Sunday, March 3, 2019

శ్రీకరమైన శివరాత్రి మహోత్సవ వైభవం...!

Vinay Kumar Aitha
Just now

శ్రీకరమైన శివరాత్రి మహోత్సవ వైభవం...!

సంవత్సరంలోని 11 మాసశివరాత్రుల తర్వాత మాఘ కృష్ణపక్ష త్రయోదశీ ప్రయుక్త చతుర్దశి ని మహాశివరాత్రి గా లోకమంతా జరుపుకోవడం, శ్రావణ బహుళ అష్టమి నాటి నడిరేయిన సాకార పరమాత్మ అయిన శ్రీకృష్ణ జననం తర్వాత, అదేవిధంగా రమారమి 6 నెలలకు, నిరాకార పరబ్రహ్మమైన, అరూపరూపి అయిన, ఈశ్వర లింగోద్భవ మహోత్సవంగా అర్ధరాత్రినే శివరాత్రిని జరుపుకోవడం వెనక ఉన్న అధ్యాత్మవిజ్ఞ్యాన విశేషాలు, " లీయతే గమ్యతే ఇతి లింగం " అనే వ్యుత్పత్తి ప్రకారంగా, ఈ చరాచర విశ్వమంతా దేని నుండి గమించి (ఉధ్భవించి), తుదకు దేనిలోనికి లీనమై లయించి పోతుందో ' అదే శివలింగం అని, ఇత్యాదిగా శివరాత్రి పర్వదిన వైభవం గురించి అస్మద్ గురుదేవులు, సద్గురువులు శ్రీ చాగంటి గారి ప్రవచనాంతర్భాగంగా అందరు వినే ఉంటారు.... :)

ఒక్కొక్కరు ఒక్కోవిధంగా శివరాత్రిని జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం....
పొద్దునే గుడికి వెళ్ళి రోజంతా ఉపవాసం ఉండి ( ఆకలేసినప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు, పాలు తాగుతు 😛 ) సాయంత్రం అవ్వగానే బుట్టెడు పండ్లు లాగించడం, రాత్రికి జాగరణ అనే పేరుతో టీ.వీ లో వచ్చే ప్రత్యేక సినిమాలు/షోస్ చూస్తు, క్యారంస్, చెస్, ఇలా వివిధ ఇండోర్ గేంస్ ఆడుతూ ఎప్పుడు తెల్లారుతుందా అని వేచి ఉండి నిద్రాగక రాత్రి 1 గంటకల్ల నిద్రలోకి జారుకోవడం, అలా సామాన్యంగా అందరి ఇంట్లో ఉండే శివరాత్రినాటి సందడి తెలిసిందే... మా చిన్ననాటి రోజుల్లో అచ్చం ఇలాగే ఉండేది శివరాత్రి అంటే... 😀

అలా సాగిపోతున్న జీవితంలో ఏనాడు అస్మద్ గురుదేవుల ప్రవచనాంతర్భాగంగా, గంగావతరణం విన్నానో,
ఏనాడు ' జన్మానికొక్క శివరాత్రి ' అనే వాక్యం గురువుగారు నొక్కివక్కానించి చెప్పడం అవధరించానో, ఆనాడే అసలు శివరాత్రి అంటే ఏమిటో, ఎందుకో, ఉపే వాసః = ఉపవాసం అనగా ఈశ్వరునికి మానసికంగా దెగ్గరగా ఉండడం, ఇత్యాదిగా శివరాత్రి ని జరుపుకోవడం మొదలయ్యింది...! 

( గురువుగారి వాగ్వైభవంలో విన్న గంగమ్మ వైభవాన్ని చూసి తీరవలసిందే అని నిశ్చయించుకొని నా తమ్ముడు విజై ని, మరియు పెద్దమ్మ కొడుకైన చిన్నన్న ను ( లక్ష్మీనారాయణ ) కూడా వెంటబెట్టుకొని అప్పటికప్పుడే ఆగమేఘాలమీద అలాహాబాద్ కుంభమేళాకి / కాశి యాత్రకి వెళ్ళడం ఇంకా బాగా గుర్తు... 
అప్పటివరకు షిరిడి కి తప్ప, ఏనాడు రాష్ట్రం వీడి దూరప్రయాణం చేయని నేను, సికింద్రబాద్ నుండి ఢిల్లి, ఢిల్లి నుండి అలాహబాద్ కుంభమేళా తీర్థ స్నానం, అట్నుండి కాశికి వెళ్ళిరావడం, మళ్ళీ కాశి నుండి ఢిల్లి, ఢిల్లి నుండి సికింద్రబాద్, అనే సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం అదే జీవితంలో మొట్టమొదటి సారి....! )

2009 నుండి క్రమం తప్పకుండా, మా ఇంటికి ఓ 2 మైళ్ళ దూరంలో ఉండే కూకట్పల్లి పాత శివాలయం అస్మద్ గురుదేవుల మాటల్లో విన్న శివరాత్రి వేడుకకి వేదిక అయ్యింది...
శైవాగమ సిద్ధాంతులైన ఆ ఆలయ ప్రధానార్చకులు మరియు గణపతి-స్కందుడు అన్నట్టుగా ఉండే, అక్కడే అర్చకులైన వారి ఇద్దరు కుమారులు (పురుషోత్తం గారు, వాసు గారు ) మరియు ఎందరో శివభక్తుల భజనలతో, శివరాత్రికి శివపరివారం అంతా కైలాసం వీడి ఈ
" శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి " ఆలాయనికే వచ్చేసారా అన్నట్టుగా, శ్రీరుద్ర నమక చమక సహిత మహన్యాస పూర్వక లింగోద్భవకాలాభిషేకాలతో, తదనంతర శివపార్వతుల కళ్యాణం తో, ఎంతో వైభవంగా ఉంటుంది శివరాత్రి కోలాహలమంతా...!

విశేషించి నేను ప్రతి శివరాత్రికి అక్కడికి వెళ్ళేది ఒక మాహా భాగవతోత్తముని స్వరం నుండి జాలువారే శ్రీరుద్రపఠనం కోసం...

రజతాద్రి నుండి శివార్చనకు నడిచి వచ్చిన నందీశ్వరులా ఏమి అన్నట్టుగా ఉండే వారి స్వఛ్ఛమైన హృదయ జనిత జ్ఞ్యాన వర్చస్సు, ఉపాసనా తేజస్సు, అభివాదం చేసినవారిని మందస్మితులై ఆశీర్వదించే వారు, వృత్తి పరంగా ఒక సంస్థలో పెద్ద అధికారి అయినా, భగవద్భక్తిభరిత ఆధ్యాత్మిక జీవనమే ప్రవృత్తి గా జీవించే ఆ మహానుభావుడు,   
ఎదలో ఈశ్వర పంచాస్యములను ధ్యానించి, అంగన్యాస కరన్యాసములు గావించి, ఈశ్వర నామాన్ని మదిలో నిలిపి, అనాహత చక్రాన్ని భేదిస్తూ వచ్చే
ఉదాత్త అనుదాత్త స్వరిత సంగమ స్వరశుద్ధమైన శ్రీరుద్రం కర్ణపేయంగా వల్లె వేస్తుంటే, అది విన్నవారి తన్మయత్వం వర్ణనాతీతం...!!

అలజడుల ఉరుకులు పరుగులతో సాగిన గంగమ్మ అప్రతిహత ప్రవాహం శ్రీవిశ్వనాథున్ని సేవించేందుకు కాశీకి చేరుకోగానే ప్రశాంతంగా ప్రవహించినట్ట్లుగా.... 
అప్పటివరకు ఏదో అలజడితో ఉన్న మనసు, వారిచే పఠించబడే శ్రీరుద్ర శ్రవణం తో హయిగా ప్రశాంతంగా మారి హృత్కుహరంలో కొలువైన శ్రీవిశ్వనాథున్ని సేవించేందుకు నిర్మలంగా మారడం, అక్కడ ఉన్న అందరి భక్తులకు విదితమే...  
 
అది విన్న ఎవ్వరికైనా సరే, ఆహా ఇది కదా...' నా రుద్రో రుద్రమర్చయేత్...' అనే శృతివాక్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా సాగుతున్న శివార్చన అని అనిపించడం కద్దు..!!

లింగోద్భవకాలాభిషేకాంతర్గతంగా అన్ని ఆవృతాలు పూర్తి అయ్యి, స్వస్తివచనం, శాంతిమంత్రం చదవడంతో, గర్భాలయంలో ఉన్న శివలింగం లోకి వచ్చిచేరిన శివకళతో సాగే హరచిద్విలాసం ఒకవైపు,

మరోవైపు వారి కంఠసీమను అలంకరించి ఉన్న చిన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి స్వర్ణమూర్తి (లాకెట్) పై సాగే హరిచిద్విలాసాన్ని చూసి...
నేను అప్రయత్నంగానే, ఆ ఈశ్వరున్ని ఈ క్రింది యజుర్వేద శ్లోకంతో నమస్కరించి, అలా కాసేపు శివస్తోత్రాలు చదువుకొని, తీర్థప్రసాదాలు చండీశ్వరునికి చిటికెలు వేసి చూపించి తీసుకొని, ఇంటికి తిరిగిరావడంతో నా ఆ సంవత్సర శివరాత్రి ఉత్సవం ముగిసేది...  

" శివాయ విష్ణురూపాయ, శివ రూపాయ విష్ణవే..
శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయగం శివః...
యథా శివమయొర్విష్ణుః, యేవం విష్ణుర్మయః శివః..
యథాంతరం న పశ్యామి, తథా మే స్వస్తిరాయుషి... "

మధురాతిమధురమైన శబరిమల అయ్యప్ప స్వామి అరవణప్రసాదం లాగా, సంవత్సరానికి ఒక్కసారి లభించే, స్వచ్ఛమైన మనసుగల ఆ భాగవతోత్తముని స్వరం విని ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది...

గత సంవత్సరము 2018 హేవిళంబి శివరాత్రికి అరుణాచల గిరిప్రదక్షిణంలో భాగంగా ఆది అణ్ణామలై శివాలయ గర్భాలయం వెనకభాగంలో ఉన్న లింగోద్భవమూర్తికి జరిగిన అభిషేకంలో ఉండడంతో, ఇక్కడ వీరి శ్రీరుద్ర స్వరప్రసాదం మిస్స్ అయ్యాను....నా ప్రార్ధనను అవధరించి ఈశ్వరుడు ఈసారి నాకు ఆ కటాక్షం పునః ప్రాప్తి కలిగించుగాక..! :)

ఒక శివరాత్రినాడు వారితో గొంతుకలిపి చంద్రశేఖరాష్టకం చదవడం, ఆ తర్వాత వారు నన్ను ఆశీర్వదించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను...కొందరి ఆశీస్సులు జీవితాలను అలా అనుగ్రహిస్తాయి మరి... :)

ఇక లోకంలో చాలామంది, శివుడు విష్ణువు అని వేరు వేరుగా రెండు పేర్లతో, విభిన్నమైన శైవాగమ విష్ణ్వాగమోక్త అర్చారాధనలతో మనం పూజిస్తున్నప్పుడు, అవి రెండు రెండు భిన్న తత్వాలు కదా....మరి పైన చెప్పబడిన యజుర్వేదశ్లోకం అలా ఎలా జీవితానికి అన్వయం చేసుకోగలం అని భావిస్తారు....
నాకు స్ఫురించిన చిన్న ఉదాహరణతో శివకేశవ అభేదాన్ని వివరించే చిరు ప్రయత్నం చేస్తాను...

అటు స్థితికారుడిగా శ్రీమహావిష్ణువు, ఇటు లయకారుడిగా భోళాశంకరుడు ఇద్దరు కలిసి ఒకే పరమాత్మ తత్వంగా, శివకేశవాభేద స్థితిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టి సక్రమంగా సాగడం జరిగేది... బాహ్యార్ధంలో ఏకత్వం చెప్పాలకున్నా సరే, శ్రీమహావిష్ణువు సమ్హారకుడిగా, శంకరుడు రక్షకుడిగా ఉండడం ఎన్నెన్నో ఉదంతాలు మనకు ఉండనే ఉన్నాయి కదా...

నారాయణుడి చెల్లెలి గా, నారాయణి గా, అర్ధనారీశ్వరి గా, ఆ అర్ధనారీశ్వరుడి పక్కన ఉన్నది శ్రీమన్నారాయణ తత్వమే కదా... ఆ ఆధ్యాత్మిక బావాబామ్మర్దులు ఇద్దరు ఒక్కటిగా ఉండి ఈ విశ్వాన్ని నడిపించడం అంటే, ఒకే రైల్వే ట్రాక్ కి ఉన్న రెండు అవిభక్త పట్టాల లాగా ఇద్దరిది సమ్మిళిత సంఘాత తత్వం... తెలియనప్పుడు ఆ రెండు పట్టాలు వేరు వేరు గా కనిపించినా సరే, తెలిసాక అవి రెండు కలిపితేనే ఒక రైల్వే ట్రాక్ గా ఉండి బండి నడవడం సంభవమయ్యేది అనే విషయం బోధపడుతుంది... ఆ రెండిట్లో ఏది లేకున్నాసరే బండి నడవడం కుదరని పని... అదేవిధంగా స్థితికర్త గా ఒకవైపు, ప్రళయకర్త గా మరో వైపు ఒకేపరమాత్మ ఉండడం.... ఆ రెండు పట్టాలు ఒకే సమదూరంలో దారిపొడవునా ఉండి రైలు బండి ప్రయాణం క్షేమంగా సాగేలా చూస్తాయి...
అదే విధంగా మన దైనందిన జీవన బండిని మరియు జీవధారకుడి లోపల ఉన్న జీవుడి జన్మప్రయాణం క్షేమంగా సాగేలా చూస్తాయి ఈ హరిహరాత్మకమైన శివకేశవ ఏకత్వం.....

ఇక భౌతికంగా కూడా, చాలా ఆలయాల్లో ఆ ఇద్దరు కలిసి ఉండి, ఆ ఇద్దరి దర్శనంతోనే తీర్థయాత్ర సంపూర్ణఫలం లభించడం చూస్తూనే ఉంటాం  కదా....

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడు.
గోగర్భం డ్యాం దెగ్గర పాండవ తీర్థం దెగ్గర కొలువై ఉన్నాడు రుద్రుడు. తిరుమల ఆలయం లోని వెండివాకిలి ముందున్న ధ్వజస్తంభం/బలిపీఠం దెగ్గర ఈశాన్య మూలన ఉండే క్షేత్రపాలక రుద్రశిల అనుమతితోనే ఈనాటికి కూడా ఆలయ ద్వారాలను మూయడం / తెరవడం జరుగుతుంది...

కాలభైరవుడు, వీరభద్రుడితో పాటు, ఎన్నెన్నో శివాలయాలకు (దక్షారామం, ఇత్యాది ) వివిధ శ్రీమహావిష్ణుస్వరూపాలు క్షేత్రపాలకులుగా ఉండడం చూస్తూనే ఉంటాం...
దక్షారామం లో సప్తగోదావరి దెగ్గరున్న పెద్ద రావిచెట్టు మొదట్లో " శంకరనారాయణుడిగా" స్వామిని కొలువడం ఇప్పటికీ మనం చూడొచ్చు..!

స్వామి ఆజ్ఞ్య ప్రకరంగా శ్రీవైష్ణవాచార్యులే కర్ణాటకలోని నిరతాన్నదాన క్షేత్రం ధర్మస్థల శ్రీమంజునాథ ఆలయ అర్చకులుగా ఉండడం ఇప్పటికీ చూడొచ్చు...

సాగరసంగమం సినిమా లో 'నాదవినోదము నాట్యవిలాసము... ' అనే పాట మొదట్లో, అందరికి తెలిసిన ఈ క్రింది శ్రీకాళిదాస మహాకవి విరచితమైన శ్లోకాన్ని....,

" వాగర్థావివ సంప్రుక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ..."

బాలు గారు రెండవసారి ఆలపించినప్పుడు , చాల శ్రావ్యంగా
శివ కేశవ నమః పూర్వకంగా ధ్వనించేలా ఈ క్రింది విధంగా పదబంధనాన్ని సవరించడం వినేఉంటారు అందరు...!

" వందే పార్వతీప...రమేశ్వరౌ....!!

' పార్వతీప ' అనగా సంస్కృతంలో పార్వతి యొక్క పతి అయిన పరమశివుడు అని...మరియు,

' రమేశ్వరౌ ' అనగా సంస్కృతంలో రమ (లక్ష్మీదేవి) యొక్క పతి రమాపతి అయిన శ్రీమహావిష్ణువు అని... 

- హరనమః పర్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర.....
🙏🙏🙏🙏🙏

సర్వం వేములవాడ మరకతమణిశివలింగరూపస్థిత శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పనమస్తు.....!! ☺️

No comments:

Post a Comment