Friday, February 22, 2019

భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదాం..... తర్జనం యమ దూతానాం రామరామేతి గర్జనం.....😊

భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదాం.....
తర్జనం యమ దూతానాం రామరామేతి గర్జనం.....😊
రామసేతు నిర్మాణసమయంలో, ఉడత సహాయానికి తన కోమలమైన కరములతో నిమిరి, ఆ జాతి మొత్తం గర్వించేలా తన దక్షిణ హస్తపు తర్జని మధ్యమ అనామిక వేళ్ళ ముద్రలు వాటి పై శాశ్వతంగా ఉండేలా కరుణించిన శ్రీరాముడు ఎంత సౌమ్యుడో.....
శూర్పనఖ తెంపరితనానికి ఒప్పుకోలేదని తనపైకి ఉసిగొల్పిన 14000 మంది ఖరదూషణ రాక్షస సైన్యాన్ని ఒక్కడే రమారమి 1 గంటా 40 నిమిషాల్లో కర్కషంగా తెగటార్చిన అంతటి యోధుడు..... 😊
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల మాటల్లో, ఆ యుద్ధ సమయంలో శ్రీరాముని హస్తలాఘవం, ధనుర్బాణవిన్యాసం గురించి చెప్పాలంటే,
" గాల్లో జడివానలా రాక్షసులపైకి ఎగిసిపడుతున్న శరపరంపరలు, ఆ ధాటికి నేలకొరుగుతున్న అసురమూక తప్ప, శ్రీరాముడు తన బాణతూణీరం నుండి ఎప్పుడు బాణం తీసి ఎక్కుపెట్టి సంధిస్తున్నాడో అసలు కనిపించలేదు..."
కోదండరాముడి కఠోర కోమలత్వాలను ఇలా పక్క పక్కనే పెట్టి తరచి చూస్తే అసలు ఆశ్చర్యం చెందకమానదు కదా... 
శ్రీరాముడి ధర్మనియతిపై బురదజల్లుతూ బ్రతికిచావడమే జీవితంగా గలవారు వేసే మరో నింద, ఈ ఖరదూషణ యుద్దంలో 3 అడుగులు వెనక్కి రాముడు జరగడం ధనుర్వేదనియమావళికి విరుద్ధమైంది కాబట్టి రాముడిది అధర్మం కాదా...? అని...
"ప్రత్యర్ధివర్గంపైకి కోదండం ఎక్కుపెట్టి ధర్మబద్దమైన బాణప్రహారం చేయడానికి తగినంత చోటు లేనప్పుడు అది అపసర్పణమే కాని అధర్మం కాదు..." అనేది ఇక్కడ సద్గురువుల బోధ....
"రామరావణ యుద్ధం రామరావణయోరివ..." అని ఇప్పటికీ కీర్తిస్తామే అటువంటప్పుడు,
శ్రీరామ శరప్రహారధాటికి నిరాయుధుడిగా నేలకోరిగిన రావణున్ని, ' ఇంటికి వెళ్ళి విశ్రమించి రేపు యుద్ధానికి తిరిగిరా....' అని చెప్పిన శ్రీరాముడికి,
మరియు
విభీషణుడు రావణాసురుని ప్రాణం యొక్క గుట్టును చెప్పినా సరే, నాభికి అధోభాగంలో శరప్రయోగం చేయడం వీరోచితధర్మం కాదని, అది తాను అభ్యసించిన ధనుర్విద్యకే అవమానమని సమాధానం చెప్పిన శ్రీరాముడు, ఖరదూషణులతో యుద్ధసమయంలో ధనుర్వేదానికి విరుద్ధంగా వెళ్ళాడు అని అనడం, అవగాహనారాహిత్యం మరియు హాస్యాస్పదమే కదా...? 🙂
( 'అల్ప జీవులైన మనుష్యులు నన్నేం చేయగలరులే.....' అనే గర్వం తో మిడిసిపడి, నరవానరుల మినహ ఇంకెవ్వరి వల్ల మరణం సంభవించని వరం బ్రహ్మదేవుడి దెగ్గర పొందాడు కాబట్టి..., ' పౌలస్త్యవధ ' అనే శ్రీరామావతార లక్ష్యం నెరవేర్చేందుకు హనుమంతుని ప్రార్ధనమేరకు వాయుదేవుడు, సంధించబడిన శ్రీరామబాణగమనాన్ని, తన పంచప్రాణాలు అమృతభాండంగా కుంభకమైఉన్న రావణ నాభి అధోభాగానికి గురితగిలేలా గతిని మార్చి, దేవకార్యం సాధించబడేలా చేసి, శ్రీమద్రామయణానికి వన్నెతెచ్చిన రావణసమ్హారం సాధించబడింది )
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య సంకీర్తన
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం
: భావము :
దివ్యమైన ప్రభావము కలిగిన, దేవుళ్ళకు దేవుడైన
రావణాసురునికి శత్రువైన రఘు వంశములో పుట్టిన శ్రేష్ఠుడయిన శ్రీరాముని సేవింతును.
గొప్పవారయిన రాజులలో గొప్పవాడయిన, సూర్య వంశానికి చంద్రుడైన
మోకాళ్ళ వరకు చేతులున్న, నల్లటి మేఘము వంటి శరీరము కల
రాజులకు శత్రువైన పరశురాముని యొక్క విష్ణు ధనుస్సు కు దీక్షా గురువైన
పద్మముల వంటి కన్నులు కలిగిన శ్రీరామచంద్రుని కొలుస్తాను.
నల్ల మబ్బు తో సమానమైన శరీరము కల
ఎత్తైన, వెడల్పైన రొమ్ము కల, మలినము లేని పద్మమును నాభియందు కల
కొండంత ఎత్తుగా ఉన్న తాటి చెట్లను హరించిన, అన్ని ధర్మాలను భూమిపై స్థాపించిన
భూదేవి కుమార్తె అయిన సీతాదేవి కి అధిపుడైన, ఆదిశేషుడు శయనముగా కల రామచంద్రుని కొలుస్తాను.
బ్రహ్మ చేత పొగడబడిన, శ్రేష్ఠుడయిన నారాయణుని
శంకరుని నుండి ఆర్జింపబడి జనకుని ఇంటిలో చేరిన శివధనుస్సును విరిచిన
లంకలో రాక్షస సమూహమును ఎండిప చేసిన, విభీషణుని ఆదరించిన
సాధువులచేత, పండితులచేత పొగడబడి కలియుగంలో వేంకటేశుని అవతారంగా కొలువబడుచున్న రామచంద్రుని సేవింతును.
- శ్రీ తాడేపల్లి పతంజలి గారు

No comments:

Post a Comment