శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారి తిథి,..., పుష్యబహుళపంచమి, శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాల పేరిట యావద్ ప్రపంచం వారి సంగీతసాహిత్య వైదుష్యాన్ని కొనియాడుతూ వారికి సగౌరవభక్తినీరాజనాలను అందించే అత్యంత దైవికమైన సమయం సద్గురు త్యాగరాయ ఆరాధనోత్సవాలు నిర్వహింపబడే ఈ పుష్యమాస సమయం.....
" రాగ సుధా రసపానము జేసి రంజిల్లవే ఓ మనసా....." అంటూ యావద్ ప్రపంచం వారి కాలం నుండి ఈనాటివరకు కూడా వారి కలం నుండి జాలువారిన అమరసాహిత్యానికి వన్నెలలదబడేలా వారి గళం నుండి ఆలపించబడిన సరస్వతీ విపంచి గమకిత సంగీత రసార్ణవ కర్ణాటక శాస్త్రీయ సంగీత లహరుల్లో ఒలలాడుతూ విశ్వవ్యాప్తమైఉండే దైవిక శక్తిని ఎవరికి వారే వారి వారి నాభిమండలం నుండి వినిర్గతమయ్యే ప్రణవ నాదశక్తితో అనుసంధానించుకొని, వైదిక వాజ్ఞ్మయంలో నుడవబడినట్టుగా....
" అంత॑ర్బ॒హిశ్చ॑ తత్స॒ర్వం॒-వ్యాఀ॒ప్య నా॑రాయ॒ణః స్థి॑తః ।
అనంత॒మవ్యయం॑ క॒విగ్ం స॑ము॒ద్రేంఽతం॑-విఀ॒శ్వశం॑భువమ్ । "
....
"తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
స బ్రహ్మ॒ స శివః॒ స హరిః॒ సేంద్రః॒ సోఽక్ష॑రః పర॒మః స్వ॒రాట్ ॥... "
గా ఆ పరాత్పరుడి శక్తి యొక్క ఉనికిని ఇహం లోనే, ఈ మర్త్యలోకంలోనే, ఈ జన్మలోనే, ఈ దేహంలోనే, సూక్ష్మ రూపంలో కొలువైఉండే యోగశక్తిని జాగృతం కావించబడేందుకు ఎవరికి వారు వారి వారి నాదశక్తినే ఒక సాధనంగా అనగా ఒక " స్పిరిట్యువల్ యోగిక్ ట్రిగర్ " గా ఉపయోగించుకునేలా ,
తరతరాలు తరించేలా తరగని దైవిక సంగీతసాహిత్యాన్ని సృజించిన కారణజన్ములు శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు.....
నార్మల్ జనబాహుళ్యానికి వారి రాగసమ్మిళిత అక్షర యజ్ఞ్యం ఒక చక్కని వినసొంపైన,
"త్యాగరాయ కృతులు" అనే పేర సుపరిచితమైన దైవికకీర్తనలు... అందరి దేవుళ్ళను కీర్తిస్తూ రచింపబడిన వారి కృతుల్లో సిమ్హభాగం వారి ఆరాధ్య దైవమైన శ్రీసీతారామచంద్రస్వామి వారి మీద రచింపబడి ఆలపించబడినవి....
భారతదేశ వైభవానికి, సర్వతోముఖాభివృద్ధికి, మూలకారణమైన సార్వజనీన సార్వకాలిక సకలప్రాణిహితకర సనాతనధర్మ శాస్త్ర ప్రాభవానికి ఉనికిపట్లైన వివిధ శాస్త్రాల పై అవగాహన గల మాన్యులకు, మహర్షులకు, ద్రష్టలకు, సంగీతసాహిత్య స్రష్టలకు, వారి సంగీతసాహిత్య వాజ్ఞ్మయం సాక్షాత్తు పరతత్త్వ ఉనికిని ఆంతర అధ్యాత్మ సాధనతో
సృజింపజేయు రాగరసార్ణవం...
అది విన్నవారికి విన్నంత.....
" అందుకు కదండి త్యాగరాయుల వారు
' తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా...." అనే కీర్తన ఆలపించారు......."
అని శ్రీ చాగంటి సద్గురువులంతటి వారు సద్గురు త్యాగరాయుల వారి వాజ్ఞ్మయవైభవాన్ని కొనియాడినారు....
http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/06/thyagaraja-kriti-thelisi-rama.html?m=1
ఈ విశ్వంలో మరే ఇతర కళకు లేని వైభవం, శక్తి కేవలం సుసంగీతసాహిత్యానికి కలదు....
అది ఎవ్వరినైనా రంజింపజేయ శక్తి గల సాధనం.....
అందుకే అమ్మవారికి
" కావ్యాలాపవినోదిని...." అనే పేరు
వాగ్దేవతలు నుడివినారు....
శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఎవ్విధమైన లౌకిక పదార్థాలను అందివ్వకుండా, శరీరాంతర్గత వివిధ రుగ్మతలను బాపే శక్తి సంగీతానికి కలదు......
( " రోగానికో రాగం......" /
" రాగాలకు లొంగని రోగం లేదు...."
అనే నానుడి వినే ఉంటారు....)
" మ్యూసిక్ థెరపి " అని ఇప్పుడు ఈ ప్రాచ్య రాగఔషధసేవనం / రోగనివారణం పాశ్చాత్య ప్రపంచంలో కూడా బహుళపాచుర్యం పొంది ఆదరించబడి ఆరాధింపబడుతోంది అనేది ఈ కాలంలో చాలమందికి తెలిసేఉంటుంది.....
ప్రకృతిలో వివిధ వర్ణరంజితమైన పువ్వులు పూయడం ఒకెత్తు......
ఆ వైవిధ్య భరిత పువ్వులను సేకరించి ఒక చూడచక్కని పూలమాలికగా కూర్చడం ఒకెత్తు......
ఆ సువర్ణశోభితమైన పుష్పమాలికను భగవద్ కైంకర్యంలో వినియోగింపబడేలా చేసి ఆ పువ్వులకు, పుష్పమాలికకు, భక్తులకు ఒక దైవిక తన్మయత్వ స్థితిని లభింపజేయడం ఒకెత్తు....
అలా భగవంతుడికి శ్రీపుష్పకైంకర్యాన్ని గావించి తరించి తరింపజేసిన భక్తుల్లో అగ్రగణ్యులైన వారు తిరుమల లో శ్రీఅనంతాళ్వార్లు.....
అదేవిధంగా......
ప్రకృతిలో వివిధ స్వరాలు, స్వరాల ఆరోహణ అవరోహణ యొక్క కూర్పుతో సృజింపబడే శాస్త్రీయ కర్ణాటక సంగీత సేవిత 72 మేళకర్త రాగాలు, వాటి జన్య రాగాలు, ఆ సంగీత రాగాలాపనల్లో ఎంతో హృద్యంగా ఒదిగేలా సాహితీ పద గుళికళను అలదడం....
ఇవ్విధంగా భగవంతుడికి సంకీర్తనా కైంకర్యాన్ని గావించి తరించి తరింపజేసిన భక్తుల్లో అగ్రగణ్యులైన వారు
శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు....
శ్రీ శ్యామశాస్త్రి గారు.....
శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ గారు....
( "సంగీత త్రయం" గా వీరు కొనియాడబడడం ఎల్లరికీ విదితమే...)
వీరి పరంపరను కొనసాగిస్తూ సంకీర్తనా కైంకర్యాన్ని సామాన్య భక్తజనబాహుళ్య గ్రాహ్య శక్తికి దెగ్గరగా ఉండేలా సరళంగా సంగీత సాహిత్య కైంకర్యాన్ని గావించిన ఇతర విద్వణ్మూర్తులు.....
శ్రీ బమ్మెర పోతన గారు......
శ్రీ భద్రాచల రామదాసు ( కంచర్ల గోపన్న ) గారు....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల
( అన్నమయ్య) వారు...
మరియు ఇప్పటి మన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు
ఇత్యాది భక్తాగ్రేసరులు......
వీరందరిలో, శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారి శైలి ఎంత సరళమైనదో అంతే గంభీరమైనది.....
మామూలుగా చదివితే వారి కీర్తన అలతి అలతి పదాలతో ఉండే, లోకంలో ఎల్లరూ మాట్లాడే సాధారణ పదాలకు బాగ దెగ్గరగా ఉండేలా ఒక చక్కని చిన్న కావ్య గుళిక లా కనిపించే వారి కీర్తనకు, వారు నిర్దేశించిన సంగీత రాగ శక్తిని జతపరిచి ఆలపించి ఆలకిస్తే...
" ఔరా....ఏమి ఈ సంకీర్తనలో దాగి ఉన్న శక్తి....ఇంతటి విశేషమైనదా...!
ఇంతటి నాదశక్తిని మననుండి ఉద్భవింపజేయగల రాగశక్తిని ఇముడ్చుకున్న సంకీర్తనా ఇది....!!
ఇంతటి దైవికమహత్తును మనలోనే ప్రభవింపజేయగల సంగీత సాహిత్య సారస్వత సమ్మిళిత ప్రౌఢ కావ్య మధురిమ ఈ సంకీర్తనమా.....!!!"
అనేలా శ్రోతలచే బహువిధాలుగా ఆరాధింపబడే సరస్వతీ కటాక్ష భరిత సారస్వతం వారి సంకీర్తనం......"
ఎందుకంటే అది సాక్షాత్తు శ్రీనారదమహర్షి వారిచే వారికి అనుగ్రహింపబడిన " స్వరార్ణవం " అనే గంధర్వ విద్య యొక్క శక్తిని తనలో గుప్తంగా ఇముడ్చుకున్న పదగుంభనంతో సాగే సంగీత సాహిత్య సమ్మిళిత సుమసరాల సౌరభం...
వారి అజరామరమైన సంకీర్తనా యజ్ఞ్యంలో పరవశించని పరమాత్మ తత్త్వం లేదు.....
వారి ప్రఖ్యాతమైన పంచరత్న కృతుల్లో ఒకటైన జదగ్ప్రసిద్ధి గాంచిన
"శ్రీరాగం : ఎందరో మహానుభావులు.... అందరికీ వందనములు....."
అనే సంకీర్తనలో వారు సెలవిచ్చిన 9వ చరణంలో
ఈ లోకంలో ఎవ్వరూ ఎప్పటికీ అందుకోలేనంతటి
శ్రీ త్యాగరాయుల వారి అత్యున్నతమైన సుజ్ఞ్యాన స్థాయి ఎట్టిదో వారు చెప్పకనే లోకానికి చెప్పి ఉన్నారు......
"చ9. భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా(రెందరో) "
ఇక ఎవరి శ్రీపాదయుగళాన్ని స్మరిస్తూనే నా అవసాన దశలోని ఆఖరి శ్వాస కూడా విడువబడునో,
ఆ శ్రీవేంకటేశ్వరుడి పై శ్రీ త్యాగరాయుల వారి అత్యద్భుతమైన ఈ క్రింది సంకీర్తనలోని రెండవ చరణం నా హృదయసీమను బాగా అలుముకున్న పదవైభవం....😊
http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/09/thyagaraja-kriti-venkatesa-raga.html?m=1
ప. వేంకటేశ నిను సేవింపను పది
వేల కనులు కావలెనయ్య
అ. పంకజాక్ష పరిపాలిత ముని జన
భావుకమగు దివ్య రూపమును కొన్న (వేంక)
చ1. ఎక్కువ నీవని దిక్కుల పొగడ
అక్కర కొని మది సొక్కి కనుగొన
నిక్కము నీవే గ్రక్కున బ్రోవు
తళుక్కని మెరసే చక్క తనము గల (వేంక)
చ2. ఏ నోము ఫలమో నీ నామామృత
పానము అను సోపానము దొరికెను
శ్రీ నాయక పరమానంద నీ సరి
కానము శోభాయమానాంఘృలు గల (వేంక)
చ3. యోగి హృదయ నీవే గతియను జన
భాగధేయ వర భోగీశ శయన
భాగవత ప్రియ త్యాగరాజ నుత
నాగాచలముపై బాగుగ నెలకొన్న (వేంక)
శ్రీ ప్లవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి ప్రయుక్త శ్రీత్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాల సందర్భంగా వారి శ్రీచరణాలకు ఒక భక్తుడి చిరు సాహితీ సుమాంజలి.....
💐🙏🍨🍦🍕🎂😊
No comments:
Post a Comment