గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్|
దీనానామతివేలభాగ్యజననీందివ్యామ్బరాలఙ్కృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౫||
విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రము నందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యము నిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను. "
అని, శ్రీఆదిశంకరాచార్యుల వారు ఎంతో ఘనమైన రీతిలో ఆ పరాంబికను శ్రీశైలభ్రమరాంబికాష్టకంలో స్తుతించడం ఎల్లరికి విదితమే కద...
ఇక్కడి మొదటి పంక్తిలో
" శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం "
అని వచించడంలో జగద్గురువులు మనకు ఆ పరేశ్వరి యొక్క పరిపాలనావైభవం గురించి వర్నించి ఉన్నారు కద.....
" విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రము నందు సంచరించుచున్నది,.."
అని ఇక్కడ మనకు తాత్పర్యం చెప్పడంలో స్థితికారుడైన శ్రీమహవిష్ణువు చే అనగా నారాయణుడిచే నారాయణిగా ఆదరించబడి ముల్లోకాలను పరిపాలించడానికి మరియు శ్రీచక్రమునందు సంచరించడానికి ఏమిటి సంబంధం....??
శ్రీ చాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా శ్రీఆదిశంకరాచార్యులవారు, వారు రచించిన వందల వేల అధ్యాత్మ సాహిత్యాల్లో ఎక్కడ కూడా ఒక్క అక్షరంకూడా ఎక్కువ కాని తక్కువ కాని ఉండని రీతిలో అత్యంత ఉన్నతమైన సుసాహితీ ప్రౌఢిమతో ఉండే వారి గగనగంభీరమైన స్తోత్ర రత్నాల్లో ఒక్కొక్క పదబంధనంలో ఒక్కొక్క మహాసముద్రమంత అర్థగాంభీర్యతను ఎంతో నిఘూడంగా పొందుపరిచి, మామూలుగా చదివితే ఎంతో సరళమైన సాహితీ సుమాలలా గుబాలించే ఆ పదపారిజాతాలవెనక
ఎంతో గహనమైన తత్త్వ చింతన దాగిఉండడం అనే సత్యం సాహితీస్రష్టలెల్లరికి సుపరిచితమే కద.....
ఇక్కడ ఆ ' త్రిభువనపాలిని ' ,
' శ్రీచక్రసంచారిణి ' అనే ఆ పదసుమలాను పక్కపక్కనే అల్లడానికి గల కారణం మరియు ఆషాఢ శక్తిగా మేల్కొని దక్షిణాయణ నాయకి గా అమేయమైన కాలచక్రం యొక్క పగ్గాలను చేబూని
పరిపాలించే ఆ పరాశక్తికి
" ఆషాఢ బోనం " అనే పేరుతో స్వాగతం / నివేదన సమర్పించే తెలుగుసీమ / తెలంగాణ నైసర్గికాచారవైభవం గురించి కొంతమేర చర్చిద్దాం....
( నేను ఇదివరకే ఈ క్రింది పాతపోస్ట్లో కొంత మేర ఆ పరాశక్తి యొక్క వైభవాన్ని వివరించిఉన్నాను కద..... దానికి అనుబంధంగా ఇప్పుడు మరికొంత విశ్లేషణ....
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/blog-post_66.html?m=0
https://m.facebook.com/story.php?story_fbid=10217468411515553&id=1033694038 )
లలితపారాయాణంలో మనకు బోధించబడినట్టుగా
ఆ పరాశక్తిని వాగ్దేవతలు
" సృష్టికర్త్రి బ్రహ్మరూపా....
గోప్త్రీ గోవిందరూపిణి.....
సమ్హారిణి రుద్రరూపా....
తిరోధానకరీశ్వరి.....
సదాశివానుగ్రహద.....
పంచకృత్యపరాయణ..... "
అని కద కీర్తించారు.......
సృష్టి, స్థితి, సమ్హారక నిర్వాహకులుగా ఉండే త్రిమూర్తులకు ఆ ఆదిపరాశక్తి యొక్క శక్త్యాంశలు జతగా ఉండి ఆయా విహిత కార్యములను నిర్వహించడం ఎల్లరికి విదితమే కద....
ఈ మూడు కూడా ఎవ్వరు ఔనన్నా కాదన్నా తమంతతాము నిత్యం జరిగే / జరుపబడే కార్యాలు.....లలాటలిఖితానుసారంగా అవి జరగడం అనేది ఆ విధాత యొక్క శాసనం.....
కాబట్టి
వాటిలో మన పాత్ర ఉండడం కాని / వాటిపై మనకు పట్టు ఉండడం కాని ఇక్కడ అన్వయం కాని విషయం.....
ఈ మూడు కాకుండా మిగతా రెంటిని కూడా అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సర్వేశ్వరి యొక్క వైభవం మనకు సంపూర్ణంగా అవగతమవుతుంది......
ఈ అధ్యాత్మ వాస్తవం అర్ధంకాని వారు / అవగతం చేసుకోని వారు / అవగతం చేసుకునేందుకు యత్నించనివారే సాధారణంగా లోకంలో మెట్టవేదాంతులుగా ఉండి వివిధ రీతుల అధ్యాత్మతను అపహాస్యం చేస్తుంటారు....
" ఆ ఏముందండి.....అంతా మన రాత.....అన్నీ ముందే రాసిపెట్టి ఉన్నప్పుడు ఇక మళ్ళి మనం ఈ ప్రార్ధనలు, పూజలు, నోములు, వ్రతాలు అన్నీ చేయడం ఏదో చాదస్తం అంతే....."
అనేలా ఉండే డైలాగ్స్ ఇలాంటి వారివే....
"అన్నీ ముందే రాసుంటే...." అని అన్నప్పుడు.....
అలా రాసేవారొకరున్నారని....
అలా రాయబడేందుకు ఒక వ్యవస్థ ఉందని....
అలా రాయించబడిన వ్యవస్థకు ఆ రాతను సరిదిద్దే శక్తి ఎల్లప్పుడూ ఉంటుందనే సత్యాన్ని మరచి ప్రవర్తించే ఆధునిక పోకడల అసలైన చాదస్తులు అన్నమాట ఈ మెట్టవేదాంతులు....
సృష్టి కర్త యొక్క కర్మసిద్ధాంతానుగునంగా మాత్రమే జీవగతి మొత్తం నిర్దేశించబడి ఉంటే
అప్పుడు కర్మ గొప్పదౌతుంది....
కర్మ తత్జడం అన్నారు కాబట్టి....
ఆ కర్మను శాసించే సిద్ధాంతానికి
ఒక అధికార శక్తి కలదు....
ఆ అధికార శక్తి యొక్క అనుగ్రహంపైనే యావద్ మానవ మనుగడ నిరంతరం ఆధారపడిఉంటుంది....
ఆ " సర్వాధికారశక్తి " కే ఈశ్వరుడు / ఈశ్వరి / భగవంతుడు / భగవతి / పరమాత్మ / ఇత్యాది గా గల నామవాచకాలతో మీరు ఏ నామరూపాత్మకంగా ఆ శక్తిని కొలిచినా సరే,
మన ప్రార్ధనకు వారి అనుగ్రహం అనే ఫలం నిరంతరం అందివ్వబడి, ఆ సైద్ధాంతిక కర్మమార్గ ప్రయాణాన్ని
జీవుడికి సులభతరం గావించడమే "ఈశ్వర కృప..." !
తిరోధానకరి+ఈశ్వరి......
సదాశివ+అనుగ్రహదా......
తిరోధానం, అనుగ్రహం....
అనే ఈ రెండింటిపైనే ప్రతి మనిషియొక్క జీవన గమనం ఆధారపడి ఉండేలా గావించడమే ఆ ఈశ్వరుడి గొప్పదనం......
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో మనకు బోధించబడినట్టుగా ,
" సదాశివ " అని కాకుండా
"సదావిష్ణు" , "సదాబ్రహ్మ " అనే పదాలు కూడా ఎక్కడా వినము.......
ఈశ్వరుడిగా తిరోధానం.....
సదాశివుడిగా అనుగ్రహం......
ఈ రెండు కార్యాలు ఆ పరాశక్తి నిర్వహిస్తున్నందుకే మనం జీవితంలో ప్రశాంతంగా ఉండగలగడం.....
లేనిచో కేవల
సృష్టి / స్థితి / లయం అనే నిర్దేశిత
కర్మ సిద్ధాంతం లోనే నిరంతర జీవయాత్ర సాగుతూంటే...,
అసలు జీవుడికి స్వతంత్రత / మోక్షము
అనే అత్యున్నతమైన స్థాయి అనుగ్రహము నుండి దైనిక జీవితపు లౌకిక ప్రశాంతత వరకు, లభ్యమయ్యే దైవానుగ్రహకారక వ్యవస్థకు ప్రాతిపదిక ఎక్కడుంది...??
ఈశ్వరుడిని విస్మరించి జీవించే వారికి మాయ అనే తెర వేయడం.....
భక్తితో ప్రార్ధించినవారికి మాయ అనే తెర తీయడం....
ఇదే ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం....
అందుకే
" మహామాయా విశ్వంభ్రమయసిపరబ్రహ్మమహిషీం...."
అనే ఎంతో గంభీరమైన భావుకతా భరితంగా ఆ పరాశక్తి యొక్క వైభవం శ్రీ చాగంటి సద్గురువులు మనకు తరచు బోధిస్తుంటారు.....
ఇక లౌకిక సామ్యానికి వస్తే.....
1. " బోనమెత్తడం "
జీవుడు జన్మనెత్తడం..
ఆ జీవేశ్వర తత్త్వానికి తనలోనే శ్రీకారం చుట్టడం.....
2. బోనం అమ్మవారి సన్నిధి చేరేంతవరకు ఎక్కడా దించకుండా ఉండడం.....
జన్మనెత్తిన జీవుడు ఈశ్వర శాసనంగా మాత్రమే ఆ జీవయాత్ర ముగిసేంతవరకు ఎక్కడా ఆ యాత్రను తనకు తాను ఆపకుండా ఉండడం....
3. బోనమెత్తిన వ్యక్తికి / ఎత్తిన బోనానికి అభేద భావనను పాటించడం......
అనగా జన్మనెత్తిన జీవుడికి ఆ జీవాంతర్గతమై ఉండే జీవేశ్వరుడికి అభేద భావనను పాటించడం...
ఇదే మన సనాతన ధర్మానికి మూలాధారమైన
" అద్వైతసిద్ధాంతం "
4. బోనం ఎత్తిన వ్యక్తికి ఒకానొక దశలో సంభవించే
" పూనకం " అనే ఆ దైవిక స్థితిలో జీవేశ్వరుడితో జీవుడు తన జీవాత్మ పరమాత్మ సమ్యోగ స్థితిని సాధించుకోవడం.....
ఇదే ఆ జీవ జీవేశ్వర సమ్యోగ జనిత అద్వైతానుభవ స్థితికి సామ్యము.....😊
5. బోనం ఊరెరిగింపుగా మేళతాళలతో బ్యాండుబాజాతో సమర్పించబడే ఆ సమయంలో
" తనపై " లేదా " తనుకు " ఆరోపించబడిన ఆ ప్రత్యేకమైన దైవావేశిత / పూనకం అనే ప్రత్యేక స్థితిని కలిగించిన ఆ పరతత్త్వాన్ని విశిష్టమైన తత్త్వంగా పరిగణించి ఆ పరమాత్మతత్త్వాన్ని జీవ జీవేశ్వర సంబంధంగా విశేషంగా గౌరవించడం, ఆరాధించడమే
" విశిష్టాద్వైత " సామ్యము....😊
ఇలా ఉండే ఆ త్రిభువనపాలిని ని శ్రీచక్రసంచారిణి అని స్తుతించడంలోని ఆంతర్యం......
శ్రీ చాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా
శ కార
ర కార
ఈ కార
బీజాక్షర సమ్యోగంగా జనించే శ్రీకారం శాక్తేయప్రణవం.....
అనగా ఎందులో నుండి అన్నీ ఉద్భవించి
ఈ " పంచకృత్యపరాయణ " యొక్క అనుగ్రహానికి పాత్రతను సంతరించుకొని పరిఢవిల్లుతాయో
ఆ శక్తికేంద్రక స్థానం శ్రీకారం....
ఇక్కడ త్రిమూర్త్యాత్మక సృష్టి స్థితి లయకు శాక్తేయ సామ్య సూచికగా ఉండేవి...
శ కారం
ర కారం
ఈ కారం
కాని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ఈ త్రిశక్తిసంఘాతమైన శ్రీకారంలోనే
శ్ర కారం
రీ కారం
కూడా అంతర్నిహితంగా
" తిరోధానం " మరియు " అనుగ్రహానికి "
శాక్తేయసూచికలుగా గర్భితమై ఉన్నాయి....
కాబట్టి ఆ పంచకృత్యపరాయణా సాగించే 5 ప్రక్రియలు కూడా వాటియొక్క శాక్తేయ తత్త్వసూచిక బీజాక్షరసంఘాతంగా ఒక్క శ్రీకారం లోనే దాగున్నాయి అనేది ఇక్కడి అధ్యాత్మ తత్త్వ సూక్ష్మం.....
శ్రీచక్రం అనగా ఆ శ్రీకారం అనే అవాంజ్ఞ్మానసగోచర బీజాక్షరగర్భితమైన ఆదిపరాశక్తిని మానవ గ్రాహ్యరూపంలోకి ఈశ్వరానుగ్రహంగా
లభ్యమయ్యే వ్యవస్థలోకి కుదురుకునేలా మనకు ఉపకారయుక్తంగా ఉండగలిగే కర్మేంద్రియగ్రాహ్య ఏర్పాటు.....
అమేయమైన శక్తివిస్ఫోటకాలైన
బీజాక్షరాల గురించి ఒక శ్రేయస్కరమైన పరిధిదాటి వాటి గురించి చర్చించకూడదని అస్మద్ గురుదేవుల సద్వాక్కట్టడి కాబట్టి నేను ఆ శ్రీకార బీజాక్షర వైభవ విశ్లేషణ ఇంతవరకు మాత్రమే చెప్పవలెను....😊
మిగతా గహనమైన శాక్తేయ వైభవ విశేషాలు వివిధ ఉపాసకుల ఉపాస్యదైవముల అనుగ్రహంకొలది, వారి వారి గురువుల యొక్క అనుగ్రహంకొలది
వారికి జ్యోతకమయ్యే దైవానుగ్రహము ద్వారా మాత్రమే గ్రహ్యము కాబట్టి ఇక
వాటి గురించిన చర్చ ఇక్కడ సంపూర్ణమైనది గా భావించవలెను...😊
కరోనా కారణంగా ఈసారి ఇంటివరకే పరిమితంగా అందరు బోనాల ఉత్సవం జరుపుకోవడం విదితమే కద....
శ్రీ శార్వరి ఆషాఢ జాతర బోనం ఎత్తిన నా శ్రీమతి యొక్క పిక్....😊
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgbVoZlH1UJJILXm8P5__z4W3n4F80HihubnQhLmMFnozS5Qg4Ebk7qDd2cs4syBuvGG1pPy0-7qls8LoyNpXPh97F6BBe5QbeM-V0Uu8BNmi4G-zSgR8eAlieZU7Yr-9hI2D_1ardq4Q7w/s1600/1594562813853786-0.png)
No comments:
Post a Comment