Sunday, September 24, 2023

శ్రీమలయప్పస్వామివారి సర్వభూపాలవాహనసేవ దర్శనభాగ్యం జన్మజన్మలకు తరగని సౌభాగ్యం...!!🙂

శ్రీశోభకృత్ నామ 2023 సంవత్సర తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, (ఈ సంవత్సరం అధికశ్రావణమాసం ప్రభవించిన కారణంగా, ఆశ్వయుజ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అదనంగా, పూర్వాంగంగా మరో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం తిరుమల శ్రీశ్రీనివాస పరివార /  ఆలయకైంకర్య ఆనవాయితి...) భాద్రపద శుద్ధ షష్ఠ్యోపరిసప్తమి బృహస్పతివాసర / గురువారం నాడు.....
కోరినవారికి కోరినట్లుగా ఎవ్విధమైన సిరులైనను అనుగ్రహించే మహిమాన్వితమైన సర్వభూపాలవాహనసేవలో శ్రీమలయప్పస్వామివారిని త్రిభంగి శైలిలోకొలువైన శ్రీభూసమేతవేణుమాధవుడిగా దర్శించడం....,
ఆతదుపరి రాత్రి పూలంగిసేవలో భాగంగా పుష్పాంబరాలంకృతుడై వర్నించనలవికాని విరిమాలలవైభవంతో అలరారే  ఆ ఆనందనిలయుడి దర్శనభాగ్యం జన్మజన్మలకు తరగని సౌభాగ్యం...!!🙂

" భక్తవత్సలాగోవిందా...భాగవతప్రియగోవిందా..."
అనే పేర్లతో భక్తులచే నిత్యం భజింపబడే ఆ శ్రీహరి అనుగ్రహవైచిత్రి అగ్రాహ్యం....
స్వర్ణాచలంగా కీర్తింపబడే శ్రీవేంకటాచలం పై కొలువైన ఆ శ్రీవేంకటేశపరబ్రహ్మము.. కిలోల కొలది వివిధ సుగంధసుమనోహరపుష్పమాలికలతో ఎందరో సంపన్న భక్తులు సమర్పించే వందనాలను స్వీకరిస్తూ ఎంత ఘనంగా శ్రీశ్రీనివాసుడిగా వారందరిని అనుగ్రహిస్తూ ఉండగలడో....ఒక్క పువ్వైననూ, త్రికరణశుద్ధిగా స్వామివారి శ్రీపాదములచెంత సమర్పించినట్టుగా భావించి సేవించే భక్తులను కూడా అంతే ఘనంగా ఆ శ్రీశ్రీనివాసుడు అనుగ్రహిస్తూ ఉంటాడు......

భూపాలురు అనగా రాజులు / పరిపాలకులు అని సామాన్యార్ధం....

మరి " భూపాలవాహనసేవ " అని అనకుండా 
" సర్వభూపాలవాహనసేవ " అని అనడంలోని ఆధ్యాత్మిక ఆంతర్యమేమి...?
భూమి అనగా ఏంటి...?
భూపాలురు అనగా ఎవరు...?
సర్వభూపాలురు అనగా, ఆ " సర్వం " లో ఉన్నది ఎవరెవరు, ఎంతమంది పాలకులు....??

ఇక్కడ ఆధ్యాత్మికపరంగా భూమి అనగా పృథ్వీతత్త్వంగా కనిపిస్తూనే తనలో పాంచభౌతిక తత్త్వాన్ని నిక్షిప్తం గావించుకున్న మన శరీరవ్యవస్థ....

భూమిలో అంతర్లీనంగా కొలువై ఉండే పాంచభౌతిక తత్త్వ
సామ్యముతో అలరారే మన దేహతత్త్వాన్ని గమనిస్తే...

ఆకాశతత్త్వం, 
(నాడీగతవ్యోమసంధులు)

వాయుతత్త్వం, 
(ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, 
నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములను దశ వాయువుల సంఘాత తత్త్వం),

అగ్నితత్త్వం,
(జఠరాగ్ని, ఇత్యాది అగ్ని తత్త్వం)

జలతత్త్వం,
(మన శరీరంలో అధికశాతం జలతత్త్వమే)

ఈ వ్యవస్థలన్నిటికి, మరియు ఆయావ్యవస్థాంతర్గత వివిధ భాగాలన్నిటికీ వివిధ దేవతాతత్త్వాలను మన ప్రాచ్య ఆర్షవిజ్ఞ్యాన సారస్వత ద్రష్టలు సూచించినారు....

శ్రీరుద్రలఘున్యాసంలో ఈ శరీరాధిష్టాన దేవతాసమూహాన్ని మనం గమనించవచ్చు....

*************************

ఓం అథాత్మానగ్^మ్ శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||

శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకం |
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ||

నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ |
వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ||

కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినం |
జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ||

వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణం |
అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ||

దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం |
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ |
సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణం |
ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ||

అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యా”క్ష్యాస్యామః | ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః స్థాపయేత్ ||

ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు | జఠరేఽఅగ్నిస్తిష్ఠతు | హృద’యే శివస్తిష్ఠతు | కంఠే వసవస్తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు | నాసికయోర్-వాయుస్తిష్ఠతు | నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం | కర్ణయోరశ్వినౌ తిష్టేతాం | లలాటే రుద్రాస్తిష్ఠంతు | మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు | శిరసి మహాదేవస్తిష్ఠతు | శిఖాయాం వామదేవాస్తిష్ఠతు | పృష్ఠే పినాకీ తిష్ఠతు | పురతః శూలీ తిష్ఠతు | పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతాం | సర్వతో వాయుస్తిష్ఠతు | తతో బహిః సర్వతోఽగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు | సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు | మాగ్^మ్ రక్షంతు |

*************************

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఉటంకింపబడిన విధంగా,
నవరంధ్రతిత్తిగా ప్రకాశించే పృథ్వీతత్త్వభరిత మన శరీరాన్ని పరిపాలించే జీవజీవేశ్వర అద్వైతతత్త్వమే ఆధ్యాత్మిక ప్రపంచంలో భూపాలుడు....
ఆ జీవుడి పరిపాలన సజావుగా సాగేలా పైనపేర్కొనబడిన వివిధ దేవతాతత్త్వముల సంచయంతో కూడి ప్రకాశించే జీవికావ్యవస్థను సర్వభూపాలవ్యవస్థ అని ఆధ్యాత్మిక వ్యవస్థలో సంబోధింతురు....
ఒక్కో దేవతాతత్త్వం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వారివారి జాతకరీత్యా కొనసాగే దశ, అంతర్దశకు సంకేతింపబడే నవగ్రహాలకు అధిపతులైన వివిధ దేవతాతత్త్వముల పరస్పర సమన్వయంతో సదరు జీవధారకుడి ఐహిక / ప్రాపంచిక యాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది.....

నవగ్రహాలు మరియు సకల దేవతాతత్త్వములు కూడా శ్రీవేంకటేశపరబ్రహ్మములో ఏకత్వభావనతో అంతర్నిహితమై వెలుగొందుచున్నవి కాన.....
సదరు జీవునకు, మరియు జీవధారకుడికి అనగా సర్వభూపాలవాహనసేవను దర్శిస్తున్న సదరుభక్తునకు,
ఆ సకలదేవతానుగ్రహపరిపుష్టి లభించి వారివారి జీవయాత్రలో మెండుగా తరించడమే ఇందలి అంతరార్ధం....

అనగా....
సకలా దేవతాతత్త్వములచే అలరారే శరీరం అనే వాహనంలో...,
చంచలమైన మనసు శ్రీదేవికి ప్రతీకగా....
నిశ్చలమైన బుద్ధి భూదేవికి ప్రతీకగా....
ఈ ఇరువురికి అధిపతిగా జీవేశ్వరుడు కొలువై ఐహిక యాత్ర సాగించడమే....
శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామివారు సర్వభూపాలవాహనసేవలో తిరువీధుల్లో యాత్ర సాగించడానికి ప్రతీక....

ఇక బాహ్యమున లౌకికార్ధంలో, ఎవ్వరు ఏఏ కోరికలతో ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తుంటారో ఆయా కోరికలు నెరవేరుటకు ఉపయుక్తమైన దేవతానుగ్రహసంచయసంవృద్ధిని ప్రసాదించే సేవగా సర్వభూపాలవాహనసేవ మాన్యులచే కీర్తింపబడుతోంది....

నిత్యశుభప్రద గోవిందా || నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా || ఆద్యంతరహితా గోవిందా

సర్వం శ్రీవ్యూహలక్ష్మి సహిత శ్రీవేంకటేశపరబ్రహ్మార్పణమస్తు...
🙂🙏💐🏵️🌸🌼

No comments:

Post a Comment