శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
వైదెహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్డపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామాం శ్రీరామం భూయో-భూయో నమామ్యహం॥
యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమతరాక్షసాంతకం
శ్రీవాల్మీకి మహర్షి విరచిత ఆదికావ్యం, శ్రీరామాయణాంతర్గతమైన ఇలాంటి ఎన్నెనో వివిధ శ్లోకాల్లో శ్రీరాముడి మరియు అతడి ప్రియాతిప్రియమైన సఖుడైన హనుమంతుల వారి వైభవం మనకు గోచరిస్తూనే ఉంటుంది.......
వారి అవ్యాజమైన మిక్కుటమైన నిస్వార్ధమైన మైత్రికి కారణం వారు అనాదిగా ఉండే అభిన్నమైన హరిహరులు కావడంచేత......
అందుకే కద ఎంతటి బలాఢ్యులకు సైతం, ఆఖరికి అపర శివభక్తిధురంధరుడైన రావణ బ్రహ్మతో సహా, కనీసం అంగులం కూడా కదిలించలేని ఆ హరచాపమును ఎక్కుపెట్టి విరిచేంతటి భుజబలం ఆ నవ యవ్వన శ్రీరాముడికే చెల్లింది......
ఆ తదుపరి ఆగ్రహోదగ్రుడై వచ్చి విరుచుకుపడుతున్న ఆ పరశురాముడి ఉగ్రతను తనలోకి లయించివేసినా సరే అది శ్రీరాముడికే చెల్లింది......
అసలు క్షత్రియులంటేనే గిట్టని, క్షత్రియసమ్హారమే పనిగా లోకమంతా తన గండ్రగొడ్డలి ( పరశు ) పట్టుకొని తిరుగుతున్న ఆ అపారమైన రాజసిక బ్రాహ్మణ తేజస్సును నిలువరించి తనలోకి లయించి వేసేంతటి క్షాత్రము సామాన్యమైన క్షత్రియులకు కలదే....??
హర తేజస్సుకు కేవలం హరి తేజస్సు మాత్రమే సాటిరాగలదు......
ఇతరములన్నీ కూడా వాటిలోకి లయించిపోవలసిందే.......
అందుకే కదా హరి హర తేజస్సుల కలయికతో సంభవించిన వీరుడి మినహా మరెవ్వరిచేతను సమ్హరించబడని విధంగా అతి తెలివితో వరము పొంది మర్త్యులకు దుర్లభమైన అమరత్వాన్ని సాధించానని మిడిసిపడిన ఆ కలిపురుష స్వరూపమైన మహిషిని సమ్హరించుటకు హరిహర తనయుడిగా అయ్యప్ప స్వామి దిగిరావలసివచ్చింది......
త్రిపురాసుర వధలో భాగంగా శ్రీహరికి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆ హరుడు హనుమంతుడై ఇలకు దిగిరావడం,
అపారమైన హర తేజస్సును సాధించి లోకాన్ని, ముఖ్యంగా సాధు సత్పురుషులను బాధించడమే పనిగా బ్రతుకుతున్న పౌలస్త్యుడి వధ హనుమ యొక్క
1. శక్తి --
( అప్పటికప్పుడే కాంచన లంకనుండి హిమాలయపర్వతశ్రేణికి లంఘించి సంజీవని పర్వతం తీసుకొని రావడం మళ్ళీ అంతే జాగ్రత్తగా అది సంగ్రహించిన చోటే తిరిగి భూస్థాపితం గావించడం అనే అనితరసాధ్యమైన దేవకార్యం.... )
2. యుక్తి --
( ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎంతవరకు బుద్ధిబలాన్ని ఉపయోగించి కార్యాన్ని సాధించాలో తెలిసినందుకు......
మహేంద్రగిరి పర్వతం శిధిలమయ్యేంతటి విరాట్ రూపాన్ని ధరించి 100 యోజనాల సాగరాన్ని లంఘించడమే కాదు......
కీటకమంత చిన్నగామారి నాగమాత సురస పెట్టిన పరీక్షలో నెగ్గి సాగరలంఘనంలో ముందికు సాగడం తెలిసినందుకు.....
పిల్లి పిల్లంత రూపాన్ని ధరించి కాంచనలంకలో సీతాన్వేషణ గావించడం కూడా తెలిసినందుకు.....
రాబోవు రామరావణ సంగ్రామానికి కావలసిన వ్యూహప్రతివ్యూహాలను రచించేందుకు, లంక యొక్క ఆనుపాను తెలియుటకు మేఘనాథుడి బ్రహ్మాస్త్ర బంధనానికి కట్టుబడిన వ్యక్తిలా ఉండడమే కాదు.......
దూత గా వచ్చిన తనను,
శ్రీరాముడి గౌరవభరితమైన సంధివచనాలను తిరస్కరించడమే కాకుండా హద్దెరగని పొగరుబోతుతనంతో ఘోరంగా అవమానపరిచినందుకు,
శ్రీరాముడికి కొంత భారం తగ్గేలా,
సీతమ్మవారి చూడామణి తో పాటుగా
సగం లంకను సమూలంగా సర్వనాశనం గావించిన
" కాంచనలంకాదహనం " అనే రిటర్న్ గిఫ్ట్ ని తీసుకొని రావడం.......
ఇత్యాది గా ఎన్నో చోట్ల యుక్తిప్రధానమైన కార్యాచరణ గావించడం..... )
3. భక్తి --
( రావణుడి వేధింపులకు మానసికంగా ఎంతో కృంగిపోయిన సీతమ్మ శింశుపా వృక్ష కొమ్మలకు తన కేశపాశాన్నే తాడుగా కట్టి ఉరి వేసుకొని ఇక కొమ్మను వదిలేయడానికి సిద్ధంగా ఉన్న ఆ అత్యంత సంక్లిష్టమైన సందర్భంలో అసలు ఏం చేయాలో ఏమి తోచక ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఇక తన ప్రభుభక్తి మాత్రమే దిక్కని తలచి అత్యంత సుమనోహరంగా శ్రీరామ నామగుణవైభవాన్ని ఆలపించి సీతమ్మను ఊరడించి ఆ పెనుప్రమాదమునుండి రక్షించడం అనే చతురత భరిత కార్యసాధన చెట్టుపైనుండే గావించడం......
రావణుడి ప్రాణ రహస్యం గురించి విభీషణుడు తెలిపినాసరే ధనుర్వేద నియమావళికి విరుద్ధంగా నాభిదిగువకు శర ప్రహారం కావించని తన ప్రభువుకు విజయం చేకూరేలా వాయుదేవుణ్ణి ప్రార్ధించి శ్రీరాముడి కోదండ సంధిత శర గమనాన్ని రావణుడి నాభిమండలంలో కుంభకమై ఉన్న ప్రాణాలపైకి సవరించి ప్రహారం గావించబడడం......
ఇత్యాది గా భక్తి ప్రధానంగా సాధించబడిన కార్యాలు...... )
వల్లే సంభవమయ్యిందనే సత్యం మనం శ్రీరామయణంలో నేర్చుకున్నాము కదా......
అందుకే కద హనుమస్వామి యొక్క శక్తి యుక్తి భక్తి సమ్మిళితమైన ఆ హరతేజోవిరాజిత స్వరూపాన్ని
" ఎవ్వరికి వశపడని ఎదురులేని కాలస్వరూపమే ఈ హనుమంతుడు......"
అని స్తుతించింది వేదోపబృహ్మణమైన శ్రీమద్రామాయణం
( అశోకవననాశకుడిగా తన విశ్వరూపాన్ని జూపిన వైనాన్ని శ్రీవాల్మీకి మహర్షి తమ ఈ క్రింది సుందరకాండ 54 వ సర్గలోని 35వ శ్లోకంలో ఎంత ఆశ్చర్యజనకంగా అభివర్ణించారో చూస్తే, హనుమంతుని సకలదేవతాశక్త్యాత్మక వైభవం గోచరిస్తుంది..!!
***************************************************************
వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!! 5-54-35
వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే...!!
vajrī mahendrastridaśeśvaro vā |
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35
"He is not a monkey. He is either Indra the Lord of celestials wielding a thunderbolt, or Yama the lord of death or Varuna the Lord of water, or Anila the wind-god or Agni the fire seated in the third eye of Lord Shiva or the sun-god or Kubera the lord of riches or the moon-god.
He may be Kaala (the Time-spirit) himself.... !
**********************************************
ఒక శక్తిని నిలువరించాలంటే అదే శక్తి లేదా ఆ శక్తికి సాటి అయిన, సామ్యమైన శక్తి ని అడ్డుగా వేసిన నాడే అది సాధ్యము.......
లేనిచో శక్తి సాంద్రత లోని హెచ్చు తగ్గుల కారణంగా వివిధ ఉత్పాతకరమైన ఉపద్రవాలు సంభవిస్తాయి......
సద్గురు శ్రీ చాగంటి గారి సులభమైన మాటల్లో
చెప్పాలంటే.....
" నీ ఇంట్లో ఫ్యూస్ పోతే...... నువ్వే వేస్కుంటావ్......పరవాలేదు......
కాని ట్రాన్స్ఫార్మర్ లో ఫ్యూస్ పోతే ఆ వ్యవస్థను చక్కదిద్దే తగు తర్ఫీదు ఉన్న లైన్మెన్ మాత్రమే ఆ పని చెయ్యాలి......"
ఎందుకంటే, ఇక్కడ రెండూ కరెంట్ సంబంధితమైన చర్యలే......
కాని ఆ విద్యుత్ శక్తి యొక్క పరిమాణంలో ఉన్న భేదాల కారణంగా రెండింటిని ఒకేలా హ్యాండిల్ చెయ్యలేము అనేది మనము లౌకికంగా చూసే వ్యవస్థలోని
సర్వ సాధారణమైన సత్యం.......
( మన ఇంట్లోకి వచ్చేది 11/33 kV సబ్ స్టేషన్ నుండి స్టెప్డౌన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వార స్థిరీకరించబడిన 230 V విద్యుత్శక్తి....... )
సరిగ్గా ఇదేవిధంగా అమేయమైన దైవిక శక్తికూడా మనుష్య ఉపాధికి ఉపలబ్ధమయ్యే విధంగా ఒక నిర్ణీతమైన పరిమాణంలో తన ఉనికిని సంక్షిప్తపరిచి వచ్చినప్పుడు అది స్వీకరించిన ఉపాధిచేత ఆ శక్తిని తక్కువ అంచనా వేసి తూలనాడడం సాధారణంగా అల్పులే తప్ప మాన్యులు గావించరు.....
అందుకే కద దూతగా వచ్చినందుకు రావణ సభలో ఉన్నవారెందరో.....
" శ్రీరాముడి పలుపున వచ్చిన కేవల మర్కటము......."
అని అపహాస్యం గావించి భంగపడ్డారు......
కాని విజ్ఞ్యుడైన విభీషణుడు మాత్రం
" వచ్చింది కేవల మర్కటము కాదు...... సాక్షాత్తు మహేశ్వరుడే...... " అని భావించి
"దూతను సమ్హరించడం దౌత్య ధర్మానికి విరుద్ధము......" అంటూ తనదైన రీతిలో రావణుడికి హితవచనాలు చెప్పి కాంచనలంకను కాపాడినాడు........
ఆ సందర్భంలో హనుమస్వామిని దూతగా భావించి విడిచిపెట్టడమే ధర్మము అని విభీషణుడు సభలోని ఒక పెద్దమనిషిగా తన విహిత ధర్మాన్ని నిర్వహించి ఉండిఉండకపొయ్యుంటే హనుమంతుల వారి ఆగ్రహానికి రావణుడితో సహా కాంచనలంక మొత్తం ఆ క్షణమే సమూలంగా సర్వనాశనమయ్యుండేది......
ఆ మాటను హనుమంతులవారే స్వయంగా చెప్తారు కద.........
" సీతమ్మ జాడ కనిపెట్టడమే తన ప్రభువు ఆజ్ఞ్య కాని మిమ్ములను సమ్హరించుటకు ఆజ్ఞ్య లేదు కాబట్టి వదిలేస్తున్నాను......" అని రావణుడికి ప్రత్యుత్తరమిచ్చి, ధర్మాన్ని ఆలంబనగా గావించి జీవించే సీతమ్మ మరియు విభీషణుడు అక్కడ ఉన్నారు కాబట్టి లంకను మొత్తం దహించకుండా వదిలేసాడు.........
రక్కసుల మలిబంధన చర్యలతో మేఘనాథుడి బ్రహ్మాస్త్ర బంధనం తొలగిన ఆ క్షణమే హనుమంతుల వారు అక్కడున్న అందరిని సమ్హరించి సీతమ్మను మాత్రమే క్షేమంగా తరలించి ఉండగలిగిన సందర్భం అది......
కాని రాజాజ్ఞ్య అది కాదు కాబట్టి సందర్భోచితంగా వ్యవహరించి సగం లంకనే దహించినాడు ఆ శ్రీరామదూత....
" హనుమ వాలానికి పెట్టబడిన నిప్పు మంచు వలే చల్లగా ఉండి ఆంజనేయునికి ఎట్టి హాని చేయకుండు గాక....."
అని నిండు మనసుతో సంకల్పించిన ఆ సీతమ్మ ఉన్న అశోకవన పరిసరాలు, మరియు అప్పుడు అక్కడ కాపలా కాసే రాకాసి మూకలు మాత్రం ఆ హనుమ ఆగ్రహానికి గురికాకుండా ఉండడం మనం గమనించవచ్చు......
శ్రీమద్రామాయణం లో రాముడు ఎంతో హనుమంతుడు కూడా అంతే......
శ్రీచాగంటి సద్గురువులు మనకు శ్రీసీతారామలక్ష్మణహనుమ స్వామి సహితమైన చిత్రపటం ఓంకార స్వరూపమై ఉండడం గురించి చెప్పిఉన్నారు కద.....
అ కార
ఉ కార
మ కార
లకు శ్రీరామలక్ష్మణసీతమ్మ ప్రతీకలైతే
" ఉమ్మ్ " అని భ్రమరనాదం లా ధ్వనించే ఆ ఓంకారనాదస్వరూపమే హనుమంతులవారు..........
అనగా నాదబ్రహ్మస్వరూపాత్మకంగా ఇక్కడ హరుడే హరీశ్వరుడైన హనుమంతుడు అవ్వడంవల్ల ఆతడు ప్రత్యక్ష పరబ్రహ్మమైన శ్రీహరికి అభిన్నమై వెలుగొందుతున్నాడు అనేది ఇక్కడి అధ్యాత్మ సత్యసూక్ష్మము....!!
ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి కూడా
బ్రతికి ఉన్నడు అని చెప్పడానికి సదరు శరీరంలోని దశవాయువులే అందుకు సాక్ష్యం......
వాటిలోని పంచ ప్రాణాలు
1.ప్రాణ
2.అపాన
3.వ్యాన
4.ఉదాన
5.సమాన
మరియు పంచ ఉపప్రాణలు
6.నాగ
7.కూర్మ
8.కృకర
9.ధనంజయ
10.దేవదత్తము
ఈ పది వాయువులు నిరంతరం తమ తమ స్థానాల్లో శరీరధారకుడి హృదయకోశంలో " అంతర్యామి " గా నెలకొన్న పరమాత్మ ఆజ్ఞ్య మేరకు శరీరంలోని ఏ భాగంలో ఎంతపరిమాణంలో ఉండాలో ఆ మేరకు ఉండి మనల్ని నిత్యం సజీవంగా నిలుపుతున్నాయి......
ఒక ప్రాణికి ఇక భూలోక యాత్ర ముగించే సమయం ఆసన్నమైన సందర్భంలో పంచ ఉపప్రాణాల సంఘాతమై శరీరమంతాకూడా నాదరూపాత్మకంగా వ్యాపించి ఉండే ఆ నాదబ్రహ్మ వైదొలగడం ప్రారంభిస్తాడు........
అనగా మనలోనే కొలువైఉండే హనుమ స్వామి దూరం అవ్వడం అన్నమాట.....
అందుకే వారికి ఇహలోకసంబంధమైన ధ్వనులు వినిపించడం ఆగిపోతాయి.......
ఆ పంచ ఉపప్రాణాలు వైదొలగిన పిదప, ఇక పంచ ప్రాణాలు తమ తమ స్థానాలనుండి వైదొలగిన పిదప, హృదయకోశంలోని జీవుడు తుదకు జ్యోతిస్వరూపాత్మకంగా శరీరం నుండి బయల్వడి అంగుష్ఠమాత్ర తైజసిక దేహాన్ని ధరించి ఇక తన పరలోక యాత్రను ఆరంభిస్తాడు.....
అందుకే లౌకికంగా మొదట
పల్స్ చెక్ చేస్తారు......
ఆతర్వాత హార్ట్ బీట్....
అలా మిగతా ప్రాణసూచీలన్నీ చెక్ చేసి.....
ఆ కీలకసూచిలన్నీ కూడా శూన్యమైన పిదప ఇక అందులోనుండి
" శివం " సంపూర్ణంగా వైదొలగింది
అని ధృవీకరిస్తారు........
ఈ నిర్దేశిత విశిష్టమైన దశప్రాణవాయువులు తొలగిన పిదప ఇక అది శూన్యము కాబట్టి బయటి లౌకిక వాతావరణంలోని అన్ని రకాల విషవాయువులు ఆ పార్ధివదేహం లోకి ప్రవేశించి ఆ శరీరం తన సహజత్వాన్ని కోల్పోతు శిధిలమవ్వడం ప్రారంభమవుతుంది.......
ఆ విషపూరిత వాయురసాయనచర్యలవల్లే దేహం ఉబ్బడం, దుర్గంధం రావడం, కొయ్యబారిపోవడం ఇలా వింత వింత గా అయిపోతుంటుంది.......
బయట కాపలాగ ఉన్న సెక్యురిటి గార్డు వైదొలగిన తర్వాత రోడ్డు పై తెరిచి ఉన్న బంగారం దుకాణం లోకి చోరులు ఎగబడితే పరిస్థితి ఎట్లైతదో పరమాత్మ యొక్క ఆజ్ఞ్య సడలి అనుగ్రహం ఈ శరీరం నుండి వైదొలగినప్పుడు ఈ శరీరం యొక్క స్థితి కూడా అంతే......
అందుకే శ్రీరాముడికి హనుమంతుడికి అంతరమేమి లేదు అని విశదీకరిస్తూ
"హరికి లంకినీ హంతకు అంతరమేటున్నది...." అంటూ అన్నమాచార్యులవారు ఎంతో రసరమ్యంగా ఆ శ్రీరామ, హనుమ స్వామి అనగా హరిహరుల అభిన్నతత్వాన్ని ఎంతో హృద్యమైన సంకీర్తన గా రచించి లోకానికి అందించారు......
ఆత్మరాముడిగా ప్రతీప్రాణియొక్క హృదయకోశంలో దేదీప్యమానంగా వెలుగుతూ కొలువైన పరమాత్మ అయిన శ్రీహరి కలియుగ శ్రీనివాసుడైతే, ఆ హృదయకోశమునుండి శరీరానికి అన్నివైపులా కొన్ని వేల మెగాహెర్ట్జ్ పౌనహ్పున్యంతో విరజిమ్మబడే నాదస్వరూపమే హనుమంతుడు......!
మా ఇంటిదెగ్గరి వివేకానందనగర్లోని శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో,
శ్రీ వికారి ఫాల్గుణ శుద్ధ ఏకాదశ్యోపరిద్వాదశి, భృగువాసర పుష్యమి నక్షత్ర యుక్త మేషలగ్న సుముహూర్తంలో, 06-మార్చి-2020 ఉదయం 9.51 నిమిషాలకు,
శ్రీపాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక ప్రతిష్ఠామహోత్సవం జరిపించుకొని కొత్తగ వచ్చి కొలువైన
శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయస్వామి వారి నూతన ఆలయ గోపుర శిఖరం...... 😊
కొండగట్టులో కొలువైన హనుమంతులవారికోసం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివార్లు వచ్చి ఇరువైపులా కొలువైఉంటే.......
ఇక్కడ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివార్ల కోసం హనుమంతుడు వచ్చి అభయముద్రలో కొలువైనాడు....!!
" ఏమయ్య హనుమయ్య, స్వామివారు వచ్చి కొలువయ్యాక వెంటనే రాక నీకు దాదాపు 3 దశాబ్దాలు పట్టిందేమయ్య కొలువై ఉండడానికి.....? "
అనే నా తుంటరి ప్రశ్నకు స్వామి వారి అంతే తుంటరి సమాధానం.....
" మరి ' Speed of the light is faster than that of the sound....' కదర అందుకనే అంతర్యామి అయిన స్వామి వచ్చాక నాకు రావడానికి కొంచెం టైం పట్టింది...!! " 😂
శ్రీఅభయాంజనేయసహితశ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః.....! 😊🙏
![No photo description available.](https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-0/p600x600/89813417_10219393901051588_1489211710102306816_n.jpg?_nc_cat=105&_nc_sid=8024bb&_nc_ohc=ve9NfSbjm2wAX-0BgGR&_nc_ht=scontent.fhyd2-1.fna&_nc_tp=6&oh=f35843a04f887c88b37efec04f0aeac5&oe=5E95934D)
![Image may contain: tree, sky and outdoor](https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-0/p403x403/90355658_10219393901811607_2313692375479746560_n.jpg?_nc_cat=107&_nc_sid=8024bb&_nc_ohc=yHG0ScZWnYUAX_hpjT_&_nc_ht=scontent.fhyd2-1.fna&_nc_tp=6&oh=71b3c1f110251e571816f167e2ff972f&oe=5E95731C)
![Image may contain: text](https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-0/s480x480/89979529_10219393975573451_193982898003509248_n.jpg?_nc_cat=105&_nc_sid=8024bb&_nc_ohc=nKSMKHUJkDsAX9D_DjD&_nc_ht=scontent.fhyd2-1.fna&_nc_tp=7&oh=5a1b28c70786ad4c15767e35a80cbe75&oe=5E935390)
No comments:
Post a Comment