శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి అమరవందితమైన సంకీర్తనల మహత్తుని బహుచక్కగా వర్ణించే ఈ కృతిలో చెప్పబడినట్టుగా, ఈ కలియుగ ప్రత్యక్షపరమాత్మను కీర్తించడమే తన ధ్యేయంగా సాగే ఆ పదకవితల అక్షరావళిలో అప్రయత్నంగానే మన జీవనానికి మార్గదర్శకత్వం గోచరించి సంకీర్తనమే సద్గురువై నిలిచి సమ్రక్షించే సాధనమై ఒప్పారుతుంది.....
అంతటి మహిమ్నతను తనలో నిక్షిప్తం చేసుకున్నందుకే ఆ శ్రీవేంకటరాయుడు సంకీర్తనాలోలుడిగా వినుతికెక్కి
వాటిని ఆలపించిన, ఆలకించిన తన భక్తులను అంతగా అనుగ్రహిస్తున్నాడు....
ప్రతిరోజు సాయంసంధ్యలో తన సహస్రదీపాలంకార సేవాంతర్భాగంగా వైదికాచారసంపన్నులైన భూసురోత్తముల నాభిలో జనించి వారి కంఠసీమ నుండి వెలువడే సుస్వర వేదఝరి తో పాటుగా, నాద కచేరి, గాత్ర కచేరి లో అనామాచార్యుల సంకీర్తనలను ఆలకించి ఆనందించేది అందుకే మరి......
మన భరతసీమ లో అనాదిగా ఆచారింపబడుతున్న సనాతన సంప్రదాయ జీవనవిధానంలో
దీపానికి ఉన్న ప్రాధాన్యం అనంతం....
ప్రతి శుభకార్యానికి దీపప్రజ్వలన
అనేది మన సంస్కృతిలో అంతర్భాగం......
భా యందు రతి గలవారే భారతీయులు, అనగ కాంతి యందు ప్రీతి కలవారు అని కదా మన పెద్దల ఉవాచ.....
ఇక్కడ కాంతి అంటే బాహ్యార్ధంలో వెలుగు అని భావించినా, ఆంతరంలో అది సకల సంపదలకు, శాంతికి, ఆరోగ్యానికి, అన్నింటినీ మించి జ్ఞ్యానానికి సూచికగా మన ప్రాచ్య ఋషి ఉవాచ కద.....
అటువంటి సహస్రదీపాల వెలుగుజిలుగుల మధ్య కొలువైన పరమాత్మ, తను సంకీర్తనలను విన్నట్టుగా మనకు కనిపిస్తున్నా, అది భక్తులందరికోసం వారి అభ్యున్నతి కోసం, వారికి సకల భౌతిక ఐశ్వర్యములతో పాటుగా వాటన్నిటికి సార్ధకతను సమకూర్చే సర్వోత్కృష్టమైన జ్ఞ్యాన సంపదను కూడా ప్రసాదించేందుకే అన్నమాచార్యుల సంకీర్తనా శ్రవణాన్ని తన సేవాంతర్భాగం గావించి మనల్ని కరుణిస్తున్మాడు ఆ అవధిలేని కారుణ్యమూర్తిగా శ్రీవేంకటనగముపై కమలాపతి గా కొలువైన కంజదళలోచనుడు.....☺
" నిక్కుటద్దములై మా నిలువు నీడలు చూపీ నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు....! " 😊
No comments:
Post a Comment