Friday, July 30, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨

( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ఆషాఢ జాతర గా అన్ని చోట్లా జరుపబడుతూ,
బోనాల ఉత్సవం గా యావద్ రాష్ట్రంలో వినుతికెక్కి అమ్మవారి ఆషాఢ నివేదనోత్సవం
అంగరంగవైభవంగా నిర్వహింపబడుతూ
మొదటి బోనం గోల్కొండ/గొల్లకొండ జగదాంబిక అమ్మవారికి...,
రెండో బోనం సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళికి అమ్మవారికి...,
మూడో బోనం ఓల్డ్ సిటి లాల్దర్వాజ సిమ్హవాహిని మహంకాళి అమ్మవారికి....
ఆ తరువాత ఇతర అన్ని అమ్మవారి ఆలయాల్లో సమర్పింపబడడం అనే నైసర్గికాచారవైభవంతో హైదరాబాద్ / భాగ్యనగరం ఎన్నో వందల సంవత్సరాలుగా పరిఢవిల్లే అధ్యాత్మ నగరంగా జదగ్విఖ్యాతమైన కీర్తిని గడించడం ఎల్లరికీ తెలిసిందే....

ఒక్కో నగరానికి ఒక్కో నగర అధిదేవత, ప్రత్యధిదేవత, ఉపాలయ దేవతలు, ఉండి ఒక్కో విధమైన వైభవంతో వర్ధిల్లడం అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం...

గ్రామాలకు గ్రామ దేవతల లాగ, నగరాలకు నగరాధిదేవతలు ఉండి వారి అనుగ్రహంతోనే ఆ నగర ప్రజలు  సుఖశాంతులతో జీవించడం అనేది ఎప్పటినుండొ మన దేవభూమి పై ఎల్లరూ గమనించే సత్యం...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో ఉటంకించబడినట్టుగా,

ఆనాటి రాజులకు / పాలకులకు గల ఉపాసనాబలం, శౌచసిద్ధి, వల్ల ఆయా నగరదేవతలు వారితో సంభాషించడం గురించి మన పురాణాల్లో తెలపడినట్టుగా ఇప్పటికీ ఆ సంప్రదాయం అట్లే ఉంటుందనడం అతిశయోక్తి కానేరదు....

ఆనాడు భరతుడు కోసల మహాసామ్రాజ్యానికి రాజధానిగా ఎప్పటినుండో ఉన్న అయోధ్యా నగరాన్ని కాదని వేరే నగరానికి పరిపాలనను మార్చినప్పుడు, అయోధ్యా నగర అధిష్ఠాన దేవత తనతో నేరుగా మాట్లాడి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చకూడదు...అని వారించి అయోధ్యకే రాజధాని మరలా మార్చబడడం....

ఒక వైపు ఎంతో అస్తవ్యస్తమైన స్లం ఏరియాలతో, మరో వైపు ఆకాశహర్మ్యాలతో అలరారే బాంబే / ముంబై నగరాధిదేవత శ్రీముంబామాతా అనుగ్రహం వల్లే ఇప్పటికీ ముంబైలో రోజుకు అంతమందికి అన్నం లభించి, దేశ ఆర్ధిక రాజధానిగా ముంబై వినుతికెక్కడం ...

గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అట్లే హైదర్ అలి నిజాం రాజు యొక్క హయాంలో తనపేరు మీద, మరియు తన ప్రేయసి భాగమతి పేరుమీద
హైదరాబాద్ / భాగ్యనరం
అనే సువిశాల నగరంగా విస్తరింపబడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా, ఈ నగరంలోని దైవత్వ వైభవం ఎంతో విశేషమైనది...

సాక్షాత్ శ్రీ ఆదిశేషుడు / శ్రీ మహావిష్ణువులే ఈ కలియుగంలో ఆనాటి శ్రీరామలక్ష్మణ యోద్ధులుగా
నడయాడి తానీషా రాజు యొక్క అంతహ్పురానికి వచ్చి త్రేతాయుగం నాటి రామమాడలతో పైకాన్ని కట్టి శ్రీరామదాసు గారిని చెర నుండి విడిపించిన ఘటన ఎల్లరికీ విదితమే కద...

భాగ్యలక్ష్మి అమ్మవారిగా చార్మినార్
వద్దే ఇప్పటికీ ఈ భాగ్యనగర అధిదేవత కొలువై ఉందనే సంగతి ఎంత మందికి తెలుసు..?
నగరం నలువైపులా విస్తరింపబడి
మహానగరంగా రూపుదిద్దుకోవడంతో
ఆయా గ్రామాల్లో / పురాల్లో గ్రామదేవతలుగా వెలసి అనాదిగా కొలవబడుతున్న దేవతలందరూ కూడా
ఈ మహానగరాన్ని సమిష్టిగా అనుగ్రహిస్తూ, కాపాడుతూ, ఉండడంతో ఒక్కో ప్రముఖ ఆలయంలో కొలువైన నగరపాలక శక్తికి ఒక్కో వారం ఆషాఢ జాతరగా బోనాల ఉత్సవంగా ఈ ఉత్తరాయణ / దక్షిణాయణ సంధి సమయమైన ఆషాఢమాసంలో విశేష ఆరాధనను నిర్వహించి ప్రీతిని కలిగించి అనుగ్రహాన్ని బడసి తరించడంలో ఎన్నో ఎన్నెన్నో నిగూఢ విశేషాలు ఉండడమనేది వాటియొక్క ప్రాభవాన్ని తెలపకనే తెలుపుతూ మనకు అధ్యాత్మ పరిపుష్టితో జీవించే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి.....

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా,
మనం ఎవరు, ఏం చదువుకున్నాం, ఎంత సంపన్నులం, ఎంత ఉన్నతాధికారులం,
అనే దానితో నిమిత్తం లేకుండా
విధి అనే వింత ఎవరిని ఎప్పుడు ఏవిధంగా " ఆపద " రూపంలో బాధిస్తుందనేది ఆ దైవానికి తప్ప ఎవ్వరికీ తెలియనిది...

మన బుద్ధికి అందని రీతిలో ఎదురయ్యే
కష్టమే ఆపద ...

పక్కింటి వారు పరాకుగా ఉండి ఒక చెట్టు కొమ్మలను కొట్టేయడంలో అక్కడే  ఆడుకుంటున్న తన పిల్లలపై ఆ కొమ్మ విరిగి పడి గాయాన్ని కలిగించబోతోందని గ్రహించిన మరుక్షణం ఆ తండ్రి తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టి తనపై ఆ చెట్టు కొమ్మ పడేలా అడ్డుపడి తన పిల్లలను సమ్రక్షించుకుంటాడు....

ఇది లౌకికమైన ఇతరుల పరాకుతో / తప్పిదంతో కంటికి కనిపించేలా కలిగిన ఆపద కాబట్టి ఆ తండ్రి తనపైకి ఆ ఆపదను ఆపాదించుకొని
తన సంతానన్ని కాపాడుకోగలిగేలా వ్యవహరించాడు....

మరి అలౌకికమైన, కొన్ని లైట్ ఇయర్ల దూరంలో ఉండి రాబోవు సమయంలో దురితంగా ఎదురయ్యే ఆపదను జ్యోతిష శాస్త్ర వైదుష్యంతో ముందుగానే గ్రహించి ఆ ఆపద తనకు సంభవించి తన సంతానం సురక్షితంగా ఉండగలిగేంతటి యోగ్యతతో సదరు తండ్రి ఉండగలగాలి అంటే అది దైవానుగ్రహం వినా ఎలా సాధ్యం..??

అందుకే మన సనాతన పెద్దలు, ఋషులు కాల ద్రష్టలై ఈశ్వరానుగ్రహం కోసం అహర్నిశలు ఉపాసన / సాధన గావించిన మహర్షులై జీవించి ఎన్నో శాస్త్రాలను వారు దర్శించి మనకు అందించి జీవించి తరించారు....

పంచాగ వ్యవస్థానుగుణంగా శూన్య మాసంగా పరిగణింపబడే ఆషాఢ మాసం తో ప్రారంభమయ్యే దక్షిణాయణ కాలం విశేషమైన ఉపాసనా కాలం...మరియు చీడ పీడలు కూడా ఒకింత అధికంగా ఉండే సమయం...

కాబట్టి ఈ మాసంలో దేవతారాధన
అనేది ఎన్నో రకాలుగా చాలా ఆవశ్యకమైన అంశం..

బాగా ఖర్చుతో, వ్యయప్రయాసలతో కాకుండా,
ఎల్లరికీ అందుబాటులో ఉండే పసుపు, కుంకుమ, వేపాకు, నీళ్ళు, పువ్వులు, బెల్లమన్నం / పసుపన్నం / పులిహోర (హరిద్రాన్నం), నువ్వుల నూనే / వేప నూనే / నెయ్యి దీపం తో ప్రీతి చెంది విశేషంగా భక్తులను అనుగ్రహించే స్వరూపంగా అమ్మవారిగా / ఆదిపరాశక్తిగా ఈశ్వరారాధనను ఈ ఆషాఢ మాసంలో విశేష గ్రామ దేవత జాతరగా ఏర్పాటుగావించి,  గ్రామ / పుర ప్రజలెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఉండేలా సంప్రదాయన్ని మన పెద్దలు మనకు అనుగ్రహించినారు....

అమ్మవారు ఎంతటి కారుణ్యమూర్తో, కాస్త పసుపుకుంకుమతో గావించిన పూజలతో ఎంతో ప్రీతిచెంది అనుగ్రహించే వైచిత్రి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అలంకారప్రియః విష్ణుః
అభిషేకప్రియః శివః
హరిద్రాప్రియః శక్తిః
నమస్కారప్రియః సూర్యః

అని అనాదిగా మన పెద్దలు,గురువులు మనకు నేర్పించి మనం తరించేలా మన జీవితాల్లో వివిధ సంప్రదాయార్చారాధనలను / నైసర్గికాచారకట్టుబాట్లను నెలకొల్పి ఉన్నారు...

క్రిమిసమ్హారక / రోగనాశక / యాంటిసెప్టిక్ ఎలిమెంట్ గా ఉండే అమ్మవారికి అత్యంత ఇష్టమైన పసుపును, వేపాకులను ఎక్కువగా ఈ బోనాల జాతరలో వాడడం గమనించే ఉంటారు....

దక్షిణాయణం మొదలవ్వడంతో సూర్యుడికి దూరంగా జరుగుతూ భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్య ( ఎలిప్టికల్ ఆర్బిట్ ) లో తన భ్రమణం సాగించడం తో అటు అధ్యాత్మ పరంగా జీవులకు అత్మశక్తి ఇటు లౌకికంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో,
ప్రాణులకు ఆంతర బాహిర శ్రేయస్సును ఒనరించడంలో పసుపుది, వేపాకులది కీలకపాత్ర...

అటువంటి పసుపును, వేపాకును తన పూజా ద్రవ్యంగా భక్తులు ఉపయోగించేలా చేసి,
(పసుపు రాయనిదే, వేపాకు కట్టనిదే అమ్మవారికి బోనం ముట్టదు...)
ఎల్లరికీ అధ్యాత్మ / లౌకిక ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ బోనాల పండుగలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అధ్యాత్మ ఆంతర్యములు కలవు....

ఇప్పుడంటే స్టైల్ గా ఉంటాయని, గ్యాస్ పొయ్యిపై వంటకు వాడడానికి, బాసాన్లు తోమడానికి ఈజిగా ఉంటాయని వివిధ లోహ పాత్రల్లో బోనాలు సమర్పిస్తున్నారు కాని,
మన పూర్వులు అందరికి అందుబాటులో ఉండే మట్టి కుండల్లో, పాత్రల్లో, బోనాలను సమర్పించేవారు....

నా రుద్రో రుద్రమర్చయేత్.....
నా దేవో దేవమర్చయేత్.....
అన్నరీతిగా...

అమ్మవారికి ప్రీతిగ బోనం ఎత్తే మహిళామణి, తను శుచిస్మితయై, చక్కని అలంకారవైభవంతో అమ్మవారిగా మారి అమ్మవారికి బోనం సమర్పించడంలో...

ఎత్తబడిన బోనానికి...ఎత్తుకున్న వ్యక్తికి /జీవుడికి, సమర్పింపబడే దైవానికి అభేద భావనతో సాగే బోనం సమర్పణలో...

ద్వైత --> అద్వైత --> విశిష్టాద్వైతంగా
వ్యవహరింపబడే త్రిమతసంప్రదాయములు క్రమముగా ఆదేశమగుచు తుదకు అర్చింపబడే అమ్మవారు ఆవేశించడం తో సంభవించే పూనకం అనబడే జీవజీవేశ్వర అభేద స్థితిలో జీవుడు దేవుడై నిలిచి శ్రీఆదిశంకరాచార్యులచే ప్రబోధింపబడిన అద్వైతతత్త్వంలో తన స్వస్వరూపానుసంధాన స్థితిని గ్రహించి...

ఆ విశిష్టమైన పరతత్త్వాన్ని విశేషంగా ఎల్లప్పుడూ అరాధిస్తూ శ్రీభగవద్రామానుజాచార్యులచే ప్రబోధింపబడిన విశిష్టాద్వైతసంప్రయాదాన్ని నిత్యం ఆరాధిస్తూ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని బడసి తరించేది...

బెల్లమన్నం, పసుపన్నం, నీరు, వేప కొమ్మలు, పసుపు, కుంకుమ, ఇత్యాది సాత్విక పదార్థాలతో తయారుచేయబడిన నివేదన / భోజనం / బోనం అనే వ్యవస్థలో..

పెద్దమట్టికుండను ఆధారంగా గావించి ఉండే చిన్నమట్టికుండ పై ప్లేట్లోని దీపం తో కలుపుకొని...

పరమాత్మ యొక్క వైశ్విక అష్టమూర్తితత్త్వం మొత్తం ఈ బోనాల సమర్పణలో దాగుంది...

చక్కని మట్టికుండలతో తయారుకావింపబడిన బోనాన్ని నెత్తిపైకి ఎత్తిన తదుపరి గమనిస్తే
పెద్దకుండపైన ఉండే చిన్న కుండ పైన వెలిగే దీపం
8 అనే సంఖ్య యొక్క ఆకారం పై వెలిగే పరంజ్యోతిగా భాసిస్తుంది.....

1. ఆకాశం ( కుండలోని ఘటాకాశం )

2. గాలి ( వెలిగే దీపానికి ఆధారం గాలి)

3. అగ్ని ( వెలిగే దీపం అగ్ని)

4. నీరు ( ఉపయోగింపబడిన నీరు )

5. పృథ్వీ ( మట్టి కుండ / పాత్ర) 

6. సూర్యుడు (  సూర్య శక్తి / సూర్య కారక ఆత్మశక్తి అజరత్వానికి ప్రతీక... వేపకొమ్మల్లోని అమ్మవారి శక్తి అజరత్వానికి ప్రతీక...)

7. చంద్రుడు ( చంద్ర శక్తి / చంద్ర కారక మనో శక్తి  అమరత్వానికి ప్రతీక... పసుపుతో కలిసిన వేపనీరు ఒక సూక్ష్మ స్థాయిలో అమృత తత్త్వానికి ప్రతీక )

8. జీవుడు ( బోనాన్ని ఎత్తుకున్న వ్యక్తిలో ఉన్నది జీవుడు...ఎత్తబడిన బోనంలో గల నైవేద్యంలో ఉన్నది జీవశక్తి )

ఈ 8 తత్త్వముల సమ్మిళిత సమాహారంగా ఉండే అష్టవిధ ప్రకృతిలో అంతర్భాగమైన పరమాత్మ తత్త్వం మనకు బోనంలో ప్రస్ఫుటంగా దర్శనీయము....

శ్రీ చాగంటి సద్గురువులు చమత్కరించిన ఒక విషయం గుర్తుండిఉంటే...

ఇంట్లోని ఈశ్వర పూజానుగ్రహం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వర పూజానుగ్రహం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

అదేవిధంగా

ఇంట్లోని ఈశ్వరి పూజామందిరంలో ఎత్తబడిన బోనం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వరి పూజగా సమర్పింపబడిన బోనం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

ఇవ్విధంగా జీవితాన్ని నూటికి నూరుపాళ్ళు దైవానుగ్రహంతో పరిపుష్టంగావించే ఈ బోనాల ఉత్సవం అమ్మవారి అమేయానుగ్రహానికి బాటలు పరిచి మన జీవితాలు తరించేందుకు కారణమై వర్ధిల్లడంలో ఇంతటి ఆధ్యాత్మిక సందేశం కూడా దాగుందన్నమాట....

భక్తి ప్రపత్తులతో ఒక సువాసిని సమర్పించిన  3 సంవత్సరాల ఆషాఢ బోనాలను స్వీకరించిన ఆ శ్రీకరి నాలుగో బోనాల పండుగ వచ్చేసరికి....
నిత్యం కాదంబరిగా కళ్ళెదుటే భాసించే  కారుణ్యమూర్తియైన ఆ కదంబవనవాసిని...
ఆ సువాసిని ఇంట వారి పుణ్యాలపంటైన సిరుల చిన్నారి తల్లిగా, వారి కన్నకూతురుగా తరలి వచ్చి అనుగ్రహిస్తుంది....
శ్రీభువనేశ్వరిగా చతుర్దశభువనాలను తన క్రీగంటి చూపులతో శాసించే ఆ ఆదిపరాశక్తి....!

ఇంతటి ఉత్కృష్టమైన ఆషాఢ బోనాల జాతర భక్తులెల్లరిని ఘనంగా అనుగ్రహించి సమ్రక్షించుగాక.....

( బోనాల ఉత్సవ వైభవం గురించిన మరింత సమాచారాన్ని ఈ క్రింది నా పాత పస్టుల్లో రాసాను..
https://m.facebook.com/story.php?story_fbid=10222907250163120&id=1033694038 )

ప్రగతినగర్ గ్రామదేవత శ్రీపోచమ్మ తల్లి...

అస్బెస్టాస్ కాలని గ్రామదేవతలు
శ్రీఎల్లమ్మ తల్లి / శ్రీనల్లపోచమ్మ తల్లి....

కూకట్పల్లి గ్రామ దేవత శ్రీచిత్తారమ్మ తల్లి...

అమ్మవార్లకు నమస్కరిస్తూ

సర్వం శ్రీ బల్కంపేట రేణుకా హేమలాంబ ( ఎల్లమ్మతల్లి ) శ్రీచరణారవిందార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment