Friday, March 29, 2019

" శ్రీశైల వైభవం " ...! :)

శ్రీ చాగంటి సద్గురువుల " శ్రీశైల వైభవం " ప్రవచనం విని 2013 నుండి " శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి " గా కొలువైన ఆ ఆదిదంపతుల అనుగ్రహానికై,
మొట్టమొదటి సారి ఆధ్యాత్మికబ్యాట్చ్
ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళడం, ఒకసారి ఒక్కడినే వెళ్ళడం, మరోసారి కుటుంబసభ్యులందరిని తీసుకెళ్ళడం, మరో సారి ఫ్రెండ్ తో కలిసి వెళ్ళడం, ఇలా పలుమారు ప్రయాణంగావించిన నాకు,
26 సంవత్సరాలుగా ఒక 5+ గంటల ప్రయాణంలోనే చేరుకునే శ్రీశైలం గురించి తెలియకుండా జీవించానంటే ఆశ్చర్యం వేసి,
ఈ భరతభూమి పై ఒక ఉన్నతమైన
వైదిక సంస్కారభరిత కుటుంబంలో జన్మించి, కడుశాస్త్రాధ్యయనము గావించి, స్వరభంగం కాకుండా శృతివిన్యాసం గావించే కంఠాన్ని
పొంది వల్లెవేసిన శ్రీరుద్ర నమకచమకాల మహత్తు వల్ల పొందిన ఈశ్వరానుగ్రహాన్ని పక్కనబెట్టి, అరిషడ్వర్గజనిత ఆవేశానికి లోనై తుదకు ఈశ్వరున్నే మరచి వెళ్ళిపోయిన జీవుడికి, మళ్ళీ అంతటి ఘనమైన సంస్కారబలం అందివ్వగలిగే వాతావరణంలో జన్మలభించడం ఎంత దుర్లభమో తెలిసివచ్చి, గురువుగారి " జీవయాత్ర " గురించిన ప్రవచనం లోని మాటలు గుర్తుకువచ్చి ఒకసారి బాగా ఏడ్చేసాను అక్కడే వృద్ధమల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో ఉన్న అశ్వత్థవృక్షం కింద... ( సిద్ధనాగార్జునుడు తన తపశ్శక్తిని నిక్షిప్తంగావించిన వృక్షసముదాయం దెగ్గర..)
ఉన్నతమైన అటువంటి జన్మలనుండి పుణ్యార్జనరహితమైన, భగవద్భక్తి లుప్తమైన జీవితము లోకి ప్రారబ్ధవశాత్తు అధోగతిపాలైన జీవుడికి ఒక సద్గురువు పాదపద్మముల స్పర్షసోకిన పిమ్మట, ఆ జీవుడికి మెల్లగా తన పారలౌకిక యాత్రావిశేషాలగురించి తెలిసినా సరే, ఇప్పటికిప్పుడు అంతటి ఘనాపాఠిగా అవ్వడం కుదరని పని అని తెలిసి వేళ్ళు విరుచుకోవడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆ జీవధారకుడిది...
వైకుంఠపాళి ఆటలో ఎంతో శ్రమించి, పైవరుసవరకు చేరుకుని ఇంకొచెందూరంలో పరమపదానికి చేరుకునే వారిని పెద్దపాము మింగి క్రింద మొదటివరుసలో ఉన్న వారితో కలిపి ఆట మళ్ళీమొదటికి వచ్చినవైనంలా ఉంటుంది ఆ దీనపరిస్థితి...
మళ్ళీ వెంటనే గురువుగారి ఈ క్రింది మాటలు గుర్తుకువచ్చి....
"జాలరి వలలో పడ్డ ఒక ప్రాణికి అందులోనుండి బయటపడి తన నిజస్థానానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడం ముఖ్యం కాని, అక్కడే దిగాలుగా కూర్చొని, ఇదేం వల, విచిత్రంగా ఉంది, ఎవరు వేసారు, ఎందుకు వేసారు, మొదలైన వ్యర్ధవిషయానురక్తమై అక్కడే ఉండి పోతే ఉన్న ఆ కొద్ది పుణ్యకాలం కాస్త గడిచి జాలరిజఠరాగ్నికి స్వాహా అవ్వడమే తప్ప ఒనగూరేదేమిఉండదు...
అచ్చం అదేవిధంగా, ఇప్పుడు ఈ జన్మ అనే రాటకి, కర్మ అనే పాశంతో బంధించబడిన జీవుడిని ధరించిన శరీరంలోకి ఎలా వచ్చాము, దేని వల్ల ఇలాంటి జన్మ లభించింది, సంచిత, ప్రారబ్ధ వశాత్తు ఉన్న మన గతపుణ్యపాపములు ఏమి, మొదలైన శుష్కప్రేలాపనతో ఉన్న కొద్ది ఆయుహ్ప్రమాణాన్ని వ్యర్ధంగావించడం, ఆ వలలో చిక్కి సమయం వ్యర్ధం చేసుకునే ప్రాణిలా ఉంటుంది...
దానికి బదులుగా, ఈశ్వరానుగ్రహంగా మనకు అబ్బిన జ్యానాగ్జ్యాములు, మన బలాబలాలు, ఇత్యాదులను ఆంతరమున బేరీజు వేసుకుంటూ, ఉన్నతమైన జీవప్రయాణానికి ఈశ్వరానుగ్రహాన్ని
సముపార్జించుకునే దిశగా ఒక సద్గురువాక్కులను ఆలంబనగా గావించి, అటు లౌకికంగా మన విహిత ధర్మాలను, ప్రాప్త్య కర్తవ్యాలను, స్వీకరించబడిన ఆశ్రమధర్మాన్ని, దేశకాలానుగుణంగా శక్తిమేరనిర్వహిస్తూనే,
ఇటు మన ఆత్మోద్ధరణకై, స్వీయ జీవరక్షణకై, ఈశ్వర శరణాగతిని గావించి జీవించడమే
ప్రతి మనుష్యప్రాణి యొక్క లక్ష్యం.."
అనే భావనతో శాంతించడం పరిపాటి...😊
అలనాడు కృష్ణాపుష్కరాల సమయంలో ఇంటిల్లిపాది అందరం కలిసి వెళ్ళి శ్రీశైల యాత్ర లో,
పాతాళగంగా తీర్థస్నానానంతరం పితృదేవతాప్రీత్యర్ధం స్వధాకార్యము, శ్రీశైల గ్రామదేవత అంకాళమ్మ దర్శనం,
స్వామి వారి గర్భాలయంలో బిల్వోదకంతో అభిషేకకైంకర్యానంతరం లలాటంతో స్వామివారి జ్యోతిర్లింగాన్ని స్పృశించడం, అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రకుంకుమార్చన గావించడం, సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార - పంచధార తీర్థస్నానం, శిఖర దర్శనం, బయలు వీరభద్రుడు, కాలభైరవుడు,
సిద్ధరామప్ప పాదాలు, కంచికామకోటి పీఠంవారి పరిరక్షణలోఉన్న సరస్వతీ తీర్థం, హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, విభూతి తయారి కేంద్రం, గోశాల, ఇత్యాదుల దర్శనానంతరం అలా కాసేపు విశ్రమించిన తర్వాత,
" తమ సద్వాక్కులద్వార గురువుగారు ఎంతటిపుణ్యాన్ని సమకూర్చి పెట్టారో కదా అని తలచుకొని వారికి అక్కడే గుడిలో సాయంత్రం, మనోహరతీర్థం, క్షేత్ర వృక్షమైన
అర్జునవృక్ష ( తెల్ల మద్దిచెట్టు ) ఇత్యాదుల దర్శనానికి మళ్ళీ వెళ్ళినప్పుడు, నమస్కరించి సంతసించాను....
ఆ మద్ది చెట్టు సాక్షాత్ మల్లికార్జునస్వామి అని తెలియక, చెట్టుకు మ్రొక్కుతూ ప్రదక్షిణలు చేస్తున్నాడేంటో....
అని అంటూ నన్ను చూసి నవ్వుకుంటున్న వారిని చూసి నేనుకూడా నవ్వుకొని,
ఇది కదా సద్గురు వాక్కులను అవధరించిన వారికి లభించే సౌభాగ్యం అని అక్కడే కొంచెం సేపు కూర్చొని "నాద తనుమనిశం శంకరం..." అనే త్యాగరాయులవారి కృతిని ఆలపించి అదే లోన గర్భాలయంలో ఉన్న స్వామివారికి నేసమర్పించిన రాజోపచారంగా భావించి స్వామికి నమస్కరించడం తో ఆనాటి ఆలయ సందర్శనం పూర్తయ్యింది.....
మరోసారి వెళ్ళినప్పుడు స్వామివారి కళ్యాణ సౌభాగ్యంకూడా లభించింది...
ఆపక్కనే ఛత్రపతి శివాజి మహారాజ్ కి అమ్మవారు
" ఎదురు లేని ఖడ్గాన్ని " ప్రసాదంగా ఇచ్చిన సన్నివేశాన్ని చూసి, ఈ నిన్నమొన్నటి కలియుగంలో సాక్షాత్ అమ్మవారి నుండి శస్త్రాన్ని అందుకున్న ఆ శివాజిమహారాజ్ ఎంతటి ఘనుడో కదా అని నమస్కరించి, అమ్మవారి ఆలయానికి వెళ్ళి ద్వారంపై కొలువైన చిన్నగాజుపేటికలోని శ్రీభ్రామరినిజస్వరూపాన్ని ప్రార్ధించి,
నా అవిద్యాబంధనములను ఖండించే అటువంటి ఎదురులేని శ్రీవిద్యా జ్ఞ్యానఖడ్గాన్ని నాక్కూడా అనుగ్రహించవా ఓ జగజ్జనని,
మణిద్వీపనివాసిని,
మత్తమాతంగగమని,
మలాయచలవాసిని,
మహాకామేశమహిషి,
మహాత్రిపురసుందరి,
అని అమ్మవారిని పలువిధాల వేడుకొని
ఆ శ్రీశైలదర్శన స్మృతులన్నీ పదిలపరుచుకుని ఇంటికి తిరిగిరావడంతో మా శ్రీశైల యాత్రలను
సఫలీకృతంగావిస్తూనేవచ్చారు ఆ
పార్వతీపరమేశ్వరులు...!
మాతాచ పార్వతీదేవి...
పితాదేవో మహేశ్వరః...
బాంధవాః శివభక్తాశ్చ...
స్వదేశో భువనత్రయం...
సర్వం అస్మద్ శ్రీగురుదేవ శ్రీచరణారవిందార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment