శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు సి.నా.రె గారిగా సుప్రసిద్ధులై సాహితీ జగత్తులో తమదైన శైలిలో ప్రౌఢపదసేద్యంతో సుశోభితమైన సాహిత్యసిరులను పండించిన నవయుగ విరించిగా వినుతికెక్కిన కోవిదులు ....
సిని సాహిత్యాన్ని ఒకవైపు, అధ్యాత్మ సాహిత్యాన్ని మరోవైపు ఎంతో నైపుణ్యంతో ఒలికించిన సిరాఝరి వారిది....
చదవడానికి ఒక సింపుల్ సినిమాపాటలా అనిపించినా.....ఈ క్రింది ఒక్క పాటలో,
వారి రచనావైదుష్యంలోని భావుకత మరియు దేశభక్తి ఎంతటి గొప్పవో అనేది చదువరులకు కానవచ్చే సాహితీ వైభవం.....
*****
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?
గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
*****
" మందారమకరందాలు " అనే పేరుతో వారు ఒనరించిన హృద్యమైన భావగంభీరమైన శ్రీపోతనామాత్య విరచిత శ్రీమద్భాగవత గ్రంథరాజ వ్యాఖ్యానాం, తెనుగు అధ్యాత్మ సాహిత్య చరిత్రలో ఒక కలికీతురాయి వంటిది అనేది ఎందరో విజ్ఞ్యుల సద్విమర్శ......
( ఆసక్తి గల పాఠకులు ఈ లింకు నుండి ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవచ్చు.....
https://drive.google.com/file/d/16Oz4qaZD7dDEym0BSgIaw67HbMR9JfU5/view?usp=drivesdk
)
ఒక్కో మహానుభావుడిది ఒక్కో రచనా శైలి....ఒక్కో విధమైన పద ప్రౌఢిమ... ఒక్కో విధమైన సాహిత్య గాంభీర్యం....
వారి వారి శ్రీసరస్వతీ కటాక్షానికి అనుగుణంగా వారి కలమునుండి ఒలికే అక్షరసిరులు ఒక్కో పాఠకుడిని ఒక్కోలా ప్రాభావితం గావిస్తాయి....
ఎన్నో జన్మల పుణ్యబలం తో మాత్రమే కళాకారులు గా జన్మించే సౌభాగ్యం సిద్ధిస్తుంది.....
సకల కళలకు సాకారరూపమైన కళామతల్లిగా ఆరాధింపబడే ఆ గీర్వాణి ఎవరికి ఏ మహత్తును ఆపాదించి వారి వారి జన్మలను తరింపజేస్తుంది అనేది ఆయా జీవుల వివిధ జన్మాంతర సుకృతంపై ఆధారపడి ఉండే విశేషం........
అటువంటి అరుదైన అక్షర కళాప్రపూర్ణులుగా వినుతి కెక్కిన శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు అక్షరనీరాజనా పూర్వక సవినయ నమస్సుమాంజలి.. 🙏💐
No comments:
Post a Comment