Thursday, January 23, 2020

శ్రీరామదాసు గారి 387 వ ఆరాధనోత్సవాలతో ఆ శ్రీసీతారామచంద్రస్వామి మరింతగా సంతసించి ఆశ్రయించిన భక్తులెల్లరికి చతుర్విధపురుషార్ధములను అనుగ్రహించి వారి జీవితాలను ముక్తికొసల చరించు విధముగా మలిచి సదా సమ్రక్షించుగాక.....!!

శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృత సారం
పావనమీ రఘురామనామం భవతారకమంత్రం

దధిక్షీరముల కన్న ఎంతో మధుర మధుర నామం
సదాశివుడు ఆ రజతాచలమున సదా జపించే నామం
కరకు బోయ తిరగేసి పలికినా కవిగా మలచిన నామం
రాళ్ళు నీళ్ళపై తేల్చిన నామం
రక్కసి గుండెల శూలం....

*************************

అని శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఉన్న పాటలో తెలిపినట్టుగా, మరియు శ్రీచాగంటి సద్గురువులు వివిధ ప్రవచనాల్లో రూఢపరిచిన వైనంలో మనకు బోధపడినట్టుగా శ్రీరామనామమే తారకం.....!

అది సకలశాస్త్రనిగమాగమ సారం.....

శ్రీమదఖిలరహస్యమంత్రవిశేషధామము రామనామము.....

ఒక్క వాక్యంలో చెప్పాలంటే శ్రీరామ నామానికి సాటిరాగల  సంపద గాని, శక్తి గాని ఈ యావద్ విశ్వంలోనే  లేదు......

కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా, శ్రీవేంకటేశ్వరుడిగా , గోవిందుడిగా, ఆయన తిరుమలలో  వెలిసినప్పటికీ

"కౌసల్యాసుప్రజారామపూర్వాసంధ్యాప్రవర్తతే...... "

అని  అరణ్యకాండలో  ఆనాడు  వారి గురుదేవులు విశ్వామిత్రులవారి సంబోధనతోనే ఈనాటికి కూడా ప్రతి రోజు    ' నిద్రమేల్కొంటున్నాడు '.......

1.పడికావలి
2.వెండివాకిలి
3.బంగారువాకిలి
4.స్నపనమండపం
5.రాములవారిమేడ
6.శయనమండపం
7.ఆనందనిలయం

అనే సప్తప్రాకారములు లోన సజీవసాలిగ్రామావేశిత సాకారపరమాత్మగా వీరస్థానకధృవమూర్తిగా పద్మపీఠంపై వరదకటిహస్తాలతో మందస్మితుడై నిలిచి సకలలోకాలను ఏలుతున్నప్పటికీకూడా........

అడుగడుగునా తన శ్రీరామావతార స్పర్శనుప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూనే ఉంటాడు.......
ఏరికోరి ఎత్తిన సంపూర్ణమనుష్యావతారం కదామరి...ఆమాత్రం పూర్వజన్మప్రీతి ఉండడం సహజమే కదా....

తన ప్రియభక్తుడైన శ్రీకులశేఖర ఆళ్వారుల శ్రీరామభక్తికి సంతసించి తన ఆనందనిలయానికి తొట్టతొలి గడప గా ఉండే సౌభాగ్యాన్ని అనుగ్రహించాడు......

ఎంతటి గొప్ప వ్యక్తైనాసరే ఆఖరికి దేశ ప్రధాని అయినా సరే కులశేఖరపడి వరకు మాత్రమే వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగలిగేది......

తను నిర్దేశించుకున్న వంశీకులైన శ్రీవైఖానసాగమాచార్యులు మాత్రమే ఆ పడికి  భక్తితో నమస్కరించి దాటిలోనికి వెళ్ళేది....... అంతటి ఘనమైన అనుగ్రహంకదా ఆ కులశేఖరాళ్వారులకు స్వామి ప్రసాదించింది....!

నలనీలుర శ్రీరామభక్తికి ఆనాడు కృతయుగం లో రాళ్ళు శ్రీరామ నామన్ని ముద్ర వేయించుకొని నీటిపై తేలియాడి రామసేతువుగా శాశ్వతానుగ్రహం పొంది ఈనాటి వరకు కూడా ఆ రామ సేతువు యొక్క భాగాలను తమిళనాడు సముద్రతీరంలో మనం దర్శించే సౌభాగ్యo కలగడం మరియు గౌతమ మహర్షి యొక్క శాపానుగ్రహానికి జడరాశి గా మారిన అహల్య శ్రీరామ పాదస్పర్శసోకిన తదుపరి తిరిగి మనుష్యరూపం పొందితే......

ఈ కలియుగంలో,
పరమాత్మను నేను ఎప్పటికీ అలా దర్శిస్తూనే ఉండాలి అనే కోరికతో రాజు రాతిగడపగా మారి, మనకు స్వామికి మధ్య ఉండే హద్దుగా శాశ్వతానుగ్రహం పొందాడు......

ఇక శ్రీరాముడి కోసం ఏకంగా ఆలయమే కట్టి తన జీవితాన్ని మొత్తం ఆ దైవకార్యక్రమంకోసమే త్యాగంచేసి అనాడు త్రేతాయుగంలో శ్రీ సీతామాత,  లక్ష్మణస్వామి  సమేత శ్రీరామచంద్రుడిగా దండకారణ్యప్రాంతంలో కొలువైనవిధంగానే తన పై శాశ్వతంగా కొలువై ఉండమని కోరుకున్న భద్రుడి ప్రార్ధనకు కొనసాగింపుగా వరభద్రాచలేశ్వరుడిగా ఆ శ్రీరాముడిని పావన గౌతమీ తీరంలో శాశ్వతంగా నిలిపి, భక్తిరస కీర్తనలతన్మయత్వంతో ఆ శ్రీరాముడిని కొనియాడిన  కంచర్ల గోపన్న శ్రీరామదాసుగా
చిరకీర్తిని గడించి శాశ్వతుడైనాడు....!!

దక్షిణ అయోధ్యగా గా వినుతికెక్కిన ముక్తిదాయక క్షేత్రమైన శ్రీభద్రాచలక్షేత్ర దర్శనం, అక్కడి సిద్ధగౌతమీతీర్థస్నానం,  ఎన్నెన్నో జన్మల పుణ్యబలం ఉంటేతప్ప లభించని సౌభాగ్యం........

శ్రీచాగంటి సద్గురువులు తమ ప్రవచనాల్లో విశదీకరించినట్టుగా మకుటంకేని అధ్యాత్మ మహారాజత్రయంగా ఈ త్రిలింగదేశంలో సర్వోత్కృష్టమైన శ్రీరామభక్తిసంపదను ఆర్జించిన మహనీయులుగా,
శ్రీరాముడిని పరోక్షంగా / ప్రత్యక్షంగా  దర్శించిన సౌభాగ్యం పొంది కీర్తికాయులైన
పరమభాగవతోత్తములై

పోతరాజు
( శ్రీ బమ్మెర పోతనామాత్యులవారు )

త్యాగరాజు
( శ్రీ సద్గురు త్యాగరాజస్వామివారు )

గోపరాజు
( శ్రీ కంచర్ల గోపన్న )

ఈ ముగ్గురు వెలుగొందుతుండగా,

వారిలో ఆలయం కట్టిమరీ శ్రీరాముడి కోసం ఆలాపన గావించిన అమరభక్తుడు శ్రీరామదాసుగారు......!!

శ్రీరాముడు శ్రీవైకుంఠరాముడిగా ఆరాధనలందుకునే పరమపావనమైన భద్రాచలంలో,
ఆ శ్రీరామదాసు గారి 387 వ ఆరాధనోత్సవాలతో ఆ శ్రీసీతారామచంద్రస్వామి మరింతగా సంతసించి ఆశ్రయించిన భక్తులెల్లరికి చతుర్విధపురుషార్ధములను అనుగ్రహించి వారి జీవితాలను ముక్తికొసల చరించు విధముగా మలిచి సదా సమ్రక్షించుగాక.....!!

*************************

రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్తకామితాయ శుభదమంగళం
రామదాస మృదులహృదయ తామరసనివాసాయ
స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం
దివ్యమంగళం దివ్యమంగళం

*************************

శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః..... 😊🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment