Wednesday, August 14, 2019

విరజా తీరస్థ గోవిందా గోవిందా...!! :) 🙏

శ్రీనివాసుడిని నిరంతరం కొన్ని కోట్ల మంది ప్రఖ్యాతమైన గోవింద నామాలతో కీర్తించడం మనం చూస్తుంటాం.... అందులోని ఒక పంక్తిలో ఉండే " విరజాతీరస్థ గోవింద...విరోధిమర్దన గోవింద..." అనే నామం, స్వామి వారు విరజా నదీ తీరమునందు వసించి ఉన్నారు... అని కద...

అల వైకుంఠపురమునందున్న విరజానది స్వామి శ్రీపాదయుగళం ఎక్కడెక్కడ మోపబడిఉంటుందో అక్కడికి ఏదో ఒక రూపంలో, అంతర్వాహినిగా అయినాసరే వచ్చి తీరుతుంది..... ఆ పావన శ్రీపాదద్వయాన్ని నిరంతరం అభిషేకించుటకు.....

తన అన్న రత్నాచలం గా వెలసి శ్రీమహావిష్ణువును శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీ సమేత సత్యనారాయణుడిగా వెలసి ఈ కలియుగ వాసులను కలకాలం కరుణించి కాపాడమని కోరుకుంటే,

తను భద్రాచలం గా వెలసి, ఆ శ్రీవైకుంఠధాముడిని శ్రీవైకుంఠరాముడిగా, భద్రాద్రి పై శ్రీ లక్ష్మణస్వామి సమేత సీతారాముడిగా తన శిరస్సుపై ఆ పావన శ్రీపాదాలను మోపి కొలువైఉండమని భద్రమహర్షి కోరాడు.  భద్రాచలం దక్షిణ అయోధ్య గా వినుతికెక్కిన  పుణ్యక్షేత్రం.

శ్రీభద్రాచలాధీశుడిపై ఎంతో ప్రేమతో శ్రీభక్తరామదాసు గారు తాము రచించిన దాశరథీ శతకంలో, ఒకానొక పద్యంలో, ఆ వికుంఠమహర్షి సృష్టి అయిన శ్రీవైకుంఠంలో ఉన్న పరివారమంతా కూడా ఈ భద్రాచలానికి విచ్చేసిన వైనాన్ని పరమాద్భుతంగా వర్నించిన ఈ క్రింది పద్యంలో మనం చూడవచ్చు, విరజా నది గౌతమి గా రూపుదాల్చిన వైనాన్ని......
    
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి.

దండకారణ్యంలో సీతారాములు తమ వనవాసంలో ఉన్నపుడు గౌతమీ / గోదావరి నదీ తీరంలో సేదతీరిన పర్వతమే భద్రుడు.
తమకు ఆసనంగా, శయ్యగా, భోజన పత్రానికి ఆలంబనగా, ఆటలకు నెలవుగా ఇలా వివిధ రూపాల్లో ఉపకారం చేసిన భద్రుడికి త్రేతాయుగంలో శ్రీరాములవారు ఇచ్చిన వరం కారణంగా, ఈ కలియుగంలో భద్రగిరిపై వారు వెలిసారు. అప్పటికి సీతాపహరణం, కిష్కింధకాండ, హనుమ ఆగమనం కాలేదు కాబట్టి కేవలం శ్రీలక్ష్మణస్వామి సమేత శ్రీసీతారాముడు మాత్రమే వనవాసంలో ఉన్నది. అప్పటి భద్రుడికి వరం ఇచ్చే సమయానికి ఉన్నది ముగ్గురు మాత్రమే కాబట్టి ఇప్పుడున్న గర్భాలయంలో కూడా హనుమ లేకుండ సీతా రామ లక్ష్మణులు మాత్రమే ఉన్నారు.... మారుతి లేకుండా ఏ శ్రీరామమందిరము కూడా పరిపూర్ణం అవ్వదు కాబట్టి, ఆలయం వెలుపల హనుమ వారికి అంజలిఘటిస్తూ కొలువైనాడు.....
త్రేతాయుగంలో ఇచ్చిన తన వరాన్ని సాకారంచేయడంలో కించిత్ ఆలస్యం అవ్వడం వల్ల భద్రుడి శరణాగతి మేరకు హుటాహుటిన శ్రీవైకుంఠం నుండి తరలి వచ్చిన సందర్భంలో తన శంఖచక్రాలను అపసవ్యంగా స్వామి ధరించాడు అని పెద్దలు చెప్పడం వింటుంటాం. కాని అది ఆ శ్రీహరి యొక్క భక్తవాత్సల్యానికి, ఆర్తత్రాణపరాయణత్వానికి సూచిక అని విజ్ఞ్యుల ఉవాచ.... సాధారణంగా కుడి చేతిలో ఉండే చక్రం, దుష్టసమ్హారానికి, శిష్టరక్షణకు పెట్టింది పేరు.... ఎక్కడైనాసరే శ్రీమహావిష్ణువు శంఖచక్రాలు ఎడమకుడి చేతుల్లోనే ధరిస్తాడు.....
కాని ఇక్కడ భద్రాచలంలో స్వామి వెలసిన సందర్భం ఏదో ఒక రాక్షస సమ్హారానికో, ఒక భక్తున్ని రక్షించడానికో కాదు......
తన భక్తుడి సపర్యలకు మెచ్చి ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకునే సందర్భంలో, తన మూలస్థానమైన శ్రీవైకుంఠమునుండి కదలి రావడం....అది కూడా
ఒక యుగం గడిచిపోయిన తరువాత, ఇప్పటి కలియుగంలో అప్పటి త్రేతాయుగపు అవతారమైన శ్రీరామచంద్రుడిగా కొలువైఉండడం.....

అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణం శ్రద్ధాళువులై ఆలకించిన వారికి తెలిసినట్టుగా,
శ్రీరాముడు ఏనాడు కూడా తను శ్రీమహావిష్ణువు యొక్క అవతారాన్ని అని త్రేతయుగంలో వచించలేదు..... నేను మానవమాత్రుడను,
దశరథుని పుత్రుడను కౌసల్యాకుమారుడను అని మాత్రమే వచించాడు.....
లంకలోని యుద్ధంలో శ్రీరామలక్ష్మణులను సైతం కట్టడి గావించిన మేఘనాథుని నాగాస్త్రబంధనానికి యావద్ వానరసేన సర్పవిషజ్వాలలకు ఆహుతై తల్లడిల్లుతున్న సందర్భంలో, నిర్దేశిత అవతార ప్రయోజనానికై మానుషరూపంలో ఉన్న తన ప్రభువుకు ఆపద వాటిల్లిన మరుక్షణం గరుత్మంతుడు
అక్కడికి వచ్చి, తన గారుడ శక్తితో మొత్తం నాగాస్త్రబంధనాన్ని నిర్మూలించి అందరికి స్వస్థత కలిగించినప్పుడు, శ్రీరాముడు గరుత్మంతులవారికి కృతగ్న్యతలను తెలుపుతూ, తాము అర్ధించకుండానే ఇంతటి ఘనమైన సహాయం చేసిన మీరు ఎవరు అని అడిగినప్పుడు, 
"ప్రస్తుతానికి మీకు ఒక అనుంగు మితృడను అని భావించండి..... " అని చెప్పి గరుత్మంతులవారు తిరిగి శ్రీవైకుంఠానికి వెళ్ళిపొయిన సంఘటనను మనం పరికించి చూస్తే, అక్కడ కూడా శ్రీరాముడు తన మానుష ఉపాధికే ప్రాధాన్యతను ఇచ్చి, తన దైవిక అంశను బహిర్గతం కానివ్వలేదు.....
సీతాపహరణ సమయంలో రావణుడిని అడ్డగించి నేలకొరిగిన జటాయువుకు ఉత్తరక్రియలను గావించి, సద్యహ్ మోక్షఫలాన్ని అనుగ్రహించిన శ్రీరాముడికి తను శ్రీమహావిష్ణువు అనే సంగతి తెలుసు అనే విషయం తెలపకనే మనకు తెలపబడినది కదా.....

నరవానరుల మినహ అన్యులెవరిచేతను మరణం లేని వరగర్వితుడైన రావణసమ్హరానికై మనుష్యుడిగా 12 మాసాలు గర్భవాసానంతరం అవతారం స్వీకరించిన పరమాత్మ తన అవతార ప్రయోజనసిద్ధికై ఎన్నడూ ఆ దేవరహస్యాన్ని వ్యక్తపరచలేదు.....
   
అవతార ప్రయోజనం సిద్ధించినానంతరం, " దశవర్షసహస్రాని దశవర్షశతానిచ..." అనగా 11000 సంవత్సరాల కోసల సామ్రాజ్యపరిపాలనానంతరం కుశుడికి లవుడికి సామ్రాజ్యాన్ని విభాగించి రామరాజ్యం సదా వర్ధిల్లు విధంగా పరిపాలన కొనసాగించమని చెప్పి, ఇక తన అవతారసమాప్తి సమయంలో సరయునదీ ప్రవేశం చేసి అవతార సమాప్తి చేసే సమయంలో తనపై ప్రమాభిమానాలతో ఎంత మంది ఆ సందర్భంలో సరయు ప్రవేశం గావించారో వారందికి కూడా సంపూర్ణకర్మక్షయం గావించి మోక్షాన్ని అనుగ్రహించిన శ్రీరాముడిది ఎంతో విశేషమైన భక్తవాత్సల్యతతి....!

తన పంచాయుధాల్లోని మూడింటిని శంఖము(పాంచజన్యము) , చక్రము(సుదర్శనము) ,  గద(కౌమోదకి) మరియు పద్మమును చతుర్భుజుడై ఆ శ్రీహరి సదా ధరించి ఉండడం వల్ల సమకూరిన 24 వైశేషిక దివ్యస్వరూపాలనే మనం కేశవాది చతుర్వింశతి - 24 నామాలుగా నిత్యం పూజా సమయంలో పఠిచడం అందరికి తెలిసిందే..... 

ఇక మిగిలింది నందకం అనే ఖడ్గము మరియు శార్జ్ఞం అనే ధనస్సు.

కేవలం తన ధనస్సు శార్జ్ఞం కోసం ప్రత్యేకంగా స్వీకరించిన అవతారమే శ్రీరామావతారమని పెద్దలు చెప్పడం కద్దు. కోదండం అనే పేరుతో తన శార్జ్~గాన్ని చేబట్టి శ్రీరామావతారంలో చేసినంతగా స్వామి మరే అవతరంలోను అంత రాక్షససమ్హారం చేయలేదు....అంతటి అరివీరభయంకరమైనది శ్రీరామావతారం.....ఎంతగా అంటే ఏకంగా
కోదండరాముడు అనే పేరుతో శాశ్వతంగా ఈ లోకంలో స్వామి శ్రీరామావతార వైభవం స్థిరపడింది...!!

అటు పరతత్వమైన శ్రీమహావిష్ణువుగా శంఖచక్రాలను ధరించి, వాటికి తోడుగా అంతటి అరివీరభయంకరమైన శార్జ్ఞం / కోదండం అనే ధనస్సును తన పరిపూర్ణ మానుషావతారమైన శ్రీరామావతారానికి సూచికగా చేబట్టి, కమలమ్మను సీతమ్మగా తన వామాంకముపై ఆసీనురాలిగా జేసి, ఆదిశేషుడిని వామ పార్శ్వమున ధనుర్ధారిగా లక్ష్మణస్వామిగా స్థానక ముద్రలో నిలిపిన బహువిశేష స్వరూపము భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తిభవించిన వైనం. ఇక్కడ స్వామి వామ భాగమున శక్తిద్వయం కొలువైఉంది. స్వామి ఎడమతొడపై సీతమ్మవారు పద్మాన్ని ధరించి ఉండడం సకల ఇహ పర ఐశ్వర్యదాయక సూచకం. శస్త్రధారి గా లక్ష్మణస్వామి నిలుచొని ఉండడం శరణాగతులకు సకల అభయ దాయకం. ఇంతటి విశేషశక్తి భరిత క్షేత్రమైనందునే, భద్రాచలం చేరి స్వామిపాదాలను చేరిన తరువాత (అనగా భద్రాచల క్షేత్ర స్పర్ష సోకినతరువాత ) గోదావరి ఉవ్వెత్తున ఉరకలేస్తూ వడి వడిగా దూసుకెళ్తూ తన విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది....!!

భద్రాచలాన్ని దాటి రాజమహేంద్రికి చేరేసరికి ఉన్న గోదావరి విశ్వరూపాన్ని ఒకవైపు, మరియు భద్రాచలం చేరక ముందు ఇతర చోట్ల ఉన్న గోదావరి విస్తారాన్ని ఒకవైపు గా, గమనిస్తే ఈ విషయం ఇట్టే సుగ్రాహ్యం.....

" విష్ణుపాదోద్భవీం " అని కదా గంగమ్మకి ఒక పేరు.... మరి అంతటి ఘనమైన శ్రీమాహావిష్ణువు యొక్క సాటిలేని శ్రీవైకుంఠరాముని అవతార క్షేత్రమైన భద్రాచల స్పర్షసోకగా గౌతమికి సమకూరే ప్రవాహశక్తి అప్రతిహతమే కదా.....!!

ఇనకులతిలకుడిగా, సూర్యవంశసంజాతుడైన శ్రీరామచంద్రుని విశిష్ట క్షేత్రమైన భద్రాచలంలో, ప్రతీ భానువాసరం నాడు, ఆలయ పరిసర పరీవాహక ప్రాంతంలో ఉన్న గోదావరి జలాలపై ఎన్నోకోట్ల పుణ్యతీర్థాలు ఆవాహితమై ఉంటాయనే సత్యం ఇప్పటికీ అక్కడ ఉండే ఎందరో భాగవతులకు అనుభవైకవేద్యమైన ఆధ్యాత్మిక సత్యం..!
అక్కడ అంతర్వాహినిగా ప్రవహించే విరజానది వల్లే ఆ మహత్తు సమకూరేది....
అసలు స్వామి వారి ఆలయంపై కొలువైన విశేషమైన సుదర్శనచక్రం సాక్షాత్ స్వామివారిచే
అనుగ్రహించబడిన విరజాప్రసాదం...... మనుష్యులచే మలచబడిన ఎన్నో సుదర్శనచక్రాలు శ్రీరామదాసు వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆలయశిఖరం పై ప్రతిష్ఠ చేయలేకపోయారు...... ఇక చేసేది లేక స్వామివారినే ప్రార్ధిస్తే,
వారికి కలలో స్వామివారు సాక్షాత్కరించి,

" ముక్తిదాయక క్ష్రేతమైన ఈ భద్రాచల గర్భాలయ గోపురానికి, దైవిక సుదర్శనమే శిఖరంగా నిలువగలదు..... మానుషకృతములు మనలేవు..." అని పలికి మరునాడు గౌతమిలో ఎక్కడ నిలిచి తనను ప్రార్ధిస్తే ఆ దైవదత్తమైన సుదర్శనచక్రం లభిస్తుందో కంచర్లగోపన్నకు తెలిపి తన ఆలయ శక్తికేంద్రాన్ని తానే అనుగ్రహించిన మహానుభావుడు ఆ వరభద్రగిరీశుడైన శ్రీవైకుంఠరాముడు....!

ఇక రీసెంట్ గా కొంత కాలం క్రితం తిరుమలలో కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసమై జియాలజిస్ట్లు జరిపిన పరిశోధనల్లో, ఒక నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ స్వామివారి గర్భాలయ మూలమూర్తి పాదాల క్రిందిగా ప్రవహిస్తుందని గుర్తించి, ఆ ప్రవాహానికి అడ్డుగా ఎటువంటి తవ్వకాలు, కట్టడాలు చేయడం క్షేమకరం కాదని తెలిపిన సత్యాలు చాల మందికి తెలుసు.... ఆ ప్రవాహమే విరజా నది అన్నది మన పెద్దలు ఎప్పుడో చెప్పిన సనాతన సత్యం....!

వివిధ చోట్ల తయారు చేయబడిన కొన్ని వందల లడ్డూల మధ్యలో ఒక్క తిరుమల లడ్డు పెట్టినా సరే, అది స్వీకరించిన ఎవ్వరైనా సరే అది తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం అని ఇట్టే గుర్తుపట్టడానికి కారణంకూడా, ఆ లడ్డూ ప్రసాదాల తయారిలో వినియోగించబడే విరజా నదీజలం...!

దైవిక తత్వాన్ని, దైవానుగ్రహాన్ని సులభగ్రాహ్యం చేసేందుకు రజోగుణాన్ని నివారించి, అవసరమైన సత్వగుణాన్ని పెంపొందించే దేవ తీర్థమే " వి రజా " జలం....!! అంతటి మహత్తరమైనది విరజానది యొక్క వైభవం....

విరజా తీరస్థ గోవిందా గోవిందా...!! :) 🙏

About This Website
YOUTUBE.COM
Viraja River. It is believed that the river Viraja of Vaikuntam flows beneath the feet of the Lord Venkateswara.

No comments:

Post a Comment