్దలు / భక్త భాగవతులు మరోవైపు...
ఎవరి మాటను పక్కనపెట్టి, ఎవరి మాట విని, మన జీవితాన్ని మనకు మనమే దైవానుగ్రహంతో ఉద్ధరించుకుంటామా.. అన్నది మన స్వనిర్మిత తర్క/విచక్షణా జ్ఞ్యానానికి ఎంతగా సంబంధించినదో, మనకు సమకూరే గురువాక్కుల అనుగ్రహానికి / దైవానుగ్రహానికి అంతగా సంబంధించిన విషయం కూడా....
ఎందుకంటే తత్ క్షేత్రాధిష్టాన దైవం యొక్క అనుగ్రహంలేనిదే అసలు ఆ క్షేత్రం గురించి మనకు తెలియడం కుదరదు కాబట్టి....
ఇంకా సరిగ్గా చెప్పలంటే అనుగ్రహపాత్రతకు మన ప్రమేయం కన్నా, ఆ దైవం యొక్క ప్రమేయమే అధికమై ఉంటుందని నమ్ముతాను నేను వ్యక్తిగతంగా...
ఎందుకంటే ఇది కలియుగం....దైవస్పర్శలేకుండ సాగే కేవల మానవ ప్రయత్నం అనేది కీకారణ్యంలో కూతవంటిది...దానికి ప్రతిస్పందన, ప్రతిఫలం ఆశించడం ఎండమావిలో ఈతకొట్టాలనుకోవడం లాంటిది....
( ఇక ఈ కలియుగ మనుష్యుల విపరీత మనోకల్మషాన్ని నిర్మూలించడం కేవలం ఆ కలియుగ దైవమైన శ్రీనివాసునికే చెల్లు....ఎందుకంటే భగవంతుడు ( మరియు తన ప్రతినిధులైన సద్గురువులు / ఆచార్యులు / భక్తభాగవతులు ) వినా నిష్కల్మషంగా మన మంచిని కోరుకునే వారుండడం కడు దుర్లభం కాబట్టి..... )
ఒక 15 గంటల సుదీర్ఘప్రయాణం తరువాత బస్ డ్రైవర్ ఉడుపి...ఉడుపి... అనడంతో పొద్దున 9.30 సమయానికి బస్ దిగి, ఒక ఆటోలో గుడివరకు వెళ్తున్న నాకు అక్కడే లోకలైట్ ఐన ఒక కాలెజ్ స్టుడెంట్ కూడా గుడికే వెళ్తున్నాడని తెలిసి, ఇంగ్లిష్ లో హాయ్ హలో అని మాటలు కలపడంతో, "నేను కూడా తెలుగు వాడినే...మాది కూడా హైదరబాదే....ఇక్కడ దెగ్గర్లొ ఉన్న కాలేజ్లో చదువుకుంటున్నాను....ఒక్కడివే వచ్చినట్టున్నవ్....ఇక్కడ రూంస్ అన్ని ఫుల్ అయ్యుంటాయి..కాబట్టి గుడి ఎంట్రన్స్ దెగ్గరే పేడ్ లాకర్ లో లగేజ్ పెట్టేసి, పక్కనే ఉండే పబ్లిక్ వాష్రూంస్ లో 10 రుపీస్ కి బాత్ ఫేసిలిటి ఉంటుంది...ఫ్రెషప్ అయ్యి, వెళ్ళి దర్శనం చేసుకొని, మధ్యాహ్నం భోజనం ప్రసాదం పెడతారు...తప్పకుండా వెళ్ళి తీస్కో....ఇక్కడి పంచకజ్జాయం ప్రసాదం కొనుక్కొని ఇంటికి తీస్కెళ్ళు....." అని టక టక మని నా షెడ్యూల్ మొత్తం తనే చెప్పేస్తుంటే, ఇతనెవరో టయింకి ఆటోలో బాగనే దొరికాడు అయాచిత గైడ్ గా అనుకొని, అతని మధ్వసంప్రదాయపు శ్రీగంధ తిరునామ భరిత ముఖమండలాన్ని ఆశ్చర్యంగా చూస్తు..." చాల థాంక్స్ బడ్డి, ఫర్ యువర్ గైడన్స్ & హెల్ప్...." అని చెప్పగా....అతను,
"నాకు కొంచెం పని ఉంది ఇక్కడే దిగిపోతా, ఆటో అతను టెంపుల్ ఎంట్రన్స్ వరకు డ్రాప్ చేస్తాడు....దర్శనమయ్యాక అక్కడే ఉండే ' ముఖ్యప్రాణదేవర ను ' కూడా మర్చిపోకుండా దర్శించి వెళ్ళు....హ్యాపి జర్ని..గుడ్బాయ్....." అని దిగి వెళ్ళిపోయాడు....
ఓకే ఓకే... అంటు అప్పటికి తలఊపి ముందుకు వెళ్ళిననాకు, ఆతర్వాత ఆలోచిస్తే అసలు ముఖ్యప్రాణ దేవరు అంటే ఎవరు.....ఈ పేరు లైఫ్ లో ఇంతవరకు అసల్ వినలేదే... ఏదో చెప్పబోయి ఇంకేదోచెప్పాడా లేక నేనే సరిగ్గా వినలేదా....అనుకుంటూ....
మొత్తానికి గుడిఎదురుగా దిగి, తను చెప్పినట్టే అన్ని ఫటాఫట్ కానిచ్చి, గుడిలోకి వెళ్ళగా, అక్కడ ఉన్న దర్శన శైలికి, అంటే కనకదాసుని అనుగ్రహించడానికి సాక్షాత్ స్వామివారే వెనక్కి తిరిగి దర్శనం ప్రసాదించిన ' నవగ్రహ కిండి ' ( నవగ్రహ కిటికి ) నుండే ఈనాటికి కూడా స్వామి వారు అందరికి దర్శనం ఇవ్వడాన్ని ఆశ్చర్యంతో చూసి, పెద్దగా భక్తుల రద్దీ లేదు కాబట్టి, మళ్ళి మళ్ళి లైన్లో వెళ్ళి ఒక 5 సార్లు దర్శనం చేసుకున్నాను శ్రీకృష్ణస్వామి వారి ఆ దివ్యమంగళమూర్తిని జీవితంలో మొట్టమొదటిసారి... 
ఆ ఆటో ఫ్రెండ్ చెప్పిన పంచకజ్జాయ ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని ఆబగా అటు ఇటు చూస్తు కొంచెం ముందుకు వెళ్ళగా, అతను చెప్పిన
" ముఖ్యప్రాణదేవరు " అనే పేరు తో ఉన్న హనుమంతుని మూర్తి దర్శనమివ్వగా, అక్కడ నిలుచున్న నాలో ఏదో తెలియని వింత అనుభూతితో, అది జీవితంలో మొట్టమొదటి సారి అయినా, ఎన్నో సార్లు అక్కడే నిల్చొని ఆ మూర్తిని దర్శించినట్టుగా అనిపించి కాసెపు అక్కడే ఉండి హనుమాన్ చాలిసా చదివి, దెగ్గర్లోనే ప్రసాదం కౌంటర్ లో పంచకజ్జాయం కొనుక్కొని అన్నప్రసాదం హాల్లోకి లైన్లో నిల్చున్న వారితో నేనూ జాయిన్ అయ్యాను...
కొద్దిసేపు అయ్యాక అందరిని లోనికి అనుమంతించడం తో వెళ్ళి పంక్తిలో కూర్చోగా, అక్కడున్న వలంటీర్లు / సహాయక స్టాఫ్ వచ్చి, ఎవరికైన ప్లేట్లు కావాలంటే తీస్కొవచ్చు అనే అర్ధం స్ఫురించేలా చెప్తూఉండడంతో కొందరు మాత్రమే అవి తీసుకొవడం మిగతవారు తముకూర్చున్న చోటే ఎదురుగా ఉన్న స్థలాన్ని నీటిని చల్లి శుభ్రపరిచి ఆ బండనే భోజన ప్లేట్ / విస్తరిగా భావించి వడ్డన కోసం ఎదురుచూస్తున్న వారిని అత్యంత వింతగా చూస్తు, "ఎన్నెన్నో ఆలయాల్లో అన్నప్రసాదం స్వీకరించాను... కాని ఇలా నేలపైనే వడ్డించే పద్దతి అసల్ ఎక్కడా చూడనే లేదే...ఇదేంటో చాలా విడ్డూరంగా ఉంది...అనుకుంటూ విస్మయంగా అలా కాసేపు అందరిని చూడగా.....,
కాసులపేరు, కడియాలు, వంకీలు, ఇత్యాది భారీస్వర్ణాభరణాలు ధరించి భూరి సంపదలతో తులతూగే, పట్టు పీతాంబరాలు, మడివస్త్రాలు, ఇత్యాది ధవళ వస్త్రాలతో ఉన్న గొప్ప సంపన్నులైన సంప్రదాయికులనుండి, సామాన్య భక్త జనం వరకు, చాల మంది అలా నేలపైనే భోజనం చేయడాన్ని విడ్డూరంగా చూస్తు, నేను తీస్కున్న పేట్లో వడ్డించబడిన ప్రసాదాన్ని, "భోజన కాల సమయే గోవింద నామ స్మరణే...గొవిందా..గోవిందా... అహం వైశ్వానరో భూత్వా...." అని యథావిథిగా ప్రార్ధించి ఆ అమృతతుల్యమైన ప్రసాదాన్ని బాగా ఆరగించాను....సాంబార్లో వడ్డించబడిన కమ్మనైన గుమ్మడిపండు ముక్కలను తినడం అదే మొట్టమొదటిసారి...! 
నాకు అప్పుడు ఒక్కసారిగా మనం చిన్నప్పుడు తెలుగు లెసన్స్ లో చదువుకున్న శ్రీకృష్ణుడు / గోపాలురు చల్దులారగించే ఈ క్రింది పద్యం మరియు
అస్మద్ గురుదేవులు, సద్గురు శ్రీచాగంటి వారి శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గత శ్రీకృష్ణలీలల్లో గోపబాలురతో కూడి కన్నయ్య చద్దన్నమారగించే ఘట్టం గుర్తుకువచ్చి స్వామికి, స్వామి వారి సౌలభ్యానికి, భక్తవాత్సల్యతతికి నమస్కరించి పరవశించాను....
***********************************************************
10.1-495-మ.
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!
***********************************************************
( ఆవులను మేపడానికి, కన్నయ్య గోపబాలురతో అడవికి వెళ్ళి, అక్కడ దొరికే అడవిపూలు సిగలో తురుముకొని, తన బూరను కటివస్త్రంలో దోపుకొని, తను మధ్యలో కూర్చొని చుట్టు ఉన్న గోపబాలురతో అక్కడున్న ఆకులు, బండలపైనే చల్దులారగించే ఘట్టాన్ని అస్మద్ గురుదేవుల వర్ణణలో వినడం నిజంగా వర్ణణాతీతమైన యోగమే....! 
చిన్నప్పుడు నా స్కూల్ సమ్మర్ హాలిడేస్ లో ఉప్పల్ గ్రామంలో ( కాజీపేట్ జం: దెగ్గర ) ఉండే మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, తాతా : నానమ్మ వాళ్ళింట్లోని నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడైన, ఎంతో అమాయకుడైన, చంద్రంబాబాయ్ రోజూ గొడ్లను మేపడానికి పొద్దున్నే అడవికి వెళ్ళి సాయంత్రానికి రావడం దైనందిన విధిగా ఉన్న ఆ రోజుల్లో, ఒకరోజు నేను కూడా బర్రెపై కూర్చొని...హై హై...చల్ చల్...అనుకుంటూ వెళ్ళాను కొంతదూరం వరకు.....
ఆ ఆవులు, ఎడ్లు, బర్రెలు, దున్నపోతులు, దార్లో కనిపించిన పచ్చికబయళ్ళను తింటూ, ఊరంతా అలికినట్టు పెండవేసుకుంటూ పోవడం, ఆ ఆకుపచ్చని ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో విహరించడం, వాళ్ళ పొలాల దెగ్గర ఉండే జమీందార్ల మామిడి తోటల్లో దూరి కాయలు కోసుకొవడం, పొలాల మడికట్లపై ఉండే ఈతచెట్ల కింద కర్చీఫ్ వేసి, ఒక కర్ర అందుకొని, ఆకుపచ్చని వాటిని వదిలేసి, నారింజ వర్ణం నుండి ముదురు గోధుమ / చాక్లేట్ కలర్ లోకి వచ్చిన పండ్లను మాత్రమే రాల్చి, అన్నిటిని ఏరుకొని జేబుల్లో ఫుల్లుగా నింపుకొని, ఒక్కొక్కటి తినుకుంటు వెళ్ళడం, 1 రుపాయికి పెద్ద గ్లాస్ నిండా రైల్వే స్టేషన్ దెగ్గర అమ్మే ఎంతో తియ్యని నల్ల ఈతకాయలను కొనుక్కొని, షర్ట్ జోబ్లో వేస్కోవడం, అలా నా చిన్ననాటి మధురస్మృతులతో, అస్మద్ గురుదేవుల భాగవత శ్రీకృష్ణలీలలు విన్నప్పుడు, కన్నయ్య చుట్టూ ఊరంతా తిరిగే ఆ తుంటరి గోపబాలుర బృందంలో నేను కూడా ఒకడిగా ఫీల్ అయ్యి ఆనందించడం పరిపాటి.... )
కాసేపు అలా ఆలయ పరిసరాలను, బయట ఉన్న ఇతర పరిసర ఆలయాలాను చూసి, రాత్రి అయ్యేసరికి కుక్కే చేరుకోవాలి కాబట్టి, ఉడిపి బస్టాండ్కి వెళ్ళి విచారించి, ధర్మస్థల మంజునాథ ఆలయం కూడా అదే మార్గంలో కవర్ చేస్కొని వెళ్ళొచ్చని తెలిసి, అక్కడికి బయల్దేరాను....
ధర్మస్థల మంజునాథ ఆలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. ఆలయం సాయంత్రం 4.30 ఆ సమయానికి తెరుస్తారు, దర్శనానికి కూడా 1 గంటపైనె టయింపడుతుందని అక్కడివారు చెప్పడంతో, కుక్కే కి బస్సులు కూడా తక్కువ అని చెప్పడంతో, నిరతాన్నదానక్షేత్రమైన ధర్మస్థలకి వచ్చి కూడా నీ అన్నప్రసాదాన్ని స్వీకరించే భాగ్యం లభించలేదు కదా స్వామి...హయ్యొ....ఎప్పటికో నాకు ఆ భాగ్యం అని తలచి, స్వామికి ఆలయం వెలుపలినుండే నమస్కరించి, బస్టాండ్ లో ఫుల్లై ఉన్న ఒకే ఒక కుక్కే బస్లో లాస్ట్ రోలో ఉన్న ఖాలి సీట్లో కూర్చొని ముందుకు వెళ్ళాను....
ఆ సాయంత్రం సమయంలో దక్షిణ కర్ణాటాక కీకారణ్యపు దారుల్లో వెళ్తూ, అక్కడున్న అటవీసౌందర్యాన్ని కిటికీలోనుండి ఆశ్చర్యంతో వీక్షిస్తూ, ఆకాశాన్ని తాకేలా ఉన్న పెద్ద పెద్ద చెట్లు మరియు వాటిని అల్లుకున్న వివిధ తీగలు, తమాల వృక్షాల (తాంబూలంలో తమలపాకుతో పాటు మనం వాడే వక్కలు) తోటలు, ఇత్యాదులను చూస్తూ చూస్తు మొత్తానికి నా గమ్యస్థలమైన కుక్కే సుబ్రహ్మణ్యాలయానికి రాత్రి 8 అయ్యేసరికి చేరుకున్నాను...
కుమారధారా నదికి దెగ్గరగా ఉండే ఒక హోటెల్ లో విశ్రమించి, మరునాటి నా పూజాదికాల గురించి ఆలోచిస్తూ, కొనుక్కున్న ఏవో స్నాక్స్ బాగ్లో ఉంటే అవే తినేసి అలా కొంచెం రెస్ట్ తీసుకోగా, ప్రయాణబడలిక తో ఉన్న శరీరం కదా అలా వెంటనే నిద్రలోకి జారుకుంది...
బాగా నిద్రపోయిన నాకు పొద్దున్నే ఆ ఆడవిలోని పక్షులకలకూజితములతో మెలకువ రాగా, లేచి కాలకృత్యాలను ముగించి, సుర్యనమస్కారం చేసి జస్ట్
వాకబుల్ డిస్టన్స్ లోనే దెగ్గర్లోని కుమారధారా నదిలో పుణ్యస్నానానికై వెళ్ళగా, యాత్రీకులందరు అందరు అక్కడ ఉన్న షాప్లో పెలాలు / మురమురాల ప్యాకెట్లు కొని, నదిలో గుంపులు గుంపులు గా ఉన్న చేపలకు ఆహారం గా వేయడం చూసి, ఇక్కడి తీర్థంలో ఇది స్థానికాచారమేమో అనుకొని నేను కూడా
ఒక ప్యాకెట్కొని వాటికి వేసి ఆనందించాను....సాధారణంగా మనుష్యులు దెగ్గరికి రాగానే ఒడ్డున ఊగిస లాడుతున్న మంద్రమైన జలప్రవాహంలోని చేపలు చటుక్కుమని చిటికెలో దొరక్కుండ నీటిలోకి జారుకుంటాయి....కాని ఇక్కడి చేపలు మాత్రం, " పేలాలు / మరమరాలు వేయడానికి ఇంకా ఆలస్యం ఎందుకు మీకు....రండి....అన్నీ ఒకేసారి నీటిలో కుమ్మరించండి....వాటి పట్టు పడతాం....మా ఆకలికి షాప్లో ఉన్న అన్ని తినుబండారాలు అయిపోవాల్సిందే...." అంటున్నట్టుగా నీటిలో మనం కాలుపెట్టి నదిలోకి దిగడమే ఆలస్యం....మనపైకి తుళ్ళిపడుతు ఎగురుతుంటాయి...... నిజంగా అవి మాత్రం బాగా గడుసు మీనపంక్తులే..... శక్త్యాయుధధారియై కుమారస్వామి ఉండగా మాకేంటిలే అనుకుంటాయో ఏమో...అసలు మనుష్యులంటే కించిత్ కూడా భయం లేకుండా సంచరిస్తుంటాయి అవి....!"
అక్కడే ఉన్న మన్ను ని కొంచెం తీస్కొని, అస్మద్ గురుదేవుల ప్రవచనాంతర్గత అనుగ్రహమైన
"పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి....మృత్తికాంతేమయాదత్తమహారార్థం ప్రకల్పయా...." అనే శ్లోకాన్ని,
యథావిధిగా అనుసంధించి, చేయబోయే తీర్థస్నాన ఫలితమైన పుణ్యం, దధీచి మహర్షి కుమారుడైన పిప్పలాదుడి తపశ్శక్తితో సృష్టించబడిన కృత్య తినేయకుండా, మృత్కలికను సమర్పించి, గురోక్తమైన సంకల్పపూర్వకంగా తీర్థస్నానమాచరించి ముమ్మారు " కపర్థీ " నామస్మరణగావించి, పొడి పంచె కట్టు పై ఉత్తరీయం వేస్కొని సశాస్త్రీయ ఆర్జితపూజాదికాలకు విధిగా గెటప్ మార్చి, ఆలయానికి బయలుదేరాను....
దార్లో హనుమంతుని ఆలయం, అతిపురాతనమైన ఒక అమ్మవారి ఆలయం, భారి సైజులో ఉన్న ఒక పెద్ద గణపతి ఆలయం, ఇలా అందరికి నమస్కరించి, కుక్కే ఆలయానికి చేరుకున్నాను.... కుమార స్వామి దయ వల్ల సతీష్ అనే ఒక తెలుగు తెలిసిన వ్యక్తి కూడా అదే పూజ కోసం రావడం, నా పక్కనే కూర్చోవడం, కన్నడ బాగా వచ్చిన అతని పరిచయం తో, అర్చకులు చెప్పే పూజకు సంబంధించిన విషయాల గురించి సరైన అవగాహన కల్పించుకొని, యథావిధిగా అక్కడున్న అందరితో పాటుగా నా ఆర్జిత పూజాదికాలు ముగించుకొని, ఎంతో సహృదయులైన అక్కడి అర్చకులకు దక్షిణతాంబూలములను సమర్పించుకొని వారి ఆశీస్సులు స్వీకరించి ఆలయ దర్శనానికి వెళ్తుండగా,
హైదరాబాదుకు చెందిన, తెలుగు తెలిసిన ఒక బెంగళూరు వాసి అక్కడ తారసపడి,
"చిన్నా, ఫస్ట్ పక్కనే ఉన్న ఆది సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించిన తర్వాతే కుక్కే సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించడం ఇక్కడి క్షేత్రసంప్రదాయం....కాబట్టి
అటు వెళ్డాం పద అంటూ, వారు కూడా నాకు తోడుగా వచ్చారు....తెలుగు వారే కదా అని మాట మాట కలిపి, కుశలప్రశ్నలు వేసి అక్కడి కుమారస్వామి వైభవం గురించి వారు చాలా బాగ వివరించడం చూసి, స్వతహా గా సశాస్త్రీయ శిఖ ధారి గా ఉన్న సద్బ్రాహ్మణులైన వారికి భారతీయ సనాతన / వైదిక సంప్రదాయాలపై గట్టి పట్టుండడం గమనించి, వీరు ఎవరో బానేతోడైయ్యారు యాత్రకి అనుకొని, నేను కూడా మాటా మాటా కలిపి ఏవో మాట్లాడుకుంటూ అలా దర్శనానికి వెళ్ళాం... తను వృత్తిపరంగా లా ఫీల్డ్ లొ ఉన్న ఒక ప్రొఫెషనల్ అని, ప్రవృత్తి పరంగా సనాతన ధర్మచింతన / తీర్థయాత్రలు చెస్తుంటానని చెప్పుకు వచ్చారు.....
ఆదిసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఉన్న పెద్ద పుట్టకి ప్రదక్షిణ / నమస్కారాలు గావించి, పక్కనే ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్తుండగా, అక్కడే ప్రవహించే దర్పణతీర్థం దెగ్గర భక్తజనమంతా గుమిగూడి ఉండడంతో మేముకూడా అక్కడికి వెళ్ళిచూడగా, ఆరు ఫీట్లకుపైగా ఉన్న ఒక పెద్ద నాగుపాము అక్కడ ఉన్న అందరినీ చూస్తు కూడా నిశ్చలంగా ఉండడం చూసి, సాక్షాత్ కుమారస్వామే
ఇలా నాగురూపంలో ఇక్కడ అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంటాడు అని అక్కడి భక్తులందరు చెప్పగా నేను కూడా కొంచెం దూరం నుంచే చూసి నమస్కరించి ప్రార్ధించాను.....
అంత పెద్ద నాగును స్వచ్చమైన నీటిప్రవాహంలోకూడా స్థిరంగా అలాఉండడం చూడడం అదే జీవితంలో మొట్టమొదటి సారి....!
మరికొందరేమో, ' ఇక్కడ ప్రతి అడుగుకి ఒక పుట్ట ఉండి, ఎన్నో పాములు అలా వస్తూపోతూ ఉంటాయి....ఇదంతా ఇక్కడ మామూలే...ఇక అందరు పదండి ముందుకు అన్నట్టుగా చెప్పడం తో, మేము కూడా కుక్కే ఆలయం దిశగా ముందుకు కదిలాము...'. ఎవరి భక్తి భావనకు తగ్గట్టుగా భగవంతుడు వారిని అనుగ్రహిస్తాడు అని గట్టిగా నమ్మే నాకు మాత్రం అది సాక్షాత్తు ఆదిసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని వల్మీకమునుండి బయల్వడిన సుబ్రహ్మణ్యస్వామే..!!
'ఒకనాడు అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనంలో చెప్పగా విని మోపిదేవి క్షేత్రానికి స్వామి దర్శనంకోసం వెళ్ళిన నాకు, అక్కడ కనిపించని స్వామి నా ప్రార్ధనలు విని ఇన్నాళ్ళకు ఇక్కడ దర్శనమిచ్చాడు కదా...' అనుకొని "హేస్వామినాథ కరుణాకర దీనబంధో.... " అంటూ మనసారా ఆ కుమారస్వామికి నమస్కరించాను... 
అలా లైన్లో ముందుకు సాగి ఇతర సాటిభక్తులతో కలిసి, గర్భాలయంలో నేతిదీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ షణ్ముఖుణ్ణి దర్షించి తరించడం జీవితంలో ఒక మరవలేని మధురానుభూతి..... 
గర్భాలయంలో నల్లనితిరుమేనితో నిగనిగలాడుతున్న ఆ కుమార స్వామిని, అట్లే వెలిగిపోతూ తారసపడిన ఆనాటి కృష్ణసర్పాన్ని చూసి, నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు మా నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించిన ఒక నాగుపాము గుర్తుకువచ్చింది....
( పైన చెప్పిన ఉప్పల్ గ్రామంలోని మా పిన్ని వాళ్ళింటికి సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళినప్పుడు, కొంచెం దూరంలోనే ఉండే, అంటే 5 రుపాయలు టికెట్ తీస్కొని నెక్స్ట్ రైల్వే స్టాప్ లో దిగితే వచ్చే
' జమ్మికుంట ', మా తాత - నానమ్మ వాళ్ళ ఊరికి కూడా అప్పుడప్పుడు వెళ్ళెవాడిని....
స్కూల్ మాస్టారు అయిన పెద్ద కొడుకు మినహ, మిగతా 5గురు కొడుకులందరూ కూడా ఉద్యోగార్ధమై హైదరాబాదులో స్థిరపడగా, తాత నానమ్మ మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు....
అర్.ఎం.పి వైద్యుడైన తాత కీ.శే శ్రీ అయిత హనుమయ్య, వృద్ధాప్యం / అనారోగ్య రీత్య ఇంట్లోనే ఉండే నానమ్మ
కీ.శే శ్రీమతి నగునూరి నాగమ్మ, ఒక చిన్న రెండు రూముల ఇల్లు, ఇంటి ముందు ఉండే పెద్ద వేప చెట్టు, పెరట్లో లోతైన బావి, ఆ ఇంటి వెనకాలే స్కూల్ మాస్టారు అయిన వాళ్ళ పెద్దబ్బాయి,
(ఆనందం పెదనాన్న) వాళ్ళ ఇల్లు ఉండేది.....
సరస్వతి శిశుమందిర్ కి ఏటు వెళ్ళాలి అని అడుగుతూ, ట్రైన్ దిగి నేను ఒక 15 నిమిషాలు నడవగా నానమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేది....
ఇంట్లోకి వెళ్ళగానే,
" ఎవరు....ఇన్నిగా నువ్వారా....బాగున్నవ మన్మడా....బాపు బాగుండా...కొలువుకు పోతుండా....అమ్మా తమ్ముడు బాగున్ర.....ఏం సదువుతానవ్ ఇప్పుడు....." అంటూ అప్యాయంగా పలకరించే నానమ్మ ను చూసి ఆనందించాలో, లేక అనారోగ్య రీత్య నేలకే పరిమితమైన నానమ్మను చూసి బాధపడాలో తెలియని సందర్భం అది.....
ఎంతైనా పాతకాలం మనుషులు కదా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఉన్నదాంట్లో తిని సంతోషంగా బ్రతికి, గట్టిగా ఉండడం అలవాటైన మనుషులు...
" ఎందుకు నానమ్మ నువ్వు ఎప్పుడు ఇట్ల కిందనే ఉంటవు...పైకి లేచి నడవవా...?" అనే తెలిసి తెలియని నా ప్రశ్నలకు చిన్న నవ్వుతో,
" మీ తాత రోజుకు 2 సూది మందులు ఏవో ఇస్తనే ఉన్నడు....గడక తిన్నంక ఏవేవో గోలీలు మింగుతనే ఉన్న.....నువ్వు వచ్చే యేడు మళ్ళి వస్తవ్ కద అప్పటికి నడుస్తన్లే...." అని చెప్పేది.....
ఆ పరిస్థితుల్లో కూడా అంత దిటవుగా సమాధానం ఇచ్చే నానమ్మని చూసి, ఎంత నిబ్బరమో కదా ఈ పాతకలం పెద్దవాళ్ళకి....అని అనుకునేవాణ్ణి....
స్వరంలో ఎంత రాజసమో, ఆహార్యంలో కూడా నానమ్మ అంతే రాజసం తో ఉండేది.... పెద్ద రూపాయి బిళ్ళంత నుదుటి బొట్టు, పాతకాలం పెద్దలు ఆచరించే శాస్త్రీయ సంప్రదాయపు గోచీ చీర కట్టు, చేతినిండా మట్టిగాజులు, ఒక చేతికి అయస్కాంతపు బి.పి కంట్రోలింగ్ బ్రేస్లెట్ తో ఉండి, బ్రతుకుదెరువుకై కొన్నాళ్ళు బొంబాయిలో ఉండివచ్చినందుకు, అచ్చం అక్కడి మరాఠ మహిళామణులు ఉన్నట్టుగానే ఉండేది నానమ్మ సనాతన అహార్య శైలి కూడా...!
ఇంట్లో తినడానికి ఏం ఉన్నై నానమ్మ అని నేను అడిగితే, " అన్నీ మీ తాతకే తెల్సుర నాకెం తెల్వద్..... పక్కన భాగ్యక్క వాళ్ళ ఇంటిపొంటి పెద్ద అల్లనేరేడు చెట్టు ఉంటది.....పొయ్యి ఒక పదిగల పండ్లు దుల్ప్కరాపో తిందాం...." అని చెప్పగా సరే అని...వెళ్ళి చెట్టుకు కాసిన పండ్లన్నీ కోస్కొని, అక్కడే కొన్ని తిని, ఇంకొన్ని జేబ్లో వేస్కొని, " ఇగొ నానమ్మ 10 పండ్లు తీస్కొ అని....కొన్ని మాత్రమే ఇవ్వగా, మెల్లగ అవి తిని, నవ్వుతూ " ఆ జేబ్లో దాస్కున్నవన్ని పట్నం పట్కపోతున్నవారా...మీకాడ దొరకవా ఏంది..." అని నవ్విన ఆ స్వచ్చమైన నానమ్మ నవ్వు నా స్మృతిపథంలో ఎప్పటికీ పదిలమే...!!
మా నానమ్మ వాళ్ళ ఇంటి చుట్టు పక్కనే ఉండే, దెగ్గరి బంధువులందరి ఇళ్ళకు ఒక రౌండ్ వేసి వచ్చేవాడిని.... వెనక గల్లిలో ఉండే ఆనందం పెద్దనాన్న,
వాళ్ళింటి ముందుండే జ్యోతక్క వాళ్ళు, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉండే రాజబాబు మామ, నానమ్మ ఇంటిముందు ఉండే రాజయ్య పెద్దనాన్న, వాళ్ళింటివెనకాల ఉండే రంగయ్య పెదనాన్న / హరి అన్న, ఇలా అందరి ఇళ్ళు కవర్ చేస్కొని వచ్చేవాడిని.... 
మా నానమ్మ చెప్పిన ఆ అల్లనేరేడు చెట్టు దెగ్గరే, ఇందాక పైన చెప్పిన కుక్కే లో దర్శించిన కృష్ణసర్పం లాంటి సర్పాన్ని ఒకసారి చిన్నప్పుడు నేను చూసింది కూడా...! )
రాత్రికి అదే హోటల్లో బసచేసి, మళ్ళీ కుమారధార తీర్థస్నానం ఆచరించి, రెండవ రోజు కూడా నియమిత ఆర్జిత పూజాదికాలు ముగించి, ఆలయం వారి భోజన ప్రసాద శాలలోనే వడ్డించే అన్న ప్రసాదాన్ని స్వీకరించి, కుక్కే నుండి ఉడిపి కి, అక్కడినుండి గౌలిగూడ బస్టాండ్కు మరునాడు చేరుకోవడంతో నా ఉడిపి / కుక్కే యాత్రలను సఫలీకృతం చేసి, అనుగ్రహించారు ఆ సకలదోషనిర్మూలకుడు సుబ్రహ్మణ్యుడు, సకల భోగ మోక్ష కారకుడు శ్రీ కృష్ణుడు....! 
కింద వీడియోలో ఉన్నవి ఆ యాత్రలో, సాయంత్రం వేళ ఆలయ పరిసర అటవీసౌందర్యాన్ని తిలకించేందుకు వెళ్ళినప్పుడు తీసిన దర్పణతీర్థంలోని సెలయేటి జలసిరుల సరిగమలు...... 

Thursday, June 20, 2019

ఆషాఢశక్తి గా మేల్కొని బోనాల నివేదనను స్వీకరించే దక్షిణాయననాయకి ఆదిపరాశక్తి...! :)

శ్రీకరమైన ఉపాసనాకాలంగా అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువులు తమ ప్రవచనామృతంలో బోధించినట్టుగా, భూభ్రమణాంతర్గతంగా
ప్రత్యక్షపరమాత్మ అయిన సూర్యనారాయణుడి చుట్టు పరిభ్రమించే భూగోళం సూర్యుడికి దూరంగా తన పయనంసాగించే దక్షిణాయనపుణ్యకాలం ఆసన్నమవుతున్నవేళ.....
ఆధ్యాత్మిక తత్వచింతనానుసారంగా సూర్యుడు ఆత్మశక్తికి, చంద్రుడు మనోశక్తికి ప్రతీకలు / కారకులు......
సశాస్త్రీయ వైదిక మార్గపు జ్యోతిష శాస్త్రానుగుణంగా
సూర్య చంద్రులు ఖగోళంలోని
సౌరమండలాంతర్గతపు 2 గ్రహాలే అయినా, వాటి ప్రత్యేకత వేరు....
సూర్యుడినుండి కాంతిని, శక్తిని సంగ్రహించే చంద్రుడు కేవలం భూమిచుట్టూ పరిభ్రమించే భూసహజ ఉపగ్రహం..( Moon is a non self-luminous earth's natural satellite...)
సూర్యుడు అన్ని గ్రహాల గమనాన్ని శాసించే కేంద్రస్థానమై, గ్రహాధినాయకుడై, స్వయంప్రకాశకుడై విరాజిల్లే బృహత్ నక్షత్ర కాంతిపుంజం....... ( Sun is a self-luminous humongous star that holds the central authority of the solar system comprising of various planets rotating and also revolving around it in their respective elliptical orbits....)
కాబట్టి ఈ సూర్యచంద్రుల ఉమ్మడి ప్రభావం అనేది కేవలం భూగత జీవులకు మాత్రమే వర్తించే భౌతిక ఆధ్యాత్మిక ( అనగా దైవిక ) అంశం.....
( ofcourse other planets do have their own moons like Saturn and it's moon and so on...however none of them affect Earth's living beings as such and hence are ignored for all practical astronomical and astrological purposes )
సూర్యుడుకి భౌతికంగా భూమి దూరమైనప్పుడు ఆ కాలంలో సహజంగానే జీవుల ఆత్మశక్తి సన్నగిల్లి, వారికి లభించవలసిన ఆత్మగతమైన జీవబలం మందగించిపోతుంది.......
సూర్యుడులేని నాడు, సూర్యశక్తే ఆధారంగా గల చంద్రునకు శక్తిలేదు.....
కాబట్టి ఆత్మశక్తి క్షీణించే కాలంలో చంద్రకారకమైన మనోశక్తికి కూడా నిలకడ ఉండదు....
ఈ రెండు తమ తమ స్థిరత్వలుప్తావస్థలో ఉండే కాలం సహజంగానే ప్రాణులకు గండకాలమై ఉంటుంది.....
అందుకే ఇలాంటి కాలంలో,
బ్రహ్మమొదలు పిపీలికాదిపర్యంతం ప్రతి ప్రాణియొక్క మనుగడకు మూలాధారమైన ఆ పరాశక్తిని విశేషంగా ఆరాధించి, ఆ వైశ్వికశక్తిని ఆషాఢశక్తిగా జాగృతపరిచి చీడపీడలకు నెలవైన ఈ దక్షిణాయన కాలపు పగ్గాలను చేబూని జీవుల రక్షణబాధ్యతను మరింత దృఢంగా స్వీకరించి కరుణించమని వేడుకోవడమే ఈ ఆషాఢజాతర
లోని ఆంతర్యం.....
భౌతిక శాస్త్రంలోని " Energy can neither be created not destroyed but can only be transformed from one form to the other... " అనే మౌలికసూత్రానుగుణంగా,
ఆ విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తిని
గడ్డుకాలంలో మనకు ఒక "cosmic divine shield" లా రక్షణగా ఉండడానికి " రాజసశక్తిగా "
జాగృతపరుస్తున్నం కాబట్టి ఆ అమేయ దైవిక శక్తిని స్థిమితపరిచి స్థిరీకరించడం కూడా అంతే ఆవశ్యకమైన అంశం....
(Stabilization of an energy transfer process is as important as the very means of various methodologies used to invoke the same.)
కాబట్టే విశేషమైన నివేదనలతో
ఆ జాగృతపరచబడిన అప్రమేయ పరాశక్తితత్వాన్ని శాంతపరిచి, ఆ పరాంబిక యొక్క అనుగ్రహాన్ని శుభకరమైన ఇహ జీవితానికి / వివిధ ఐహిక ఉపలబ్ధికి అనువైనరీతిలో కొలువైవుండి అనుగ్రహించమని వేడుకోవడమే ఈ బోనాల ఉత్సవ వైభవం...
నివేదన --> భోజనము --> బోనము
అనే జనబాహుళ్యాంతర్గత వ్యవహరమైన పదప్రయోగంతో "బోనాలు" గా యావద్
తెనగసీమ --> తెలగసీమ--> తెలుంగుసీమ --> తెలంగాణ నేలపై బహువైభవవిశేషాలతో ఆ
"భవాని భావనాగమ్యా భవారణ్యకుఠారిక" ను ఆరాధించి అనుగ్రహాన్ని పొందడమనేది తరతరాలుగా పరిఢవిల్లుతున్న నైసర్గికాచారవిశేషం...😊
శ్రీమాత్రేనమః.....🙏🙏🙏🙏🙏
సర్వం బల్కంపేట స్వయంభూ
శ్రీరేణుకాహేమలాంబ(ఎల్లమ్మ) పరాంబికశ్రీచరణారవిందార్పణమస్తు.....😊

అత్యంత ఉత్కృష్టమైనది సంగీత పరిజ్ఞ్యానం..... :)

మానవశరీరం అనే ఒక దైవదత్తమైన పరికరానికి కలిగే క్లేశాలను నివారించే ఆరితేరిన వైద్యులు అందరూ అవ్వగలరా...??
అంతరిక్షంలో వినువీధిలోకి దూసుకుంటూ సాగిపోయే క్షిపణి / వ్యోమనౌక యొక్క విన్యాసాలను భూమిపైనుండే తమ చేతివేళ్ళతో
శాసించే రాకెట్ సైంటిస్ట్ అందరూ అవ్వగలరా...??
వాటికి ఒక ప్రత్యేకమైన అర్హత, అనుగ్రహం, కఠోర పరిశ్రమ, జన్మాంతర పుణ్యబలం ఇత్యాదుల సమ్మిళిత సంఘాతమై ప్రభవించే జీవితం మాత్రమే యోగ్యతను సంతరించుకొని సరితూగుతుంది....
అది స్వగ్రాహ్యమా కాద అన్నది వేరు విషయం.....
అట్లే అత్యంత ఉత్కృష్టమైన
సంగీత పరిజ్ఞ్యానం కూడా..!!
అది ఆలపించడానికే కాదు....
ఆలకించి ఆస్వాదించి ఆనందామృతరససిద్ధిని మనలోనే ప్రభవింపజేయుటకు కూడా ఆ దైవానుగ్రహమే కారకమై వర్ధిల్లుతుంది....😊
అందుకే కద సద్గురు శ్రీత్యాగరాయుల వారు,
" రాగ సుధారస పానము జేసి రంజిల్లవే ఓ మనసా...."
అనే తమ కృతిలో...
శ్రీశారదాంబ కటాక్షజనితమైన సుసాహిత్య సమ్మిళిత శాస్త్రీయ సంగీత సంపద యొక్క వైభవాన్ని నిర్వచించడానికి
" యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)
చ. సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా) "
అంటూ అంతటి ఘనమైన పదసంపదను ఎన్నుకున్నారు...!!! 😊
Sudhakar Modumudi
ో ఏమి ఆనందం ఉంటుందో నాకర్థం కాదు.నేను నిజానికి ఆ సంగీతాన్ని ఆస్వాదించలేను.జానపద సంగీతమో, సినిమా పాటలో వింటే కలిగే ఆనందం,నాకు శాస్త్రీయ సంగీతం వింటే కలగదు.' అంటూ వేదికపై సెలవిచ్చారు మా బెజవాడలో ఒక పెద్దాయన.
నేను మనసులో అనుకొన్నాను.'అవునులెండి..అలా బుర్ర ఊపి, ఆనందించడానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి.ఇక,తాళం విషయానికొస్తే..అలా తాళం వేయగలగడం వెనుక ఎంతో శిక్షణ,సాధన,అనుభవం ఉంటాయి.అవి మీకెలా అర్థమవుతాయి?'
గురు ముఖంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి,నేర్చుకొని,సాధన చేస్తే..సంగీత రచనలైతే వస్తాయిగానీ..శ్రుతిలయలు రావు.మంచి సంగీతాన్ని గుర్తించి,విని ఆనందించడం రాదు.ఇవిమాత్రం, జన్మాంతర సంస్కారం వల్ల మాత్రమే అబ్బుతాయి.
నేను అక్కడ,ఆ పెద్దమనిషితో ఈ విషయాలు చర్చించడం-' చెవిటివాడి ముందు శంఖం ఊదటమే అవుతుంది.అందరికీ అర్థమైతే..అది 'శాస్త్రీయ' మెందుకు అవుతుంది? అసలు శాస్త్రం తెలుకోవాలనే జిజ్ఞాస ఎంతమందికుంటుంది?
అయితే,ఈ సందర్భంగా మరొక విషయం చర్చించాలి.మా సంగీత కళాకారుల్లో కూడా ఎక్కువ శాతం మంది కచేరీలు వినడానికి రావట్లేదు.వాళ్లు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం మరొకరు పాడితే వారు ఎందుకు వినటానికి రారు?ఊరిలో జరిగే కచేరీలకు హాజరవకుండా,రకరకాల కుంటిసాకులు ఎందుకు చెప్తారు? అప్పుడు నాకు అనిపిస్తుంది'కర్ణాటక సంగీతం అందరూ అనుకొనేట్లు నిజంగా అంత కర్ణ కఠోరమా?'
సంగీతం నేర్చుకొని,వేదికలెక్కి పాడటం మొదలైనాక, విద్యార్థి అభిరుచిలో మార్పు వస్తోంది.విద్యలో, ఖ్యాతిలో తమకన్నా గొప్ప వారి కచేరీలే వినాలి అనుకోవడం,తమకు అవకాశమివ్వని సభలకు దూరంగా ఉండటం,వేరే గురువుల శిష్యులను పరాయివారిగా చూడటం, తోటి కళాకారుల యెడ ఈర్ష్యాసూయలు...ఇటువంటివన్నీ ప్రారంభమౌతాయి.తాము వేదికలెక్కేందుకు చూపే శ్రద్ధ, వేదికపై జరిగే కచేరీలు వినటంపై చూపరు.మళ్లీ వారే,తమ కచేరీలకు హాజరవని సామాన్య జనాన్ని ఆడిపోసుకుంటారు.
అసలు ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా,ప్రతి కార్యక్రమానికీ హాజరై,బాగుంటే ఆసాంతం కూర్చొని,విని,నచ్చకపోతే మారుమాట్లాడక, వెళ్ళిపోయే కొంతమంది 'సీనియర్ సిటిజన్స్' కూడా నాకు తారసపడుతూ ఉంటారు.వారిలో కొందరు, తమకు వచ్చే పెన్షన్ డబ్బులలో వీలైనంత అప్పుడప్పుడూ ఇస్తూ..నన్ను మనస్ఫూర్తిగా అభినందించి మరీ వెడుతూ ఉంటారు.వారికి చేతులెత్తి నమస్కరిస్తాను నేను.నిజం చెప్పాలంటే..31 సంవత్సరాలుగా నెలనెలా కచేరీలను 'స్వరఝరి' లో నేను నిర్వహించ గలుగుతున్నానంటే..ప్రధానంగా అటువంటివారి సహకారంతోనే.
'శాస్త్రీయ సంగీత కళాకారులు సాహిత్యానికి ప్రాథాన్యతనివ్వరు కనుక,మేము వినలేమని' కొందరు ఆంధ్ర సాహితీప్రియులనవచ్చు.మరి,ఏ భాషా అవసరంలేని రాగాలాపన,స్వరకల్పన,తానం వంటివాటినైనా ఆస్వాదించవచ్చుకదా! వాద్యసంగీతాన్ని వినవచ్చుకదా!
తెలుగు భాష తెలియని పొరుగు రాష్ట్రాలవారు ఆరాధించినంతగానైనా,మన భాషలోని సంగీతాన్ని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాము?
వీటన్నిటికీ సమాధానం త్యాగయ్యగారు ఎప్పుడో చెప్పారు..
"సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా!"
ఈ విషయంలో,సంగీత కళాకారులకూ మినహాయింపు లేదు...'సంగీత జ్ఞానం' అంటే..త్యాగయ్యగారి దృష్టిలో,సంగీతాన్ని ఆస్వాదించగలగడం అనికూడా అర్థం.
ఈ కథ వినండి...
సంగీతాభిరుచి పెద్దగాలేని ఒక రాజుగారు,ఒక సందర్భంలో తమ కొలువులో ఒక ప్రసిద్ధ విద్వాంసుని గాత్ర కచేరీ ఏర్పాటుచేశారు.విద్వాంసుడు ఎంతో హృద్యంగా పాడుతున్నాడు..శ్రోతలు ఆనందంతో తలలూపుతూ ఆస్వాదిస్తున్నారు.ఆ సంగీతాన్ని ఆస్వాదించలేకపోతున్న రాజుగారికి,అనుమానం వచ్చింది.'వీళ్లంతా నిజంగా ఆనందిస్తున్నారా? లేక నా మెప్పుకోరి నటిస్తున్నారా?' అని.కచేరీ మధ్యలో ఇలా ప్రకటించారు' ఇక శ్రోతలెవ్వరూ తలలూపడానికి వీలులేదు.తల ఊపితే..శిరచ్ఛేదమే'..
కచేరీ తిరిగి ప్రారంభం అయింది.గంగాప్రవాహంలా సాగుతోంది గాత్ర కచేరీ.సభలో అందరి తలలూ ఊగటం ఆగిపోయాయి..ఒక వ్యక్తి తల మినహా...రాజుగారు పట్టరాని కోపంతో..'ఎవరా తల ఊపుతున్నది? వెంటనే ఆ తలతీసేయండి' అని భటులకు ఆదేశమిచ్చారు.
ఆ తల ఊపుతున్న వ్యక్తి నుంచొని, వినయంగా ఇలా అన్నాడు..'మహారాజా!మంచి సంగీతాన్ని విని,ఆనందంతో స్పందించని నాతల ఉంటేనేం? పోతేనేం?వెంటనే తీసేయండి ప్రభూ..'
రాజుగారికి తన తప్పు తెలిసింది.తన అభిప్రాయం మార్చుకొని,ఆనాటి నుండీ సంగీతాన్ని గురించి తెలుసుకొంటూ,తరచుగా వింటూ, తానూ సంగీతాభిమానిగా మారారు.
దూరదర్శన్ భారతి చానెల్ లో విఖ్యాత సితార్ విద్వాంసులు విలాయత్ ఖాన్ గారు అన్న మాటలు నేనెన్నటికీ మరువలేను..'శంకరా' రాగం విన్నా..పాడుకొన్నా...'అంబరాన్ని అంటే అనంత శరీరుడై, శిరసు నుండి వ్రేలాడే మహా జటలతో, భస్మ ధారియై, ధ్యానముద్రలో గంభీరుడైన శంకరుని దర్శనం నాకు కల్గుతుంది'.
ఎంత గొప్పగా చెప్పారు? ఒక మహమ్మదీయునికి కలిగిన ఆ దర్శనం...భావిస్తే మనకెందుకు కలుగదు?
నాకైతే..శృతిలయ బద్ధమై, శాస్త్రనిబద్ధతతో కూడిన సంగీతం ఎవరు పాడినా...ఖచ్చితంగా దైవదర్శనం కలుగుతుంది.హంసధ్వని రాగం వింటే..గణపతి రూపం..సరస్వతి రాగం వింటే ..వీణాధరి అయిన వాణీమాత దర్శనం, నాదనామక్రియ రాగం వింటే...లీలగా శ్రీరాముడి దివ్యరూపం,సురటిరాగం వింటే..మారుతి సాక్షాత్కారం..ఇలా ప్రతిరాగం, ఒక దైవస్వరూపంగా కనిపిస్తాయి.నాకు సంగీతం వినడంలో ఉన్న ఆనందం, పాడటంలో కూడా కనబడదు.నేను విన్న ప్రత్యక్ష సంగీతం,నా సమకాలీనులలో ఎవరైనా విన్నారా? అని సందేహం కల్గుతుంది.
నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన శ్రవణ భక్తిని నాకు అనుగ్రహించిన వాగ్దేవికి సదా వందనాలు!