Thursday, August 29, 2024

శ్రీ గిడుగు వేంకటరామమూర్తి గారి జన్మదినోత్సవం / తెలుగుభాషాదినోత్సవ శుభాభినందనలు...💐🙂


బియ్యం, యాలకులు/బాదాంపప్పు/జీడిపప్పు
ఇత్యాది పలుకులు, బెల్లం, ఈ మూడూ కూడా సరైనమోతాదులో మేళవించి చక్కని పరమాన్నం సిద్ధంచేసి ఈశ్వరుడికి నివేదన గావించి ప్రసాదంగా స్వీకరించి తరించే విజ్ఞ్యులకు తెలిసినట్టుగా....

బియ్యం అనేది తప్పకుండా ఉండే, ఉండవలసిన పదార్ధమే...
కాని బెల్లం ఉన్నప్పుడే అది మథురమైన పరమాన్నం గా గౌరవింపబడుతుంది...
ఇతర పలుకులు కూడా తోడైతే, అది ఘుమఘుమలాడే అమోఘమైన పరమాన్నం గా గౌరవింపబడుతుంది...

అచ్చం అదేవిధంగా...

ఇంగ్లీష్/ఆంగ్లము అనేది తప్పకుండా అభ్యసింపబడే, అభ్యసింపబడవలసిన భాషే...
మాతృభాష తోడైతేనే అది మథురమైన జీవితం గా గౌరవింపబడుతుంది...
ఇతర భాషలు కూడా తోడైతే, అది బహుభాషాకోవిదత్వంతో వెలుగొందే వైభవభరిత జీవితంగా గౌరవింపబడుతుంది...

ప్రత్యేకించి తెలుగుభాష మాతృభాషగా కలవారి వైభవం కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహన్ని సముపార్జింపబడే వైభవభరిత జీవితానికి ఆలంబనగా అలరారుతుందనడం మన తెలుగువారందరి భాగ్యవిశేషం..!

ఎందుకంటే, శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల అజరామరమైన పదకవితలప్రాభవాన్ని తమలో నిక్షిప్తంగావించుకున్న గోవింద సంకీర్తనల అనుగ్రహన్ని అందుకున్న భాష మన తేనెలొలుకు తెనుగు భాష....!

శ్రీబమ్మెర పోతనామాత్యులచే ఆంధ్రీకరింపబడిన శ్రీమద్భాగవతపురాణమణికిరీటాన్ని అలంకరించిన వజ్రవైఢూర్యద్యుతిమయూఖజిలుగుల మార్దవభరిత మందారమకరంద తేనియల తేటతెలుగు భాష మన తెలుగు భాష...!

శ్రీకాకర్లత్యాగబ్రహ్మం గారి త్యాగరాయకృతుల్లో ఒదిగిన తారకమంత్రవైభవమై శ్రీరామనామరసపానంలో రంజిల్లే రమ్యమైన రసమయమైన భాష, మన తెలుగు భాష..!

శ్రీభద్రాచలరామదాసుగా పేరుగడించిన శ్రీకంచర్లగోపన్న  గారి కమనీయమైన రామసంకీర్తనల్లో రాచఠీవిని సంతరించుకున్న రాజసభరిత భాష మన తెలుగుభాష...!

ఆదికవి నన్నయ గారు నుడివిన కావ్యమంజరులకు నమస్కరించి కొనసాగించిన ఎర్రన గారి వైభవాన్ని దశదిశలావ్యాప్తి గావించిన తిక్కన గారి తియ్యనైన రచనాప్రౌఢిమను భావితరాలకు అందించిన అమరభాష మన తెలుగుభాష..!

శ్రీతరిగొండవెంగమాంబ గారి తపఃశక్తిని నింపుకున్న నిండైన మెండైన మేటికావ్యకదంబముల అనుగ్రహాన్ని భావితరాలకు అందించే భవ్యమైన భాష, మన భరతజాతి మెచ్చిన మనదైన భాగ్యసిరుల భాష, మన తెలుగు భాష...!

మన భావితరాలకు మనం అందించే విలువైన సంపదల్లో, అత్యంతవిలువైనది మన మాతృభాషా వైభవం....
ఎందుకంటే మనదైన భాషాసంస్కృతి మన భావిజీవితాలకు జీవగర్రవంటిది...అవి ఎల్లప్పుడూ కూడా ఎంతో గొప్పగా పరిరక్షింపబడవలసిన పురాతన సంపత్తి....

కొత్తగా మార్కెట్ లోకి ఎన్ని రకాల కొత్తకొత్త తినుబండారాలు వచ్చినా కూడా, పాతబియ్యానికి ఉండే విలువ వాటికి సరిపోలదు...
అదే విధంగా, ప్రపంచంలోకి ఎన్ని రకాల కొత్తకొత్త భాషాసంస్కృతులు వచ్చినా కూడా, మన పురాతన భాషాసంస్కృతులకు ఉండే విలువ వాటికి సరిపోలదు...

ఒక దేశవైభవం అనేది ఆ దేశప్రజల యొక్క నైసర్గిక భాషాసంస్కృతులపై ఆధారపడిఉండే అంశం...
మనదేశం ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు/మాండలీకాలతో పరిఢవిల్లే వైభవభరితమైన దేశం....
అందుకే శతాబ్దాలతరబడి అన్యదేశస్తులు, అన్యసంస్కృతుల వారిచే మనదేశం దోపిడీకి గురైనా సరే, పునర్వైభవలబ్ధితో తన సర్వోన్నతస్థాయిని ఎల్లప్పుడూ నిత్యనూతనంగా సంతరించుకుంటూనే ఉంది...ఉంటుంది...!

తెలుగుభాషావైభవాన్ని విశ్వవ్యాప్తంగావించిన / గావించే 
ప్రవచనకర్తలు, తెనుగువిద్యాపారంగతులు, అధ్యాపకులు, కవులు, కోవిదులు, రచయితలు, పండితులు, నటులు, గాయకులు, దర్శకులు, నిర్మాతలు, వ్యాఖ్యాతలు, విశ్లేషకులు, ఇత్యాది మహనీయులందరికీ కూడా తెలుగుభాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభినందనలు... 🙂💐