Thursday, September 16, 2021

శ్రీ ప్లవనామ సంవత్సర 2021 భాద్రపద గణపతి నవరాత్రోత్సవ శుభాభినందనలు....💐😊🍨🙏💐

చిన్న పిల్లలనుండి వయోవృద్ధుల వరకు ఎల్లరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ శ్రీవినాయకచవితి / వినాయకనవరాత్రి ఉత్సవములు....

ఎందుకంటే ఎవ్వరినైనా ఇట్టే తన అధీనంలోకి తీసుకోగల వైభవం వినాయకుడిది...

శ్రీ చాగంటి సద్గురువుల శ్రీవినాయకవైభవం /
గణేష షోడశనామస్తోత్రం ఇత్యాది ప్రవచనాల్లో
" సుముఖః " అనే నామం గురించిన వ్యాఖ్యానం విన్నవారికి తెలిసినట్టుగా ఎవ్వరినైనా తనవైపునకు ఆకర్షింపజేసుకోగల వదనవైభవం గలిగి ఉండడమే సుముఖః అనే నామం యొక్క క్లుప్తమైన వ్యాఖ్యానం...

గణపతి పరబ్రహ్మం యొక్క వైశ్విక వైభవాన్ని ఎంతో భావగాంభీర్య సారస్వతంతో స్తుతించబడే
" గణపత్యథర్వశీర్​షోపనిషత్ " లోని శృతివాక్యానుగుణంగా...

"
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే॒
నమః ॥ 10 ॥
"

( Hymn excerpt is copied from
https://vignanam.org/telugu/ganapati-atharva-sheersham.html )

అని మనం చదివేటప్పుడు....ఏదో దబ దబ చదివేయడం కాకుండా అందులో గణక ఋషి నిక్షిప్తం గావించిన వైదిక రహస్యసుజ్ఞ్యాన సారాన్ని కూడా గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఆ గణపతి పరబ్రహ్మం యొక్క సంపూర్ణ వైభవం జ్యోతకమై ఎట్లు ఆ గణపతి పరబ్రహ్మమై వర్ధిల్లునో బోధపడును...

నమో వ్రాతపతయే
నమో గణపతయే
నమః ప్రమథపతయే
నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ
విఘ్నవినాశినే
శివసుతాయ
శ్రీవరదమూర్తయే
నమః

నమో వ్రాతపతయే
అనడంలో సృష్టికర్తగా...

నమో గణపతయే
అనడంలో స్థితికర్తగా..

నమః ప్రమథపతయే
అనడంలో ప్రళయకర్తగా..

నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ
అనడంలో యావద్ భువనభాండాలను నిక్షిప్తం గావించుకున్న ఉదరం మరియు ఏకదంతము అనగా ' రెండుకానిది ' అనుదానికి పర్యాయపదముగాము మరియు
' ఈ ఒకటి..ఆ ఒకటి..అలా ఉండే ఎన్నో ఒకట్లకు ఏకత్వ సూచికగా ఉండే ఒకేఒక దంతం..'
అనుదానికి పర్యాయపదముగాము ధ్వనించే ఏకీకృత పరమాత్మ తత్త్వంగా..

అనగా అన్నిటిని తనలో ఇముడ్చుకొని ఉండే ఆదిపరాశక్తి తత్త్వంగా..


విఘ్నవినాశినే
అనడంలో కాలానికి అధినేతగా ఉండే విధాతగా..

శివసుతాయ
అనడంలో సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే నిర్గుణ సదాశివతత్త్వము సగుణసాకార తత్త్వంగా రూపంతరంచెందడంలోని ఈశ్వర విలాసంగా...

శ్రీవరదమూర్తయే
అనడంలో భక్తులకు సదా వరముల అనుగ్రహన్ని వర్షించే అవ్యాజమైన కారుణ్య మూర్తిగా / సకల శ్రీకటాక్షదాయకుడిగా....

నమః
నమస్కరింపబడడం

ఇన్ని విభూతులు గల పరిపూర్ణ పరమాత్మ తత్త్వం కాబట్టే గణపతి ఆరాధనని
" గాణాపత్యం " గా పంచాయతన అర్చావ్యవస్థ లో అంతర్భాగం గావించి శ్రీగణేష భుజంగ స్తోత్రం వంటి ఎంతో గంభీరమైన స్తోత్రాలను శ్రీగణపతిపై రచించి
ఆ వినాయకుడి వైభవాన్ని శ్రీఆదిశంకరాచార్యుల వారు బహుధా కొనియాడారు...

పంచాయతన అర్చావ్యవస్థ అనగా 5 ప్రముఖ భగవద్ తత్త్వాలకు ప్రతీకగ ఉండే పూజా విధానం...

1. సౌరం
2. శాక్తేయం
3. శైవం
4. వైష్ణవం
5. గాణాపత్యం

6. కౌమారం ( పూజలో వెలిగించబడే దీపం యొక్క శిఖ / జ్యోతి యే కౌమారానికి ప్రతీక అనే శ్రీచాగంటి సద్గురువుల వివరణ కొందరికైనా గుర్తుండి ఉండాలి )

ఇక మరొక ఆసక్తికరమైన అంశం
గణపతి ఎలుకను వాహనం గా కలిగి ఉండడం....

ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు వెంటనే ఎవ్వరైనా అనుకునేది / అనేది
"ఏనుగు ఎలుకపై ఎక్కి తిరగడం ఏంటి..విచిత్రమూ విడ్డూరమూ కాకపోతే..."

ఇక్కడ ఇమిడి ఉన్న తత్త్వాన్ని పరికిస్తే...

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా జంతుజాతికి చెందినవైనను ఏనుగు,మర్కటము(కోతి)
మనిషి వలే " ద్వైపం " గా చెప్పబడినాయి...

అనగా ఆహారాన్ని మొదట చేతులతో  స్వీకరించి ఆ తరువాత నోటితో స్వీకరించే ప్రాణులకోవకి చెందడం...

ఏ ప్రాణికి లేనివిధంగా
( 4 కాళ్ళు లేదా (2 కాళ్ళు + 2 చేతులు) కాకుండా ))
5 వ ఉపకరణంగా ఉండే తొండం గల ఎకైక ప్రాణి ఏనుగు...

కాబట్టి ఒకరకంగా కోతి మరియు మనుష్యుడి కంటే కూడా ఉన్నతమైన రీతిలో ఆహారాన్ని 5 వ హస్తం తో స్వీకరించగలిగే ప్రత్యేకత గల ప్రాణి ఏనుగు....

కేవలం దాహానికి నీరు, ఆకలికి తిండి ని అందుకోవడానికి మాత్రమే కాకుండా తన తొండంతో ఎంతో గంభీరంగా ఘీంకరించగల ప్రత్యేకతతో నాదశక్తిని సృజించ గలిగే ప్రాణి ఏనుగు....

అరవడం, మొరగడం, ఊలలు వేయడం లాంటి జంతుసంబంధమైన అపశబ్దకారక ధ్వనులకు
మరియు నాద శక్తితో లయభరితంగా ఘీంకరించగల ఏనుగు కి గల భేదమే, ఈశ్వర సన్నిధిలో గజపూజకు స్థానం లభించేలా శాస్త్రం అనుమతించింది....

1. సాక్షాత్ పరదేవత అయిన ఆవుకు,
2. డెక్కల్లో అమృతత్త్వం కలది మరియు ధర్మానికి ప్రతీకగా ఈశ్వర వాహనం గా ఉండే వృషభానికి,
3. నాదశక్తిని సృజించగల ప్రాణి మరియు గజవదనం లక్ష్మీనివాస స్థానం అయిన ఏనుగుకు,
4. హయగ్రీవుడిగా శ్రీమన్నారాయణుడిని సకల విద్యలకు నెలవైన దైవంగా గావించినందుకు హయాన్ని ( గుర్రాన్ని )

ఈ నాలుగు ప్రాణులను కాకుండా ఇతర మనుష్యేతర ప్రాణులను పరమ పవిత్రమైన భగవద్ సన్నిధి దరిదాపుల్లోకి అనుమతించడం మీరెప్పుడైనా చూసారా..??

కలియుగ ప్రత్యక్ష భూవైకుంఠమైన
శ్రీవేంకటేశ్వర స్వామివారి నాలుగు మాడవీధుల్లో,
వార్షిక బ్రహ్మోత్సవాల్లోని వాహనసేవల్లో
ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, మరియు మనుష్యులు మినహా 5వ ప్రాణిని ఎప్పుడైనా చూసారా..??

నొ...నెవర్...

ప్రత్యక్షంగా...
చక్కని తిరునామ అలంకారవైభవంతో తిరుమాడవీధుల్లో తిరుగాడుతూ భక్తులను తొండంతో ఆశీర్వదిస్తూ,
ప్రతీకగా...
గజవాహనసేవ గా తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని, మరియు తిరుచానూర్లో శ్రీపద్మావతీదేవి అమ్మవారిని వహించి తిరుమాడవీధుల్లో అత్యంత ప్రశస్తమైన శ్రీకరమైన సకల ఐశ్వర్య ప్రదాయకత్వానికి చిహ్నంగా శ్రీవైష్ణవాచార్యులచే కొనియాడబడే సేవ గజవాహనసేవ...

ఈ జన్మలో ఒక వ్యక్తి ఐశ్వర్య దిగ్గజంగా లోకంలో పేరుగాంచాడంటే, ఏదో ఒక జన్మలో ఈశ్వర గజవాహన సేవ యొక్క అనుగ్రహానికి పాత్రుడిగా తరించాడు అని అనడం గజవాహనసేవ యొక్క వైభవం.....

సరే ఇక మన అసల్ టాపిక్ కి వస్తే...

"ఏనుగు ఎలుకపై ఎక్కి తిరగడం ఏంటి..విచిత్రమూ విడ్డూరమూ కాకపోతే..."

ఎలుక లౌకిక / జీవగతమైన సర్వసాధారణమైన గ్రామ్యవిషయ తత్త్వాలకు ప్రతీక...

నా 1స్ట్ క్లాస్ నుండి ఇంటర్ 1స్ట్ ఇయర్ వరకు, 11 సంవతారాల పాటు 2 రూముల చిన్న సిమెంట్ రేకుల ఇంట్లో ఎలుకలతో పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు...

ఎందుకు అనవసరంగా ఊకే అటూ ఇటూ తిరుగుతాయో అర్ధం కాదు...

కింద పడి ఉన్న బియ్యం బుక్కకుండ
ఎందుకు బియ్యం సంచులను అనవసరంగా కొరికి పాడుచేస్తాయో అర్ధం కాదు...

వేలాడే కరెంట్ వైర్లను ఎందుకు కొరికి కరాబ్ చేస్తాయై అర్ధం కాదు....

అవసరం ఉన్నా లేకున్నా కొరుక్కొచ్చిన వస్తువులన్నీ ఒకదెగ్గర ఎందుకు పోగు చేస్తాయో అర్ధం కాదు.....

ఇట్లా ఇల్లున్నది వాటికోసమే అన్నట్టుగా చెవులకు చిరాకు కలిగించే శబ్దాలతో నిత్యం వాటి రభస అంతా ఇంతా కాదు...

మనం జాగ్రత్తగా పరికిస్తే స్థూల స్థాయిలో మనుష్యుడికి తెలియకుండానే మనిషి ఈ మూషికత్వం తో జీవించేస్తుంటాడు...

ఎందుకు అనవసరంగా పనికిరాని ప్రదేశాలకు తిరుగుతాడో అర్ధం కాదు...

తన ఉదరానికి అవసరం ఉన్న పరిమితి దాటి బ్రేవ్ బ్రేవ్ అంటూ ఎందుకు మెక్కుతాడో అర్ధం కాదు...

తనకు అవసరంలేని విషయాల్లో ఎందుకు తలదూర్చుతాడో అర్ధం కాదు....

అవసరం లేకున్నా కొనుక్కొచ్చి వివిధ వస్తువులన్నీ ఎందుకు పోగు చేస్తాడో అర్ధం కాదు....

ఇట్లా లోకం ఉన్నది కేవలం మనుష్యుల కోసమే అన్నట్టుగా నిత్యం కొందరి మనుష్యుల గోల అంతా ఇంతా కాదు...

గణపతి గా ఉన్న పరబ్రహ్మం ఎలుకను వాహనం గా కలిగి / అధివసించి మనకు దర్శనాన్ని ప్రసాదించడం అంటే,

మనుష్యులకు గల ఈ గ్రామ్య లాలసతను పరిధిలో ఉండేలా పరిణతతో జీవించే సమర్ధతను కటాక్షించడం....

అనగా

అనవసరమైన గోలను తగ్గించుకుంటూ జీవితంలో క్రమక్రమంగా
" మా నవతి ఇతి మానవః " అనే శృతివాక్యానికి అనుగుణంగా జీవితాన్ని ఆత్మోద్ధరణ వైపునకు నడిపించుకుంటూ సాగగలిగే మేధోదక్షతను కటాక్షించడం...

ఇది అనడానికి చాలా సింపుల్ గా ఉన్న...

" ఎదుట 10 లడ్డూలు ఉన్నాయి...అన్నీ నీకే...కాని ఇప్పటికి రెండు తిను చాలు..."
అని అనుకోవడానికి మరియు ఆచరణలో పెట్టడానికి ఎంత భేదం కలదో...

ఇది కూడా అంతే....

"పది సంవత్సరాల క్రితం భాద్రపద శుద్ధ చవితికి గణపతికి మ్రొక్కినప్పుడు మనకు గల మేధో పరిణత మరియు ఇప్పుడు మనకు గల మేధో పరిణత ఎట్టిది...."
అని ఎవరికి వారే వారికి వారు తమ అంతరంగాన్ని బేరీజు వేసుకోవడంలో ఆ గణపతి యొక్క అనుగ్రహవైభవం జ్యోతకమౌతుందనేది
నా యొక్క భావన...

శ్రీ చాగంటి సద్గురువుల గజేంద్రోపాఖ్యాన ప్రవచనాలు విన్నవారికి తెసిలినట్టుగా...

సంస్కృతంలోని అనులోమ విలోమ సామ్యము చేత

గజ..జగ...
సిమ్హ...హింస....

గజము జగమునకు సంకేతం...

"జాయతే గచ్ఛతే ఇతి జగత్..."
అని కదా సద్గురువుల ఉవాచ....

"హమ్మ్....." అనే ధ్వని జీవాంతర్గతమైన నాదానికి / నాదశక్తికి ప్రతీక....

"గం...." అనే ధ్వని గ వాచకం హమ్మ్ తో సగమించగా ధ్వనిస్తుంది....

"ఓం గం గణపతయే..." అనే మంత్రం బాగా స్లొ గా
( 1x నార్మల్ స్పీడ్ ఐతే
0.1x స్లో డౌన్ పేస్ లో ఒకసారి రెహార్స్ చేయండి...మీకు క్లియర్ గా అర్ధమైతది.... )

అనగా వస్తూ పోతూ ఉండే అశాశ్వతమైన జగత్తునకు
+
ఎప్పుడూ ఉండే శాశ్వతమైన నాదశక్తికి అనగా
ప్రాణ / జీవాత్మ / పరమాత్మ శక్తికి సూచకంగా...

అనగా ప్రకృతి+పరమాత్మ ఇరు తత్త్వాల సమ్మేళత్వానికి గణపతి బీజాక్షరం
" గం " సూచిక.....

అనగా అశాశ్వతమైన ప్రకృతిలో / ప్రకృతితో ఉంటూనే శాశ్వతమైన పరమాత్మ తత్త్వాన్ని ఆకళింపుగావించుకొని జీవితానికి ఆపాదించుకొని తరించడంలో గణపతి యొక్క అనుగ్రహం కీలకమై వర్ధిల్లుతుంది.....

ఇవ్విధంగా జీవుడి అసంఖ్యాక జీవపరంపరల్లోని జీవిత గమనానికి భద్రతను ఒసగే భాద్రపద గణపతి నవరాత్రి ఉత్సవాలు / గణపతి యొక్క విశేష ఆరాధనతో ఎల్లరూ తమ తమ జీవితాలను తరింపజేసుకొనెదరు గాక...

నా జీవితాన్ని ఎంతో ఘనంగా తీర్చిదిద్దిన,
మా కాలేజ్ కాంపస్ ( పద్మశ్రీ డాక్టర్ బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, నర్సాపూర్, మెదక్ )  ) లోని ఆలయంలో,
అత్యంత కట్టుదిట్టమైన గాణాపత్య
ఆచార వైభవంతో నెలకొన్న ఆ విద్యాగణపతి యొక్క శ్రీచరణారవిందాలకు ప్రణమిల్లుతూ....

ఎల్లరికీ గణపతి నవరాత్రోత్సవ శుభాభినందనలు.... 😊🍕💐🍨

( నా పాత పోస్టుల్లో ఉటంకించబడిన గణపతి వైభవం ఈ క్రింది అంతర్జాల పుటల్లో కలదు...

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_21.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/httpswww.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/09/blog-post.html?m=1
)


No comments:

Post a Comment