Monday, October 14, 2019

2019 శ్రీ వికారి నామ సంవత్సర కన్యామాస (ఆశ్వయుజం) సాలకట్ల బ్రహ్మోత్సవ దివ్యమంగళస్వరూపసందర్శనాసౌభాగ్యానుగ్రహO .... :)

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోకసర్వజ్ఞ్యశక్తనతవత్సలసర్వశేషిన్న్
స్వామిన్ సుశీలసులభాశ్రితపారిజాత శ్రీవేంకటేశచరణౌశరణంప్రపథ్యే.....🙏😊
అనికదా నిరంతరం కొన్ని కోట్ల గొంతుకలు స్వామిని స్తుతిస్తూ మేల్కొల్పేది.......
శ్రీనివాసుని అసంఖ్యాకమైన దివ్యవిభూతులు ఎన్ని ఉన్నా సరే, పైన శ్లోకంలో పేర్కొనబడిన
" కృపాజలనిధే " , " సులభాశ్రితపారిజాత " అనే గౌణములు ప్రస్ఫుటంగా స్వామి ప్రదర్శిస్తు ఈ కలియుగ ప్రత్యక్షదైవమై కొలువైఉండడంవల్లే ఏడుకొండలకు కోటానుకోట్ల భక్తులు నిరంతరం స్వామి క్రీగంటి కరుణాకటాక్షవీక్షణాలకై తండోపతండాలుగా తరలివస్తుంటారనే ప్రత్యక్ష సత్యాన్ని మనం నిరంతరం చూస్తూనేఉన్నాం కదా.....
కాని కొందరు మాత్రం ఆ స్వామి యొక్క నిర్హేతుక భక్తవాత్సల్యానికి, భువనసమ్మోహనమైన దర్శనసౌభాగ్యానికి బంధీలై తమ సర్వస్వం శ్రీనివాసుడే అనే సర్వస్యశరణాగతితో జీవించడం,
మరి కొందరు కేవలం " మమ " అనేసి ఆ తీర్థయాత్ర ఏదో ఒక సగటు ప్రయాణంలా భావించి తిరిగి తమ నిత్య లౌకిక జీవితంలో మునిగిపోవడం మనం చూస్తూనే ఉంటాం...... అంటే ఆ దివ్య అప్రాకృత శ్రీవైష్ణవభక్తిసిరులు అనే ఆధ్యాత్మిక విరులపరిమళాలు సోకకుండా సాగే లౌకిక సంసారంలో తిరిగి యథావిధిగ తలమునకలవుట.....
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాలు, ప్రత్యేకించి కళ్ళకుకట్టినట్టుగా మనమున్న చోటనే శ్రీనివాసుణ్ణి దర్శింపజేసే వారి
" శ్రీవేంకటేశ్వర వైభవం " ప్రవచనాంతర్గంతంగా అవధరించిన అధ్యాత్మ సత్యాలను ఆలంబనగా గావించి స్వామివారి పరమాద్భుత సందర్శన సౌభాగ్యాంతర్గత కరుణాకటాక్షవీక్షణావైభవాన్ని కొంతమేర విశదీకరించే చిరు ప్రయత్నం గావిస్తాను......😊
" కృపాజలనిధే " అంటూ స్వామివారిని,
నువ్వు అమేయమైన కృపాగంగకు నిలయమైన మేఘంవంటి వాడివి అని కీర్తించడం స్వామి యొక్క సహజమైన కారుణ్యతత్వాన్ని ఆవిష్కరించడం.
బాగా జలసిరిభరితమైన ఒక నల్లమబ్బు తాను ఉన్నచోటితో సంబంధంలేకుండా ఆ తీయని జలాన్ని వర్షించేయడమే తన స్వభావంగా సాగుతు, మొత్తం నీరంతా కురిపించినతర్వాత తెల్లని దూదిపొరల్లా తేలికపడి హాయిగా వినువీధుల్లో తేలిపోతుంది.....
స్వామివారు కూడా అంతే, కొండెక్కి తనవద్దకు వచ్చి
" పాహి శ్రీనివాస..... దేహి చిద్విలాస...."
అంటూ తనను అర్ధించినవారెల్లరికి తన అనుగ్రహన్ని అలా కురిపించి, మనస్పూర్తిగా భక్తుడు పెట్టిన ఒక్క దండానికి, అర్పించిన ఒక్క కాసుకి, ఎంతో సంతోషించి తన తెల్లని పలువరస కనిపించకుండా మందస్మితుడై నవ్వుకుంటాడు......😊
అందరికి అందివ్వబడింది అదే అనుగ్రహమైనప్పుడు ఒక్కొక్కరికి అది ఒక్కోలా ఒక్కో స్థాయిలో అందిరావడం వెనక ఉన్న ఆధ్యాత్మిక పరమార్ధమేమి అనగా....
ఆ అందిపుచ్చుకున్న దైవానుగ్రహాన్ని " గురుభక్తి " అనే అగ్నిహోత్రంతో అనుసంధానించిన నాడు మనకు ఉపయుక్తంగా సద్యోశ్రేయోదాయకంగా ఆ దైవకృప ఒప్పారుతుంది.......
మనయొక్క దైవభక్తి / గురుభక్తి సాంద్రతకు అనుగుణంగా ఆ అనుగ్రహం మన జీవితాలకు అందివచ్చి పరిపూర్ణంగావిస్తుంది.......
అది ఎట్లనగా ఈ క్రింది ఒక చిన్న లౌకిక ఉదాహరణద్వార తెలియజేస్తాను.......
బాగ జలుబు దగ్గు తుమ్ములతో సతమవుతూ ఉన్న వ్యక్తి దెగ్గర మంచినీళ్ళు, చింతపండు, కరివేపాకు, మిరియాలు, ఉప్పు, పోపులడబ్బా ఉండడం ఒకెత్తైతే......
వాటిని సరైన మోతాదులో మేళవించి, అంటే కడాయిలో నూనే పోసి ఆవాలు జీలకర్ర మిర్చి పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఇత్యాదులతో పోపు పెట్టిన తర్వాత నీళ్ళలో నానబెట్టిన చింతపండు రసంతీసి నీళ్ళలోకి కలిపి అందులో పోసి కొన్ని మిరియాలు దంచి అందులో వేసి బాగా మరగబెట్టిన తర్వాత వచ్చే మిరియాల చారు / రసమే తన రుగ్మతకు దివ్యౌషధంగా ఉపయుక్తమైనట్టుగా,
బుద్ధికుశలతతో గడించిన ఆధ్యాత్మిక వస్తుసామాగ్రి మనవద్ద ఎన్ని ఉన్నా, దైవదర్శనానికి కావలసిన టికెట్లు, సదుపాయాలు ఎన్ని ఉన్నా, అవన్నీ ఏ విధంగా ఎప్పుడు ఏ మోతాదులో రంగరించి భక్తి సాంద్రత అనే అగ్నిహోత్రతీవ్రతపై కొలువైన మనసు అనే పాత్రలో పచనం కావించబడి మన భవరుగ్మతలకు కావలసిన భగవదనుగ్రహౌషధములు తయారు చేసుకోవచ్చో చెప్పే గురువాక్కుల అనుసంధానమే ఇక్కడి అధ్యాత్మనిఘూడత......
ఇక " సులభాశ్రితపారిజాత " అనే శ్రీనివాసుని దివ్యవిభూతిని వర్ణించడం ఒక విచిత్రమైన విషయమే.....
ఎందుకంటే ఎంతో వ్యయప్రయాసలకోర్చి కాలినడకన కొండెక్కి తనవద్దకొచ్చే ఒక సగటు మధ్యతరగతి జీవితపు సామాన్య భక్తుడు మరియు అధికార ఐశ్వర్యాలతో తులతూగుతూ, పెద్ద పెద్ద బంగ్లాల్లో బసచేసి ఖరీదైన కార్లలో వచ్చి రాంబగీచా దెగ్గరదిగి వీఐపి బ్రేక్ దర్శనంలో తన వద్దకు వచ్చే సదరు సంపన్నవర్గపు భక్తుడికి, శ్రీనివాసుడు ప్రసాదించేది ఒకే దర్శనం, ఒకే దరహాసం కదా....
మరి సులభాశ్రితపారిజమై ఉండే స్వామివారి తత్వం మనకు ఎక్కడ గోచరిస్తుంది అనే ప్రశ్నరాకమానదు కద....
ఇక్కడే దాగుంది స్వామివారి శ్రీవైష్ణవమాయ మొత్తం.....!
అందరు వచ్చి దర్శించేది ఆ రోజు తను అలకరించుకున్న ఒకే దివ్యమంగళస్వరూపాన్ని......
కాని ఏ భక్తులపై తన అమృతేక్షణములు కురిపించి
వారి దురితకర్మలను క్షయింపజేసి
వారికి పుణ్యబలాన్ని ఆపాదిస్తున్నాడన్నది కేవలం తనకు మాత్రమే తెలిసిన అధ్యాత్మమర్మం అది...... కర్మసిద్ధాంతానికి కారకుడైన ఈశ్వరుడికి మాత్రమే ఆ కర్మను లయింపజేసే అధికారంకలదు...... అన్యులకు
కేవలం దాన్ని వివిధ కోణాల్లో తర్కించడం వరకు మాత్రమే సాధ్యమయ్యే కడు గహనమైన సిద్ధాంతమది......
అంటే కేవలం కొన్ని క్షణాల పాటు ఒక భక్తుడికి ప్రసాదించిన తైజసాత్మిక దర్శనంలోనే స్వామి తన క్రీగంటి చూపులతోనే ఇన్ని పనులను ఏకకాలంలో చక్కబెట్టెస్తున్నాడా అంటే అవును అనే కద అర్ధం.......
అంటే ఆర్తిగల భక్తుల దురితాలను అంతే ఆర్తితో ఆ కర్మశేషాన్ని క్షయింపజేసి వారి ఉన్నతికి కావలసిన పుణ్యబలాన్ని కట్టబెట్టి ఆ భక్తులను అనుగ్రహించి,
ఇంకొందరు భక్తులు కేవలం ఏదో రావాలనో లేదా వీఇపి బ్రేక్ దొరికిందనో లేదా మరేదో ఇతర పుణ్యకర్మసంచయబలం కొద్దీ రాగా వారిని యథావిధిగా మందస్మితుడై చూసి ప్రసాదం ఇచ్చి పంపించడం అని ఇక్కడ భావించడం తగునా...? అని అనడం / అనుకోవడం కంటే......
ఆ దైవాధీనమైన అనుగ్రహవిశేషాన్ని సరైన రీతిలో
సమన్వయపరచుకొని సమాధానపడడం సర్వశ్రేయోదాయకం......
అంటే ఇక్కడ ఉన్న రహస్యం మొత్తం స్వామివారి అనుగ్రహప్రసరణలో ఉన్నదని మనం గమనించవలసి ఉంటుంది........
బయట ఎండలో బిల్డింగ్ పై ఉన్న అన్ని కాగితాలపై సూర్యుడి ఎండ సమంగానే పడుతుంది......
కాని ఏ పేపర్లపై మనం ఒక
" మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ " పెడతామో వాటిపై మాత్రమే పడే సూర్యకిరణాలన్నీ కేంద్రీకరణంచెంది క్షణాల్లో అవి తీవ్రంగా వేడెక్కి వాటిపై అగ్ని జనించి సమూలంగా అవి భస్మమైపోతాయి.......
ఇక్కడ ఎవరు ప్రత్యేకించి అగ్గిపెట్టె వాడలేదు..... నిప్పు రాపాడించనులేదు..... కాని క్షణాల్లో అంతటి శక్తి ఎలా ఉత్పన్నమైంది అంటే అది కేవలం సూర్యకిరణాలకేంద్రీకరణవల్ల......
అచ్చం ఇదేవిధంగా, సదరు భక్తుడి ఆర్తి అనే
" మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ " కి అణుగుణంగా ఆ పరమాత్మయొక్క అనుగ్రహవీక్షణములు క్రమక్రమంగా
ఆ శరీరధారి యొక్క
అన్నమయ
ప్రాణమయ
మనోమయ
విజ్ఞ్యానమయ
ఆనందమయమనే
పంచకోశాలను భేధించుకొని పంచభూతాల సంఘాతమైన ఈ పాంచభౌతిక స్థూల శరీరంతో సంబంధంలేకుండా, హృదయమండలంలో
కొలువైన జీవుడిని నేరుగా స్పృశించే ఆ శ్రీవైష్ణవమహత్తు మానవ మేధోపరిధికి అందే భౌతిక విజ్ఞ్యానానికి ఎన్నో రెట్లు అధికమైన అత్యున్నతస్థాయికి సంబంధించిన తేజోవలయాల దీర్ఘవృత్తపు పరారుణకాంతుల పారామార్ధిక తత్వసంబంధమైనది......
జీవ స్థాయిలో మనం ఇక్కడ మాట్లాడినప్పుడు పక్క పక్కనే దర్శనం Q లైన్లో ఉన్న ఇరు జీవులపై
ఉండే ప్రభావంలో అంత భేదం ఉండడం ఎలా సంభవం అని కొందరికి సంశయం కలగవచ్చు......
ఒక చిన్న లౌకిక ఉదాహరణలో మనకు ఆ సమాధానం సులభగ్రాహ్యం అవుతుంది......
ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుట్టి కాళ్ళకి అసలు సేద్యపు మట్టి అంటకుండా పెరిగిన వాళ్ళకి అంతగా అర్ధం కాకపోవచ్చుగాని.....
సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితనేపథ్యం కలిగి పుడమితల్లి అనుగ్రహంతో పంట పొలాలు, వ్యవసాయం ఇత్యాదివాటిపై కొంత అవగాహన కలిగినవారికి బాగా అర్ధమవుతుంది ఈ విషయం.....
గడ్డిజాతికి చెందిన మొక్కలు చాలారకాలు ఉంటాయి..... గొడ్లకు గడ్డి / పశుగ్రాసం గా వాడే శెలకల నుండి మొక్కజొన్న చెట్లవరకు
చాలా రకాలుగా ఉంటాయి...
నా ఇంటర్మీడియట్ 1 వ సంవత్సరంవరకు కూడా మాది ఒక చిన్న రెండు రేకులరూముల ఇల్లు....
మిగతా ఇంటి చుట్టూ ఉన్న మట్టిలో ఎన్నో మొక్కలు చెట్లు పెంచేవాళ్ళం..... అందులోమొక్కజొన్న కూడా వేసేవాళ్ళం.......
మొదట్లో అవి కూడా చిన్నచిన్న గడ్డిపరకల లాగా మొలకలొచ్చి క్రమక్రమంగా ఏపుగా పెరిగి కాండానికి ఆకులకు మధ్య ఉండే సందుల్లో కంకులు కాయడం, ఒక్కో చెట్టుకు గరిష్టంగా ఏకకాలంలో 5 వరకు కూడా కంకులు రావడం బాగ గుర్తు....
మొక్కజొన్న చెట్లు చూడ్డానికి మాత్రం సన్నగా ఉండి తేలికపాటి గాలికి కూడా ఊగిపోయే ఆకులతో పెరుగుతాయి...... కాని వాటి ఆకులు మాత్రం చాల పదునైనవి.....అజాగ్రత్తగా చెయ్యివేస్తే వేళ్ళను కోసిపారేసేంతటి పదును వాటి సొంతం.....
అట్లే భూమిపొరల్లోకి చొచ్చుకుపోయే వాటి వేర్లు కూడా
చాల బలమైనవి....... వాటి సాంద్రత ఎంత ఘనమైనదంటే ఒక ఎండిపోయిన మొక్కజొన్న చెట్టుని కాండంవరకు విరిచెయ్యగలరేమో కాని వేర్లతో సహా పెకిలించడం అంత సామాన్యమైన విషయం కాదు..... వాటిని హ్యాండిల్ చేయడంలో ఎన్నో సార్లు అరచేతులు కోసుకుపోయి మోచేతులకు దెబ్బలు తగిలించుకున్న వాడిని కాబట్టి ఒక రైతు యొక్క దృక్కోణంలో వాటి బలమంటే ఏంటో దృఢత్వమంటే ఏంటో నేను చెప్పగలను.....
వాటిపై అవగాహన లేని వేరొకరు,
పక్కన అదే నేలలో పెరిగిన ఇంకో గడ్డిచెట్టుని మరియు మొక్కజొన్న చెట్టుని చూడ్డానికి ఒకేలా ఉన్నాయికాబట్టి రెంటికి ఒకే విధంగా బలాబలాలు ఉంటాయి అని అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో......,
అచ్చం అదే విధంగా ఒకే శక్తిపుంజం ముందు పక్క పక్కనే నిలబడిన ఇరు జీవులు ఒకే మనుష్య జాతికి చెందిన వారైనా సరే, వారి వారి భక్తి సంస్కారబలానికి అనుగుణంగా పొందిన ఆంతరంగిక అనుగ్రహసంపాకము కేవల మాంసనేత్రాలకు అందే భౌతిక విషయం కాదు......
అధ్యాత్మ యోగశాస్త్రాలపై అమితమైన పట్టున్నవారికి అర్ధమయ్యే సత్యం అది....... అనగా సద్గురువుల బోధల్లో మాత్రమే కానవచ్చే సర్వేశ్వర తత్వమది....!
అందుకే ఇక్కడ స్వామివారిని ఎల్లరికి సులభుడు అని అనలేదు .....తనను భక్తితో ఆశ్రయించిన వారికి మాత్రమే " సులభాశ్రితపారిజాతం " వంటివాడు అని పేర్కొనారు..... 😊
అందుకే అన్నమాచార్యులవారు ఆ మూర్తీభవించిన దైవికపు సజీవచైతన్యరాశిని
" అలరిన చైతన్యాత్మకు డెవ్వడు " అంటూ తమ
" వేదం బెవ్వని వెదకెడివి " సంకీర్తనలో కొనియాడారు..... 😊
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/347vedam-bevvani-vedakedivi.html?m=1
స్వామి వారి 2019 శ్రీ వికారి నామ సంవత్సర కన్యామాస (ఆశ్వయుజం) సాలకట్ల బ్రహ్మోత్సవాంతర్గత శ్రవణానక్షత్ర ప్రయుక్త భౌమవాసరపు దివ్యమంగళస్వరూపసందర్శనాసౌభాగ్యానుగ్రహన్ని సమకూర్చిన సద్గురువాక్కులకు శ్రీనివాసుని శ్రీయుత దృక్కులకు నమస్కరిస్తు స్వామి వారి శ్రీపాదపద్మములకు ఒక భక్తుడి చిరుకవనకుసుమాంజలి..... 😊🙏

No comments:

Post a Comment