శ్రీకృష్ణవిజయం సినిమాలోని జోహారు "శిఖిపింఛమౌళి...." అనె సి.నా.రె గారి రచనలోని
"నిగమాలకే నీవు సిగబంతివైనావు"
అనే అత్యత్భుతమైన పదప్రయోగం గురించి వినేఉంటారు చాలామంది....
అంత ఘనంగా శ్రీకృష్ణుడిని వర్నించే భాగ్యం కీ.శే
శ్రీ.సింగిరెడ్డినారాయణరెడ్డి గారికి
శ్రీమద్భాగవతం పై గల ఎనలేని అభిమానంతో వారు గావించిన అధ్యవసాయభరిత పరిశోధనాత్మక దృక్కోణంలో ఒడిసిపట్టిన భగవత్తత్వం యొక్క మహత్తు వల్లే అనేది లోకవిదితమే కద.....
( వారి " మందారమకరందాలు " యొక్క
గొప్పదనం సాహితీలోకానికి సుపరిచితమే కద )
ఇక శ్రీమద్భాగవత గ్రంథరాజమును
ఇతిహాస పౌరాణిక వాంజ్ఞ్మయ నిగమంగా భావిస్తే ఆ నిగమమణిపూస గా వెలుగొందే "శ్రీకృష్ణదివ్యలీలలు" యొక్క మహత్తు అంతా ఇంతా కాదనేది జగద్విదితమైన సత్యం....
ఇందుకు గలమూలకారణాలు మనకు శ్రీచాగంటి సద్గురువులు ఎంతో ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలతో ఉపాసనగావించి మనకు అందించిన శ్రీపోతనామాత్య విరచిత తెనుగు శ్రీమద్భాగవతానికి ఆ శ్రీరామహస్తకలితకలం యొక్క ప్రత్యక్ష స్పర్శ వల్ల.....
శ్రీపోతనామాత్యులవారిచే ఆంధ్రీకరించబడిన ఆ శ్రీమద్భాగవతం, మిగతా అన్ని పురాణాల మాదిరిగ శ్రీవేదవ్యాస మహర్షి వారిచే విరచితమైనా సరే, ఈ క్రింది ప్రత్యేకతలవల్ల మిగతా అన్ని సారస్వతములకెల్ల శ్రీమద్భాగవతం ఎంతో ప్రశస్తమైనది అని మన పెద్దల ఉవాచ కద.....
1. అన్ని పురాణాలను రచించిన శ్రీవేదవ్యాసుల వారు ఏదో తెలియని వ్యాకులతతో సరస్వతీ నదీ తీరాన సంచరించే సమయంలో వారికి సాక్షాత్తు శ్రీనారదమహర్షి వారిచే ఉపదేశపూర్వకంగా అందివ్వబడిన భగవత్సంకల్పంతో శ్రీమద్భాగవతరచన జరిగింది కాబట్టి...
2. శ్రీ చాగంటి సద్గురువులు ఎంతో రసరమ్యంగా మనకు విశదీకరించిన వైనంలో బోధించబడినట్టుగా....
మిగతా పురాణవాంజ్ఞ్మయం అంతా కూడా సూతమహర్షి వారిచే శౌనకాదిమహర్షులకు తద్వారా యావద్ లోకానికి అందివ్వబడినది...
కాని మహత్తరమైన శ్రీమద్భాగవతం
అట్లుకాక సాక్షాత్తు శ్రీవేదవ్యాసపుత్రులైన శ్రీశుకబ్రహ్మచే మొట్టమొదటిసారి పరీక్షిత్ మహారాజు గారికి భాగవతసప్తాహంగా అనుగ్రహించబడి తద్వారా ఈ లోకానికి అందివ్వబడింది....
అనగా భగవద్ అంశగా ఆరాధించబడే ఏ శ్రీవ్యాసమహర్షి వారు రచించారో "ఆత్మావైపుత్రనామాసి " అని గురువుగారు చెప్పే విధంగా సాక్షాత్ శ్రీవ్యాసతేజస్సే ఈ లోకానికి ఉపదేశపూర్వకంగా అనుగ్రహించడం....
3. మరియు శ్రీకృష్ణపరమాత్మ యొక్క నిర్హేతుక అనుగ్రహం తో / అనుగ్రహం కొరకు ఈ లోకానికి అందిన మహత్తరమైన సారస్వతత్రయం లో ఒకటైనందున....
( శ్రీవిష్ణుసహస్రనామం, శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతం ఈ ఐతిహాసిక త్రయం యొక్క అనుగ్రహం లభించడం కేవలం శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అది సాధ్యం.....)
కాబట్టి శ్రీమద్భాగవత శ్రవణ / స్మరణ / మనన / నిధిధ్యాసనములు
మిగతా ఎన్ని అధ్యాత్మ సాధనలకన్ననూ మిక్కిలి శ్రేష్ఠమైనవి ఎంతో ఉత్కృష్ఠమైనవి అనన్యసామాన్యమైనవి.....
అందుకే కద అంతటి విచిత్రమైన విశేషపుణ్యదాయకమైన శ్రీమద్భాగవతం యొక్క మహత్తును శ్రీపోతనామాత్యుల వారు తమ పద్యంలో అంతే విచిత్రంగా ఉల్లేఖించారు....
"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత, కన్నంత,
దెలియ వచ్చినంత, దేటపఱతు.
భావము:
అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను."
అని సకల పురాణశాస్త్రవాంజ్ఞ్మయాన్ని తమలోకి జీర్ణం చేసుకున్న శ్రీపోతనామాత్యులవారే సెలవివ్వడం,
మరియు శ్రీపోతనామాత్యులవారంటే ఎంతో గౌరవం గల శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులు భాగవత పద్యాలను వల్లెవేస్తు పాదయాత్రలు చేసి దైవదర్శనం సిద్ధించుకోవడం వంటి తార్కాణాల దృష్ట్యా శ్రీమద్భాగవతం యొక్క ప్రాముఖ్యత తెలపకనే తెలపబడే అధ్యాత్మ సత్యం......
బెల్లం లేకపోతే ఈశ్వరుడికి గావించే నివేదన సంపూర్ణతను సంతరించుకోదు.....
వేపాకు లేకపోతే అమ్మవారికి బోనం
ముట్టదు.....
గుమ్మడిపువ్వు లేకపోతే బత్కమ్మ సంపూర్ణత సనతరించుకోదు....
చైత్రశుద్ధనవమి నాడు శ్రీసీతారాములకళ్యాణం నిర్వహించే ఆలయాలు లేకపోతే ఆ పరిసర గ్రామాల్లో / ప్రదేశాల్లో నివసించే జీవితాలు సంపూర్ణతను సంతరించుకోవు..
అట్లే శ్రీమద్భాగవత కథాసుధను కర్ణపేయంగా జుర్రుకోని అధ్యాత్మ జీవనం / ఉపాసన భగవదనుగ్రహాన్ని, సంపూర్ణతను సంతరించుకోదు.....
అటువంటి శ్రీమద్భాగవతం, శ్రీకృష్ణలీలల వర్ణన లేనిదే
సంపూర్ణతను సంతరించుకోదు.....!!
అంతటి ఘనమైన దైవం కాబట్టే ఇప్పటికీ మరియు ఎప్పటికి " కృష్ణంవందేజగద్గురుం " అని ఆ పరమాత్మ యొక్క స్తుతి....
నువ్వు మాతో ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే కృష్ణా అన్నందుకు, అన్నితానై గొపబాలురను అంతగా పొదివిపట్టి రక్షించాడు....!
కేవలం యజ్ఞ్యహవిస్సులను మాత్రమే అగ్నిముఖంగా స్వీకరించే పరమాత్మ
గోపబాలురతో నేలపై కూర్చొని చల్దులారగించాడు...!
జారచోరలీలలతో హాస్యాన్ని పండిస్తూనే ఎల్లరి జీవితాలను పండించాడు.....
సమ్మోహన మురళీగానంతో గోపగోపికాసమూహానికి ఏకంగా జీవాత్మపరమాత్మసమ్యోగ సిద్ధిని
రాసలీల ద్వార రక్తికట్టించాడు....
కాస్తంత గంధమలదిన కుబ్జను కడుసౌందర్యవతిగా మార్చాడు....
కొన్ని పుష్పమాలికలను సమర్పించుకున్న మాలాకారుడిని మహదైశ్వర్యవంతుడిగా మార్చాడు....
బావా...నాకు అన్నీ నువ్వే అని ప్రార్ధించిన బామ్మర్దికి ఏకంగా పార్ధసారధి గా మారి.,
దుర్లభమైన దైవదర్శనాలను దెగ్గరుండిమరీ చేయించాడు.....
ఎంతోశక్తివంతమైన అస్త్రాలను అవలీలగా పొందేలా అనుగ్రహించాడు....
తన మోకాలి చిప్పనే శివలింగంగా దర్శింపజేయించి శివకేశవ అభేదాన్ని తనలోనే స్థిరీకరింపజేసాడు...
అస్త్రం పట్టను...యుద్ధం చేయను అని ప్రతిన బూనినా, కురుసంగ్రామంలో ఏకంగా భీష్ముడిపైకి రథచక్రంతో విరుచుకుపడ్డాడు....
ఎన్నెన్నో విధాలా అర్జునిడిని / పంచపాండవులను రక్షించి తుదకు కురుసంగ్రామంలో విజయాన్ని కట్టబెట్టాడు......
"నేను, నావారు ఎమైనాసరే,
నువ్వే నాకు లోకం....నువ్వే నా ప్రాణం....
నీతోనే నాకు జీవితం....."
అని అగ్నిద్యోతనుని ద్వారా వర్తమానం పంపిన రుక్మిణీదేవికి మాత్రమే చిరు తులసీ దళానికి తూగిన పరమాత్మ, తనకు కావలసింది తనపై నిర్మలమైన
భక్తి, గౌరవం, మరియాద...
కేవలం వాటితో మాత్రమే తనని సాధించగలరు అని సత్యభామకు ఎంత సున్నితంగా లీల గావించి అవగతపరిచిన దేవకీవసుదేవ సుతుడో....
తనపై, తనవారిపై పొగరుతో మిడిసిపడిన వారి కుత్తుకలను కర్కషంగా నరికివేసిన నారాయణ ధీరత్వాన్ని అంత కఠినంగా చాటిచెప్పిన యదుకులవీరుడు ఆ యశోదానందనందనుడు.....
గడసరి గోపికలు తనకు అందకుండా ఉట్లల్లో దాచిన వెన్నను అందుకొని అందరికి పంచి ఆరగించినా తనకేచెల్లింది.....
గర్వితుడైన ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలని గోవర్ధనగిరిని చిటికెనవేలిపై 7 దివారాత్రముల పర్యంతం నిలిపి,
" భువనభాండాలన్నీ వచ్చి దీనిమీద పడినా సరే ఇది ఇసమంతైనను సడలదు.....
మీకు నేను అభయం ఇస్తునాన్ను...."
అని అందరిని పిలిచి మరీ రక్షించినా అది ఆ గోవిందుడికే చెల్లింది.....!!
అష్టపట్టమహిషులతో హంసతూలికాతల్పంపై శయనించినా ఆయనకే చెల్లింది.....
అదే హంసతూలికాతల్పంపై ఒక మితృడిని కూర్చుండబెట్టి వారితో అర్ఘ్యపాద్యాలను అందించేలా చేసినా అది ఆయనకే చెల్లింది..
యుద్ధభూమిలో ఉండి "నాకు ఏమి చేయాలో అర్ధంకావట్లేదు బావా ...." అని
అర్ధించిన అర్జునుడికి
"యావద్ విశ్వంలో ఉన్నది నేనే....
నాలోనే యావద్ విశ్వం కలదు.....
నేను చెప్పింది చేయ్...."
అని విశ్వరూపాన్ని ప్రదర్శించినా ఆయనకే చెల్లింది....
" నీ చెల్లెలి కోడల..." అని ప్రార్థించిన ఉత్తరకు, తన గర్భస్థ పిండంపైకి దూసుకెళ్తున్న బ్రహ్మాస్త్రానికి అంతటి సూక్ష్మరూపియై ఎదురునిలిచి ఆ బ్రహ్మాస్త్రశక్తిని తనలోకి లయించివేసినా అది ఆయనకే చెల్లింది....!
పంచపాండవులకు ఇన్ని చేసిన శ్రీకృష్ణుడు,
తన సుదర్శనచక్రధారలతో ఎందరెందరో రక్కసిమూకల వెన్నులో వణుకు పుట్టించిన ఆ చక్రి, అప్పటికప్పుడే తనచే సృష్టింపబడిన మాయామేఘాలను సూర్యునకు అడ్డుగా వేసి కాల గతికి కల్లెం వేసిన పరమాత్మ, తుదకు, కేవలం ఒక బోయ యొక్క బాణానికి కాలిబొటనవేలికి గాయం అయ్యిందనే నెపంతో తన శరీరత్యాగం చేయడం నిజంగా విడ్డూరమే కదు....!
( అది శ్రీరామావతారంలో చెట్టుచాటునుండి గావించిన వాలివధకు ప్రతిగా తనకు తానే ఆపాదించుకున్న కర్మక్షయం అని పెద్దలు చెప్పడం వినేఉంటారు )
కాని ఇక్కడ ఒక యోగ రహస్యము దాగున్నది.....
శ్రీకృష్ణపరమాత్మ అవతారం పరిపూర్ణావతారం.....
అనగా తన దివ్యదేహంలో ఎన్నెన్నో దైవిక యోగసాధనలతో నిండినిబిడీకృతమైన పరమాత్మశక్తితో ఒక పరిపూర్ణయోగి గా ఉన్న దివ్యపురుషుడు.....
అటువంటి ఒక అసామాన్యమైన యోగబలం గల సిద్ధపురుషుడి దరిదాపుల్లోకి కూడా మృత్యువు తొంగిచూడజాలదు....
ఎన్ని శక్తులైనను తనలోకి లయింప జేసుకొవడమే తప్ప ఏ శక్తికి లొంగని పరమాత్మశక్తి తో తిరుగాడే ఆ మహనీయుడు ఎంతటి ఆశ్చర్యమైన వ్యక్తంటే.....
ఒక స్త్రీమూర్తి ఇచ్చిన శాపం నిజంచెయ్యడం కోసం తనకు తానుగా తానే తన యోగశక్తిని మొత్తం తన కాలిబొటనవేలిలోకి స్థిరీకరించి
తన కట్టడిలోనే ఉండే కాలస్వరూపంగా వచ్చిన బోయవాడి బాణ ప్రహారానికి ఆ యోగశక్తిపుంజం బద్దలయ్యేలా ప్రహారం గావించబడేలా చేసి, తద్వారా తన దివ్యదేహం ఒక సాధారణ మర్త్య దేహంగా మార్చి తన ప్రాణాలను సంతోషంగా సంపూర్ణచేతనతో
సమర్పణగావించిన లోకసారంగుడు...!
కాలి బొటనవేలితో అర్జునుడి రథాన్ని భూమిలోకి చొచ్చుకుపోయేలా శక్తిని ప్రదర్శించగల పరమాత్మ, కాలి బొటనవేలికి గాయం అవ్వడంతో తనువుచాలించాడు అనడం ఆశ్చర్యమే కదామరి...!
భౌతిక శాస్త్రం ప్రకారం "energy can neither be created nor can be destroyed but can only be transferred from one form to the other......"
అనే మౌళికసూత్రానుగుణంగా,
ఈ ప్రపంచంలోకి వినిర్గతం గావించబడిన అంతటి ఘనమైన యోగశక్తి మరి ఎక్కడికెళ్ళి కొలువై తన దివ్యత్వాన్ని ప్రకటిస్తున్నది ....??
అనేది
శ్రీవేంకటాద్రి పై కొలువైన ఆ శ్రీశ్రీనివాసుడి నిజపాదదర్శనసేవా టికెట్ లభించిన వారెల్లరికి అది కేవలం అనుభవైకవేద్యం మాత్రమే....😊
అందుకే కద శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఆ శ్రీపాదపద్మాలను ఎంతో ఘనంగా ఇవ్విధంగా స్తుతించారు.... !
ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||
చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||
చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||
చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది|
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది
http://annamacharya-lyrics.blogspot.com/2007/02/130i-padamekada.html?m=1
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgRJcgIRNvHy_Jvho85NUAq49CdT24B7k1LpsH_43TU-iZWfwXEUAg97ZHCwmR60fRdX0ZIntROZK0Xv9qLS8MhPnR9soys7E1xVdcCmhA_GuwHctyQC2wd5XY4Yf-k52TVnq5KclVBlfZp/s1600/1597438216223195-0.png)
No comments:
Post a Comment