Monday, July 8, 2019

కాంగ్రెస్ మరిచినా... దేశం మరవకూడని బృహస్పతి....శ్రీ పాములపర్తివేంకటనరసిమ్హారావ్...!

క్రింద నక్షత్రాల (*****) తర్వాత ఉన్న వ్యాసానికి, నాకు, వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధము లేదు.....ఎవరో రచించింది నాకు పంపించబడితే అందులోని కొన్ని అంశాలు నచ్చి ఇక్కడ షేర్ చేసాను అంతే....
భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు, అంతర్జాతీయ యవనికపై దేశం యొక్క పరువు మసకబారి, భారతదేశం అంటే ఆనాడు ఆంగ్లేయులు నిర్వచించినట్టుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఒక "బీదలబస్తి" అనే భావన మిగతా దేశాలకు కలిగేలా ఉన్న సమయంలో,
అత్యంత సాహసోపేత నిర్ణయాలను ఏకపక్షంగా కాకుండా అందరిని ఒప్పించి మరీ తీసుకొని, దేశ భవిష్యత్తు పురోగమన దిశలో సాగేలా నిస్వార్ధంగా కృషి చేసిన ఆ మేరునగధీరుని, ఆ బహుభాషా కోవిదుడిని, ఆ రాజనీతిచతురిడిని,
ఆ అసమాన దేశభక్తుడిని, "భారతరత్న" పురస్కారం ఇంకా వరించలేదంటే అది వారి మేధో భిక్షపై తన ఉనికిని నిలుపుకున్న ఈ యావద్ భవ్య భారతావనికే తీరని అవమానం.....
రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా
శ్రీ పాములపర్తివేంకటనరసిమ్హారావ్ గారికి ఆ గౌరవపురస్కారం లభించేలా ఇప్పటి నాయకులు, పెద్దలు తగు చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా మన సాంఘిక కృతఘ్నతకు నిష్కృతి లభిస్తుందని నా భావన...
( అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువులతో శ్రీ పీ.వీ.ఎన్.ఆర్ గారు ఒకనాడు, " నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలనో చెప్పండి... నా వల్ల వీలైనది చేస్తాను...." అని అడిగినప్పుడు, యథాప్రకారంగా "నాకేమి వద్దండి....మీ అభిమానం చాలు..." అని సున్నితంగా సద్గురువులు వారించిన సందర్భం ఒకటి గుర్తుకువచ్చింది... 😊
దేశాన్ని పరిపాలించే అంత పెద్ద శాసక పదవిలో ఉండికూడా భాగవతులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో అలా అడగాలంటే ఎంతో గొప్ప సంస్కార బలం ఉంటేనే కదా అలా వీలైయ్యేది..!)
జైహింద్....వందేమాతరం...🙏
**************************************
కాంగ్రెస్ మరిచినా... దేశం మరవకూడని బృహస్పతి
-------------------------------------------------------------
(SHARE it, if you like)
1) కమల హాసన్ "ఆకలి రాజ్యం" సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణం...కమల్ హాసనో,దర్శకుడు కె.బాల చందరో కాదు. దేశంలో అప్పుడున్న పరిస్థితులు. సినిమా చూసిన ప్రతి యువకుడు "అరే,ఇది నా కథ లా ఉందే.." అని ఫీల్ అవడం. టి.కృష్ణ గారి ఎర్ర సినిమాల తో పాటు..ఎన్నో సినిమాల్లో నిరుద్యోగ సమస్య పై..బుల్లెట్స్ లా పేలే "రాజకీయనాయకులను,ప్రభుత్వాలను" తిడుతూ వచ్చిన డైలాగ్స్, సమాజానికి అద్దం పట్టేవి.
ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాయి. కారణం పి.వి.నరసింహారావు గారు..అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో గానీ..నిజం.
1980 లలో వచ్చిన ఎన్నో నాటకాలలో..పది లో ఏడు సాంఘిక నాటకాలు "నిరుద్యోగ సమస్య" గురించి మాట్లాడేవి. కమ్యూనిజం పై ఆసక్తి కంటే..నిరుద్యోగ సమస్య వల్ల ప్రభుత్వం పై కోపం తో నక్సలైట్లలో చేరేవారి సంఖ్య రోజు రోజు కు పెరిగేది. యువకులల్లో..సినిసిజం పెరిగేది. ఏదో..కసి, ఎవరి మీదో కోపం. ఎవరి మీదో..ఆవేశం. పోనీ దేశ ఆర్ధిక పరిస్థితి బాగుందా..అంటే..అదీ లేదు. వీటన్నింటికీ ఒకే దెబ్బ తో చెక్ పెట్టిన మహామేధావి పి.వి నరసింహారావు గారు. రాజీవ్ గాందీ గారు 21 మే 1991 లో మరణించాక జరిగిన ఎన్నికల తర్వాత యు.పి.ఏ ప్రభుత్వం లో 9 వ ప్రధాన మంత్రిగా పి.వి.నరసింహారావు గారు ప్రమాణ స్వీకారం చేసారు.
2) "దేశం లో నిరుద్యోగ సమస్య తగ్గించాలి. లేదంటే..మన దేశ యువకులే మన సమాజానికి సమస్య అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే.. ప్రస్తుతం భారత దేశ ఆర్ధిక పరిస్థితి బాలేదు. ఎలా నిరుద్యోగ సమస్య ను సాల్వ్ చెయ్యాలి?" ఇది అప్పుడున్న సమస్య.
ఉద్యోగాలు రెండు రకాలు.
1. ప్రభుత్వానికి డబ్బు సంపాయించి పెట్టే ఉద్యోగాలు (పోస్ట్ ఆఫీసులు, రైల్వేలు etc,)
2. ప్రభుత్వానికి డబ్బు సంపాదించని..సర్వీస్ ఓరియెంటెడ్ ఉద్యోగాలు (టీచర్లు,పోలీసులు etc,)
కొత్తగా ఉద్యోగాలు సృష్టించి, నిరుద్యోగ సమస్య సాల్వ్ చెయ్యాలంటే, ప్రభుత్వం దగ్గర "జీతాలు" ఇవ్వడానికి డబ్బుండాలి. ప్రభుత్వానికి డబ్బు వచ్చేది స్థూలంగా రెండు మార్గాల ద్వారా.
A. మీద రాసిన 1 వ పాయింట్ లో వచ్చే డబ్బు వల్ల
B. అన్ని రకాల ట్యాక్సుల వల్ల
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనాలకు సేవలు అందించాలన్నా, ప్రభుత్వం దగ్గరున్న డబ్బు సరిపోవడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? మూడవ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి. ఆ మూడవ ప్రత్యామ్నాయం..రెండు సమస్యలను సాల్వ్ చెయ్యాలి. 1. నిరుద్యోగ సమస్య ను సాల్వ్ చెయ్యలి 2. సమాజం లో డబ్బు ను సృష్టించాలి.
అప్పుడు..శ్రీ పి.వి గారు చెప్పిన సొల్యూషన్.."ప్రైవేటైజేషన్".
ప్రైవేట్ జాబ్స్ లేకపోతే...నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని సక్రమంగా నడవనివ్వరు. సమాజాన్ని అల్లకల్లోలం చేస్తారు.అది..కాదనలేని వాస్తవం.
3) 'నక్సలిజం' ప్రారంభమైన కారణం వేరు కానీ...నిరుద్యోగ యువత కూడా తుపాకులు పట్టుకోవడం వల్ల విప్లవకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాళ్ళు బలపడితే..భారతదేశం, అంబేద్కర్ గారి కలల వైపు కాకుండా.. మరో దిశలోకి వెళుతుంది. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసం అత్యంత బలమైన పావు ను కదిపారు పివి గారు.
అప్పటి వరకు..కాంగ్రెస్ నుండి దేశాన్ని పాలించిన బలమైన ప్రధానులు నెహ్రూ,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ...రష్యా సోషలిస్ట్ విధానాల వైపు మొగ్గు చూపుతూ ఉండడం వల్ల , "ప్రైవేటైజేషన్" కు పూర్తిగా అనుకూలంగా ఉండే అమెరికన్ క్యాపిటలిస్టిక్ విధానాన్ని దూరం పెట్టేవారు.
పీవీ నరసింహారావు గారు, అందుకు వ్యతిరేక దిశలో ఆలోచించారు. "మన దేశం లో ప్రస్తుతం డబ్బు సృష్టించాలన్నా..నిరుద్యోగ సమస్య తీర్చాలన్నా..ప్రైవేటైజేషన్ కు తలుపులు తెరవాల్సిందే.." అని నిర్ణయించుకొని, తమతో ఉన్న ఇతర పార్టీల వారిని ఒప్పించి ప్రైవేటైజేషన్ కు, విదేశీ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ కు సులభంగా ఉండేలా చట్టాలు చేశారు.
4) 1992 నుండి నెమ్మదిగా విదేశీ కంపెనీలు మన దేశం లో పెట్టుబడులు పెట్టడం ఊపందుకుంది. క్రమంగా నిరుద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయ్ ప్రభుత్వం...గ్లోబలైజేషన్ కు శ్రీకారం చుట్టింది. పీవీ వేసిన బాటలో నడుస్తూ...పెట్టుబడి పెట్టేవారికి బెంగుళూరు,హైదరాబాద్,పూనే,కలకత్తా వంటి నగరాల్లో SEZ లు ఇవ్వడం మొదలుపెట్టి, ప్రైవేట్ రంగానికి ఊపునిచ్చింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్,కర్ణాటకా,గుజరాత్,మహారాష్ట్ర,బెంగాల్,ఢిల్లీ లలో సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్శూరెన్స్ కంపెనీలు వచ్చాయి. పీవీ తీసుకున్న ఒక్క నిర్ణయం..భారత దేశపు భవిష్యత్తును మార్చేసిందన్నది ఎంత వాస్తవమో... సోనియమ్మ గారి కాంగ్రెస్ పార్టీ పీవి నరసింహారావు ను ఆ తర్వాతి రోజుల్లో..అంతగా అవమానించారన్నది కూడా వాస్తవం. ఈరోజుల్లో ఉన్నట్లు...ఆరోజుల్లో సోషల్ మీడియా ఉంటే పీవీ గొప్పదనం గురించి మరింత ఎక్కువ మంది మాట్లాడుకునేవారేమో!
5) దేశం కోసం పీవి,వాజ్ పేయ్ లాంటి వారు...ఈ ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తే..ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా సరే పంటపొలాలను SEZ లు గా మార్చిన దిక్కుమాలిన నాయకులు కూడా ఉన్నారు. అది వేరే విషయం.
అప్పటి వరకు, "పెట్టుబడిదారులను.." విలన్స్ లాగా చూపిన సినిమాలలో..."పెట్టుబడి దారులను" హీరోలుగా చూపే సినిమాలు మొదలయ్యాయి. "పెట్టుబడిదారి విధానం నశించాలి.." అని యూనివర్సిటీలలో నినాదాలు చేసే విద్యార్ధుల స్థానంలో..."క్యాంపస్ సెలక్షన్ కు ఏ కంపెనీలు వస్తున్నాయి? ఏ కంపెనీ ఎక్కువ జీతం ఇస్తుంది?" అని ఆలోచించే తరం తయారయ్యింది. ఒకరకంగా..పీవి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం మావోయిస్టులకు కూడా పెద్ద దెబ్బ! మావోయిస్టుల రిక్రూట్మెంట్ లో అడవిప్రాంతాలలో ఉండే వారు చేరుతున్నారు తప్ప, కాలేజీ విద్యార్ధుల చేరిక గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
6) మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, తన పార్లమెంట్ స్పీచ్ లో, "మహోన్నతమైన వ్యక్తి..మీ పార్టీకే చెందిన శ్రీ పీవి గారిని..మీరే మరిచిపోయారు. మీ పార్టీ 2004 నుండి 2014 దాకా అధికారం లో ఉన్నప్పటికీ..పీవి గారికి భారత రత్న ఇప్పించలేకపోయారు," అని కాంగీయులను ఉతికి ఆరేశారు. పీవి గారికి భారతరత్న ఇవ్వమని..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అడిగారు. బిజేపీ...పీవి కి భారత రత్న ఇచ్చి సత్కరించే అవకాశాలు ఈ 5 ఏళ్లలో ఉన్నాయి. కానీ...ముందు, స్వంత పార్టీ వారు ఆయనను గౌరవిస్తూ, ఆయన కు భారత రత్న ఇవ్వండి అని అడిగితే, గౌరవంగా ఉంటుంది.
7) సోనియమ్మ గారు ఎంత గొప్పవారంటే...పీవీ నరసింహారావు గారికి క్రెడిట్ ఇవ్వకుండా, ఆయనను మెచ్చుకున్నట్లే మెచ్చుకుంటూ..."రాజీవ్ గాంధీ గారు ఆల్రెడీ భారతదేశం ఎలా ఉండాలో..పాలసీ తయారు చేసిపెట్టారు., దాన్నే పీవీ, 5 ఏళ్ళపాటు ఆచరించి చూపించారు.." అంటూ ఒక స్పీచ్ లోనూ..."పీవీ,మన్మోహన్ సింగ్ ను ఆర్ధిక శాఖా మంత్రిగా పెట్టి పూర్తి స్వేచ్చను ఇచ్చారు...అందుకే ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి,"అంటూ ఇంకో స్పీచ్ లోనూ పీవీ గారి ప్రతిభ ను తగ్గించి మాట్లాడారు.
8) బాబ్రీ మసీద్ కూల్చివేత, పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు జరగడం..పీవీ కి ఒక మచ్చ! ఐతే..1992 లో ఆ సంఘటన జరిగితే..కాంగ్రెస్ వారు మాత్రం 1996 దాక తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా పీవీ ని కొనసాగించి...ఆ తర్వాత మాత్రం ముస్లీం ఓటు బ్యాంకు కోసం పీవీ ని బలిపశువులా చూపిస్తూ వచ్చారు.
పీవీ గారి తెలివితేటలను,రాజనీతిజ్ఞత ను పూర్తిగా వాడేసుకొని ఆయనను వదిలేశారు.
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాల వల్ల, పీవీ నరసింహారావు కు మాత్రం..దక్కాల్సినంత ఖ్యాతి దక్కలేదు!
9) వాజ్ పాయ్ గారు మరణించినప్పుడు...సెక్యూరిటీ సమస్యలు పట్టించుకోకుండా దేశప్రధాని నరేంద్రమోడీ 6 కిలోమీటర్లు..వాజ్ పాయ్ గారి పార్ధివదేహం వెంట నడిచారు. ఒక మాజీ ప్రధాన మంత్రికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో, అందులోనూ తమ పార్టీ నాయకుడైనా వాజ్పాయ్ గారి అంతిమసంస్కారాల్లో ఎలాంటి గౌరవం ఇవ్వాలో..మోడీ ఆ గౌరవం ఇచ్చారు.
తన జీవితం మొత్తం..పార్టీ కోసం, దేశం కోసం కోసం పనిచేసిన అపరమేధావి
శ్రీ పీవీ గారు మరణిస్తే...ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఢిల్లీ లోని కార్యాలయం లోకి కూడా అనుమతించకుండా తాళాలు వేయించి, బలవంతంగా హైదరాబాద్ కు పంపేశారు కాంగ్రెస్ వారు. ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తికి, భారతదేశపు చరిత్రలో అత్యంత బాధాకరమైన "అంతిమసంస్కారం" లభించింది అంటే..అది కేవలం పీవీ నరసింహారావు గారికి మాత్రమే. అదీ..సోనియమ్మ & కో..చలువే. దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే...తెలుగువారిగా మనకే ఎక్కువ బాధ కలుగుతుంది.
10) పీవీ తీసుకున్న ప్రైవేటైజేషన్ నిర్ణయం వల్ల కూడా సమస్యలు వచ్చాయి.ప్రతి నిర్ణయానికీ..సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ వంటివి. ఐతే..ఆ సమస్యలు సమాజాన్ని మింగేసేవా లేకపోతే సమాజం వాటిని తట్టుకుని నిలబడగలదా అన్నదే ముఖ్యం. పీవీ గారికి మాత్రం అప్పుడు వేరే ఛాయిస్ లేదన్నది మెజారిటీ ఆర్ధిక శాస్త్రవేత్తలు ఒప్పుకున్న సత్యం. పీవీ గారి ఆర్ధిక సంస్కరణలు..భారతదేశాన్ని భారీస్థాయి ఆర్ధిక-సామాజిక సమస్యల నుండి బయటపడేశాయన్నది వాస్తవం.
(వ్యాసం లో..మీకు నచ్చిన/నచ్చని అంశాల పై నిరభ్యంతరంగా మీ కామెంట్స్ రాయొచ్చు. అలాగే..మన తెలుగు దినపత్రికల రాజకీయ ఎజెండాలను సంతృప్తిపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. అందువల్ల..ఏ పత్రికకు పంపకుండా నా FB లో ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.నచ్చితే షేర్ చెయ్యండి. -- Kandlakunta Sharath Chandra)
-- 28-జూన్-2019 పీవీ నరసింహారావు జయంతి సందర్భం గా కథ,నవలా రచయిత,
కండ్లకుంట శరత్ చంద్ర
**************************************

No comments:

Post a Comment