Friday, January 14, 2022

శ్రీప్లవనామ సంవత్సర వైకుంఠ ఏకాదశి / భోగి( శ్రీగోదారంగనాథ కల్యాణం ) / సంక్రాంతి / కనుమ / ముక్కనుమ పండగ శుభాభినందనలు.....😊🙏🍕🍧🍦🎂🍨💐

( శ్రీగోదారంగనాథ కల్యాణం ) / సంక్రాంతి / కనుమ / ముక్కనుమ పండగ శుభాభినందనలు.....😊🙏🍕🍧🍦🎂🍨💐

శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాలను ఆలంబనగా గావించి జీవితాలను స్వయంకృషితో తీర్చిదిద్దుకున్న అధ్యాత్మ తత్త్వచింతనాపరులకు తెలిసినట్టుగా....

ఈ కలియుగంలో రాక్షస ప్రవృత్తికి ఉపాధి మనుష్యుడి మనసే...
కృత, త్రేత, ద్వాపర, యుగాలలో ఉన్నంత ప్రస్ఫుటమైన దర్శనీయ రీతిలో రాక్షసులు ఉండకపోవడం ఈ యుగంలోని అతి పెద్ద సమస్య....

కాబట్టి  ఈ కలియుగంలో దేవ ప్రవృత్తికి కూడా మనుష్యుడి మనసు చక్కని ఆవాసం కాగలదు... 
( అందుకు తగు సంస్కార వైభవం తోడైనప్పుడు )

పైకి చూడ్డానికి కడక్ బట్టలు కట్టుకొని పెద్దమనిషిలా ఉండే వ్యక్తి ఎంత మంది కొంపలు ముంచిన ముదనష్టపు వ్యక్తో కేవలం బాధితులకు మాత్రమే తెలిసి ఉంటుంది.....
ఎందుకంటే వాడిలోని రాక్షసత్వం పైన పౌడర్ పూసుకున్న చక్కని మేనికి ఆవల దాగున్న కనిపించని కర్కషత్వం.....
బాధితుడిగా ఉండకుండానే వాడి రాక్షసత్వం గురించి తెలుసుకోవాలంటే వాడి మాటను, బాటను, క్షుణ్ణంగా అధ్యయనం గావించగల వారికి మాత్రమే అర్ధమయ్యే అంశం అది.....

పైకి చూడ్డానికి నార్మల్ దుస్తులు ధరించిన సాదాసీదా వారిలా ఉన్నా ఒక వ్యక్తి ఎందరో జీవితాల్లోని వైభవానికి కారణమై ఉండడం అనేది వారి జీవితాన్ని, జీవిత సంఘర్షణలను, అధ్యయనం గావించిన వారికి మాత్రమే అర్ధమయ్యే అంశం....

ఎందుకంటే వారిలోని దైవత్వం పొగమంచు మాటున దాగి ఉన్న పున్నమివెన్నెల యొక్క వన్నెల వంటిది....
అజ్ఞ్యాన గ్రంథి కారక బహుబలీయమైన జీవ జడత్వం పై అధ్యాత్మ సాధనతో విజయాన్ని సాధించి ఆంతర తపోయజ్ఞ్య జనిత సుజ్ఞ్యాన దీపికల వెలుగుల్లో వారి దైవత్వాన్ని ఆకళింపుజేసుకోగల వారికి మాత్రమే అది దర్శనీయమై ఉండే అంశం.....

ఒక MBBS డాక్టర్ ని మనం.....

" ఎందుకు మీరు ఈ పేషెంటును ఒకలా ట్రీట్ చేస్తున్నారు....ఆ పేషెంటును ఒకలా ట్రీట్ చేస్తున్నారు...."

అని అడగడానికి వీల్లేదు...

ఎందుకంటే రోగి నాడిని బట్టి శరీరాంతర్గతంగా కొలువువైన రుగ్మత రీత్య పైకి ఒకేలా ఏదో జ్వరంతో మూలిగే వారిలా ఉండే పేషెంట్లైనను....ఆంతరమున వారిరువురి రోగాలు వేరు వేరు.....

కాబట్టే సదరు డాక్టర్ గారు ఇద్దరు పేషెంట్లకు అవ్విధమైన భేదాలు పాటిస్తూ వారికి ఉన్న రోగాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు....

ఎవరైనా ఇంకా ఎక్కువగా మాట్లాడాలని చూస్తే....

"సిస్టోల్ / డయాస్టోల్ రీడింగ్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా అర్ధంకాని వాడివి..... నేనేం చెయ్యాలో నువ్వు చెప్తున్నవ...?
డాక్టర్ ని నేనా... నువ్వా...??
నలుగురిలో చెప్పుతీసుకొని కొడితే మొహం ఎక్కడపెట్టుకుంటావ్....???
ఇష్టం ఉంటే పేషెంట్ ఉంటడు....
లేదా వేరే హాస్పిటల్ కి వెళ్తడు...
నా వైద్య ప్రక్రియలో తలదూర్చేందుకు నువ్వెవడివి...????
"
అని కూడా అనగలరు......

అచ్చం అదే విధంగా....
మనుష్యుల మనసు యొక్క నాడిని పట్టే అధ్యాత్మవేత్తలు కూడా ఒక్కొక్కరిని ఒక్కోలా డీల్ చేస్తుంటారు..

వారిని ప్రశ్నించే అవసరం కాని, అర్హత కాని, సామాన్యులకు ఉండవు....
ఎవరైనా ఇంకా ఎక్కువగా మాట్లాడాలని చూస్తే....

" నడు కాణిపాకం సిద్ధి వినాయకుడి గుడికి...
సత్యప్రమాణాలు చేద్దాం...
అట్నుండి అటే తరిగొండ లక్ష్మీనరసిమ్హ స్వామి గుడికి కూడా పద...నీ మెదడులో ఉన్న విషమంతా కక్కిస్తా...
మీ బద్మాష్ బత్కులను అక్కడే ఎండగడ్తా....
అప్పుడు గాని మీ కుక్కతోక వంకర లాంటి లెక్కలు సక్కబడవు...."
అని నలుగురిలో చెప్పుతీసుకొని కొట్టినట్టుగా మాట్లాడగలరు....

ఈ కలియుగానికి గల గొప్పదనం కూడా శ్రీచాగంటి సద్గురువులు వారి శ్రీమద్భాగవతాంతర్గత ప్రవచనాల్లో బహుబాగా తెలిపి ఉన్నారు.....
"భగవద్ నామాన్ని ఆలంబనగా గావించి... త్రికరణశుద్ధితో ఒక పుణ్యకార్యాన్ని మనసులో సంకల్పించినంత మాత్రాన ఆ పుణ్యకార్యాచరణ ఫలితం సంప్రాప్తింపజేయగల గొప్ప అధ్యాత్మ సాధనానుగ్రహకారక యుగం...ఈ కలియుగం...."

కాబట్టి మనుష్య ఉపాధిలో
అధ్యాత్మరాహిత్య జీవనంతో రాక్షసత్వం ఎంత తొందరగా ఆవాసం ఏర్పరచుకోగలదో.....
అధ్యాత్మజీవనం తో దైవత్వం కూడా అంతే త్వరగా ఆంతరమున సాగే సాధనతో మూర్తిభవించగలదు.....
( ఇక్కడ అధ్యాత్మ జీవనం అంటే పూజలు, గుళ్ళు గోపురాలు అని కాదు....
ఈశ్వర స్పృహతో సాగే లౌకిక జీవితంలో భగవద్ నామమే ఆలంబనగా, సాధనంగా సాగే జీవనయానం మరియు అందలి జీవ జీవేశ్వర పరమేశ్వర భావ సారూప్యతతో సాధించబడే అద్వైత తత్త్వ సిద్ధి.... అని విజ్ఞ్యులు భావించవలే.....)

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి అత్యత్భుతమైన సంకీర్తనల్లో ఒకటైన 

" సేవించుడీ మ్రొక్కుడీ శ్రీపతి యితడు
భావించుడీ మదిలోస పట్టుడీ యీరూపు "

అనే సంకీర్తనలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని వర్ణిస్తూ...
" అరుదయిన శంఖచక్ర హస్తాలవిగో..."
అని ఈ క్రింది చివరి చరణంలో స్వామి వారి శంఖచక్ర వైభవాన్ని కొనియాడినారు....

" వరము లిచ్చే హస్తము వరుస కటి హస్తము
అరుదయిన శంఖచక్ర హస్తాలవిగో
సరి మకర పత్రాలు శశిసూర్యనేత్రములు
శిరసుపై కిరీట మదే శ్రీవేంకటపతికి "

శ్రీవేంకటేశ్వరస్వామి వారు ఆనందనిలయంలో  కరచరణాదులతో తిరుగాడుతూ అందరికీ అందుబాటులో ఉన్న సమయంలో తొండమాన్ చక్రవర్తికి వారి బంధువులకు మధ్య అధికారం కోసం యుద్ధం జరిగినప్పుడు గావించిన శరణాగతికి అనుగ్రహంగా స్వామి వారు ఏకంగా వారి శంఖచక్రాలనే కానుకగా రక్షణకు ఇచ్చి యుద్ధంలో గెలిపించిన ఘట్టం గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపి ఉన్నారు....

తరువాత చాలాకాలానికి శ్రీరామానుజాచార్యుల వారి శ్రీవైష్ణవస్థిరీకరణలో భాగంగా స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా యోగమార్గంలో ఆనందనిలయంలోకి ప్రవేశించి స్వయంగా స్వామివారికి శంఖచక్రాలను వారే ధరింపజేయడం.....
ఒకే నాగాభరణంతో ఉన్న స్వామివారికి అచ్చం అదే విధమైన మరొక నాగాభరణం ఇంకో భుజానికి అలంకరింపజేయడం....
స్వామివారి వక్షసీమలో బంగారు శ్రీభూసతులను కొలువైఉండేలా చేయడంతో ఈ కలియుగ ప్రత్యక్ష ఈశ్వర సాకార స్వరూపాన్ని శ్రీవేంకటేశ్వరుడిగా....
సకలవిధమైన శ్రీ కి నిలయమైన శ్రీనివాసుడిగా....
భూగత శ్రీవైష్ణవపరతత్త్వ ఉనికికి ప్రత్యక్ష నెలవుగా శ్రీవేంకటేశ పరబ్రహ్మంగా స్వామివారిని భక్తులెల్లరికి 
నిత్యనూతనంగా " అందుబాటులోకి " తెచ్చిన వైనాన్ని గమనించగలిగితే....

స్వామివారికి ఆచార్య స్థానంలో ఉండి 

( తిరుమల ఆలయ ఉత్తర ఈశాన్యంలో దక్షిణాభిముఖంగా స్వామి వారి హృదయసీమకు సమాంతరంగా శ్రీభాష్యకార్ల సన్నిధి ఉండడం మనం గమనించవచ్చు.....అనగా గురువుగారి అనుగ్రహాన్ని గుండెలనిండుగా నింపుకున్న గోవిందుడిగా వెలుగుతున్న పరతత్త్వం అని తత్త్వసూచిక......)

శంఖచక్రాలను పునః స్థిరీకరించడం అంటే ఏంటి.....?

యావద్ విశ్వంలో ఎక్కడ ఉన్నా సరే 
స్వామి వారు ఒక్కసారి సంకల్పించినంత మాత్రాన వచ్చివాలగల సుదర్శన పాంచజన్యములను, ఆచార్యుల వారు స్వామివారికి కొత్తగా ధరింపజేయడం ఏంటి...??

"నిరాయుధపాణి గోవిందా..."
అని అనిపించుకోవడం ఎందుకు...?
మరలా వాటిని ధరించి 
" శంఖచక్రధర గోవిందా..."
అని అనిపించుకోవడం ఎందుకు...??

అసలు పూర్తిగా తొండమానుడికి ఇచ్చేయడం ఎందుకు....?
మరలా శ్రీవైష్ణవపరతత్త్వ స్థిరీకరణం పేరిట 
ధరింపజేసుకొనే జగన్నాటకం ఎందుకు..??

అసల్ ఎందుకు...??

అని అంటే....
"లోకకల్యాణం కొరకు...." అని అనడం సర్వసాధారణమైన సమాధానం.....

అది ఎవ్విధంగా అనేదే ఈ కలియుగ ప్రజలు వారి వారి జీవితాలకు అన్వయించుకొని ఆపాదించుకొని ఆమూలాగ్రం భగవద్ తత్త్వాన్ని ఒడిసిపట్టి తరించడం తో ఎరుకలోకి వచ్చిన ఈశ్వరతత్త్వంగా పరతత్త్వాన్ని ఆకళింపుజేసుకోవడంలో జీవనసాఫల్యం దాగుంటుంది.....

అప్రతిహత సూర్య శక్తిని భరించలేకపోతున్న
ఛాయాదేవి విన్నపానికి విశ్వకర్మ ఆ మహోగ్ర సూర్యతేజస్సును కొంత తగ్గించడానికై 

శ్రీకంఠుడికి త్రిశూలం....
శ్రీహరికి సుదర్శనచక్రం.... 

తయారుచేయించడంతో సూర్యుడి ఆత్మశక్తి కారక తత్త్వం సుదర్శనచక్రానికి కూడా ఆపాదింపడుతుంది...

క్షీరసాగరజనిత చంద్రుడి శక్తికి సామ్యముగా, సుజ్ఞ్యానసిరిదాయకమైన సాధనంగా,
అమేయమైన నాదశక్తిని అనగా జీవశక్తిని అనగా మనోశక్తిని సృజించగల వాద్యపరికరంగా శంఖానికి గొప్ప ప్రాభవం కలదు.....
 
కాబట్టి శంఖచక్రాలు కేవలం శ్రీహరి ధరించిన శస్త్రాలేకాదు....
అవి సూర్య చంద్ర శక్తి కారక తత్త్వ సాధనాలు కూడా.....

సూర్య చంద్ర శక్తులు అనగా 
సూర్య కారక ఆత్మ శక్తి...మరియు
చంద్ర కారక మనః శక్తి...
అవి లుప్తమైన నాడు అసలు జీవుడికి మనికే ఉండదు....

లౌకికంగా బాహ్యంలో వాటిని తొండమాన్ చక్రవర్తికి ఒకానొక సందర్భంలో ఇచ్చి వేయడం అనగా....
ఆంతరమున సూర్య చంద్రులకు కూడా అతీతంగా వెలిగే పరత్త్వమును నేను అనే సార్వకాలిక సత్యశ్రేష్టం ప్రతిపాదింపబడడం.....

వాటిని ఆచార్యముఖేన తిరిగి ధరింపజేసుకొని భక్తులకు "శంఖచక్రధర గోవింద...." గా దర్శననివ్వడంలో...
ఎవ్వరికీ పట్టుబడని పరతత్త్వానికే
మనో శక్తి కారక....
ఆత్మ శక్తి కారక....
తత్త్వసూచికలైన శంఖచక్రాలను ధరింపజేసి ఇతరులకు వాటి అనుగ్రహాన్ని వర్షింపజేయగలిగే రీతిలో ఆ పరతత్త్వాన్ని ఎల్లరికీ ఎరుకలోకి తీసుకురాగల భగవద్స్వరూపులు ఆచార్యులు / గురువులు అనేది ఇక్కడి అధ్యాత్మ తత్త్వ సందేశం..... 

కాబట్టి అనునిత్యం ఆత్మ శక్తిని... మనః శక్తిని....
ఏకకాలంలో కటాక్షించే అరుదైన పరదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి అమేయ అనుగ్రహం ఈ కలియుగ భక్తులకు ఎల్లకాలం లభిస్తూ తరించేలా పరతత్త్వ స్థిరీకరణం అనే శాశ్వతత్వం ప్రత్యక్ష పరమాత్మకు ఆపాదింపబడి భక్తులెల్లరి అభీష్టసిద్ధి నెరవెరేలా ఆ శ్రీవేంకటేశ్వరుడు, శ్రీనివాసుడు,
" అరుదయిన శంఖచక్ర హస్తాల " వాడిగా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారిచే కీర్తింపబడినాడు.....

( మీరు గమనించి ఉండి ఉంటే...
మిగతా అభరణాలన్నీ కూడా గురువార నేత్రదర్శనం సడలింపులో భాగంగా తొలగించబడినా సరే.....
శుక్రవార పూరాభిషేక సేవ / నిజపాదదర్శన సేవలో కూడా స్వామివారిచే సదా ధరింపబడి ఉండే ఆభరణాలు శంఖచక్రాలు.....  అవి కేవల ఆభరణాలు కాదు కాబట్టే భగవద్ రామానుజాచార్యుల వారి ఆనతి మేరకు ఇప్పటికీ మరియు ఎప్పటికీ అవి ధరింపబడిన 
శ్రీవేంకటేశ్వర స్వామివారినే భక్తులెల్లరు దర్శించి తరించేది.... )

శ్రీవేంకటేశ్వర స్వామి వారి నిజపాదర్శనంలో, అస్మద్ గురుదేవులు, శ్రీచాగంటి సద్గురువుల పాదపద్మాలను కూడా దర్శిస్తూ..... 
వారి ప్రహృష్టవచనాల్లో ఆ
శ్రీహరి పాంచజన్య స్పర్శను పొందుతూ....
వారి సుజ్ఞ్యాన అధ్యాత్మ బోధామృత లహరుల వెలుగుజిలుగులే శ్రీమాహవిష్ణువు ధరించిన 
సుదర్శనచక్ర జనిత జ్వాలా దివిటీలుగా దర్శిస్తూ...
శ్రీప్లవనామ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి తో 35 వత్సరములు పూర్తై 36 వ పడిలోకి అడుగిడుతున్న శుభపర్వసమయంలో,
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు మరియు శ్రీవేంకటేశ్వరస్వామి వారి
శ్రీచరణాలకు నమస్కరిస్తూ ఎల్లరికీ 
శ్రీప్లవనామ సంవత్సర వైకుంఠ ఏకాదశి / భోగి
( శ్రీగోదారంగనాథ కల్యాణం ) / సంక్రాంతి / కనుమ / ముక్కనుమ పండగ శుభాభినందనలు.....😊🙏🍕🍧🍦🎂🍨💐

No comments:

Post a Comment