"జనకమహారాజు గారిచే నిర్వహింపబడిన సీతాస్వయంవరంలో, శ్రీవిశ్వామిత్ర గురువుగారు చెప్పినందుకు ఒక సుక్షత్రియకర్తవ్యంగా శివధనస్సును ఎక్కుపెట్టిన తదుపరి సీతమ్మవారికి తగిన యోధుడు వరుడిగా లభించగా,
సీతాకళ్యాణం తో రాముడు, శ్రీరాముడైనాడు..." అని శ్రీరాముడి వైభవాన్ని " శ్రీరామ " నామం యొక్క మహాత్మ్యమంత మధురంగా శ్రోతలకు
" సంపూర్ణశ్రీమద్రామాయణం ప్రవచనాలు" అనే ఒకానొక స్వాధ్యాయయజ్ఞ్యఫలంగా శ్రీచాగంటి గారు వారి మహిమోపేతమైన ప్రహృష్ట వచనాలను ప్రసాదించడం చాలామందికి విదితమే కద...
చక్కెరపొంగలి / బెల్లంపొంగలి యొక్క అమృతమైన రుచి ఎంత గొప్పదో ఎవరికి తెలుసు...?
ఎవరు అటువంటి భగవద్ నివేదితమైన ప్రసాదాన్ని నిత్యం ఆరగిస్తూ ఉంటారో వారికి తెలుసు....
అవ్విధముగనే....
శ్రీసీతారామలక్షణుల వైభవంలోని మహిమ్నత ఎంత గొప్పదో ఎవరికి తెలుసు...?
ఎవరు అటువంటి "భగవద్ రుచి" ని నిత్యం మనస్పూర్తిగా ఆరాధిస్తూ ఉంటారో వారికి తెలుసు...
[ భగవద్ తత్వం ఎల్లప్పుడూ ద్యుతి గా భక్తునకు భాసించును గాన, "భగవద్ రుచి" అనే సంస్కృత వచనాన్ని సంబోధించాను...🙂 ]
శ్రీసీతారామలక్ష్మణులను ప్రణవ స్వరూప పరతత్త్వంగా, ఆంజనేయులవారిని ఆచార్యతత్త్వంగా భావించి వారి యావద్ జీవితము కూడా శ్రీరామసంకీర్తనాకైంకర్యానికి అంకితం గావించుకున్న, సద్గురు శ్రీత్యాగరాయ / కాకర్ల త్యాగబ్రహ్మం గారి కంటే శ్రీరాముడి గొప్పదనం ఈ లోకంలో మరెవరికి తెలుసు...??
ఎందుకంటే, సాక్షాత్తు నారదులవారిచే "స్వరార్ణవం" అనే సంగీతవిద్యను అందుకొని, నాదబ్రహ్మశక్తిగా పరతత్త్వాన్ని ప్రత్యక్షంగా స్వానుభవజీవిత సత్యంగా అందుకొని అమరులైన ధన్యజీవులు సద్గురు శ్రీత్యాగరాయస్వామి వారు.....
శ్రీ త్యాగరాయస్వామి వారి ఈ క్రింది ఒక్క సంకీర్తన చాలు, శ్రీరాముడి పరతత్త్వవైభవ విశ్లేషణాత్మక మహత్తును ఎంత మధురమైన అలతి అలతి పదాలలో పొందుపరిచి, పండితపామరజనరంజకంగా వారు లోకానికి శాశ్వతానుగ్రహంగా అందించారో....
హనుమంతులవారి వైభవం యావద్ విశ్వానికి తెలిసినదే...
అటువంటి "రుద్రాంశ సంభూతుడైన వాయుసుతుడి స్తుతికి పాత్రుడైన వాడు నా శ్రీరాముడు", అని అనడంలో శ్రీత్యాగరాయుల వారు శివకేశవాభేద వైభవాన్ని,
శ్రీరామాంజనేయ మైత్రీమహత్తును,
శ్రీరాముడి వైభవాన్ని ఎంతో ఘనంగా కీర్తించారు....
ప. సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
చ1. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర (సీతా)
చ2. భక్త జన పరిపాల భరిత శర జాల
భుక్తి ముక్తిద లీల భూ-దేవ పాల (సీతా)
చ3. పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ (సీతా)
చ4. సర్వ లోకాధార సమరైక వీర
గర్వ మానవ దూర కనకాగ ధీర (సీతా)
చ5. నిగమాగమ విహార నిరుపమ శరీర
నగ ధరాఘ విదార నత లోకాధార (సీతా)
చ6. పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణి కుల సంజాత త్యాగరాజ నుత (సీతా)
https://thyagaraja-vaibhavam.blogspot.com/2008/04/thyagaraja-kriti-sita-kalyana.html?m=1
సూర్యవంశ చక్రవర్తుల పరంపరలో ప్రభవించిన రాముడు, శ్రీసీతారాముడైనందుకు సంతసించి పరమేశ్వరుడు శ్రీరాముణ్ణి కీర్తించాడు...అట్టి భవతరణసాధనమైన శ్రీరాముడు త్యాగరాయులచే సదా సంస్తుత్యుడు...
అని ముగించారు సంకీర్తన....
ఎన్నో అవతారాల్లో, ఎన్నో పెళ్ళుల్లు చేస్కున్న శ్రీమహావిష్ణువు, శ్రీరాముడిగా సీతమ్మ వారిని పెళ్ళి చేస్కోగా పరమేశ్వరుడు ఎందుకంతగా సంతసించి స్తుతించాలి...?
అది కేవలం ఒక సామాన్యమైన పరమేశ్వర స్తుతి గా మాత్రమే సకలశాస్త్రసారాన్ని శ్రీరామసంకీర్తనారసంగా అందుకున్న త్యాగరాయులవారు స్తుతించారా...?
లేక అందులో నిక్షిప్తమైన తత్త్వ వైభవ విశేషమున్నదా...?
భాగవతోత్తములకు విదితమైనట్టుగా,
త్రిపురాసూవధకై, శ్రీమహావిష్ణువు ఒక అప్రతిహత దైవికశరం గా తననుతాను రూపాంతరం గావించుకోగా...
ఎంతో విచిత్రమైన వరాన్ని పొందిన త్రిపురాసురుడు, ఈ విశ్వంలో తనతో ఢీకొనే యోధుడు అసలున్నాడా అనే సందేహంతో, తన వరంలో పేర్కొన్నట్టుగా,
"నిత్యం 3 పురాల్లో (స్వర్ణ, రజత, లోహ) పరివ్యాప్తమై ఉండే తన ఉనికిని, ఆ మూడుపురాలు కూడా ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు మాత్రమే తన హననం సంభవమయ్యేది..." అనే వచనాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని అనుకొని, ఒక్కక్షణం అలా రోదసీలో నిత్యం అటూ ఇటూ పైకి క్రిందికి విహరించే స్వర్ణ రజత లోహ పురములను, ఒకే సరళరేఖపైకి వచ్చేలా చేయగా,
అంతర్నిహితమైన దివ్యచక్షువుతో తదేక ఏకాగ్రచిత్తుడై అట్టి క్షణం కోసం ఎదురుచూస్తున్న రుద్రుడు, త్రిపురాసురవధను తృటిలో కానిచ్చేసాడు....ఎందుకంటే విశ్వవ్యాప్తమైనది (విశ్వేతివ్యాప్తః ఇతి విష్ణుః) శ్రీమహావిష్ణువు యొక్క శక్తి...యావద్ విశ్వమే తన స్వరూపంగా అలరారే వాడు పినాకం అనే ధనస్సును ధరించిఉండే రుద్రుడు..
అట్టి శ్రీమహావిష్ణువు అప్రతిహతి శరంగా పినాకము నుండి వినిర్ముక్తమై త్రిపురములను ఛేదించడం తో త్రిపురాసురవధ రెప్పపాటులో సాధింపబడినది....
అనే పౌరాణిక ఘట్టం నిజానికి,
శ్రీమహావిష్ణువును స్మరించినంతనే,
జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థల్లో నిత్యం సంచరించే మన చిత్తం, తన జాఢ్యాన్ని లయింపజేసి భగవద్ ఉన్ముఖమై తద్వారా భగవద్ అనుగ్రహంతో ఎంతటి క్లిష్టకార్యాన్నైనా సాధించగలదు అనే అధ్యాత్మసత్యాన్ని ప్రబోధించడమే....
మాటకు ముందు శ్రీరామ, మాట తరువాత శ్రీరామ, అనే అత్యంత అరుదైన వాచిక తపస్సును నిత్యం ఆచరించే మారుతిశర్మ గారు అనే ఒకానొక ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన భాగవతోత్తములగురించి కొందరైనా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినే ఉంటారు....
(ఒకానొక సత్సంగంలో వారిని దర్శించడం నా సుకృతం)
సుషుప్తిలో అనగా గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా భగవద్ నామం స్మరింపబడడం అనే మహోన్నతమైన స్థాయిలో ఉండే మహానుభావులు కూడా ఉంటారు అని చెప్పడానికే, మారుతిశర్మ గారిని ఎగ్సాంపుల్ గా ఉదహరించాను...
(జాగ్రత్ అవస్థలో ఎక్కువగా స్మరింపబడేవే స్వప్న సుషుప్తి అవస్థల్లో తారాడేస్మృతులౌతాయ్)
అవ్విధముగా, భగవద్ నామ స్మరణ మనన నిధిధ్యాసనం యొక్క వైభవం అనేది ఎవ్విధములైన మేయములకు కూడా అందనటువంటి మహిమోపేతమైన విద్వత్తు
(విశేషించి ఈ కలియుగంలో....
"నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణం" )
అట్టి భగవద్ నామములు, అవతారాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నా... నారాయణ, గోవింద, శ్రీరామ
అనే మూడు నామాల యొక్క మహత్తు అనేది ఇంతని అంతని ఎవ్వరూ కూడా నిర్వచింపలేనంతటిది...
అందుకే త్రిలోకసంచారి గా వినుతికెక్కిన శ్రీనారదమహర్షి దేవకార్యసాధకుడిగా నిత్యనారాయణనామస్మరణధురీణుడై లోకాన్ని ఎన్నో విధాల అనుగ్రహిస్తున్నారు....
ఈ లోకంలో ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఎట్లా అనేవాటితో సంబంధంలేకుండా, ఆర్తితో గోవిందా అని పిలిచినంతనే పలకడానికి సర్వసన్నద్ధుడైన వీరస్థానకధృవమూర్తిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా అలరారే శ్రీవేంకటాచలపతి, గోవింద నామం తో పట్టాభిషిక్తుడై ఎంతో విశేషమైన అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు....
సాక్షాత్తు, గౌరీశంకరులు నిత్యం జపించే నామంగా శ్రీరామ నామం వినుతికెక్కి, శ్రీవిశ్వనాథుడి చే అంత్యకాలమున కాశీవాసులకు కైవల్యాన్ని ఒసగే తారకమంత్రమైనది....
అట్టి శ్రీరామ నామస్మరణ యొక్క వైభవం శ్రీరాముణ్ణే ఆశ్చర్యపరిచినంతటిది అనే సత్యం మనకు శ్రీమద్రామాయణం ఉత్తరకాండ ద్వారా ఎరుకపడుతున్నది...
దేవతల ఎన్నో అవతారాలు, ఎన్నో నామాలు, ఎన్నో సంఘటనలు, అనేవి ఈ భారతావనిలో సంభవించిన / సంభవించే దైవిక విశేషాలు....
ఎన్ని కల్పాలైనా, (ప్రస్తుతం మనం ఉన్నది శ్వేతవరాహకల్పం లో),
ఎన్ని మన్వంతరాలైనా, (ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం లో),
ఎన్ని మహాయుగాలైనా, (ప్రస్తుతం మనం ఉన్నది 28వ మహాయుగం లో),
ఎన్ని యుగాలైనా, (ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం లో),
శ్రీరామ నామం అనేది అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు, కూడా ఎంతో విశేషమైన సర్వమంత్రసారమైన అధ్యాత్మ సాధనం...
దేవతలు భూమిపై నిలువరు...
కేవలం ఆకాశయానం లో ప్రత్యక్షంగా,
కొండలపై కొలువైన స్వయంభూ పుణ్యక్షేత్రాల్లోని దేవతామూర్తుల్లో ప్రస్ఫుటంగా,
మరియు మహర్షి, మానవ ప్రతిష్ఠిత మూర్తులుగా నెలకొన్న వివిధ ఆలయాల్లో ఆయా ఆలయసదాచారసంపన్న ప్రయుక్త వేదస్వర శక్తికి అనుగుణంగా, తమతమ దేవతాశక్తిని /అనుగ్రహాన్ని ప్రతిబింబింతురు....
కాని శ్రీరాముడు దీనికి భిన్నంగా అలారే అనన్యసామాన్యమైన శ్రీవైష్ణవ మానుషరూప స్థిత దైవం....
యావద్ భారతావని కూడా నడయాడిన అరుదైన అవతారం...
తన శ్రీపాద స్పర్శతో ఒక జడపదార్ధంగా పడి ఉన్న అహల్యను తిరిగి పడతిగా మార్చడం అనాటి వైభవమైతే.....
అవే శ్రీపాదాలను భద్రుడి శిరస్సుపై వసియింపజేసి, ఈ కలియుగంలో ఆనాటి త్రేతాయుగ శ్రీమద్రామాయణ ఘట్టాలకు సజీవసాక్షిగా అలరారిన భద్రుడికి, శ్రీభద్రాచలం గా అమరత్వాన్ని ఒసగిన అమరవంద్య పాదపద్మములు కద మన కోడండ రామయ్య పాదములు..!
శ్రీవైకుంఠంలో సాక్షత్తు శ్రీమహాలక్ష్మి యొక్క పాదసంవాహనం తో పావనమైన పవిత్రపాదపద్మములు, నాగేటిచాలులో జనకనందినిగా, సీతాదేవిగా ప్రభవించిన భూదేవి నమస్కరించిన పాదాలైన శ్రీరాముడి పాదపద్మముల మహత్తు అటువంటిది కాబట్టే...
మీరు గమనించండి, భద్రాచలాన్ని స్పృశించిన తదుపరి గోదావరి యొక్క ఉరుకులో పరుగులో ఎంతటి వేగం సంతరింపబడి...గౌతమి రాజమహేంద్రవరం
చేరుకోగానే విశాల గోదావరి గా ఎంతటి విశ్వరూపాన్ని సంతరించుకుంటున్నదో...
శ్రీరాముడి పావన పాదపద్మములను ధరించిన శ్రీభద్రగిరి క్షేత్రంలో అందుకే, మీరు ఏ పుణ్యకార్యం ఆచరించినా సరే, ఆ పుణ్యం ఎన్నో రెట్లు అధికఫలితాన్ని ఒనరించును...
శ్రీభద్రాచలం లోని, అంబసత్రంలో మీరెప్పుడైనా శ్రద్ధగా చదివిఉంటే...
"భద్రాచలంలో ఒక్కరికి గావించే అన్నదానఫలం, కాశిక్షేత్రంలో 1000 మందికి అన్నదానం గావించిన ఫలం ప్రసాదించును...." అనే ఆర్యోక్తి అక్కడ పోస్టర్ గా ఉండును.....
దశరథమహారాజు గారు గావించిన పుత్రకామేష్ఠి యజ్ఞ్యఫలితంగా అగ్నిదేవుడు అందించిన దైవికపాయసపాత్ర యొక్క ఫలంగా, కౌసల్యా నందనుడిగా మనుష్యుడిగా జన్మించి, సూర్యవంశచక్రవర్తుల కులగురువులైన శ్రీవశిష్ఠుల వారు రామ అని నామకారణం చేయగా,
బ్రహ్మ సృష్టికి సమంగా ప్రతిసృష్టిని సృజించే తపః శక్తి సంపన్నులైన శ్రీవిశ్వామిత్రుల వారిచే అమేయ అసంఖ్యాక ధనుర్వేద అస్త్ర శక్తిని అనుగ్రహంగా అందుకున్న శ్రీరాముడి
శ్రీవైష్ణవశక్తి యొక్క మహత్తు అందుకే బ్రహ్మగారిచే వరప్రసాదితులైన శ్రీవాల్మికి మహర్షి విరచిత
బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, అనే ఆరుకాండల ఇతిహాస అమరకావ్యమై అలరారుతోంది...!
శివకేశవులు ఇరువురు కూడా ఆ మహావైశ్విక విరాట్పురుషుడి ఇరుపార్శ్వములు...
బాలకాండ,
అయోధ్యకాండ,
అరణ్యకాండ,
అనే మొదటి మూడు కాండల్లో ఉండే శ్రీరాముడికి జతగా
కిష్కింధకాండ,
సుందరకాండ,
యుద్ధకాండ,
అనే తదుపరి కాండల్లో,
రుద్రాంశసంభూతుడైన ఆంజనేయుల వారి ఆగమనంతో
శ్రీమద్రామాయణ మహాకావ్యం, శివకేశవాత్మక విరాట్పురుషుడి వైశ్వికరూపాన్ని సంతరించుకున్న మంత్రమహార్ణవమైనది...
కాలానికే కాలస్వరూపమైన రుద్రుడు అనాడు త్రిపురాసురవధలో, శ్రీమహావిష్ణువును దైవికశరంగా గావించి,
అందుకు ప్రతిగా ఉత్తరోత్తరా రాబోయే శ్రీరామావతారంలో, శ్రీమహావిష్ణువుకు సేవకుడిగా ప్రభవిస్తాను అని వచించినది ఎందుకో తెలుసా....
త్రిపురాసురుడు ఎంతటి మహామాయావి గా, నిలువరించసాధ్యపడని రీతిలో ఉంటూ, తన ఉనికి ఎవ్వరికీ కూడా వశపడకుండా ఉండే అసురుడో....
మేఘనాథుడు కూడా అదే ఆసురి అంశగా త్రేతాయుగంలో రావణపుత్రుడిగా వచ్చినవాడు...
సత్యయుగంలో
హిరణ్యాక్ష, హిరణ్యకశిప,
త్రేతాయుగంలో
రావణ, కుంభకర్ణ,
ద్వాపరయుగంలో
శిశుపాల, దంతవక్త్ర,
అనే మూడు ఆసురి జన్మల్లో శ్రీమహావిష్ణువు చేతిలో సమ్హరింపబడి తిరిగి వైకుంఠానికి చేరుకునే,
సనకసనందనసనత్కుమారసనత్సుజాత జయవిజయ ద్వారపాలక శాప వృత్తాంతంలో...
త్రిపురాసురుడు, మేఘనాథుడు / ఇంద్రజిత్ అనే ఇంకో సూపర్ డెమన్ యొక్క ప్రస్తావనలేదు....
మేఘనాథుడు కేవలం ఆ పరమేశ్వరుడు రుద్రుడిగా ఉండి సమ్హరిస్తేనే లయించే అసురశక్తి...
అందుకే....వీడి గురించి ముందే తెలిసిన ఈశ్వరుడు....
వాయుదేవుడి ద్వారా పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా భూలోకంలో ఉండగా, రుద్రశక్తిని ఆంజనేయుడిగా ప్రభవింపజేసాడు...
హనుమంతుడు, లక్ష్మణుడు ఇరువురు కూడా ఎంతో కష్టపడి,
ఈ లోకంలో ఎన్నడూ కనివినిఎరుగని "శ్రీరామనామాభిమంత్రిత ధర్మాస్త్రం" అనే సరికొత్త అస్త్రంతో మేఘనాథుణ్ణి లయించిన తదుపరిమాత్రమే, శ్రీరాముడి అవతారప్రయోజనమైన రావణ, కుంభకర్ణ హననం సాధింపబడినది...
త్రిపురాసురుడిలా, కాలాన్ని కూడా తన అధీనంలోకి తీసుకునేంతటి శక్తిసంపన్నుడు మయావి అయిన మేఘనాథుడు...
కాబట్టి కాలానికి వశపడి ఉండే మనుష్యులకు మించిన శక్తి, అనగా కాలం తన అధీనంలో ఉండేవాడి శక్తి కూడా జతైతేనే మేఘనాథుణ్ణి నిలువరించడం సాధ్యపడేది.....
అది కేవలం కాలకాలుడైన రుద్రుడికి మాత్రమే సాధ్యం కాబట్టి, ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా లొంగని ఇంద్రజిత్ అనే రాక్షసుణ్ణి, రుద్రాంశ సంభూతుడైన హనుమంతులవారు,
అనగా కాలాన్ని కూడా లొంగదీసుకునే శక్తి సంపన్నుడు...
మరియు
ఆదిశేషావతరామైన అనగా కాలానికి లొంగని శక్తిగలవాడు అయిన లక్ష్మణుడు కలిసి, సమ్హరించినారు అనేది అధ్యాత్మ అంతరార్ధం......
(14 రోజులు కూడా నిద్రాహారాలు మాని ఉండలేమే, మరి 14 సంవత్సరాలు దైనందిన నిద్ర అనే స్వల్పకాలిక లయానికి లొంగని సౌమిత్రి శక్తి ఎంతటి ఘనమైనదో అలోచించండి)
అటువంటి కాలాధిక స్వరూపులిరువురూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్యం ఆరాధించిన దైవం శ్రీరాముడు...
లక్ష్మణుడు నిద్రాహారాలు కూడా మాని శ్రీరాముణ్ణి సేవిస్తే....
ఆంజనేయుడు శ్రీరాముడికి కూడా ప్రశాంతంగా నిద్రాహరాలు లభించేందుకు కారణమైన దాసుడిగా వినుతికెక్కిన చిరంజీవి..
అందుకే శ్రీరామ నామం అనంత అప్రతిహతశక్తి సంపన్నమయిన తారకమంత్రమయ్యింది...
అనాడు సేతుబంధనసమయంలో తనపైకి శ్రీరాముడు ఎక్కుపెట్టిన అస్త్రం యొక్క శక్తి ఎంతటి ఘనమైనదో తెలుసుకాబట్టే ఇప్పటికీ కూడా శ్రీరామేశ్వరం జ్యోతిర్లింగక్షేత్రంలో సముద్రుడు, తన సహజమైన సాగరఘోషను లయించి కెరటాలు లేని ప్రశాంతమైన సముద్రుడిగా ఉంటాడు...
శ్రీకరమైన శ్రీరామనామం ఎంతటి రమ్యమైనదో అంతే శక్తివంతమైనది...
ఎంతటి సరళమైనదో అంతే గహనమైనది...
ఎంతటి గ్రాహ్యమైనదిగా అనిపించేదో...అంతే అగ్రాహ్యమై ఉండునది...
శ్రీచాగంటి.నెట్ అనే వెబ్సైట్ లో ఒకప్పుడు భక్తులకు అందివ్వబడిన, (ఈ పోస్ట్ యొక్క కామెంట్స్ లో జతపరచబడిన) గద్యస్తోత్రంలో,
శ్రీరామనామం యొక్క గహనమైన మహత్తు ఎంత సరళంగా కీర్తింపబడినదో చాలా మంది శ్రీరామభక్తులకు తెలిసినదే...
రెండో పేజ్లో ఆఖరి లైన్ లో కీర్తింపబడినట్టుగా...
" ఆగామి సంచిత ప్రారబ్ధములను హరియించునది శ్రీరామనామము "
అనే అత్యంత మహత్వభరిత శ్రీరామనామస్మరణ వైభవాన్ని గమనించారా..?
ఇది అనేయడానికి ఎంతో సింపుల్ గా అనిపించే ఈ వచనం ఎంత గహనమైనదో, ఎంతటి అనుగ్రహభరితమైనదో, ఎంతటి దైవికతత్త్వానుసంధాయక గహనమైన అధ్యాత్మవిశేషమో విజ్ఞ్యులకు ఎరుక..
భక్తులెల్లరి ఆగామి కర్మలను కరుణతో పాపపుణ్యరహితం గావిస్తూ, ప్రారబ్ధాన్ని విశేషంగా క్షయిస్తూ, సంచితాన్ని పరమవిశేషానుగ్రహంతో సమూలంగా లయించివేస్తూ, ఆ శ్రీసీతారామచంద్రస్వామి వారు భక్తులెల్లరికి సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య మోక్షానుగ్రహాన్ని ప్రసాదించి ఘనంగా అనుగ్రహింతురుగాక.....
భద్రాచలానికి సద్యోముక్తిదాయకక్షేత్రం గా అధ్యాత్మసంప్రదాయంలో ఎనలేనివైభవం గలదు....
శ్రీభద్రాచల ఏకశిలాలయగోపురోపరిస్థిత సుదర్షనచక్రం
సాక్షాత్తు శ్రీవైకుంఠరాముడిచే గోదావరి ప్రసాదంగా శ్రీభద్రాచలరామదాసు గారికి లభించిన అరుదైన దైవిక సుదర్షనచక్రం...! ఆ సుదర్షనచక్రాన్ని ధ్యానించే వారికి అంత్యకాలమున సద్యోముక్తి శ్రీభద్రగిరీషుడైన శ్రీవైకుంఠరామానుగ్రహంగా లభించును అని పెద్దల మాట...
అందుకే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు, శ్రీరామచంద్రుణ్ణి ఎంతో గొప్పగా "కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి"
అని సంకీర్తించారు...
సర్వం శ్రీభద్రగిరిశ్రీసీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు.... 🙏
🙂🍨🎉☺️💐
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/55ramachandrudithaduraghuvirudu.html?m=1
No comments:
Post a Comment