Thursday, November 9, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర 2023 ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య / కార్తీక శుద్ధ పాడ్యమి, విదియ అనే 5 రోజుల దీపావళి పండగ శుభాభినందనలు...🙂💐🎉🎂🍕🍧🇮🇳


దీపావళి పర్వసమయం అనేది సనాతనభారతీయ సంప్రదాయ వైభవద్యుతికి పెట్టిందిపేరుగా 
అనాదిగా భాసిల్లే పర్వం.....
అందుకు ముఖ్యకారణం, రోజుకు మూడుపూటలా నాణ్యమైన భోజనానికి నోచుకోని సామాన్యుల దెగ్గరినుండి,
అలాంటి మృష్టాన్నభోజనం వారి తరతరాల వారు కూర్చొని తిన్నాకూడా తరగని సిరులతో వర్ధిల్లే అపరకుబేరుల వరకు....,
ఎల్లరూ కూడా ఎంతో గౌరవంతో ఆరాధించే శ్రీలక్ష్మిదేవి యొక్క ఆరాధనాపర్వంగా దీపావళి పండగ విశేషఖ్యాతిని గడించడమే....

ఆధ్యాత్మిక తృష్ణతో శాస్త్రాన్ని గౌరవించే సనాతనపెద్దలు వచించే మాటలను, మరీ ముఖ్యంగా శ్రీచాగంటి సద్గురువులవంటి వాగ్దేవివరపుత్రుల ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించిన వారు చాలామందే ఉంటారు.....
వారిలో కొద్దిలో కొద్దిమందికైనా, శ్రీచాగంటి సద్గురువులు ఒక విషయం గురించి చెప్పడం గుర్తుండి ఉండాలి....

లక్ష్మీంక్షీరసముద్రరాజతనయాం
శ్రీరంగధామేశ్వరీం,
దాసిభూతసమస్తదేవవనితాం
లోకైకదీపాంకురాం,
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్
బ్రహ్మేంద్రగంగాధరాం,
త్వాంత్రైలోక్యకుటుంబినీం
సరసిజాంవందేముకుందప్రియాం....

అనే శ్రీలక్ష్మి స్తుతిలో, 
"లక్ష్మీంక్షీరసముద్రరాజతనయాం..." దెగ్గర పాజ్ ఇవ్వకుండా "శ్రీరంగధామేశ్వరీం" వరకు కూడా ఏకబిగిన వచించడం గురించి.....

ఎందుకంటే లక్ష్మి వేరు, లక్ష్మీఅనుగ్రహం అనగా శ్రీలక్ష్మీనారాయణ కటాక్షం వేరు....

ఇంటినిండా సరుకులు, ధాన్యరాశులు ఇత్యాది సరంజామా ఉండడం లక్ష్మి...
అవన్నీ వండుకొని/వండబడి చక్కని భోజనంగా స్వీకరించగలగడం శ్రీలక్షీనారాయణ కటాక్షం....

ఎన్నో సుగంధపుష్పాలతో అలరారే
దేవతావృక్షాలు చుట్టూ ఉండడం లక్ష్మి....
ఆ సుగంధపుష్పాలను మన పూజామందిరంలోని ఈశ్వర సిమ్హాసనానికి సమర్పించి తరించగలగడం శ్రీలక్షీనారాయణ కటాక్షం....

మేరుతుల్యమైన ధనరాశులు ఉండడం లక్ష్మి...
అంత సంపద ఉన్నా, ఒక్క కాసుకూడా లెక్కతప్పకుండా సమ్రక్షించే ఒక నమ్మదగిన నమ్మినబంటు ఉండడం శ్రీలక్షీనారాయణ కటాక్షం....

కంటిసైగతోనే శాసించగల అధికారం ఉండడం లక్ష్మి...
ఆ అధికారంతో ఎన్నో హృదయాల్లో చోటు సంపాదించుకునేలా మంచి పేరును గడించగలగడం శ్రీలక్ష్మీనారాయణ కటాక్షం...

చిటికేస్తే వచ్చివాలే అనుచరగణం ఉండడం లక్ష్మి... 
అందులో మనం చెప్పినా చెప్పకపోయినా మన శ్రేయస్సును కాంక్షించే విధంగా నిస్వార్ధులై నడుచుకునేవారే ఎక్కువగా ఉండడం  శ్రీలక్ష్మీనారాయణ కటాక్షం...

ఇవ్విధంగా లక్ష్మి ఉండడం వేరు....
ఆ ఉన్న లక్ష్మి, శ్రీలక్ష్మీనారాయణ అనుగ్రహంగా జీవితానికి అన్వయం అవ్వడం వేరు...

అందుకే ఆవిడ
ఓం హరివల్లభాయై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
అనే నామాలతో అర్చింపబడుతున్నది....

"ఆవిడ పురిషకారిణి, భాగ్యానుసంధాయిని..."అని విజ్ఞ్యులైన మాన్యులచే ప్రవచింపబడుతున్నది....

"అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా  "
అని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులచే  "జయలక్ష్మి వరలక్ష్మి" అనే సంకీర్తనలో కీర్తింపబడినది...

[ https://annamacharya-lyrics.blogspot.com/2007/11/352jayalakshmi-varalakshmi.html?m=1 ]

"ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీవేంకటేశ....."
అని భజన సంప్రదాయంలో కూడా,
శ్రీ కి నివాసం గా గలవాడైన శ్రీనివాసుడి సకలవిభూతులకు కారకురాలిగా భక్తులచే భజింపబడుతోంది....
[ తిరుమల తిరువీధుల్లో సాగిన ప్రభాతభేరిలో ఈ భజన ఆలపించిన నాకు ఎంతో మంది తోటి టి.బి.పి భక్తబృంద శ్రీవారిసేవకుల నుండి చప్పట్లు / ప్రశంసలు లభించడం నాకు ఒక్క గొప్పమధురస్మృతి...
అందుకే ఈ భజనపాట గుర్తొచ్చింది...☺️ ]

శ్రీలక్ష్మి వెంట పరుగెత్తడం అనేది లోకుల స్వాభావిక నైజం....
శ్రీహరిభక్తిసిరులు కొలువైఉన్నచోటికి తనకుతానుగా ఆ సిరి వచ్చి వరించడం అనేది "ఓం శ్రియై నమః" గా ప్రార్ధింపబడే ఆ శ్రీలక్ష్మి తత్త్వ విశేషం...

అందుకే ప్రణవం మరియు శాక్తేయప్రణవం తో సమ్మిళితమైన ఈం మరియు ఐం కార శక్తి ధ్వనించే " ఓం శ్రియై నమః " అనే మంత్రాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీఅదిశంకరాచార్యులవారు వారి తపఃశక్తి తో, తిరుమల ఆలయ కుబేర స్థానంలో నిక్షిప్త బీజాక్షర శక్తిగా లిఖించినందుకు, ప్రపంచం నలుదెసలనుండి లక్షల కోట్ల సంపద ఇప్పటికీ మరియు ఎప్పటికి ఆ శ్రీయంత్రంపైన ఉండే హుండీల్లోకి వచ్చి కొలువైఉంటుంది అనేది అధ్యాత్మ విజ్ఞ్యులకు తెలిసిన శ్రీలక్ష్మి ఉపాసనా తత్త్వం...

లక్ష్యభావన ఉన్నచోట లక్ష్యసిద్ధి సమకూరుతుంది...
లక్ష్యసిద్ధి ఉన్నచోట లక్ష్యసాధన సమకూరుతుంది...
లక్ష్యసాధన ఫలించగా లక్ష్మి సమకూరుతుంది....
లక్ష్మి సమకూరినతదుపరి ఈశ్వరానుగ్రహంతో శ్రీలక్ష్మీనారాయణ కటాక్షంగా ఆ శ్రీలక్ష్మి తత్త్వానుగ్రహం జీవితానికి అన్వయింపబడుతుంది.....

ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
అనే నామాలతో అర్చింపబడేవిధంగా, శరణాగతి గావించిన వారి పట్ల కారుణ్యమే శ్రీలక్ష్మి తత్త్వం యొక్క విశేషం....
అందుకే లోకమాతగా శ్రీశ్రీనివాసుడి హృదయసీమలో కొలువైన శ్రీవ్యూహలక్ష్మిని, "హృదయసరసిజేభూతకారుణ్యలక్ష్మీః" అని నిత్యం తిరుమలవేదపఠనం ఎంతో గంభీరంగా కీర్తిస్తున్నది...!

శ్రీవారిసేవలో ఉండగా,
ఒకానొక గురువారం నాడు నా జన్మాంతర సౌభాగ్యవిశేషంవల్ల లభించిన శ్రీవారి సన్నిధి డ్యూటి లో, ఆరుగంటల పాటు తదేకంగా రాములవారిమేడ దెగ్గర భక్తులను ముందుకు నడిపించే పోస్ట్ లో నిల్చున్న నా తన్మయత్వాన్ని వర్నించడానికి ఏ భాష కూడా సరిపోదు...ఏ భావం కూడ సరితూగదు...
ఏ ఉపమానం కూడా సరిపోలదు....

ఎందుకంటే...
ఏదో పేరుకు అక్కడ నిల్చొని భక్తులను ముందుకు నడిపించడం అనే పనిలో ఉన్నాసరే....
నా ఎదుట అంత సమీపంగా నిల్చొని, లక్ష్మీవార సడలింపు అలంకరణతో, కోటిసూర్యకాంతమణిసంఘాతసదృశ
శ్రీలక్ష్మీ ద్యుతితో వెలుగుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని చూస్తూ ఒకానొక అవ్యక్తాశ్చర్యానందామృత లహరిలో మునిగిన నా మనస్సుకు ఏమైందో ఏమో నాకే అర్ధంకాలేదు...
అక్కడే నాతోపాటుగా సన్నిధిడ్యూటి లభించిన భావన అనే మరో శ్రీవారిసేవక్ ఫ్రెండ్ మరియు ఇంకొంతమంది ఇతర శ్రీవారిసేవకులకు కూడా అదే విధంగా ఆ దర్శనం ఒకవిధమైన శూన్యం అని అనబడే పరిపూర్ణంలోకి మా మనస్సులను స్వాధీనం గావించుకున్న అగ్రాహ్య శ్రీహరి దర్శనమాహాత్మ్యవైచిత్రి...!

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాల్లోని వచనం...
"చూపుల శ్రీపతిరూపము త్రాగి త్రాగి...." అన్నచందంగా,
ఆకలిదప్పికలను కూడా మైమరపించిన ఆ స్వామివారి ఆపాదతలమస్తక దర్శనంలోని మహిమను కొంతలోకొంతైనా వర్నించాలంటే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి "గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు" అనే సంకీర్తనలో ఆ భావమధురిమను విజ్ఞ్యులు గ్రహించవచ్చు.....

" నిలుచున్నా(డిదె నే(డును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుం(డీతదు
కలడు గలడితని(గని మనరో "

[ https://annamacharya-lyrics.blogspot.com/2007/03/158govimdadi-nmochcharana.html?m=1 ]

ఆనాడు భాసించిన స్వామివారి శ్రీవత్స చిహ్నం ఎంతగా నా మదిలో ఎదలో కొలువైయ్యిందంటే, నిద్రలో లేపి అడిగినాసరే ఆనాటి  శ్రీవత్సభూషిత శ్రీశ్రీనివాసుణ్ణి నేను అదే తన్మయత్వంతో ఇప్పటికీ మరియు ఎప్పటికీ వర్నించగలను....☺️

వివిధ శ్రీలక్షీతత్త్వాన్ని తన అప్రాకృత సాలిగ్రామ దివ్యతిరుమేనిపై ఆపాదతలమస్తకమూ వసింపజేసుకున్న శ్రీశ్రీనివాసుడి వైభవాన్ని వర్నించాలంటే, శ్రీత్యాగరాయ వంటి మహనీయులకే అది చెల్లును.....
ఈ క్రింది త్యాగరాయకృతిలో కొలువైన శ్రీవేంకటపరతత్త్వ ద్యుతిలోని శ్రీలక్ష్మీవైభవం విజ్ఞ్యులకు ఆనాటి నుండి ఈనాటివరకు కూడా సదా మననీయమైన మధురిమే...

ప. వేంకటేశ నిను సేవింపను పది
వేల కనులు కావలెనయ్య

అ. పంకజాక్ష పరిపాలిత ముని జన
భావుకమగు దివ్య రూపమును కొన్న (వేంక)

చ1. ఎక్కువ నీవని దిక్కుల పొగడ
అక్కర కొని మది సొక్కి కనుగొన
నిక్కము నీవే గ్రక్కున బ్రోవు
తళుక్కని మెరసే చక్క తనము గల (వేంక)

చ2. ఏ నోము ఫలమో నీ నామామృత
పానము అను సోపానము దొరికెను
శ్రీ నాయక పరమానంద నీ సరి
కానము శోభాయమానాంఘృలు గల (వేంక)

చ3. యోగి హృదయ నీవే గతియను జన
భాగధేయ వర భోగీశ శయన
భాగవత ప్రియ త్యాగరాజ నుత
నాగాచలముపై బాగుగ నెలకొన్న (వేంక)

[ https://thyagaraja-vaibhavam.blogspot.com/2009/03/tyagaraja-kritis-alphabetical-list.html?m=1#V ]

సకలవైభవలక్ష్మీసహితంగా విరాజమానమైన శ్రీభూసమేతశ్రీశ్రీనివాసుడి అనుగ్రహంతో, భక్తులెల్లరి జీవితాల్లో ఈ దీపావళి పర్వం శ్రీమహాలక్ష్మి అనుగ్రహసంవృద్ధిని కలిగించాలని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ 2023 దీపావళి పండగ శుభాభినందనలు....🙂
🍨🍒🍇🌾🌻🌟✨🎉🎂🍕🥧🍧🍿💐🍧
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం
శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేదనిశం.....



No comments:

Post a Comment