శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి వైదేహీప్రాణనాధం..... 🙏😊
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణరామాయణ ప్రవచనాంతర్గతంగా అవధరించిన కొన్ని ప్రత్యేకమైన సంఘటనల్లో విశదీకరించబడిన
" రామో విగ్రహవాన్ ధర్మః....." అని కొనియాడబడే శ్రీరాముడి యొక్క ధర్మనిరతిని, షోడశసద్గుణాలంకృతమైన మహోన్నతవ్యక్తిత్వాన్ని, సాటిలేని బలపరాక్రమాలను, సౌజన్యానికి నిలయమైన అనుపమాన సౌశీల్యత్వాన్ని, కోమలకర్కశత్వ సమ్మిళితమైన తన నడతను, ప్రతి మజిలీలో తన ఆచార్యులు గురుదేవులు అనుగ్రహించిన శక్తియుక్తులను పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకుంటు వినియోగించడంలో సాగించిన కర్తవ్యనిర్వహణాశైలిని ఒకసారి నెమరు వేసుకుంటే,
" అరిషడ్వర్గమైన కామక్రోధాదులను పూర్తిగ నిర్మూలించేసి జీవించండి......" మొదలైన వాక్యాలతో నిత్యం సమాజంలో ఉండి సాగించవలసిన లౌకిక జీవిత పయనానికి కుదరని రీతిలో ఆధ్యాత్మికత గురించి అర్ధరహితంగా వ్యాఖ్యానించేవారికి మరియు ఈనాటి ఆధునిక యాంత్రిక రోగభరిత నిత్యసంఘర్షణాత్మకమైన కల్మషపూరిత కలియుగ జీవనశైలికి ఏమాత్రం పొసగని రీతిలో ఆధ్యాత్మిక సాధనకు మరియు దైవతత్వానికి కొత్త కొత్త వింత గీతోపాఖ్యానాలు చేసే
శుష్కవేదాంతులకు, మెట్ట వేదాంతులకు, ఆదికావ్యమైన శ్రీరామాయణం ఆనాడే ధీటైన సమాధానం చెప్పింది..... అది సద్గురువుల బోధల్లో ఆలకించి సద్విమర్షనాత్మకంగా తర్కిస్తే తెలియని ధర్మంలేదు, తెలపని తత్వం లేదు.....
ఎల ఉండాలో తెలిపేది రామాయణం....
ఎల ఉండకూడదో తెలిపేది మహాభారతం......
ఏం చేస్తే తరిస్తామో తెలిపేది శ్రీమద్భాగవతం......
అని పెద్దలు చెప్పే ప్రకారంగా చూసినా సరే ఆదికావ్యంలో మనకు కావలసిన ధర్మాధర్మాలు, ధర్మసూక్ష్మాలు, తాత్వికసమన్వయాలు, తత్వబోధలు, కోకోల్లలు.......
మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒక వ్యక్తి కనిపెట్టి
లోకానికి బోధించవలసిన విషయాలు అసలు లేవనే అనాలి......
లేదా శ్రీమద్రామాయణం పూర్తిగా వినకుండా / ఆకళింపు చేసుకోకుండా చేసే బోధలు సదరు వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అవగాహనారాహిత్యానికి, అర్ధరహిత కుతర్కానికి, కుటిలత్వానికి ప్రతీక అని అనవలసిఉంటుంది......
బుద్ధిని ఆలంబనగా చేసుకొని వాక్కును దివ్యాస్త్రంగా మలిచి జీవించే సర్వోత్కృష్ట ప్రాణి మనుష్యజీవి..... అటువంటి మనుష్యౌపాధిని స్వీకరించి భువికి దేవకార్యం నిమిత్తమై అవతారం స్వీకరించి తరలివచ్చిన పరమాత్మ యొక్క విశేషమైన అవతారం శ్రీరామావతారం.......
ప్రత్యేకించి హరిహరులు ఇద్దరు కలిసి
నరవానరులు గా భువిపై నడయాడి ధర్మస్థాపన గావించడానికై సాగించిన ప్రయాణం కాబట్టి శ్రీమద్రామాయణం, మరే కావ్యము
సరితూగలేనంతటి, శిఖరాయమానమైన వైభవంతో నదీనదములు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఈ భూమిపై తన ఘనకీర్తిని దిగ్దిగంతములకు వ్యాపింపజేస్తూ ఎల్లరికి శుభములను అనుగ్రహిస్తూనే ఉంటుందన్నది ఎందరెందరో పెద్దలచే, భాగవతోత్తములచే రూఢమైన సార్వకాలిక సత్యం......
హార్వర్డ్, స్టాన్ ఫర్డ్, ఐ.ఎస్.బి వంటి ఉన్నతశ్రేణి విశ్వవిద్యాలయాల్లో బోధించే యాజమాన్యనైపుణ్యవికాస పాఠాలు, వ్యక్తిత్వ వికాసపాఠాలకు ఎన్నోరెట్లు అధికమైన అత్యున్నతమైన మ్యానేజ్మెంట్ స్కిల్ల్స్, ఇంటర్ పర్సనల్ / సాఫ్ట్ స్కిల్ల్స్ శ్రీమద్రామాయణం మనకు రెండు యుగాల క్రితమే అందించింది....
కాకపోతే, ఎంతో కష్టపడి, ఎన్నో డబ్బులు పోసి కొంటేనే ఆ పెద్ద పెద్ద జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ని బోధన అందుకోగలిగేది.....
అట్లే ఎంతో కష్టపడి సద్గురువుల బోధలను శ్రద్ధాభక్తులతో ఆలకించి శ్రీమద్రామాయణాన్ని అవధరించగా అందులో నిక్షిప్తమైన ఆ విద్యలన్నీ మనకు కరతల ఆమలకములవుతాయి అనేది అధ్యాత్మ జగత్తులో విహరించే వేదాంతులెల్లరికి ఎరుకపడే సత్యం.....
శ్రీచాగంటి సద్గురువులు ఉటంకించినట్లుగా రామాయణాన్ని శ్రీరాముడి దివ్యత్వపు చరితము గా కాకున్నా, కేవలం ఒక నరుడి కథగానే వినండి...
అందులో రాముడు నిర్వహించే ప్రతి కర్తవ్యం ఒక ధర్మయజ్ఞ్యమే....
రాముడు వేసే ప్రతి అడుగు కూడా ఒక ధర్మసోపానమై పరిఢవిల్లే శైలిని మనం జాగ్రత్తగా పరికించి తర్కించి తత్వసమన్వయం కావిస్తే ఔరా ఎంతటి ఘనమైనది రాముడి అయనం అని అనిపించకమానదు.....
( Moreover there is no equivalent word in English that can be used to substitute
" dharmam " and thus SriRaamayanam has no parallel whatsoever which is an embodiment of SreeRaamaa's personified
" dharma deavataa swaroopam " despite being a human being's story of how he was successful in fulfilling his aspirations with the help of his Gurus' teachings and blessings.... )
చాలమంది కొన్ని చోట్ల రాముడి కార్యనిర్వాహక శైలి ఏ విధంగా ధర్మచట్రంలోకి ఒదిగింది అనే సత్యాన్వేషణలో తడబడుతుంటారు.....
రాముడు మరోలా చేసిఉండొచ్చు కదా...ఇలా ఎందుకు చేసాడు....
ఇత్యాదిగా ఉండే సంశయాలను కాసేపుపక్కనబెట్టి, పోతపోసుకున్న ధర్మస్వరూపమైన రాముడి ఫలానా కార్యం ఏ విధంగా సమన్వయపరిచి ధర్మపరిధిలోకి తీసుకోవాలి అనే దృక్కోణంలో ఆలోచించిననాడు ఆ వ్యక్తికి వ్యక్తిత్వానికి శ్రీరామానుగ్రహం సమకూరుతుందని అర్ధం.....
ఎక్కడో శ్రీశైల జలవిద్యుత్కేంద్రంలో ఉత్పన్నమవుతున్మ విద్యుత్శక్తి మన ఇంటిలోని ఫ్యాను, బల్బు, టీవీ ఇత్యాది పరికరాల్లోకి రావడానికి ఎన్ని వైర్లు దాటుకొని వస్తుంది, మధ్యమధ్యలో ఎక్కడైనా ఆగుతుందా, ఎవరైనా అది తీగల్లోనుండి తస్కరిస్తున్నరా, అన్ని తీగల్లో సమంగానే విద్యుత్ ప్రసరిస్తుందా, ఇంత సన్న తీగల్లో అంత విద్యుత్ శక్తి ఎలా పారగలదు ఇత్యాది శుష్క తర్కాలతో కాలంగడిపేవారికన్నా.........,
ఎప్పటినుండో ఒక కట్టుదిట్టమైన సరఫరా వ్యవస్థలో భాగంగా వివిధ విద్యుత్ గ్రిడ్లు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వార మన ఇంటికి సరిపడే వోల్టేజ్ లో ( 50Hz, 230v) చేరే విద్యుత్ శక్తిని సరైన విధంగా ఏ వస్తువుకు ఎన్ని యాంపియర్స్ కరెంట్ అందించి మనం ఆ విద్యుత్ శక్తిని మానవసహాయకారిగా మలుచుకుందాము అనే దిశలో సాగే వారికే ఆ శక్తి మేలుచేస్తుంది....
అలా కాకుండా తీగలున్న ప్రతి ప్రాంతానికి వెళ్ళి పట్టుకొని చూస్తేకాని నమ్మను అనే మూర్ఖుడికి ఎంత చెప్పిన అది వ్యర్ధమే....
అచ్చం అదేవిధంగా పుత్రకామేష్టి యజ్ఞ్య ప్రసాదంగా కౌసల్యాదశరథుల ముద్దుల పెద్దకొడుకుగా పునర్వసు ప్రయుక్త చైత్ర శుద్ధ నవమి న జన్మించినది మొదలు 11000 సంవత్సరముల పైచిలుకు జీవించి సాగించిన రామరాజ్యపరిపాలనను లవకుశులకు అప్పగించి సరయు నదీ ప్రవేశం గావించి శ్రీరామావతరాన్ని సమాప్తిగావించిన పర్యంతం శ్రీరాముడి ప్రతి అడుగు కూడా ఈ భూమిపై ధర్మదేవత సాగించిన ప్రయాణమే......!
ఆ సుదీర్ఘ ధార్మిక ప్రయాణంలో అంతర్లీనంగా ఉన్న ధర్మసూక్షములను సద్గురువుల బోధల్లో అర్ధంచేసుకునే వారికి శ్రీమద్రామాయణానుగ్రహం లభిస్తుంది.....
అంటే రాముడి ఫలానా చర్యలో ఉన్న ధర్మము ధర్మసూక్ష్మము ఏమైఉంటుంది .....? అని తర్కించే వారికి శ్రీరామానుగ్రహం ఉంటుందని అర్ధం....
అలా కాకుండా, రాముడి ఫలానా చర్య నాకు అంతగా నచ్చలేదండి.....అది ధర్మం ఎలా అవుతుందండి...? అని కుతర్కం సాగించే వారికి శ్రీరామాయణం అర్ధం కాలేదు..... వారికి శ్రీరామానుగ్రహం ఇంకా లభించలేదు అని అర్ధం......
ప్రతి మనిషిని శాసించే కామక్రోధాది అరిషడ్వర్గం మనుష్యుడు కనుక రాముడికి కూడా వర్తిస్తుంది.....
కాకపోతే రాముడి వశంలో అవి ఉన్నాయికాని వాటి వశంలో రాముడు లేడు.....
శ్రీచాగంటి సద్గురువులు అరిషడ్వర్గ నియంత్రణ గురించి ఇచ్చిన ఒక అత్యత్భుతమైన ఉదాహరణ రాముడికి నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది.....☺
ఒక వేడి పాలగిన్నె ని పట్టుకోవడానికి ఉపయోగించే పటకార మన వశంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ పాలను జాగ్రత్తగా మనకు కావలసినన్ని కావలసిన పాత్రలోకి పోసుకోగలము......
అలా కాకుండా పటకార మనల్ని పట్టుకుని దాని వశంలో మనం ఉంటే అది కుదరని పని......
అట్లే కామక్రోధాధి అరిషడ్వర్గం పటకారలాగ మన వశంలో ఉన్నప్పుడు వాటి ప్రభావం తో ఊగిపోయే వ్యక్తులను "హ్యాండిల్ చేయడానికి" వాటిని ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో వాడాలో అలా వాడి మనం వాటిని ఉపయోగకారిగా మలచవచ్చు.....
అలా కాకుండ మనం వాటి వశంలో ఉంటే ఆ కామక్రోధాదులే మనపై రాజ్యాన్ని సాగిస్తాయి.....
రాముడు ఒక దెగ్గర రాక్షసస్త్రీ ని కర్కషత్వంగా హతమార్చాడు....
మరో చోట సున్నితంగా మందలించి వినకపోతే ముక్కు చెవులు మాత్రమే కోసి పంపించాడు......
ఏమిటి ఇందలి ధర్మము మరియు ధర్మసూక్ష్మము.....?
స్త్రీ అయినా సరే, రాక్షసి గా ధర్మఘాతకి గా మారి సాధుసజ్జనులను సద్బ్రాహ్మానోత్తములను కూడా వదలకుండ దార్లో వచ్చిపోయేవారందరిని హతమార్చి
యజ్ఞ్యయాగాది దేవకార్యములకు విఘ్నాలను కలిగిస్తూ జీవించడమే లక్ష్యంగా ఉన్నందుకు అక్కడ తాటకిని వధించడమే ధర్మం.....
ఏకపత్నీవ్రతుడను అని చెప్పినా వినిపించుకోకుండా తనను మోహించి వేధించిన శూర్పణఖను కేవలం ముక్కు చెవులు కోయించి పంపించివేయడమే సబబు అనే ధర్మాన్ని పాటించకుండా ఇక్కడ కూడా రాక్షసస్త్రీని హతమార్చితే అడిగే వారెవరులేరు మరియు వచ్చే నష్టమేమిలేదు రాముడికి....
ఆ రాక్షసి ఉసిగొల్పిన 14000 ఖరదూషణులతో చేసిన యుద్ధంలో వెనక్కి జరిగి బాణప్రహారం కావించాడు అనే అపవాదు కూడా తప్పేది కద.....
కాని ఎక్కడి ధర్మం అక్కడే అనే సూత్రం రాముడికి బాగ తెలుసుకాబట్టి
తాటకిని నేలకూల్చడమే అక్కడి ధర్మం.....శూర్పణఖకు తగు శిక్ష వేసి పంపించడమే ఇక్కడి ధర్మం.....
( శ్రీరాముడి సఖి జానకి కంటే కూడా తను చాలా అందగత్తె కాబట్టి రాముడు తన దరిచేరాలి అని కామరూపం దాల్చి వేధించిన శూర్పణఖకు కేవలం ముక్కు చెవులు కోసి అందవిహీనం గావించి గర్వభంగం మాత్రమే చేసాడు కాని ఆ ఇంద్రియాలనే తొలగించివేయలేదు రాముడు.... అంటే ఎప్పటిలాగే ఆ రాక్షసి వినగలదు ఊపిరి తీసుకోగలదు వాసన చూడగలదు.... ఇది ఇక్కడ మనం గమనించవలసిన రాముడి చర్యలోని ధర్మసూక్ష్మం.....! )
తన కొడుకే యువరాజు కావాలని, అందుకు అడ్డు అని భావించిన రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపి నిర్ణయించిన ఆ సుముహుర్తానికే భరతుడికి యవ్వరాజ్యపట్టాభిషేకం జరిపించలాని శోకగృహంలో నల్లచీరధరించి నాటకాలాడి దశరథుణ్ణి నానావిధాల సాధించి ఒప్పించి పొందిన వరం కారణంగానే రాముడు దూరమై ఆ శోకాన్ని భరించలేక హృదయవిదారకంగా రోదించి తనువుచాలించిన దశరథుడికి, అరణ్యాల్లో దొరికిన కందమూలాలు తింటూ జీవించడం ప్రారంభించిన రాముడికంటే కూడా
అంతహ్పురంలో ఉన్న భరతుడికే పిండప్రదానం / శ్రాద్ధం పెట్టవలసిన వెసులుబాటు మరియు బాధ్యత ఎక్కువ...
నీమాటే నామాట అనే ధర్మపత్ని మరియు నీమాటే నాకు శాసనం అనే తమ్ముడు మినహ, ఎవరు లేని
అరణ్యంలో ఉన్న రాముడు తను ఉన్న క్లిష్టపరిస్థితుల కారణంగా ఆ క్రియలు చేయకున్నా అక్కడ పట్టించుకునే వారు, అడిగేవారు ఎవరు లేరు....
సశాస్త్రీయంగా అవి జరిపించేందుకు తగిన బ్రాహ్మనోత్తములు కూడా అక్కడ ఎవరు లేరు.....
కాని రాముడికి మాత్రం తన ధర్మం తనకు బాగ తెలుసును కాబట్టి అరణ్యంలో లభించే రేగుపండ్లగుజ్జు మరియు గారపిండిని కలిపి గతించిన తండ్రికి పిండప్రదానం చేసాడు.....
తన వనవాసానికి కారణమైన గతించిన తండ్రిని గురించి మరిచి, వారు బ్రతికుండడానికి ఆ రేగుపండ్లను, గారపిండిని మరునాటి ఆహారానికి దాచుకోవచ్చు....కాని ఎక్కడి ధర్మం అక్కడే కాబట్టి రాముడు తన విహితకర్తవ్యాన్ని ఎవ్వరు చెప్పకున్నా చేసుకుంటూ సాగిపోయాడు.....
పౌలస్త్యుడుని ఒకనాడు తన వాలంతో చుట్టి బంధించి 3 సముద్రాల్లో ముంచి నానాతిప్పలు పెట్టిన వాలికి రావణుడిని సమ్హరించి సీతమ్మను తీసుకురావడం నల్లేరు మీద నడక అని రాముడుకి తెలుసు......
కాని అధర్మపరుడైన రావణుడితో మైత్రిని నెరపి జీవించే వాలి కూడా అధర్మపరుడే కాబట్టి అధర్మపరులతో సంధికుదుర్చుకొని సీతమ్మను తిరిగి తనదెగ్గరికి చేర్చుకోవడం రాముడికి ఇష్టంలేదు కనకనే సుగ్రీవుడితో సంధి కుదుర్చుకొని ధర్మస్థాపనకై వాలిని, ఆ తదనంతరం రాణుడిని సమ్హరించాడు......
ఇక్కడ మనం గమనించ గలిగితే, రాముడు తన కర్తవ్యం కేవలం దూరమైన తన భార్యను తిరిగి పొందడం మాత్రమే అని భావించి ఉంటే వాలి సుగ్రీవుల గొడవను పక్కనపెట్టి, మొదట తన కార్యం కొరకు ఎవరు తగు వీరులు / సహాయకారులు అని ఆ ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపి ఆపై తన కార్యసాధనకు తగు విధంగా నిర్ణయం తీసుకునేవాడు.....
వాలి యొక్క అప్రతిహత బలంగురించి బేరీజు వేసి తన పంచన చేరిఉంటే చెట్టు చాటునుండి వాలి వధ అనే అపవాదు కూడా వచ్చేది కాదు కద....
అలా కాకుండా ధర్మాచరణే ముఖ్యం అని భావించినందువల్లే సుగ్రీవుడి తో కలిసి ముందుకు సాగాడు.....
( అరణ్యంలో సంచరించే మృగాలను, ప్రత్యేకించి ఇతర ప్రాణులను అనవసరంగా పరిధి దాటి ఇబ్బంది పెడ్తూ జీవించే వాటిని వేటలో హతమార్చడం క్షత్రియకలాపం కాబట్టి ఇక్కడ రాముడి చెట్టు చాటు బాణప్రహారంకూడా ధర్మచట్రంలోకి ఇముడుతుంది అనేది ఇక్కడి ధర్మసూక్ష్మం...... )
నిద్రాహారాలు లెక్కచేయకుండ నిరంతరం తనవెంటే ఉన్న తమ్ముడికి ఇవ్వని చిరంజీవిత్వం, భవిష్యద్ బ్రహ్మత్వం, హనుమకు ప్రసాదించాడు రాముడు.....
రాముడికి లక్ష్మణుడు ఎంతో హనుమ కూడా అంతే అనేది జగద్విదితం....
మరి అంతటి సౌభాగ్యం హనుమకు మాత్రమే కట్టబెట్టడం వెనక ఉన్న ధర్మం....?
హనుమ రాకపోతే అసలు సీతమ్మ జాడ కనిపెట్టడం, సంజీవని పర్వతం తెచ్చిన హనుమ సహాయంతో లక్ష్మణుడు సహా ఎందరో వానరవీరులు పునహ్జీవుతులు కావడం, కొరకరాని కొయ్యలా మారిన
మేఘనాథుణ్ణి వధించడం, తన విహిత కర్మాచరణమైన శరప్రహారాన్ని దేవకార్య సిద్ధికొరకై రావణవధకు అనుకూలంగా హనుమ ప్రార్ధనమేరకే వాయుదేవుడు సవరించి రావణవధకు కారణమవ్వడం, ఇత్యాదిగా అసలు హనుమ లేని నాడు రాముడిని విజయం వరించడం కడుదుర్లభం అనేది ఇక్కడి ధర్మసూక్ష్మం....
( త్రిపురాసుర సమ్హారంలో రుద్రునకు
రమానాథుడు ఒనరించిన సహాయానికి ప్రతిగా చేసిన ప్రతినకు, అపర రుద్ర తేజస్సుగా ప్రభవించిన హనుమకు అది అవశ్యమే అయ్యుండొచ్చు కాని నరవానరుల ప్రయాణంగా సాగిన కథలో వానరునకు నరుడు కీర్తిని కట్టబెట్టడంలోనే ధర్మం మరింత దేదీప్యమానంగా తన వైభవాన్ని చాటుతుంది అనేది అవ్యక్త అధ్యాత్మ సత్యం.....)
కాబట్టే హనుమకు అంత ఘనకీర్తిని కట్టబెట్టాడు రామయ్య......
ఇలా చెప్పుకుంటూ పోతే రాముడికి, ఎప్పుడు ఎక్కడ ఎవరికోసం ఎలా ఎందుకు ఉండాలో అనేది కొట్టిన పిండి....
ఎవరిని ఎందుకు అభిమానించాలో,
ఎవరిని ఎందుకు ఎక్కడివరకు ఆదరించాలో,
ఎవరిని ఎందుకు ఆమడ దూరంలోనే పెట్టాలో,
పూర్వభాషీ, స్మిత భాషీ, మిత భాషీ, హిత భాషీ, మృదు భాషీ అయిన రాముడికి వెన్నతో పెట్టిన విద్య....
అందుకే ఆయన మర్యాదా రాముడయ్యాడు....
మరియాదా పురుషోత్తముడయ్యాడు....
మాన్యుడయాడు....మహనీయుడయ్యాడు....
"రామాయణమహామాలారత్నం వందే అనిలాత్మజం...." అని కొనియాడబడే సుందరుడికే ఆరాధ్య దైవమై.....
యావద్ జగత్తుచే జేజేలు పొందిన
జగదభిరాముడైనాడు....ఆ సీతారాముడు......శ్రీరాముడు....సాకేతధాముడు...
కోదండరాముడు........కల్యాణగుణాభిరాముడు.......
ఇక ద్వాపరంలో శ్రీకృష్ణావతారం కూడా సాగించి, ఈ కలియుగ ప్రత్యక్ష దైవమై శ్రీవేంకటాచలాన్నే అయోధ్యగా మలిచి జగత్పాలన కొనసాగిస్తున్న ఆ శ్రీవేంకటరాముడికి
శ్రీరాముడిలా నవ్వడం తెలుసు....
శ్రీకృష్ణుడిలా నవ్వించడమూ తెలుసు....
ముసి ముసి నవ్వులు నవ్వుతూనే అధర్మపరులను, దుష్టులను, సాధుసజ్జనులను పీడిస్తు బ్రతికే
వారిని హరుడై హరించివేయడమూ తెలుసు.......
అందుకే కదా అన్నమాచార్యులవారు ఆ శ్రీవేంకటరాముడిని అంత ప్రేమతో
" సౌజన్య నిలయాయ జానకీశాయ...."
అంటూనే....
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో | వితత వావిలిపాటి వీర రామాయ || " అంటూ కీర్తించారు....