Wednesday, December 1, 2021

శ్రీ చెంబోలు సీతారామశాస్త్రి గారికిఒక సాహిత్యాభిమాని యొక్క చిరు సవినయ సాహిత్య నివాళి...

అనంతమైన పదసంపదను తెలుగు సినీ జగత్తుకు అందించి...
"జగమంత కుటుంబం నాది..." అని జగత్తు యావత్తు తమ పాటలపూదోటలో సేదతీరేలా వేలకొలది పాటలను మనకు ప్రసాదించి వారు కానరాని లోకాలకు ఏగినారు.... ​

"ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి..."
అనే మయూరనర్తనంలా వారి సరళ సాహిత్య రచనాశైలిలో నిత్యనూతనంగా నర్తించిన పదాలెన్నో ఎన్నెన్నో....

"ఎవ్వరినెప్పుడు తన వలలో
బంధిస్తుందో ఈ ప్రేమ..."
అంటూ ఎన్నెన్నో భావగంభీరమైన సాహితీ పదబంధనాలను అల్లిన అందెవేసిన చెయ్యి వారిది...

ప్రవచనా ప్రస్థానంలో
శ్రీమల్లాదిచంద్రశేఖరశాస్త్రి గారు, 
శ్రీచాగంటి గారు,
శ్రీసామవేదం గారు, ఇత్యాది అగ్రగణ్యులు....

నటనా ప్రస్థానంలో ఎస్.వి.ఆర్ గారు, ఏ.ఎన్.ఆర్ గారు, ఎన్.టి.ఆర్ గారు, కృష్ణ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు,... ఇత్యాది అగ్రగణ్యులు...

సంగీత ప్రస్థానంలో మహదేవన్ గారు, రాజ్కోటి గార్లు, ఇళయరాజ గారు, మణిశర్మ గారు,... ఇత్యాది అగ్రగణ్యులు....

భక్తి పాటల గాత్ర  ప్రస్థానంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి గారు, శోభారాజు గారు, బాలమురళి గారు....

సినిమా పాటల ప్రస్థానంలో
సుశీల గారు, జానకి గారు, వాణీజయరాం గారు, 
బాలు గారు,...ఇత్యాది అగ్రగణ్యులు....

సినీ సాహిత్య ప్రస్థానంలో 
ఆత్రేయ గారు, సి.నా.రె గారు, వేటూరి గారు, సిరివెన్నెల గారు.....ఇత్యాది అగ్రగణ్యులు....

పాతతరం, కొత్తతరం అనే రెండు ఎల్లలకు వారధిలా ఉండి వారి వారి మార్గాల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడే అధ్యాయాన్ని సృజించిన మేటి కళాకారులు....

ఎన్ని వస్తువులు/పదార్థాలు ఉన్నా సరే....
ఏసమయంలో ఎంత మోతాదులో
అగ్నిని అందించాలో అలా అందించి ఆ వివిధ పదార్థాలన్నీ కూడా ఒక చక్కని ఆస్వాదయోగ్యమైన వంటకం గా రూపాంతరం గావించడమే వంట యొక్క గొప్పదానికి మేయమై పరిఢవిల్లుతుంది....

అదే విధంగా ఎన్ని వస్తువులు / ఎంత మంది ఆర్టిస్ట్లు ఉన్నా సరే....
ఒక సినిమాలోని మాటలకు పాటలకు
ఏసమయంలో ఎంత మోతాదులో
ఎట్టి అక్షరసిరిని అందించి సన్నివేశాలను రక్తి కట్టించాలో ...
అవ్విధంగా తగు రీతిలో సారస్వతాగ్ని శక్తిని అందించి ఎల్లరూ  ఆనందించగల చిత్రం గా ఆ వస్తు/వ్యక్తి సముదాయాన్ని రూపాంతరం గావించడమే సదరు సినిమా యొక్క వైభవానికి కొలమామై పరిఢవిల్లుతుంది....
అనేది జగద్విదితమైన సత్యం.... 

అట్టి సరళ సారస సారస్వతాన్ని తమ కలం నుండి నిరంతర అమృతధారగా జాలువార్చడంలో సిరివెన్నెల గారు సిద్ధహస్తులు అనేది వారి వందల కొలది రచనల్లో ఎల్లరూ నెమరువేసుకునే సత్యం...

అది శోకరసమైన, శాంతరసమైన, ఇతర ఏ రసమైనా సరే...నవరసాలను తమ రచనల్లో ఒలికించి ప్రేక్షకులను రంజింపజేయి విధంగా తమ కలాన్ని దేశకాలానుగుణంగా నర్తింపజేసే సాహిత్యనటరాజమూర్తి సిరివెన్నెల గారు...

కొందరు వ్యక్తులు, కొన్ని వ్యక్తిత్వాలు
ఈ భూమిపై ఎన్నటికీ తరగని కీర్తి
కెరటాలతో శోభిల్లే వైభవంతో అలరారే వారిగా భగవద్ అనుగ్రహంగా ప్రభవిస్తారు....

శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒక దెగ్గర...
ఆమ్మవారు " శర్మదా శర్మదాయిని..." అని ఆరాధింపబడుతూ ఆరాధించిన వారికి విశేష కీర్తిని అనుగ్రహించే రీతిని తెలిపినారు కదా... 
అవ్విధమైన అలౌకిక వాగ్దేవి అనుగ్రహ భరిత సారస్వతవిద్వణ్మూర్తులు శ్రీసీతారామశాస్త్రిగారు....

రజతాద్రికి పద పద మని పవిత్రమైన కార్తీక జ్యోతులతో స్వాగతించి శ్రీకైవల్య సిద్ధిని అనుగ్రహించడానికి పరమేశ్వరుడు తొందరపెట్టాడో ఏమో....

" ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం "

అనే అత్యత్భుతమైన పదాల కలబోత గా అందించబడిన పాటను 
(వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్) అందించిన వారి కలం, ఇక సెలవు..., అంటూ తన అక్షరసేద్యానికి స్వస్తి పలికింది....

" హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం "...

అని అని పలికిన వారి రచనలా....
తెలుగు సినిసాహిత్య హృదయానికి
తీరని గాయం వారి నిష్క్రమణం.....

" నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం
నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని.."

లాంటి ఎన్నో ఎన్నెన్నో భావుకతా భరిత 
సాహిత్యసౌగంధికాసుమసరాలతో అలంకరింపబడిన
తెలుగు సినీసంగీత మగువ సిగలోని 
అరవిరిసిన ముద్దమందారంలా వారి కీర్తి అజరామరమైన ప్రభలతో తెలుగు సాహితీ లోకానికి దార్శనికమై దేదీప్యమానంగా వెలుగొందుతూ ఎల్లరికీ తమ కవనకదంబకుసుమపరిమళాలను
అలదుతూనే ఉంటుంది......

మీరు ఏ లోకానికి ఏగినా సరే
...అనతికాలంలోనే సరికొత్త నామరూపంతో మీ వైరించి శక్తి ఈ తెలుగు నేలకు మళ్ళీ దిగిరావాలని ఆశిస్తూ....

శ్రీ చెంబోలు సీతారామశాస్త్రి గారికి
ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు సవినయ సాహిత్య నివాళి...
ఓం శాంతిః శాంతిః శాంతిః..
🙏💐

No comments:

Post a Comment