Friday, February 1, 2019

HTAMF-2019 - 'జలతరంగిణి' స్వరవిన్యాసం :)

Yesterday's HTAMF-2019 was a true feast to many a 'Sangeeta Aaradhaka' with a one of its kind rarest art of ' Jalatarangini ' swara vinyaasam, performed by Shree Nemani Somayaajulu gaaru. More details on this amazing art are published in the attached clipping.
శ్రీ నేమాని సోమయాజుల గారిచే నిన్నటి హైదరాబాద్ త్యాగరాయ సంగీత ఆరాధనోత్సవంలో ప్రదర్శించబడిన 'జలతరంగిణి' అనే అరుదైన కళ లోని స్వరవిన్యాసం సంగీత ఆరాధకులెల్లరికి కర్ణపేయమైన కమనీయ ప్రసాదంగా లభించింది..! 
అది వింటున్నప్పుడు నాకైతే అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటిగారు తమ ప్రవచనాల్లో ఒక చోట వరంగల్ రామప్ప ఆలయంలోని అపురూపమైన సంగీత స్తంభాల గురించి చెప్పిన విశేషాలు గుర్తుకువచ్చి, మన పెద్దలచే ఆరాధించబడిన ప్రాచ్య కళలవైభవం ఎంతటి ఘనమైనదో ఒక్కసారిగా కళ్ళెదుట స్పురించింది. ఎదుట ఉన్న నిర్దిష్ట శృతిబద్దమైన ప్రత్యేక పింగాణి పాత్రల్లోకి తగు మోతాదులో నీటిని నింపి, తత్స్వరాన్ని పలికించేలా చేసి స్వరవిన్యాసాన్ని ప్రదర్శించడమే అంత కష్టమైన గొప్ప కళ అయినప్పుడు, మరి పెద్ద పెద్ద బండరాళ్ళను శిల్పశాస్త్రానుగుణంగా చెక్కి స్తంభాలుగా మలిచి, అందులోంచి సప్తస్వరాలు పలికించేలా వాటికి సంగీత రససిద్ధిని ఆపాదించి వాటిని రాతితంత్రులుగా మలచిన మన పూర్వకాలపు స్థపతులు ఎంత గొప్పవారో కదా...!
ఈనాటి ఎంతటి అత్యాధునిక విజ్ఞ్యానాన్ని ఉపయోగించైనా సరే ఇలాంటి కళలకు ప్రాణంపోయడం అసాధ్యమే అని నా భావన...
ఆధునిక విద్య / విజ్ఞ్యానము, మనిషి మనుగడకు ఉపయుక్తమై, ఒక నాగరికుడిగా, సదరు సాంకేతిక / భౌతిక విద్యకు అధిపతిగా మాత్రమే మనల్ని తయారుచేయగలవేమో...
కాని, మనిషి యొక్క బుద్దినే కాక, మనసును సైతం స్పృశించి, తన శక్తితో ఆ మనిషి యొక్క ఆలోచనాసరళిని ఉన్నతంగా తీర్చిదిద్ది, వ్యక్తికి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని కూడా సమకూర్చిపెట్టగలిగే సాధనాలు మాత్రం లలితకళలే...!! అందునా సప్తస్వరాత్మకమైన సంగీతానికి ఉన్న శక్తి అనన్యసామాన్యము అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా...
సంగీతానికి శిలలు సైతం కరిగి ప్రవహిస్తాయి అని మన పురాణాల్లో పెద్దలు చెప్పడం వినే ఉంటారు.... ( హనుమంతుడు, నారదతుంబురులకు వారి సంగీతాతిశయాన్ని నివారించేందుకు ఒక చిన్న సంగీత పరీక్ష నిర్వహించి రాతిపై పెట్టిన వీణని కరిగిన రాతిలోకి వెళ్ళేలా చేసిన ఉదంతం చదివేఉంటారు..)
అలా శిలలను సైతం కరిగించే గంధర్వవిద్యాధురీణులను ఈకాలంలో చూడడం కుదరదు కదా అనుకోవడంకంటే, రాయిలాంటి మన మనసుని వెన్నముద్దలా మార్చే సంగీతాన్ని విన్నప్పుడు ఆ సత్యాన్ని మనం అప్రయత్నంగానే ఒప్పుకోవడం కద్దు...!! 
మనిషి మనసు అనేది సింగరేణి బొగ్గు ముక్క లాంటిది... అప్రయత్నంగానే అది నిత్యం అరిషడ్వర్గ ధూళిధూసరావృతమై సద్గుణాలను కప్పిపెట్టే ఆసురివర్గ కపటిగానే ఉండడానికి ఇష్టపడుతుంది...
సద్గురు వాక్కులు, భగవద్ నామగుణవైభవములు, సుసంగీతసాహిత్య ఝరులు అనే మెరుగులు దానికి ప్రయత్నపూర్వకంగా అందివ్వబడిననాడే, అది మెల్లగా మెత్తని శుద్ధసత్వపు సుద్దముక్కలా మారి, సద్గురువుల ఆశీస్సులతో / భగవద్ అనుగ్రహంతో ఏదోఒకనాడు శాశ్వత సద్గుణ వజ్రమై నిలిచిఉంటుంది..!
( even a Diamond was once a mere piece of charcoal that withstood extreme pressures of earth's crust  )
సంగీతారధన అంటే ఒక వాద్యం పై, సదరు వాద్యకారుడి స్వరవిన్యాసాన్ని తిలకించి ఆలకించడం మాత్రమే కాదు...
ఆ ఆలాపన మన హృద్వీణపై మనోతంత్రులను మీటుతూ సాగించే విన్యాసాన్ని ఆంతరంగా దర్శిస్తూ, తన్మూలంగా శరీరంలోని ముఖ్యమైన నవనాడులపై అది ప్రసరించే దైవానుగ్రహాన్ని ఆలకిస్తూ, ఆ ఆంతరానందానుభవం కలిగించే మనోరససిద్ధి మన నయనాలనుండి ఆనందాశ్రువులై జాలువారిననాడు, ఆ బాహ్య సంగీతమే మన ఆంతర షడ్చక్రాల తంత్రులను మీటుతూ నాదయోగానందామృతఝరి గా ప్రకటితమై, మనదేహమే సంగీతసరస్వతీనిలయంగా మారి మౌనరాగాలభరిత మన భావనే ఆ ' భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక ' యొక్క అంతర్ సంగీతారాధన గా మారి, జీవితానికి భవ్యత నొసగుతుంది... 
అందుకే త్యాగరాయులవారు, సరస్వతీ రాగంలో కూర్చిన తమ ఈ క్రింది కృతిలో సగుణ నిర్గుణోపాసనలను అనుసంధానిస్తూ మనోలగ్నత యొక్క ప్రాముఖ్యాన్ని వర్ణించారు...
ప. అనురాగము లేని మనసున సు-జ్ఞానము రాదు
అ. ఘనులైన అంతర్జ్ఞానులకెరుకే కాని (అ)
చ. వగ వగగా భుజియించే వారికి తృప్తియౌ రీతి
స-గుణ ధ్యానము పైని సౌఖ్యము త్యాగరాజ నుత (అ) 

EPAPER.TELANGANATODAY.COM
Read digital edition of Telangana Today daily newspaper. Find Telangana Today all Newspapers Online including Main Editions and Supplements at Telangana Today ePaper Site.

No comments:

Post a Comment