Thursday, December 23, 2021

కె.ఎల్ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పురస్కార ప్రదానం సందర్భగా, శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు ఒక శిష్యపరమాణువుయొక్క సవినయ సాష్టాంగ ప్రణామపూర్వక ఆభినందనానమస్సుమాంజలి....

ఫలానా వ్యక్తి / వ్యవస్థ వారి విద్వత్తును గుర్తించి గౌరవించడం / సత్కరించడం తో ఆయా వ్యక్తుల / వ్యవస్థల గౌరవం / పేరుప్రఖ్యాతలు మరింతగా ఇనుమడింపబడినాయి అని అనడం విశేషం.....

వృత్తిరీత్యా అందరిలా ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ( FCI లో విశ్రాంత ఉన్నతాధికారులు ) గా ఉంటూనే వారు ఒక అసాధారణ ప్రవచనకర్తగా / ఆధ్యాత్మికవేత్తగా / సద్గురువులుగా / వారి మాటను వేదవాక్కులా గౌరవించే వేవేల అధ్యాత్మ జిజ్ఞ్యాసాపరుల / శిష్యుల హృదయసీమల్లో కొలువై అర్చింపబడే ఆరాధ్యదైవంగా వారి గత 2 దశాబ్దాలా జీవిత ప్రస్థానం అనన్యసామాన్యమైనది....

ప్రశాంతంగా, పద్ధతిగా టిఫిన్ / లంచ్ / డిన్నర్ కూడా చేయలేనంత బిజీ గా ఉండే బ్రతుకుల్లో ఆధ్యాత్మికత, దేవుడు, పురాణాలు, శాస్త్రాలు, పద్ధతులు, ఇత్యాదివాటి గురించి ఆలోచించేంతటి తీరిక, మక్కువ లేనటువంటి ఈ రోజుల్లో....

ఉమామహేశ్వరుల వైభవ వర్ణనలను
ఉదయం అల్పాహారం లా ఆబగా ఆరగించగలగడం...

మహాభారత రామాయాణ ఇతిహాసాల్లోని మహోత్కృష్టమైన గాథలను, ధర్మాలను, 
ధర్మసూక్ష్మాలను మధ్యాహ్న మహానివేదనం / భోజనం లా ఆకళింపుజేసుకోగలగడం...

రసరమ్యమైన వివిధ అధ్యాత్మ కావ్యాలాప కథామృతాన్ని కమనీయమైన రాత్రి భోజనం లా ఆస్వాదించగలగడం...

అక్కడక్కడా వారు పండించే హాస్యభరిత కథాలాపనలే మధ్యమధ్యలో ఈవినింగ్ స్నాక్స్ లా ఆనందించగలగడం... తో...
ఆధ్యాత్మికత అనేది ఈ నవయుగజీవనంలో కూడా 
ఎంతో మంది భక్తభాగవతశిష్యకోటి
జీవితాల్లో అంతర్భాగమై ఒప్పారుతూ...
తన్మూలంగా "శృణ్వన్ తపః" అనేలా మనకు తెలిసినా తెలియకున్నా ఋషిఋణాన్ని తీర్చుకునేలా ఒక నిరంతర అధ్యాత్మ యజ్ఞ్యాన్ని ఆచరింపజేస్తూ ఎల్లరి జీవితాలను పండిస్తూ పరమాత్మవైపునకు నడిపిస్తున్న కనిపించే నడిపించే కరుణించే దైవమై శ్రీచాగంటి గారు ఇవ్వాళ కొన్ని కోట్ల హృదయసీమలను ఏలుతున్న అనితరసాధ్యమైన అధ్యాత్మజ్ఞ్యానయజ్ఞ్య సోమయాజి..!!

బాగుపడే యోగం రవ్వంతైనను ఉండని కొన్ని బ్రతుకులకు, ఈశ్వరుడి పేరు పలకడం అనేది వారి జీవితాలో ఎప్పుడో కొన్ని నెలలకు ఒక్కసారి ఎదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు 
" ఈ గుడిలో ఉన్నది ఏ దేవుడి విగ్రహం అండి...?"
అని అడిగినప్పుడు మాత్రమే సంభవించే అంశం....

గంగా నదిలో నిత్యం ఉంటున్నా సరే వాసపుణ్యం కూడా లభించని దౌర్భాగ్య మకర ప్రాణిలా...

అటువంటి వారికి శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కుల వైభవం గురించిన అవగాహనా లేమితో ఇలాంటి కథనాలు గొప్ప విషయంలా అనిపించకపోవచ్చు.....

భగవద్ నామాన్ని ఆలంబంగా గావించి, ఆగమోక్త ఆలయంలోని  భగవద్ మూర్తి నుండి విశేషమైన అనుగ్రహాన్ని ఎట్లు బడసి తరించవలెనో తెలియజేసి..
ఎవరి జీవితాలను వారే తీర్చిదిద్దుకునేలా యోగ్యతను కటాక్షించి అనుగ్రహించే వారి ప్రవచనాప్రస్థానంలోని
వైభవాన్ని ఒడిసిపట్టిన వారికి....

సద్గురువులకు అందివ్వబడే ఎట్టి గౌరవ సత్కారమైనను విశేషమైనదే...

వారు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోకఠోర పరిశ్రమతో శాస్త్రపురాణాల సారాన్ని నిరంతర అధ్యయనంతో అందిపుచ్చుకొని అత్యంత సరళమైన రీతిలో భక్తులకు, శిష్యులకు ఆందిస్తూ జీవించడం ఎంతో ఉత్కృష్టమైన జీవనం....

ప్రవచనకర్తగా ఒక శాస్త్రీయ కళను గౌరవభరితమైన రీతిలో ఆవిష్కరించడం ఒకెత్తైతే...

ఆ కళతో ఎదుటివారి జీవితాలను ఎంతో గొప్పగా ప్రభావితం చేయగలగడం ఒకెత్తు....

వారు స్పృశించని అధ్యాత్మ అంశం లేదు....
వారు శ్లాఘించని మహనీయులు లేరు...
వారి రసనపై అప్రతిహత శారదాప్రవాహమై ప్రభవించి శ్రోతలను రంజింపజేయని కావ్యమధురిమ లేదు...
వారి ఉన్నతోన్నతమైన శాస్త్రసంప్రదాయ వస్తువిషయ పరిశీలనాత్మకా శక్తికి అందని అంశంలేదు....
వారి విశ్లేషణాత్మకవైభవంలో
ఒదగని అధ్యాత్మ తత్వంలేదు....

ఇలా చెప్పుకుంటూ పోతే......
వారి దీక్షాదక్షతకు, వారి వాగ్వైభవానికి, వారి వివేచనకు, మేయమవ్వగల ఉపమానం లభించలేనంతటి మహనీయవ్యక్తిత్వమై ఈనాడు ఎందరెందరికో వారి ప్రహృష్ట వచనాలు వివిధ రీతుల దిక్సూచియై అలరారుతున్నాయంటే వారు ఈ తరానికి లభించడం ఈ తెలుగు నేల చేసుకున్న తరతరాల పుణ్యాల పంట...

ఒక డాక్టరేట్ లభించడం వారి కీర్తికిరీటంలో మరో కలికీతురాయి అయినాసరే...వారు ఏనాడు కూడా ఏ కిరీటాలను పెద్దగా పట్టించుకున్న వారు కారు...
వాటికి అతీతంగా తమ పంథాలో యథావిధిగా ఎల్లరి ఆత్మోద్ధరణ యజ్ఞ్యంలో మున్ముందుకుసాగడమే వారి శైలి....

కె.ఎల్ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పురస్కార ప్రదానం సందర్భగా, వారి శ్రీచరణాలకు ఒక శిష్యపరమాణువుయొక్క సవినయ సాష్టాంగ ప్రణామపూర్వక ఆభినందనానమస్సుమాంజలి....
😊💐
🙏🙏🙏🙏🙏

शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ॥ 1 ॥

No comments:

Post a Comment