Friday, December 2, 2022

పద్మశ్రీ, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వర్ధంతి సంస్మరణార్ధం వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి.....🙏💐


కొందరికి కొన్ని కలర్ పేపర్స్ అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ డిజైన్స్ తో కూడిఉండే కళాకృతులను నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ బట్టముక్కలను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ డిజైన్స్ తో కూడిఉండే స్టైలిష్ ఫాషన్ దుస్తులు నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ పువ్వులను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ రంగులకలబోతగా పరిమళవిరిమాలలను నిమిషాల్లో తయారు గావించి
ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ రంగులను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ వర్ణచిత్రాలు నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

ఇలా ఈ లోకంలో వారివారికి సమకూరిన భగవద్ అనుగ్రహం కారణంగా ఒక్కొకరిది ఒక్కో ప్రత్యేకత... ఒక్కో విశేషం...ఒక్కో శైలి...ఒక్కో గుర్తింపు.....

కొందరు కొన్ని పదాలను అందుకొని వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ సంధి సమాసాల కలబోతతో ఎంతో భావగంభీరమైన కవనాలను నిమిషాల్లో సృజించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు....

ఇవ్విధంగా ఆ కళామతల్లి యొక్క అనుగ్రహం అక్షరమయి గా సమకూరి పరిపూర్ణమైన అక్షరబ్రహ్మలుగా జన్మించే సౌభాగ్యం చాలా తక్కువ మంది పుణ్యాత్ములకు మాత్రమే సమకూరే విశేషం.... 

ఎదుకంటే అది ఎన్నో జన్మల పుణ్యబలంతో మాత్రమే సమకూరే సర్వోత్కృష్టమైన అనుగ్రహం....

క్షరము కానిది అక్షరం.......

దాని యొక్క ప్రభావం కూడా అట్లే శాశ్వతమై పరిఢవిల్లుతుంది కాబట్టి అక్షరోపాసకులు వారి కవనాల రూపంలో ఈ లోకంలో ఎప్పటికీ చిరంజీవులే......

కొన్ని ప్రవచనాలు, కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, కొన్ని నవలలు, కొన్ని పుస్తకాలు, కొన్ని పద్య గద్య కవనాలు, కొన్ని పాటలు ఈ జగత్తులో ఎప్పటికీ ఎందరెందరినో ప్రభావితం గావించే విధంగా ఉండడం మనం గమనించవచ్చు.....

అది అక్షరం యొక్క సారస్వత శక్తి.....
ఆ అక్షరాన్ని నుడివే సరస్వతీ ఉపాసకుని శక్తి.....
ఆ అక్షరాన్ని అందుకొని ఆకళింపు గావించుకొని తరించగలిగే సరస్వతీ కటాక్షాన్ని లభింపజేసుకున్న వారి భక్తి యొక్క శక్తి....

ఇవ్విధంగా తెలుగు సినీసంగీత జగత్తులో వందలాది పాటలను సృజించి, తెలుగు అక్షరాలకు, పదాలకు, వాటితో అల్లబడిన సాహిత్య సరాలకు శాశ్వతత్త్వాన్ని సమకూర్చిన అగ్రగణ్యుల్లో వేటూరి గారి తరువాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది అందెవేసిన చెయ్యి..... 

సందర్భం ఏదైనా..... 
భావం ఏదైనా.....
రసం ఏదైనా.....
రాగం ఏదైనా.....
సాహిత్యంలో వాటన్నిటిని సరైన మోతాదులో మేళవించి ఒక చక్కని పాటగా రంగరించడం అనే ప్రక్రియలో సిరివెన్నెల గారు సృజించిన అద్భుతాలు ఎన్నో...ఎన్నెన్నో.....

అలతి అలతి పదాల్లోనే ఆకాశమంత గంభీరమైన భావుకతను ఒలికించిన వైనం ఈ క్రింది పాటల చరణాల్లో మనం గమనించవచ్చు......

1.
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
....
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించె  కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ..
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ .. నిదురించిన హృదయరవళి  ఓంకారం కానీ

2.
నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం
నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని

3.
నా ఉఛ్ఛ్వాసం కవనం  నా నిశ్వాసం గానం (2)
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది 
నే పాడిన జీవన గీతం ... ఈ గీతం 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

4.
నీటి ముల్లై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా
జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా
తేనెల చినుకులు.. చవి చూపించీ
కన్నుల దాహం.. ఇంకా పెంచీ
కమ్మని కలలేమొ.. అనిపించీ
కనుమరుగై.. కరిగావా.. సిరి వానా
నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా

5.
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
....
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది

ఇవ్విధమైన 3000 పైచిలుకు కవనాల అక్షరసేద్యంతో  పాటలపూదోటలో తెలుగుసినీసంగీత జగత్తును ఓలలాడించిన అపురూపమైన అరుదైన అనన్యసామాన్యమైన ఆరితేరిన సాహితీస్రష్టలు, పద్మశ్రీ, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు......

వారి వర్ధంతి సంస్మరణార్ధం వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి.....🙏💐

No comments:

Post a Comment