Tuesday, October 23, 2018

శ్రీకరమైన సద్గురుబోధల సారసంగ్రహం...! :)

శ్రీకరమైన సద్గురుబోధల సారసంగ్రహం...! 
"లోకో భిన్నరుచిః.... పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి.... "
అని మన పెద్దలు చెప్పినట్టు గా, సత్యలోకంలో బ్రహ్మ గారిచే గతజన్మల పాపపుణ్యవిశేషం చేత సంచయమైన సంచిత కర్మఫలాలను, ప్రారబ్ధం గా అనుభవింప జేయడానికై ఒక్కో జీవుడికి, తన పూర్వపు పూర్ణజన్మ ( సంపూర్ణ కర్మ స్వతంత్రత ఇవ్వబడిన, అనగా వెన్నుపాము నిటారుగా ఉండే ద్విపదులైన నరాది ఉన్నతమైన జన్మల ) లోని ఆఖరి ఘడియల్లో పంచేంద్రియ సంఘాతంతో కూడుకొనిఉన్న తన మనసు దేనిపై తీవ్రంగా లగ్నమై ఉండిపోయిందో, తద్ అనుగుణంగా కర్మాచరణచేయడానికి వీలైనరీతిలో అత్యంత గహనమైన కర్మసిద్ధాంత సూత్రబద్ధమైన జీవితానికి కావలసిన బీజ / క్షేత్రాన్ని ఎన్నుకునేలా, భువరాది షడూర్ధ్వలోకాల క్రింద ఉండే మేఘమండలానికి సూక్ష్మ రూపంలో పంపించబడిన జీవుడు, తండూలాన్ (బియ్యము), గోధుమ, ఇత్యాది వివిధ ధాన్య రాశి లోకి వర్షపు నీటిని ఆధారంగా చేసుకొని భూమండలంలోకి ప్రవేశించి, అది స్వీకరించబడి పచనమైన పురుషుని యొక్క వీర్యంలో ఒక జీవకణంగా మారి, అది నిక్షేపించబడిన ఒక స్త్రీ యోనిక్షేత్రం లోని మావిని ఆధారంగా/కవచంగా చేసుకొని, రమారమి 9 నెలలపాటు గర్భవాసం చేసి ఒక సంపూర్ణ మనుష్య శిశువుగా రూపాంతరం చెంది భువిపైకి అడుగుపెట్టడం తో, మళ్ళీ అదే కర్మ స్వతంత్రత కలిగిన జీవచట్రం లో ఒదిగి, అటు మోసుకొచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ, ఇటు ఆగామిని కూడబెడుతూ, తన పాత సంచిత సరంజామాను (దీపావళి కి మార్వాడి కొట్టులో పాత లెక్కలన్ని కలుపుకొని ఇంకొక కొత్త పుస్తకం లో ఖాతా లెక్కలు ప్రారంభించినట్టు గా ) సరికొత్తగా సరి చేసుకుంటూ, తన అసంఖ్యాక జీవ ప్రస్థానంలోని ఇంకొక నవ జీవిత ప్రస్థానాన్ని కొనసాగించే మనుష్యుల జీవనశైలి ఎంత ఆశ్చర్యకరమో అంతే విచిత్రకరమూనూ...!
ఒక్కో కాలంలో ఒక్కోరకం పండు, ఒక్కోరకం పువ్వు, లభించడం ప్రకృతి యొక్క ధర్మం గా మనం చూస్తూనే ఉంటాం....
అదేవిధంగా ఈ విశాల భూమండలంపై ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం, యెవ్వరు అవునన్నా కాదన్న అదే ప్రకృతి యొక్క ధర్మం / నియమం...
ఆ రీతిగ, బంగాలాఖాతం,హిందూమహాసముద్రం,అరేబియన్ సముద్రం 3 కలిసి తమ దోసిట్లో ఒడిసిపట్టుకున్నట్టుగా ఉన్న భూభాగమైన భరత ఖండానిది మిగతా అన్ని దేశాల లోకెల్ల ఎంతో ఉన్నతమైన, విశేషమైన ప్రాభవం.
అన్య దేశాల లాగా, ఇది కేవలంగా భోగ భూమి మాత్రమే కాదు...
ఇది వేద భూమి...కర్మ భూమి..జ్ఞ్యాన భూమి...యొగ భూమి....ధర్మ భూమి....ఇది యుగ యుగాల నాటిది...
ఏ దేశం లో లేని విధంగా ఇక్కడే మహత్తరమైన ఆలయాలు ఎందుకు ఉంటాయి...ఇక్కడే ఎందుకు ఇన్ని శాస్త్రాలు ఉంటాయి...ఇక్కడే ఎందుకు ఇన్ని సంప్రదాయాలు ఉంటాయి.... ఇక్కడే ఎందుకు గంగా యమునా సరస్వతి యొక్క త్రివేణి సంగమం ఉంటుంది... ఇక్కడే ఎందుకు వేద ఋక్కులను / సద్ గురువుల వాక్కులను / ప్రామాణ్యం గా స్వీకరంచి ఆచరించబడిన కర్మలకు నిర్దిష్ట ఫలితాలు లభిస్తాయి...ఇట్లాంటి వెర్రి వెంగలప్ప ప్రశ్నలను అడగడం మనం డబ్బులు పోసి ఆర్జించుకున్న / కొనుకున్న డిగ్రీల యొక్క గొప్పతనం గా భావిస్తే,
మరి ఎన్నెన్నో దశాబ్దాలు తపస్సును ఆచరించి, గురువులను సేవించి, యుక్తాహార విహర యమనియమ దమశమాది సంపత్తితో మహర్షులు / మునులు / యోగులు / ఆచార్యులు / సిద్ధ పురుషులు, తమకు మరియు ఈ భారతదేశానికి సముపార్జించి పెట్టబడిన సారస్వత / ఔషధ / సంప్రదాయ / సదాచార / యోగ ఇత్యాది వివిధ అమూల్య అమేయ సంపదను, మనకున్న లౌకిక పరిజ్ఞ్యానానికి అతీతంగా, ఉన్నతంగా, సర్వమానవ శ్రేయోదాయకంగా సదాచార సంపన్నులైన పెద్దలచే బోధింపబడుతున్నప్పుడు,
ఆ విద్వత్తును ఏహ్య భావం తో తూలనాడడం, కుటిల భావం తో కలుషితం చేయడం, కావరం తో కించపరచడం, చేసినప్పుడు దానివల్ల ప్రత్యక్ష పరోక్ష నష్టం ఎంతో మంది సజ్జనులకు కలుగుతుంది కాబట్టి, ఆ మహనీయుల ఆవేదన, రోదన, శాపం, తగిలి ఆ పాపం కట్టికుడిపినప్పుడు కాని అర్ధం కాదు, తేనెపట్టును అనవసరంగా సరదాకోసం కదిపి పక్కనే నిల్చొని ఆనందించాలనుకోవడం ఏ విధంగా ఉంటుందో అన్నది...!

ఒక్కోసారి ఒక్కోలా ఉండడం కాలం యొక్క ధర్మం... నాకు చలికాలం బాలేదు... ఎండా కాలమే కావాలి అంటే...కాల చక్రం లో భాగంగా అది వచ్చే వరకు వేచి ఉండాల్సిందే... నాకు ఈ కలియుగం బాగాలేదు... పూర్వపు ద్వాపర / త్రేతా / సత్య యుగాలే కావాలి అంటే, తుది మొదలు లేని సువిశాల కాల చక్రం లో అంతర్భాగంగా అవి వచ్చేంతరవకు వేచి ఉండాల్సిందే....
అల వేచి ఉండడం కుదరదు కాబట్టి, ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్ని దుస్తులు, శ్వెటర్, సాక్స్, వార్మర్స్, ఇన్ హేలర్స్, మొదలైన వాటితో చలికాలం మొత్తం శరీరాన్ని సమ్రక్షించుకొని, వసంత ఋతువు లోని లేలేత చిగురుల మధ్యన మామిడి పూత పై చైత్ర మాసపు కోకిలగానం కోసం ఎదురు చూసినట్టుగా....
ఈ కలి యుగ ధర్మానికి తగ్గట్టుగా, జీవితాన్ని సమ్రక్షించుకొని, సద్గురువుల / ఆచార్యుల / భాగవతుల
బోధనలను కరదీపికలుగా చేసుకొని ఎవరి జీవితాలను వారు ఉద్ధరించుకోవడమే ఈ యుగ ధర్మం...!
హరినామస్మరణం / హరిగుణగానం / భక్త భాగవత సేవనం / ఇత్యాదులతో, భగవత్ అనుగ్రహాన్ని మెండుగా పొంది సంచితాన్ని సమూలంగా తుడిచేసే దిశగా చిత్తశుద్దితో కర్మాచరణను చేసి ఫలితాన్ని భగవద్ అర్పితం చేసి, పుణ్యపాపాలాకు అతీతంగా శాశ్వత శివసాయుజ్య / పరమపదసోపానాధిరోహణ / కైవల్యతీరం / దిశగా జీవితాన్ని మలుచుకునేలా, అందరికి ఉపయుక్తంగా ఉండేలా చూస్తారు సద్గురువులు వారి సద్బోధలను.... అవి ఏ మేరకు మనం మన జీవితంలో ఆపాదించుకొని శుభాన్ని పొందుతాము అన్నది వారి వారి స్వవిషయం..
టీ.వీ స్క్రీన్లోనుండి ఆ సద్గురువులు మన ఇంట్లోకి వచ్చి బలవంతంగా మనతో ఏమి అవి పాటింపచేయట్లేదు కదా... ఇలా చేయడం మీకు హితకరం అని మాత్రమే చెప్తారు వారు....
అలాంటప్పుడు పనికట్టుకొని వివిధ మాధ్యమాల్లో రచ్చబండలకెక్కి, వారు అలా ఏంటి చెప్పేది...ఇలా ఏంటి చెప్పేది... నాకైతే ఇదంతా సిల్లి, మన ఆధునికత ఎక్కడ, ఆ పురాణపోకడలెక్కడ, అంటూ వందల మందిని ఉద్దేశిస్తూ తీర్పులు చెప్పేయడం ఏ పాటి గొప్పతనం ...? అది వారి వారి జ్ఞ్యానలేమికి పరాకాష్ఠ కాకపోతే ఇంకోటి అవుతుందా...? సమాజానికి హితవు చెప్పే పెద్ద స్థాయిలో కూర్చున్నాము అనే ఇంగితం కూడా లేకుండా చిన్నతనం తో చీప్ కామెంట్స్ వేయడం ఎంత విచిత్రమో ..! పేరులో ఇద్దరు దేవుళ్ళను పెట్టుకోవడం గొప్ప కాదు... తీరు లో ఒక పెద్ద మనిషిలా ఉండలేకపోయినా, కనీసం ఒక సజ్జనుడిగా ప్రవర్తించగలగడం మీడియాలో లో షొస్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు, వందల మందిని ప్రభావితం చెయ్యగల ఆ కుర్చీకి ఇచ్చే గౌరవం.....!!
అది తెలియని నాడు సద్గురువుల వచనాలపై నా యొక్క అభిప్రాయం అంటూ మీ యొక్క శుష్కచార్వాకం ప్రజలకు బోధించడం కోరి ' కర్మ కొరివి ' తో తల గోక్కోవడమే...!!!

No comments:

Post a Comment