Friday, November 7, 2025

కీ.శే శ్రీగరిమెళ్ళబాలకృష్ణప్రసాద్ గురువుగారి సప్తసప్తతి (77వ) జయంతి పురస్కృత శ్రీతాళ్ళపాక అన్నమార్యుల సంకీర్తనాబృందగానం...

కీ.శే శ్రీగరిమెళ్ళబాలకృష్ణప్రసాద్ గురువుగారు, మాజి తిరుమల ఆస్థానగాయకులు, శ్రీవేంకటేశపదపాదారాధకులు, శ్రీతాళ్ళపాక అన్నమార్య హృదయావిష్కృత గోవిందతత్త్వారాధకులు,
అనగానే శ్రీతిరుమలేశుడిని కళ్ళెదుటసాక్షాత్కరింపజేసే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనాసరములస్వరరాగరససుగంధజ్ఞ్యాపకాలలో ఓలలాడే విజ్ఞ్యులు ఎందరో...

అట్టి మహనీయుల సప్తసప్తతి (77వ) జయంతి పురస్కృత 
శ్రీతాళ్ళపాక అన్నమార్యుల సంకీర్తనాబృందగానం భక్తుల్లెలరికీ కర్ణామృత ప్రసాదమే కద... 

ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు 

అనే మధురాతిమధురమైన సంకీర్తనలో, ఈ క్రింది విధంగా శ్రీహరినామ స్మరణం, మననం, గానం యొక్క వైభవాన్ని ఆచార్యులు ఎంతో రమ్యంగా స్తుతించారు.....

చ|| 
హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు 
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు 
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా

...

వంట అందరూ వండుతారు....
కాని సత్బ్రాహ్మణశ్రేణికి చెందిన అమృతమయమైన వంటకం కొందరికి మాత్రమే ఆ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంగా అమరే వైభవం...

అవ్విధంగానే...

శ్రీహరి నామాన్ని ఎందరో భక్తులు నిత్యం నుడువుతూనే ఉంటారు....
కాని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల హృదయం నుండి ఉప్పొంగిన స్వరగంగాలహరుల్లో మెరిసిన అమృతమయమైన రీతిలో శ్రీహరిస్తుతి గావించడం కొందరికి మాత్రమే శ్రీశారదాంబా అనుగ్రహంగా అమరే వైభవం...

పాలలో నీళ్ళు కలపడానికి మరియు నీళ్ళలో పాలు కలపడానికి.....ఉండే భేదంలా....
సాహిత్యంలో సంగీతాన్ని రంగరించడానికి మరియు
సంగీతంలో సాహిత్యాన్ని మేళవించడానికి గల భేదమే ఆనాటి పాతతరం యొక్క ఘనమైన సుసాహితీప్రధానసంగీతరవళికి మరియు ఈనాటి సంగీతప్రధానసాహితీఒరవడికి గల
వైవిధ్యం....
అందుకే అనాటి విజ్ఞ్యులు రచించి అందించిన ఆపాతమధురగానరసగుళికలు, అంతగా సంగీతస్పర్శలేని సమాన్యుల జీవితాల్లో కూడా నిత్యనూతనస్మృతికావ్యములై ఈనాటికీ మారుమ్రోగుతున్నాయి....

అందుకే 6 శతాబ్దాల క్రితం నాటి ఆపాతమధురశ్రీవేంకటహరిగుణగానరసగుళికలైన శ్రీతాళ్ళపాక అన్నమార్యుల అమరరచనార్ణవం ఈనాటికీ శ్రీహరిభక్తుల హృదయాంతరాలను భగవద్ భక్తిజ్ఞ్యానవైరాగ్య విభూతిపరిమళాలతో అనునిత్యం దేవతామయం గావిస్తూ ఆలపించిన, ఆలకించిన వారెల్లరినీ తరింపజేస్తున్నది....

అట్టి అత్యంత మహిమాన్వితమైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శ్రీవేంకటముద్రాంకిత
సంగీతసాహిత్యరచనార్ణవంలో, వారి జీవితపర్యంతమూ కూడా అగ్రశ్రేణి స్వరరాగతపస్సును ఆచరించిన మేటి మహానుభావులుగా, అభినవ అన్నమార్యులుగా, వినుతికెక్కిన శ్రీగరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గురువుగారి జయంత్యుత్సవంలో పాల్గొని తరించడం, గోవిందుడి భక్తులెల్లరికీ లభించే సగౌరవసుస్వరరాగసంకీర్తనాసుధాసారాభిషేకోత్సవం...

అందునా "సంకీర్తన గోష్టి గానం" అంటే గోవిందుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కైంకర్యం కాబట్టి, ఈ విశిష్టమైన సంగీతసాహిత్యాలాపనాక్రతువులో పాల్గొనే విజ్ఞ్యుల్లెలరికీ విశేషమైన శ్రీశ్రీనివాసుడి అనుగ్రహలబ్ధి సమకూరి తరించడం ఎల్లరి సౌభాగ్య హేతువు....

శ్రీవేంకటహరిసంకీర్తనావైభవం గురించి తెలియాలంటే,
శ్రియఃపతి యొక్క అమేయ వాత్సల్యాన్ని వర్షించే వైనాన్ని వివరించే గౌణములతో, విభూతులతో, యతిప్రాసాలంకరణౌచిత్యంతో, సకలజనస్మరణయోగ్యమైన స్వరసాహిత్యలాలిత్యంతో రంగరించబడిన లలితపదముల లావణ్యభరిత సంకీర్తన ఒకటి ఆలపించినా, ఆలకించినా విదితమౌను...
అట్టి ఒక మహత్వభరిత సంకీర్తన క్రింద పేర్కొనబడింది...

ఇట్టి విశిష్టమైన శ్రీహరిసంకీర్తనారాధనాకైంకర్యంలో పాల్గొని తాము తరించి, శ్రోతలను, భక్తులను, శిష్యులను, ఆరాధకులను, తరింపజేస్తున్న నిర్వాహకబృందసభ్యులకు, గాయకగాయనీమణులకు, వాద్యసహకార నిలయవిద్వాంసులకు, వ్యాఖ్యాతలకు మరియు ఆహ్వానిత ప్రముఖ వక్తలకు, విజ్ఞ్యులకు, విద్వాంసులకు, కళాకారులకు, మాన్యులకు, ఇతర మహానుభావులందరికీ కూడా సవినయ సుహృద్భావకారకశుభాభినందనానమస్సుమాంజలి....

ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు...💐

***** ***** ***** ***** ***** ***** ***** *****

కలిగె మాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం ॥పల్లవి॥

అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతిశోభితం
అచలంబిదివో హరికీర్తనం ॥కలి॥

నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితం హరం భవదూరం
పరమ మంగళం భావాతీతం
కరివరదం నిజ కైంకర్యం ॥కలి॥

సులభం సుకరం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీవేంకటపతిశరణం
జలజోదరనిచ్చ స్తోత్రం ॥కలి॥

https://www.telugubharati.com/kIrtanalu/annamayya/kirtana.php?id=976

***** ***** ***** ***** ***** ***** ***** *****

ఓం నమో వేంకటేశాయ...💐



శ్రీ విశ్వావసు 2025 సౌమ్య వాసర ప్రయుక్త కార్తీక పౌర్ణమి / దేవదీపావళి, అత్యంత మహిమోపేతమైన అమేయపుణ్యకరమైన పరమపావనమైన పర్వసమయ, శుభాభినందనలు.... 💐🙂


ఆశ్వయుజ అమావాస్య మానవులకు దీపావళి / కార్తీక పౌర్ణమి దేవతలకు దీపావళి ఎందుకు అని అంటే, దేవతాసార్వభౌముడైన శ్రీమహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై మేల్కొని ఉండే సమయమే దేవతలకు పర్వసమయం కాబట్టి...
అనగా....
శ్రీలక్ష్మీనారాయణుడి క్రీగంటి చూపులతో సకల చరాచరభువనాల్లో వసించే ఆయా జీవరాశులు పుణ్యోద్దీపనతో పరిఢవిల్లే సమయమైన దేవోత్థాన ఏకాదశి తరువాత వచ్చే కార్తీక పౌర్ణమి నాటి దీపావాళి, మనకు మరియు ఎల్లరికీ కూడా దేవదీపావళి పర్వసమయం...

ఆ శ్రీలక్ష్మీనారాయణుడు ఎవరో కాదు, ఏ దేవతాసార్వభౌముడి కిరీటమైతే ఆ మణిద్వీపనివాసిని అయిన శ్రీలలితాపరాంబిక యొక్క శ్రీపాదమంజీరములను అలంకరిస్తూ అలదబడిన దేవలోకకస్తూరిసమ్మిళితలత్తుకకు సంబంధించిన అరుణారుణభాసతో తణుకులీనుతూ ఉండునో, అనగా ఏ సర్వలోకపరిపాలకసార్వభౌముడు అనునిత్యం మణిద్వీప మహాసామ్రాజ్ఞికి నమస్కరిస్తూ ఉండునో ఆ మహాపుణ్యతైజసికదేహధారుడు...

అందుకే "చంద్రమండలమధ్యగ" గా వర్ధిల్లే "విశ్వభ్రమణకారిణి",  "కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః" గా వాగ్దేవతలచే స్తుతింపబడుతోంది...
పూర్ణచంద్రబింబస్థితశ్రీచక్రరూపంలో కొలువై భులోకవాసులకు నిత్యం చంద్రామృతశక్తిని ఓషధీశక్తిగా వర్షిస్తూ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది...
ఆ చంద్రామృతకారకఓషధీశక్తిని మనోశక్తిగా భూలోక ఆవరణ మనుజులకు అనుగ్రహిస్తున్నది....

ఇట్టి శరత్చంద్రుడి / శరత్కాలపౌర్ణమిచండ్రుడి వైభవం అధ్యాత్మశాస్త్రరీత్యా కూడా ఎంతో ఘనమైనది ..

వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర 
అనే ఆరు ఋతువుల్లోనూ చంద్రుడు, పౌర్ణమి, వెన్నెల, ఉండును...
మీలో ఎవ్వరికైనా.....
శరత్చంద్ర, హేమచంద్ర అనే పేర్లతో ఫ్రెండ్స్ ఉన్నారేమో కాని....
వసంతచంద్ర, గ్రీష్మచంద్ర, వర్షచంద్ర, శిశిరచంద్ర అనే పేర్లతో ఫ్రెండ్స్ ఉండరు...
(నాకు శరత్చంద్ర, శరత్, వంశీచంద్ర, శరత్ విశ్వనాథ్, అనే ఫ్రెండ్స్ ఉన్నారు....)

అమృతంలాంటి గుడాన్నంలో / పరమాన్నంలో ఉప్పు, కారం, ఘాటు రుచులు ఉండవు....
పుళిహోరలో తీపి రుచి ఉండదు....
గుండా, రౌడి, రాక్షస వ్యక్తిత్వాలలో, మంచి, మానవత్వం ఉండవు...
అని అనడం ఎట్లాగో...
వసంత, గ్రీష్మ, వర్ష, శిశిర ఋతువుల్లో చంద్రుడికి విశేషమైన అమృతవర్షిణి శక్తి ఉండదు....
అని అనడం కూడా అట్లాంటిదే....
అందుకే కేవలం శరత్చంద్ర అనే పేర్లు లోకంలో ఎక్కువగా వినపడుతూ ఉంటాయ్....

కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవుడు అధిపతి...
ఆ ఆ అగ్నిదేవుడికి మరోరూపమైన కార్తికేయస్వామి వారి మాతాపితరులైన రుద్రుడికి / ముక్కంటికి, రుద్రాణికి, 3వ కన్ను అగ్నినేత్రం....

ఉత్తరాయణంలో భూమికి సూర్యశక్తిలభ్యత ఎక్కువ....
దక్షిణాయణంలో భూమికి సూర్యశక్తిలభ్యత తక్కువ....
అని అందరికీ తెలిసిందే....
అనగా అధ్యాత్మపరంగా దక్షిణాయణంలో సూర్యానుగ్రహలభ్యత కూడా తక్కువ...
అనగా పంచాంగబలం కూడా తక్కువ...
అందుకే దక్షిణాయణంలో ఎక్కువగా ముఖ్యమైన ఫంక్షన్లు ఉండవు...

సూర్యచంద్రమండలాలు ఇరు నేత్రమండలాలుగా గల శర్వునకు...
సూర్యచంద్రమండలాలు ఇరు కర్ణాభరణములుగా గల (తాటంకయుగళీభూతతపనోడుపమండల) శర్వాణికి, 
శర్వాణి సోదరుడైన శ్రీమన్నారాయణుడికి (చంద్రసహోదరి అయిన శ్రీలక్ష్మి పతికి) కూడా ఈ కార్తీక మాసం అత్యంతప్రీతికరమైన మాసం....

శ్రీచాగంటి సద్గురువుల శ్రీలలితాసహస్రనామావళి
ప్రవచనాల్లో ఆలకించినవారికి తెలిసినట్టుగా,
తపన మండలం అనగా సూర్యమండలం,
ఉడుప మండలం అనగా చంద్రమండలం.

మనలో ఉండే ఇడా పింగళ సుషుమ్నా నాడులు,
పరమేశ్వరుడి / పరమేశ్వరి యొక్క సూర్య చంద్ర అగ్ని మండలాలతో ఎవ్విధంగా యోగసమాధిలో అనుసంధానమౌతూ ఉంటాయో తెలియాలంటే మీరు, స్వయంగా శ్రీకార్తికేయస్వామివారే ప్రతిష్ఠించిన పంచారామక్షేత్రమైన, సామర్లకోటలోని శ్రీకుమారారామయోగక్షేత్రాన్ని దర్శించవలసి ఉంటుంది...
అక్కడ ధ్యానించి తెలుసుకోవలసి ఉంటుంది ..
(ఈ యోగక్షేత్రంలో ఒక దెగ్గర ఒక స్టార్ గేట్ కూడా ఉందనే విషయం చాలా తక్కువమందికి అనగా ఎక్కువగా ఈ యోగక్షేత్రాన్ని దర్శించే అధ్యాత్మ విజ్ఞ్యులకు మాత్రమే, తెలియును...)

సూర్యపరావర్తనశక్తికి ప్రతిరూపమే చంద్రశక్తి...
(అని సైన్స్ కూడా అంటుంది....)
అనగా అధ్యాత్మశాస్త్ర అనులోమవిలోమ సిద్ధాంతప్రకారంగా,
విశేషమైన చంద్రశక్తి / చంద్రానుగ్రహం ఉన్నచో అది
విశేషమైన అధ్యాత్మ సూర్యశక్తి / సూర్యానుగ్రహం కూడా కలిగించును ...

చంద్రుడు ఎంత చల్లనివాడో, సూర్యుడికి అభిముఖంగా ఉన్న చంద్రగ్రహభాగం అంతే వేడిగా ఉండును....
అగ్నికీలలు ఎగిసిపడేది కేవలం భానుమండలంలో మాత్రమే కాదు....127 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత గల చంద్రుడి ఉపరితలంపై 
/ చంద్రమండలంలో కూడా అని అంటే అది కొందరికి అతిశయంగా అనిపించవచ్చు....

కాబట్టి అగ్నిదేవుడికి చంద్రుడికి కూడా ఒకానొక అవినాభావ మైత్రి ఉన్నది...
కాబట్టి అధ్యాత్మ రీత్యా కూడా కృత్తికా నక్షత్రం యొక్క అగ్నితత్వంతో కూడి ప్రకాశించే కార్తీక మాస పౌర్ణమి చంద్రుడికి విశేషమైన సూర్యశక్తి, ఆత్మశక్తి ని అనుగ్రహించే విశేషముండును అని మన సనాతన మహర్షులు కనుగొన్నారు....

"దక్షిణాయణంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వొడుగులు, ఫంక్షన్లా...?
కార్తీక మాసం వచ్చిందా ఏంటి...?"
అని అనేది అందుకే....

అనగా " మహోన్నత్తమైన గహనమైన ముహూర్తశాస్త్రానికి సూర్యమండలశక్తి సమకూరే కార్తీకమాసం వచ్చిందా...". 
అని ఆ క్యాజువల్ డైలాగ్ యొక్క అర్ధం...

అంతటి మహిమాన్వితమైన కార్తీకమాస పౌర్ణమి పర్వసమయంలో విజ్ఞ్యులెల్లరూ విశేషమైన 365 వత్తుల దీపారాధనతో, విశేషమైన దేవతారాధనతో, తరించే ఉంటారు...
అనగా సంవత్సరంలోని అన్ని రోజుల్లోనూ దీపారాధన / దేవతరాధన చేసిన పుణ్యఫలం నాకు లభించుగాక...
అని శాస్త్రార్ధం.....

శ్రీభువనేశ్వరిదేవి (హ్రీం బీజాధినేత్రి) సహిత శ్రీద్వాదశజ్యోతిర్లింగేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీరమాసమేతశ్రీసత్యనారాయణస్వామివారి సామూహిక పంక్తివ్రతంలో (ఉదయం)
మరియు
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సహస్రదీపోత్సవంలో (సాయంత్రం) పాల్గొని తరించిన ఈనాటి కార్తీక పౌర్ణమి పర్వసమయంలో,  
అమేయపుణ్యదాయకదయామూర్తులైన,
నిర్గుణ, నిరాకార, పరమేశ్వరునకు / శ్రీకార్తీకత్రయంబకునకు...,
సగుణ, సాకార, పార్వతీసోదరునకు / శ్రీకార్తీకదామోదరునకు..
ప్రణమిల్లుతూ, శ్రేయోభిలాషులెల్లరికీ దేవదీపావళి శుభాభినందనలు.... 💐🙂

సత్త్వోత్తరైః సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన ।
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥

శ్రీ విశ్వావసు 2025 కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి / దేవోత్థాన ఏకాదశి, చిలుకు / క్షీరాబ్ధి / కైశిక ద్వాదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂


108 శ్రీవైష్ణవక్షేత్రాల్లో పుష్పమండపం గా విశేషమైన ఖ్యాతిని, మహిమ్నతను, వైభవాన్ని, గడించిన తిరుమల / శ్రీవేంకటాచల పుణ్యక్షేత్రంలో, ఇవ్వాళ్టి శ్రీకార్తీకశుద్ధద్వాదశి / శ్రీకైశికద్వాదశి నాడు, ఉదయభానుడి మయూఖస్పర్శ భూలోకానికి సోకని ఉషోదయపూర్వసంధ్యలో, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తిరువీధి ఉత్సవంలో (తిరుమల పంచబేర తిరువారాధనా సంప్రదాయ పరిభాషలో స్నపనబేరం గా ఆరాధనలు అందుకునే) శ్రీభూసమేతశ్రీఉగ్రశ్రీనివాస పరమాత్మ,
భక్తులకు ప్రసన్నుడై ఊరెరిగింపులో విహరించెదరు అని తిరుమల ఆలయాచారం తెలిసిన విజ్ఞ్యులకు విదితమే....

అమృతంకోసం దేవదానవులు వాసుకి యొక్క వాలమును, శిరస్సును అల్లెత్రాడుగా గావించి పట్టుకొని, మేరుగిరి పర్వతాన్ని కవ్వంగా గావించి సాగించిన క్షీరసాగరమథనంలో ఉద్భవించిన

0. హాలాహలం : శ్రీమహావిష్ణువు యొక్క ప్రార్ధనమేరకు పరమేశ్వరుడు స్వీకరించి నీలకంఠుడైనాడు.

ఆ తదుపరి దేవతల ప్రార్ధన మేరకు మహాకూర్మమై క్షీరసాగరానికి అడుగున కొలువై మేరుపర్వతం అనే కవ్వానికి స్థిరమైన ఆలంబనగా శ్రీమహాకూర్మావతారాన్ని దాల్చిన శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహంగా ఆవిర్భవించిన అనేక దైవిక వస్తువుల్లో....

1.కల్పవృక్షము : స్వర్గ లోక వాసులకు
2.కామధేనువు : బ్రహ్మగారిచే మహర్షులకు / వశిష్ఠ మహర్షివారికి
3.ఉఛ్చైశ్రవము : దేవేంద్రునకు
4.ఐరావతము : దేవేంద్రునకు
5.చంద్రుడు : పరమేశ్వరునకు
6.శ్రీలక్ష్మీదేవి : శ్రీమన్నారాయణుడికి
7.శ్రీధన్వంతరి భగవానుడు తెచ్చిన అమృతం మోహిని ద్వారా సురలకు..
చెంది వారెల్లరూ అనుగ్రహింపబడిరి...
అని పురాణవచనం....

క్షీరసాగరతనయగా శ్రీమహాలక్ష్మి ప్రభవించి ఆసమయంలో అక్కడున్న దేవదానవులందరినీ పరికించి, శంఖచక్రధారిగా మందస్మితుడై ఉన్న దేవతాసార్వభౌముడైన శ్రీమహావిష్ణువును వరించెను...
అక్కడున్న దేవతలందరూ కూడా క్షీరాబ్ధికన్యకను కడు రమ్యమైన స్తోత్రముతో (ఈ క్రింది సర్వదేవకృత శ్రీలక్ష్మీస్తోత్రం) స్తుతించి అనుగ్రహింపబడినారు....
https://vignanam.org/telugu/sarvadeva-kruta-sri-lakshmi-stotram.html
అనే ఇతిహాసా వృత్తాంతాన్ని శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్భాగవత ప్రవచనాలు ఆలకించిన విజ్ఞులకు విదితమే.....

ఎంతో విశేషమైన శ్రీలక్ష్మీఅనుగ్రహాన్ని వర్షించే ఈ శ్రీమద్భాగవతాఖ్యానంలో ఉన్న దేవతాతత్వాన్ని కొంత ఆలకిద్దాం...

హరిని ఆహ్వానించని ప్రయాస మొత్తం లోకకంటకమైన హాలాహలాన్ని తెచ్చిపెట్టింది...
హరి వచ్చి కొలువైన తదుపరి కొనసాగిన ప్రయాస అమృతంతో పాటుగా ఇతర మహిమాన్వితమైన సామాగ్రిని కూడా సమకూర్చిపెట్టింది....
అనగా, విష్ణు స్మరణ లేని జీవితంలో ఎంత ప్రయాస గావించినా పెద్దగా ఫలితం ఉండదు....
విష్ణు స్మరణతో సాగే జీవితంలో గావించే ప్రయాస, ఆపేక్షిత ఫలం తో పాటుగా ఇతర ఎన్నో మహిమాన్వితానుగ్రహాలను కూడా ప్రసాదించును....

హరిని ఆలంబనగా గావించి సాగించిన జీవిత ప్రయాసలో ప్రభవించే సర్వోన్నతమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ హరిని, అనగా హరిభక్తులను వరించును...

ఎందుకంటే హరిభక్తులున్న చోటే హరి కూడా ఉండేది...

నాహంవసామివైకుంఠే
నయోగిహృదయేరవౌ
యత్రమద్భక్తాఃమమగాయంతి
తత్రస్తిష్ఠ్యామ్యహం నారదా

అని కదా శ్రీహరి నారదమహర్షి వారికి సెలవిచ్చింది....

క్షీరసాగరతనయగా శ్రీమహాలక్ష్మి ప్రభవించి ఆసమయంలో అక్కడున్న దేవదానవులందరినీ పరికించి, శంఖచక్రధారిగా మందస్మితుడై ఉన్న దేవతాసార్వభౌముడైన శ్రీమహావిష్ణువును వరించెను...
అనగా
హరిభక్తిని ఆలంబనగా గావించి సాగే మన జీవితప్రయాసలో ప్రభవించే అనుగ్రహాలు ఇతరులు తీసుకున్నా,
కార్యసాఫల్యలక్ష్మి / సిద్ధలక్ష్మి మాత్రం హరిభక్తులనే వరించును....

ఎందుకంటే, శ్రీచాగంటి సద్గురువుల వివరణ మొత్తం విన్నవారికి తెలిసినట్టుగా...,
దేవదానవులు ఎంతో కష్టపడి సాధించుకున్న అమృతకలశం దేవేంద్రుడు తీసుకెళ్ళి స్వర్గలోకంలో అగ్నిదుర్గాన్ని సృజించి
(ఒక అడ్వాన్స్డ్ లేసర్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటి సిస్టం అనుకోండి...
అటువంటి సెక్యూరిటి సిస్టం మధ్యలో కొలువైన ఒక డైమండ్ ని ధూం మూవి లో హీరో హ్రిత్తీక్ రోషన్ తస్కరించడం చాల మందికి గుర్తుండే ఉంటుంది కద...)
అందులో మధ్యలో కొలువుతీర్చినా కూడా, గరుత్మంతులవారు వారి మాతృదాస్యవిముక్తికై కద్రువ కు ఆ అమృతకలశం ఇవ్వడానికి స్వర్గానికి చేరుకొని ఆ అగ్నిదుర్గాన్ని భేదించి,
దేవేంద్రుడి గర్వానికి సమాధానంగా, తన బంగారు ఈకను ఒకటి అక్కడ విదిల్చిన సంఘటన విదితమే....

ఆ సంఘటనతో అచ్చెరువొందిన, దేవేంద్రుడు, దేవతల శ్రేయస్సుకై, తద్వారా లోకాల శ్రేయస్సుకై, అమృతాన్ని అన్యులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు అని గరుత్మంతులవారిని ప్రార్ధించగా....,
శ్రీహరిని స్మరించి అనుమతిని తీసుకున్న గరుత్మంతులవారు ఇట్లు నుడివినారు....

"నా మాతృదాస్యవిముక్తికై స్వర్గలోకంలోని ఈ అమృతకుంభాన్ని నేను తీసుకొని వెళ్ళడం తథ్యం....
కాని, దేవకార్యనిమిత్తమై మీరు ప్రార్ధిస్తున్నారు కాబట్టి, నేను అలా ఈ అమృతకలశాన్ని కదృవకు ఇచ్చినట్టే ఇచ్చి, నా మాతృదాస్యాన్ని విముక్తిగావించిన మరుక్షణం మీరు
ఈ అమృతకలాశాన్ని సద్యోక్షణంలో గైకొని స్వర్గలోకానికి కొనిపోవుడి....అవ్విధముగా మన ఇరువురి సంకల్పాలు కూడా నెరవేరును...." అనే పరస్పర అంగీకార సమ్మతితో దివిజలోకంలోని అమృతకలశం / అమృతభాండం / అమృతకుంభం గరుత్మంతులవారు భువికి తీసుకొచ్చే సందర్భంలో ఆ గరుడవేగానికి తొటృపాటులో ఓ నాలుగు చుక్కలు రాలిన ప్రదేశాల్లో ఇప్పటికీ అమృతోత్సవాలుగా కుంభమేళా ఉత్సవాలు నిర్వహింపబడడం విజ్ఞ్యులకు విదితమే...

దేవేంద్రుడిచే మరలా స్వర్గలోకానికి తీసుకురాబడిన ఆ అమృతకుంభం కోసం దేవదానవులు కొట్లాడుకుంటూ ఉండగా, మరలా శ్రీహరి కల్పించుకొని లోకోత్తరమైనసౌందర్యంతో అందరినీ మోహింపజేసి, ఆ అమృతకలశాన్ని గైకొని గజగమనంతో ముందుకుసాగుతూ, కుడివైపు వరుసలో కూర్చున్న దేవతలకు అమృతాన్ని పోస్తూ, ఎడమవైపు వరుసలో కూర్చున్న దానవులకు అమృతంలా కనిపించే పానకం పోస్తూ ఉన్న సందర్భంలో, శ్రీహరియొక్క ఈ లీలను గమనించి దానవులవరుసలో నుండి మెల్లగా దేవతల వరుసలోకి స్వర్భాను అనే దానవుడు వచ్చి కూర్చోగా,
కామరూపాన్ని ధరించి మా ప్రక్కన వచ్చి కూర్చున్న ఈ దానవుడికి అమృతం పోయకు మోహినీ అని సైగలు చేసిన సూర్యచంద్రులను కోపంతో ఇప్పటికీ రాహుగ్రస్త, కేతుగ్రస్త సూర్యచంద్రగ్రహణాల రూపంలో అప్పుడప్పుడూ వారి క్రోధాన్ని రాహుకేతువులుగా, ఛాయాగ్రహలుగా రూపాంతరం చెందిన ఆ స్వర్భానుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు....
అమృతం తాగిన కారణంగా, శ్రీహరి సుదర్షనచక్రస్పర్శ కారణంగా, రాహుకేతువులు నవగ్రహాల్లో భాగమై విశ్వపరిపాలనలో వారికి నిర్దేశింపబడిన విహితకర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు...

చూడండి ఒక దానవుడి దేహభాగలైనా కూడా శ్రీహరి అనుగ్రహం కారణంగా......

జ్యోతిషశాస్త్రానుసారంగా....

[
ఓం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ....
గా నుతింపబడే రుద్రుడి నక్షత్రమైన ఆర్ద్ర...,

ఉగ్రంవీరం మహావిష్ణుం 
జ్వలంతం సర్వతోముఖం
నృసిమ్హంభీషణంభద్రం
మృత్యోర్మృత్యం నమామ్యహం
గా నుతింపబడే నారసిమ్హుడి నక్షత్రమైన స్వాతి..,

శతభిష : నక్షత్రాలకు అధిదేవతగా రాహువు..
]

[
శ్రీవాణీం హంసారూఢ వీణాపాణీం
సకలసారస్వతానుగ్రహసిద్ధిదాయినీం

గా స్తుతింపబడే శ్రీసరస్వతీదేవి నక్షత్రమైన మూలా,

అశ్విని, మఖ : నక్షత్రాలకు అధిదేవతగా కేతువు
]

కొలువై చతుర్దశభువనాలనూ ప్రభావింపజేయగల వైశ్వికమూర్తులుగా రాహుకేతువులు పేర్గాంచినారు....

శ్రీచాగంటి సద్గురువుల ఉవాచలో విన్నట్టుగా, నవగ్రహాలకు ఈశ్వరత్వం లేదు....ఈశ్వరుడు విహించే కర్తవ్యాన్ని పాటించడం వరకు మాత్రమే ఆయా నవగ్రహాల ప్రభావ పరిధి....

ఫర్ ఎగ్సాంపుల్,
"హే రాహు..... నా సదరు భక్తుడు నన్ను ఆరాధిస్తున్న కారణంగా,..వారికి నీయొక్క ఖగోళగ్రహరూప సంచారప్రభావం
కారణంగా కలిగే వారం పాటు జ్వరం, ఒక్కరోజు మాత్రమే ఉండుగాక..." అని ఈశ్వరుడు శాసిస్తే అది అట్లే అగును....

అట్టి దేవతాసార్వభౌముడైన శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, దేవోత్థాన ఏకాదశి, చిలుకు / క్షీరాబ్ధి / కైశిక ద్వాదశి పర్వసమయాల్లో గావించే జప,తప,దాన,ఆరాధనలు, మిక్కుటమైన పుణ్యాన్ని ప్రసాదించును అని ఆర్షవిజ్ఞ్యాన విజ్ఞ్యుల ఉవాచ....

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ ।
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 10 ॥


Sunday, November 2, 2025

శ్రీఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాల్లో గురుస్థానాన్ని వహించే దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదాంబాపీఠ ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారు, వారి విజయయాత్రలో భాగంగా, భాగ్యనగరానికి విచ్చేసిన శుభసమయంలో, మోతి నగర్ శ్రీశంకరమఠంలో వారి దర్శనానుగ్రహంతో, ఆశీస్సులతో,శ్రీఆదిశంకరాచార్యమందిరం మరియు శ్రీశారదాంబామందిరం యొక్క కుంభాభిషేక సందర్శనంతో తరించిన పర్వసమయ విశేషాలు....💐🙂

శ్రీఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాల్లో గురుస్థానాన్ని వహించే దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదాంబాపీఠ ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారు, వారి విజయయాత్రలో భాగంగా, భాగ్యనగరానికి విచ్చేసిన శుభసమయంలో, మోతి నగర్ శ్రీశంకరమఠంలో వారి దర్శనానుగ్రహంతో, ఆశీస్సులతో,
శ్రీఆదిశంకరాచార్యమందిరం మరియు శ్రీశారదాంబామందిరం యొక్క కుంభాభిషేక సందర్శనంతో తరించిన పర్వసమయ విశేషాలు....💐🙂

సదాశివసమారంభాం
వ్యాసశంకరమధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం
వందేగురుపరంపరాం

సదాశివుడితో ప్రారంభమై, శ్రీవేదవ్యాసులవారు, శ్రీఆదిశంకరాచార్యులవారు, మధ్యలో కొలువై ఉండగా,
వారి అనుగ్రహంగా మా యొక్క ఆచార్యులవరకు పరిఢవిల్లే శ్రీగురుపరంపరకు వందనములు... 
అనే ప్రాజ్ఞ్యుల నిత్య గురుప్రార్థనల్లో వచింపబడినట్టుగా,
మనం మాన్యులైన ఏ శ్రీగురుస్వరూపం యొక్క సన్నిధిలో కొలువై ఉన్నామో, ఆ గురువులను శ్రీశంకరాచార్యులకు ప్రతిరూపంగా భావిస్తూ ఆరాధించడంలోని ఆంతర్యమేమనగా....

అమేయమైన ప్రాచీన దైవిక సంపద అనేది,
(అధ్యాత్మశాస్త్రవిజ్ఞ్యానం మొదలుకొని అరుదైన అధ్యాత్మ ఆరాధనా సంపత్తి వరకు) పరంపరాగతంగా ఈ భారతదేశంలో పరిరక్షింపడుతూ, ప్రజలకు, భక్తులకు, విజ్ఞ్యులకు అభివృద్ధిని అనుగ్రహింపబడుతూ వస్తున్నది....

ఫర్ ఎగ్సాంపుల్, మనం శ్రీవేదవ్యాసమహర్షి వారి శ్రీమద్భాగవతం అనే పౌరాణికవాజ్ఞ్మయ వైభవాన్ని 
శ్రీచాగంటి సద్గురువుల నుండి వారి ప్రవచనాల ద్వారా అందుకొని తరిస్తున్నామంటే...
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ గారి శిష్యులైన శ్రీచాగంటి గారు శ్రీగురుస్వరూపులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...

ఫర్ ఎగ్సాంపుల్, 
మనం శ్రీఆదిశంకరాచర్యుల వారే స్వయంగా కైలాసం నుండి భూలోకానికి అనుగ్రహంగా అందించిన 
శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగం యొక్క అభిషేక తీర్థాన్ని సేవిస్తూ తరిస్తున్నప్పుడు,
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీభారతీతీర్థస్వామి వారి శిష్యులుగా కొలువైన శ్రీవిధుశేఖరభారతీస్వామి వారు శ్రీగురుస్వరూపులై, జగద్గురువులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...

నాడు శ్రీఆదిశంకరాచార్యులచే వ్యవస్థీకరింపబడి నేటి వరకు కొనసాగుతున్న శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాంబా పీఠాలంకృత శ్రీగురుపరంపర యొక్క వరుసక్రమం ఈ క్రింది అంతర్జాల పట్టికలో పేర్కొనబడి ఉన్నది...

https://www.sringeri.net/jagadgurus?fbclid=IwdGRjcANxgnljbGNrA3GCcGV4dG4DYWVtAjExAAEe5zab1EijeQqcb67tzO_5tmaNhFCEbi2Zv44w0ZvgpxbcWI5qMf6lY8ATJKU_aem_vHkiSbCtm785ihnAbhM0Cg

శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్ట వచనాల్లో "కలియుగంలో ఆధ్యాత్మికత" అనే అంశం గురించి ఆలకించి క్షుణ్ణమైన అవగాహనను కలిగిఉన్న వారికి తెలిసినట్టుగా...

కృతయుగం : 17280000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
త్రేతాయుగం : 8640000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
ద్వాపరయుగం : 12960000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
కలియుగం : 4320000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం

అనే నాలుగు యుగాల్లో విస్తరించి ఉండే మన అధ్యాత్మ విజ్ఞ్యానం అనేది, యుగలక్షణానికి అనుగుణంగా మారుతూ ఉండును....

కృతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక 
అస్తిత్వం నిత్య కఠోర తపస్సులో....
త్రేతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక 
అస్తిత్వం నిత్య యజ్ఞ్యయాగాది క్రతువుల్లో....
ద్వాపరయుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్యాగ్నిహోత్ర క్రతువుల్లో....
కలియుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్య భగవన్నామ స్మరణలో....
అని విజ్ఞ్యుల ఉవాచ...

ప్రభావాది 60 సంవత్సరముల చాంద్రమాన కాలచక్రం 1000 సార్లు పూర్తి అయినచో ఒక యుగం.
అటువంటి 72 యుగాల (72 × 60000 = 4320000) సంవత్సరాల)  నిడివి గల "మహాయుగం" / కాలప్రవాహ మేయం నిత్యం పునరావృతం అవుతూ ఉండును....

అలా ఇప్పటివరకు ఈ మహాయుగ కాలచక్ర ప్రయాణంలో ఎన్నెన్ని కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు సంభవించాయో ఆ పరమాత్మమకు మాత్రమే ఎరుక ...

ఇప్పుడు మనం ఉన్నది....,
శ్రీ శ్వేతవరాహకల్పంలోని వైవస్వతమన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలోని 5126 వ సంవత్సరంలో....

తిరుమల, శ్రీశైలం, అరుణాచలం, కాశి, ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి పూర్వీకుల తపోస్థలానవాళ్ళు ఉండడానికి గల కారణం ఈ నిరంతర మహాయుగచక్ర భ్రమణం....

ఇట్టి అమేయకాలచక్రంలో ప్రభవించే దేవతల గురించిన వివరాలు, దైవికాంశముల వర్ణనలు, ఆయా కాలంలో సంచరించిన గురుస్వరూపులకు మాత్రమే ఎరుకలో ఉండే అంశాలు.....
అవన్నీ కూడా సమీకరింపబడి, పరిష్కరింపబడి, క్రోడీకరింపబడి, భవిష్యద్ తరాలకు అనుగ్రహంగా అందివ్వబడి లోకం చల్లగా అభివృద్ధి చెందేదుకు కారణం నిర్హేతుకమైన శ్రీగురుకృప....

అట్టి శ్రీగురుకృపగా అందివచ్చే అనుగ్రహం ఆజన్మాంతర సౌభాగ్యమై వర్ధిల్లును....
అందుకే ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు స్థాపించి అధివసించిన శ్రీశంకరపీఠాల్లో ఎందరో మహానుభావులు ఆనాటి శ్రీఆదిశంకరజ్ఞ్యానదీప్తిని వారి అనుగ్రహంగా నేటికీ ఆస్తికసమాజవిజ్ఞ్యులకు అనుగ్రహిస్తూ లోకాన్ని, లోకుల్లో దైవత్వాన్ని, లోకంలో దేవతారాధనను, పరిరక్షిస్తూ పరిఢవిల్లుతున్నారు....

రమారమి 1200 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన,

రాజులు, రాజ్యాలు, పరిపాలకసంస్థానాలు, మాన్యాలు, ధనకనకవస్తువాహనాది భౌతిక సిరిసంపదలు, ఇతరత్రా ఏవి కూడా నేటి సమాజానికి అందుబాటులోలేవు....

కాని ఆనాడు శ్రీపార్వతీపరమేశ్వరుల అనుగ్రహంగా శ్రీకాలటిశంకరులకు అనుగ్రహింపబడిన శ్రీ చంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేకానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వ్యవస్థీకరించి అందించిన పంచాయతన ఆరాధనావ్యవస్థ యొక్క అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారి అనిర్వచనీయ తపఃశక్తితో సృజించిన ఉష్ణకుండముల అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారు దర్శించి రచించి అందించిన అసంఖ్యాక దేవిదేవతాశ్లోకసారస్వతానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది..

శ్రీగురుస్వరూపం సాక్షాత్తు సకలదేవతల సన్నిధిగా ఒప్పారును...
అందుకే దైవం మానుషరూపేన....
దైవం శ్రీగురురూపేన....
అని విజ్ఞ్యులు వచించేది.....

శ్రీతోటకాచార్యులు ఈ క్రిందివిధంగా వారి గురుదేవులను, శ్రీఆదిశంకరాచార్యులను స్తుతించడంలోని ఆంతర్యం శ్రీగురుస్వరూపం యొక్క సర్వేసర్వత్రా పరివ్యాప్తమై పరిఢవిల్లే అంతర్యామిత్వం...

"జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం"
తాత్పర్యము :
" ఈ జగత్తును రక్షించుటకు మీవంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో మీరు సూర్యదేవులవంటి వారు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము."

అందుకే...
ఈ కలియుగంలో శ్రీజగద్గురువులెల్లరూ వచించేది..

"మా నారాయణనామస్మరణానుగ్రహాన్ని మీ అందరికీ అందిస్తూ,

సర్వేషాం శాంతిర్భవతు...
సర్వేషాం స్వస్తిర్భవతు...
సర్వేషాం పూర్ణంభవతు...
సర్వేషాం మంగళంభవతు..."

శ్రీవిధుశేఖరభారతి స్వామివారు స్వయంగా నిర్వహించిన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేక వైభవం గురించి ఈశ్వరానుగ్రహంగా కొంత వివేచనగావిద్దాము...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీశైలవైభవం, శ్రీఉమామహేశ్వరవైభవం, ఇత్యాది ప్రవచనాలు భక్తిశ్రద్ధలతో ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా...
ఈశ్వరాభిషేకంలో పాల్గొని తరించడం ఎంత పుణ్యప్రదమో...,
ఈశ్వరాభిషేకాన్ని దర్శించడం కూడా అంతే పుణ్యప్రదం....

మీలో బి.టెక్ బడ్డీస్ కి స్పెక్ట్రం ఆల్-ఇన్-1 గురించి బాగా తెలిసిన అంశమే...
ఎంజినీరింగ్ ఫైనల్ / ఎక్స్టర్నల్ ఎగ్సాంస్ అనగానే, 
అన్ని సబ్జెక్ట్లకు సంబంధిన ముఖ్యమైన ప్రశ్నోత్తరమంజరి గా వర్ధిల్లుతూ,
స్పెక్ట్రం ఆల్-ఇన్-1 పుస్తకం దాదాపుగా అందరి విద్యార్ధుల చేతుల్లో దర్శనం ఇచ్చే ముఖ్యసాధనం.....

అచ్చం అదే విధంగా సకలదేవతానుగ్రహసముపార్జనకు ఆల్-ఇన్-1 లాంటి సాధనం శ్రీరుద్రాభిషేకం....
శ్రీసరస్వతీ అనుగ్రహం...
శ్రీలక్ష్మీ అనుగ్రహం....
శ్రీగౌరి అనుగ్రహం...
ఏకకాలంలో భక్తులకు లభింపజేసి తరింపజేసే సాధనం శ్రీరుద్రాభిషేకం....

భగవంతుడికి నివేదింపబడిన గుడాన్నం ఎంత మధురంగా ఉంటుందో తెలియాలంటే, ఆ పరమాన్నప్రసాదం స్వీకరించిన వారికి తెలియును...
అట్లే....
ఈశ్వరునకు గావించే శ్రీరుద్రాభిషేకం ఎంత మధురానుగ్రహంగా ఉంటుందో తెలియాలంటే, ఆ రుద్రాభిషేకంలో పాల్గొనే వారికి తెలియును...
అని అనవలసి ఉంటుంది...

కృత్తికా నక్షత్రాధిపతి అగ్నిదేవుడైన కారణంగా,
ఈ కార్తీక మాసం మొత్తం అగ్నిదేవుని అధీనమై ఉండే కారణంగా, 
సాక్షాత్తు పరమశివుడికే ప్రణవోపదేశరహస్యాలను బోధించిన 
శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారికి ప్రతిరూపంగా దేవతారాధనలో కొలువై ఉండే అగ్ని సాక్షాత్తు శ్రీకార్తికేయ స్వరూపమైన కారణంగా,
ఈ కార్తీక మాసంలో నిర్వహింపబడే
శ్రీరుద్రాభిషేకం యొక్క వైభవం ఎనలేనిది అని అనాదిగా మన ఆర్షవిజ్ఞ్యానకోవిదుల ఉవాచ....

శ్రీరుద్రాభిషేకంతో శివలింగం చల్లగా ఉండడం, తన్మూలంగా భక్తుల మనసు మరియు మన చుట్టూ ఉండే ప్రపంచం చల్లగా వర్ధిల్లడంలోని ఆంతర్యం,

"మయస్కరాయచ" అని పరమశివుణ్ణి శ్రీగురుస్వరూపంగా శ్రీరుద్రవైభవం స్తుతించడంలోని ఆంతర్యం...

"శివా విశ్వాః భేషజీ..."
"శివా రుద్రస్య భేషజీ..."
అని శ్రీరుద్రవైభవం శివశక్తిని స్తుతించడంలోని ఆంతర్యం...,

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకలో ఉన్న వైభవమే...

ఈ పరమపావనమైన పుణ్యదాయక కార్తీక మాసంలో,
అట్టి మూర్తీభవించిన శివస్వరూపులైన శ్రీ విధుశేఖరభారతీ జదగ్గురువుల దర్శనానుగ్రహం మరియు అనుగ్రహభాషణం, సనాతనధర్మదీప్తిని, ఆర్షవిజ్ఞ్యానవైభవాన్ని బహుశోభాయమానంగా ధర్మప్రచారసేవగా సమాజానికి అందించే విజ్ఞ్యుల్లో ఒకరైన శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి దర్శనం, అనుగ్రహాశీస్సులు లభించడం ఈశ్వరానుగ్రహంగా సమకూరిన వైభవం...

రాతిలింగం మొదలుకొని రౌప్యలింగం, హిరణ్యలింగం, వజ్రలింగం, వరకు ఎన్నో ప్రాకృతిక పదార్ధాలతో వర్ధిలే శివలింగాలు ఉన్నా...,
స్వచ్ఛమైన స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....
సప్తవర్ణవినిర్ముక్త సర్వోన్నత సాత్విక సద్వస్తువైన
అట్టి స్ఫటికశివలింగం సాక్షాత్తు పరమశివుడే లోకానికి అనుగ్రహంగా ప్రసాదించగా, అట్టి శ్రీచంద్రమౌళీశ్వర స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....

అగ్రశ్రేణి శృంగేరి పండితవర్యుల ముక్తకంఠాలాపనలో సాగిన
శ్రీరుద్రనమకచమకపఠనం, శ్రీసూక్తపురుషసూక్తదుర్గాసూక్తమంత్రపుష్పాది వేదఘోషను శ్రవణానందకరంగా ఆలకిస్తూ....,
శ్రీవిధుశేఖరభారతీ జగద్గురువులచే, 2025 శ్రీ విశ్వావసు కార్తీక శుద్ధ నవమి ప్రయుక్త భృగువాసర చంద్రోదయ సమయంలో, భక్తులందరి సమక్షంలో నిర్వహింపబడిన అత్యంత అపురూపమైన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగాభిషేకాన్ని దర్శించి తరించిన ఈనాటి మధురఘట్టం ఆజన్మాంతర సుకృతం...!
జన్మజన్మలకు వర్ధిల్లే సౌభాగ్యం.....!!

సర్వం శ్రీఆదిశంకర స్వరూప శ్రీభారతీతీర్థ జగద్గురువరేణ్య 
కరకమలసంజాత శ్రీవిధుశేఖరభారతి జగద్గురువరేణ్య ఆరాధిత శ్రీశారదాంబాశ్రీచరణారవిందార్పణమస్తు...
💐🙏🙂

చంద్రచూడాలంకృతచారుహాసచంద్రికాం
సకలసారససుజ్ఞ్యానచంద్రామృతవర్షిణీం
తుంగాతీరశ్రీఋష్యశృంగతపోస్థలవాసినీం
వందేవాణీస్వరూపశ్రీశారదాంసర్వజ్ఞ్యానదాం


శ్రీకరమైన 2025 విశ్వావసు కార్తీకమాస పర్వసమయ శుభాభినందనలు...🙂💐


కార్తీకమాసేకృతంపుణ్యం సహస్రగంగాస్నానఫలదం
కార్తీకదామోదరప్రీతికరం కార్తీకత్రయంబకతోషకరం

అని ఆర్యోక్తి....

అనగా..

కార్తీక మాసంలో గావించే పుణ్యం....
సహస్ర (అనంతం అని అర్ధం) గంగాస్నాన ఫలితాన్ని ఒనరించునని అర్ధం...
కార్తీకమాస పుణ్యకార్యం ఒనరించే పుణ్యఫలం
కార్తీక దామోదరునకు ప్రీతికరం మరియు కార్తీక త్రయంబకునకు ఆనందకరం.....
అని వాక్యార్ధం....

ఈ లోకంలోని ప్రతీ విజ్ఞ్యులకు కూడా ఏదో ఒక సద్గుణం, ఏదో ఒక విభూతి, ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక కళానైపుణ్యం, ఉండడం ఈశ్వరానుగ్రహం....

అట్టి ఈశ్వరప్రసాదిత
సద్గుణం, విభూతి, ప్రత్యేకత, వ్యాపకం, కళానైపుణ్యం,
ఈశ్వరసేవలో వినియోగింపబడి విశేషమైన పుణ్యార్జనతో తరించగలగడం కూడా ఈశ్వరానుగ్రహమే...

శ్రీ చాగంటి సద్గురువుల వంటి అగ్రశ్రేణిపుణ్యాత్ములచే, వాగధీశ్వరి గా వారి రసనపై ఆ పరేశ్వరి నిలిచి ప్రవచింపజేసిన 
అనంతమైన పౌరాణికవాజ్ఞ్మయార్ణవలహరుల్లో విహరిస్తూ
గంగాస్నానపుణ్యదాయకమైన వారి సద్వాక్కులను భక్తిశ్రద్ధలతో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా.....,

"కురుపుణ్యం అహోరాత్రం....." అని శాస్త్ర ఉవాచ....

ఎందుకంటే, సంచితం నుండి మోసుకొచ్చిన ప్రారబ్ధంలోని పాపపుణ్యాల సమ్మిళిత సమాహారంగా ఎల్లరి జీవితం నిత్య సూర్యోదయసూర్యాస్తమయాలతో పాటుగా గడిచిపోతూ ఉన్నది....

ఇట్టి చిరంతన జీవితకాలప్రవాహంలో పాపం అనేది మనకు తెలియని కారణంగా, మన వశంలో మనం లేని  
కారణంగా, మన రజోగుణ ఉద్ధతి / విస్ఫోటనం
కారణంగా, పోగౌతూ ఉండును....
పుణ్యం మాత్రం మన ప్రయత్నపూర్వక సత్త్వగుణ సాంద్రత / నడవడి కారణంగా, పరిశ్రమతో మాత్రమే 
సమకూరును.....

ఫర్ ఎగ్సాంపుల్ మీరు గమనించండి....

ఒకరేమో....
"అసలే కార్తీక మాసం...అలా ఆలయానికి వెళ్ళి.... లేక ఇంట్లో తులసి మొక్క సన్నిధిలో అయినా దీపారాధన గావించి....,దేవుడా మంచి ఆరోగ్యాన్ని, విద్యాబుద్ధులను, ఐశ్వర్యాన్ని, శ్రేయస్కర సంపత్తును, నిరంతర భగవద్భక్తిని, జీవితకార్యాచరణబాటలో విజయాన్ని అనుగ్రహించు స్వామి....."
అని ప్రార్ధించి పుణ్యాన్ని గడించి తరిస్తున్నారు.....

మరొకరేమో...
"ఊరవరాహంలా తిని ఊరిమీదపడితిరగడానికి ఏమాసం అయితే ఏముందిలే..." అని అనుకుంటూ..
అలా రోడ్డుమీదకి వెళ్ళి.... 
ఏదో ఒక చెత్తను కొనుక్కొని నమిలి ఊసి
రోడ్లను ఎరుపెక్కించి...హమ్మో అప్పుడే మధ్యాహ్నమయ్యిందా అని బాగా తిని కాసేపు నిద్రించి....లేచి...హమ్మో అప్పుడే సాయంత్రమయ్యిందా.....అని మళ్ళీ రోడ్లెక్కి అదే పనిగా రొడ్లకు రంగును, వారి కర్మసంచితానికి పాపాన్ని రంగరిస్తూ, రాత్రి అవ్వగానే మళ్ళీ బాగా తిని కనీసం ఒక్కసారైనా శివనామస్మరణ అయినా చేయకుండా
నిద్రించడం.....
తెలవారగానే.....హుం మళ్ళీ తెల్లారిందా...అని అనుకుంటూ కనీసం ఒక్కసారైనా శ్రీహరి అని కూడా స్మరించకుండా మేల్కొని.....
జీవితం షరామామూలే కదా అని అనుకుంటూ రోడ్లమీద తిరుగుతూ...
తెల్లారిపోతున్న వారి బ్రతుకుబండి దౌర్బల్యానికి వారి చుట్టూ ఉండే వారిపై అనవసరంగా కసురుతూ, మరో పూట, మరో రోజు, మరో వారం, మరో నెల, మరో సంవత్సరం, అని అనుకుంటూ ఏ పుణ్యకార్యమూ చేయకుండా పతనమై పోతుంటారు...

ఈ రెండురకాల వ్యక్తిత్వాలకు భేదం ఎక్కడో తెలుసా....?

వారివారి మనసుకి పట్టిన జాఢ్యం అనేది
క్రమక్రమంగా వారి జీవితానికి పట్టిన అలక్ష్మి గా రూపాంతరం చెంది, ఈశ్వరస్మరణ పట్ల విస్మరణ, విహితకర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, పుణ్యకర్మాచరణ పట్ల అలసత్వం...
వెరసి వారి జీవితం ఒక నూతిలో జన్మించి, నూతిలోనే బ్రతికి, నూతిలోనే తెల్లారిపోయే మండూక (కప్ప) జన్మలా వారి జీవితం వారికి వచ్చే జన్మలో ఊరికే బెకబెక అరిచే కప్ప లా జన్మించేందుకు కావలసిన కర్మను కూడబెడుతున్నది అని అర్ధం......

ఎట్టి వస్తువులనైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్నిది....
ఎట్టి జాఢ్యాన్నైనా, పాపాన్నైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్ని అధిదేవతగా ఉండే కార్తీక మాసానిది...
(కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని...కాబట్టి కార్తీకమాసం మొత్తం అగ్నిదేవుడి అధీనమై వర్ధిల్లే పరమపావనసమయం...)

అందుకే మీరు గమనించి ఉండి ఉంటే...
"ఏంటి...మొత్తం కార్తీక మాసంలో ఒక్కసారైనా దీపం వెలిగించలేదా..... ఓరినీ బత్కు***.."
అనే నిష్టూర వాక్యాలు పాతకాలం నాటి పెద్దలు అనే వారు.....
అంటే కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాధాన్యమో అనేది మన పాత తరం పెద్దలు అలా ఏవో క్యాజువల్ మాటల్లో కూడా చెప్పారన్నమాట....

బాహ్యంలో రాత్రులు అత్యంత చీకటితో ఉండే మాసం కార్తీక మాసం.....
గాలిలో చలి తీవ్రత పెరగడంతో, శరీరాంతర్గత నాడివ్యవస్థ ఇబ్బందులు పడే మాసం ఈ కార్తీక మాసం....

దీపారాధన సాధారణంగా నువ్వులనూనే, లేక ఆవునెయ్యి తో గావిస్తారు.....
తిలల (నువ్వులు) నుండి సంగ్రహమైన తైలం (నువ్వులనూనే),
గంగిగోవు క్షీరము తప్తమవ్వగా లభించే నవనీతం / దధిమథనం నుండి సంగ్రహింపబడిన నవనీతం, తప్తమవ్వగా లభించే స్వచ్ఛమైన శుభ్రమైన గోఘృతం (ఆవునెయ్యి)..,
అధ్యాత్మపరంగా దీపారాధనకు శ్రేష్ఠమైన ఇంధనం అని శాస్త్ర ఉవాచ....

నువ్వులనూనేతో మసాజ్ చేసుకునేవారికి దేహదారుఢ్యం,
ఆవునెయ్యితో భోజనం ఆభిగారం చేసుకొనే వారికి మేధోదారుఢ్యం,
చాలా విశేషంగా ఉండునని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ....
అందుకే విజయనగరమహాసామ్రాజ్య వైభవానికి మకుటాయమానమైన కీర్తితో వర్ధిల్లిన ప్రజారంజకపరిపాలకులు,
శ్రీకృష్ణదేవరాయలవారికి బుద్ధిబలం మరియు కండబలం అమితంగా ఉండేవని ఆనాటి పెద్దల మాట....

ఆయుర్వృద్ధిని అనుగ్రహించే ఆయుర్వేదశాస్త్ర వైభవాన్ని నమ్మినవారు మరియు శ్రీహరి దాసులు ఏ పురాణాల్లో ఎంత వెదికినా చెడరెన్నడును.....

నువ్వులనూనెలో ఉండే ఆరోగ్యకరమైన లిగ్నన్స్ మరియు టొకొఫెరాల్స్ అనే ధాతువులు దీపారాధన ద్వారా డైరెక్ట్ గా ఆ ఆరాధకుడి నాడివ్యవస్థ పై ప్రసరించి సద్యోఆరోగ్యకారకశక్తిని కలిగించును....అని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ...

నువ్వుల నూనే గురించి గూగుల్ చేసి ఈ క్రింది సమాచారాన్ని ఎవ్వరైనా చదవచ్చు...

***********************************************

Lignans: A group of compounds that includes SESAMIN, SESAMOLIN, AND SESAMOL.
Tocopherols: A form of Vitamin E, with gamma-tocopherol being the most abundant.

Sesamin, sesamolin, and sesamol benefit heart health by reducing cholesterol and blood pressure, and by combating inflammation and oxidative stress, which are major factors in cardiovascular disease. These compounds can help regulate lipid metabolism, prevent the buildup of arterial plaque, and improve overall heart function. 

***********************************************

శరీరానికి కాల్షియం ని గ్రాహ్య పరిచి దృఢత్వాన్ని ప్రసాదించే శక్తి నువ్వులనూనేతో కావించే దీపారాధనకు ఉన్నది అని సైన్స్ కూడా నిర్ధారించింది....

ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా శరీరాంతర్గత జవసత్త్వాలను మెరుగుపరిచే శక్తి, వేయించిన నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసే లడ్లకు ఉన్నదనే సత్యం ఎల్లరికీ తెలిసిందే...
(మితంగా మాత్రమే స్వీకరించవలెను సుమా..లేనిచో అతిఉష్ణత్వం కలుగును)

కార్తీక త్రయంబక దేవతాభ్యో నమః, కార్తీక దామోదర దేవతాభ్యో నమః, అని ప్రత్యేకంగా శివకేశవ నామాలను ఈ కార్తీకమాసంలో ఆరాధించడంలో గల ఆంతర్యమేమి అని తెలుసుకోవాలంటే....,

అసలు దామోదరుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?
త్రయంబకుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?

అనే అధ్యాత్మవిజ్ఞ్యానాంశాలను శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతాంతర్గత శ్రీకృష్ణలీలామృత ప్రవచనాల్లో
దామోదరలీల / ఉలూకలబంధనం....,
శ్రీఉమామహేశ్వరవైభవం ప్రవచనాల్లో 'త్రయంబకాయ', 'త్రయంబకేదేవి' అనే అధ్యాత్మ అంశాలను శ్రద్ధగా ఆలకించిన వారికి విదితమౌను...

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ...

"వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం"
అనగా
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మువ్వురు దేవతా తత్త్వాలు 3 నేత్రాలుగా గల ఓ ముక్కంటి, ఓ ముకుంద ప్రియా నీకు వందనం...

శ్రీమహావిష్ణుస్వరూపంగా ఆరాధింపబడే ఉశిరిచెట్టు అమేయమైన మహిమోపేతవైభవంతో అలరారే ఔషధీఅమృత ఫలాలైన ఉశిరికాయలను అనుగ్రహించడం ప్రారంభమయ్యే మాసం కూడా కార్తీకమాసమే....

కమ్మని చింతపండురసం / పచ్చిపులుసు లో 
జిలకర, ఆవాలు, ఎండుమిరప, కలగలిపి ఘుమఘుమలాడే పోపుపెట్టడం ఎట్లాగో....,
ఈ కార్తీక మాస ఆరాధనల్లో,

ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి 
పుత్రాందేహి మహాప్రాజ్ఞ్యే యశోదేహి బలంచమే
మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిర్రోగం కురుమామ్నిత్యం నిష్పాపం కురు సర్వదా

అనే శ్లోకంతో ఉసిరిచెట్టుకి ప్రార్ధనా నమస్కారం గావించడం..
మరియు

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః,
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః,
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః || 

అనే శ్లోకంతో కార్తీక దీపానికి ప్రార్ధనా నమస్కారం గావించడం

కూడా అట్లే అమోఘమైన ఫలితాలను ఒనరించును అని సద్గురువాక్కులను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకే కదా..

ఇక కార్తీకమాసంలో నదీతీర్థస్నానం కూడా గొప్ప పుణ్యాన్ని అనుగ్రహించే క్రతువు....
ఎందుకంటే......

"హే అగ్ని దేవా...
నీవు సర్వకాలసర్వావస్థల్లోనూ పరమపవిత్రుడవై వర్ధిల్లెదవు...
నీలో తప్తమవ్వని తత్త్వముండజాలదు....
దేవతలకు స్వాహాకారంతో ,
పితృదేవతలకు స్వధాకారంతో,
నీద్వారా సమర్పింపబడే హవ్యకవ్యములు ఈ లోకానికి నిత్యశ్రేయస్సును ఒనరిస్తూ ఉండును....
నిత్యం అగ్ని ఆరాధన గావించే విజ్ఞ్యులు పరమపవిత్రమైన అగ్నిహోత్రులుగా వర్ధిల్లెదరు.....
వారి రసనపై వాగ్దేవతలు కొలువై ఉందురు....అస్తు....."
అని అగ్నిదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

మరియు....

"హే క్షీరసాగరోద్భవ చంద్రదేవ...
మా శిరోభూషణంగా మిమ్మల్ని / మీ యొక్క శుక్లపక్ష తృతీయ చంద్రరేఖను అలంకరించుకొని మేము చంద్రశేఖరుడిగా,
చంద్రమౌళీశ్వరుడిగా వర్ధిల్లెదము....
శుద్ధ ప్రతిపత్ మొదలు శుద్ధ చతుర్దశి పర్యంతం ప్రవర్ధమానమౌతూ పౌర్ణమి నాడు షోడశకళలతో వర్ధిల్లే మిమ్మల్ని ఆరాధించినవారికి, శ్రీచక్రనవావరణదేవతానుగ్రహం లభించి తరించెదరు....
పౌర్ణమిచంద్రుణ్ణి పార్వతీపరమేశ్వరుల సమ్మిళిత పరిపూర్ణశోడషకళాత్మక స్వరూపంగా ఆరాధించే విజ్ఞ్యులకు సకల సిద్ధౌషధీతత్త్వము అనుగ్రహింపబడును....
యజ్ఞ్యవేదిలో సమర్పింపబడే సోమరసం యొక్క అనుగ్రహఫలమే అట్టి భక్తుల కరకమలకృత అగ్నిక్రతువు
యొక్క అనుగ్రహఫలంగా ఒప్పారును...అస్తు...."

అని చంద్రదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడిగా అలరారుతూ,
కార్తీక పౌర్ణమి కి కారకమై ఉండే కృత్తికా నక్షత్రాధిదేవతగా అగ్నిదేవుడు అలరారుతూ,
ఉండే కార్తీక పౌర్ణమి తిధి నాడు పరమేశ్వర జటాజూటంలో బంధింపబడిన గంగాదేవికి ఎంతటి మాహాత్మ్యం అమరునో కదా....!

ఈ భరతభూమిపై ప్రవహించే అన్ని నదులకూ కూడా గంగ యొక్క శక్తి అంతర్వాహినియై లభ్యమౌతూ ఉన్న కారణంగా, కార్తీక మాసంలో నదీ తీర్థ స్నానం గొప్ప పుణ్యఫలదాయక
అధ్యాత్మకృతువుగా భాసిల్లుచున్నది.....

చంద్రసహోదరిగా శ్రీమహలక్ష్మి
గంగాజనకుడిగా శ్రీమహవిష్ణువు
గంగాధరుడిగా, సోమేశ్వరుడిగా
శ్రీకంఠుడు, చంద్రమౌళీశ్వరుడు
ఆరాధింపబడుచున్న కారణంగా 
హరిహరప్రీతికరమైన ఈ కార్తీకమాసమాహాత్మ్యం అమరులుకొనియాడే అమేయపుణ్యార్ణవం....

కలియుగ ప్రత్యక్ష పరమాత్మ,
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో,
వారివారి భక్తిశక్తియుక్తికొలది, భక్తులెల్లరూ ఈ పరమపావనమైన కార్తీక మాసంలో విశేషమైన భగవదారాధనతో, 
విశిష్ఠమైన పుణ్యసంచయంతో, తరించెదరని ఆకాంక్షిస్తూ,
కార్తీక మాస మొదటి సోమవార పర్వసమయ శుభాభినందనలు...💐🙂

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్యైర్ మహోభి రభూత మహేంద్ర నీలౌ !
ఉద్యాన్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే !!

సర్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వరీ సమేత శ్రీరాజరాజేశ్వర సన్నిధి స్థిత శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏