Wednesday, March 25, 2020

శ్రీ కోటి ఫలి క్షేత్ర మాహాత్మ్యం......😊 అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊

శ్రీ కోటి ఫలి క్షేత్ర మాహాత్మ్యం......😊

ముందుగా అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊

రమారమి ఒక 7 సంవత్సరాల క్రితం
( 2013 గురుపౌర్ణమి ఉత్సవానికి ) కాకినాడ లోని సర్పవరంలో నా మితృని ఇంటికి వెళ్ళినప్పుడు,
అలా కాసేపు చుట్టుపక్కన ఉండే
గుళ్ళు చూసొద్దామని వెళ్ళాము.....

అప్పుడు నాకు అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువులు నుడివిన ఒక అధ్యాత్మ విశేషం ఠక్కున గుర్తొచ్చి,
" హె వినోద్...గోదావరి సముద్ర సంగమానికి దెగ్గరగా ఉండేవాటన్నిటికి తీస్కెళ్ళవ...."
అని అడగగా.....
అట్లే అని మితృలందరం బైక్స్ వేస్కొని బయల్దేరాం......

దక్షారామం,
( శక్తిపీఠం, శ్రీమాణిక్యాంబాసమేతభీమేశ్వర స్వామి ఆలయం )

పిఠాపురం
( శక్తిపీఠం శ్రీ పురుహూతికాదేవి
మరియు శ్రీహుంకారిణిదేవి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయాలు) 

సర్పవర శ్రీభావనారయణస్వామి ఆలయం , 
( ఈశ్వరానుగ్రహం వల్ల ఆనాడు భానువాసరం..... ఆదివారం నాడు ఎదురుగా ఉన్న నారదకుండంలోని తీర్థజలాన్ని సేవించి సర్పవరం శ్రీభావనారాయణస్వామిని దర్శించి సేవించిన వారికి 108 దివ్య దేశాల దర్శనఫలితం సిద్ధిస్తుందని శాస్త్రవచనం...! 😊 )

ఇలా కాకినాడ చుట్టుపక్కన ఉండే వివిధ ఆలయాల సందర్శనలో భాగంగా కోటిపల్లి శ్రీసోమేశ్వరస్వామి వారి ఆలయాన్ని కూడ సందర్శించి తరించాము......
శ్రీచాగంటిసద్గురువులు ప్రవచనంలో ఒకచోట చెప్పిన్నట్టు
అది కోటిపల్లి కాదు కోటిఫలి క్షేత్రం......

( వాడుకభాషలో దక్షారామం ద్రాక్షారామం ఐనట్టు, కోటిఫలి కోటిపల్లి గా అయ్యింది అనేది వివరణ....)

అప్పుడు నాకు అక్కడి క్షేత్రాల మాహాత్మ్యం గురుంచి పెద్దగా అవగాహన లేదు కాని గురువుగారు చెప్పిన ఒక్క వాక్యం కొరకు కోటిఫలి క్షేత్రం చూడ్డానికి వెళ్ళాము......

" ఉత్తరభారత ప్రాంతంలో ప్రవహించే జీవనదుల జన్మస్థానముల వద్ద ఉండే తీర్థాలు క్షేత్రాలు     కడుశక్తిదాయక బహుపుణ్యదాయకాలు......

అట్లే దక్షిణ భారత ప్రాంతంలో ప్రవహించే జీవనదుల సముద్రసంగమ ప్రాంతాలకు దెగ్గరగా ఉండే తీర్థాలు క్షేత్రాలు కడుశక్తిదాయక బహుపుణ్యదాయకాలు............" 

అనే ఆ అధ్యాత్మసూక్ష్మశ్రవణం నాకు కోటిఫలి క్షేత్ర సందర్శనభాగ్యం ప్రసాదించిందన్నమాట......😊

( ఆ అనుగ్రహవిశేషాన్ని త్వరలో  వేరొక పోస్ట్లో రాస్తాను.....)

ఇక్కడ అర్ధంచేసుకోవలసిన విషయం ఏంటంటే,

కొందరు దేశకాల మహిమ్నతను, తత్సంబంధమైన శాస్త్రవచనాలను,
అవిపాటించే వ్యక్తులను / భక్తులను చాలా చులకన చేసి అగౌరవపరిచేలా మాట్లాడుతుంటారు / వ్యవహరిస్తుంటారు......

వాళ్ళకు గల అహంకార భరిత అజ్ఞ్యాన భావజాలాన్ని సరిదిద్దడం నా ఉద్దేశ్యం కాదు కాని,
కొన్ని లౌకిక ప్రపంచపు ఉదాహరణలద్వార శాస్త్రం యొక్క హితవచనాల గొప్పదనం గురించి నా యొక్క భావాన్ని తెలియజేసే ప్రయత్నం గావిస్తాను......

1. శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒక చోట ఉదహరించిన ఒక గొప్ప లౌకిక సామాన్య విషయాన్నే ఇక్కడ నేను ముందుగా ఉదహరిస్తాను......

ఒక నాలుగు గోడల మధ్యలో, ఒక 100 గజాల్లో మీరు కట్టుకున్న ఒక చిన్న  ఇంట్లోనే.......

ఒక మూలన కొంచెం పెద్దగా ఉండేలా ఒక గది వేసి ఇది నిద్రపోయే మాస్టర్ బెడ్రూం.... అని అంటున్నారు.....

దాని పక్కనే ఇంకో రెండు గోడలు వేసి ఇది వంట చేసుకునే కిచెన్ రూం అంటున్నారు....

దాని ముందు ఇంకో రెండు గోడలు వేసి ఇది హాల్ రూం అందరు కూర్చొని టీ.వి చూడ్డానికి అని అంటున్నారు.....

ఆ మధ్యలో ఇంకో రెండు సన్న గోడలు కట్టి ఇది పూజ గది....ఇందులో మా దేవుడు ఉంటాడు.....అని అంటున్నారు.....

మరో మూలన ఇంకో రెండు గోడలు కట్టి ఇది స్నానాదికాలకు బాత్రూం అని అంటున్నారు......

బాత్రూంలోనే స్నానాలు చేయాలి....
పూజ గదిలోనే దైవారాధన చేయాలి.....
కిచెన్ లోనే వండి ఆ పక్కనే తినాలి....
బెడ్రూంలోనే పడుకోవాలి.....

అంటు ఏగదిలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో చెప్తూ 
" This is how a house is to be used for peaceful living and thus call it a home......."

అని ఒక చిన్న 100 గజాల భూమి ముక్కలోనే మీరు ఇన్ని విభాగలు గావించి అది అందుకు ఇది ఇందుకు ఇది ప్రత్యేకం అని అంటున్నారే......

మరి యావద్ ప్రపంచాన్ని ఈ భూమిపై తనదైన ఒక సక్రమ పద్ధతిలో శాస్త్రాన్ని ఆధారంగా గావించి ఈశ్వరుడు నిలిపినాడు.....
సనాతనంగా మన పూర్వీకులు పెద్దలు అది ఆచరించి తరించినారు......
అందుకు విరుద్ధంగా అంటే శాస్త్ర విరుద్ధంగా ఉంటే అశుభం కలుగుతుంది కాబట్టి శాస్త్రసమ్మతంగా కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రం కచ్చితంగా పాటించడంలోనే శ్రేయస్సుకలదు అని విజ్ఞ్యులైన వారన్నప్పుడు,
అది శాస్త్ర మౌఢ్యం, చాదస్తం, వెర్రి, పిచ్చి, ఇత్యాదిగా చులకనజేయడం మీ యొక్క అజ్ఞ్యానానికి కొలమానమవుతుందేమో కాని అది పాటించిన సదరు వ్యక్తి యొక్క ఔన్నత్యానికి కాదు.....

"కిచెన్లో స్నానాలు ఎందుకు చేయొద్దు...
బెడ్రూంలో పూజలు ఎందుకు చేయొద్దు..."

ఇలాంటి వెర్రి ప్రశ్నలను అడిగినవారిని ఏమని సంబోధించాలో,

దేశకాల ప్రాముఖ్యతను గుర్తించి 
శాస్త్ర వచనాలను గౌరవించి జీవించే వారిని తప్పు పట్టేవారిని కూడా అట్లే సంబోధించవలసి ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.....

అలా ఒక పద్దతిగా ఈశ్వరభక్తి భరిత గార్హస్త్య జీవితం లో ఉండి అధ్యాత్మ సాధన చేసే వారే అందరికంటే గొప్ప అని శ్రీచాగంటి సద్గురువులు గృహస్తాశ్రమ ధర్మాన్ని ఎన్నెన్నో ప్రవచనాల్లో నొక్కి వక్కానించారు.......

ఎందుకంటే ఒక గృహస్తు యొక్క భక్తభాగవత ఆరాధన సాధుసజ్జన ఆదరణ వల్లే ఇతర ఆశ్రమధర్మాలను స్వీకరించి జీవించేవారికి జీవనం సంభవం.....

అవతల ఉన్న వ్యక్తి యొక్క యోగ్యతను, పాత్రతను, ఈశ్వరభక్తిప్రపత్తిని బట్టి ఒక గృహస్తు తన శక్తికొలది దానధర్మాలు చేస్తేనే సదరు  పురోహితునకు కాని, సాధుసన్యాసికి కాని, ఇతర భక్తభాగవతులకు కాని లౌకిక జీవనం సంభవమయ్యేది......

సమజానికి సహాయకారులైన వ్యక్తులు
ఈ భూమిపై ప్రభవించాలన్నా గృహస్తాశ్రమాన్ని గౌరవించినప్పుడే అది సాధ్యం......

కాబట్టి సాంసారిక కర్తవ్యాలతో విహిత ధర్మాచరణతో కామ క్రోధాది " అరిషడ్వర్గ " స్పర్ష లేకుండా ఒక గృహస్తు జీవించడం అసాధ్యం.....

సంసారం లో ఉన్నంత మాత్రన భక్తి లేనట్టు కాదు.......
సంసారాన్ని త్యజించినంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు.....

శ్రీ చాగంటి సద్గురువులు చెప్పినట్టుగా 
"నీటిపై నావ ఉండాలి కాని, నావలో నీరుండరాదు......"

అప్పుడే ఆ నావను ఆధారంగా చేసుకొని ఉన్నవారందరి మనుగడ సంభవమయ్యేది.....
అట్లే 
వ్యక్తి సంసారంలో ఉండాలి కాని, వ్యక్తిలో సంసారం ఉండకూడదు....

అప్పుడే ఆ వ్యక్తి యొక్క గృహస్తాశ్రమధర్మాన్ని
ఆధారంగా చేసుకొని ఉన్నవారందరి మనుగడ సంభవమయ్యేది.....

ఒడ్డున నిల్చున్న వ్యక్తికి కనిపించేది కేవలం ఒక సముద్రంలో  సాగిపోతున్న నావ, అందులో ప్రయాణం సాగిస్తున్న జనం.....

కాని ఆ నావ నడిపేవారికి కనిపించేది కల్లోల కెరటాల సాగరం.....
వారికి అవసరమయ్యేది అందులో మునిగిపోకుండా ఎంతో జాగ్రత్తగా నావను తీరానికి చేర్చే నావిక కౌశలం.....

కాబట్టి సంసారంలో ఉన్నవారికి యొగము భోగము రెండూ అవసరం......

భోగము లేనిదే యోగము సిద్ధించదు.....
యోగము సిద్ధించనిదే అమరిన భోగానికి సార్ధకతలేదు....

ఇవ్విధముగా భోగ యోగములు సమ్మిళితములైనప్పుడు మాత్రమే ఆ గృహస్త జీవితం పరిపూర్ణతను సంతరించుకొని భగవద్ప్రీతికరమై తుదకు మోక్షప్రదమై వర్ధిల్లుతుంది..... 

ఇది కూడా శ్రీ చాగంటి సద్గురువులు ఎంతో సరళంగా విశదీకరించారు చాలా సార్లు వారి వివిధ ప్రవచనల్లో......

ఒక చెరుకుగడను 4 భాగాలుగా నరకాలంటే వెయ్యాల్సిందే 3 వేట్లే..... మూడో వేటుకు ఆ నాలుగో ముక్క అయాచిత ఆర్జితంగా లభించి ఆ ప్రయాస లాభిస్తుంది......

అట్లే ధర్మార్ధకామమోక్షములు అనే నాలుగు ముక్కలను సాధించడమే ప్రతి ఒక్కరి జీవిత పరమావధి కాబట్టి 
ధర్మం, అర్ధం, కామం వీటికొరకై భక్తియుత జీవితం గడిపిననాడు ఆఖరిదైన మోక్షం పైన లభించిన నాలుగో చెరుకు ముక్కలా 
ఈశ్వరుడు అనుగ్రహించి మన ధార్మిక జీవితానికి పరిపూర్ణతను ఆపాదిస్తాడు అనేది సద్గురువుల సార్వకాలిక సత్యబోధ......

ఆ అర్ధకామములను కూడా అందుకే మధ్యలో పెట్టారు.....
అంటే గార్హస్త్య ధర్మంతో అర్ధకామములను ముడివేసిన నాడు అవి ధర్మం తో పూర్వబంధనం చెందిన కారణంగా ఉత్తరబంధనమైన మోక్షం ఈశ్వరానుగ్రహంగా సిద్ధించబడడం తథ్యం....!

ఎందరెందరో అధ్యాత్మవేత్తలు ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రౌఢ శాస్త్రవచనాలను వల్లే వేస్తుంటారు.......
మరీ ముఖ్యంగా గృహస్తులకు బోధలు జేయడమంటే ఈ కలికాలం లో ప్రతి ఒక్కరికి ఎంత ప్రీతికరమైన విషయమో నేను పెద్దగా చెప్పకర్లేదు.....

వేలకు వేల పీఠాలు, ఆశ్రమాలు, సన్యాసులు, అలా అధ్యాత్మిక ప్రపంచం ఈ కలియుగంలో ఎన్ని విధాలుగా కొత్త పుంతలు తొక్కి, ఒక్కొక్కరు తమదైన శైలిలో శాస్త్రబోధ గావిస్తునారో పొద్దున లేచింది మొదలు మనంచూస్తూనే ఉన్నాం......
టీవీలు వందల ఛానెల్లో చూపిస్తూనే ఉన్నాయి...

కొన్ని లక్షలమంది ఇవ్వాళ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి గురించి,  ఇతర దైవాల గురించి
ఎన్నో బోధలు చేస్తునారు.....

శ్రీచాగంటి సద్గురువులు ఒక చోట అడిగినట్టుగా, ఇవ్వాళ తిరుమలకు ఎంతమంది పాదరక్షలను త్యజించి వెళ్తున్నారు......??

తిరుపతి వరకు మినహాయింపు ఇచ్చినా సరే, తిరుమల కొండ ప్రారంభం అయ్యేప్రదేశానికి చెప్పులు అనేవి ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఉండకుండా ఉండడమే ఆ స్వామికి మనమిచ్చే సర్వోన్నత గౌరవం.....

ఎంత మంది ఇవ్వాళ తమ గుండేమీద చెయ్యేసి మేము తిరుమలకు వెళ్ళేటప్పుడు అసలు చెప్పులు వేసుకోము అని ధైర్యంగా చెప్పగలరు......??

కొండ మొత్తం పరమాత్ముడే అని ఒక  వైపు చెప్తునారు.....
మరి ఆ కొండకు చెప్పులు ఎలా చెప్తున్నారు....?

మీరు AC కార్లల్లో వెళ్ళినా ఆ స్వామి ఏమి అనుకోడు......
మీరు VIP  సూట్లో బసచేసినా ఆయన ఏమి ఫీల్ అవ్వడు.......

కాని అంతటి పవిత్రమైన కొండపైకి ఒకటో రెండో రోజులు ఉండే యాత్రకి కూడ చెప్పులు లేకుండా వెళ్ళము / వెళ్ళలేము అనేవారు.......,
ఎవరైనా తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం అని లడ్డు ఎదురుగా పెడితే
'ఎంత సౌభాగ్యం ఉంటే తిరుమల ప్రసాదం లభిస్తుందో కద.....'  అని, కాళ్ళకున్న పాదరక్షలు
( లోఫర్స్ ) ఒక్క రెండు సెకన్ల పాటు అలా వదిలి, అది కళ్ళకద్దుకొని తినాలి అనే సోయి కూడా లేని వారికి,
ఇతరుల భక్తి గురించి,
వారి భక్తి భరిత గార్హస్త్య జీవితం గురించి మాట్లాడేంతటి అర్హత, యోగ్యత ఉందని నేనైతే అనుకోను.........

" పరోపదేశవేళాయాం సర్వే వ్యాసపరాశరాః...... " అనే గురువుగారి ఛలోక్తి ఇక్కడ బాగ సరిపోతుందనుకుంటా......

కాబట్టి యోగ భోగములను కలిగించి
అవి భక్తభాగవతులకు సాధుసజ్జనులకు ఉపయుక్తమయ్యేవిధంగా మన గృహస్తజీవితాలను పరిపూర్ణం గావించి,
మనం కావించే కాస్తో కూస్తో అధ్యాత్మ ప్రయాసను ఈశ్వరుడు కోటి రెట్లు హెచ్చ వేసి కరుణించే
 ఇలాంటి అరుదైన అనన్యసామాన్యమైన 
' యోగ లింగ / ముక్తి లింగ ' క్షేత్రం జీవితంలో ఒక్కసారైన భక్తులు వీలుచేసుకొని దర్శించి తరించండి......

క్షేత్రం గురించిన మాహాత్మ్యము మరియు ఇతర వివరాలు ఇంటర్నెట్లో అందరికి లభ్యమే.....😊

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన, మనబడే పంచముఖాలతో యావద్ విశ్వాన్ని నడిపించే ఆ సర్వేశ్వరుడి దయతో, 

తన వామదేవ స్వరూపమైన శ్రీమహావిష్ణువుయొక్క కలియుగ ప్రత్యక్ష అవతారమైన 
ఆ తిరుమల శ్రీశ్రీనివాసుని కరుణాకటాక్షాలతో ఈ 
" శ్రీ శార్వరి " నామ తెలుగు నూతన సంవత్సరం ఎల్లరికి సర్వ శ్రేయస్సులను కలుగజేయుగాక అని అభిలషిస్తూ అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊




No comments:

Post a Comment