శ్రీవేంకటాద్రిసమంస్థానంబ్రహ్మాండేనాస్తికించన
శ్రీవేంకటేశసమోదేవోనభూతోనభవిష్యతి......
అని కదా శ్రీవేంకటాచలమహాత్యం మనకు కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని భూవైకుంఠ క్షేత్రమాహాత్మ్యాన్ని విశదీకరిస్తుంది......
అదే మన లౌకిక భాషలో సింపుల్ గా చెప్పాలంటే
" శ్రీనివాస...., సరిలేరు నీకెవ్వరు.....!! "
మొన్న నేను, హరిత ఇద్దరం సంక్రాంతి స్పెషల్ రిలీస్
ప్రిన్స్ మహేష్ లేటెస్ట్ మూవి " సరిలేరు నీకెవ్వరు...."
చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఇండియన్ ఆర్మీ కథాంశ నేపథ్యంతో తెరకెక్కించిన ఆ చిత్ర సన్నివేశాలకు అబ్బురపడి నిజంగా మన జీవితంలో అన్నిరకాల ప్రశాంతత ఉంది అని అనగలగాలి అంటే "దేశం నలుదిశలా జవాన్, దేశం నలుదెశలా కిసాన్...." ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యేది......
ఈ ఇద్దరు ఎంతగానో శ్రమిస్తే తప్ప ప్రతి రోజు మనం పూజ సమాప్తి గావించెటప్పుడు పఠించే
" ఓం శాంతిః శాంతిః శాంతిః...."
అనే ప్రశాంతజీవనం ఎవ్వరికైనా లభించేది.....
సమాజం లోని వంద కోట్ల ప్రజలు వందలాది వృత్తుల్లో తమ తమ జీవన ప్రస్థానం కొనసాగిస్తూంటారు.....
ఆ వందలాది వృత్తుల్లో ప్రత్యేక గౌరవం మాత్రం కేవలం 3 వృత్తులవారికి ఇవ్వడమనేది మనం సాధారణంగా గమనించే సార్వకాలిక సత్యం....
రైతు - పంట పండించని నాడు మనకు అసలు జీవనమే లేదు......
జవాన్ - గస్తి కాస్తు శత్రుమూకలను
మట్టుపెట్టని నాడు మన జీవితానికి భద్రతే లేదు....
ఉపాధ్యాయులు - బాల్యం నుండి విద్యాబుద్ధులు నేర్పించి మన జీవితాలకు సార్ధకతను ఒసగినందుకు....
హలం పోటు తో కొన్ని వేల ప్రజలకు ఆహారాన్ని అందించే రైతు......
తూటా పోటు ని భరించి కొన్ని వేల ప్రజలకు రక్షణ కలిగించే జవాన్....
కలం పోటు తో కొన్ని వేల విద్యార్ధుల భవితను తీర్చిదిద్దే గురువులు.....
ఈ 3 పోట్ల వల్లనే ముప్పూటలా తింటూ బ్రతికే మన జీవితాలు సర్వతోముఖాభివృద్ధితో పరిఢవిల్లడం సంభవించేది....
వీరి ముగ్గురిలో జవాన్ దే ఒకింత పైచేయి.....
ఎందుకంటే అన్ని ప్రతికూల పరిస్థితులకు ఎదురునిలిచి తమ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేయడం వల్లే అటు దేశానికి ( అంటే ఒక దేశాన్ని నడిపించే రాజకీయ, న్యాయ, వ్యాపార, రక్షకభట, ఇత్యాది వ్యవస్థలన్నిటికి ) ఇటు దేశప్రజానీకానికి పెట్టనికోటలా తమ జీవితాలను మలిచినందుకు....
అటువంటి ఆర్మి కి సంబంధించిన వీర గాధలంటే ఎవ్వరికైనా గౌరవం తో కూడిన అభిమానమే కదా ఉండేది......
గన్నులు, బుల్లెట్లు, కత్తులు, మిని క్యామెరాలు, బాంబులు, ఇత్యాది యుద్ధ / ఆయుధ పరికరాలు వెంటబెట్టుకొని కాశ్మీర సరిహద్దుల్లో దాగిన శత్రుస్థావరంపై మెరుపు దాడి చేసి బందీలుగా వాళ్ళ దెగ్గరున్న పిల్లలను రక్షించడం లో ప్రిన్స్ మహేష్ నటించిన ఆ సన్నివేశాలు నాకైతే నిజంగా ఔరా అనిపించాయి...
మనల్ని రక్షించే అటువంటి ఎందరో జవాన్ల జీవితాలకు
రక్షగా నిలిచి కాపాడే అసలు సిసలైన వీర జవాన్ మన 7 కొండల గోవిందుడు...!!
శత్రువులతో సాగే యుద్ధంలో విరజిమ్మే తూటాల వర్షానికి రెప్పపాటులో మీదపడే ఆ ఆపదను, తనని నమ్మి కొలిచే భక్తులకు తన సుదర్శన చక్రాన్ని అడ్డుగా వేసి ఆ ఆపదను తప్పించి కాపాడే సద్యో రక్షకుడు శ్రీనివాసుడు...!!
2012 నాటి నా మొట్ట మొదటి తిరుమల శ్రీవారి సేవలో,
అలా శ్రీనివాసుడు రక్షించిన ఒక యుద్ధ వీరుడితో కలిసి స్వామివారిని సేవించడం నిజంగా నా సుకృతం.....
ఆ సమయంలో భారత దేశ రక్షణవ్యవస్థలోని నార్కోటిక్స్ డిపారమెంట్లో ఒక సమున్నతమైన అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు, స్వామి వారి వైభవాన్ని వివరించినప్పుడు ఔరా ఎంతటి ఆపద్బాంధవుడు గోవిందుడు అని అనిపించి వారిని తూటా పోటునుండి తృటిలో తప్పించి కాపాడిన స్వామివారి భక్త రక్షణావైచిత్రికి ప్రణమిల్లి,
ఆ కాలంలో నేను ఎదురీదుతున్న ఈతిబాధల క్లిష్ట పరిస్థితులనుండి నాకు / నా కుటుంబానికి సద్యో రక్షణ కల్పించి కాపాడమని స్వామిని ఎంతగా ప్రార్ధించానో నాకు బాగా గుర్తు.....
[ తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయం దెగ్గర ఉన్న వారి అత్తగారింట్లో, భాగవతార్ శ్రీమాన్ పరిటాల గోపికృష్ణ గారి నేతృత్వంలో అలనాటి శ్రీవారిసేవకోసమై విచ్చేసిన సేవకులందరికీ కాఫీలు, స్నాక్స్ అందించి ఎంతో ఆప్యాయతతో ఆతిథ్యం ఇచ్చి గౌరవించిన
( P & P ) ఆ సర్ కి / మేడం కి మేమందరం ఎప్పటికీ కృతజ్ఞ్యులమే.... ( వ్యక్తిగత గోప్యత దృష్ట్యా వారి వివరాలు వెళ్ళడించడం తగదు కాబట్టి అలా నేను కేవలం P అండ్ P అనే అక్షరం తో వారిని సంబోధించాను....)
సీతమ్మవారిలా ఎంతో మృదుమంజులభాషిని,
పరమ భాగవతురాలైన ఆ మేడం యొక్క అమ్మగారు, ఆ పెద్దావిడ కూడా అంతే పరమభాగవతోత్తమురాలు.......
"ఏం బాబు మొదటిసారి సేవకు వచ్చావ..... మా గోవిందుడి వైభవం తెలుసా......"
అంటూ స్వామి వారి మహిమ్నత గూర్చి ఒక మనవడికి చెప్పిన్నంత ఆప్యాయతతో చెప్పడం ఎప్పటికి మరవలేను.......
ఆ పెద్దవిడ వారి చిన్నతనంలో తిరుమల ఎలా ఉండేదో, వారు దర్శించిన వివిధ తిరుమల తీర్ధాల యొక్క ప్రశస్తి ఎట్టిదో అంతా వివరంగా తెలిపి జీవితంలో వాటన్నిటిని తప్పక సేవించి తరించు అని చెప్పిన ఆ బామ్మ ఇప్పుడు కీర్తిశేషులై స్వామివారి సన్నిధిలో ఉన్నాసరే అటువంటి పరమభాగవతోత్తముల వద్ద విన్న శ్రీవేంకటహరి వైభవవిశేషాలు నిరంతరం ఎదలోతుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి..... ]
ఆ నాడు సేవ ముగిసాక అంగప్రదక్షిణం టికెట్ తీసుకొని అర్ధరాత్రి స్వామిపుష్కరిణిలో స్నానమాచరించి గజ గజ వణికించే ఆ చలిలో స్వామి వారి ఆలయ విమాన ప్రాకారంలో పొర్లుదండాలు పెట్టి వేడుకోవడం జీవితంలో అదే మొట్టమొదటిసారి.....
స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ఆ పొర్లుదండాల సేవ కు స్వామి సంతసించి కల్పించే సద్యో రక్షణకు ఆశ్చర్యం చెంది ఆ తర్వాత చాలా సార్లు స్వామివారికి అంగప్రదక్షిణం చేయడం, ఆ టికెట్ పై ఇచ్చే 1 ఫ్రీ లడ్డు ప్రసాదంతో ఇంటికి రావడం ఆ తదుపరి స్వామి తన భక్తవాత్సల్యం కొలది మమ్మల్ని ఎంతో ఘనంగా కరుణించిన వైనం కేవలం నాకు మాత్రమే అర్ధమైన / తెలిసిన సత్యం....
ఒకసారి తమ్ముడిని కూడా వెంటబెట్టుకొని,
" అలిపిరి పాదాల నడక మార్గంలోని ప్రతి మెట్టుకి కర్పూరం వెలిగిస్తు కొండెక్కి నీకు అంగప్రదక్షిణం చేసుకుంటాము స్వామి....భరించలేని మా కష్టాలనుండి మమ్మల్ని గట్టెక్కించు ప్రభు....." అని ఇంటిదెగ్గర ప్రతిశనివారం దర్శించే శ్రీనివాసుణ్ణి వేడుకొని వెళ్ళినప్పుడు,
అంగప్రదక్షిణం అలవాటులేని తమ్ముడు పొర్లు దండాలు పూర్తయ్యాక అక్కడే కళ్ళుతిరిగి వాంతి చేసుకుని సొమ్మసిల్లాడు......
ఎందుకంటే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో పొర్లుదండాలు అంత వేగంగా పూర్తిచెయ్యాల్సి ఉంటుంది....
భక్తులకు ఉచితంగానే ఇచ్చే ఆ టికెట్ మీలో ఎవరైనా తీసుకొని వెళ్ళిన వారుంటే, వారికి బాగ తెలిసే ఉంటుంది పొర్లుదండాలు పెట్టడం లోని కష్టం మరియు వాటి మహిమ్నత కూడా....
తన దాసుల పట్ల, భక్తభాగవతోత్తముల పట్ల స్వామి వారు ఎంతటి ఘనమైన రక్షకుడో.......
వారిని బాధించే బాహ్యాంతర వైరిసమూహలపట్ల అంతే ఘనమైన వేటగాడు.....!!
అసలే ఆయన శ్రీనృసిమ్హావతారం దాల్చిన కొదమసిమ్హం...!
ఇక ఆ సిమ్హం వేటకు వెళ్తే నిలిచి గెలిచే వారు కలరే ఇహపరముల కలనైనన్....?
తన పంచాయుధములను
( పాంచజన్యం / శంఖం,
సుదర్శనం / చక్రం
శారన్ౙం / ధనస్సు
కౌమోదకి / గద
నందకం / ఖడ్గం )
ధరించి కనుమ నాటి పార్వేట ఉత్సవానికి వెళ్ళే ఆ రాజసం అసలు వర్నించతరం కాదుకద......
తిరుమల పంచబేరాల్లో ఉత్సవమూర్తులైన శ్రీమలయప్పస్వామిని అలా సకల శస్త్రధారిగా దర్శించే భాగ్యం లభించేది కేవలం ఈ పార్వేట ఉత్సవంలో మాత్రమే......
సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి సకల రాజలాంఛనాలతో బ్రహ్మోత్సవంలో ఊరెరిగింపు స్వీకరించే ఆయన పేరే శ్రీవేంకటరాయడు, తిరువేంగడముడయవర్.......
శ్రీరామావతారంలో కేవలం ధనుర్బాణాలు ధరించిన సుక్షత్రియుడిగా అరణ్యాల్లోని వేలకు వేల రక్కసులను తుత్తునియలకింద తెగటార్చిన ఆ ఆరితేరిన వేటగాడికి, ఇక పంచాయుధాలను అందిస్తే అది కేవలం వేట అనబడదు.....
రక్కసులను, శత్రుమూకలను సమూలంగా మట్టికరిపించే ఎదురులేని క్షత్రియుడి దండయాత్ర అనబడుతుంది.......
శ్రీ చాగంటి సద్గురువుల
" శ్రీవేంకటేశ్వరవైభవం " ప్రవచనం విన్నవారికి గుర్తున్నట్టుగా, బంధువులైన శత్రువులు తనపై దాడి చేసినప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామి వారిని శంఖ చక్రాలు తనకు రక్షణగా ఇవ్వమని వేడుకుంటాడు.
స్వామి వారి ఆ 2 దైవిక శంఖచక్రాలు ఒక్కొక్క శత్రువుపైకి ఒక్కొక్క సుదర్శన చక్రంగా రూపుదాల్చి వారందరిని సమూలంగా తుదముట్టించి తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసిన ఆ వృత్తాంతం కలియుగాంతం వరకు భక్తులందరికి కూడా గుర్తుండిపోయేలా తను నిరాయుధపాణిగా శంఖచక్ర రహితుడిగా నిలిచిఉంటానని చెప్పిన
స్వామి వారి భక్తవాత్సల్యతతికి....
మరియు ఆగమశాస్త్రప్రకారంగా పూజాదికాలు అందుకుని భక్తులను కరుణించి రక్షించే మూర్తి అలా శంఖచక్రరహితంగా ఉండకూడదు కాబట్టి, శ్రీవైఖానసాగమ సంప్రదాయ స్థిరీకరణలో భాగంగా అలనాడు శ్రీ రామానుజాచార్యుల వారిచే బంగారు శంఖచక్రాలను ధరింపజేయడం చేత ఇవ్వాళ్టికి కూడా స్వామివారిని " శంఖచక్రధర గోవిందా...." అనే నామం తో మనం స్తుతించడం జగద్విదితం.....
( శ్రీనివాసుడికి ఆచార్యుల స్థానంలో ఉండి శ్రీరామానుజులు అలా శంఖచక్రాలు ధరింపజేసారు కాబట్టి, ఆచార్య శాసనం అనుల్లంఘనీయమైన కారణం చేత ఏఒక్క భక్తుడికి కూడా శ్రీనివాసుడు
శంఖచక్రాలు లేకుండా దర్శనం ఇవ్వడు..... శుక్రవారాభిషేకంలో కూడా అన్ని ఆభరణాలు సడలింపజేస్తారు కాని బంగారు శంఖచక్రాలు మాత్రం స్వామివారు ఎల్లవేళలా ధరించే దర్శనం ప్రసాదిస్తారు ఈనాటికి కూడా.... )
అవ్విధంగా పంచాయుధల్లో ఒక్కొక్క శస్త్రానిది ఒక్కొక్క ప్రశస్తి.....
అలాంటిది మరి ఏకంగా 5 ఆయుధాలను ఒకేసారి ధరించి పార్వేట ఉత్సవంలో భక్తులకు దర్శనం ఇవ్వడంలో తన క్షాత్రలాఘవం ప్రదర్శించడమేనా లేదా మరేమైన అధ్యాత్మ తత్త్వ సందేశంకూడా ఆ శ్రీనివాసుడు మనకు అనుగ్రహిస్తున్నాడా అనే సమాలోచన గావిస్తే ఈ క్రింది తత్త్వసమన్వయం ఆ అధ్యాత్మ సందేశానికి సరితూగుతుందని నా భావన........
శ్రీనివాసుడు తన పంచాయుధాలను ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొనడం.....
అనగా
బాహ్యంలో ఒక దొర వేటకు వెళ్ళి క్రూరమృగాలను వేటలో హతమార్చడం......
మరియు అట్లే దుష్టులను శిక్షించి శిష్టరక్షణ గావించడం....
ఆంతరమున ఆధ్యాత్మికంగా అరిషడ్వర్గమనే రిపుసమూహాన్ని అంతమొందింపజేసి తన శ్రీపాదా శరణాగతిని అందించి భక్తులను నిత్యం సమ్రక్షించడం......
ఇది మనం సాధారణంగా వినే సందేశం......
ఇక పంచాయుధాల వెనక ఉన్న ప్రశస్తమైన సందేశం
1. పాంచజన్యం / శంఖం :
చూడ్డానికి ముచ్చటైన ముత్యాలసరాలన్నీ ముద్దగా చేయబడిన ఒక చక్కనైన కళాఖండంలా కనిపిస్తుంది.....ఆధ్యాత్మికపరంగా శంఖం అమేయ జ్ఞ్యాన దాయకం......
శంఖధ్వని సర్వమంగళదాయకమైన శివానుగ్రహ సూచకం.......
శంఖ తీర్థం సకల శ్రేయోదాయకం....
చూడ్డానికి / స్పృశించడానికి కూడా
శంఖం చాల సౌమ్యంగా ఉంటుంది.....
కాని నాభినుండి వాయువును ఏకబిగిన
అందులోకి సంధించగా దిక్కులు పిక్కటిల్లే శంఖారావం అందులోనుండి ఉత్పన్నమవ్వడం మనం గమనించవచ్చు..... వాయుతీవ్రతను బట్టి శంఖ ధ్వని తీవ్రత కూడా మారుతూ ఉంటుంది.....
మనము కూడా శంఖంలా చూడ్డనికి సౌమ్యంగా, ముత్యాల వంటి దంతసిరి తో నవ్వుతూ ఉండగలగాలి......
కాని మనలోని జ్ఞ్యాన రవం దిక్కులు పిక్కటిల్లేవిధంగా ఎప్పుడు ఎక్కడ ఏది ఎందుకు ఎలా ఏస్థాయిలో ఉండాలో అలా ఉండగలిగి ఈ లోకం యొక్క సహజ లక్షణమైన అజ్ఞ్యానం అనే నిశ్శబ్దనిశీధిని చీల్చిచెండాడే భాస్కరుడి భవ్య భాసలా విజృంభించగలగాలి.....అదే శంఖం మనకు ఇచ్చే సందేశం....!
2. చక్రం / సుదర్శనం :
స్వామి వారి పంచాయుధాల్లో కెల్లా అత్యంత ప్రశస్తమైనది ఈ సుదర్శనం...
చక్రధారి అనే పేరే ఈ లోకంలో స్థిరపడేంతగా సుదర్శనచక్రం మరియు శ్రీహరి అభిన్నమై వెలుగొందుతున్నారు. ఎందుకంటే అది సాక్షాత్ చండ ప్రచండ శక్తి పుంజమైన సూర్యుడిని సాన బట్టి దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిన ఎదురులేని అమోఘ దైవిక శస్త్రం..... ( అట్లే త్రినేత్రుడి త్రిశూలం కూడా )
ఇప్పటికీ తిరుమలలో స్వామివారు మాడవీధుల్లోకి ఊరెరిగింపుకు రావాలంటే ముందుగా ప్రత్యేక సందర్భాల్లో విశ్వక్సేనులవారు మరియు ప్రతినిత్యం సుదర్శనచక్రత్తాళ్వార్లు ప్రదక్షిణం చేసి అన్నిటిని పరికించి ఆతరువాత మాత్రమే పరమాత్మను ఊరెరిగింపునకు వేంచేపుచేస్తారు....
మిరుమిట్లు గొలిపే తేజంతో నిరంతరం
భ్రమనం సాగించే సుదర్శనచక్రానికి ఒక ప్రత్యేకత ఉంది.... శ్రీచాగంటి సద్గురువులు అంబరీశోపాఖ్యానంలో మనకు ఆ ప్రత్యేకతను గురించి వివరించి ఉన్నారు.... వెన్ను చూపినవారికి హాని చేయక కేవలం తనకు ఎదురు నిలిచినవారిని మాత్రమే సమ్హరించే ప్రత్యేకత కలదు సుదర్శనానికి......అందుకే కద దుర్వాసోమహర్షి తను స్నానమాచరించి వచ్చే లోపే అంబరీశుడు జలసేవనం తో ఏకాదశి వ్రత ఉపవాసాన్ని విరమించాడనే కోపంతో శపించగా అక్కడ అప్పటికే తన భక్తునికి కాపలాగ శ్రీహరి పెట్టిన సుదర్శన చక్రం దుర్వాసో మహర్షిని ముల్లోకాలు తరిమింది కాని వెన్ను చూపి పారిపోతున్నందుకు సమ్హరించలేదు......
మనము కూడా సుదర్శన చక్రం లా నిరంతరం భగన్నామగుణవైభవ స్మరణమనే మనోభ్రమణం గావిస్తు దైవిక గుణసంపత్తి అనే తేజోరాశిని ప్రోదిచేసుకుంటు మనకు ఎదురుగా ఉన్న ముఖ్యమైన విషయాలకోసం మాత్రమే మన శక్తియుక్తులను వెచ్చించి వాటిని చక్కబెట్టి.......
మనతో ఎదురుగా కాకుండా చాటుగా మనవెనకాల మనపై / దూషన చేసే వారిని కేవలం ఉపేక్షిస్తు సరైన సమయంలో వారు ఎదురుపడినప్పుడు మాత్రమే మన శక్తియుక్తులతో వాటిని నిర్మూలిస్తూ ముందుకు సాగిపోవాలి అనేదే సుదర్శనం మనకిచ్చే సందేశం......
3. గద / కౌమోదకి :
భీముడు, హనుమంతులవారు ఉపయోగించినంత సాధారణంగా శ్రీహరి ఈ గదాయుధం ఎక్కువగా ఉపయోగించినట్టుగా మనకు కనిపించదు.... అటువంటి స్వరూపాలు / మూర్తులు కూడా తక్కువే.....
శ్రీహరి కరకమలములందు శంఖచక్రగదాపద్మముల అమరిక తో ఏర్పడే 4! = 24 స్వరూపాలకు ప్రతిరూపమైన కేశవాది చతుర్వింశతి నామాల తాలుకు మూర్తుల్లో కూడా స్వామివారు గదను ఊర్ధ్వ హస్తాల్లో ధరించినట్టుగా ఎక్కువగా మనకు ఎక్కడా కనిపించదు..... శ్రీసత్యనారాయణస్వామి వారి మూర్తిలో కూడా క్రింది చేతిలోనే ఉండడం మనం గమనించవచ్చు....
కాని స్వామి వారు తమ కౌమోదకి అనబడే గదను ఉపయోగించి రాక్షససమ్హారం గావించిన ఉదంతాలు మన పురాణాల్లో కలవు....
మదుకైటబుల సమ్హారంలో గదాప్రహారం తో స్వామి ఆ అసురులను అంతమొందించడం.....మరియు చాణూరుడితో జరిగిన మల్లయుద్ధానికి ముందు గదను ఉపయోగించి కొందరు రక్కసులను హతమార్చడం లాంటివి.....
గదకు ఇతర శస్త్రానికి లేని ప్రత్యేకత ఒకటి ఉంది......
దిమ్మతిరిపోయే గదాప్రహారానికి ఎంతటివాడైనా నేలకూలవలసిందే..... ఇతర వ్యక్తులకు ఆ ప్రహారతీవ్రత అంతగా అర్ధంకాదు.....దెబ్బ తగిలినవాడికి మాత్రమే ఆ తీవ్రత అర్ధమౌతుంది.....
మిగతా ఆయుధాల ప్రహారం ( అంటే చక్రం, ఖడ్గం, ధనుర్బాణం ) వెంటనే కంటికి కనిపించి, గాయం యొక్క తీవ్రత వెంటనే రక్తసిక్తమైన ఆ ప్రహారధాటికి ఆ చుట్టూఉన్న వారందరికి తెలిసివస్తుంది.....
కాని గదాప్రహారం అలాకాదు.....
చుట్టూఉన్నవారికి ఏదో దెబ్బలు తగులుతున్నాయిలే అనిమాత్రమే అనిపిస్తుంది..... దెబ్బలన్నీ పూర్తయ్యక కాని తెలియదు ఆ దెబ్బల తీవ్రతేంటీ అనేది......
సాఫ్ట్ గా కనిపించే గదా ప్రహారం యొక్క తీవ్రత ఎంత హార్డ్ గా ఉంటుందో చెప్పాలంటే ' అతడు ' సినిమాలో, పొలంలో అక్రమంగా వేసిన కంచె తీయమని మరియాదగా అడిగిన మహేష్ బాబు కి కాదు కుదరదు అని వెటకారంగా ఎకసెక్కాలాడిన నాయుడుగారి మనుషులకు పార్థు ఇచ్చిన పవర్ఫుల్ పంచ్ లా ఉంటుంది.... పంచ్ పడిన కొద్దిసేపటికి కాని అర్ధం కాదు ఆ పంచ్ యొక్క పవర్ ఎంటో........
అలాంటి గదా ప్రహారం లా, జీవితంలో కొరకరాని కొయ్యలా మారిన కొన్ని సందర్భాలకు, కొందరు వ్యక్తులకు, మనం ఇచ్చే సమాధానం గదాప్రహారంలా ఉండాలి....... పైకి సాఫ్ట్ గా లోన హార్డ్ గా.....
"మ్యాక్జిమం ఇంపాక్ట్ ఇన్ మినిమల్ టైం..."
అనే సూత్రానికి అనుగుణంగా మన కార్యాచరణ ఉండాలి అనేదే గద మనకు ఇచ్చే సందేశం.....
4. శారంగం ధనస్సు / ధనుర్బాణములు :
శ్రీహరి యొక్క పంచాయుధాలో కేవలం శారంగమనే ధనస్సు కోసం ఏకంగా ఒక అవతరామే ఎత్తిన ఘనుడు ఆ శ్రీహరి..... శ్రీరామావతారంలో కోదండరాముడిగా వేలకువేల రాక్షసులను ఏకబిగిన సమ్హరించిన ఘనత ఈ శారంగమనబడే ధనస్సుది......
మిగతా ఆయుధాలకు లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ ధనస్సు సొంతం.....
శ్రీహరి శారంగం..
శ్రీరాముడి కోదండం....
శ్రీకంఠుడి పినాకం..
అర్జునుడి గాండీవం....
పరశురాముడి విష్ణుచాపం....
ఇలా మన పురాణాల్లో గల ధనస్సులను మనం గమనించవచ్చు......
మిగతా శస్త్రాలన్నీ దెగ్గరి శత్రువులపై ప్రహరానికి ఉపయోగించబడితే ధనస్సు మాత్రం
దూరంగా ఉండే వాటిపై బాణం ఎక్కుపెట్టి ప్రహారం గావించేందుకు వీలైన ఆయుధం......
మరే శస్త్రాలకు లేని విధంగా ఏకంగా ధనుర్వేదం అనే ఒక శాస్త్రమే కలదు ధనుర్విద్యకొరకై.....
ధనుర్వేదం అంతటి ప్రశస్తమైనది కాబట్టే లోకంలో గల ఏ శస్త్రాస్త్రాలతోటి మరణం లేని వరగర్వంతో మాయాయుద్ధంలో శ్రీరామసేనను నాగాస్త్రంతో బంధించి సమూలంగా నేలకొరిగేలా చేసిన ఆ ఇంద్రజిత్త్ ను
" శ్రీరాముడి ధర్మాచరణమే, సత్యనిరతియే ఇదివరకెన్నడులేని అప్రతిహత అస్త్రమై నిన్ను సమ్హరుంచు గాక......"
అని సంకల్పం గావించి హనుమ సహాయంతో లక్ష్మణ స్వామి ఆనాడు
" ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యధి......."
అంటూ జయమంత్రాన్ని అభిమంత్రించి గావించిన శరప్రహారానికి మేఘనాథవధ సంభవమయ్యింది....
అంతటి ఘనమైనది కద ధనుర్వేదం మరి....!
"వింటినారిని ఎక్కుపెట్టి, ఆకర్ణాంతం లాగి బాణాన్ని గురి చూసి, ఆ పరిస్థితికి సరిపడే మంత్రాన్ని పఠించి శస్త్రాన్ని అస్త్రంగా మలిచి తదేక ఏకాగ్రతతో సంధించడం......"
అనే ప్రక్రియలో ఎన్ని విద్యలు సమ్మిళితమై ఉన్నాయో మనం గమనించవచ్చు......
శారీరక / భుజబలం, తదేక శ్రద్ధ, దూరదృష్టి, వేల కొలది అస్త్రాలకు సంబంధించిన మంత్రపఠనక్రమం ఆపోశనపట్టగలిగే మేధోశక్తి,
అన్నీ సరైన మోతాదులో కలగలిపే కౌశలం దైవానుగ్రహంగా / గురువానుగ్రహంగా అబ్బితే తప్ప ధనుర్విద్యను అభ్యసించడమనేది అరుదుగా లభించే సౌభాగ్యం....
అంతటి సకల సద్గుణసంపన్నుడు కనుకనే అలనాటి త్రేతాయుగంలో 11000 సంవత్సరాలు తను పరిపాలించిన సుభిక్ష శ్రీరామరాజ్యాన్ని ఈనాటికి కూడా ప్రజలు గుర్తుంచుకొని ఆ కోదండ రాముడిని శ్లాఘించేది....!
అవ్విధంగా సకల సద్గుణాల మేలిమికలబోతగా మనము కూడా మన జీవితాలను దైవానుగ్రహంగా / గురువుల అనుగ్రహంగా తీర్చుదిద్దుకున్న నాడు మన జీవితం కూడా సాటిలేని ధనుర్వేద విద్యాపారంగతమైన ధనుర్బాణాల ప్రాభవంలా పరిఢవిల్లుతుంది అనే సందేశం మనకు శారంగం ఇస్తుంది....
5. నందక ఖడ్గం :
శ్రీహరి తన నందక ఖాడ్గాన్ని ధరించిన చిత్రాలు / మూర్తులు అసలు బహు అరుదు......
కలియుగాంతంలో కాశ్మీరదేశంలో విష్ణుయశుడు అనే సద్బ్రాహ్మనోత్తముని ఇంట శ్రీహరి దశావతారాల్లో ఆఖరిదైన తన కల్కి అవతారం దాల్చి దుర్మార్గులను, దుష్టులను, సాధుసత్పురుష భక్తభాగవతులను హింసించే క్రూరులను, ఉచ్చైశ్రవం అనే తన తెల్లని గురాన్ని అధిరోహించి తన నందక ఖడ్గంతో సమ్హారం గావించిన పిదప సత్య / కృత యుగం పునః ప్రారంభమవుతుందనే భవిష్యపురాణ గాధను శ్రీ చాగంటి సద్గురువులు తమ ప్రవచనంలో చెప్పడం గుర్తు ఉండేఉంటుంది అందరికి.....
ఆ నందక ఖడ్గానికి ప్రతిరూపంగా ఇప్పటికీ కూడా ప్రతిగురువారం నాడు ఆ తిరుమలేశుడు తన "సూర్యకఠారి" అనే ఖడ్గాన్ని భక్తులందరికి ప్రస్పుటంగా కనిపించేలా పక్కన నిలిపి నేత్ర దర్శనం ప్రసాదిస్తాడు........
అంటే లౌకికంగా నేత్రదర్శనం ప్రసాదించే గురువారం నాడు మాత్రమే స్వామి తన ఖడగాన్ని అలా ప్రదర్శించడం తో భక్తులను ఇబ్బందిపెట్టే వారికి బుద్ధిచెప్తాడు అనికాదు ......
దుష్టశిక్షణ కంటే కూడా శిష్టరక్షణే స్వామికి చాల ముఖ్యం కాబట్టి అది ఆయన ప్రతి రోజు ఎల్లవేళలా కొనసాగించే కార్యక్రమమే......
గురువారం అనగా "బృహస్పతివాసరే"..
మానవుల మేధోశక్తికి దేవగురు బృహస్పతి వారి అనుగ్రహమంతటి అమేయ అనుగ్రహము వర్శించే గురు హోర తో మొదలయ్యే రోజు కావడం చేత తన భక్తులకు నందక ఖడ్గం / సూర్యకఠారి ఎంత పదునుదేలి ఉంటుందో అంతటి పదుదైన ధీశక్తిని ప్రసాదిస్తాడు స్వామి అనేసత్యానికి సూచికగా అలా ఆ ఖడ్గప్రదర్శన........
బుద్ధిగతప్రాణులైన మనుష్యులు కూడా
స్వామి వారి ఖడ్గమంతటి పదునైన బుద్ధికుశలతతో , వాగ్పటిమతో పనులు చక్కబెట్టుకోవాలి అనేది నందకం మనకిచ్చే సందేశం....!
( లౌకికంగా ఖడ్గం యొక్క గొప్పదనం నేను ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదనుకుంటా.......
ఎదురుగా ఉన్నది ఎంతటి వారైనాసరే తృటిలో నేలకొరిగేలా వేటువెయ్యగలగడం పదునైన ఖడ్గ ప్రహారo యొక్క లక్షణం....
" స్త్రీలను అనవసరంగా ఇబ్బంది పెట్టేవారికి నరకాల్సింది చేతి వేళ్ళు కాదు....తల......."
అని సాగే బాహుబలి సినిమాలో ప్రభాస్ యొక్క పదునైన ఖడ్గప్రహార సన్నివేశం అందరికి గుర్తు ఉండిఉంటుంది.... )
ఇలా పంచాయుధాలు ధరించిన ఆ శ్రీహరి భక్తులందరికి సర్వకాలసర్వావస్థల్లో ఘనమైన సమ్రక్షకుడిగా ఉండాలని,
"గోవింద.....సరిలేరు.....నీకెవ్వరు....."
అనే రీతిలో ఉండే ఆ శ్రీవేంకటహరి యొక్క భక్తరక్షణావైచిత్రిని అన్నమాచార్యులవారు
" ఆదిమూలమే మాకు అంగరక్ష....."
అనే ఈ సంకీర్తనలో ఎంత ఘనంగా విశదీకరించారో కద.... 😊
******************************************
312.AdimUlamE mAku-ఆదిమూలమే మాకు నంగరక్ష
book:4, kriti:49
Archive Audio link : G Balakrishnaprasad
ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష
భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్యముందున్న జలరక్ష
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష
( http://annamacharya-lyrics.blogspot.com/2007/09/312adimulame-maku.html?m=1 )