Sunday, August 30, 2020

శ్రీశార్వరి భాద్రపదశుద్ధద్వాదశి / శ్రీవామనజయంతి శుభాభినందనలు....😊💐🍨🍕🍟


శ్రీహరి దశావతారాల్లో ఒక్కొక్క అవతారానిది 
ఒక్కో ప్రశస్తి....
ఒక్కో ఐతిహ్యం....
ఒక్కో ఆధ్యాత్మిక తత్వరహస్య భరితం.....

ఆ గహనమైన తత్త్వరహస్యాలను అత్యంత సులభసాధ్యంగా కేవలం ఆ అమోఘమైన భగవద్ తత్త్వాన్ని అంతే అమోఘమైన రీతిలో ఒడిసిపట్టిన సద్గురువులకు మాత్రమే విశదీకరించ సాధ్యం.....

అటువంటి సద్గురువరేణ్యులైన శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతాంతర్గత శ్రీవామనవృత్తాంతం విని తరించిన వారెందరికో ఆ వామనమూర్తి యొక్క ఆశ్చర్యమైన వైభవం బాగ ఎరుకపడి ఆ శ్రీమహావిష్ణువు యొక్క త్రివిక్రమాకృతి యొక్క ప్రశస్తిని వేనోళ్ళ కొనియాడడం కద్దు.....

సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారి ప్రత్యక్షానుగ్రహంతో సంస్కృతమూలాన్ని తెనుగు శ్రీమద్భాగవతంగా ఆంధ్రీకరించిన శ్రీపోతనామాత్యుల వారి అమృతకావ్యంలో ఆ శ్రీవామనమూర్తి యొక్క వైభవం ఆ పద్యగద్యాల్లో ఇప్పటికీ సజీవసాక్షాత్కారమే కద.....

శ్రీవామన అవతార ఘట్టాన్ని విశదీకరించే ఈ క్రింది పద్యం....
*****
రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.
*****

మరియు ఆ వామనమూర్తి బలిదైత్యుడొసగిన 1, 2 అడుగుల భూదానాన్ని, ఈ క్రింది పద్యంలో వివరించబడిన విరాట్ స్వరూపన్ని దాల్చి యావద్ విశ్వాన్ని 2 అడుగుల్లో కొలిచి, " 
ఇప్పుడు 3 వ అడుగు ఎక్కడ పెట్టమంటావ్....? "
అని బలిని అడగగా "నా శిరస్సుపై మీ 3డో అడుగు నాకు శిరోధార్యం...." స్వీకరించడని మనస్ఫూర్తిగ తనని తాను ఆత్మార్పణం గావించుకున్న బలిచక్రవర్తి ఇప్పటికి కూడా నవవిధభక్తుల్లో 
ఆత్మనివేదనానికి ప్రశస్తమైన ఉదాహరణగా కొనియాడబడడం ఎల్లరికి విదితమే కద....

*****
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
*****

మరే అవతారానికి లేని ఎంతో విశిష్టత, ఎన్నెన్నో గహనమైన, సద్గురుబోధాంతర్గతంగా మాత్రమే గ్రాహ్యమైన ఆధ్యాత్మిక, దైవిక, యోగ రహస్యాలు ఈ శ్రీవామనవృత్తాంతంలో కలవు....

అవి భగవదనుగ్రహం కొలది 
"అందుకున్నవారికి అందుకున్నంత మహదేవ...." 
అన్నట్టుగా అత్యంత మహిమాన్విత మాధవతత్త్వమధురిమలు...!

అసలు ఈ వామనావతార ఆవిర్భావానికి గల నేపథ్యాన్ని కొంతమేర పరిశీలించి ఆ తదుపరి ఆ త్రివిక్రమాకృతిని కొనియాడుదాము.....

"ముమ్మారు మీకు పుత్రుడనై జన్మించెద...." నని తన భక్తదంపతులకు ఇచ్చినవరం లో భాగంగా...

పృష్ణిగర్భుడు
వామనుడు
శ్రీకృష్ణుడు

అనే మూడు అవతారాలను ఆ శ్రీహరి స్వీకరించడం.....

అందులో 3వ అవతారం,
అదితికశ్యపులకు పుత్రుడిగా,
ఇంద్రునకు తమ్ముడిగా ఉపేంద్రుడిగా,
సకల దేవతల వినతిప్రకారంగా
బలిదైత్యుడు హస్తగతం చేసుకున్న దేవలోకాన్ని / స్వర్గపురిని తిరిగి దేవతలకు అనుగ్రహించేందుకు
ఒక చిన్ని శిశువుగా జన్మించి, అప్పటికప్పుడే 8 వత్సరముల వడుగై 
బలిదైత్యుడిని భూదానం అర్ధించి,
సమంత్రక జలాధారపూర్వకంగా 3 అడుగుల భూదానం పట్టిన తదుపరి, ఎవ్వరి ఊహకందని రీతిలో తన విశ్వరూపాన్ని దాల్చి యావద్ చరాచర బ్రహ్మాండాన్ని కొలిచి అందులోభాగంగా బలిని అధోలోకాలకు అణచి దేవకార్యాన్ని సాధించిపెట్టిన అత్యంత ఆశ్చర్యకరమైన అవతార వైభవం, శ్రీవామనావతారం.....!!

ఇక్కడ మనం గమనించి సమన్వయపరచి అన్వయించుకునే అధ్యాత్మిక జ్ఞ్యానగులికలను కొన్నిటిని చర్చిద్దాం.....

1. ఎందరో వందల కొలది అసురుల వలె దేవతానగరిపై దండెత్తిన బలిదైత్యుడిని ఎప్పటిలా తన పంచాయుధాల్లో ఏదోఒకటి ఉపయోగించి బలిని సమ్హరించి దేవకార్యం సాధించడం ఆ శ్రీహరికి ఒక చిన్న తేలికపాటి పని....

అందుకోసం ఇంతగా శ్రమించి మరే అవతారంలో లేని విధంగా ఆ పరమాత్మ ఒక దైత్యుడిని అర్ధించడం
ఎంత విడ్డూరమో కద అనే ఆలోచన రావడం తాత్వికులకు సహజమే కదు..!

శ్రీహరి భక్తపరాధీనుడు..!

తన భక్తుల సమ్రక్షణకోసం ఎంతమంది దుష్టులనైనను తుత్తునియలుగా నరకడం ఆయనకు నల్లేరుమీద నడక....

శ్రీరామ శ్రీకృష్ణావతారాల్లో మనం ఆ శ్రీహరి యొక్క సాటిలేని బుద్ధిబలాన్ని భుజబలాన్ని పలుమారు దర్శించడం కద్దు...

కాని అంతకు మించి ఆ
శ్రీహరి భక్తవత్సలుడు...!!

తన భక్తుల కోర్కెలు ఈడేర్చడానికి ఆయన ఎంతటి ఘనమైన విధముగనైన వాటిని సాధించిపెట్టడం, అవసరమైతే తనకు తానే వారికి లొంగిపోవడం ఆ శ్రీహరి యొక్క వాత్సల్యతతికి తార్కాణం....

అదే బాటలో తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడికి, హిరణ్యకశిప వధకై శ్రీనారసిమ్హుడిగా అవతరించిన సమయంలో ఇచ్చిన వరాల ప్రకారంగా
భక్త ప్రహ్లాదుడి తరతరాలకు తన అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని వరమిచ్చాడు.....

ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు...
విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి...

కాబట్టి ఆ వైరోచనుడు కూడా ప్రహ్లాదుడిలా శ్రీహరికి ఆప్తుడు కాబట్టి ఇతర రాక్షసులను సమ్హరించిన రీతిలో బలిదైత్యుడిని సమ్హరించి దేవకార్యం సాధించడం అన్వయం కాని విషయం...

ఏ పనైనా సాధించబడడానికి 
సామ దాన భేద దండోపాయములు
అనే సూత్రానికి అనుగుణంగా కార్యనిర్వాహక శైలిని యోచించాలి కబట్టి ఇక్కడ

సామ దండోపాయములు కుదరని పని...

అందరిచే స్తుతించబడే ఆ శ్రీహరి ఒక దైత్యుడిని స్తుతించినంత మాత్రాన ఆ స్తుతికి అసురులు లొంగడం అనేది కుదరని పని....

కాబట్టి ఇక మిగిలింది భేద దండోపాయములు మాత్రమే...

దానధర్మాలు గావించడంలో తనని మించినవారు లేరు, ఉండబోరు అనేది బలిదైత్యుడి అహంకారం....

కాబట్టి తనదైన శైలిలో ఆ అసురుడి దాననిరతిని ఆలంబనగా గావించి దేవకార్యం చక్కదిద్దడం ఇక్కడ శ్రీహరికి సర్వోచితమైన సాత్త్విక కార్యనిర్వాహక సరళి...

ఆ శ్రీహరి ఎక్కడ అడుగు పెడితే అక్కడ
సాధుసజ్జనులకు సకల శ్రేయస్సులు కలిగేవిధంగా ప్రకృతి తనకు తానుగా ఆ శ్రీహరికి దాసోహం చెందడం తథ్యం.....

కాబట్టి శ్రీవామనావతారంలో తన దేవకార్యనిర్వహణలో భాగంగా

" నేను ఎదైనా దానం చెయ్యగలను....
నన్ను మించిన దానశీలురు మరెవ్వరు లేరు..." 
అనే బలిదైత్యుడి అహంకారం కూడా సరిదిద్దబడాలి....

కాబట్టి ఆ బలిదైత్యుడు

" ఈ పాటి దానం చెయ్యడం నాకొక పెద్ద విషయమేమి కాదు కద..... ఇప్పుడే దానం చేసేస్తా...."

అనే  అత్యంత సులభమైన రీతిలో, అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆ దానం దాతకు, గృహీతకు సఫలీకృతం చెందడం....

మరియు అట్లే

ఇక ఆ బలిదైత్యునకు దానమివ్వడానికి ఏమి మిగలని రీతిలో ఆ దానం పరివర్తన చెందగా, తనకు తాను సమర్పించుకోవడం మినహ మరేమి సాధ్యపడని గహనమైన రీతిలో అది సాధించబడడం ఏక బిగిన జరిగి దేవకార్యం సాధించబడడం ఇక్కడ
ఆ శ్రీహరి యొక్క అసామాన్య కార్యసాధకత్వానికి ప్రతీక...

నేను ఇదివరకే నా పాత పోస్టులో వివరించినట్టుగా 

ఆకాశం, గాలి  అగ్ని, నీరు, భూమి     

అనే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో కేవలం భూమి మరియు ఆకాశం మాత్రమే పరిపూర్ణత కలిగిన పరమాత్మ తత్త్వప్రతీకలు...

కాబట్టి అందరికీ అన్నీ ప్రసాదించే ఆ పరమాత్మ ఒకరిని దానం అర్ధించడానికి విశేష అవతారం స్వీకరించి వచ్చినప్పుడు, తన పరిపూర్ణ తత్త్వాన్ని ఇముడ్చుకున్న పదార్ధం తప్ప అన్యములు అపరిగ్రహములు.....

ఆ శ్రీమహావిష్ణువు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే తన అనుసంధాయక శక్తి శ్రీలక్ష్మి ఎదో ఒక నామరూపాత్మకంగా అనుగమించడం కద్దు....

"నిత్యాన్నపాయినీం నిరవద్యాం దేవదేవదివ్యమహిషీం...." 

అని కదా నిత్యం శ్రీలక్ష్మీఅష్టోత్తర స్తోత్రంలో మనం ఆ శ్రీలక్ష్మిని స్తుతించడం...!

తన శ్రీభూసతుల్లో, 
ఆకాశానికి ప్రతీక శ్రీసతి....
భూమికి ప్రతీక భూసతి....

ఇక్కడ శ్రీవామనావతారంలో
ఆకాశానికి ప్రతీకగా ఉండే ఆ శ్రీలక్ష్మి 'అనఘాలక్ష్మి' గా శ్రీవామనమూర్తి యందు అభిన్నమై కూడి ఉన్నందున, 
ఇక మిగిలిన భూసతిని కూడా తనలోకి స్వీకరించగా ఆ ముగ్గురు అనగా

శ్రీపతి, శ్రీసతి, భూసతి

ఈ మూడు శక్తులు ఒక్కటై 
" త్రీణిపదాత్ త్రివిక్రమే...."
అని శృతులు కొనియాడేరీతిలో ఒక్కటై యావద్ బ్రహ్మాండo లో ఉన్న ఆ పాంచభౌతిక మహత్తును తమలోకి ఇముడ్చుకోవడంతో ఇక బలిదైత్యునకు
" నాది..." 
అని చెప్పుకోవడానికి తన శరీరం మినహా మరేమి ఉండదు....!!!

తన భార్య వింధ్యావళి తో కలిసి చిన్ని బ్రాహ్మానోత్తముడిగా ఏతెంచిన ఆ 8 వత్సరముల వటువుకు పాద్యం సమర్పిస్తున్నప్పుడు శ్రీవామనమూర్తి యొక్క కుడిపాదంపై గల గుర్తులతో
ఈతడు అనఘాలక్ష్మి సహితుడిగా ఏతెంచిన శ్రీమహావిష్ణువే...!
అనే విషయం బలిచక్రవర్తికి ప్రత్యక్షగోచరమయ్యింది....

కాబట్టి సమంత్రకంగా 3 అడుగుల భూదానం
" ఇదన్నమమ.... "
అని ఇచ్చిన మరుక్షణం తన ఎడమకాలితో నిలుచున్న యావద్ భూమి ఒక్క అడుగులో శ్రీవామనుడి సొంతమైపోతుంది...

ఇక రెండవ అడుగుతో ఆ అనఘాలక్ష్మి
శ్రీమహావిష్ణువుయొక్క కుడిపాదంలోకి యావద్ బ్రహ్మాండాన్ని అనుసంధానించి రెండవ అడుగులో ఈ భూప్రపంచం కాకుండా ఉన్నదంతాకూడా దానంలోకి వెళ్ళిపోతుంది....

ఇప్పుడు ఇక ఆ మూడో అడుగుతో ఎక్కడి భూమిని కొలవాలి...?

బాహ్య భూమి మొత్తం అయిపోయింది....

కాబట్టి " యత్ పిండే...తత్ బ్రహ్మాండే..." అనే సూత్రానికి అనుగుణంగా తన పాంచభౌతిక కాయం మినహ ఆ దాతకు అనగా బలిచక్రవర్తికి మరేమి మిగిలిలేదు....

కాబట్టి సమూలంగా తనను తాను అర్పించుకోవడం మాత్రమే ఆ 3వ అడుగు భూదానానికి సరితూగే తత్త్వసామ్యము..!

ఇవ్విధంగా ఉన్న ఆ శ్రీవామనమూర్తి యొక్క ఆశ్చర్యకరమైన 

" పతిం విశ్వస్యాత్మేశ్వరగుంశివమచ్యుతం...."

తత్త్వాన్ని 

" పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమునదిలించిన పరమాత్ముడితడేపో పతి శ్రీవేంకటవిభుడు....."

అని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు మనకు ఈ క్రింది సంకీర్తనలో అంతే ఆశ్చర్యంగా అందించి తరింపజేసారు కద....!

( కంచిలోని శ్రీఉలగళందపెరుమాల్ ఆలయం / దివ్యదేశం సందర్శించిన వారికి " అవురా....ఏమి ఆశ్చర్యకరం ఈ శ్రీవామనావతారమూర్తి వైభవం..."
అని అనిపించకమానదు.....😊 )

ప|| ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు | ఆదిదేవు డీతడేపో హరి వేంకటవిభుడు ||

చ|| ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో | బైకొనియుండ నొకవటపత్రములోపలను |
చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన- | శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు ||

చ|| అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము | సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి |
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నగలించిన | పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు ||

చ|| క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా | ధారుణియును సిరియును బాదము లొత్తగును |
చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి | నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు ||

No comments:

Post a Comment