చంద్రుడు శ్రవణా నక్షత్రంతో కూడి ప్రకాశించే శ్రావణపౌర్ణమిని ఎంతో విశేషమైన జంధ్యాల పౌర్ణమి పర్వసమయంగా, గొప్ప ఉత్సవంగా అనాదిగా మన సనాతనధర్మసంప్రదాయ విజ్ఞ్యులు గుర్తించి గౌరవించారు...
యావద్ భూమండలంలో, వైదిక ధర్మవైభవానికి ఆలవాలంగా అలరారే యోగభూమి మన భారతదేశం....
ఇతర దేశాలన్నీ కూడా విశేషమైన భోగభూములుగా అలరారుతుండగా, మన అద్వితీయ భారతదేశం యోగములచే భోగాలను ప్రసాదించే భోగీంద్రశాయి యొక్క యోగభూమిగా పరిఢవిల్లుతున్నది.....
"సమత్వం యోగముచ్యతే..."
అని అన్నాడు శ్రీమద్భగవద్గీతా రెండవ ఆధ్యాయమైన సాంఖ్యయోగంలోని 48వ శ్లోకంలో.....
శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువుగా నిలిచి...
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।।
।। 2-48 ।।
శ్రీకృష్ణపరమాత్మ ను మించిన భోగీశ్వరుడు ఇంకొకరులేరేమో అని పైకి అనిపిస్తుందేమో కాని...
శ్రీకృష్ణుణ్ణి మించిన యోగీశ్వరులు కలరే అనేది ఎవరికివారు సంధించుకోవలసిన పరిప్రశ్న....
"సమత్వం" అనే పదాన్ని ఎన్నోవిధాలా సమన్వయపరిచి అందలి యోగకారక తత్త్వాన్ని అందుకొని తరించడమే యోగం అనబడును...
"సమత్వం" అనగానే...
చాలామంది చాలా క్యాజువల్ గా,
గెలుపు ఓటముల్లో ఒకేలా ఉండాలి...
కలిమి లేముల్లో ఒకేలా ఉండాలి...
ఉన్నవాడు లేనివాడు అందరూ ఒక్కరే...
ఇత్యాదిగా ఎన్నోరకాలుగా మెట్టవేదాంతాన్ని వల్లించే వారికి శ్రీకృష్ణపరమాత్మ యొక్క హృదయం సరిగ్గా అర్ధంకాలేదు అని అర్ధం...
బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది స్వోద్ధరణ కోసమే కాని ఇతరులను ఇతరులు ఉద్ధరించడానికి కాదు...
అనగా, ఒకరు సాధనచేసే అధ్యాత్మవిజ్ఞానం అనేది వారినివారు ఉద్ధరించుకోవడానికి అనేది ముఖ్యాంశం...
ఆ ప్రయత్నంలో విజ్ఞ్యులైన ఇతరులు కూడా ఉద్ధరింపబడడం అనేది అనుశంగిక ప్రయోజనం....
శ్రీచాగంటి సద్గురువుల వంటి విజ్ఞ్యుల ప్రవచనాలు ఎక్కువగా విన్నవారికి తెలిసినట్టుగా... " ఉద్ధరేణాత్మనాత్మానం " అనేది నిజమైన అధ్యాత్మవిద్యార్జన యొక్క లక్ష్యం....
"నాకుతోచిన ఓ నాలుగు మంచిమాటలు, భగవద్ప్రీతికరమైన మాటలు, పుణ్యదాయకమైన భక్తభాగవత చరితములను మీతో పంచుకుంటున్నానే కాని మీకేదో తెలియదని, నాకే అన్నీ తెలుసునని కాదు..."
అని విజ్ఞ్యులు నుడివే మాటలను ఎప్పుడో ఒక్కప్పుడు వినేఉంటారు కద...
ఇక మన అసల్ టాపిక్ కి వస్తే...
"సమత్వం యోగముచ్యతే..." అనే వచనానికి నిజమైన నిర్వచనం...
మన ఆంతర వివేకం అనేది సమత్వాన్ని గడించి తద్వారా యోగాన్ని సమకూర్చి మనల్ని తరింపజేయుట...
అనగా,
ఒకనాడు కేవలం చద్దన్నం, పప్పుచారు మాత్రమే తినిబ్రతికిన వారు, ఈశ్వరానుగ్రహంతో ప్రతీరోజు పంచభక్ష్యపరమాన్నములను భుజించగల మహదైశ్వర్యవంతుడిగా అనుగ్రహింపబడినా,
చద్దన్నం, పప్పుచారుతో గావించే భోజనాన్ని, పంచభక్ష్యపరమాన్నములతో గావించే భోజనాన్ని, ఒకేలా దర్శించగలిగి, రెంటిపట్లా సమభావన, సమగౌరవం కలిగిఉండడం...
ఒకనాడు సైకిల్ తొక్కుతూ గుడికి వెళ్ళేవారు, ఈశ్వరానుగ్రహంగా, బెంజ్ కార్లో ఆలయానికి వెళ్ళగలిగేలా అనుగ్రహింపబడినా, సైకిల్ ప్రయాణమైనా, కార్ ప్రయాణమైనా,
విమానంలో ప్రయాణించేవారైనా సరే వాహనం నుండి క్రిందికి / భూమిపైకి దిగి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడమే భగవద్ దర్శనం అని అందురు అనే సత్యాన్ని దర్శించి, రెంటిపట్లా సమభావన, సమగౌరవం కలిగిఉండడం...
ఒకనాడు సాధారణంగా హనుమాన్ చాలిసా చదువుతూ ఇంటికిదెగ్గర ఉండే ఆంజనేయుడి గుడికి వెళ్ళినప్పుడు ఉన్న నిర్మలమైన భగవద్భక్తి, ఈశ్వరానుగ్రహంగా పరిణితిచెంది, సర్వోన్నతమైన శ్రీవిద్యోపాసనామంజరుల్లో తేలియాడే స్థితిలో ఉన్నప్పుడు ఉన్న విశేషమైన భక్తి, రెంటిపట్లా సమభావన, సమగౌరవం కలిగిఉండడం...
ఇవ్విధంగా, మనిషి తన జీవితం అనే పుస్తకంలో ఉన్న ప్రతీ పేజీ పట్ల, సమత్వాన్ని, సమభావనను, సమగౌరవాన్ని, కలిగిఉండేలా ఈశ్వరుడి అనుగ్రహంపట్ల కృతజ్ఞ్యతాభావంతో ఉన్నప్పుడు, సముపార్జింపబడే ఆంతరంగిక చిత్తశుద్ధితో జీవించడాన్ని యోగత్వం అని అందురు...
ఆ యోగశక్తి, సదరు వ్యక్తి యొక్క శమదమశక్తి, ప్రాణాయామ యుక్తాహారవిహార, సదసత్వస్తువివేచనాత్మక శక్తి, ఇత్యాదివాటితో సమ్మిళితమై, అనిర్వచనీయమైన అధ్యాత్మయోగశక్తిగా రూపాంతరం చెందడాన్ని యోగీశ్వరేశ్వరత్వం గా విజ్ఞ్యులు భావింతురు.....
వైదిక సంప్రదాయంలో, పరంపరాగతంగా విజ్ఞ్యులైన వారి పూర్వీకులనుండి అందివ్వబడిన గొప్ప జ్ఞ్యానసంపదగా, యజ్ఞోపవీతధారణను ద్విజులకు గల ఒక గొప్ప వైభవభరిత సంస్కారంగా నిర్వహింతురు...
అట్టి ఉపవీత ధారణాసంప్రదాయం వారి పెద్దలనుండి అందనివారు, ఈ శ్రావణ పౌర్ణమిని రాఖి పౌర్ణమి పండగ పేరుతో గౌరవిస్తూ, వారి కుడిచేతికి రక్షాతోరములను అలంకరింపబడడం అనే సత్సంప్రదాయం మనం సాధారణంగా గమనించే అంశం...
అనగా, ఉపవీతం ఉన్నవారు కొత్త ఉపవీతాన్ని అలంకరించికోవడం, లేనివారు రాఖి / రక్షాతోరాన్ని అలంకరించుకోవడం అనేది ఈ శ్రావణ పౌర్ణమి పండగ పర్వవిశేషం అనేది అందరికీ తెలిసిందే....
అధ్యాత్మ సాధనచే సముపార్జింపబడే యోగశక్తికి, ఉపవీతం / రక్షాతోరము / రాఖి / కట్టుకోవడానికి, శ్రావణమాసం / శ్రావణపౌర్ణమి కి, ఏంటి సంబంధం అనేదే కద మీ సందేహం...?
ఈ ఖగోళశాస్త్ర విజ్ఞ్యాన విశేషాన్ని మీకు చాలా సింపుల్ గా వివరించేప్రయత్నం గావిస్తాను...
హుం...ఇవ్వాళ మళ్ళీ స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలా దేవుడా...
అని అనుకునే ఆటపాటలంటే బాగ మాక్కువకలవారు, స్కూల్ కి తప్పకుండా వెళ్ళేది ఎప్పుడెప్పుడు...?
జనవరి 26, గణతంత్రదినోత్సవం సందర్భంగా ఆటలపోటీల సమయం,
ఆగస్ట్ 15, స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆటలపోటీల సమయం,
సెప్టెంబర్ 5, టీచర్స్ డే (శ్రీసర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి) సందర్భంగా ఆటలపోటీల సమయం,
ఈ మూడు సందర్భాల్లో కాకుండా మిగతా సమయాల్లో స్కూల్లో ఆటలపోటీలు ఉండవా అంటే...
ఉంటాయ్ కాని ఏ లంచ్ టైం లోనో, లీషర్ సమయంలోనో, అలా ఓ అరగంటో గంటో క్లాస్ ఫ్రెండ్స్ తో కలిసి ఏవో చిన్నచిన్న ఆటలకు మాత్రమే వీలయ్యేది....
(చోర్ పోలీస్, టచ్ మీ నాట్, ఫాం ఏ చైన్, లాంటి ఆటలు)
అన్ని తరగతుల విద్యార్ధులతో, ఎంతోమంది ప్లేయర్స్ తో కలిసి, కబడ్డీ, ఖో-ఖో, ఇత్యాదివి ఆడడం అనేది సాధారణంగా జనవరి-26, ఆగస్ట్-15, సెప్టెంబర్-5, న నిర్వహింపబడే ఇంట్రా స్కూల్ స్పోర్ట్స్ టైం లో మాత్రమే కుదిరేది...
ఆ సమయంలో విన్నర్స్ కి పెద్దపెద్ద ట్రోఫీలు కూడా ఇవ్వగా, విద్యార్ధుల ఇంట్లో ఆ ఇత్తడి ట్రోఫీల వెలుగుజిలుగులు చాలమందికి మధురస్మృతులే...
ఇవ్విధముగనే....
మనస్సు యొక్క శక్తి, ఆరాధనా / సాధన / ఉపాసన యొక్క శక్తికి ఆధారం....
మన మనోశక్తియే క్రమక్రమంగా యోగశక్తిగా రూపాంతరం చెందును...
చంద్రుడు మనఃశక్తికారకుడు అని మన ప్రాచీన సనాతనధర్మశాస్త్రవచనం...
అట్టి మనఃశక్తికారక చంద్రుడికి బాగా ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రం...
జ్యోతిషశాస్త్రం (ఆస్ట్రాలజి) ప్రకారంగా,
రోహిణి, హస్త, శ్రవణం అనే నక్షత్రాలు ఏకవర్గానికి చెందినవి...
ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమి) ప్రకారంగా, ఈ మూడింటిలో, భూమిపైనుండి / భూలోకవాసులు దర్శించగల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి మాత్రమే..
అనగా రోహిణి, హస్త, అనే నక్షత్రాలతో చంద్రుడు కూడి ప్రకాశించడం అనేది ఈ భూలోకవాసులకు దర్శనీయం కాని
ఖగోళ విశేషం..
కాబట్టి, చంద్రుడు మిక్కుటముగా వర్షించే యోగకారక మనో శక్తిని భూలోకవాసులు అందుకొని తరించడం అనేది కేవలం శ్రావణమాసంలో / శ్రావణపౌర్ణమి నాడు మాత్రమే సంభవించే అధ్యాత్మ అంశం...
అందుకే చంద్రసహోదరి గా స్తుతుంపబడే శ్రీమహాలక్ష్మికి ఈ శ్రావణమాసం ఎంతో ప్రీతికరమైనదిగా, శ్రావణశ్రీలక్ష్మీ వైభవంతో
ఆలయాలు మాత్రమే కాదు, వస్త్రదుకాణాలు కూడా గొప్పగొప్ప డిస్కౌంట్లతో, 1+1 ఆఫర్ లతో, కేజీ సేల్ ఆఫర్స్ తో కిటకిటాలాడుతూ కళకళలాడుతూ ఉండడం మనం గమనించవచ్చు....
కాబట్టి ఈ మాసంలో విశేషమైన ప్రాభవంతో, కళతో శోభిల్లే చంద్రుడు, శ్రీమహాలక్ష్మి యొక్క వైభవంలా, లోకంలోని అక్కాచెల్లెళ్లు కూడా తమ అన్నదమ్ములకు రాఖి / రక్షాతోరబంధనం అనే పేరుతో చల్లగా శ్రావణపౌర్ణమి నాటి యోగకారక చంద్రుడిలా వర్ధిల్లమని రాఖీలు కట్టి శుభాకాంక్షలను అందించడం...మరియు అన్నదమ్ములు చీరాసారెతో, కానుకలతో వారి అక్కాచెల్లెళ్ళను గౌరవించి శుభాకాంక్షలను అందించడం అనే సత్సంప్రదాయం వర్ధిల్లడంలోని విశేషం....
ఈ లోకంలో వర్ధిల్లే అన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిగా వర్ధిల్లే క్షీరసాగర తనయ, చంద్రసహోదరి, తనయందు లక్ష్యభావన గల భక్తులందరినీ చల్లగా దీవించి అన్నిరకాల సిరిసంపదలను అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తూ.....రాఖిపౌర్ణమి పర్వసమయ శుభాభినందనలు...🙂💐
****** ****** ****** ****** ****** ****** ****** ******
సురగణ వందిత సుందరి మాధవే చంద్రసహోదరి హేమమాయే
మునిగణ వందిత మోక్షప్రదయిని మంజుల భాషిని వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిని శాంతియుతే
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయమాం
****** ****** ****** ****** ****** ****** ****** ******
No comments:
Post a Comment