Saturday, June 1, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర వైశాఖ బహుళ అష్టమ్యోపరి నవమి ప్రయుక్త పూర్వాభాద్ర నక్షత్ర హనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనలు.....🙂💐


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమద్ స్మరణాద్భవేత్..

బుద్ధి మరియు బలం,
యశస్సు మరియు ధైర్యం,
ధీరత్వం మరియు అరోగత్వం,
నిత్యచైతన్యశీలత మరియు వాగ్వైభవం,

ఇవన్నీ కూడా మనిషికి తన జీవితమార్గంలో పురోగమించడానికి దోహదమయ్యే దైవికానుగ్రహాలు...

ఇవన్నీ కూడా హనుమద్ స్మరణతో లభించడం అనే విశేషానికి కారణం, శ్రీమద్రామాయణంలో హనుమంతుడు వీటన్నిటి సమ్మిళిత సమాహారస్వరూపంగా అలరారిన అనన్యసామాన్య అప్రతిహత వానరవీరుడు...
సాక్షాత్తు ప్రత్యక్షభగవానుడైన సూర్యభగవానుడి నుండి సకలవిద్యలను ప్రత్యక్షంగా గడించిన అరుదైన భాగవతోత్తముడు...
శ్రీరాముడి వరం కారణంగా చిరంజీవిత్వాన్ని కూడా అందుకున్న భగవంతుడైనాడు...
[ అలా ఒక వానరుడిగా ప్రభవించి భగవంతుడిగా రూపాంతరమయ్యే ఐతిహ్యం తో రుద్రాంశ సంభూతుడిగా ప్రభవిస్తానని జపాలి మహర్షికి ముందే చెప్పిన మహనీయుడు ఆంజనేయుడు...అందుకే హనుమంతుడి ఆవిర్భావ ఘట్టానికి సంబంధించిన ఒకానొక కథనంతో ముడిపడిన ఐతిహ్యం కారణంగా ఇప్పటికీ, తిరుమల అరణ్యంలో జపాలి తీర్థ పరిసరాల్లో ఈ లోకంలో ఎక్కడాకూడా లభించని విధంగా ఉప్పుమామిడి కాయలు / పండ్లు అక్కడ లభిస్తాయ్....
అనగా మనుషులు తినలేనంత ఉప్పుతో నిండిన మామిడికాయలుగా ఆ చెట్లకు కాసే మామిడికాయలు రూపాంతరం చెందుతాయి....ఎంతటి ఆశ్చర్యం కదు..! ]

*********** *********** *********** ***********
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరినెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు

*********** *********** *********** ***********

అని ఆ పరతత్త్వ ప్రాభవాన్ని ప్రస్తుతించారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు....

సకల తత్త్వారాధనకు సామ్యముగా అలరారే దేవుడు హనుమంతుడు కూడా....
అందుకే అన్నమాచార్యుల వారు 
"హరికి లంకిణీహంతకు అంతరమీట్టునది..." అనే సంకీర్తన అనుగ్రహించినారు...

రుద్రాంశ సంభవుడైన ఆంజనేయుడు రుద్రాని యొక్క శక్తిని తన వాలాగ్ర శక్తిగా కలిగిఉన్నాడు కాబట్టి ఒక్క హనుమంతులవారికే వాలాగ్ర పూజ...
రామోలలితాంబికా కృష్ణశ్చశ్యామలా స్వయం....
అనేది పరతత్త్వోపాసకులకు ఎరుకైన తత్త్వ విశేషం....
ప్రత్యక్షపరమాత్మైన సూర్యుణ్ణి గురువుగారిగా భావించి, ఈ విశ్వంలో ఎవ్వరికీ సాధ్యపడని రీతిలో ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు అనుగమిస్తూ సేవించి, సకల విద్యలను గడించి 'బుద్ధిమతాం వరిష్ఠం' గా వినుతికెక్కిన వానరవీరుడు ఆంజనేయుడు...

ప్రత్యక్షంగా భువిపై నడయాడే మానుషరూప పరమాత్మగా కౌసల్యాదశరథుల కుమారుడిగా శ్రీరాముడిగా అవతరించిన శ్రీవైష్ణవతేజస్సు, సరయూ నదీప్రవేశం గావించి అవతార పరిసమాప్తి గావించే ముందు,
సీతమ్మ జాడ కనిపెట్టి తనను శ్రీసీతారాముడిగా అయోధ్యా నగరం రాజధానిగాగల కోసలమహాసామ్రాజ్య చక్రవర్తిగా,
500 నదీజలాలతో అభిషిక్తుడైన సుక్షత్రియ వీరుడిగా కొలువుతీర్చినందుకు సంతసించి, సభలో ఉన్నవారందరికీ వివిధ కానుకలు ఇవ్వగా, హనుమంతుల వారితో పాటుగా మైందుడు, ద్వివిదుడు, ఇత్యాది వానరవీరులకు కూడా చిరంజీవిత్వాన్ని అనుగ్రహించిన వైనాన్ని శ్రీచాగంటి సద్గురువుల సుమధుర మహిమాన్విత సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో విజ్ఞ్యులు వినే ఉంటారు కద...

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
( అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు సప్తచిరంజీవులు । )

అనే ప్రసిద్ధమైన సప్తచిరంజీవుల శ్లోకం బుధజనులకు విదితమే..
పరశురాముడు దశావతారాల్లో ఒకరు కాబట్టి చాలమందికి తెలుసు....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి తప్ప ఈ తరంలో మైందుడు, ద్వివిదుడు అనే వానరవీరుల పేర్లు కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియవు...
త్రేతాయుగం దాటి ద్వాపరయుగంలోని వివిధ ఐతిహ్యాలప్రకారంగా కృపాచార్య, అశ్వత్థామ వంటి వీరులు కూడా చిరంజీవులుగా ఉన్నారు...
మరి వారిని ఎవరైనా దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారా...? లేదు కద...

మరి వానరవీరుడిగా జన్మించి, సుగ్రీవసచివుడిగా చరించి, శ్రీరామబంటుగా ఖ్యాతిగడించి చిరంజీవిగా వరాన్ని గైకొన్న హనుమంతుల వారినే ఈ కలియూగంలో కూడా దేవుడిగా ఆరాధించడంలో (ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ కలియుగంలో హనుమద్ ఆరాధన ఎంతో ఆవశ్యకమైనది) అంతర్యమేమి..?

అనగా ఈ లోకంలో వివిధ చిరంజీవులు ఉన్నా,
కేవలం కొందరినే అనగా...

శ్రీవేదవ్యాసుల వారిని, హనుమంతుల వారిని భగవానులుగా నిత్యం ఆరాధించడం విజ్ఞ్యులు గమనించే ఉంటారు....

అనగా ఇక్కడ తత్త్వపరంగా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది...

అమరత్వం/చిరంజీవిత్వం మరియు దైవత్వం ఇవి రెండూ కూడా సంబంధం ఉన్నట్టుగా అనిపించే సంబంధం లేని రెండు తత్త్వాలు.....

అనగా,
పరమాత్మయొక్క అనుగ్రహంతో / సాధనతో, దేవతా ఉపాధిలో, దైవత్వస్థితిలో ఉన్నవారు / ఉండేవారు అమరులై ఉండాలనేంలేదు...
మరియు
అమరులై ఉన్నవారు దేవతా ఉపాధిలో, దైవత్వస్థితిలో ఉండాలనేంలేదు...

ఫర్ ఎగ్సాంపుల్, చూడ్డానికి కూడా ఒళ్ళుకంపరం చెందేలా ఉండే చిరంజీవి అయిన అశ్వత్థామ, దేవుడు కాడు కాలేడు...
మరియు
దర్శించినంత మాత్రాన ఎంతో ప్రశాంతతను, దైవిక అనుగ్రహాన్ని ప్రసాదించే పరమప్రశాంత స్వరూపులైన శ్రీకంచిపరమాచార్య వంటి మహనీయులు భౌతికంగా చిరంజీవులు కాకపోయినా, దేవతా సమానులుగా ఇప్పటికీ పిలిస్తే పలికే దైవంగా అలరారే మహానుభావులు..  దేవతా ఉపాధుల్లో / తైజసిక స్వరూపంలో ఉన్న హనుమంతులవారిని ప్రత్యక్షంగా దర్శించిన అరుదైన మహానుభావుల్లో ఒకరు....
వారి శ్రీమద్రామాయణ ప్రవచనాలు జరుగుతున్న సమయంలో
సాధారణ కపిరూపంలో తిరునామంతో ఉండే హనుమంతులవారిని ప్రత్యక్షంగా దర్శించిన మహానుభావుల్లో ఒకరు శ్రీచాగంటి సద్గురువులు ఒకరు.. అక్కడి ప్రవచన ప్రాంగణంలో అప్పుడు ఉన్న భక్తులు కూడా దర్శించిన హనుమస్వరూపం అక్కడ ఇప్పుడు ఒకపెద్ద విగ్రహంగా కొలువుతీర్చబడి ఉన్న విశేషాన్ని ప్రవచనాల్లో కొద్దిలో కొద్దిమందైనా వినే ఉంటారు..

భ గ వ తి
అనే అక్షరాల్లో...

భ దైవిక ద్యుతికి,
గ నాదశక్తికి,
వ అమృతత్త్వ శక్తికి,
తి శాంతి కారకత్త్వానికి,
ప్రతీక...

ఆరాధించిన వారికి వీటిని అనుగ్రహించే వారిని మాత్రమే
భగవంతులుగా శాస్త్రం పరిగణించును...

భ దైవిక ద్యుతిశక్తికి ప్రతీక : 
దైవిక ద్యుతి అంటే ఫేర్ & లవ్లి క్రీం రాసుకుంటే వచ్చే వర్చస్సు కాదు..
నిర్మలమైన విశ్వశ్రేయోకారక హృదయసంకల్పంలో జనించే దేవతాతత్త్వభాస వల్ల సమకూరే వర్చస్సు.....
వారివద్దకు గమించు వారికి ఆ ద్యుతిశక్తిని అనుగ్రహంగా ఇచ్చే తత్త్వం.

గ నాదశక్తికి ప్రతీక : 
నిత్యం నాదశక్తితో అలరారుతూ ఉండి, వారివద్దకు గమించు వారికి ఆ నాదశక్తిని అనుగ్రహంగా ఇచ్చే తత్త్వం.

వ అమృత శక్తికి ప్రతీక : 
నిత్యం అక్షీణ తత్త్వంతో అలరారుతూ ఉండి, వారివద్దకు ఏతెంచే వారికి ఆ అమృతశక్తిని అనుగ్రహంగా ఇచ్చే తత్త్వం.

తి శాంతి శక్తికి ప్రతీక :
నిత్యం ప్రశాంతతకు ఆవాసంగా ఉండి, వారివద్దకు ఏతెంచే వారికి ఆ ప్రశాంతశక్తిని అనుగ్రహంగా ఇచ్చే తత్త్వం.

ఫర్ ఎగ్సాంపుల్,

ఏదో ఒక విషయం గురించి వాడిపైకి వీడిపైకి ఏదో అరుస్తూ, కోపంతో మనఃశాంతిలేమితో, చిరాకు మొహంతో, ఉండే సదరుసామాన్యుడు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం గావించిన తదుపరి....
"మనస్సంతా ప్రశాంతంగా హాయిగా ఉందండి...అని వర్చస్సుతో కూడిన చక్కని మందహాస వదనంతో సమాధానం ఇవ్వడం గమనించే ఉంటారు..."

అనగా, పైన తెల్పబడిన తత్త్వాలన్నీ కూడా భగవణ్మూర్తి యొక్క దర్శనంతో భగవంతుడి నుండి భక్తులకు ఆపాదించబడినవి అనేది తత్త్వార్ధం...

హనుమంతుడు స్వతహాగా రుద్రాంశసంభూతుడు...
కాబట్టి ఆపాదతలమస్తకం శ్రీరుద్రద్యుతితో తొణికిసలాడే స్వర్ణశైలాభదేహం ఆంజనేయుడిది...

నిత్య హ్రీంబీజగర్భితమైన శ్రీరామజయరామజయజయరామ అనే త్రయోదశాక్షరి మహామంత్రజపంతో అప్రతిహత తపోశక్తిజనిత నాదశక్తితో నిండినిబిడీకృతమైఉండే  నాదమయమైనతనువు ఆంజనేయుడిది....

ఉత్తరదిక్కునకేగి హిమసీమలనుండి సంజీవని పర్వతాన్ని తెచ్చి సౌమిత్రిని పునర్జీవింపజేసిన ఘనుడు హనుమంతుడు...
అమృతశక్తి నిత్యం ఆతడికి కరతల ఆమలకమై ఉండే శక్తి...

హనుమద్ ఉపాసన ప్రశాంతమైన మనసుకు కారణం అవును కాబట్టే ఇప్పటికీ హనుమద్ దీక్షలు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఆరాధనా సంప్రదాయం...

అత్యంత మహిమాన్వితమైన, ప్రశాంతదాయకమైన, సుందరకాండ యొక్క మొదటి సర్గలోని మొదటి శ్లోకం మరియు చివరి సర్గలోని చివరి శ్లోకం 'త కారం' తోనే ఉండును అని శ్రీచాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో వివరించడం కొద్దిలోకొద్దిమందికైనా బాగా గుర్తుండి ఉండాలి...

తతో రావణ నీతాయాః సీతాయాః శతృకర్షనః
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి
৷৷5.1.1৷৷
ఇది సుందరకాండ లో మొదటి శ్లోకము.  

తతో మయా వాగ్భిరదీనభాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదితా.
జగామ శాన్తిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడితా ৷৷5.68.29৷৷
ఇది సుందరకాండ లో చివరి శ్లోకము.

శ్రీపరాశరసమ్హిత ప్రకారంగా, హనుమద్ ఉపాసన అనేది సకలదేవతా ఉపాసనకు ప్రతీకగా, సకల దేవతత్త్వార్ధసాధనకు సాధనం గా, భగవద్ తత్త్వాన్ని / పరతత్త్వాన్ని స్థిరమైనభక్తిజ్ఞ్యానములతో అందుకునేందుకు మార్గముగా భావింపబడును....

ఆనాడు మహేంద్రగిరి నుండి సముద్రలంఘనం సాగించడానికి పెరిగిన హనుమంతులవారి వైభవాన్ని మానసికంగా దర్శించేందుకు....
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడిగా అలరారే ఆజ్ఞ్యాపాలక హనుమంతులవారిని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఎంతో ఘనమైనరీతిలో ఈ క్రింది సంకీర్తనను అనుగ్రహించడం మన సౌభాగ్యం...

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు ||

రక్కసుల పాలిటి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ||

లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ||

దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ||

భక్తుల్లెల్లరూ హనుమద్ జన్మదినోత్సవ నైమిత్తికారాధనతో తరించెదరుగాక అని ఆకాంక్షిస్తూ...

ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రికమనీయవిగ్రహం
పారిజాతతరుమూలవాసినం
భావయామిపవమాననందనం

శ్రీవేంకటరామచంద్రపరబ్రహ్మణేనమః...🙂💐🙏