శ్రీ వికారి సంవత్సర స్వాతి నక్షత్ర ప్రయుక్త వైశాఖశుద్ధ చతుర్దశి, శ్రీలక్ష్మినృసిమ్హజయంతి / శ్రీతరిగొండ వెంగమాంబ జయంతి శుభాభినందనలు.....
:)
మత్స్యకూర్మవరాహనారసిమ్హాది శ్రీమహావిష్ణు దశావతరాల్లోని
4 వదైన శ్రీనృసిమ్హావతార ఆవిర్భావదినంగా మాధవమాసంలోని ఈరోజుని మన పెద్దలు నిర్ణయించినారు.... అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా ఆలకించిన నృసిమ్హవైభవాన్ని కొంత వివరించే ప్రయత్నంచేస్తాను....
:)
ఒకానొక సమయమున శ్రీవైకుంఠస్థిత రమాపతి యొక్క దర్శనార్థమై ఏతెంచిన బ్రహ్మగారి మానసపుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులను బ్రహ్మవేత్తలను, స్వామివారి సన్నిధికి వెళ్ళకుండా అడ్డగించి పరిహాసమాడినందుకుగాను, స్వామి వారి ద్వారపాలకులైన జయవిజయులను,
" కన్ను మిన్ను కానక అహంకారపూరితులై ఏ స్వామికి భాగవతులంటే అత్యంత ప్రీతికరమో అటువంటి భక్తవత్సలుడి సన్నిధికి వెళ్ళేందుకు మమ్ములను అడ్డగించినందుకు, అదే స్వామికి మీరు దూరమై మర్త్యలోకమునందు జన్మనెత్తెదరు గాక....." అని శపించగా,
వారి అపరాధాన్ని మన్నించి తిరిగి తమ స్వస్థానాల్లో చేరే భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ ద్వారపాలకులు స్వామివారిని ప్రాధేయపడగా,
" స్వామివారిపై ప్రీతితో 7 జన్మలు...లేక వైరంతో 3 జన్మలు ఎత్తి, తిరిగి శ్రీవైకుంఠం చేరగలరు...." అని శ్రీమహావిష్ణువు శాపానుగ్రహమివ్వగా, 7 జన్మల పాటు స్వామివారి ఎడబాటును సహించడం కన్నా 3 జన్మలు ఎత్తి తిరిగివచ్చుటే మేలని భావించి, 3 వైరి జన్మలనే కోరిన ఆ జయవిజయులు
హిరణ్యాక్షహిరణ్యకశిపులు అనే అన్నదమ్ములుగా కృతయుగంలో,
రావణకుంభకర్ణులు అనే అన్నదమ్ములుగా శ్రీరాముని త్రేతా యుగంలో,
శిశుపాలదంతవక్తృలుగా శ్రీకృష్ణుని ద్వాపరంలో జన్మించి,
స్వామివారిచే నిహతులై తిరిగి విష్ణుపార్శ్వదులుగా తమ పూర్వపు ఉన్నత జన్మలకు ఏగిన వృత్తాంతాం అందరికి సుపరిచితమే కదా....
అందులో మొదటి జన్మలోని, హిరణ్యాక్షహిరణ్యకశిప దైత్యులుగా జన్మించినప్పుడు, వరాహావతారంలో సోదరుడు హిరణ్యాక్షుణ్ణి సమ్హరించిన శ్రీహరిపై కక్షతో హిరణ్యకశిపుడు ఘోర తపమాచరించి, బ్రహ్మగారిచే,
" దేవ దానవ నరులు మొదలుకొని ఏ జాతి జీవులచే కాని, పగలు కాని రాత్రి కాని, భూమి పై కాని ఆకాశంలో కాని, అస్త్రంతో కాని శస్త్రంతో కాని, జీవము ఉన్నదానితో కాని నిర్జీవమైనదానితో కాని, ఇవ్విధములైన వేటితోకూడా తనకు మృత్యువు లేకుండా వరమివ్వమని అడగగా..."
స్థితికారుడిగా ఎల్లప్పుడూ అంతటా పరివ్యాప్తమై అన్నిటికీ అతీతమైఉండే ఆ పరమాత్మతత్వం, లయకారుడిగా ఏ విధంగా ప్రభవించి వాడికి మృత్యువును అనుగ్రహించగలదో దర్శించి,
బ్రహ్మగారు ఆ దైత్యుణ్ణి, "అట్లే అగుగాక తథాస్తు..." అని, కోరుకున్న వరమిచ్చి అంతర్ధానమయ్యెను.....
మిగతా రాక్షస ఉపాధులకంటే వీడి అతితెలివి కొంచెం ఎక్కువైనదే అని భావించాలి...ఎందుకంటే, అప్పటివరకు ఈ విశ్వంలోనే ఎక్కడా లేని విధంగా దుస్సాధ్యమైన వరాన్ని ఆర్జించి అమర్త్యుడై విర్రవీగుదామనుకున్న వాడి అహంకారం కంటే కూడా, అమరత్వానికై ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండ ఉండడానికి యావద్ జీవకోటిని, తద్ జనితమైన జడరాశిని తనవరంలోని ఐచ్ఛికాలలోకి తీసుకురాగలిగిన వాడి అహంభావానికి ఇక్కడ లోకమంతా నివ్వెరపోయింది....!
వాడు పెట్టిన ఆ కఠిన నియమావళికి అనుగుణంగా ఆ పరతత్వం రూపాంతరం చెంది, అత్యవసరమైన శిష్టరక్షణ అనివార్యమైన దుష్టశిక్షణ గావించేందుకు, విశేషక్రూరత్వాన్ని సంతరించుకున్న ఆ దైత్యుడి సమ్హారానికై, అంతే చిత్ర విచిత్రమైన, ఇదివరకు ఈ విశ్వంలో లేనిది, సరికొత్తదైన సాటిలేని బలసంపన్నమైన ఉపాధిని, దుస్సహమైన రుద్రతేజస్సును సంపూర్ణంగా తనలోకిగైకొని, స్వల్పకాల వ్యవధి గల అపురూపమైన అవతారంగా ప్రభవించి, ధర్మరక్షణగావించిన శ్రీహరి 4వ అవతారమే ఈ శ్రీనృసిమ్హావతారం.....!
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనగా బంగారువర్ణంలో మెరిసే కళ్ళు, గోళ్ళు ఉన్నవారని అర్ధంకదా.....
ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, అలా ఉంటేనే అది చక్కనిది, ఉత్తమైనది, అని భావం....
సాధారణమైన నలుపు, తెలుపు రంగుల్లో ఉండవలసిన కళ్ళు, గోళ్ళు, బంగారు వర్ణంలో ఉండడాన్ని అసలు ఊహించుకోడానికి కూడా సమ్మతించం...
ఆపాదతలమస్తకం నిండిపోయిన రాక్షసత్వాన్ని వాటిద్వార ప్రకటంగా విశదపరుస్తూ, అలాంటి వాటితో తిరిగే ఆ రాక్షసులను, వారి క్రౌర్యాన్ని ఇక లోకం ఏవిధంగా భరించగలదు....
ఏ జీవుల్లోనైనా సరే, విశేషించి కర్మస్వతంత్రత కలిగిన బుద్ధిజీవులైన మనుష్యుల కళ్ళు, గోళ్ళు ఈ రెంటికి ఉన్న శక్తి అపారం...ఒకటి ఐంద్రికంగా, మరొకటి భౌతికంగా....అది మంచిగాను, చెడుగాను రెండువిధాలుగా వ్యక్తపరచబడడం మనం చూస్తూనేఉంటాం....
"ఏ మహానుభావుని చల్లని చూపుల అనుగ్రహమో ఈ విశేషం....." అని పెద్దలు అనడం చూస్తుంటాం...
అట్లే,
"నరుని చూపునకు నల్లరాయి అయినా పగిలిపోవును..." అని కదా మన పెద్దలు చెప్పే సామెత.....
యోగపరిభాషలో చెప్పాలంటే, విశేషమైన జవశక్తి గల మనసులో జనించే సంకల్పశక్తికి అనుగుణంగా ఒక ఇంద్రియంచే తద్సమయంలో తరంగితమయ్యే ధనాత్మక / ఋణాత్మక భావాలే, ఈ మంచి చెడులు అని అర్ధం.....
అదేవిధంగా, మనిషి యొక్క జుట్టు, గోళ్ళు కూడా.... జీవాజీవ ద్వయమైన ఈ రెండు చాల విచిత్రమైనవి....
పెరుగుతుంటాయి కాబట్టి జీవమున్నట్టా.....అంటే ?
శరీరంలోని వైటమిన్-కె ని గ్రహించి, వాటి ఉద్గమ స్థానంలో సజీవకణజాల జనితపదార్ధమునుండి ప్రభవిస్తాయి కాబట్టి జీవమున్నట్టే....!
కత్తిరించినప్పుడు నొప్పి ఉండదు కాబట్టి జీవంలేనట్టా...అంటే ?
జనించి ఒక నిర్నీతపరిధిని దాటి పెరిగినతరువాత (అంటే when they protrude out of the dermis and epidermis layers of the skin ) శరీరబహిర్గతమైనప్పుడు, అందున్న జీవకణజాలం లుప్తమై పోతుంది కాబట్టి అప్పటినుండి అది నిర్జీవమే...!
హస్తనఖములను పరిశీలించి ఆ మనిషియొక్క ఆరోగ్యమును గురించి వివరించగల గొప్ప శాస్త్రీయవిద్వాంసులు గల దేశం ఈ భారతదేశం..!!
ఇక భౌతికంగా / ఆధ్యాత్మికంగా కూడా నఖముల శక్తి అపారం అని తెలిసిందే.... క్యారంస్ ఆడడం దెగ్గరినుండి, పెన్ పర్ఫెక్ట్ గా పట్టుకొని బాగా రాసేంతవరకు,
మరియు తలగోక్కోవడం నుండి స్వీయరక్షణకు సహజ శస్త్రాలుగా, భౌతికంగా మనం గోళ్ళను వివిధ ప్రయోజనాలకు ఉపయోగించడం తెలిసిందే....
ఇక ఆధ్యాత్మికంగా, అమ్మవారైతే భండాసురసమ్హారంలో తన దివ్య నఖములనుండి ఏకంగా శ్రీమన్నారాయనుణుని దశావతారాలను సంకల్పమాత్రం చేత సృజించి యుద్ధంలో వాడి అసురసేనను లయించివేసింది...!!
( " కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః " )
అలా బంగారువర్ణపు గోళ్ళుండి క్రూరత్వంతో బాగామదించిన ఆ హిరణ్యకశిపుడు సొంత కొడుకని కనికరంకూడా లేకుండా ప్రహ్లదుని ఎన్నెన్నో కష్టాలకు గురిచేసి తుదకు విసిగివేసారి,
ఎక్కడరా నీ శ్రీహరి ఉండేది....అంటూ కసిరిననాడు,
" ఎక్కడైనా ఉంటాడు నా శ్రీహరి..." అని అంతే ధీటుగా సమాధానం ఇచ్చిన బాలుని ఓర్వక, సభాస్తంభాన్ని చూపి ఇందుగలడా నీ హరి అని గదమాయించిననాడు...
"ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే "
అనే శ్రీపోతనామాత్యుల వారి కందపద్య శైలిలో శ్రీహరి సర్వాంతర్యామిత్వాన్ని తేటతెల్లం చేసేలా ప్రహ్లాదుడు పలకడంతో, భాగవత వచనాన్ని నిజంచేసేందుకు, భగవంతుడే మునుపెన్నడు రాని రీతిలో, హిరణ్యకశిపుడు తన గదతో ప్రహారం గావించబడిన ఆ స్తంభమునుండి దుర్నిరీక్ష్యమైన దైవిక తేజస్సుతో,
అటు నరుడు ఇటు మృగము కాని ఆగ్రహోదగ్రుడైన ఉగ్రనారసిమ్హునిగా సద్యోప్రకటితమై,
అటు భూమి ఇటు ఆకాశం కాని గడపపై నిలిచి,
అటు పగలు ఇటు రాత్రి కాని సంధ్యాసమయంలో,
అటు అస్త్రం కాని ఇటు శస్త్రం కాని జీవాజీవములైన తన వాడి హస్తనఖములతో ఆ దైత్యుడి శరీరాన్ని తన ఊరువుపై పెట్టి, వాడి పొట్టను చీల్చి పేగులు పెకిలించి, సమ్హరించిన విశేష అవతారమే శ్రీమహావిష్ణుమూర్తి యొక్క శ్రీనారసిమ్హావతారం...!!
:)
ప్రహ్లాదుడు మరియు అందరు దేవతలు కలిసి పరి పరి విధముల స్తుతించి శాంతి పరిచి, అంతటి మహత్తరమైన స్వామి యొక్క అవతార వైభవం ఇలలో శాశ్వతంగా నిలిచి, భక్తభాగవతులకు చిరకాలం ఎనలేని రక్షణ వెలువరించేలా ఆనాడు ప్రార్ధించినందుకు అప్పటి కృతయుగం నుండి నేటి కలియుగం వరకు కూడా ఆ స్వామి వైభవం దిగ్దిగంతముల వ్యాపించి పరిఢవిల్లుతూనే ఉంది...!!
తత్ఫలితంగా పంచనారసిమ్హులు, ( యాదఋషి తపస్సును అనుగ్రహించి యాదాద్రిపై ) , నవనారసిమ్హులు ( అహోబిలాది 9 క్షేత్రాలు ), ఇత్యాదిగా ఆ స్వామివైభవం / అనుగ్రహం మనం ఇప్పటికీ పొందుతూనేఉన్నాం....
:)
మంగళగిరి పానకాల శ్రీలక్ష్మీనరసిమ్హుడిగా,
అలనాడు కృత యుగంలో అమృతాన్ని,
త్రేతాయుగంలో గోఘృతాన్ని (ఆవునెయ్యి),
ద్వాపరంలో గోక్షీరాన్ని (ఆవుపాలు),
ఈ కలియుగంలో గుడోదకాన్ని (బెల్లం పానకం)
స్వీకరిస్తూ, భక్తులందరిని ఆ స్వామి చల్లగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు నేటికి కూడా...!
:)
శ్రీ ఆదిశంకరచార్యుల వారిని ఒక కాపాలికుడు కపటయాచనతో, వారి శిష్యులు దెగ్గర్లో లేనిసమయంలో, బలి తీసుకునేటప్పుడు శిష్యులకు ఆ ఆపద మనోదృక్ గోచరమై శ్రీనరసిమ్హ స్వామిని ప్రార్ధించగా ఉత్తరక్షణం కొండనుండి స్వామి బయల్వడి ఆ కాపాలికుణ్ణి చీల్చిచంపేసాడు...
మరియు శ్రీశంకరాచార్యులవారు కొన్ని రోజులు తమ దేహాన్ని యోగమార్గంలో వీడి ఒక రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశంగావించినప్పుడు (శ్రీ శిరిడి సాయిబాబా గారిలా ),
అది తెలుసుకొని ఆచార్యులను ఓర్వలేని దుండగులు భగవద్పాదుల భౌతికకాయాన్ని అగ్నితప్తం చేసినప్పుడు,
ఈ విషయాన్ని గ్రహించి తిరిగి తమ శరీరంలోకి యథాస్థానంలో పంచప్రాణాలను ప్రవేశపెట్టే యోగప్రక్రియలో కొంచెం ఆలస్యమై, చేతులు కాలిపోయినప్పుడు శ్రీ శంకరాచార్యులవారు వెంటనే తనను రక్షించిన శ్రీనరసిమ్హస్వామిని కరావలంబ స్తోత్రంతో ప్రసన్నం చేసుకొని కాలిపోయిన తమ హస్తాలాను తిరిగిపొంది, తమ శరీరంలోకి సంపూర్ణంగా పునఃప్రవేశం గావించారు.....
ఇక అదే భక్తప్రహ్లాదుని అంశలో ఈ కలియుగంలో జన్మించిన మహాసాధ్వీమణి మాతృశ్రీతరిగొండవెంగమాంబ గారికి మొదట తమ ఊరులోని సత్యప్రమాణాలక్షేత్రమైన శ్రీ తరిగొండ లక్ష్మీనరసిమ్హుడిగా అనుగ్రహించి, పిదప తన కలియుగ ప్రత్యక్షావాసమైన శ్రీవేంకటగిరిపైకి రప్పించి ( అలయ ఈశాన్యభాగాన తన హస్తనఖములు ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూ శ్రీయోగనారసిమ్హుడిగా స్వామి కొలువైఉండడం మనం ఇప్పటికీ చూడొచ్చు ), తిరుమల అభయారణ్యస్థిత తుంబురు కోనను సాధనాస్థలిగా అనుగ్రహించి, తుదకు శ్రీవరాహస్వామి ఆలయానికి దెగ్గర్లో ఉన్న శ్రీతరిగొండవెంగమాంబ బృందావనంలో సజీవసమాధియోగాన్ని అనుగ్రహించిన ఆ అప్రతిహత తేజోమూర్తి అయిన శ్రీవేంకటనృసిమ్హాన్ని అన్నమాచార్యులవారు, ఒకానొక సందర్భంలో అప్పటి భూపతి అయిన సాలువనరసిమ్హరాయులవారి చెరలో బంధీగా ఉన్నప్పుడు తనకు బంధనవిముక్తి కలిగించమని వేడుకుంటూ వెలువరించిన ఈ సంకీర్తన కూడా స్వామి వారి శ్రీనృసిమ్హావతారమంతటి కడు గగనగంభీరమైనదే...!!
:)
ప|| భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా ||
చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార | లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- | చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||
చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- | లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ | నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||
చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- | కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- | కారణ ప్రకట వేంకట నారసింహా ||