Tuesday, July 13, 2021

శ్రీ (ప్లవనామ సంవత్సర) ఆషాఢ జాతర గా వినుతికెక్కిన ఆదిపరాశక్తి యొక్క వైభవవర్నన.... 😊💐🍕🍨


శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లోని అమృత గుళికల వంటి అధ్యాత్మ విశేషాలను,
" భద్రంకర్ణేభిః శృణుయామదేవాః " అనే శృతివాక్యానుగుణంగా తమ తమ మస్తిష్కాలలో పదిలంగా పొదివిపట్టి భద్రపరుచుకున్న శిష్యులకు అవతగతమైనట్టుగా....

ఆ ఆదిపరాశక్తి ఒకానొక సందర్భంలో దేవతలకు సైతం కలిగిన అతిశయాన్ని నిర్మూలించి వారి యందు భక్తి భావన, మరియాద/వినమ్రత, ఇత్యాది సద్గుణసంపదను ప్రోది చేసి కరుణించేందుకు గాను ఒక గడ్డి పరకను అడ్డుగా పెట్టి దేవతలను వారికి గల సర్వ శక్తులతో ఆ గడ్డిపరను అక్కడినుండి కదిలించమని  చెప్పినప్పుడు, ఒక్కరు కూడా ఆ గడ్డిపరకను కదిలించలేని తమ అశక్తతను గుర్తించి 

అనగా వాయుదేవుడు ఎంతగా విజృంభించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను జరపలేకపోవడం...

అగ్ని దేవుడు ఎంతగా తన ప్రతపాన్ని చూపినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను కాల్చలేకపోవడం.. 

వరుణ దేవుడు ఎంతగా హోరెత్తించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను తడపలేకపోవడం....

ఇత్యాదిగా సకలదేవతలు కూడా తమకు ఒసగబడిన  విహిత శక్తులన్నీ కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహమే అని తెలుసుకొని భక్తితో
అమ్మవారికి నమస్కరించిన ఆ వృత్తాంతంలో జ్యోతకమైన విధంగా....

"సహస్రాపరమాదేవి శతమూలాశతాంకురా సర్వగుమ్హరతుమేపాపం దూర్వాదుస్స్వప్ననాశినీం...."

అనే శాస్త్రోక్త శ్లోకంలో నుతించబడినట్టుగ ఆ ఆదిపరాశక్తి  గడ్డిపరకను సైతం గగనసదృశమైన గంభీర తత్త్వ పదార్ధంగా మనగలిగేలా అనుగ్రహించే ఆద్యంతరహితమైన శక్తి...

సైన్స్ చెప్పినట్టుగానే
"Energy can neither be created nor can be destroyed but can only be transformed from one form to the other...."

ఆధ్యాత్మికత కూడా అదే సూత్రానుగుణంగా 

" ఆది పరాశక్తి అను తత్త్వం ఆద్యంతరహితమై...
అణువుకన్ననూ చిన్నగా ఉండగల...
ఆకాశంకన్ననూ పెద్దగా ఉండగల...
లెక్కింపశక్యంకానంతటి వివిధ నామరూపాత్మక గ్రాహ్య అగ్రాహ్య శక్తికేంద్రక వ్యవస్థగా యావద్ విశ్వంలో నిండి నిబిడీకృతమై ఉండే సకలాధార చైతన్య శక్తి....

ఒక నామం, రూపం, తత్త్వం నుండి
మరో నామం, రూపం, తత్త్వం లోకి
దేశకాల ఆవశ్యకతానుగుణంగా నిత్యం రూపాంతరం చెందుతూ ఈ విశ్వపరిపాలనను సర్వదా సర్వజీవకోటికి అనుగ్రహదాయక రీతిలో కొనసాగించడమే ఆ శక్తి యొక్క నిరంతర కార్యాచరణాత్మక ఉనికికి గల విశేషం..

" గురుమండలరూపిణి "
" గురుమూర్తి "

అనే నామాలతో శ్రీలలితాసహస్రంలో 
అమ్మవారు ఆరాధింపబడడం గమనించేఉంటారు....

న గురోరధికం తత్త్వం...న గురోరధికం తపః...

అనే వాక్యం గురించిన వ్యాఖ్యానం శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కులో విన్నవారికి గుర్తున్నట్టుగా...

గురువుగారి ముందు ఎల్లరూ లఘువులే...

కాబట్టి ఆవిడ 
"గురుమూర్తిగా కూడా ఉన్నది నేనే..."
" యావద్ గురుమండలాన్ని అధివసించి ఉండే బృహత్ వ్యక్తావ్యక్త అమేయ తత్త్వ సంచయం కూడా నేనే..."

అంటూ

" ఓం గురుమూర్త్యై నమః... "
" ఓం గురుమండలరూపిణ్యై నమః... "

అంటూ పూజలు అందుకొని అనుగ్రహిస్తూన్నది...

ఈ కరోనా కారణంగా ఈసారి కూడా కుదరదేమో కాని,
కాకినాడ భానుగుడి జంక్షన్ లోని 
అయ్యప్పస్వామి వారి ఆలయంలో 
శ్రీచాగంటి సద్గురుదంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో,
శ్రీ సుబ్రహ్మణ్యశర్మ గారి గళసీమలో కొలువైన వేదమయి, వారు చదివే నామావళికి ప్రసన్నురాలై అక్కడి గురుమండల పూజ అందుకోవడానికి వివిధ సూక్ష్మ తలాల్లో వచ్చి కొలువైఉండే ఆ ఆదిపరాశక్తి యొక్క వైభవం అక్కడుండే ఎందరో నమ్మికొలిచే భక్తులకు / శిష్యులకు సుగ్రాహ్యమే....

నేను ఇదివరకే ఒక పాత పోస్ట్లో,
 
శూన్యమాసం గా పిలువబడే ఆషాఢ మాసంలో విశేష గురుపూజ / వ్యాసపూజ నిర్వహింపబడే గురుపౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి ఉత్సవం గా జరుపుకోవడంతో ఏ విధంగా పంచాంగ వ్యవస్థకు ఒక విధమైన  
" cosmic balance to adjust the almanac drift due to the void caused by the AashaaDha maasam..." 
సమకూరుతుందో ఆయా విశేషాలను క్లుప్తంగా వివరిస్తూ రాసినట్టుగా...

దేవశయన ఏకాదశి కి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి జారుకోవడం మరియు ఆషాఢ శక్తిగా ఆదిపరాశక్తి నారాయణి మేల్కోవడం లోని ఆంతర్యం అధ్యాత్మ లోకానికి అందివ్వబడే అనుగ్రహవిశేషం....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాలపెద్దమ్మ ఆ దుర్గమ్మ,
మా ఇంటి బాలగా వచ్చి కొలువైనందుకు
ఈ సంవత్సరం యొక్క ఆషాఢ జాతర 
నాకు మరింత విశేషమైనదే...

ఎందుకంటే అప్పుడెప్పుడో 2009 లో అనుకుంటా...

శ్రీచాగంటి సద్గురువుల అనుగ్రహమైన ఈ క్రింది శ్లోక మంత్రాన్ని నిత్యం స్మరణ మనన నిధిధ్యాసన గావించడంతో...

" సర్వదా సర్వదేశేశు పాతుః త్వాం భువనేశ్వరి...
మహామాయా జగ్గధాత్రి సత్ చిత్ ఆనంద రూపిణీం..."

ఆ హ్రీం బీజాక్షర అధిదేవత శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా మా జీవనజ్యోతిగా ఆ పరంజ్యోతి ఈ ఆషాఢ జాతరకు మా ఇంట బాలగా వచ్చి కొలువయ్యింది....😊

కూకట్పల్లిలోని మా శ్రీచైతన్య కాలేజ్ పక్కన ఉండే శ్రీద్వాదశజ్యోతిర్లింగేశ్వర స్వామివారి శక్తిగా స్వామివారి వామభాగాన శ్రీచక్రాభిముఖియై కొలువైన స్థిర శ్రీభువనేశ్వరి అమ్మవారే ఇప్పుడు మా ఇంట తిరుగాడే చిన్నారి గా వచ్చి కొలువై మమ్ము అనుగ్రహించింది...

శ్రీవాణి గా, శ్రీ గౌరి గా, శ్రీ లక్ష్మి గా...
త్రిశక్తి సంఘాతమై యావద్ భూమండలానికి నాభి స్థానంలో ఉండే, దక్షిణ భారత ఎకైక మోక్షపురి, కాంచీపురానికి అధిదేవతయై ఎల్లరినీ అనుగ్రహించే ఆ శ్రీకంచికామాక్షి పరదేవత,

పంచభూతాత్మక ప్రతీకలుగా చెప్పబడే 5 లింగాల్లో ఒకటైన కంచి పృథ్వీ లింగంగా ఉండే
ఏకామ్రేశ్వరుడి శక్తిగా కొలువై ఉండి,
తన సన్నిధిలోని బిలాకాశం / బిలాహాసం ద్వారా యావద్ విశ్వంలోని శక్తికేంద్రాలకు తానే అధిదేవతగా భాసిల్లుతూ, అసంఖ్యాక నామా రూపాలతో భక్తుల్లెలరిచే అర్చింపబడే ఆ ఆది పరాశక్తిని ఆషాఢ శక్తిగా అర్చిస్తూ విశేష ఉత్సవం జరపడంలో మనం గమనించగలిగితే...

1. పంచభూతాల్లో పృథ్వికి / పృథ్వి తత్త్వ పదార్థాలకు మాత్రమే ఇతర పంచభూతాల సమ్మేళనంతో వివిధ నామరూప ధారక శక్తి కలదు...

అప్పటివరకు చెరువులో ఎండిన మట్టి దిబ్బ గా ఉన్న బంక మన్నుకి వర్షం రూపంలో నీరు జతైన తదుపరి 
గణేష ప్రతిమగా మారి మృణ్మయం
చిన్మయమౌతుంది....

ఆతదుపరి అగ్ని,.వాయు, ఆకాశం అనే ఇతర పంచభూత తత్త్వ సమాగ్రితో జతై ఒక చూడచక్కని సశాస్త్రీయ గణేష మూర్తిగా మారి పూజ గదిలో 
ఈశ్వరుడిగా మారి పూజలు అందుకొని అర్చించిన భక్తులను అనుహ్రహిస్తున్నది.....

పృథ్వి వినా,
ఆకాశం, వాయు, అగ్ని, ఆపః ( నీరు ) ,
ఈ నాలుగు సమ్మిళితమైనను ఈ ప్రక్రియ సాధ్యపడదు...

12 మాసాల నిరంతర కాలచక్రాన్ని
5 భాగాలుగా విభాగిస్తే
అనగా గాయత్రి మహామంత్ర బీజాక్షర సంఖ్య 24 కు ప్రతీకగా

24 × 5 భాగాలు = 12 మాసాలు...

అనగా రమారమి 72 రోజుల కాలాన్ని ఒక భాగంగా భావిస్తే 

72 రోజులు × 5 భాగాలు = 360 రోజుల సంవత్సర కాలం...

అనగా రమారమి 5 పక్షాల కాలం ఒక భాగంగా భావిస్తే... 

అటువంటి 5 భాగాల్లోకి కుదురుకునే ఒక సంవత్సరకాలం లో 

ఆకాశం
వాయువు
అగ్ని
ఆపః ( నీరు ) 
పృథ్వి

తమ తమ శక్తిని ప్రస్ఫుటంగా పరివ్యాప్తి గావించే విధంగా కాలం ఉండడం మనం గమనించవచ్చు...

చైత్రం
వైశాఖం
జ్యేష్టం
ఆషాఢం
శ్రావణం
భాద్రపదం
ఆశ్వయుజం
మార్గశీర్షం
కార్తీకం
పుష్యం
మాఘం
ఫాల్గుణం

అగ్ని, నీరు, పృథ్వి, తమ తమ శక్తిని పరివ్యాప్తం గావించే

చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ ప్రారంభం, వచ్చేసరికి
పృథ్వి తత్వం కాలం పై తన పట్టును కలిగి ఉండే సమయం...

అందుకే ఆషాఢ మాసం వచ్చిందనగానే వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల ఆయా ప్రాంతీయ ఆచారానుగుణంగా అమ్మవారికి విశేష నైవెద్యాలతో జాతర / ఉత్సవాలు జరపడం మనం గమనించవచ్చు.....

నైవేద్యంలో అమ్మవారికి ఏ తత్త్వ పదార్థలు సమర్పిస్తాం...??

ఆకాశం..?
వాయు..?
అగ్ని..?

కాదు...
జలం మరియు పృథ్వి తత్త్వ భరిత పదార్థాలు...

ఎందుకంటే మన శరీరం కూడా సిమ్హభాగం జల మరియు పృథ్వీ తత్త్వ భరితం కాబట్టి...

నిలవదోషం లేని బెల్లం ముక్కని ఈశ్వరుడి నైవేద్యానికి వాడడంలో గల ఆంతర్యం..??

శ్రీరాజరాజేశ్వరి గా, శ్రీలలితాంబిక గా, చెరుకు విల్లును అమ్మవారు ధరించి ఉండడంలో గల ఆంతర్యం..??

ఎటువంటి పృథ్వి నుండైనా ఒక సాధారణ మొక్కను తియ్యని చెరుకు గడగా మార్చి అందునుండి మధురమైన  బెల్లము, చక్కెర ని మనకు అందించే చెరుకు మొక్క మనకు ఈ పృథ్వీ తత్త్వం యొక్క విశేషం తెలియచెప్తుంది....

అనగా మన శరీరం అనే మృణ్మయం నుండే అధ్యాత్మ సాధన ద్వారా చిన్మయ వీచికలను ప్రభవింపజేసుకొని మధురమైన బెల్లము వంటి పరమాత్మ తత్త్వానుభూతిని మనలోనే ఉద్భవింపజేసుకోవడంతో ఈ కేవల పృథ్వీ ఘటం.... అమేయమైన చిదాకాశమై సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే పరత్తత్వ పదార్థం గా పరిణమిస్తుంది...

అప్పుడు " తత్ త్వం అసి "  అనే శృతివాక్యానికి నిదర్శనంగా మన పాంచ భౌతిక శరీరమే, ఒక దివ్య అప్రాకృత పరమాత్మ పదార్ధానికి నెలవుగా మారి అప్పుడు " సోహం " అనే స్థితిలో జీవుడు జీవేశ్వరుడితో ఓలలాడుతూ ఉండే ఆ తురీయావస్థలో
ని తత్త్వానుభూతినే  " అద్వైత స్థితి " గా శ్రీఆదిశంకరాచార్యుల వారు ప్రబోధించినారు....

అంతటి ఉత్కృష్టమైన ఈ పృథ్వీ తత్వ మహాత్మ్యాన్ని
శర్వ శర్వాని గా ఉండి ఆ ఆదిదంపతులు ఎవ్విధంగా విశ్వపరిపాలనను గావిస్తుంటారో శ్రీ చగాంటి సద్గురువులు మనకు వారి ప్రవచనాల్లో బోధించి ఉన్నారు....

ఆ శర్వాని తన సకల శక్తులను మరింత ప్రస్ఫుటంగా ఉద్దీపన గావించి దక్షిణాయణానికి నాయకిగా కాలచక్రం యొక్క పగ్గాలను శ్రీమన్నారాయణుడి నుండి తన అధీనంలోకి తీసుకొని ఎల్లరినీ ప్రత్యక్షంగా పరిపాలించే పరాశక్తిగా సిమ్హాసనారూఢురాలై ఉండే కాలం కనుక ఈ ఆషాఢ జాతర ను అమ్మవారికి ప్రీతికరంగా ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకోవడం ఎల్లరికీ విదితమే...

యావద్ తెలంగాణ లో "బోనాల జాతర" గా
ఈ ఆషాఢ జాతర వినుతికెక్కడంలో గల ఆంతర్యం ఇదివరకే నా ఈ క్రింది పాత పోస్ట్లలో వివరించాను....

https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/07/blog-post_12.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_16.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/2019-bonaalu.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post_20.html?m=1

ఉజ్జైని నుండి భాగ్యనగరానికి తరలి వచ్చిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జైని మహంకాళి,

స్వయంభువై కొలువైన బల్కంపేట శ్రీ రేణుకా హేమలాంబ (ఎల్లమ్మ),

మంచి హృదయంగల ప్రజానేతగా చిరకీర్తిని గడించిన పీ.జే.ఆర్ గారు నెలకొల్పిన జూబ్లీ హిల్ల్స్ పెద్దమ్మతల్లి,

ఇత్యాదిగా హైదరాబాద్ లోని వివిధ
ప్రాంతాల్లో కొలువైన మహాశక్తిగా ఆ ఆదిపరాశక్తి, బెల్లమన్నం బోనాలతో పాటుగా భక్తుల మనోప్రార్థనలను కూడా స్వీకరించి, ఎల్లరినీ చల్లగా అనుగ్రహించుగాక....

శ్రీమచ్ఛఙ్కరసద్గురుర్గణపతిర్వాతాత్మజః క్షేత్రపః
ప్రాసాదే విలసన్తి భూరి సదయే నిత్యస్థితే హ్రీంమయి ।
యుష్మత్స్నేహకటాక్షసౌమ్యకిరణా రక్షన్తి దోగ్ధ్రీకులం
శ్రీవల్లీం భువనేశ్వరీం శివమయీమైశ్వర్యదాం తాం భజే || ౫ ||

No comments:

Post a Comment