శ్రీ చాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనంలో బోధించినట్టుగా
శ్రీమహావిష్ణువుయొక్క దశావతారాల్లో 5వ అవతారమైన శ్రీవామనమూర్తి విశ్వరూపాన్ని దాల్చి త్రివిక్రమాకృతితో యావద్ విశ్వాన్ని తన కుడి పాదంతో పాదాక్రాంతం గావించిన సమయంలో ఆ ఆబ్రహ్మాండపర్యంత శ్రీపాదానికి ప్రదక్షిణ నమస్కారము ఆచరించిన ఘనులుగా వినుతికెక్కిన జాంబవంతులవారే మేఘనాథుడి మాయాయుద్ధాంతర్గత నాగాస్త్ర బంధన సమయంలో యావద్ శ్రీరాముడి వానరసేన రామలక్ష్మణులతో సహా
అత్యంత విషపూర్తిమైన నాగబంధనములతో బాధించబడుతున్న సమయంలో
అంతటి జాంబవంతుల వారు విభీషణుడిని
" హనుమంతుడు క్షేమమేనా...? " అని
అడిగినప్పుడు....
విభీషణుడు
"అదేంటి ఇంతటి ఘోరమైన విపత్కర పరిస్థితుల్లో మీరు 'శ్రీరామలక్ష్మణులు క్షేమమేనా ' అని అడుగుతారనుకుంటే....
హనుమంతుల వారి గురించి అడుగుతున్నారేంటి...?" అని తిరిగి ప్రశ్నించగా....
" హనుమంతుడు క్షేమంగా ఉంటేనే శ్రీరామలక్ష్మణులతో సహా మిగతా అందరు క్షేమంగా ఉండగలరు...."
అని జాంబవంతుల వారు విభీషణుడినికి ఇచ్చినసమాధానంలో ఆంజనేయస్వామి వారి గొప్పదనం ఏంటో మనకు శ్రీవాల్మీకి మహర్షి వారు ఎంతో ఘనమైన రీతిలో శ్లోకపరచగా శ్రీ చాగంటి సద్గురువులు అంతే ఘనమైన రీతిలో విశదపరిచినారు....
అగ్నిసాక్షిగా కపిరాజు సుగ్రీవుడితో శ్రీరామలక్ష్మణుల మైత్రిని నెరపిన ఘట్టం నుండి
శ్రీరాముడి 14 సంవత్సరాల వనవాస సమయం ముగిసిన వెంటనే తన అన్న అయోధ్యకు తిరిగి చేరుకోకుంటే దేహత్యాగం చేస్తానని వచించిన
భరతుడు ఇక తనువుచాలిద్దాం అని ప్రాయోపవేశం చేయబోయే భరతుడి దెగ్గరికి టైంకి చేరుకొని శ్రీసీతారామలక్ష్మణుల పుష్పక విమానాగమన సందేశాన్ని విన్నవించి భరతుడిని కాపాడి శ్రీసీతారాముడు
లక్ష్మణభరతశతృఘ్ణ సహితుడై శ్రీకోసలామహాసామ్రాజ్య చక్రవర్తిగా సిమ్హాసనారూఢుడై కొలువయ్యేంత వరకు
శ్రీరామాయణం మొత్తం నిజానికి
శ్రీహనుమాయనమే...!
ఎందుకంటే తనకంటే అభిన్నమైన తేజస్సైన హర తేజస్సు, సూర్యవంశ సాంజాతుడై దేవకార్యం నిమిత్తమై నరుడిగా కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా జన్మించిన శ్రీరాముడి యొక్క హరి తేజస్సుతో సమ్మిళితమై హరిహరులిరువురుకి కూడా తన శక్తి నుండి సృజించబడిన త్రిశూల / సుదర్షన ఆయుధాలను అందించిన సూర్యనారాయణుడి తేజస్సు భువిపై సుగ్రీవ కపిరాజు గా ఉన్నందువలన,
శ్రీరాముడు, శ్రీఆంజనేయుడు, శ్రీసుగ్రీవుడు ఈ ముగ్గురూ ఒక్క జట్టుగా ఏర్పడిన తదుపరి మాత్రమే పౌలస్త్యవధ సాధ్యమయ్యేది....
అనాడు హరి హరునకు దివ్యశరమై సమకూరినప్పుడే త్రిపురాసుర వధ సంభవమైన రీతిగ
ఇక్కడ
హరిహరసూర్య తేజస్సుల అంశలో ప్రభవించిన శ్రీరామశ్రీఆంజనేయ
శ్రీసుగ్రీవ కూటమి ఏర్పడిన తదుపరి మాత్రమే
నరవానర సంఘాతంగా రావణుడు సమూలంగా
నశించిపోవడం జరిగేది.....
కాని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ఆంజనేయుడు చిన్నప్పుడే సూర్యుడిని మధురఫలం గా భావించి మింగుదామని నింగికెగసిన ఆ వృత్తాంతం లో ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారంతో వాయుదేవుడి ప్రకోపంతో స్తంభించిన లోకాన్ని కాపాడేతరుణంలో సకల దేవతలు ఆంజనేయుడికి తమ తమ శక్తులను అందించి సకల దేవతా శక్తిసంఘాతంతో అలరారే ఏకైక భూగత ప్రాణిగా వానరుడిగా ఉన్న అనిర్జిత అమేయ శక్తి పుంజము ఆంజనేయుడు....!!
కాబట్టే కేవలం వయసులో మాత్రమే కాకుండా ఎంతో జ్ఞ్యానవృద్ధుడైన జాంబవంతుల వారు విభీషణుడిని అట్లా అడిగారు....
నిజానికి కాంచన లంకకు శ్రీరాముడి దూతలుగా వెళ్ళిన ఆంజనేయ అంగదులు
రావణుడిని ఆనాడే సమ్హరించగల బలసంపన్నులు...
కాని రాజాజ్ఞ్య, రామాజ్ఞ్య లేనందున
వెళ్ళిన పని మాత్రమే సంపూర్ణం గావించి తిరిగివచ్చారు.....
1. భరతఖండం యొక్క దక్షిణ తీరం నుండి లంకకు....
2. లంకనుండి భరతఖండం యొక్క దక్షిణ తీరానికి...
మరియు
3. లంకనుండి హిమాలయ పర్వతసానువుల్లోని
సంధానకరణి, సావర్ణకరణి, విశల్యకరణి, సంజీవని ఓషధీ మూలికలు గల గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి....
4. అక్కడి నుండి ఆ పర్వతాన్ని పెకిలించి లంకకు...
5. మళ్ళీ లంకనుండి గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి ఆ ఓషధీ పర్వతాన్ని పెకిలించిన స్థానంలోనే పునః స్థాపించడానికి....
ఇవ్విధంగా ఆజనేయుడు 5 సార్లు సముద్రాన్ని లంఘించడం మనం శ్రీమద్రామాయణంలో గమనించే సత్యం......
మరియు చివరి సారిగా భరతుడికి రావణవధానంతరం శ్రీరామాగమన వార్తను తెలియజేయడానికి శ్రీరామసేన తో విచ్చేస్తున్న పుష్పకవిమానం కంటే ముందే అయోధ్యకు చేరుకోవడం....
సొ మొత్తం 6 సార్లు హనుమంతులవారు సముద్రాన్ని లంఘించారు అనే సత్యం మనకు శ్రీరామాయణం తెలియజేస్తుంది....
ఇదంతా బానే ఉంది....
ఏ మూలికలను సంగ్రహించి తీసుకొనిరావాలో అనే సందేహంలో ఉన్న హనుమంతుల వారు ఏకంగా ఓషధీ పర్వతాన్నే అవలీలగా తీసుకొచ్చి తిరిగితీసుకెళ్ళగల విరాట్రూపధారులైనప్పుడు....
అసలు అంత కష్టపడి భరతఖండమునుండి కాంచనలంకకు వారధి కట్టడం ఏంటి....
నలుడికి గల సిద్ధమహిమతో నీటిపై తేలే శ్రీరామ నామ ముద్రాంకిత రాళ్ళ దొంతరగా ఉన్న వారధిపై మెల్లగా నడుచుకుంటూ సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం ఏంటి....
కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాన్నే అటు నుండి ఇటు... ఇటు నుండి అటు తీసుకెళ్లిన హనుమంతుల వారు
శ్రీరామసేనను అట్లే తన విరాడ్రూపంపై కొలువై ఉండేలా చేసి నిమిషాల్లో లంకకు తరలించి ఉండొచ్చు కద..??
అనే సందేహం అధ్యాత్మ జిజ్ఞ్యాసాపరులైన కొందరికైనా వచ్చి ఉండాలి...
ఇక్కడ ఉన్న అధ్యాత్మ తత్త్వ విశేషాలేంటో చూద్దాం...
రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారు భువిపై వానరుడై ప్రభవించిన తదుపరి
1. శ్రీరాముడి నుండి సీతమ్మవారికి అభిజ్ఞ్యానంగా అందివ్వబడిన శ్రీరాముడి అంగుళీయకం అందుకున్న హనుమంతుల వారి శక్తి ఒక స్థాయి...
2. ఆదిపరాశక్తి భూదేవి అంశగా అయోనిజగా జనకుడి పుత్రికగా జానకిగా ప్రభవించి,
బాల్యంలోనే ఎవ్వరికీ సాధ్యమవ్వని పని, శివధనస్సు గల మంజూషను ( ధనస్సును భద్రపరిచే పెట్టె లాంటి వస్తువు ) అవలీలగా చేతితోనే లాగి పక్కకు పెట్టిన అసామాన్య శక్తిసంపన్నురాలైన సీతాదేవిని అశోక వనంలో సందర్శించిన తదుపరి
సీతమ్మ తన చూడామణిని శ్రీరాముడికి అభిజ్ఞ్యానంగా ఇవ్వమని హనుమంతులవారికి అందించిన తరువాత
హనుమంతుల వారి శక్తిది మరొక స్థాయి..
:
ఒకసారి శ్రీరుద్ర లఘున్యాసంలోని ఈ క్రింది సరళిని మీరు గమనించగలిగితే
"
ఆత్మని దేవతాః స్థాపయేత్ ॥
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు ।
పాదయోర్-విష్ణుస్తిష్ఠతు ।
హస్తయోర్-హరస్తిష్ఠతు ।
బాహ్వోరింద్రస్తిష్టతు ।
జఠరేఽఅగ్నిస్తిష్ఠతు ।
హృదయే శివస్తిష్ఠతు ।
కంఠే వసవస్తిష్ఠంతు ।
వక్త్రే సరస్వతీ తిష్ఠతు ।
నాసికయోర్-వాయుస్తిష్ఠతు । నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం ।
కర్ణయోరశ్వినౌ తిష్టేతాం ।
లలాటే రుద్రాస్తిష్ఠంతు ।
మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు ।
శిరసి మహాదేవస్తిష్ఠతు ।
శిఖాయాం వామదేవస్తిష్ఠతు ।
పృష్ఠే పినాకీ తిష్ఠతు ।
పురతః శూలీ తిష్ఠతు ।
పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతాం ।
సర్వతో వాయుస్తిష్ఠతు ।
తతో బహిః సర్వతోఽగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు ।
సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు ।
మాగ్ం రక్షంతు ।
"
15 వ న్యాసస్థానమైన శిఖ స్థానమునకు అధిదేవతగా కొలువైఉండే వామదేవుడి,
( అనగా రుద్రుడి పంచముఖ తత్త్వంలో
ఉత్తరాభిముఖమైన వామదేవ వదనానికి ప్రతీక )
శక్తిని తనలో ఇముడ్చుకున్న సీతమ్మవారి చూడామణిని స్వీకరించిన హనుమంతుల వారిలో
హర శక్తి ( హస్తయోర్-హరస్తిష్ఠతు )
హరి శక్తి ( శిఖాయాం వామదేవస్తిష్ఠతు )
ప్రత్యక్షంగా సమ్మిళితమై హరిహరాత్మక శక్తిపుంజమై వెలుగొందిన హనుమ యొక్క స్థాయి ఏ యోగభూమికలకు కూడా అందనంత ఉన్నతమైనది...
అందుకే, సీతాదేవి గా ఉన్న తన శక్తి దూరమైన శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం ఉన్నప్పుడు..
" హుం....నేనా ఇంత పెద్ద సముద్రం దాటగల ధీరుడను....
అని ఒకింత నిరాశానిస్పృహతోనే ఉన్న హనుమంతుల వారిని జాంబవంతుల వంటి మహావీరులు ఉత్తేజపరిచి తన శక్తిని ప్రకటింపజేసారు...
"అయ్యో..కుయ్యో...ఇప్పుడెట్లా...హుం...ఉం"
ఇత్యాదిగా ఒక భూగత ప్రాణికి సహజంగా ఉండే నిరాశానిస్పృహలు.....
వానరుడిగా ఉన్న హనుమంతులవారికి కూడా అంతే సహజంగా ఆపాదించబడినవి....
అశోకవనంలో బంధీగా ఉన్న
సీతమ్మ తన శిఖ స్థానంలో ధరించిన ఆ చూడామణిని శ్రీరాముడికి అందివ్వమని హనుమంతులవారికి అనుగ్రహించిన తరువాత మీరు హనుమంతుల వారి శక్తిని గమనిస్తే ఒక్కసారిగా వారిలో
అంతర్గతంగా సమ్మిళితమైన హరిహరాత్మక శక్తులకు శ్రీ శక్తి అనగా ఆదిపరాశక్తి యొక్క శక్తి సంఘటితమై ఆ శాక్తేయ శౌర్యంతో రెచ్చిపోయిన హనుమంతుల వారిని ఏ వీరుడు పట్టలేనంతటి అరివీరభయంకరుడిగా శ్రీఆంజనేయుడి శక్తి రూపాంతరం చెందడం...
"నేనా సముద్రము దాటగల ధీరుడను..."
అన్న హనుమంతుడు...,
"ఎవడ్రా నాకు ఎదురునిలిచి గెలిచేది ఈ భువిపై...." అనే స్థాయిలో విరుచుకుపడి రావణుడి మంత్రుల వధ, అక్షకుమార వధ, కాంచనలంకా దహనం లో ప్రదర్శించిన చండప్రచండ శాక్తేయశౌర్యప్రతాపాలకు ఎవ్వరైనా సరే ఔరా అని అనితీరవలసిందే...
ఇక్కడ హనుమంతుల వారు పైకి కథాంశంగా శ్రీరామాయణంలోని ఒక ముఖ్య వక్తిగా, శ్రీరాముడి దూతగా, బంటుగా, తన విహిత కర్తవ్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న వైనంలో అంతర్లీనంగా బోధించబడే అధ్యాత్మ తత్త్వ జ్ఞ్యానమంజరులను సద్గురుబోధాంతర్గతంగా సాధనలో ఒడిసిపట్టగలిగితే శ్రీమద్రామాయణం నిజంగా ఒక అత్యద్భుత అధ్యాత్మ యోగార్ణవం....
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా ఆదిపరాశక్తిగా పురుషకారిణిగా
అమ్మవారి దయతోనే అయ్యవారి కరుణ సంపూర్ణంగా లభించి తరించడం సంభవమయ్యేది...
"నేను వెతుకుతున్నాను..." అని అనుకున్నంతసేపు సీతమ్మ దర్శనం లభించలేదు...
"వెతికేది నేనే అయినా శ్రీరామకార్యంలోని ఈ వెతుకులాట నీ అనుగ్రహం వినా సఫలీకృతం కానేరదమ్మా..."
అని ఆ ఆదిపరాశక్తికి, సీతాదేవికి
నమస్కరించిన తదుపరి మాత్రమే సీతమ్మ దర్శనం లభించడం జరిగింది....
అదే విధంగా
అన్నమయ
ప్రాణమయ
మనోమయ
విజ్ఞానమయ
ఆనందమయ
కోశములనబడే జీవుడి పంచకోశాల ఆంతరమున స్వప్రకాశ శక్తిపుంజమై వెలుగొందే ఆ త్రికోణాంతరదీపిక....
మనంగావించే శరణాగతికి తన స్వస్వరూపానుసంధానంతో జీవుడిని అనుగ్రహించడం సంభవిస్తుంది....
చతుర్దశ భువనాలను శాసించే శ్రీభువనేశ్వరి బీజాక్షరమైన హ్రీంకారోపాసనతో నిత్యం ఒక జ్వలించే శక్తిపుంజమై వెలిగే హనుమంతులవారు శివశక్త్యాత్మక
దేవతామూర్తి...
అందుకే శ్రీ చాగంటి సద్గురువులు మనకు ఉపాసనాపరమైన 2 విశేషాలను బోధించి అనుగ్రహించారు...
1. అమ్మవారు మరియు హనుమంతులవారు...
ఈ ఇరువురు కూడా అత్యంత వేగంగ, శక్తివంతంగా భక్తులను అనుగ్రహించే దేవతా స్వరూపాలుగా శాస్త్రం బోధించి అనుగ్రహించింది...
2. కేవలం చేతివేళ్ళతో "హనుమ" అని భూమి మీద వ్రాసి నమస్కరించినంత మాత్రాన
హనుమదనుగ్రహం సద్యోలభ్యమై భక్తులను సమ్రక్షిస్తుంది..
ఇక తిరుగులేనిది, అత్యంత శక్తివంతమైన పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆరాధన యొక్క
విశేషం ఎల్లరికీ తెలిసిందే...
శ్రీసమర్ధరామదాసుగారిని అనుగ్రహించి ఛత్రపతి శివాజీమహరాజ్ గారితో భారత సనాతన ధర్మవైభవాన్ని దేశం నలుచెరగులా మళ్ళీ దేదీప్యమానంగా ఉజ్జీవింపజేసిన ఘనత ఆ పంచముఖ ఆంజనేయునిదే కద....
ఇవ్విధంగా శ్రీఆంజనేయస్వామి వారు
నాడు, నేడు మరియు ఎల్లప్పుడూ భక్తులను సమ్రక్షించే ఘనదైవమై సప్తచిరంజీవుల్లో ఒకరై శాశ్వతత్వాన్ని , అమరత్వాన్ని, దేవత్వాన్ని, దివ్యత్వాన్ని సంతరించుకున్న మహాయోగీశ్వరుడైన రీతిని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంతతి వారు ఎంతో ఘనంగా ఈ క్రింది సంకీర్తనలో భక్తులెల్లరికి అందించడం విదితమే....
సర్వం శ్రీలక్ష్మీవేంకటేశ్వర సమేత
శ్రీకొండగట్టు వీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏😊🍟🍨💐
http://annamacharya-lyrics.blogspot.com/2020/05/875-hariki-lamkini-hamtaku.html?m=1
hariki lamkiNI hamtaku amtarameTTunnadi - హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
Tuned & Sung by Sri Sathiraju Venumadhav in Raga : Hamsadhwani,
Album : Nivugaliginachalu
హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
కరుణ నింత మన్నించె కమలావిభుఁడు
విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు
ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని
దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె
దేవహితార్థమే జలధిలంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi73ixbLuqXNoexViaKbrmbO8ZzK1i8LTeeug-GRL3zR8OchXHcth7o4FwymPo6jJ_rZyZZj-YyaczX1C4VxSEwePFoE1PRZXsDTNNKr90dEVETDL-6yMGHGvgIDwcF2zM9zfYW750Nqw8w/s1600/1622753974249573-0.png)
No comments:
Post a Comment