Thursday, February 14, 2019

Happy Valentine's day to my dear Govinda... :)

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం దెగ్గరగా నా ప్యాషన్ ప్లస్ బండి ఆపి కాళ్ళుకడుక్కొని గుడిలోకి వెళ్ళిన, 2009 వ సంవత్సరంలోని ఒక సాయంత్రం అది....
శుక్రవారము కావడంతో ఆఫీస్ నుండి కొంచెం త్వరగా బయల్దేరాను ఆరోజు...
ఇద్దరు ఆచార్యులు శృతిసుభగంగా ఆలపిస్తున్న శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం వినపడగా, 'ఇక్కడ వేంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందా....జగద్గిరిగుట్టపై ఉన్న గుడి మాత్రమే తెలుసే మనకు....వి.వి.నగర్ వైపుగా ఎన్ని సార్లో వచ్చుంటాను...కాని అసల్ ఇక్కడ గుడి ఉన్న సంగతే తెలియదే...' అనుకుంటూ మెల్లగా ధ్వజస్తంభంవైపుగా కదిలిన ఆక్షణంలో నాకు తెలియదు, నా భావి జీవితానికి ఇక ఆ శ్రీనివాసుడే భవ్యమైన తోడూనీడై నన్ను కంటికిరెప్పల్లే కాచుకునే పరదైవమై నా సర్వస్వమైపోతాడని.....
ఎంతో తీవ్రమైన ఈతిబాధలతో సతమతమవుతూ భారమైనమనసుతో బ్రతుకీడుస్తున్న ఆనాటి నా జీవితానికి శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు తప్ప మరేతోడులేని రోజులవి...నిరుడు 2008-జూన్ లో కొత్తకొత్తగా ఉద్యోగజీవితం ప్రారంభించి అప్పటికి సంవత్సరం అయ్యింది... 1990 నుండి 13 సంవత్సరాలు పాటు ఉన్నంతలో తిని ప్రశాంతంగా బ్రతికిన కుటుంబం, నిత్యనరకంలా మారి కుటుంబమే విచ్ఛిన్నమైపోయెంతగా కాలం కాటేసిన రోజులవి....ఎదలోని బాధను ఒక బూటకపు చిరునవ్వు మాటున అదిమిపెట్టి, అటు ఒక బహుళజాతీయసంస్థలోని బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగపరంగా/ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడానికి కష్టిస్తూ, ఇటు కుటుంబపరంగా లోపించిన శాంతిని పునః స్థాపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ నా జీవితం మొత్తం ఒక అసిధారావ్రతమే అయిన సమయమది.... విధి బలీయమైనది అని సరిపెట్టుకొని అలానే బాధపడుతూ ఉండడమా, లేక కష్టనివారణోపాయం దిశగా కష్టించడమా అనే డోలాయమానమైన సందిగ్ధస్థితిలో, అస్మద్ గురుదేవుల ' శ్రీమద్రామాయణం ' ప్రవచనం నాకు అడుగడుగునా నేస్తమై నిలిచింది....తోడుగా ఆ శ్రీవేంకటరాముడి సన్నిధి కూడా లభించింది.... భగవద్గీత మొత్తం చెప్పిన భగవానుడే
'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకంశరణంవ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిశ్యామిమాశుచః....'
అనే గీతాశ్లోకాన్ని ఆధారంగాచేస్కొని త్రికరణశుద్దిగా స్వామిని సేవిస్తూ భారమంతా శ్రీనివాసుడిదే అని సర్వస్యశరణాగతి కావించి జీవిస్తున్నరోజులవి....
మా ఇంటిముందు 2003 వ సంవత్సరంలో నాటిన చిన్న నందివర్ధన మొక్క (తెల్ల చక్రం పూలు), ఎర్ర గన్నేరు మొక్కలు, ఏపుగా పెరిగి బాగా పూలుపూయడంతో ప్రతిశనివారం స్వామికి వాటితో పుష్పకైంకర్యం చేయడం పరిపాటిగా అయ్యింది... శనివారం సెలవు కాబట్టి పొద్దున్నే నిత్యపూజ అవ్వగానే, భక్తి శ్రద్ధలతో మా కంపౌండ్ గోడ పైకెక్కి పెద్ద పెద్ద కవర్లు / సంచుల నిండా ఆ పూలన్ని కోసి, రమారమి సాయంత్రం 5 అయ్యేసరికి తోమాల తయారయ్యేలా చూస్కునే వాడిని... ఇక సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లోదీపారాధన చేసి ఫ్రిజ్లో పెట్టిన ఆ పెద్ద పూమాల జాగ్రత్తగా తీస్కొని గుడికి వెళ్ళి ఆనంద్ ఆచార్యులు గారికి ఇచ్చి గోత్రనామాలు చెప్పడం పరిపాటి.... "వచ్చావా పాండవగోత్రం బాబు..తెచ్చావా శ్రీనివాసునికి నీ తెల్లటి తోమాల... ఈసారి కొంచెం పెద్దగానే కట్టావే....." అని వారు నన్ను మందస్మితులై పలకరించి స్వామికి ఆ మాల అలంకరించేవారు..... ముట్టుకుంటె మాసిపోయే పాలవంటి తెలుపుతో, స్వామి నీలతిరుమేనికి ధవళకాంతులను అలదుతున్నదా అన్నట్టుగా ఆ మాల స్వామిని అలంకరించగానే నాలో ఎన్నెన్నో భావరాగలహరులు ఉప్పొంగి, స్వామి సోయగాన్ని చూస్తు నాలోనేనే మైమరచి తేలిపోయేవాన్ని...!
మాలకట్టడంలోని అలసటంతా అది ధరించిన స్వామిని చూడగానే మటుమాయమయ్యేది...! ఒక్కోవారం ఒక్కోవిధంగా స్పెషల్ గా మాల ఉండాలని, మధ్య మధ్యలో ఎర్రగన్నేరు, పింక్ కలర్ గన్నేరు, మా గల్లి చివర్లో ఉండే సురేష్ వాళ్ళింటి ముందుండే సంపంగి చెట్టు పూలు, అప్పుడప్పుడు మర్కెట్ నుండి కొనితెచ్చే వివిధ కలర్ చామంతులు, ఇలా వీటితో మాలకు మధ్యమధ్యలో మెరుగులు కూర్చినట్టుగా ఉండేలా చూసేవాడిని....
తెల్లటి నందివర్ధనాల మధ్య మధ్యలో ఎర్రటి గన్నేరు పూల వరుస, స్వామికి వజ్రాల విరిదండలోని కెంపుల లాగా....
తెల్లటి నందివర్ధనాల మధ్య మధ్యలో పింక్ కలర్ గన్నేరు పూల వరుస, స్వామికి వజ్రాల విరిదండలోని పద్మరాగముల లాగా....
తెల్లటి నందివర్ధనాల మధ్య మధ్యలో, ఇంకా పూర్తిగా విచ్చుకోని ఆకు పచ్ఛ సంపెంగ పూల వరుస, స్వామికి వజ్రాల విరిదండలోని గరుడపచ్ఛల లాగా....
తెల్లటి నందివర్ధనాల మధ్య మధ్యలో, గట్టిగా పట్టుకుంటె రెక్కలు రాలిపోయే పసుపు పచ్ఛ సంపెంగ పూల వరుస, స్వామికి వజ్రాల విరిదండలోని పుష్యరాగముల లాగా...
ఇలా ఆ వారనికి ఏ విధంగా దండ రడి అయితే, స్వామి అది ధరించాక ఆ విధంగా భావించి,
" నిలుచున్నా(డిదె నే(డును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుడు....వలసినవారికి వరదుం(డీతదు కలడు గలడితని(గని మనరో....గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు...ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము...."
అని అన్నమాచార్యులవారు ఆనాడు ఏ స్వామిని చూస్తు పాడిపరవశించారో లేదా పరవశించి పాడారో గాని........
" నా ఎదుట నిలిచిఉన్నది కూడా ఆ ఆనందనిలయుడే.... నేనే ఈ శ్రీపుష్పకైంకర్యం చేసుకునే మహద్భగ్యాన్ని పొందిన అనంతాళ్వార్ ని....
మా గల్లి లోని చెట్లన్నీ ఆ పురిశైవారి తోటలోని పూలమొక్కలే....." అని భావించి సేవించిన శ్రీనివాసుడే, నాకు క్రమేపి అందరిని మించిన ఆత్మబంధువై, నావెంటే, నాతోనే, నాలోనే, సదా ఉండే నా ఆప్తమితృడై, ఎన్నెన్నో ఆపదలనుండి నన్ను గట్టెకిస్తూ, ' ఆపదమొక్కులవాడు ' అనే తన పేరుని సార్ధకం చేసుకుంటు, అడిగినవన్నీ అట్టే సమకూర్చే ఆశ్రితవత్సలుడై, జీవితానికి, జీవనానికి, జీవుడికీ, జీవధారకుడికి, జీవేశ్వరుడై వర్ధిల్లుతూ.... ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ " శ్రీమద్ అలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరుడే" నాకు అవ్యాజమైన, మిక్కుటమైన, అమేయమైన, అక్షయమైన, అజరామరమైన ప్రేమనుపంచే శాశ్వత ప్రేమికుడై నిలిచిపోయాడు..... 
" ప్రేమికుల రోజు " అనే పేరుతో వివిధ విధాలుగా ప్రేమ అనే అవ్యక్త భావనను సెలబ్రేట్ చేసుకోవడం పెద్ద విషయమేమికాదు....
భగవంతుడే మనల్ని నిజంగా ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమించే ప్రేమైకమూర్తి.... అది తెలుసుకొని, స్వామి దరిచేరిననాడే మనకు అసలైన " ప్రేమికులరోజు " అన్నది నా భావన.. 
అందుకే అనుకుంటా అన్నమాచార్యుల వారి పౌత్రులు, చిన్న తిరుమలయ్యగారు తమ "నీవు గలిగిన చాలు నిక్కము అన్నీ గలవు....." అనే తమ కీర్తనలో,
"యెన్న(డు(ను గల(గనట్టి హితుడవు నీవె పన్నినట్టె ఉండె నిచ్చపంటా నీవె... నన్ను(గాచే శ్రీవేంకటనాధు(డవని తాళ్ళపాకన్నమయ్యగారె నాకునానతిచ్చిరయ్య.... "
అంటూ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని లోకానికి తేటతెల్లం చేసారు.... 
***********************************************************************
ఆ ఆలయ 27 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాంతర్గత హనుమద్వాహనారూఢుడైన శ్రీపాంచరాత్రాగమ సేవిత శ్రీభూసమేత శ్రీనివాస పెరుమాళ్... 
When we say he is there, yes he is just there...
When we say he is there for us, yes he is there just for us...
Happy Valentine's day to dear Govinda... 
Yadbhaavam Tadbhavati... 
***********************************************************************
Comments

No comments:

Post a Comment