Wednesday, September 16, 2020

శ్రీ మోక్షగుండంవిశ్వేశ్వరయ్య గారు , భారతరత్న , భారతదేశం గర్వించేలా వారి జన్మదినోత్సవం ( Sep-15-2020 ) "ఇంజనీర్స్ డే"...

శ్రీ మోక్షగుండంవిశ్వేశ్వరయ్య గారు భారతరత్న , భారతదేశం గర్వించేలా వారి జన్మదినోత్సవం ( Sep-15  ) "ఇంజనీర్స్ డే" గా జరుపబడుతూ చిరస్మరణీయులై నిలిచిన ఒక ప్రఖ్యాత ఇంజనీర్ గా యావద్ ప్రపంచం యొక్క మన్ననలను పొందిన మాన్యులు.....

ఒక ఇంజనీర్ తన మేధాశక్తితో తనకు చెందిన విద్యతో ప్రపంచాభివృద్ధికై తనదైన ఒక సేవాసమిధను సమర్పించినట్టు, ప్రతి వ్యక్తి కూడా నిరంతర పరిశ్రమతో "భగవద్భక్తి" అనే ఒక ఇంజనీరింగ్ విద్యలో ఉత్తీర్ణతను సాధించుకొని జీవితంలో ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలకు తమ దైవిక సాంకేతిక విజ్ఞ్యానం అనే పరికరంతో  " ఇన్నర్ ఇంజనీరింగ్ " లో సుశిక్షితులై
తమ జీవితాలను సద్గురువుల ఆచార్యుల అండదండలతో ఉద్ధరించుకోవడం అనే విద్యలో మేటిగా రాణించడమే ప్రతి వ్యక్తి నిరంతరం అభ్యసించే ఇంజనీరింగ్ విద్య....

లౌకిక ఇంజనీరింగ్ విద్య 4 సంవత్సరాల్లో అభ్యసించబడి ఇంకా పై చదువులు గడించడం, అనగా ఎంటెక్, పీ హెచ్ డి, వంటి ఉన్నత శ్రేణి 
విద్యల్లో పట్టభద్రులవ్వడంతో పూర్తౌతుంది......

కాని భగవద్భక్తి అనే ఆ ఆంతర సాంకేతిక విజ్ఞ్యానార్జన మాత్రం నిరంతరం కొనసాగే స్వకౌశల దీపకమైన జ్ఞ్యాన యజ్ఞ్యం.....

లౌకిక ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి
ఆ ఇంజనీరింగ్ బ్రాంచ్ కి తగ్గట్టుగా అనగా, ఎలెక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలెక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇత్యాది శాఖలు గా ఉండే ఆ ఇంజనీరింగ్ విద్యకు తగిన రీతిలో అత్యాధునిక సామాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, అత్యాధునిక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అత్యాధునిక వాహన / యంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం,  అత్యాధునిక గృహ ,ఆలయ, సేతు, ఇత్యాది భారి నిర్మాణాల వ్యవస్థను ఏర్పాటు చేయడం, మొదలైన విధంగా ఆ విద్య తన ఉనికిని, తన వైభవాన్ని చాటి ఈలోకంలో శాశ్వతత్వాన్ని గడించి ఎందరెందరికో సహాయ సహకారాలను అందించి సార్ధక్యం చెందడం మనం గమనించవచ్చు.......

కాని ఈ భగవద్ భక్తి అనే ఆంతర ఇంజనీరింగ్ మన జన్మపరంపరలను సువ్యవస్థీకరించే ఒక బృహత్ దైవిక వ్యవస్థ... మన ఈ జన్మ మాత్రమే కాకుండా ఎన్నెన్నో జన్మపరంపరల నుండి భగవద్ అనుగ్రహంగా లభించే
ఆ భగవద్భక్తిని మరింతగా ప్రోదిచేస్తు తన్మూలంగా అత్యంత గహనమైన ఆ భగవద్ తత్త్వాన్ని అత్యంత సులభంగా మనకు అందివచ్చేలా తద్వారా మన ఇహపరాలకు కూడా ఆ భగవద్భక్తి అనబడే ఆంతర ఇంజనీరింగ్ వ్యవస్థ సమకూర్చే మేలు అమేయమైనది....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినే ఉంటారు...

" పెట్టి పుట్టాడండి....అందుకే ఇప్పుడు ఆ ఘనమైన జన్మ...."

అనే లౌకిక వాడుక గురించి గురువుగారి వ్యాఖ్యానం.....

అనగా ఇప్పుడు ఈ జన్మలో ఒక వ్యక్తి కి అబ్బిన జ్ఞ్యానం కాని, సిరిసంపదలు కాని, ఇతహ్పూర్వం జన్మలయొక్క పుణ్యబల విశేషం మరియు భక్తి సాధన యొక్క అనుగ్రహములు, మరియు వారి 7 తరాల పితృదేవతల యొక్క అనుగ్రహం.....

ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్న ఆరోగ్యస్థితి అప్పటికప్పుడు ఆ రోజు తను తిన్న ఆహారం వల్ల ఉన్నది కాదు.....

గత ఆరు నెలలుగా తనచే స్వీకరించబడిన ఆహారం యొక్క ఫలితం ఆ ప్రస్తుత ఆరోగ్యస్థితి.....

అచ్చం ఇదే విధంగా ఇప్పుడు ఈ జన్మలో ఉన్న ఒక వ్యక్తి యొక్క సుఖదుఃఖాలు, సిరిసంపదలు, కలిమిలేములు, విద్యావినయసంపత్తి, ఇత్యాది విభూతలకు మూలం గత 6 జన్మల్లో కావించబడిన వివిధ కర్మల యొక్క సమ్మిళిత సమాహార స్వరూపం....

ఒక సాధారణ వ్యక్తికి ఒక సెల్ఫోన్ అంటే ఇతరులతో మాట్లాడేందుకు  అరచేతిలో ఇమిడే ఒక చిన్నపాటి పరికరం.....

కాని ఒక ఈసీఈ ఇంజనీర్ కు అది కొన్ని
వందల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల, మైక్రో, నానో చిప్ ల సమ్మిళిత సమాహారస్వరూపం.....

అదే విధంగా భగవద్ భక్తి తత్త్పరులైన బ్రహ్మవేత్తలకు మాత్రమే అవగతమయ్యేవి ఈ మానవజన్మ అనే సదరు జీవితంలో ఆ జీవుడి వందల కొలది జన్మపరంపరల యొక్క సంచిత ప్రారబ్ధ కర్మ సంచయం...

కాబట్టి లౌకిక ఇంజనీరింగ్ తో పాటుగా ఎవరికి వారు తమ శక్తి కొలది ఆ భగవద్భక్తి అనే ఇన్నర్ ఇంజనీరింగ్ లో పరిశ్రమించి ఉన్నతమైన ఇహ పరాలను సాధించుకోవడం ఎవరికి వారు తమ జీవితాలకు, జన్మపరంపరలకు  సముపార్జించుకునే అనంతమైన దైవానుగ్రహం....

అందుకే అన్నమాచార్యుల వారు తమ 
"ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము.." 

( http://annamacharya-lyrics.blogspot.com/2008/11/549urake-dorakuna-vunnatonnatasukhamu.html?m=1 )

అనే సంకీర్తనలో శ్రీవేంకటేశ్వరదాస్యము అబ్బిన గాని
మన జన్మ పరంపర ఆ కైవల్యదరిని చేరదు అని ఎంతో భావుకత భరితమైన సుజ్ఞ్యాన సత్యాన్ని ఆవిష్కరించారు....

"తనశాంతమాత్మలో తగిలినప్పుడు గదా
పనిగొన్నతనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినగదా దరిచేరిమనుట"

No comments:

Post a Comment