Sunday, August 27, 2023

శ్రీవరలక్ష్మీ నమోస్తుతే...!

శ్రీశోభకృత్ నామ సంవత్సర నిజశ్రావణమాస రెండవ శుక్రవారం ఈ లోకంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన మహిమోపేతమైన శ్రీవరలక్ష్మివ్రతవైభవానికి పెట్టిందిపేరుగా విజ్ఞ్యులెల్లరికీ విదితమే....
.
.
.

***** ***** ***** ***** ***** *****

|| శ్రీ సూక్తమ్ ||
 
ఋగ్వేదసంహితాః అష్టక - ౪, అధ్యాయ - ౪, పరిశిష్టసూక్త - ౧౧

హిరణ్యవర్ణామితి పంచదశర్చస్య సూక్తస్య
ఆనందకర్దమశ్రీద చిక్లీతేందిరా సుతా ఋషయః |
ఆద్యాస్తిస్రోఽనుష్టుభః | చతుర్థీ బృహతీ |
పంచమీ షష్ఠ్యౌ త్రిష్టుభౌ | తతోఽష్టావనుష్టుభః |
అంత్యా ప్రస్తారపంక్తిః | శ్రీర్దేవతా ||

**

ఓం || హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ"మ్‌ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్‌ 
|| ౨ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా"దప్రబోధినీమ్‌ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా" దేవీజుషతామ్‌ || ౩ ||

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్‌ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్‌ || ౪ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్‌ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || ౫ ||

ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలా"ని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః || ౬ ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్‌ కీర్తిమృద్ధిం దదాతు మే || ౭ ||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్‌ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్‌ || ౮ ||

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్పాం కరీషిణీ"మ్‌ |
ఈశ్వరీ"‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌ 
|| ౯ ||

మనసః కామమాకూ"తిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః || ౧౦ ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్‌ || ౧౧ ||

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే || ౧౨ ||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్‌ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧౩ ||

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్‌ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧౪ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ"మ్‌ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్, విందేయం పురుషానహమ్‌ || ౧౫ ||

| ఫలశ్రుతిః |

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయా"దాజ్య మన్వహమ్‌ |
శ్రియః పంచదశర్చం చ శ్రీకామస్సతతం జపేత్‌ || ౧ ||

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే |
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్‌ 
|| ౨ ||

అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే |
ధనం మే జుషతాం దేవి సర్వకామా"ంశ్చ దేహి మే || ౩ ||

పద్మాననే పద్మవిపద్మపత్రే పద్మప్రియే పద్మదలాయతాక్షి |
విశ్వప్రియే విష్ణుమనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సంనిధత్స్వ || ౪ ||

పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవే రథమ్‌ |
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతుమామ్‌ || ౫ ||

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః |
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే || ౬ ||

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా |
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినీ" || ౭ ||

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూ"క్తం జపేత్సదా || ౮ ||

వర్షంతు తే విభావరిదివో అభ్రస్య విద్యుతః |
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో" జహి || ౯ ||

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ,
గంభీరావర్తనాభిస్తనభరనమితా శుభ్రవస్త్రోత్తరీయా |
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః స్థాపితా హేమకుంభైః,
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా || ౧౦ ||

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్‌ |
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్‌ || ౧౧ ||

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీః సరస్వతీ |
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా భవ సర్వదా || ౧౨ ||

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్‌ |
బాలార్కకోటిప్రతిభాం త్రిణేత్రాం భజేఽహమాద్యాం జగదీశ్వరీం తామ్‌ || ౧౩ ||

సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తుతే || ౧౪ ||

సరసిజనిలయే సరోజహస్తే ధవలతరాం శుకగంధమా"ల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్‌ || ౧౫ ||

విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియామ్‌ |
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్‌ || ౧౬ ||

మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయా"త్‌ || ౧౭ ||

శ్రీర్వర్చస్యమాయుష్యమారో"గ్యమావిధాత్పవమానం మహీయతే" |
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవథ్సరం దీర్ఘమాయుః || ౧౮ ||

ఋణరోగాది దారిద్ర్య పాపక్షుదపమృత్యవః |
భయ శోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా || ౧౯ ||

శ్రియే జాతః శ్రియ ఆనిరియాయ శ్రియం వయో" జరితృభ్యో" దధాతి |
శ్రియం వసా"నా అమృతత్వమా"యన్‌ భవ"ంతి సత్యా సమిథా మితద్రౌ" |
శ్రియ ఏవైనం తచ్ఛ్రియమా"దధాతి |
సంతతమృచా వషట్కృత్యం సంతత్యై" సంధీయతే ప్రజయా పశుభిర్య ఏ"వం వేద ||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయా"త్‌ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||
***** ***** ***** ***** ***** *****
.
.
.

ఈ అత్యంత మహిమోపేతమైన శ్రీసూక్త ఫలశృతి యొక్క 12వ పంక్తిలోని శ్లోకంలో వరలక్ష్మి దేవి యొక్క ప్రస్తావన గురించి విజ్ఞ్యులెల్లరికీ విదితమే....

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీః సరస్వతీ |
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా భవ సర్వదా || ౧౨ ||

ఓ మహాలక్ష్మి, సిద్ధిని (సిద్ధలక్ష్మి), ముక్తిని (మోక్షలక్ష్మి), విజయాన్ని (జయ లక్ష్మి), జ్ఞానాన్ని (సరస్వతి), సంపదను (శ్రీలక్ష్మి), వరములను (వరలక్ష్మి), ప్రసాదించే లక్ష్మిగా
నీవు నన్ను ఎల్లప్పుడూ అనుగ్రహించు.....

వరము అనే అత్యంత ప్రశస్తమైన పదం మన సనాతనసంప్రదాయంలోని ఆర్షసారస్వతంలో మనము తరచుగా వినే పదం.....
ఈ "వరము" అనేది ఎంతటి శక్తివంతమైన అనుగ్రహం అంటే, వరాల ప్రభావానికి దేవతలే భువిపైకి అవతారస్వీకరణ గావించి మనుష్యులుగా రావడంతో, ఈ భారతావనిపై ఎన్నో పుణ్యక్షేత్రాలు ఏర్పడి ఇప్పటికీ అవన్నీ కూడా అజరామరమైన వైభవంతో వర్ధిల్లడం మనం గమనించవచ్చు......

శ్రీమహావిష్ణువు యొక్క ఈ క్రింది ప్రశస్తమైన దశావతారాల్లో

మత్స్య
కూర్మ
వరాహ
నారసిమ్హ
వామన
బుద్ధ
పరశురామ
శ్రీరామ
శ్రీకృష్ణ
కల్కి

సోమకాసురుడి నుండి వేదాలను రక్షించడానికి మత్స్యావతారాన్ని,

అమృతకలశ లబ్ధికై క్షీరసాగర మథనం కోసం శ్రీకూర్మావతారాన్ని,

హిరణ్యాక్షుడి సమ్హారానికై శ్రీవరాహావతారాన్ని...

హిరణ్యకశిపుడి సమ్హారానికై బ్రహ్మగారి వరానికి అనుగుణంగా 
శ్రీనారసిమ్హావతారాన్ని...

దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుణ్ణి స్వర్గాధిపతిగా పునః అభిషిక్తం గావించడానికి, బలిదైత్యుడి తాత ప్రహ్లాదుడికి ఇచ్చిన వరం కారణంగా, ప్రహ్లాద సంతతికి చెందిన బలిచక్రవర్తితో యుద్ధం కూడదు కాబట్టి, 8 ఏళ్ళ బ్రాహ్మణ వటువుగా అవతరించి, ఓ బలిదైత్య మహారాజా, ఒకటిరెండడుగుల మేర భూదానం ఇవ్వు, అని సామదానభేదదండోపాయాల్లోని రెండవ సిద్ధాంతాన్ని ఉపయోగించి, 3 అడుగులతో యావద్ విశ్వాన్ని తన పాదాక్రాంతం గావించుకున్న త్రివిక్రముడిగా......

ప్రజలను పీడించే దుష్ట క్షత్రియ పరిపాలకుల సమ్హారానికై భార్గవరాముడిగా, (ఆయన ధరించిన పరశు అనే గండ్రగొడ్డలి ఆయుధం వల్ల పరశురాముడు అనే పేరు ఎక్కువగా ప్రచారంలో ఉన్నది)

పౌలస్త్యుడి సమ్హారానికై బ్రహ్మగారి వరానికి అనుగుణంగా కౌసల్యాదశరథ తనయుడిగా మనుష్యుడైన శ్రీరామావతారాన్ని...

శ్రీమద్రామాయణంలో వాలి అనే వానరరాజుకు గల వరప్రభావం కారణంగా చెట్టు చాటు నుండి వాలివధ గావించిన శ్రీరాముడు అనే సోకాల్డ్ అపవాదు వల్ల మరో అవతారాన్ని స్వీకరించి, అవతార పరిసమాప్తి సమయంలో ఒక ఎరుకలవాడి బాణప్రహారం అనే సాకుతో ఆ సంచితం యొక్క లెక్కను అప్పజెప్పిన పరిపూర్ణావతారమైన 
శ్రీకృష్ణావతారాన్ని...

(మూడు సార్లు మీకు కుమారుడిగా జన్మిస్తాను అని సాధుదంపతులకు ఇచ్చిన వరం కారణంగా
పృష్ణిగర్భుడు, వామనుడు, శ్రీకృష్ణుడు, అనే 3 అవతారాలను స్వీకరించడం..)

శ్రీకృష్ణావతార పరిసమాప్త సమయంలో, తన మానుష స్థూల శరీరం నుండి విడివడిన శ్రీవైష్ణవతేజస్సు ఆకాశంలో ప్రయాణిస్తూ శ్రీవైకుంఠంలోని పరవ్యూహంలో లయమవ్వడానికి ముందుగా, మహర్షులకు ఇచ్చిన వరం కారణంగా, ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేశుడిగా....
శ్రీవేంకటేశ్వరుడిగా....

రానున్న కలియుగ పరిసమాప్తి సమయంలో (అనగా ఇప్పటి మన కాలమానం ప్రకారంగా, కల్క్యావతారానికి ఇంకా 4 లక్షల సంవత్సరాల పైచిలుకు సమయం ఉన్నది)
కాశ్మీర దేశంలో, విష్ణుయశుడు అనే సత్బ్రాహ్మణోత్తముని ఇంట్లో కల్క్యావతారంగా.....

ఇలా సాధారణంగా భూలోకవాసులకు కనిపించని, కనిపించవలసిన అవసరంలేని, కనిపించేంతటి పుణ్యం/శౌచం కొందరికే ఉండే, ఆ పరతత్త్వం, ఒకానొక సందర్భంలో ఒకానిక ఐతిహ్యం కారణంగా సదరు వ్యక్తులకు ఇవ్వబడిన వరం కారణంగా, అవతారాలను స్వీకరించడం, ఆయా అవతారాల్లోని గాథలతో ముడిపడిఉండే ఎన్నో సంఘటనలతో కూడిన సనాతనధర్మవైభవం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, 
నిత్యనూతనమే.....

కృత, త్రేత, ద్వాపర యుగాల్లోని సదాచారవైభవం / శౌచం / తపస్సు కారణంగా, వివిధ దేవతామూర్తుల్లోని దైవిక తేజస్సు భక్తులకు సద్యోప్రసన్నమై పలికేంతటి వైభవంతో ఉండడం.......

ఈ భువిని పరిపాలించిన ద్వాపరయుగం చివరి రోజుల్లోని మహారాజుల గాథల్లో....
శంతనమహరాజు / గంగాదేవి / భీష్ముడు / పరాశరమహర్షి /, మత్స్యగంధి /వ్యాసమహర్షి  / అంబా,అంబిక,అంబాలిక /
పాండుమహారాజు--> అర్జునుడు--> అభిమన్యుడు--> పరీక్షిత్ మహారాజు వరకు గల చంద్రవంశచక్రవర్తుల 
రాచరిక వ్యవస్థలో, 
ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణనిర్యాణం తో అమేయ కాలచక్రానుగుణంగా ఇక కలియుగం ప్రారంభమవ్వాలి కాబట్టి, కలిపురుషుడిప్రవేశంతో మొదలైన ఈ కలియుగంలో, 
యుగలక్షణం కారణంగా,
ధనమూలం ఇదం జగత్ అనే నానుడికి అనుగుణంగా సాగే ఈనాటి కలియుగంలో ధర్మం కేవలం సత్యం అనే ఒకేఒక పాదంపై మనికిని సంతరించుకోవడం కారణంగా.....

మరియు, ఈ కలియుగంలో ఉండే
బాహ్యశౌచలోపం,
వైదికస్వర / సదాచారలోపం,
చిత్తశుద్ధి / ఆంతరశౌచలోపం,
కారణంగా త్రికరణముల ఏకీకరణ లుప్తమౌతూ..,
అనగా మనసా, వాచా, కర్మణా, శౌచసిద్ధితో ఉంటూ, భక్తిప్రపత్తులతో ఆరాధన గావించే భక్తుల సంఖ్య గణనీయంగా క్షీణిస్తూ ఉండే ఈ కలికాలంలో,
పిలిస్తే ప్రత్యక్షమై పలికేంతటి స్థాయిలో అర్చామూర్తులు నిత్యం విశేషమైన దైవిక తేజస్సుతో అలరారే సౌభాగ్యం భక్తులకు మృగ్యమైన ఈ కలికాలంలో, దేవతలు మనుష్యులకు ప్రత్యక్షమై వరాలను అనుగ్రహించడం అనే సనాతనధర్మం యొక్క కాన్సెప్ట్ ఎక్కడో కోటిలో ఒక్కరికి అన్నచందంగా ఉండే కాలం ఈ కలికాలం....

మరి ఇటువంటి కలికాలంలో
వరాలను అనుగ్రహించేది ఎవరు....?
అందిపుచ్చుకునేది ఎవరు...?

వరాలను అనుగ్రహించేంతటి శౌచసిద్ధి, వైదికమంత్రోఛ్ఛరణస్వరసిద్ధి, సదాచారసిద్ధి తో అలరారే ప్రశాంతమైన మునివాటికలేవి...? ఎక్కడ...?
వరాలను అందుకునేంతటి శౌచసిద్ధి, స్వరసిద్ధి, సదాచారసిద్ధి తో సాధింపబడే తపఃశక్తి సంపన్నులు ఎవరు...? ఎక్కడ...?

కాబట్టి ఇతర యుగాల్లో ఉన్నట్టుగా కాకుండా కేవలం భగవద్ నామం యొక్క స్మరణ, మనన, జపం, తోనే పుణ్యసంచయమయ్యే ఈ కలియుగంలో యుగలక్షణానుగుణంగా దేవతలు కూడా వారి వారి వరాలనొసగే కాన్సెప్ట్ ని కొద్దిగా దేశకాలానుగుణంగా ఆవశ్యకమైన మాడిఫికేషన్స్ తో నూతనాత్వాన్ని జోడించి కొన్ని వ్రతాలను ఈ కలియుగవాసులకు అనుగ్రహంగా అందించినారు....

శ్రీసత్యనారాయణస్వామివారి వ్రతం....
శ్రీవరలక్ష్మివ్రతం....
ఇత్యాదిగా....

ఎప్పుడైనా ఆచరించి తరింపజేయగలిగే వ్రతాలు కొన్ని....
(శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతం లా..) 
కల్పోక్త ప్రకారంగా ఎప్పుడు ఆచరించాలో అప్పుడే ఆచరించి తరింపజేసే వ్రతాలు కొన్ని...
(శ్రావణమాస శ్రీవరలక్ష్మీ వ్రతం లా...)

ఒక చిన్న లంచ్ బాక్స్ లో మనకిష్టమైన అన్నం, పప్పు, కూర, పెరుగు, చపాతీలు, ఇత్యాదివన్నీ కాంప్యాక్ట్ చేసి ఏవిధంగానైతే ఎక్కడికైనా క్యారి చేస్తూ, మనకు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో అప్పుడు అక్కడ అలా వాటిని ఒక విస్తరి/ప్లేట్లో పరుచుకుంటామో....
అవ్విధంగా.....
మానుషమేధకు గ్రాహ్యం కాని సూక్ష్మశరీరంతో సంచరించే వివిధ దేవతాతత్త్వములు యావద్ ప్రపంచంలో ప్రయాణిస్తూ
వారు ఎప్పుడు ఎక్కడ ప్రసన్నంగా ఉంటారో అప్పుడు అక్కడ వాటిని స్థూల తైజసిక తత్త్వాలుగా, రూపాలుగా, విస్తరింపజేసి ప్రకటింపజేసి ఆరాధించిన వారిని అనుగ్రహించి, ఆ దైవిక తేజస్సును వరంగా ప్రసాదించడం అనే ప్రక్రియనే వరాలను ఒసగడం అని క్లుప్తంగా మనం భావింపవచ్చును.....

ఈ ప్రక్రియలో, సూక్ష్మరూపంలో ఉంటూనే ఆరాధించిన వారిని అనుగ్రహించడం కూడా వరాలను ఒసగడం గానే ఈ కలియుగంలో పరిగణింపవలసి ఉంటుంది....

ఎందుకంటే, ఎక్కడో ఒక ఉన్నతస్థాయిలో ఒక ఉన్నత పదవిని అలంకరించి ఉండే మాన్యులు, ఒక వెయ్యి రూపాయల జీవనభృతి / పెన్షన్ ఇవ్వడానికి మన ఇంటికే వచ్చి ఇవ్వవలసిన అవసరంలేదు కద....
ఒక వ్యవస్థీకృత విధానంలో భాగంగా మన అభ్యర్ధన అందిన తదుపరి మనకు బ్యాంక్ ఛానల్ ద్వారా ఆ పెన్షన్ అనే అనుగ్రహం అందడం ఎట్లో....

అట్లే...
కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ఆరాధనంచకరిష్యే....
అనే మన సంకల్పానుసారంగా....
తత్ ఆరాధ్యదైవం మనకు వరాలను అనుగ్రహించడం కూడా....

మనకోసం మనం ఎన్నుకునే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థే ఎంతో గొప్పదిగా చెప్పబడుతున్నప్పుడు.....
మరి
అనాదిగా ఉన్న వైశ్విక పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పదై ఉండాలి....?

లోకాలు మునగకుండా ఉండేలా రక్షిస్తూ, సూర్య, చంద్ర, భూ భ్రమణాలు గతితప్పకుండా ఉండేలా శాసిస్తూ, యావద్ విశ్వంలో పరివ్యాప్తమై ఉండే పరతత్త్వం అనే వ్యవస్థ ఎంత గొప్పదై ఉండాలి...?
యావద్ బ్రహ్మాండాన్ని సృష్టించే బ్రహ్మగారికి తన నాభిగొట్టం ద్వారా శక్తిని అందించే విశ్వవ్యాప్తమైన విష్ణు తత్త్వం ఎంత గొప్పదై ఉండాలి...?
ఆ వ్యవస్థలో భాగమైన వివిధ దైవిక తత్త్వములు ఎంత గొప్పవై ఉండాలి...?
ఆయా దేవతలు స్థూలరూపంలో ఈ మర్త్యలోకవాసులకు ప్రత్యక్షమవ్వాలంటే దానికి ఎంతటి పుణ్యసంపత్తి మరియు శౌచసంపత్తి ఉండాలి...?
ఆయా దేవతాతత్త్వములను సరైన అవగాహనతో ఆకళింపుజేసుకోవడానికి ఎంతటి అధ్యాత్మ కృషీవలులమై ఉండాలి..?
అనే అలోచనలేని అడ్డగాడిదలు ఏవో కూసినంతమాత్రాన, 
ప్రతీరోజు సూర్యుడు ఉదయించకుండా ఉండడు....
ప్రతీనెలా పౌర్ణమి చంద్రుడు ఉదయించకుండా ఉండడు....
జీవనదులు ప్రవహించకుండా ఉండడం ఉండదు...
సముద్రం అలలతో హోరెత్తకుండా ఉండడం ఉండదు.....
దిగ్దిగంతముల పర్యంతం పరివ్యాప్తమైఉండే సనాతనధర్మాంతర్గతమైన వివిధ దేవతా తత్త్వముల దేదీప్యమానవైభవం ఆరాధించినవారిని అనుగ్రహించకుండా ఉండడం ఉండదు.....

శ్రీవరలక్ష్మీవ్రతవైభవం చారుమతి అనే పతివ్రత యొక్క స్వప్న వృత్తాంతం ద్వారా లోకంలో ఆ వరలక్ష్మి అమ్మవారే వ్యాప్తిగావించడం గురించి, చారుమతి అనగా చక్కని బుద్ధివైభవం గల పతివ్రత అనే వ్యాఖ్యానం గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో చాలామంది భక్తులు వినేఉంటారు....
ఆ ఈశ్వరచైతన్య స్పృహను మనలో స్థిరీకరించే చక్కని బుద్ధివైభవమే మన పుణ్యసంచయానికి కారణం....
కాబట్టి శ్రీవరలక్ష్మివ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతీ మహిళామణి కూడా చారుమతియే....
అలాంటి చారుమతి వంటి స్త్రీమూర్తులు ఉన్నంతకాలమూ ప్రతీ గృహము కూడా శాంతిసౌఖ్యములతో విహితానుగ్రహమైన సిరిసంపత్తితో వర్ధిల్లుతూనే ఉంటుంది....

శ్రీవరలక్ష్మీ నమోస్తుతే...!
🙏🙏🙏🙏🙏
🙂🍧🍨🍕🍿

No comments:

Post a Comment