Tuesday, October 9, 2018

​బ్రతుకమ్మ (ప్రకృతి) / బతుకమ్మ (వికృతి) ఉత్సవ వైభవవిశేషాలు....! :)

​బ్రతుకమ్మ (ప్రకృతి) / బతుకమ్మ (వికృతి) ఉత్సవ వైభవవిశేషాలు....! 
తెలంగాణా రాష్ట్ర పండుగగా స్థీరీకరించబడిన బతుకమ్మ పండుగ, చూడ్డానికి రంగు రంగుల పూలతో, ఉయ్యాల పాటలతో, కేవలం ఒక గ్రామీణ జానపద సంప్రదాయంలో అబ్బురంగా సాగిపోయే అమాయకపు పల్లె ప్రజల పండుగ అని మాత్రమే అనుకుంటారు....
కాని ఈ ఆశ్వయుజ మాస శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా జరుపుకునే ఈ ప్రాంతీయాచారం వెనక ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరమార్థం దాగుందో తెలుసుకుంటే ఆశ్చర్యంచెంది మరింత ఆనందంతో ఈ పండుగను జరుపుకోవడం ఖాయం...
అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల పర్యవేక్షణలో మొన్నటి కాకినాడ లో జరిగిన హేవిళంబి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో స్వామికి జరిగిన ప్రత్యేక పుష్పార్చనలో, స్వామి వారి ఆహ్నిక ధృవమూర్తి అచ్చం బ్రతుకమ్మలో పేర్చబడిన వివిధ పుష్పదొంతరల మధ్య కొలువైన గుమ్మడిపువ్వులాగా ఉండడం చూసి స్వామిని ధ్యానిస్తే తెలిసింది బ్రతుకమ్మ లో దాగిన ఆ ' చైతన్య కుసుమప్రియ ' యొక్క చిత్శక్తి వైభవం....!
నా 1స్ట్ క్లాస్ నుండి, గత 25+ సంవత్సరాలుగా మా అమ్మ ఎంతో నియమ నిష్టలతో, మా ఇంటిదెగ్గరి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాలనుండి, పెద్ద గునుగు, తంగేడు, చామంతి, రంగు రంగుల చిన్న గునుగు, గుమ్మడి, బంతి, ఇత్యాది వివిధ పువ్వులు ఆకులు కొని/సేకరించి చిన్న బత్కమ్మ, పెద్ద బత్కమ్మ అని రెండు పేర్చి, చివరికి గుమ్మడిపువ్వులోని పసుప్పచ్చని కేసరాన్ని లేదా పసుపుముద్దని పైన మణిపూస లాగ పెట్టి బ్రతుకమ్మను సాయంత్రం వాకిట్లో పెట్టి ఇరుగు పొరుగు వారితో కలిసి చుట్టూర తిరుగుతూ కొన్ని ఉయ్యాల పాటలు పాడి, కాలనిలోని కాలువ దెగ్గర అందరి బత్కమ్మలతో కలిపి అక్కడ కూడా అందరు ముత్తైదువులు / ఆడపడుచులు కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడి నీటిలో వదలడంతో, ఈ పండగ ముగిసేది....
ఇప్పుడంటే తీరిక లేక, ఖర్చుల కారణంగా, చిన్నచిన్నగా పేరుస్తున్నారు కాని, మా అమ్మమ్మ తాత వాళ్ళ రోజుల్లో అయితే 5 ఫీట్లు, 7 ఫీట్ల ఎత్తు బ్రతుకమ్మలు కూడా పేర్చేవారట...!. కేవలం రామవరం అనే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే కాకుండా, మొత్తం భద్రాద్రి కొత్తగూడెం లోనే మా అమ్మమ్మ తాతలు పేర్చే బ్రతుకమ్మకు 1స్ట్ ప్రైజ్ రావడం ఆ రోజుల్లో పరిపాటి..
రామవరం నుండి వచ్చే కేశ వీరయ్య / గట్టమ్మల బతుకమ్మ అంటే అంత ఘనంగా ఉండేదని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్తుండేది..!
నాకు చిన్నప్పుడైతే, అంటే 5 వ తరగతి వరకు అలా, బతుకమ్మ పండగ అంటే, ఇంట్లో అమ్మ, కాలనిలో అందరు ఫుల్లుగా పంచే ప్రసాదాలే గుర్తుకువచ్చేవి... బెల్లం కలిపిన నువ్వుల పిండి, చక్కెర పొడి కలిపిన పెసరు పిండి, బియ్యం పిండి, సత్తుపిండి, మినప్పిండి, అటుకులు బెల్లం, పుళిహోర, దద్యోజనం, ఇలాంటి రకరకాల ప్రసాదాలే నాకు సద్దులబతుకమ్మ అనాగానే మొట్టమొదట గుర్తొచ్చేవి.... ఎంత సేపు అవన్నీ తినేయడమే పనిగా ఉన్న నాకు, ఇలా ఈ పూల పండుగ జరుపుకోవడంలోని పరమార్థమేమి అనే ప్రశ్నైతే వచ్చింది కాని, దానికి సమాధానం మాత్రం అందని ద్రాక్షగానే ఉండిపోయింది.... పరంపరాగతంగా జనబాహుళ్యంలో ఉన్న సదాచార సంప్రదాయాల గౌరవ మరియాదలు తెలిసిన పెద్దలు ఏది చేసినా, చెప్పినా, సుదూరాలోచనతో, అందరి క్షేమం, ఉన్నతి కోరి చెప్తారు కాబట్టి, ఈ పండుగలో కూడా ఏదో ఆంతర్యం ఉండేఉంటుంది అని ప్రతి సంవత్సరం కేవలం అలాగే చూస్తూ సరిపెట్టుకున్నాను కాని, దానికి సమాధానం మాత్రం 2+ దశాబ్దాల తరువాత, అస్మద్ గురుదేవుల వివిధ ప్రవచనాల సారాన్ని సమన్వయం చేసుకొని స్వామిని ధ్యానిస్తే మొన్నటికి లభించింది... 
సాధారణంగా అందరు పెద్దలు చెప్పేది, ఆ వివిధ పూల బత్కమ్మలను కాలువల్లో, చెరువుల్లో, బావుల్లో, నదుల్లో, వేస్తే, ఆషాఢశ్రావణభాద్రపదం నాటి వర్షాలకు వచ్చి చేరిన కొత్త బురదనీటికి సహజసిద్ధమైన క్రిమిసమ్హారకంగా ఉండి ఆ నీటికి స్వచ్చతను, జీవశక్తిని ప్రసాదించి జీవకోటికి దాహార్తిని తీర్చే జలాలను శుద్ధి కావించడం అని....
అటువంటప్పుడు డైరెక్ట్ గా పూలన్ని తెంపి తీస్కెళ్ళి నీళ్ళలో గుమ్మరిస్తే సరిపోతది కదా అనే సందేహం వచ్చేది.. కాబట్టి ఈ మొత్తం బ్రతుకమ్మ ఉత్సవం మానవాళి మనుగడకు ఒక మంచి సందేశం ఇస్తూ సాగే సరళమైన, విరుల వారోత్సవం ( సద్దుల వరకు, ఈ 9 రోజులు కూడా చాలా చోట్ల ఆడుతారు కాబట్టి ఇది వారోత్సవం అన్నాను..) అని భావించడం కద్దు...
సో, ఈ చక్కనైన పరిమళాల పుష్పోత్సవం లో దాగిన గగన గంభీరమైన అధ్యాత్మ సందేశం ఏమనగా....
ఈ కాలం లో పుష్పించే వివిధ పుష్పాలన్ని సేకరించి, ఒక త్రికోణవృత్తావళి గా పూలను పేర్చుతూ బ్రతుకమ్మను పేర్చడం = చర్మము, రక్తము, అస్తి, మేధ, శుక్రము, మజ్జ, మాంసము, అనే 7 వివిధ ధాతువుల తో మనిషి శరీరము అనే ఒక సౌకుమార్య నిర్మాణము పరమాత్మచే గావించబడడం....
బతుకమ్మపై మధ్యలో తీర్చబడిన గుమ్మడిపువ్వు కేసరాన్ని / పసుపుముద్దని గౌరమ్మ గా ఆరాధించడం = మనిషి హృదయాంతరంలో పరమాత్మ తానే గౌర వర్ణంలో జీవాత్మగా కొలువై ఉండడం...!
( " తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌உక్ష’రః పరమః స్వరాట్ || "
అని మంత్ర పుష్పం లో చెప్పినట్టు కదా, ఆలయంలో అర్చకులు మనకు నిత్యం స్వామి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉంటారు....  )

ఎక్కడెక్కడో పేర్చబడి తెచ్చిన అన్ని బతుకమ్మలను ఒకచోటికి చేర్చి అందరూ చుట్టూ చేరి ఆటపాటలతో చప్పట్లు కొడుతూ బ్రతుకమ్మను సేవించడం... ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన మనుష్యులందరు సంఘజీవులుగా అందరితో కలిసి మెలిసి జీవనం సాగిస్తూ తమ జీవన యాత్రను / తుదకు జీవ యాత్రను సుసంపన్నం చేసుకోవడం ... )
ఇక ఆఖరికి, పెద్దవా చిన్నవా...., ఎవరు పేర్చినవి, ఎవరి ఇంటినుండి వచ్చినవి, ఎంత గొప్పోల్లవి, ఎంత సామాన్యులవి, అనే భేదభావాలేవి లేకుండా అన్ని బతుకమ్మలను దెగ్గర్లోని నీటి లో వదలడంతో అవి అలా కాసేపు నీటిపై తెలుతూ కొద్ది దూరం వెళ్ళాకా నీటిలో కలిసిపోయి ప్రకృతిలోకి ఒదిగిపోవడం.... = ఒక కుటుంబం గా, ఒక సంఘం గా కొన్ని సంవత్సరాలు జీవించిన మనుష్యులందరు, ఎక్కనుండి వచ్చారు, ఎంత గొప్ప వారు, ఎంత సమాన్యులు, ఇత్యాది భేదభావలేవి లేకుండా, విరించి లిఖిత ఊపిరులు / శ్వాస లెక్కలు ఇక సరి అయిననాడు, సప్తధాతువుల ఈ శరీరం ఎలా ఏర్పడిందో అలాగే శీర్యమై ప్రకృతిలోకి కలిసిపోవడం....!
ఈ రోజుల్లో అంటే సాంకేతిక విప్లవంతో , టీ.వీ లు, ఇంటర్నెట్లు, బుక్కులు, పత్రికలు, ఇత్యాది ఎన్నెన్నో ప్రచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆధ్యాత్మిక విజ్ఞ్యానాన్ని నలుగురితో పంచుకొని అందరు సమిష్టిగా జీవ యాత్ర లో ముందుకు వెళ్ళడానికి ఉపకరణాలు ఉన్నాయి...
మరి ఆ పూర్వపు రోజుల్లో మన పెద్దలకు, హరి కథలు / బుర్ర కథలు / ఒగ్గు కథలు / ఆలయాలు / జానపద గేయాలు / ప్రాంతీయాచారాలు మాత్రమే కదా ఉండేవి.... అందుకే ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా అందరూ కలిసి ఒక చోట జరుపుకునే ఇటువంటి గ్రామీణ ఆచారాలను ఏర్పాటు చేసి అందులో వెలకట్టలేని మన శాస్త్ర విజ్ఞ్యానాన్ని మేళవించి అందరూ సంతోషంగా జీవించాలనే ఉన్నతమైన మన పూర్వుల జీవనదృక్పథాన్ని భావి తరాలకు కూడా అందేలా సంస్కృతిని సమ్రక్షించడం ప్రతి నాగరికుని విహిత ధర్మమే కదా...! 
( చిత్ శక్తి లోని ' చిత్ ' అనే పదం, జనపదం లో ' చిత్తూ ' గా మారింది )
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన...
రాగి బింద తీసుక రమణి నీళ్ళకు వోతే
రాములోరు ఎదురయే నమ్మో ఈ వాడ లోన...
వెండి బింద తీసుక వెలది నీళ్ళకు వోతే
వెంకటేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన...
బంగారు బింద తీసుక బామ్మా నీళ్ళకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడ లోన...
పగిడి బింద తీసుక పడతి నీళ్ళకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన...
ముత్యాల బింద తీసుక ముదిత నీళ్ళకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడ లోన...! 

No comments:

Post a Comment