శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేదనిశం
🙂🍧🥧🍀🍊🏵️🎉🍨🍿✨👏🇮🇳☺️
బిల్వవృక్ష ఛాయలలో కొలువై భాగ్యనగర వాసుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి 33వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీక్రోధి నామ సంవత్సర (ఏప్రిల్-15-2024) చైత్ర శుద్ధ సప్తమి ఇందువాసర ప్రయుక్త పునర్వసు నక్షత్ర మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తంలో అంగరంగవైభవంగా శ్రీవారి దివ్యతిరుక్కళ్యాణ మహోత్సవ శుభాభినందనలు....🙂💐
నాటి త్రేతాయుగంలో కళ్యాణ కేశవుడు
శ్రీసీతారాముడైనా,
నిన్నటి ద్వాపరయుగంలో కళ్యాణ కేశవుడు
శ్రీరుక్మిణీకృష్ణుడైనా,
నేటి కలియుగంలో కళ్యాణ కేశవుడు
శ్రీపద్మావతిశ్రీనివాసుడైన శ్రీవేంకటేశ్వరుడైనా,
ఎల్లప్పుడూ ఆ శ్రీహరి లోకకళ్యాణ కర్తగా తన స్థితికర్త యొక్క దైవిక కర్తవ్యాన్ని నిర్వహించే దీక్షలో భాగంగా, భక్తులను అనునిత్యం ఘనంగా కరుణిస్తూ తన భక్తవాత్సల్యవైభవాన్ని లోకోత్తరమైన మహిమ్నతతో ప్రదర్శిస్తూనే ఉన్నాడు....
భగవద్కళ్యాణాన్ని ఆచరించడం, నిర్వహించడం, అనే సత్సంప్రదాయం ఎప్పటినుండో మన ఆర్షసంప్రదాయ మహిమ్నతకు అద్దంపట్టే అద్భుతమైన, అమరులకు కూడా ఆనందకారకమైన ఆచారవైభవంగా ప్రసిద్ధినొందిన ప్రక్రియ...
ఒక ఆలయంలో వార్షికోత్సవమైతే భగవద్ కళ్యాణం...
ఒక తీర్థయాత్రగావిస్తే భగవద్ కళ్యాణం...
ఒక విశేషమైన పుణ్యక్రతువు నిర్హహింపబడుతుంటే భగవద్ కళ్యాణం...
కోరికలు నెరవేరడానికి ప్రార్ధనగా భగవద్ కళ్యాణం...
ప్రార్ధించిన కోరికలు నెరవేరగానే భగవద్ కళ్యాణం...
ఇవ్విధంగా భగవద్ కళ్యాణం నిర్వహింపబడడం అనేది మానవజీవిత సర్వతోముఖాభివృద్ధికి విశేష
అనుగ్రహాన్ని వర్షించే సాధనంగా విజ్ఞ్యులైన పెద్దలచే భావితరాలకు అందివ్వబడుతున్న భగవదనుగ్రహవిశేషం....
ఒక మహాసముద్రంలోని అల ఎప్పుడు ఎక్కడ ఎవ్విధంగా మొదలై ఒక మహాఉప్పెనగా పరిణమించగలదో కేవలం ఆ విధాతకే ఎరుక....
ఆ ఉప్పెన తనలోకి ఎన్నిటిని లయించి వేయగలదో ఆ మహాసముద్రానికే ఎరుక...
అవ్విధముగనే....
భగవద్ కళ్యాణ వీక్షణం, సేవనం, అనేది పాలసముద్రంలో ప్రభవించే ఒక దైవిక ఉప్పెన గా భావిస్తే...
ఆ భగవదనుగ్రహపరిణామవైభవంలోకి ఎన్ని దురితాఘజాఢ్యాలు లయించునో ఆ భగవంతుడికే ఎరుక...
తద్వారా ఎన్ని శుభపరంపరలను వర్షించే సాధనంగా ఆ భగవద్కళ్యాణానుగ్రహం అనబడే దైవిక మహత్తు అలరారునో ఆ ధాతకే ఎరుక....
శుభంకరోతుకళ్యాణం,
సర్వలాభాయకేశవస్యపూజనం,
హరినామస్మరణంసర్వార్ధసాధనం,
అనబడే పెద్దల ఉవాచ ఎప్పుడోఒకప్పుడు వినేఉంటారు కద....
అన్ని శ్రీహరి కళ్యాణగుణవైభవాల మహత్తును భక్తులకు అలదే అమరసిరి శ్రీశ్రీనివాసకళ్యాణకైంకర్యం....
శ్రీహరినామస్మరణం తో మొదలై పుణ్యాహవాచనం తో ఎల్లరికీ దైవిక పరిశుద్ధతను అలది, శ్రీవిష్వక్సేనారాధనతో శ్రీహరి సర్వసైన్యాధ్యక్షులకు ప్రథమారాధన అందించి తద్వారా యావద్ శ్రీవిష్ణుదేవసేన యొక్క అనుగ్రహంతో ఆ కళ్యాణ క్రతువు నిర్వహింపబడే ప్రాంగణమంతా కూడా
దైవికశక్తివిరాజితమైన తేజోవలయంగా ప్రభవించి,
మహాసంకల్పపఠనం,
దేవిదేవప్రవరపఠనములు,
లగ్నాష్టకచూర్ణికలు,
గుడజీరకధారణ,
మాంగళ్యధారణ,
ముత్యాలతలంబ్రాలు,
అనే వివిధ ఘట్టాల్లో సాగే వేదస్వరఘోషతో శ్రీశ్రీనివాసకళ్యాణం నిర్వహింపబడే ప్రాంగణం, ప్రాంతం, ప్రదేశం, దేశం ఆనందసౌభాగ్యాలతో, సుభిక్షమైన పాడిపంటలతో, శాంతిసౌఖ్యాలతో, అమరుల అరామంలా అలరారే వైభవం అనాదిగా ఈ భారతావని తన ప్రజలకు అందించే భవ్యమైన దైవానుగ్రహ విశేషం...
ఎందుకంటే...
మీ పెళ్ళిలో, నా పెళ్ళిలో పురోహిత మంత్ర పఠనంలో చెప్పబడేది...
"మాంగళ్యంతంతునానేనా మమజీవనహేతునా...
అని...
కాని భగవద్ కళ్యాణంలో పురోహిత మంత్ర పఠనంలో చెప్పబడేది...
"మాంగళ్యంతంతునానేనా లోకరక్షణహేతునా...
అని...
ఒక ఏరియా కి రక్షకులు, టౌన్ పోలీస్ స్టేషన్ లోని ఆఫీసర్స్....
ఒక జిల్లాకి రక్షకులు, జిల్లా పోలీస్ కమిషనరేట్ లోని ఆఫీసర్స్....
ఒక రాష్ట్రానికి రక్షకులు, స్టేట్ హోం మినిస్ట్రి లోని ఆఫీసర్స్....
ఒక దేశానికి రక్షకులు, దేశ / యూనియన్ హోం మినిస్ట్రి లోని ఆఫీసర్స్...
వీళ్ళందరూ కూడా దేశరాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడే ఒకానొక ప్రజారక్షక వ్యవస్థలో భాగమైన అధికార వ్యవస్థలోని సభ్యులుగా వారివారి పరిధిలోని లౌకికపరిరక్షణ విధులను నిర్వహిస్తున్నారు / పైఅధికారులచే నిర్వహింపబడుతున్నది అనే లౌకిక ప్రక్రియ గురించి ఎల్లరికీ తెలిసిందే....
మరి అలౌకిక పరిరక్షణ సంగతేంటి...??
చిరుజల్లుగా మొదలై, జడివానగా కొనసాగి, పెనుతుఫానులో అంతకంతకూ ఉధృతమయ్యే కల్లోల వరదగా పరిణమించి, ప్రాంతాలకుప్రాంతాలనే ఈడ్చేసే ప్రళయమారుతగతులను విలయజలతాండవాన్ని జనావాసాలకు దూరంగా, మహాసముద్రాల మధ్యనే బంధిస్తున్న అలౌకిక పరిరక్షక వ్యవస్థను ఎవరు నిర్వహిస్తుంటారు...??
ఎవరి ఆజ్ఞ్య మేరకు నిర్వహింపబడుతున్నది..??
వాతావరణంలో పెనుమార్పులతో పరిణమించే
వర్షాకాల అంటురోగాలు, మహమ్మారులు, ఎండాకాల వడదెబ్బలు, చలికాల గుండెదడలు, ఇత్యాది సకల
అవాంఛిత కాలంతర్గత హాలాహల సదృశమైన భీతావహపరిస్థితులను ఎక్కువకాలం కొనసాగకుండా లయించి లోకాన్ని సమ్రక్షిస్తున్నది ఎవరు..?
ఎవరి ఆజ్ఞ్యమేరకు సమ్రక్షింపబడుతున్నది...??
ఇన్ని కోట్ల ప్రజానీకంలో ఎంత మంది మన సీ.ఎం ని, పీ.ఎం ని ప్రత్యక్షంగా చూసారు..?
వారి ప్రజాసేవక / ప్రజాపాలక వ్యవస్థకు సంబంధించిన కార్యనిర్వాహక బృందాన్ని ఇన్ని కోట్ల ప్రజానీకంలో ఎంత మంది ప్రత్యక్షంగా చూసారు..?
అనే ప్రశ్నకు....,
"మన దైనందిన స్కూల్, కాలేజ్, ఆఫీస్, అనే నిత్యజీవితంలో కాస్త ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టే తీరికే లేదు ఇక వీళ్ళందరిని, వీళ్ళ వివిధ పాలక, రక్షక,
వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసే తీరికెక్కడుండును...?
అయినా టీ.వీ, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, ఇత్యాది మాధ్యమాల ద్వారా పరోక్షంగా చూసి నమ్ముతున్నాము కద ఆయా వ్యక్తులను, వారి వ్యవస్థలను...."
అనేదే చాలా మంది యొక్క సమాధానమై ఉంటుంది...
అవ్విధముగనే..,
ఇన్ని కోట్ల ప్రజానీకంలో ఎంత మందికి దేవీదేవతలను ప్రత్యక్షంగా చూసే పుణ్య, శౌచ సంపత్తి ఉండును....?
వారి లోకరక్షక / భక్తపాలక వ్యవస్థకు సంబంధించిన కార్యనిర్వాహక బృందాన్ని ఇన్ని కోట్ల ప్రజానీకంలో ఎంత మంది ప్రత్యక్షంగా చూడగలరు..?
అనే ప్రశ్నకు....,
"మన దైనందిన స్కూల్, కాలేజ్, ఆఫీస్, అనే నిత్యజీవితంలో కాస్త ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టే తీరికే లేదు ఇక దేవీదేవతలను, దేవీదేవతల వివిధ భక్తపరిపాలక, రక్షక, వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసే తీరికెక్కడుండును...?
అయినా ఆచార్యవాక్కుల్లో, ఆర్షసంప్రదాయ పెద్దల మాటల్లో,
అధ్యాత్మస్రష్టలు / ప్రవచనకర్తలు / భగవద్ తత్త్వద్రష్టలు, నుడివే సద్వాక్కుల్లో, ఇత్యాది మాధ్యమాల ద్వారా పరోక్షంగా చూసి, విని నమ్ముతున్నాము కద ఆయా దేవతలను, వారి వ్యవస్థలను...."
అనేదే చాలా మంది యొక్క సమాధానమై ఉండాలి అని అనడం అతిశయోక్తి ఎట్లౌను....??
నీ ఇంటికి నా భవనం ఎంత దూరమో...
నా భవనానికి నీ ఇల్లు కూడా అంతే దూరమౌను..
లౌకిక సిద్ధాంతాలపై నీకెంత విశ్వాసం, గౌరవం ఉండునో...
అలౌకిక విశ్వాసాలపై నాక్కూడా అంతే విశ్వాసం, గౌరవం ఉండును...
సిద్ధాంతం అనేది బాహ్య లోకానికి సంబంధించినది...
విశ్వాసం అనేది ఆంతర లోకానికి సంబంధించినది...
పాస్పోర్ట్ మరియు వీసా ఉంటేనే విమానం ఎక్కగలిగేది, అమెరిక, ఆఫ్రిక, ఆస్ట్రేలియా, అంటార్క్టిక, ఇత్యాది "ఇతర" దేశాలను దర్శించగలిగేది, అనేది లౌకిక సిద్ధాంతం....
అది మీకైనా, నాకైనా, ఈ లోకంలో ఎవ్వరికైనా సరే ఒకేవిధంగా ఉండే సిద్దాంతం....
పాస్పోర్ట్ అర్హులెల్లరికీ ఇవ్వబడేదే....
కాని వీసా అనేది ఎవరికివారు వారివారి వ్యక్తిగత ప్రయత్నపూర్వక శ్రద్ధాసక్తులతో, ఆయా దేశాల నియమాలకు అనుగుణంగా నడుచుకొని సాధించుకోవలసిన ప్రివిలెజ్...
అవ్విధముగనే.....
భగవద్ భక్తి, శౌచం, అర్హులెల్లరికీ సమకూరే సంపత్తి....
కాని పుణ్యం, ఈశ్వరానుగ్రహం అనేది ఎవరికివారు వారివారి వ్యక్తిగత ప్రయత్నపూర్వక శ్రద్ధాసక్తులతో, ఆయా దేశకాల నియమాలకు అనుగుణంగా నడుచుకొని సాధించుకోవలసిన ప్రివిలెజ్...
భగవద్ భక్తి, శౌచం మరియు పుణ్యం, ఈశ్వరానుగ్రహం అనేవి సంవృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే....
అలౌకికవిమానం ఎక్కగలిగేది, శ్రీకైలాసం, శ్రీవైకుంఠం, సత్యలోకం, మణిద్వీపం, ఇత్యాది "ఇతర" లోకాలను దర్శించగలిగేది, అనేది అలౌకిక విశ్వాసం....
అది మీకైనా, నాకైనా, ఈ లోకంలో ఎవ్వరికైనా సరే ఒకేవిధంగా ఉండే విశ్వాసం....
ఆవశ్యకమైన బాహ్యాంతర శౌచం, భగవద్ అనుగ్రహం, జన్మాంతరార్జిత పుణ్యం, ఉన్నప్పుడు లభించే, వేయి కన్నులతో దర్శించవలసిన శ్రీకరమైన భగవద్ కళ్యాణ వైభవ దర్శనం,
సదరు భగవద్ కళ్యాణ క్రతువు భక్తిప్రపత్తులతో ఈశ్వరానుగ్రహమైన దైవికతత్త్వసాక్షాత్కారయుక్తంగా దర్శింపబడడం వేరు....
మరియు
సదరు భగవద్ కళ్యాణ క్రతువును కేవలం చూడడం వేరు....
ఎందుకంటే
ఏమి మాట్లాడకుండానే ఎంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే IAS ఆఫీసర్ గారి స్థాయి వేరు....
సంవత్సరానికి ఒక్కసారి ఎంతో వైభవమైన ఆచార్యుల సుస్వరవేదఘోషతో, సదాచారసంప్రదాయ వైభవంతో, శ్రేష్టమైన సత్వగుణసంవృద్ధిభరిత భగవద్ నివేదనలు అమృతతుల్యమైన ప్రసాదాలుగా రూపాంతరం చెందగా వాటిని సేవిస్తూ, ఆనందిస్తూ, అమరవంద్యుడైన ఆ శ్రీవేంకటాచలపతి యొక్క అనుగ్రహంలో ఓలలాడే జీవితకాలమధురిమను సమకూర్చుకుంటూ, తద్వారా పరిమితకాల జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటూ,
తరించడంలోనే ఉండును కద మన జీవితాలకు సార్ధకత..🙂
భగవద్ కళ్యాణంలో పురోహిత మంత్ర పఠనంలో చెప్పబడే...
"మాంగళ్యంతంతునానేనా లోకరక్షణహేతునాం..."
అనే మంత్రాన్ని ఎంతో గొప్పగా
" శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు "
అని సంబోధించారు అన్నమాచార్యులవారు వారి ఈ క్రింది కళ్యాణ సంకీర్తనలో.....
ఎందుకంటే మన మానుష పెండ్లిలో విచ్చేసిన అతిధులకు లభించేవి విందులువినోదాలు, గిఫ్ట్లు, మాత్రమే.....
కాని దేవుడి పెండ్లిలో విచ్చేసిన భక్తులకు లభించేవి...
పైన పేర్కొనబడిన లౌకికమైన వాటితో పాటుగా అలౌకికమైన, ఎంతో మహత్తరమైన వరాలు కూడా ఈశ్వరానుగ్రహంగా లభించును అని ఈ లోకానికి తెలియజెప్తున్నారు అన్నమాచార్యుల వారు వారి...
"యెదుట నేగేరు వీరె యిచ్చేరు వరములివె"
అనే వచనం ద్వారా...!
భక్తులెల్లరూ కూడా భగవద్కళ్యాణకైంకర్యములో భాగమై, జన్మజన్మలకు తరగని సిరులైన అమేయమైన దైవికానుగ్రహాన్ని వరంగా గైకొని తరించెదరు గాక....
సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరశ్రీచరణారవిందార్పణమస్తు...🙂🙏
*********************************
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని
కందర్ప జనకునకి కమలాదేవికి
పెండ్లిపందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని
అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
*********************************
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/62pasidiakshimtalive-pattaro.html?m=1
No comments:
Post a Comment