శ్రీవారి జ్యేష్ఠమాస జ్యేష్ఠాభిషేకోత్సవ శుభాభినందనలు....
💐🙂🍦🍧🍕🍉🍨🍍
పచ్చకర్పూరపు తిరునామములను ధరించి, ఆకుపచ్చని తులసిమాలలు మరియు రంగురంగుల వివిధ సుగంధభరిత విరులకలబోతతో ఎంతో ఒద్దికగా అల్లబడిన తోమాలలను అలకరించుకొని ఎంతో వైభవంగా ఆనందనిలయంలో మందస్మితుడై పద్మపీఠంపై వీరస్థానక ధృవమూర్తిగా కొలువైన ఆ తిరుమలేశుడే, తిరుగిరులే కాకుండా యావద్ విశ్వాన్ని కూడా బంగారు మెరుగులతో ధగధగలాడే ప్రాకృత ఆనందనిలయ త్రితల విమానగోపురంలో గుప్తమైన యోగరూపంలో నిక్షిప్తమై ఉండే నిజమైన బంగారు విమానం లో విశ్వమంతటా ప్రయాణిస్తూ భూగత 84 లక్షల జీవరాశులే కాకుండా భువరాది 6 ఊర్ధ్వలోకాల్లో కొలువైఉండే ద్యులోక తైజసిక వాసులను..మరియు అతలాది సప్త అధోలోక తిర్యంగ్ముఖ, అసురాది, జీవులను...సదా పరికిస్తూ....
తన శ్రీపాదపద్మములను ఎక్కడెక్కడ ఎవరెవరు నిత్యం ధ్యానిస్తున్నారో వారిని అనుగ్రహిస్తూ....
ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడికి తిరుమలలో జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవాలు ఎన్నో కలవు.....
వేటి విశేషం వాటిదే....వేటి ప్రత్యేకత వారిదే....వేటి వైభవం వాటిదే....!
వాటిలో ఎంతో విశేషంగా ఉత్తరాయణం చివర్లో వచ్చే జ్యేష్ఠమాస పౌర్ణమికి ఉండే జ్యేష్ఠా నక్షత్రాన్ని పురస్కరించుకొని గావించే విశేషమైన అభిషేక ఉత్సవాన్ని , తిరుమల ఆచారవ్యవహార పరిభాషలో జ్యేష్ఠాభిషేక ఉత్సవం గా పేర్కోనబడే 3 రోజుల ఉత్సవ విశేషాలేంటో కొంత పరికిద్దాం...
వజ్రకవచం, ముత్యపుకవచం, స్వర్ణకవచం.....
అనే మూడు ముచ్చటైన అలంకరణల్లో,
ఉత్సవమూర్తిగా తిరుమలపంచబేర సంప్రదాయంలో భక్తుల్లెల్లరికీ ప్రతీరోజు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తున్న శ్రీభూసమేత శ్రీమలయప్ప స్వామి వారు,
సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అరుదైన ఉత్సవం జ్యేష్ఠాభిషేక ఉత్సవం....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వివరింపబడిన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల గురించి మరియు తత్సంబంధమైన యోగవిశేషాల గురించి అవగాహన కలిగిన మాన్యులకు తెలిసినట్టుగా...
ఒక ఆకారంతో , ఒక రూపంలో, ప్రపంచానికి కనిపించే ప్రతీ మనిషికి కూడా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములనబడే 3 విధములైన శరీరములు కలవు....
అనగా యోగపరిభాషలో హృదయకోశగత జీవాత్మపరమాత్మ సంఘాతంగా వెలుగొందే మనిషి అనే సర్వోత్కృష్ట ప్రాణికి గల తొడుగులు...
1.స్థూల శరీరం :
బాహ్యప్రపంచానికి కనిపించే మన పాంచభౌతిక శరీరం.....
మనము భుజించే ఆహారము / అన్నము నుండి అన్నాదము గా పరిణమిస్తూ, నిరంతరం రూపాంతరం చెందే ఈ స్థూల శరీరం గురించే ఈ లోకంలోని 99% జనాలు ఎల్లప్పుడూ మాట్లాడుకునేది....
"అప్పుడు రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు బక్కగా కరువుప్రాంతబాధితుడిలా ఉండేవాడివి..
ఇప్పుడు బాగా తిని బాక్సింగ్ ఛాంపియన్ లా తయారయ్యావ్...."
అని ఎవరైనా అంటే అది మన స్థూల శరీరం గురించి వారి అభిప్రాయం...
అన్నము అనగా....
" మనము తినునది...మనల్ని తినునది..."
అంటూ ఎంతో గొప్పగా నిర్వచింపబడిన శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లోనే...ఆ భుజింపబడే అన్నములోని 6వ వంతు మన మనసుగా పరిణమిస్తుందనే వివరణ చాలా మందికి గుర్తుండే ఉంటుంది...
2. సూక్ష శరీరం :
అన్నాదము గా పరిణమించిన మన శరీరం లో నిరంతర సంకల్పవికల్పాల సమూహంగా ఉనికిని పొందే అగోచర సర్వేంద్రియసంఘాత తత్త్వమే మన మనసు....
ఆ మనసు యొక్క వేగం గురించి కూడా శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో గొప్పగా వివరించి ఉన్నారు...
ఇప్పుడు టీ.వీ.లో ఏదో ఒక ప్రొగ్రాం ని వీక్షించే మన మనసు....
కొద్ది సేపట్లోనే పూజ గదిలో ఆచమనం గావించి ఆసీనులైన తదుపరి ఆనందనిలయం లో షట్కాల అర్చనలను అందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుడి పాదపద్మములను అలంకరించి ఉన్న తులసీ పత్రాలను దర్శిస్తూ ఉంటుంది....
సూపర్సోనిక్ జెట్లో తిరుమలకు ప్రయాణించినా, మనసు ప్రయాణించే వేగానికి అది సరిరాదు....
వాయుపుత్రుడైన హనుమంతుల వారిని
" మనోజవం మారుతతుల్య వేగం..."
అని కీర్తించడం ఎల్లరికి తెలిసినదే...
మనసు యొక్క జవానికి / వేగానికి, గాలికి ఏంటి సంబంధం...?
రేచక, పూరక, కుంభకమనబడే ప్రాణాయామ ప్రక్రియలకు సాక్షిగా తమను తాము దర్శించే ఉపాసకులకు, వాయుశక్తి మనోశక్తి గా పరిణమించే వైచిత్రి, మరియు తదనుగుణంగా మనోశక్తి యొక్క సృజన గా రూపాంతరం చెందే సూక్ష్మశరీరం యొక్క వైచిత్రి గురించి ప్రాజ్ఞ్యులైన విజ్ఞ్యులకు విదితమే....
ఆ సూక్ష్మ శరీరం అనేది అన్యులకు అగ్రాహ్యం...అగోచరం...అనిర్వచనీయం...గా ఉండే ఆంతర జీవసంబంధమైన అంశం....
"అప్పుడు రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు
నీ మనసు నిత్యం తిరుమలకు ప్రయాణిస్తూ ఉండేది...
ఇప్పుడు బాగా ఆలోచిస్తూ హిమాలయాలను దాటి మానససరోవరానికి కూడా ప్రయాణిస్తూ ఉన్నదా నీ సూక్ష్మ శరీరం....?"
అని ఎవ్వరూ అనజాలరు....
ఎందుకంటే సూక్ష్మ శరీరం అనునది లోకులకు అగోచరమైనది కాబట్టి....
3. కారణ శరీరం : ఈ స్థూల, సూక్ష్మ శరీరాలకు అనుసంధానకర్తగా ఉంటూ ఇంద్రియసంఘాతానికి మరియు మనసుకి కూడా అనుసంధానంగా ఉండే మన చిత్తవృత్తులు సమీకరించుకున్న బౌద్ధిక పరిణతకు అనుగుణంగా సదరు యోగస్థాయికి జీవుడి ఉపాసన / తపోశక్తి చేరుకున్న తదుపరి ఆవిర్భవించేదే కారణ శరీరం....
అది కేవలం పరమాత్మకు మాత్రమే గ్రాహ్యమై ఉండే జీవజీవేశ్వర సంఘాతం...
ఒక్కో యోగీశ్వరుడు ఒక్కోవిధంగా ఈ కారణ శరీరాన్ని నిర్వచించడం అనేది సదరు ఉపాసకుల తపోసాంద్రతకు సంబంధించిన విషయం....
జ్యేష్ఠాభిషేక ఉత్సవాంతర్గతంగా, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అలకరింపబడే వజ్రకవచం...ముత్యపుకవచం...స్వర్ణకవచం....
అనే అలంకరణ సంప్రదాయం భక్తులకు ఈ 3 విధములైన శరీరముల గురించిన ఎరుకను అనుగ్రహించే ఉత్సవాంతర్గత యోగ విశేషం....
స్థూల శరీరం గొప్ప దేహదారుఢ్యం తో ఉన్నా సరే...
సూక్ష్మ శరీరం శక్తివంతమైనది గా ఉండనప్పుడు...
అనగా మనోబలం క్షీణించినప్పుడు...
ఆ మనిషి కేవలం ఒక కూలబడిన బియ్యం బస్తా లా తనకు తానే భారంగా ఉండిపోతాడు....
కనీసం ఆలయానికి వెళ్ళి ఓ 3 ప్రదక్షిణలైనా గావించి తీర్థప్రసాదాలను సేవించి రమ్మని చెప్పినా సరే...
అదేదో కాళ్ళు అరిగిపోతాయేమో అన్నట్టుగా 'వచ్చేవారమో ఆ తర్వాతో ఎప్పుడైనా వీలుంటే వెళ్తాలే....'
అన్నట్టుగా బదులిస్తాడు...
ఆలయానికి కూడా వెళ్ళలేనంతటి క్షీణమనోబలంతో ఉండే మనిషికి ఆ స్థూల శరీరం దేనికి ఉపయోగపడినట్టు...?
స్థూల శరీరం ఆర్నాల్డ్.ఎస్ లా 8 ప్యాక్ ఆబ్స్ తో ఉండకపోయినా...
ఒక డీసెంట్ సీరియల్ హీరో లా సింపుల్
కరాటే / టాయిక్వాండో ప్లేయర్ లా ఉన్నాసరే...
మనిషికి మనోబలం మెండుగా ఉన్నప్పుడు...
ఇప్పుడు ఈ క్షణం లో చంద్రమండలం వెళ్ళిరావడనికి కూడా మనిషి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు.....
ఎందుకంటే అది సూక్ష్మశరీరం యొక్క గొప్పదనం....
అన్నం, చపాతీలు, బిస్కెట్లు, బిర్యానీలు, వగైరాలతో బాగా దృఢమైన స్థూల శరీరాన్ని సముపార్జించవచ్చును...
ఎందుకంటే అది లౌకిక పౌష్టిక ఆహారంతో వృద్ధిచెందే పాంచభౌతిక బ్రహ్మాండ పిండాండ సమన్వయ సంఘాతం...
మరి అలౌకిక ఆహారంతోనే ఎక్కువగా ప్రభావింపబడే సూక్ష్మ, కారణ శరీరములకు వేటిని భోజ్యంగా అందించి వాటిని దృఢమైన వాటిగా గావించగలము...?
అనే ప్రశ్న ఉదయించినప్పుడు....
అప్పుడు భక్తి, భగవంతుడు, శ్రీమద్రామాయణం, భాగవతం, ప్రాణాయామం, యుక్తాహారవిహార భరిత శౌచసిద్ధి, శమము, దమము, జితేంద్రియత్వము, యోగము....
ఇత్యాది వాటి గురించిన జిజ్ఞ్యాస, పరిశోధనాత్మక వివేచన అంకురించి మనిషి తరించడం అనే ప్రక్రియకు నాంది పలికే ఆంతర ప్రయాణం మొదలైయ్యేది.....
ఈ సుపీరియర్ ట్రైట్స్ అన్నీ కూడా ఏ సూపర్ మార్కెట్లోను కొనుక్కొని స్వీకరించడానికి కుదరదు....
ఎందుకంటే అవి ఎంతో శ్రమించి
సద్గురువానుగ్రహం, భక్త భాగవత భగవద్ అనుగ్రహం తో మాత్రమే అందుకొనబడే ఈశ్వర విభూతులు కాబట్టి....
వజ్రసదృశమైన దృఢసంకల్ప శక్తిని...
ముత్యము వంటి స్వఛ్చమైన మనస్సును,
మృదువైన మనో సున్నితత్త్వాన్ని....,
పరిశుద్ధమైన స్వర్ణం లాంటి దేహసౌష్ఠవం / తత్త్వాన్ని....
భక్తులకు అనుగ్రహంగా అందించి వారి స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను అత్యంత శక్తివంతంగా గావించే ఈశ్వరానుగ్రహ వైచిత్రికి ఈ జ్యేష్టాభిషేక ఉత్సవం ఒక ప్రతీక అని మాన్యుల విశ్వాసము.....
అటువంటి మహత్తరమైన తిరుమల జ్యేష్ఠాభిషేక ఉత్సవం జరుగుతున్న శుభవేళ, స్వామివారి అనుగ్రహవీచికలు భక్తులందరికి కూడా పరిపూర్ణంగా లభించి భక్తులెల్లరి జీవితాలు సుఖశంతోషాలతో పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తూ.....
ఓం నమో వేంకటేశాయ.......
🙏🙏🙏🙏🙏🙏🙏
🙂🍊🍑🍎🥭🍓🍿🍧
"జలకమాడి వున్నాడు సర్వేశ్వరుడు నిగ్గు
గలిగిన మంచి నల్లకలువ వలెను...."
అని అన్నమాచార్యుల వారు స్వామివారి మీద కడు చక్కని సంకీర్తన రచించి భక్తులను అనుగ్రహించినారు....
*******
సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాడిందరి భాగ్యము వలెను
జలకమాడి వున్నాడు సర్వేశ్వరుడు నిగ్గు
గలిగిన మంచి నల్లకలువ వలెను
ఎలమి కప్పురకాపు ఇదె చాతుకున్నవాడు
వెలలేనియట్టి పెద్ద వెండికొండవలెను ||
అందముగా తట్టుపుణుగు అలదుక నున్నవాడు
కందువ ఇంద్రనీలాల గనివలెను
ముందటి వలెనె తా సొమ్ములు నించుకున్నవాడు
పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను||
మించి అలమేల్మంగ మెడగట్టుకొన్నవాడు
మంచి(పొంచి?) బంగారు తామరపువ్వువలెను
ఎంచగ శ్రీవేంకటేశుడిదె కొలువై విన్నవాడు
నించిన దాసులపాలి నిధానము వలెను ||
http://annamacharya-lyrics.blogspot.com/2008/02/405sevimparo-janulala.html?m=1
*******
డార్క్ పర్పుల్ కలర్ లో ఉండే అరుదైన నల్లకలువలను మీరు ఎప్పుడైనా చూసారో లేదో కాని.....
నేను మాత్రం ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో భక్తులు మల్లన్నకు నల్లకలువల పుష్పమాలను సమర్పించడం చూసి వాటి సౌకుమార్యప్రభలకు అచ్చెరువొందాను కూడా....
"ఈశ్వరుడికి అభిషేక ఉత్సవం నిర్వహించి ఆ ప్రసాదం భక్తులు స్వీకరించడంతో, ఆ అభిషేకమూర్తికి లభించిన గొప్ప స్వాంతనలా మన మనసుకు కూడా ఎంతో గొప్ప స్వాంతన లభించి మనకు నూతన జవసత్వాలు అనుగ్రహింపబడును ...."
అని శ్రీనగర్ కాలని లోని సత్యసాయి నిగమాగమంలో ఒకసారి నిర్వహింపబడిన శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి విశేష అభిషేక ఉత్సవాంతర్గత ప్రవచనాల్లో, శ్రీచాగంటి సద్గురువులు ఉటంకించడం అక్కడికి విచ్చేసిన కొందరు భక్తులకైనా గుర్తుండి ఉండాలి....
అప్పుడే చెన్నై నుండి ఫ్లైట్లో తెప్పించబడిన ఆ స్వచ్ఛమైన విభూతిని అభిషేకానంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి
ప్రసాదంగా గైకొని ధన్యులైన భక్తుల్లో నేను కూడా ఒకణ్ణి...🙂
స్రగ్-భూషాంబర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే ।
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్
॥ 11 ॥
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్
॥ 12 ॥
శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
॥ 13 ॥
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్
॥ 14 ॥
శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః...
No comments:
Post a Comment