ఏదైనా పండగో / ఎవరిదైన జయంతి ఉత్సవమో అన్నట్టుగా ఒక అమావాస్య తిథి కి కూడా శుభాభినందనలు ఏంటి అని కొందరు అనుకోవచ్చు....
ఇది కూడా ఒక గొప్ప పండగలాంటి తిథి కాబట్టే శుభాభినందనలను వ్యక్తపరచడం....
ఎందుకు ఏంటి ఎవరు ఎప్పుడు ఎక్కడ
ఇత్యాది గా కొన్ని సందర్భోచిత ముఖ్యాంశాలను తర్కిద్దాం...
ఈ విశ్వంలో మన సనాతన ధర్మానిది ఒక గొప్ప విశేషమైన స్థానం....అది ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా కూడా పూర్తిగ నిర్వచింపలేని మహత్వభరితమైన ధర్మం కాబట్టి...
ఈ ప్రకృతిలోని ప్రతీ వస్తువుకు కూడా దైవత్వాన్ని ఆపాదిస్తూ, ఆరాధిస్తూ, వాటి అనుగ్రహంతో జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించి తరించడం అనేది మన సనాతన ధర్మానికి గల వైభవం....
ఈ విశాల విశ్వంలో ఒక చిన్న తెల్లని బంతిలా (ఒక్కోసారి వివిధ ఇతర రంగుల్లో కూడా మనకు అగుపించడం అనేది దేశకాలానుగుణంగా సంభవించే అంశం) మెరిసే చంద్రుడు భూమి యొక్క సహజ ఉపగ్రహంగా ఎల్లరికీ ఎరుకే...
ఆ చంద్రుణ్ణి మన సనాతనధర్మం కేవలం ఒక భౌగోళిక భౌతిక ఉపగ్రహంగా మాత్రమే కాకుండా,
మనఃకారక దేవతా తత్త్వంగా ఆరాధించడం విజ్ఞులకు ఎరుకే....
"తదేవ తరాబలం చంద్రబలం, దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి...."
అనే సంకల్పవచన పఠనంతోనే అన్ని ముఖ్య సనాతనధర్మ ఉత్సవాలు నిర్వహింపబడడం ఎల్లరికీ విదితమే...
"చంద్రమా మనసో జాతః...చక్షో సూర్యోఅజాయత..."
అంటూ సాగే శృతివచనాలు కూడా విజ్ఞ్యులకు ఎరుకే...
సాధారణంగా లోకంలో కొన్ని డౌలాగ్స్ వినే ఉంటారు...
"హె ఫలాన వ్యక్తి ఎట్లాంటి వాడు...?"
అనే చాలా క్యాజువల్ ప్రశ్నకు....
" ఒహ్ ఆయనా..చాలా మంచి మనిషి..గొప్ప మనసున్న వ్యక్తి..."
లేక
" ఒహ్ వాడా..వాడొక రాక్షసుడు...వాడి మనసంతా కుళ్ళు తో విషమయమై ఉండే వ్యక్తి..."
అని ఎంతో క్యాజువల్ గా మనం వినే సమాధానాలు...
కనిపించే పేరు, రంగు, రూపు, డాబు, దర్పం, తెలివి,
అధికార ఐశ్వర్యాలు ఇత్యాది విభూతులను కాదని కనిపించని మనసును ఆధారంగా ఫలానా వ్యక్తి మంచి వాడు....లేక ఫలానా వ్యక్తి ముంచే వాడు....
అని అనడం కొంత విచిత్రమే కద....
ఆ మంచి మనసుకు / మరియు మనో బలానికి కారకుడు చంద్రుడు అని మన సనాతన ధర్మ ప్రతిపాదిత విశ్వాసం...
ఇక ఆధ్యాత్మికపరంగా చంద్రుడు....,
రోహిణ్యాది సప్తవింశతి (27) తారలకు నాయకుడిగా,
దక్షప్రజాపతికి అల్లుడిగా,
పరమేశ్వరుడికి శిరోభూషణంగా...,
శ్రీమహావిష్ణువుకు బామ్మర్ది గా....
(క్షీరసాగర సంజాత శ్రీలక్ష్మి " చంద్రసహోదరి " గా స్తుతింపబడుతున్న కారణంగా ....),
విజ్ఞ్యులకు ఎరుకే...
ఆ చంద్రుడు ఒకానొక సందర్భంలో రోహిణి మోహంలో ఇతర 26 తారలను విస్మరించిన కారణంగా దక్షప్రజాపతిచే క్షయగ్రస్తుడిగా శాపగ్రస్తుడైనప్పుడు, విముక్తి కోసం పరమేశ్వరుడిని ఆశ్రయించగా, తనకు శిరోభూషణమై వర్ధిల్లేలా అనుగ్రహాన్ని బడసినప్పటినుండి,
కేవలం కృష్ణపక్షంలో క్షీణచంద్రుడిగా దక్షుడి శాపానికి లోనవుతూ, శుక్లపక్షంలో వృద్ధి చంద్రుడిగా తిరిగి తన పూర్ణస్వరూపాన్ని పొందడం....
అనే గాధ గురించి శ్రీచాగంటి సద్గురువుల బోధలో శ్రీఉమామహేశ్వరవైభవం ప్రవచనాల్లో వినే ఉంటారు కద....
ఈ కథ విన్నప్పుడు కొందరు కేవల భౌతికవాదులకు ఒక సందేహం కలుగుతుంది...
" అదేంటి అలా అంటున్నారు....
రెండు పక్షాల్లోను చంద్రుడు అదే విధంగా గోళాకారంలో ఉండి భూమి చుట్టూ తిరగడం మనం ISS లో ఉన్నప్పుడు చూడవచ్చును కద.....
మరి ఈ క్షయం ఎక్కడ...వృద్ధి ఎక్కడ...
చంద్రుడు మహేశ్వరుడి సిగలో ఉంటే, చంద్రుడి కింద కైలాసం ఎక్కడ ఉంది..? "
ఇత్యాది గా.....
మన లౌకిక ప్రపంచంలోని ఒక సింపుల్ ఎగ్సాంపుల్ తో ఈ సామ్యమును వ్యక్తపరిచే ప్రయత్నం గావిస్తాను...
"వారానికి 5 రోజులు ఆఫీసు ఉంటుంది..
2 రోజులు ఆఫీసు ఉండదు...సెలవు...."
అనే ఎగ్సాంపుల్ లో...
ఆ రెండ్రోజులు ఆఫీసు ఏమైంది, ఎక్కడికెళ్ళింది...?
మళ్ళీ ఎక్కడి నుండి తిరిగి వచ్చింది...?
అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమిస్తాము...?
" భౌతికంగా ఆఫీస్ ఎక్కడికి వెళ్ళలేదు.....
ఆఫీస్ అనే వ్యష్టి, అనగా అందులో ఉండే ఉద్యోగుల సమిష్టి కి సెలవు... "
అని దాని అర్ధం ...
అదే విధంగా చంద్రుడు, భౌతికంగా ఒక ఉపగ్రహంగా మాత్రమే భావిస్తే...చంద్రతలం యొక్క భౌతిక స్థాయిలో, లేక అంత కంటే ఎత్తైన స్థాయిలో ఉన్నప్పుడు ఏ వృద్ధిక్షయలూ కానరావు.....
చంద్రుడు ఒక మనః కారక వ్యష్టి గా భావింపబడినప్పుడు ఈ వృద్ధిక్షయలు అనేవి కనబడే తత్త్వము....
ఇక భౌతికంగాను మరియు ఆధ్యాత్మిక పరంగాను కూడా ఒక భూగత ప్రాణిగా చంద్రుణ్ణి దర్శించే వారికి....,
స్థిరమైన పూర్ణమైన చంద్రుణ్ణి, మరియు వృద్ధిక్షయలకు లోనయ్యే చంద్రుణ్ణి కూడా ఒకేసారి దర్శించడం అనేది ఎప్పుడూ ఉండేదే...
అనగా జాగ్రత్తగా చంద్రుణ్ణి గమనిస్తే....
ఆ పూర్ణచంద్రబింబ ఛాయ యొక్క గోళాకార స్వరూపము,
మరియు ఆ ఛాయలో ఆనాటి తిథి ప్రకారంగా వెలిగే క్షీణ / వృద్ధి చంద్రుడి స్వరూపము ఒకేసారి గమనించవచ్చు.....
సరే ఇక మన అసల్ టాపిక్ కి వస్తే...
అమావాస్య సోమవారం నాడు వస్తే అది సోమావతి అమావాస్య గా పిలువబడుతు, విశేషమైన ప్రధాన్యత గల తిథిగా గౌరవింపబడడంలోని ఆంతర్యమేమి...?
స ఉమ ఇతి సోమ....
అనగా...
ఉమాదేవి తో కూడి ఉన్న పరమేశ్వరుడికి ప్రియకరమైన తిథి సోమవారం.....
సోముణ్ణి ధరించినవాడికి ప్రియకరమైన తిథి సోమవారం.....
ఇక యథావిధిగా పంచాంగ గణన ప్రకారంగా,
సూర్యోదయ సమయానికి చంద్రహోర ఉండే తిథి సోమవారం.....
ఇలా చంద్రుడికి విశేష ప్రాధాన్యత గల తిథిగా సోమవారం ఉండడంతో ఆనాడు వచ్చే అమావాస్య అనగా భూగతమైన చంద్రశక్తి సంపూర్ణంగా లుప్తమై ఉండే రోజు సోమవారం నాడు రావడం సోమావతి అమావాస్య గా ప్రాచుర్యం పొందడం......
పద్మావతి, కుషావతి, ప్రభావతి, కళావతి, సత్యవతి, ఇత్యాది స్త్రీసంబంధమైన పేరుగా సోమావతి ధ్వనించడం మనం గమనించవచ్చు...
ఎందుకంటే తత్త్వతః,
భరించు వాడు భర్త....
చంద్రుణ్ణి తన జటాజూటంలో ధరించి భరించినాడు కాబట్టి
సోమేశ్వరుడు సోముడికి భర్త అయినాడు...
(గంగాధరుడికి గంగ భార్య అయిన విధంగా..)
కాబట్టి ఇక్కడ సోమావతి అమావాస్య పరమేశ్వర ప్రీతికరమైన తిథిగా విరాజిల్లును......
శ్రీపోతనామాత్యులవారి ఈ క్రింది శ్రీమద్భాగవత ఉత్పలమాల పద్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారు కద...
"
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
"
మరియు ఈ క్రింది ధూర్జటి మహాకవి గారి పద్యాన్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారు కద...
"
ఏ వేదంబు ఫఠించె లూత భుజంగం బే శాస్త్రముల్ ల్సూచె తా
నేవిద్యాభ్యాసం బొనర్చె గరి చెంచే మంత్రం బూహించె భో
దావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద
సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తిశ్వరా. ....
"
అన్ని ఈప్సితములు ఈడేరుటకు మూలసాధనము మరియు అన్ని ఈప్సితములు ఈడేరిన తరువాత కూడా ఉండే మోక్షాపేక్షకు కూడా మూలసాధనము మనోబలం....
శశాంకమౌళి గా ఉండే మహేశ్వరుడికి,
భక్తుల ఈప్సితములు ఈడేరుటకు, ఏంటి సంబంధం...?
మనసు కోరే అన్ని కోరికలు ఈడేరిన తదుపరి ఉండే మోక్షము అనే కోరిక కూడా ఈడేరుటకు మన మనోబలము, మనోసంకల్పమే కారణమై ఉంటుంది....
ఈ మనోబలం / సంకల్పబలం అనేది ఇతర అన్ని విభూతులకు కూడా అతీతమైనది.....
అనగా ఫలాన వ్యక్తికి ఫలానా విభూతులు ఉంటే వారికి గొప్ప మనోబలం / సంకల్పబలం ఉండును అని చెప్పడం కుదరదు...
ఫర్ ఎగ్సాంపుల్,
ఒక రియల్ లైఫ్ సినారియో ని ఎగ్సాంపుల్ గా తీసుకుంటే....
ఒక రిచ్ ఫ్యామిలి కి చెందిన ఒక విద్యార్థి...
మరియు
ఒక పూర్ ఫ్యామిలి కి చెందిన ఒక విద్యార్థి...
ఇలా అనుకుంటున్నారు....
" మా పేరెంట్స్ నా మీద నమ్మకంతో ఇన్నిన్ని లక్షలు పోసి ఇంజనీరింగ్ సీట్ కొని చదివిస్తున్నారు....
అడిగినవన్నీ కాదనకుండా కొనిచ్చారు....
ఇంతటి అఫ్లుయెంట్ లైఫ్ ఇచ్చిన నా పేరెంట్స్ కి నేను ఎట్లైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్టై వాళ్ళ సంతోషానికి కారణం అవ్వాలి...."
అనేది ఒక రిచ్ ఫ్యామిలి కి చెందిన విద్యార్థి యొక్క మనోసంకల్పం / సంకల్పబలం....
" మా పేరెంట్స్ పెద్దగా చదువుకోలేదు, సంపాదించలేదు కాబట్టే కద, రెండు పూటలా చక్కని పౌష్టికాహారానికి కూడా నోచుకోని నేను పడే ఈ దుర్భరమైన పూర్ మిడిల్ క్లాస్ లైఫ్ కష్టాలు....
ఎట్లైతే కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సాధించానో.....
అట్లనే కష్టపడి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్టై నా జీవితాభివృద్ధి
బాటను నేనే నిర్మించుకొని తీరాలి...."
అనేది ఒక పూర్ ఫ్యామిలి కి చెందిన విద్యార్థి యొక్క మనోసంకల్పం / సంకల్పబలం....
ఇక్కడ గమనిస్తే ఈ ఇరువురి జీవిత నేపథ్యం వేరు..
వారికి గల సౌకర్యాలు, విభూతులు, వేరు.....
వారి కష్టాలు వేరు....
ఇలా ఎందులోను ఒక రిచ్ ఫ్యామి స్టుడెంట్ కి మరియు ఒక పూర్ ఫ్యామిలి స్టుడెంట్ కి పొంతన లేదు...
కాని ఈ ఇరువురి సంకల్పం మాత్రం ఒక్కటే....
వారి మనోబలం / సంకల్పబలం సమానంగా గొప్పది...
అందుకు తగ్గట్టుగా వారు సలిపే కృషి సమానంగా గొప్పది....
తుదకు ఇద్దరూ కూడా ఒకే కార్పోరేట్ సంస్థలో ఒకే విధంగా ఆర్జించే ఎంజినియర్స్ గా వారి ఇంజనీరింగ్ కళాశాల నుండి
ఉత్తీర్ణులై ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించబోయే క్యాంపస్ సెలెక్ట్స్ గా ఎల్లరిచే గౌరవింపబడినారు....
ఇప్పుడు చెప్పండి....
మొదటి విద్యార్థి...
బాగా ఐశ్వర్యవంతులైన కుటుంబ నేపథ్యం ఉన్నందుకు విలాసాలకు, జల్సాలకు అలవడి ఒక తాగుబోతు, తిరుగుబోతు అవ్వకుండా ఒక గొప్ప క్యాంపస్ రెక్రూట్ గా గౌరవింపబడిన జీవితానికి కారణం ఏంటి...?
రెండవ విద్యార్థి...
పూర్ మిడిల్ క్లాస్ కుటుంబ నేపథ్యం అయినందుకు ఇతర తాగుబోతులతో, తిరుగుబోతులతో కలిసిపోయి, కేవలం ప్రపంచంలోని మరో సాధారణ తాగుబోతు, తిరుగుబోతు గా అవ్వకుండా, ఒక గొప్ప క్యాంపస్ రెక్రూట్ గా గౌరవింపబడిన జీవితానికి కారణం ఏంటి...?
వారి కుటుంబ నేపథ్యాలా...?
వారి కలిమి లేములా....?
వారి స్నేహితులా...?
కాదు...
కేవలం వారి మనోబలం / సంకల్పబలం మాత్రమే కారణం..
అనగా అది సమకూరడానికి కారణమైన దైవబలమే
ప్రధాన కారణం....
అంతటి గొప్ప మనోబలం / సంకల్పబలానికి కారణం....
అది స్వతహాగా జాతకంలో చంద్రబలం బాగా దృఢంగా ఉండి అందుకు తోడుగా బుధ, గురు బలాలు కూడా సమృద్ధిగా ఉన్న స్థితి అయినా అయ్యుండాలి......
లేక
చిత్తశుద్ధి భరిత నిత్యదైవారాధన లో భాగంగా సమకూరిన విశేషమైన ఈశ్వరానుగ్రహంతో ఒనగూరిన మనోబలం / సంకల్పబలం అయినా అయ్యుండాలి....
అవ్విధంగా ఒక మనిషిని జీవితంలో తడబడకుండా...
తను ఎన్నుకున్న బాటలో, మార్గంలో, వృత్తిలో, ప్రవృత్తిలో, మహోన్నతుడిగా మలిచే సాధనం కేవలం వారివారి దృఢమైన మనోబలం / సంకల్పబలం...
మనోబలం / సంకల్పబలం అనేది ఇతర అన్ని బలాలకు కూడా అతీతమైన విభూతి....
మనోబలం / సంకల్పబలం ఉన్నప్పుడే మిగతా అన్ని బలాలకు కూడా శోభ సమకూరేది....
మనోబలం / సంకల్పబలం వల్లే ఇతర అన్ని విభూతులు కూడా సమకూరేది....
జీవుడు మనో బలాన్ని ఆశ్రయించి తన ఉనికిని వ్యక్తపరుస్తూ ఉంటాడు...
అనగా మనలోని జీవజీవేశ్వర సంఘాతం మన యొక్క మనోబలానికి తగ్గట్టుగా వివిధ విభూతులను సంతరించుకుంటూ ఉంటుంది....
పెరుగుతూ, తరుగుతూ, వివిధ రీతుల నిత్యం మార్పు చెందుతూ, ఉండే మన అసంఖ్యాక మనోసంకల్పవికల్పాలకు సర్వేసర్వత్రా సాక్షీభూతుడై ఉండే పరమాత్మ వాటిని వహిస్తూ,
వాటిని సుసంకల్పాలుగా సవరిస్తూ, శివసంకల్పమస్తు అని దీవిస్తు, తన వైశ్విక చైతన్యాన్ని అందిస్తూ వాటికి సార్ధకతను ఒనరిస్తూ ఆంతరమున
" నీలతోయదమధ్యాస్తాత్ విద్యుల్లేకేవభాస్వర...."
గా కొలువై వెలుగొందడమే పరమశివుడు సోమనాథుడై,
సోమేశ్వరుడై, చంద్రచూడుడై, చంద్రమౌళీశ్వరుడిగా శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖను జటాభూషణంగా కలిగి వెలుగొందడంలోని ఆంతర్యం....
మన శరీరం అనే గృహంలోనే కొలువైన స్వప్రకాశక పరమాత్మను ప్రస్ఫుటముగా ఎప్పుడు తెలుసుకోగలరు...?
బాహ్య ఆధ్యాత్మిక / భౌతిక ప్రపంచంలో చంద్రుడు లుప్తమై ఉన్నా కూడా ఆంతరమున మన మనసుకు సంకల్పబల సంవృద్ధిని ఒనరించేది ఎవరు అనే దిశగా
చిత్తము అధ్యాత్మ ప్రశ్నోత్తరమంజరిలో తన స్వస్వరూపానుసంధాన స్థితికై వెతుకులాటలో ఉన్నప్పుడు
దేదీప్యమానమైన స్వప్రకాశ ప్రభలతో తణుకులీనే ఆ అమూల్యమైన పరతత్త్వాన్ని ధ్యానించి అంతర్యామి గా దర్శించి తెలుసుకోగలము.....
అవ్విధంగా పైన పేర్కొన్న వివిధ కారణముల రీత్యా, సోమవారం అమావాస్య వచ్చిన నాడు, ఆ విశేషానుగ్రహదాయక సోమావతి అమావాస్య ఆరాధనలో....అభిషేకంలో
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||
గా భాసించే భవుడిని బాగా, బాగుగా, ఆరాధించిన నాడు, ఆంతర భవసాగరంలో దర్శించి తరించవచ్చును అని ఆర్ష వాక్కు...
సోమావతి అమావాస్య నాటి ఎవ్విధమైన పరమేశ్వర అరాధన అయినను అది 1000 రెట్ల ఫలితాన్ని ( అనగా అసంఖ్యాకమైన ఫలితాన్ని ) ఇవ్వబడును అని ఆర్షవాక్కు....
" పెద్దల మాట చద్దన్నం మూట... " అని అనడం వినే ఉంటారు కద...
[ ఇక్కడ పెద్దలు అంటే, అడ్డమైన పొట్లాలను నములుతూ, అడ్డమైన సీసాలను తాగుతూ, నిత్యం అలక్ష్మికి ఆవాసంగా ఉండే భూమికి నిలువుగా బరువుగా పెరిగిన అడ్డగాడిదల వంటి వయసున్న పొగరుబోతు యాప్రాసి యెదవలు, మూర్ఖులు, మందబుద్ధులు, జడుల వంటి వారు అని కాదు అర్ధం....
పెద్దలు అంటే, వారివారి వయసుకు తగ్గట్టుగా హుందాగా ఉంటూ, పెద్దరికాన్ని, గౌరవమరియాదలను ఆర్జించే విధంగా నడయాడే ఉన్నతమైన మృదుస్వభావ, మధురహితవచోభూషణాఢ్యులైన
మనస్తత్త్వం గల విజ్ఞులైన మాన్యులు అని అర్ధం...]
చంద్రుడు మనః కారకుడే కాక...ఓషధీశక్తిసంపాత కారకుడు కూడా.....
మరీ ముఖ్యంగా వరి / బియ్యం ఆ చంద్రవర్షిత ఓషధీశక్తిసంపాతాన్ని అమృత శక్తిగా ఒడిసిపట్టే ధాన్యము.....
మంచి మనసు ప్రభవించడానికి కారణమయ్యే ధాన్యము....
అందుకే ఒడిబియ్యం పోసుకోవడం అనే ఫంక్షన్లు ఉన్నాయ్ కాని...
ఒడిగోధుమలు, ఒడిరాగులు, ఇత్యాదివి పోసుకునే ఫంక్షన్లు లేవు...
ముత్యాలకు సమంగా భావిస్తూ అక్షతలను అనగా పసుపుకుంకుమలతో అలదబడిన బియ్యాన్ని అక్షతలుగా వేస్తూ పెద్దలు దీవించడం ఉంటుంది కాని గోధుమలను, ఇతర పప్పులను అక్షతలుగా వేయడం ఉండదు....
ఒక సర్వోత్కృష్ఠ యాగాన్ని నిర్వహించి, అవబృథస్నానమాచరించిన మాన్యులను సోమయాజి అని వచించి గౌరవించడం గూర్చి వినే ఉంటారు....
ఇక్కడ సోమ అనే పదాన్ని అపాదిస్తూ, యాగ హవిస్సులో సమర్పింపబడిన సర్వోత్కృష్ఠ పదార్ధాలను సోమరసం పేరుతో వచిస్తూ ఉండడం కూడా విజ్ఞ్యులకు ఎరుకే....
ఇది మన లౌకిక యజ్ఞ్య యాగాలకు సంబంధించిన సోమ సంబంధమైన విశేషం.....
మరి చంద్రమౌళీశ్వరుడిగా ఉండి ఆ రోదసీస్థిత నిజసోమతత్త్వవర్షిత సోమరసాన్ని చంద్రామృతంగా గైకొని తనపై తానే అభిషిక్తం గావించుకుంటూ ఉండే సోమేశ్వర వైభవంలోని ఆంతర్యమేమి అనేది,
శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి ప్రయుక్త మహాశివరాత్రి నాటి పోస్టులో ఈశ్వరానుగ్రహంగా కొంత తర్కిద్దాం....
సర్వం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...🙂🍨💐🍧🍒🍿🍏🍊🌾🫐🍇🍕🍎
రాగ సుధా రస పానము జేసి రంజిల్లవే ఓ మనసా
యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే
సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు...
🙏🙏🙏🙏🙏☺️
No comments:
Post a Comment