Saturday, July 20, 2019

శ్రీమహారాజ్ఞి అయిన ఆదిపరాశక్తి యొక్క ఆషాఢ బోనాల ఉత్సవం....!

శ్రీమహారాజ్ఞి అయిన ఆదిపరాశక్తి యొక్క ఆషాఢ బోనాల ఉత్సవంలో చిన్నప్పుడు మా బస్తిలోని పోచమ్మ గుడిలో దిగిన పిక్......
నాన్నకు ఇరువైపులా నేనూ ( చిలకపచ్చరంగు షర్ట్ లో 😁 ) , తమ్ముడు, ఉన్న ఈ పిక్లో మా వెనకాల పోచమ్మ గుడిగోడపై ఉన్న కాళికా అమ్మవారి చిత్రాన్ని చూసారు కదా....అలా ఎన్నో చోట్ల బోనాల పండగ రాగానే, అన్ని గ్రామదేవతల గుళ్ళకు కొత్త రంగులు, చిత్రాలు, వేసి వేపాకుల తోరణాలు కట్టి, " అమ్మ బైలెల్లినాదే...జగదంబా బైలెల్లినాదే....." అంటూ వివిధ జానపద పాటలతో హోరెత్తి ఉండే ఆ ఆషాఢ జాతర కోలాహలం అందరికి తెలిసిందే......
ఇది నా 5త్ క్లాస్ లోని పిక్ అనుకుంటా...ఇప్పుడున్నట్టు కాకుండ అప్పుడు మా ప్రగతి నగర్ బస్తి కేవలం ఒక 50 కుటుంబాలవరకు ఉండే చిన్న స్లం ఏరియ...
అన్నీ ఖాలి ప్లాట్లు, పిచ్చి చెట్లు, మొక్కలతో ఉండేవి మా గల్లీలన్నీ.....
ఐ.డి.పి.ఎల్ కాలనిలో ఉండే బంధువులైన మా తాత  ఒకరు మరియు కీ.శే శ్రీ పెంటయ్య అనే ఇద్దరు పెద్దలు కలిసి ఈ బస్తి యొక్క లేయౌట్ వేసి పేదలందరికి భూమి పట్టాలను అందించారు.....
మూసాపేట్ దెగ్గరి భరత్నగర్ లో కిరాయికి ఉంటూ, సనత్నగర్ లోని ఆల్ల్విన్ కంపెనీలో ఒక చిరుద్యోగి అయిన మా నాన్న కి కూడా ఒక ప్లాట్ ఇవ్వడంతో, అందులో ఒక 50 గజాల్లో చిన్న రేకుల రూం వేసుకొని ఇక్కడికి మకాం మార్చడంతో 1991 నుండి మా జీవితాలు ఇక్కడ స్థిరపడ్డాయి....
పెద్దగ ఏ సదుపాయాలు లేని రోజులవి....మట్టి రోడ్లు...అప్పుడప్పుడే వేయబడుతున్న విద్యుత్ స్తంభాలు, సర్కార్ బోరింగ్లు....
పక్కన ఉన్న అస్బెస్టాస్ కాలనిలో కూడా అప్పుడు మంజీరా నీళ్ళ సౌకర్యంలేదు....వాళ్ళకి కూడా ఉప్పునీళ్ళే వచ్చేవి....
త్రాగునీటి కోసం నేను ప్రతి ఆదివారం మా నాన్న అట్లస్ సైకిల్ కి వెనకాల రెండు S ఆకారపు ఇనప కొండీలకు నల్లడబ్బాలను తగిలించి ' కైంచి ' తొక్కుకుంటూ (పొట్టిగా ఉన్నందుకు కాళ్ళు అందేవి కావు కాబట్టి...) గుట్ట పైప్లైన్ రోడ్ చౌరస్త దెగ్గర ఉండే మునిసిపల్ వాటర్ టాంక్ దెగ్గర పెద్ద లైన్లో గంటకుపైగా నిలబడి రెండు డబ్బాలు నింపుకుని ఇంటికి తెచ్చేవాణ్ణి....ఎన్ని సార్లు కిందపడి మోకాళ్ళు మోచేతులకు దెబ్బలు తగిలాయో నాకు ఇప్పటికీ బాగానే గుర్తు.....ఉప్పునీళ్ళు తాగలేక ఎంత కష్టమైనా సరే అలా ఇంటిల్లిపాదికి మంజీరా నీళ్ళు తెచ్చేవాణ్ణి...
కొన్ని సంవత్సరాలకు పక్కన ఉన్న అస్బెస్టాస్ కాలనిలో మంజీరా నీళ్ళు రావడంతో ఇక ఇక్కడే చుట్టూ ఉండే తెలిసిన వాళ్ళింట్లల్లో బిందెలు, డబ్బాలతో మోసుకొచ్చేవాణ్ణి.....ఆ తరువాత మంజీర వాటర్ టాంకర్లు మా బస్తీకి ప్రతి గల్లీకి వారానికి రెండుసార్లు రావడంతో ఆ బాధ కొంచెం తగ్గింది.....
నా ఇంజనీరింగ్ రోజుల్లో, మా బస్తిలోని ఇంటింటికి మంజీర నల్లలు రావడంతో మంచినీటి కోసం 12 సంవత్సరాలు పడిన ఆ బాధలకు శాశ్వతంగా తెరపడింది...
ఆరోజుల్లో మా బస్తి తో పాటుగా, నేను తిరిగే అన్ని ప్రాంతాల్లో అంటే జగద్గిరిగుట్ట, హనుమాన్ నగర్, అస్బెస్టాస్ కాలని, ఆల్విన్ కాలని, ఇత్యాది ప్రాంతాల్లో గ్రామదేవతగా ఉండే అమ్మవారి గుడి గోడలపై ఉండే చిత్రాల్లో కాళికా స్వరూపం, అత్యంత రౌద్రమూర్తిగా తన పతి అయిన ఈశ్వరుడిపైనే తన పాదాన్నిమోపి నిలిచి ఉండడం నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది...
అమ్మవారు రాక్షసులను చంపి, వారి తలలను పెకిలించి రక్తమోడుతున్న ఆ శిరస్సులను తన హస్తాల్లో పట్టుకొని వీరవిహారం చేయడం వరకు ఉన్న ఉగ్రత్వం అర్ధమయ్యేది కాని, అలా ఈశ్వరున్ని కూడా తన కాలితో అదిమిపెట్టడం ఏంటి అనే సందేహం మాత్రం చిన్నపటినుండి కూడా అట్లే ఉండిపోయింది....
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనంలో అమ్మవారి వైభవాన్ని వినేంతవరకు ఆ సందేహం నివృత్తికాలేదు...!
"రక్తబీజుడు ఇత్యాది ఎందరెందరో దుష్ట అసురులను తన కాళికా అంశ తో సమ్హరించిన అమ్మవారు అదే మహోగ్ర రూపంతో తన ప్రళయతాండవాన్ని కొనసాగిస్తు ఉండడం, అంత ఉగ్రంగా ఉన్న అమ్మవారి ఎదుట నిలిచి శాంతపరిచే సాహసం ఎవ్వరు చేయలేకపోవడం తో ఇక సాక్షాత్ ఆ పరమశివుడే తన అర్ధాంగిని శాంతింపజేసే ప్రయత్నంలో అలా క్రింద పరుండి, ఆమ్మవారి పాదమును తనపై మోపేలా చేయడంతో, "మహాకమేశమహిషి" గా ఉండే ఆ చండిక తన పతి తిరుమేని స్పర్శసోకగానే తన ఉగ్రత్వం ఆ లయకారుడిలోకి లయించిపోయి శాంతమూర్తిగా స్థిరపడింది....." అనే సమాధానం లభించడంతో నా దశాబ్దకాల సందేహంకూడా నివృత్తి అయ్యిందన్నమాట.....😊
ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.....
"నియంత్రి నిఖిలేశ్వరి....." గా ఉండే అమ్మవారు తనని తాను నియంత్రించుకోలేక పోవడమేంటి అనే సందేహం వస్తుంది చాలామందికి....
ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి తెలిసినట్టుగా, A.C కంటే కూడా D.C చాల ప్రమాదకరమైన విద్యుత్శక్తి.....
Alternating Current Sine wave కాబట్టి తరంగదైర్ఘ్యం / పౌనహ్పున్యం ( Frequency / Wavelength ) సిద్ధాంతానుగుణంగా ఆ విద్యుత్ శక్తి యొక్క neutralization కి ఎంతో కొంత గ్రౌండింగ్ ఇచ్చి  క్రమంగా మన అధీనంలోకి తీసుకురావొచ్చు...
కాని Direct Current యొక్క తరంగదైర్ఘ్యం సున్నా కాబట్టి హై వోల్టేజ్ లో ఉన్న D.C షాక్ కొడితే రెప్పపాటులో ఆ జీవి / వస్తువు బూడిదకుప్పగా మారిపోతుంది.....
ఎందుకంటే 0 wavelength అనగా infinite / అనంతమైన పౌనహ్పున్యం ( Frequency = 1 / wavelength ) ....
ఆ అనంత పౌనహ్పున్యం తో విరుచుకుపడే విద్యుత్శక్తిని నేరుగా నిలువరించడం అసాధ్యం.... అంతకు సమానమైన లేదా అంతకంటే కొంచెమైనా సరే అధికమైన తద్భిన్నధృవశక్తిని ఏకబిగిన అడ్డువేయగలిగినప్పుడు మాత్రమే ఆ విద్యుత్శక్తిని అధీనంలోకి తీసుకురావడం సంభవమయ్యేది.... ఏమాత్రం తేడావచ్చినా ఆ దుస్సహమైన శక్తిముందు భస్మీపటలం అవ్వడమే..!
అదేవిధంగా ఇక్కడ జగద్రక్షణకోసం ఆదిపరాశక్తి, ఒకానొక సందర్భంలో నిలువరించ సాధ్యపడని ఆసురిశక్తిని అంతమొందించడానికి అంతటి మహోగ్రమైన శాక్తేయకళను తన కాళికా అంశలోకి ఆవహింపజేసి దైత్యసమ్హార ప్రక్రియను పూర్తిగావించడం ఐతే అయ్యింది కాని అదే పొటెన్షియల్ లో పర్సిస్ట్ అయి ఉన్న ఆ విద్యుత్శక్తి తనంతతానుగా స్టేబిలైజ్ అవ్వడం కుదరలేదు..... అలా అమ్మవారు అత్యుగ్రశక్తిగా ఉండిపోవడం లోకానికి శ్రేయస్కరం కాదుకాబట్టి, తనలో అర్ధభాగమైన ఆ శక్తిని నిలువరించే స్థీరీకరణ శక్తి కేవలం ఆ అర్ధనారీశ్వరుడికి మాత్రమే కలదు కాబట్టి, తనను ఒక కొలమానంలేని యానోడ్ గా మలిచి (ఈ భూగోళం మొత్తం కలిపితే ఎంత గ్రౌండింగ్ క్యపాసిటి ఉంటుందో అంతకంటే కూడా ఎన్నో రెట్లు శక్తివంతమైన గ్రౌండింగ్ ఫ్యాక్టర్ గా తన దేహాన్ని మలిచి ), ఒక గైగాంటిక్ క్యాథోడ్ గా ఎగజిమ్ముతున్న ఆ పరాశక్తి లోని ఉగ్రశక్తిని ఒక్కసారిగా తన హృదయ మండలం లోకి లయించి వేసి ఆ పరమేశ్వరుడు లోకాన్ని అనుగ్రహించాడు....!  ఇదన్నమాట స్థూలంగా అమ్మవారి దశమహా అవతారాల్లో ఒకటైన కాళికా వైభవం...  🙏🙏🙏🙏🙏
**************** **************** ****************
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
**************** **************** ****************

No comments:

Post a Comment