శ్రీవేంకటేశ్వరస్వామి గా భూవైకుంఠమైన తిరుమలలో కొలువైన శ్రీమన్నారాయణుడి శ్రీ శార్వరి నామ సంవత్సర సాలకట్లబ్రహ్మోత్సవాలు భక్తులను అనుగ్రహించిన శుభవేళ.....
అధిక [ ఆశ్వయుజ ] మాసం ఉన్న కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవం నిర్వహించడం అనే ఆనవాయితిని
ఈ సంవత్సరం పాటించడం ఎల్లరికి విదితమే కద.....
అసలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఎందుకు...?
మరియు అధికమాసం వస్తే అదే బ్రహ్మోత్సవం దాదాపుగా వెంటవెంటనే రెండుసార్లు నిర్వహించడం ఎందుకు...??
అనే ప్రశ్నలు ఆధ్యాత్మికులకు రావడం సహజమే కద.....
ఆలయానికి గల నిర్దేశిత ఆగమప్రకారంగా ఆయాఉత్సవాలు నిర్వహించబడడం ఆనవాయితి....
శాస్త్ర వచనానుసారంగా ధ్వజస్తంభప్రతిష్ఠ జరిగిన ప్రతి ఆలయానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం జరిగితీరాలి....
రాజులు మరియు రాష్ట్రం ( అనగా ఈ కాలంలో పరిపాలకులు మరియు ఆలయం నెలకొన్న ప్రాంతం / రాష్ట్రం ) సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లాలంటే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం తప్పనిసరి....
ప్రతీ ఆలయానికి అలా విశేషంగా బ్రహ్మోత్సవం జరిపే ఆర్ధికసుసంపన్నత ఉండడం అన్నివేళలా ఉండడం కుదరదేమో అని శ్రీవైష్ణవాలయాల్లో శ్రీసీతారాములకల్యాణం, శివాలయాల్లో శివరాత్రిమహోత్సవాంతర్గతంగా
శ్రీపార్వతీపరమేశ్వరులకల్యాణం,
అమ్మవారి ఆలయాల్లో ఆశ్వయుజశరన్నవరాత్రోత్సవాలు నిర్వహించడం అనే సత్సంప్రదాయాన్ని మన పెద్దలు, పూర్వీకులు ఏర్పరిచినారు.....
కాని నిజానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం జరిపి తీరాలి అనేది శాస్త్రవచనం...
ఇక ఏ ఆలయ బ్రహ్మోత్సవం ఎవ్విధంగా జరుపబడాలి అనేది ఆ ఆలయాన్ని శాసించే ఆగమశాస్త్ర సంబంధంగా అక్కడి అర్చక వ్యవస్థ సువ్యవస్థీకరించడం కద్దు....
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీశ్రీనివాసుడి ఆనందనిలయం కొలువైన తిరుమల ఆలయాన్ని శాసించేది శ్రీ విఖనస మహర్షి చే ఈ లోకానికి అందివ్వబడిన శ్రీవైఖానస ఆగమశాస్త్రం.....
ఆ శ్రీవైఖానసాగమశాస్త్రోక్త విధివిధానాలు ఎక్కడాకూడా శృతితప్పకుండా పాటించబడేలా ఆలయ నిర్వాహక వ్యవస్థని కట్టుదిట్టం గావించి భగవద్ ప్రీత్యర్ధంగా నిత్యం శ్రీకైంకర్యములు జరిగేలా మంగళ ఆశాసనాలు అలనాడు శ్రీభగవద్ రామానుజాచార్యులు అందివ్వడం, అది ఈనాటికి కూడా అట్లే కొనసాగించబడడం మనం తిరుమలలో గమనించే విశేషం....
ఇక ఇప్పుడు అధిక మాసం వచ్చిన సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవం నిర్వహించబడడం ఎందుకు అనే అధ్యాత్మ విశేషం గూర్చి చర్చిద్దాం.....
అసలు అధిక మాసం అంటే ఏంటి, చాంద్రమాన గణనలో ఎప్పుడు, ఎందుకు ఈ అధికమాసం వస్తుంది ఇత్యాది విషయాలు వికిపీడియాలో
" అధికమాసం " అనే సర్చ్ వర్డ్ తో ఎల్లరు పొందవచ్చు....
( https://en.m.wikipedia.org/wiki/Adhik_Maas )
కాబట్టి వికిపీడియాలో లేని, గూగుల్
చెప్పలేని, ఎక్కువగా ఎవరికి తెలియని, శ్రీ చాగంటి సద్గురువుల వంటి మహనీయుల బోధలో మాత్రమే
జ్యోతకమయ్యే అధ్యాత్మ విశేషాలను
ఇప్పుడు పరికిద్దాం......
మన చాంద్రమాన పంచాంగం మొత్తం చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న ఒక దివ్యమైన దైవికమైన కాలగణన వ్యవస్థ అని ఎల్లరికి విదితమే కద....
తన చుట్టూ తాను భూమి తిరగడం,
భూమి చుట్టూ చంద్రుడు తిరగడం,
ఇలా వీళ్ళిద్దరు కలిసి సూర్యుడు చుట్టూ తిరగడం అనే ఒక నియమిత సౌరకుటుంబ వ్యవస్థవల్లే మనకు 30 రోజులు, 1 వారం, 1 శుక్ల పక్షం, 1 కృష్ణ పక్షం, 12 నెలలు, 6 ఋతువులు, 2 అయనాలు, వెరసి ఒక సంవత్సర కాలం....
ఈ వ్యవస్థ ఒక నిర్దిష్టమైన భ్రమణ వ్యవస్థ..... పరమాత్మచే కాలస్వరూపంగా స్థీరికరించబడిన
పంచాంగ గణన వ్యవస్థ.....
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణ్యాది 27 నక్షత్రమండలాలతో స్థిరమైన కూడిక తో సాగే నిరంతర చంద్రభ్రమణం లో సూర్యుడి శక్తి / వెలుగు సంపూర్ణంగా పరావర్తనం చెంది పూర్ణచంద్రబింబంచే ప్రసరించబడే 15 వ పౌర్ణమి తిథి వచ్చే సరికి చంద్రుడు కచ్చితంగా 12 నక్షత్ర మండలాల్లో ఏదో ఒక మండలంతో కూడి ఉండడం అనగా
చిత్ర నక్షత్ర మండలంతో కూడి ప్రకాశించిన పౌర్ణమి చైత్రమాసం,
విశాఖ నక్షత్ర మండలంతో కూడి ప్రకాశించిన పౌర్ణమి వైశాఖమాసం,
.........
ఫల్గుణి నక్షత్ర మండలంతో కూడి ప్రకాశించిన పౌర్ణమి ఫాల్గుణ మాసం గా వ్యవహరించబడుతూ సాగే ఈ నిరంతర చంద్ర భ్రమణ వ్యవస్థలో,
కాలం యొక్క విశేషమైన సంచితం వల్ల దాదాపు 32.5 నెలలకోసారి " అధికమాసం " గా వ్యవహరించబడే ఒక "ప్రత్యేకమైన కాల వ్యవధి" రావడం వల్ల ఈ స్థిరీకరించబడిన నిర్దిష్టమైన చంద్ర భ్రమణ వ్యవస్థ లోని సంతులత లోపించడం వల్ల, చంద్రుడు తన క్రమబద్ధమైన 27 నక్షత్రమండలాలతో కూడి ప్రకాశించే ఆ కాల చక్రంలో వచ్చిన మార్పు వల్ల పంచాంగ వ్యవస్థలో ఏర్పడే ఆ భేదన్ని స్థిరీకరించేందుకు విశేషమైన దైవారాధన ఆవశ్యకం....
అందుకే ఆ అధికమాసం వల్ల ఏర్పడిన కాలచక్రం లోని మార్పును ఒక విధంగా ఒక సంపూర్ణ కాలచక్రంగా భావించి ఆ కాలానికి ఒక ప్రత్యేకతను ఆపాదించి, అధికమాసంలో దైవారాధన కాకుండా మానుషయోగ్యమైన శుభకార్యాలకు ముహుర్తాలు ఏమి లభించని విధంగా ఉండే ఆ ప్రత్యేకమైన కాలం తనతో తీసుకొచ్చే మార్పులను శాంతపరిచేందుకు కావలసిన విశేషమైన సంతులనాత్మక శక్తి
కేవలం పరమాత్మకు మాత్రమే సాధ్యం...
అందుకే ఆ ప్రత్యేక అధికమాస కాలాన్ని ఒక విశేషమైన లఘు సంవత్సర కాలంగా భావించి ఆ లఘు సంవత్సరానికి కావలసిన సంతులత పరమాత్మ యొక్క బ్రహ్మోత్సవాంతర్గతంగా సకల దేవతానుగ్రహంగా ఈ భూప్రపంచానికి లభించేలా అధికమాసం వచ్చిన సంవత్సరంలో,
మళ్ళి అశ్విని నక్షత్రంతో కూడి ఇంక్కొక కాల చక్రం చంద్రుడు మొదలుపెట్టకముందే, అనగా ఆశ్వయుజ మాసం రాకముందే ఒక బ్రహ్మోత్సవం నిర్వహించి ఆ కాలం లో ఏర్పడిన మార్పులకు తగు రీతిలో శాంతిని నిర్వహించడం వల్ల ఆ సంతులనాలేమి అక్కడితో సరిపోతుంది.....
అశ్విని మొదలుకొని ఫల్గుణి వరకు సాగే కొత్త కాల చక్ర కూడికకు ఆ అధికమాసం తో, అది కలిగించిన మార్పులకు ఎటువంటి సంబంధం ఉండకుండా, ఈ నూతన కాల చక్రానికి యథావిధిగా మళ్ళి బ్రహ్మోత్సవం నిర్వహించబడడం అనే ఆనవాయితి మన సనాతన ధర్మశాస్త్ర, జ్యోతిష శాస్త్ర కోవిదులు ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ....
మీకు ఈ గహనమైన జ్యోతిష శాస్త్ర, పంచాంగ శాస్త్ర విశేషం చాలా సులువుగా అర్ధమవ్వాలంటే ఒక చిన్న లౌకిక ఉదాహరణ తో సమన్వయం గావించి చెప్తాను వినండి...
చిన్నప్పుడు, మనం స్కూల్లో ఆడే ఆటల్లో కబడ్డి ఆట అందరికి బాగా గుర్తు ఉండే ఉంటుంది....
శ్రీ చాగంటి సద్గురువులు చెప్పినట్టు ఇప్పుడంటే క్రికెట్ అనే ఒకేఒక్క ఆట తప్ప అసలు ఆటలంటే ఏంటో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఈ కలికాలం సాగిపోతుంది....
మన చిన్ననాటి ఆ కబడ్డి ఆటలో
అవతలి టీం లోని వ్యక్తి మధ్య రేఖ దాటి ఆటకు వచ్చినప్పుడు,
మళ్ళి మధ్య రేఖ దాటి వెనక్కి వెళ్ళేంతవరకు, లేదా ప్రత్యర్ధులకు చిక్కి ఔట్ అయ్యేంతరవకు
" కబడ్డి....కబడ్డి....కబడ్డి...."
అనే పదం నిరంతరం శ్రీరామ నామంలా గట్టిగా వినపడేలా జపిస్తూనే ఉండాలి....లేకపోతే ఔట్
ఐనట్టే...
అలా " కబడ్డి....కబడ్డి....కబడ్డి...."
అంటూనే ఎంతమందిని తాకితే అంతమంది
ప్రత్యర్ధులు ఔట్ ఔతారన్నమాట....
ఒక చైన్ లా ప్రత్యర్ధులందరు కలిసి
గుమిగూడి ఇతణ్ణి బంధించడానికి ఎదురుచూసే ఆ ప్రక్రియలో వాళ్ళు అందరు కలిసి సఫలీకృతం ఐతేనే ఆ ప్రత్యర్ధిని ఓడించడం సంభవం....
అలా ఒక చైన్ గా ఉన్న టీం మొత్తంలో ఒక్క వ్యక్తిని ముట్టుకొని మధ్యరేఖ దాటి వెళ్తే ఆ వ్యక్తితో భౌతిక గొలుసుకట్టు బంధనం ఉన్న కారణంగా ఆ గొలుసులో భాగమైన వారందరు కూడా ఒకేఒకదెబ్బకు ఔట్ అన్నమాట....
అందుకే ముందుజాగ్రత్తగా జట్టు మొత్తం ఒకే గొలుసుగా కాకుండా ఒక 2 సభ్యులను ఇరుచివర్లకు విడిగా ఉండేలా ఏర్పాటు చేసుకొని, ఈ మధ్యలో ఉన్న చాలామంది సభ్యులు గల గొలుసుకు ప్రత్యర్ధి చిక్కితే అప్పుడు ఆ చివర్లో ఉన్న వారు కూడా వీళ్ళతో మమేకమై సంపూర్ణ కట్టడితో అతన్ని ఔట్ చేస్తారు.....
ఒక వేళ ఆ ఇరు చివర్లో ఉన్న ఇద్దరి సభ్యుల గొలుసును మాత్రమే తాకి మధ్యరేఖ దాటెస్తే అప్పుడు జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే ఔట్ అయ్యి మిగతా జట్టు మొత్తం యథాతథంగా తమ ఉనికిని నిలుపుకొని ఆటను కొనసాగిస్తుంది. .......
ఈ విధమైన రీతిలో కొందరు సభ్యులను అటు ఇటు చివర ప్రత్యేక గొలుసు బృందంగా ఉండనివ్వకుండా అందరు సభ్యులు " నీకు నేను...నాకు నువ్వు...ఒకరికొకరం నువ్వునేను..." అన్నట్టుగా అట్లే ఉండి ఆట కొనసాగిస్తే ఎప్పుడో ఒకప్పుడు బాగా పదునైన వ్యూహం తో ప్రత్యర్ధి మెరుపుదాడితో తృటిలో చివర్లో ఉన్న ఒక సభ్యుణ్ణి అలా ఒక్క దెబ్బ విసిరి మధ్యరేఖ దాటివెళ్తే దెబ్బకు జట్టు మొత్తం ఔట్ అవ్వడం ఖాయం.....
అచ్చం ఇదే విధంగా కాల స్వరూపంలో కొనసాగే ఆ పరమాత్మ యొక్క దైవిక ఆటలో అన్ని జీవులు కూడా నిమిత్తమాత్రులైన పావులు మాత్రమే....
కాలం కలిసిరావడం, రావకపోవడం అని మామూలుగా అనడంలో నిజమైన అర్ధం
పరమాత్మ యొక్క అనుగ్రహం లభించడం....లోపించడం.....
అలా కాలస్వరూపంగా ఉండే పరమాత్మ యొక్క అనుగ్రహన్ని ఎల్లప్పుడు జీవులకు క్షేమదాయకంగా అందివ్వడంలో మన పెద్దలు ఎంతో జాగ్రత్తగా ఎంతో ముందుచూపుతో సనాతన ధర్మశాస్త్ర విశేష ఆచార వైభవంలో భాగంగా ఏర్పరిచినవే ఈ అధికమాసం మరియు తత్ సంబంధంగా దోషనివారక, శాంతికారక బ్రహ్మోత్సవాలు....
"కాలం చాలా బలమైనది....."
అని అంటూనే
" నేనే ఆ కాల స్వరూపాన్ని...."
అని అంటాడు గీతాచార్యుడు......
కాబట్టి ఆ కాలాన్ని ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా లెక్కలు కట్టాలి, ఆ నిరంతర భ్రమిత కాలచక్రాన్ని ఎలా ఎక్కడ విరిచి, ఆ కాల జనిత దుష్ప్రభావాలను చాల తక్కువగా జీవులకు సోకే విధంగా జాగ్రత్తలు పాటించాలి, అనే లోక శ్రేయస్కరమైన ఆ గహనమైన శాస్త్ర విజ్ఞ్యానాన్ని మన పెద్దలు అలా పంచాగ వ్యవస్థలో క్రోడీకరించి మనకు అందించి తరించినారు....
అవి పాటించి తరించమని దీవించినారు.....
కావున, అవ్విధంగా వాటిని పాటించి
శ్రేయస్సులను అందుకోవడంలోనే విజ్ఞ్యత ఉంటుంది కాని......
ఇవన్ని ఏంటో చాదస్తం, పాతకాలం లెక్కలు, పనికిరాని ఆచార వ్యవహారాలు అని చిన్నచూపు చూడడానికి పెద్దగా ఏ గొప్పదనం అక్కర్లేదు....వాటి యందున్న అవగాహనా రాహిత్యమే అలా మాట్లాడే వారి "జ్ఞ్యానానికి" కొలమానం....
కాబట్టి అధికమాసం వస్తే, అది పరమాత్మ యొక్క విశేషమైన అనుగ్రహానికి బాటలు వేసిన ప్రత్యేక కాలవ్యవధిగా గుర్తించి రెండు సార్లు నిర్వహించబడే ఆ బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించడంలోనే మన జన్మసార్ధకత ఉంటుంది కద.....😊
అధిక ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలను సంపూర్ణం గావించి, నిజ ఆశ్వయుజ మాస / శరన్నవరాత్ర వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీశ్రీనివాసుడి అపార కరుణాకటాక్షాలు భక్తులెల్లరికి లభించి శాంతిసౌఖ్యాలతో ఎల్లరి జీవితాలు పరిఢవిల్లుగాక......
అందుకే కద అన్నమాచార్యుల వారు, ఎంతో ఘనంగా ఆ శ్రీపతిని
" బహుబంధదూరునకు " అంటూ స్తుతించారు....
అనగా వివిధ శాస్త్రోక్తమైన ఉత్సవాలు తను జరిపించుకొని కాల స్వరూపంలో ఎదురయ్యే వివిధ బంధనాలను తన భక్తులకు దూరంగా ఉండేలా చూసి, కాలం యొక్క పగ్గాలను తన కళ్ళతోటే శాసిస్తు తన భక్తులకు శుభాలను ఒసగబడేలా ఆ కాలచక్రాన్ని తన అధీనంలోనే ఉండేలా చేసి
" కాలాంతకునకు " అనేలా స్తుతించబడినాడు ఈ క్రింది చక్కని సంకీర్తనలో....
ప : మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ
చ : ఆదికినినాదైనదేవున
కచ్యుతున కంభోజణాభున-
కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి-భేదికిని సామాదిగానప్రియవిహారునకు
చ : హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా-కరునకును గాత్యాయనీనుతకలితనామునకు
చ : పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు
http://annamacharya-lyrics.blogspot.com/2008/01/400mamgalamu-govimdunaku.html?m=1